పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : ఏ కథల యందుఁ

కం||
థల యందుఁ బుణ్య
శ్లోకుఁడు హరి చెప్పఁబడును సూరిజనముచే
నా థలు పుణ్యకథలని
యార్ణింపుదురు పెద్ద తి హర్షమునన్.
బా|| తా|| ఏ చరిత్రముల యందు గోవిందునిఁగూర్చి ప్రశంసింపబడునో తచ్ఛరిత్రములు మోక్షదాయక మగు కథ లని యార్యులు ప్రీతితో వినియెదరు కదా।
రహ|| హరి - "హరిర్హతి పాపాని" పాపహరుఁ డగు శ్రీపతిఁగూర్చి వ్యాసంగముఁ జేయఁబడునో అనగా శ్రు|| ఉత్తమాతత్వ చింతాచ - మధ్యమం శాస్త్ర చింతనం - అధమా మంత్ర చింతాచ - తీర్ధ భ్రాం త్యధమాధమం" తత్వచింతన (బ్రహ్మవిచారణ) ఉత్తమమును - శాస్త్ర చింతన మధ్యమము - మంత్రచింతన మనగా, నభిచార వశీకరణాధిక, మధమమును - దీర్థయాత్రాధిక మధమాధమముగాఁ జెప్పుచున్నారు తత్వ మనగా నా పరమాత్మయే నీ వని బోధ -
శ్లో||
యధైధాంసిసమిద్ధోగ్ని - భస్మసాత్కురుతే౾ర్జున
జ్ఞానాగ్ని సర్వకర్మాణి - భస్మసాత్కురుతేతథా.
నహిజ్ఞానేన సదృశం -పవిత్ర మిహ విద్యతే||
ప్రజ్వలితాగ్ని, యింధనము (చిదుగు) లను భస్మముసేయు నటులు జ్ఞానాగ్ని, సకల కర్మలను భస్మము చేయును. జ్ఞానముతోఁ దుల్య మగున దెద్దియు లేదు.
శ్లో|| మోక్షార్థం బ్రహ్మవిజ్ఞాన - మితివేదాంతడిండిమః
బ్రహ్మవిచారణ మోక్షార్ధమే యగును. శ్రు|| "జ్ఞానాదేవహి కైవల్యమ్" జ్ఞానమువలననే తప్పక మోక్షము గలుగును -
శ్లో ||
అశ్వమేధ సహస్రాణి - వాజపేయశతానిచ
ఏకస్యజ్ఞానయోగస్య - కలాంనార్హంతిషోడశీం||
వేయి యశ్వమేధములు - నూఱు వాజపేయము లనగా (యజ్ఞవిశేషము)ల యొక్క ఫలరూప సుఖము - క్షణికార్థకాలమునఁ జేసిన బ్రహ్మవిచారణ ఫలజనితానందమునకుఁ దులఁదూగఁజాలవు.
శ్లో||
స్నాతం తేన సమస్త తీర్థనిచయే దత్తమహీమండలం
విప్రేభ్యః పితృదేవతా సురగణా - సర్వేపి సంతర్పితాః
జప్తంమంత్ర సహస్రకోటిదమునా - తప్తంచ తీవ్రం తపో
యస్య బ్రహ్మవిచారణే క్షణమపి - ప్రాప్నోతి స్థైర్యం మనః||
పుణ్యతీర్ధములందు స్నానముఁ జేసి నందువలనను - సకలదానము లొనర్చి నందువలనను బ్రహ్మయజ్ఞపితృ తర్పణము లొనర్చినందువలనను - దేవతారాధనములవలనను - గాయత్ర్యాది మంత్రాదులవలనను - చాంద్రాయణాది తపస్సులవలనను - ఏమి ఫలము గలదో, నిర్విషయస్థితిలోనుండి పరమాత్మనొక్క క్షణము ధ్యానించిన నంత ఫలము గలుగఁగల దందుఱు - కాన సత్వర మెఱిఁగింపుఁ డని.
ప్రాయోపవిష్టుండైన పరీక్షన్నరేంద్రుం డడిఁగిన శమీక మునిపుత్రుండగు శృంగి యనువానిచే శపింపఁబడి పరీక్షిద్భూవిభుండు మరణాసన్న నిశ్చయచిత్తుండై శ్రీమద్భాగవతంబున గజేంద్రమోక్షణ కథ వినఁ దొందఱ పడుచుండె నని శుకముని కనికర హృదయుం డయి.
రహా|| పరీక్షితుఁ డనఁగా నశ్వత్థామ, కరవిముక్త విశిఖాగ్నిచే, నుత్తర గర్బస్తుం డగు జీవుఁడు పరితప్తుండై శ్రీకృష్ణపరమాత్మునిఁ బ్రార్ధింప నతండు తద్భాణాన లోపశమనంబుఁ గావించి రక్షించిన తదుపరిఁ దన్ను రక్షించిన పరమపురుషుం డెచ్చట నున్నా డని పరీక్షించి నందునఁ బరీక్షి త్తని పిలువంబడె. శ్రీ కృష్ణుం డనగా, సచ్చిదానందము;
శ్లో||
కృషి ద్భూవాచక శబ్దో - ణశ్చ నిర్వృతి వాచక||
తయోరైక్యం పరబ్రహ్మ - కృష్ణ యిత్యభిధీయతే||
కృ - అనగా భూవాచకము (భూ, సత్తాయాం) సత్, ణ - కార మనగా నిర్వృతిః (ఆనందము), ష - కార మనగా చిత్చ; తద్వర్ణ సంయుక్తము, సచ్చిదానందము అట్టి సచ్చిదానందరూప శ్రీకృష్ణ పరబ్రహ్మ మెచ్చట నున్నది యని యన్వేషించి నందున, నాత్మానాత్మలను పరీక్షించి నందునఁ బరీక్షిత్తని వివక్షింపబడెను - ఆ యాత్మానాత్మ లనగా నెవ్వి?
శ్లో||
అస్తిభాతి ప్రియం రూపం - నామంచే త్యంశపంచకం
ఆద్యత్రయంబ్రహ్నరూపం - జగద్రూపంతో ద్వయం||
అస్తి - సత్, భాతి - చిత్, (ప్రకాశము) ప్రియం - అనందము అనగా నెట్లు శర్కర శ్వేత మృధు మధురములు విభజించుటకు వీలులేదో, అట్లు సచ్చిదానందముఁ బదత్రయముగా విభజింప వీలులేని యాత్మ - శేషించిన రూపము నామములు - మాయాస్వరూపము. సచ్చిదానంద మొకే రూపముతోఁ బ్రకాశించు పరబ్రహ్మ మగును.
శ్రు|| తస్య ప్రియమేవ శిరః, మోదో దక్షిణః పక్షః, ప్రమోద ఉత్తరః పక్షః, ఆనంద ఆత్మా బ్రహ్మపుచ్ఛం ప్రతిష్ఠా||
ప్రియము - మోదము - ప్రమోదము - కుడి - ఎడమ - ఊర్ద్వభాగములు కలిగి ఆనందాత్మక మయి, బ్రహ్మమే యాధార (పృచ్ఛ) మగు నే యానంద మయి కోశము (సుషుప్త్యావస్థ) కలదో అదియే ఆత్మ -
పూర్వపక్షి - అయితే, - పరమాత్మ అన్నమయాది కోశాతీత మని చెప్పబడినది కదా! యని ప్రశ్నించిన.
సిద్ధాంతి - నామరూపాత్మక మగు జగత్తుతో సమానాధికరణముఁ జేసి చెప్పి నపుడు. అనుభవ పూర్వక మగు ఆనందమయ కోశమే, యాత్మ యని చెప్పబడెను.
"బీజనిద్రా యుతః ప్రాజ్ఞః - సాచ తుర్యేన విద్యతే" సుషుప్తి యం దశ్వద్ధ బీజమును, వ్యాపక చైతన్య (బ్రహ్మ) కళయును, చంద్రోదయ యౌషధమునందు సువర్ణచూర్ణము మిళితమైనట్లు జగద్ర్బహ్మములు సుసంగతమై యున్నవి ఆ కళయే అవిద్యా ప్రతిబింబిత ప్రాజ్ఞుఁ డని పిలువఁబడును. తురీయమునం దశ్వద్ద బీజము లేదు. సుషుప్తి వఱకే సర్వానుభవ మగుటచే ప్రత్యక్కళామిళిత మగు నానందమయ కోశమే యాత్మ యని బోధించి కోశ సమాప్తిఁ జేయఁబడినది. కావున - అస్తి - భాతి - ప్రియములను సచ్ఛిదానంద స్వరూప బ్రహ్మమును (ఆత్మయును) రూప, నామము లగు అనాత్మయును క్షీరనీరముల వలె నేకాకార మై యున్నవి.
శ్రు|| తద్థేదంతర్హ్యవ్యాకృతమాసీత్ - తన్నామరూపాభ్యామేవ వ్యాక్రియతా సౌనామాయ మిదం రూప ఇతి||
ఆ పరబ్రహ్మమే గుణసామ్య మగు ప్రకృతితోఁ గలసి మొదట నవ్యక్తము (బీజము)గా నుండి పిదప దేవదత్తాది నామములచేతను, నీలపీతాది రూపములచేతను - వ్యక్త మయి, షడ్వికార యుక్త మాయాకార్య మగు సంసార పాదప మగుచున్నది. యెట్లు వృక్షమునకు బీజము కారణ మయి పృథ్వి యధిష్ఠాన (స్థితికి ఆధార) మగుచున్నదో, యటులు సంసార పాదపమునకు అవ్యక్తము కారణ మయి బ్రహ్మ మధిష్ఠాన మగుచున్నది. యెట్లు వృక్ష బీజములతోఁ బృథ్వికి సంబంధము లేదో, యట్లు మాయా, తత్కార్యములతో బ్రహ్మమునకు సంబంధము లేదు. కావున దేహేంద్రియ ప్రభృతి అవ్యక్త పర్యంతము ననాత్మ యని చెప్పఁబడినది.
శ్లో|| దేహేంద్రియ ప్రాణమనోహమాదయః -సర్వే వికారా విషయాస్సుఖాదయః, వ్యోమాది భూతాన్య
ఖిలంచవిశ్వ - మవ్యక్త పర్యంతమిదంహ్యానాత్మా||
దేహము, ఇంద్రియములు, ప్రాణములు, మనస్సు, బుద్ధి, (అహం) శబ్దస్పర్శాది విషయములు, తజ్జనితము లగు నానావిధ దుఃఖములు, ఆకాశాది భూతపంచకమును, దన్మేళన మగు నశేష ప్రపంచమును - నవ్యక్త పర్యంత మనాత్మ యని చెప్పఁబడినది. (ప్రకృతి, అవ్యక్తము, మాయ, అశ్వత్థము, మున్నగునవి. యనాత్మకుఁ బర్యాయ పదములు) బీజమునకు మృదధిష్ఠానమైనటు, లనాత్మకుఁ బురుషుఁడే యధిష్ఠాన మని సంశ్రవణ మగుచున్నది.
శ్రు||
మనసశ్చ పరాబుద్ధిః - బుద్ధేరాత్మామహాన్పరః
మహతః పరమవ్యక్త - మవ్యక్తాత్పురుషః పరః
పురుషాన్నపరంకించి - త్సాకాష్ఠాసాపరాగతిః||
సంకల్పరూప మనస్సుకంటే నిశ్చయాత్మక మగు బుద్ధియును, బుద్ధికంటె - నాత్మ (ప్రతిబింబకళ) క్షేత్రజ్ఞుడు, ఆత్మకంటె - మహత్తత్వము (హిరణ్మయుఁడు) - సూత్రాత్మ, మహత్తత్వముకంటె - అవ్యక్తము (అంతరాత్మ), దానికంటెఁ బురుషుఁడు (పరమాత్మ) పరములు. ఆ స్థితినిఁ గాష్ఠ యని నుడువుదురు. కాష్ఠ, పరా, ఆత్మ, క్షేత్రజ్ఞుఁడు, సాక్షి మొదలగునవి. యాత్మకుఁ బర్యాయపదములు - ఇ ట్లాత్మానాత్మల పరీక్షకుఁ డగుఁ పరీక్షిన్నరేంద్రుండు ప్రాయోపవిష్టుండై యనగాఁ బధికునకు గమ్యస్థాన దీక్షవలె మోక్షైక దీక్షాపరుండై సర్వ సంగములను వర్జించి, మరణాసన్న నిశ్చయుండై యుండె నని తాత్పర్యము - ముముక్షువునకు బహిరంగసాధనములను వైరాగ్యబోధోపరతులలో, వైరాగ్యము ప్రథమ సోపానముగాఁ జెప్పబడినది యెటు లనగా.
శ్రు||
వమనాహారవద్యస్య - భాతిసర్వేషణాదిషు -
తస్యాధికారస్సన్యసే - త్యక్తదేహాభిమానినః||
ఎట్లు మాంసభక్షకుఁడు, మత్స్యాది పచన సంస్కార జనిత దుర్గంధాదులను, సౌరభముగా గ్రహించునో, వాటినే తపోధురీణుం డగు సద్బ్రాహ్మణుఁ డె ట్లసహ్య మని యేవగించి నాసికావివరముల మూసికొనునో, యట్లు గాఢవైరాగ్యవంతుఁ డగు ముముక్షువు ఈషణత్రయ స్త్రీ విత్తాది విషయము లందు వమనాహారము వలె, దేహాభిమాన వర్జితుండై పూర్వానుభూతార్థ దుఃఖస్మృతిచే నిశ్చయంబుగా వివర్జిత విషయం డగును. వమనాహారమును, శ్వానము పునర్గ్రహణ మొనర్చి నటుల దేహాద్యభిమా నాధీనుఁ డగు జడుఁడు - మరల మరల సంసారవిషయ గ్రహణాసక్తుం డగును. అట్టి దేహాభిమాన వర్జితునకే సన్యాసము నం దధికార మగును. గుడమును విసర్జించినచోఁ బిపీలకము (చీమ)లు చేరనటులు విషయ భోగాభిలాష పాత్ర మగు గాత్రము పై శరీరాభిమానముఁ ద్యజించినచోఁ దన్మూలకము లగు సకల దుఃఖపుంజములును నశించును.
శ్రు||
సంస్కృతిర్వర్తతేర్బీజం - శరీరం విద్ధిభౌతికమ్
భావాభావ దశాకోశం - దుఃఖరత్నసముద్గతమ్
బీజమస్య శరీరస్య - చిత్తమాశావశానుగమ్||
ప్రాప్తా - ప్రాప్తా (హర్షామర్షా) ద్యవస్థలకుఁ గోశము (వర) అయినట్టియు - దుఃఖములకు స్థాన మయినట్టియు, నీ పాంచభౌతిక శరీరమే సంసారపాదపమునకు బీజ మగుచున్నది. యాశావశ మగు చిత్తమే శరీరద్రుమమునకు విత్తనమై యున్నది. ద్విశీర్ష భుజంగము (రెండు తలల పాము) ఇరు దెసలను స్వచ్ఛందగమనముఁగలిగి యొక శిరస్సునశించినచో నితరము శక్తివిహీనమయి క్రమముగ నెట్లు నాశనమగునో యటుల, నవిద్యాకార్యము (వాసనా కర్మము) లన్యోన్య కారణములై యొకటి నశించినచో నితరమునకుఁ గూడ నాశనముఁ గల్గును.
శ్లో||
హేతుద్వయంచచిత్తస్య - వాసనాచసమీరిణః
తయోర్వినష్ట ఏకస్మిం - స్తద్వావపివినస్యతః||
చిత్తమను వృక్షోపజీవనమునకుఁ బూర్వకర్మఫల భోక్తృత్వపేరక మగు వాసన (దృఢేచ్ఛ)యును, సమీరణమనగాఁ బ్రాణవాయు స్పందము (వర్తమానకర్మ ప్రవర్తకము)నను, కారణ ద్వయము కలదు. వాటిలో నొకటి నష్టమైనచోఁ ద ద్వంద్వ వినష్టము కల్గును - బాహ్య విషయ ప్రకృ త్యనుసంథానమునందు ఫలమును, తత్ఫలమునందు వాసనారూప కర్మములు సహజముగా నంకురించి యుండును.
శ్లో||
బాహ్యాను పరివర్ధయేత్ఫలం
దుర్వాసనామేవతతస్తతోధికామ్
జ్ఞాత్వావివేకైః పరిహృత్యబాహ్యమ్
ఆత్మానుసంధిం విదధీత నిత్యమ్||
బాహ్యవిషయేంద్రియ సంయోగానుసంధానము నిశ్చయముగా ఫలముఁ గలిగించును. దానివలన నధిక మగు దుర్వాసన కలుగును. (అ ట్లెఱింగి జ్ఞానులు బాహ్యానుసంధిని వర్జించి యాత్మానుసంధానముఁ జేయవలెను) వాసన యనగా?
శ్లో||
దృఢభావన యాత్యక్త్వా - పూర్వాపరవిచారణం
యదాదానంపదార్థస్య - వాసనాసాప్రకీర్తితా||
పూర్వానుభూత యాతన (దుఃఖము)ను, రాబోవు కష్టములను యోచన చేయక, దృఢవాంఛా నిబద్ధుఁడై, విషయగ్రహణ మొనర్చు టెద్దియో, దానినే వాసన యని పరిగణింతురు.
ఎట్లు పృష్టసుగంధ జంతువు లగు పునుగు జవ్వాజి మున్నగు పిల్లులు నిశలయం దెచ్చటెచ్చట విశ్రమించునో యా యా ప్రస్తర (ఱాతి) ఫలకముల యందు సువాసనలు గ్రమ్ము నట్లు, వర్తమాన దుష్క్రియ (కర్మ)ల యందు రాగద్వేషము లను వాసనాబీజములు అంతఃకరణఫలకమునందు వెదజల్లఁ బడి, తద్వాసనలు పునరాగమ, భవ (రాబోవు జన్మ)ము నందు దేహారంభాంకురములుగాఁ బరిణమించి ప్రారబ్ధ కర్మరూప జల సించితము లై దుఃఖ రూప ఫలంబుల నొసంగుచు రథాంగము (చక్రము)వలెఁ ద్రిమ్మరుచుండును.
శ్లో||
క్రియాశరీరోద్భవ హేతురాదృతా
ప్రియా ప్రియౌతౌ భవతస్సురాగిణః
ధర్మేతరౌతత్రపునశ్శరీరకం
పునఃక్రియాచక్రవదీర్యతేభవః||
కర్మమువలన జన్మమును - అనుభవ జన్మక్రియల యందు ప్రియాప్రియములు (ఇష్టాయిష్టములు)ను, తన్నిమిత్తంబు లగు ధర్మాధర్మములు (పుణ్యపాపములు)ను, తత్ఫల సేవ్య మగు పరజన్మమును, ఇటుల మాటిమాటికిని నూర్ధ్వాధో గమనముఁ గలిగిన చక్రమువలె రాగవంతునకు భ్రమణముఁ గలిగి యుండును. వృక్షమునకు బీజ మెట్లు సంప్రాప్త మయ్యెనో యనుపలబ్థము (తెలియబడదు) కాని, వృక్ష లబ్ధ బీజములు పునరారోహణ కారణములని తెలియఁబడును.
శ్లో||
వృక్షదర్శనకాలేతు - నబీజముపలభ్యతే
వృక్షోద్ధితానిబీజాని - దృశ్యంతేవృక్షబీజవత్||
ప్రత్యక్ష వృక్షమునకు బీజ మెట్లు లబ్ధ మైనదో తెలియఁబడలేదు కాని తత్ఫల బీజములు భవిష్యద్ద్రుమోత్పత్తి కారణము లని తెలియఁబడుచున్నవి. ఆ రీతిని సుత్తి ముందా? కారు ముందా? అనునట్లు, వాసనా కర్మము లన్యోన్య సహాయ సంపాదకములై యుండును. ఎట్లు సౌధమన నాశ్రయించిన పిశాచము తత్సౌధాద్యక్షుని బాధించునో యటులు స్థూల, సుక్ష్మోపాధిగతము లైన యాధివ్యాధులు చిదాభాసుఁ డగు జీవుని బాధించుచుండును - ఆధివ్యాధు లనగా।
శ్లో||
శరీరేజ్వరకుష్ఠాద్యాః క్రోధాద్యామానసాస్మృతాః
ఆగంతుకాభిఘాతోద్ధాః సహజాక్షుతృడాదయః||
జ్వర కుష్ఠాదులు స్థూలోపాదివ్యాధులును - కామక్రోధాదులు సూక్ష్మగతములును - ఘాతాదు (దెబ్బ) లాగంతుకములను - క్షుతృడాదులు సహజ జ్వరములు నై యున్నవి. రాగద్వేషములు పిండోత్పత్తి సమయమునందే వాసనారూపమున విస్త్రుత మయి (వ్యాపించి) యుండును.
శ్లో||
ఇచ్ఛాద్వేషసముద్ధేన - ద్వంద్వమోహేనభారత
సర్వభూతాని సమ్మోహం - సర్గేయాంతిపరంతప||
ఓయి భారతా! భాః - ప్రకాశమగు పరమాత్మునియందు రత - ఆసక్తి కలిగినవాఁడా! భార - సంసారమును త - (తనుత్వము) విస్తరింపఁజేసినవాఁడా! పరంతప - శత్రువులను తపింపఁజేయువాఁడా! లేక, పరమునుగూర్చి తపించువాఁడా! యని, ద్వ్యర్థి సంబోధనలు - ఇచ్ఛా ద్వేష, రూప ద్వంద జనిత మోహముచే సర్వభూతములును - సర్గే - పిండోత్పత్తి సమయము నందే వాసనా రూప మగు మోహమును పొందుచున్నవి.
అనగా జీవునకు వాసనాజనితమోహ రూపమహోదథి యలంఘ్య మని యాశయము - కొండ ప్రక్కనుండు మృత్తు దృఢ మయి క్రమంబున ఱాతిగాఁ పరిణమించినట్లు పూర్వవాసనలు పరజన్మమునందుఁ గ్రియారూప మయి సర్వ దుఃఖాకర మగును.
శ్లో||
దేహమూల మిదం దుఃఖం - దేహఃకర్మసముద్భవః
కర్మప్రవర్తతే దేహే౾ - హంబుధ్యా పురుషస్యహి
అహంకార స్త్వనాదిస్యా - దవిద్యాసంభవోజడః
జీవకామ పిశాచేన - వాసనోవివశో భవేత్||
ప్రారబ్ధానుభవమునకు, దేహమును, దానికిఁ గర్మమున కహంతయును, దానికి నవిద్యయును గారణములు - అవిద్యాప్రతిబింబుఁ డగు జీవుఁడు కామపిశాచ గ్రస్తుం డగును. కావున జీవాశ్రయ మగు విషయభోగ వాంఛయే పిశాచమువలెఁ బ్రతిబంధక మగును.
శ్లో||
భోగేచ్ఛామాత్రకోబంధ - స్తత్యాగోమోక్షఉచ్యతే||
భోగేచ్ఛయే బంధమును - తత్త్యాగమే మోక్షమును నగును. గాని, తద్పృధగ్భంధ మోక్షములు లేవు, భోగము లన్ననో?
శ్లో||
భోగోమేఘ వితానస్థో - విద్యుల్లేఖేనచంచలా
ఆయురప్యగ్ని సంతప్త - లోహస్థజలబిందువత్||
భోగములు మేఘవితాన (ఊర్థ్వస్థ) విద్యుల్లేఖ మెరుపువలేఁ జంచలము లగును. ఆయువన్ననో యగ్నిదగ్థ లోహగత జలబిందువువలె సద్యోనాశన స్వభావ మైనది.
శ్లో||
ఛాయేనలక్ష్మీశ్చ పలాప్రతీతా
తారుణ్యమం బూర్మితదధృవంచ
స్వప్నోపమం స్త్రీ సుఖమాయురల్పం
తధాపిజంతో రభిమానఏషః||
ఐశ్వర్యము ఛాయవలెఁ జపల మైనది. యౌవనము తరంగమువలె నస్థిర మైనది. స్త్రీ సుఖము స్వప్న లబ్ధానందము వంటిది. జీవితము క్షణభంగురము అని, యిట్లు చక్షుర్గోచర మైనను, మనుజుఁడు సంసారమును సత్య మను ప్రత్యయము (విశ్వాసము)చే, నభిమానమును విడువకున్నాడు. ఏమి యాశ్చర్యము? ఇట్లవలోడన (విచారణ) సేయువాఁడు జన్మములను గోరక ముక్తినే గోరును.
శ్లో|| శ్రేయోహిధీరో౾భిప్రేయసోవృణీతే ప్రేయోమందో యోగక్షేమాద్వృణీతే||
బుద్ధిమంతుఁడు జననమరణ ప్రవాహ ప్రయచ్ఛక మగు, కర్మలనుండి నివృత్తుఁడై, మోక్షమార్గము (శ్రేయస్సు)నే కోరును. మందుఁడు ప్రేయస్సు కర్మమార్గముయొక్క యోగక్షేమములనే గోరును. (యోగ మనఁగా, లేనిదానిని సంపాదించుట. క్షేమ మనఁగా, సంపాదించినదానిని వృద్ధిచేయుట)
శ్లో||
వైరాగ్యతైలసంపూర్ణే - భక్తివర్తిసమన్వితే
ప్రబోధపూర్ణపాత్రేతు - జ్ఞప్తిదీపంవిలోకయేత్||
వైరాగ్యతైలపూరిత మగు ప్రబోధ యను ప్రమిదయందు, భక్తి యను వర్తిఁ జేర్చి జ్ఞాన మను జ్యోతిని వెలిఁగించి పరమాత్మను జూడవలెను. వైరాగ్య బోధోపరతు లుత్తరోత్తర పధానుక్రమ సహాయ సంపాదకములై యుండును.
శ్లో|| వైరాగ్యస్య ఫలంబోధో - బోధస్యోపరతిఃపలమ్||
వైరాగ్యముయొక్క ఫలము జ్ఞానము - జ్ఞానవిహీన మైనచో వైరాగ్యము లేదనియే గ్రహించవలెను. అట్లే బోధయొక్క ఫల, ముపరతియు దానియొక్క ఫలము స్వాత్మానందమును, శాంతియు నై యున్నవి. కదళీవృక్షము గెలవేసినతోడనే స్వనాశనముఁ గలిఁగినట్లు, వైరాగ్యాదులు, బ్రహ్మానంద ఫలముఁ గలిఁగినతోడనే నశించును. కావున,
శ్రు||
సర్వవ్యాపారము త్సృజ్య - అహంబ్రహ్మేతి భావయ
అహంబ్రహ్మేతి నిశ్చిత్య - అహంభావం పరిత్యజ||
వ్యాపారవర్జితుఁడ వై, నేను బ్రహ్మము నని భావించుము. నిశ్చయానంతర మంహంభావమును విడువుము. ముముక్షు, విట్లేకాగ్ర చిత్తుఁ డై, దేహావసాన సమయమునుగూర్చి నిరీక్షించుచుండును.
శ్రు||
మృత్యుంచనాభినందేత - జీవితంవా కథంచన
కాలమేవ ప్రతీక్షేత - నిర్దేశంభృతకోయథా||
ముముక్షువు జననమరణాది వృత్తులనుగూర్చి యభిలషించకఁ, గూలివాఁడు నిర్దిష్ఠ సమయము ముగియు కొఱకు నిరీక్షించినట్లు ప్రారబ్థక్షయ కాలము కొఱ కెదురుచూచుండు. నిట్లు శ్రుతి స్మృతి యుక్త్యనుభవ పూర్వక మగు, గాఢవైరాగ్యవంతుఁ డగు పరీక్షిద్భూపాలకుండు. ప్రాయోపవిష్టుండై (మరణాసన్న నిశ్చయుండై) కూర్చుని బాదరాయణి యగు శుకు నడిఁగె నని రహస్యార్థము. బాదరాయణిః, బదరికాశ్రమ స్ధాత యగు వ్యాసుఁడు, అతనిపుత్రుఁడు శుకుఁడు.
శ్లో||
విశ్రుత స్తునదాపుణ్యో - ఖ్యాతో బదరికాశ్రమః
నరనారాయణౌయత్ర - తేపాతేతౌ మునీతపః||
నరనారాయణు లను ఋషు లే యాశ్రమమునఁ దపం బొనరించిరో, యది పవిత్ర మగు బదరిక యను వనవాటిక యని ప్రశంసింపఁబడినది. తదాశ్రమవాసి వ్యాసుఁడు.
అతని పుత్రుఁ డగు శుకుం డిట్లనియె. శుకుం డనఁగా? విహంగమార్గగామి.
శ్లో||
శుకశ్చ వామదేవశ్చ - ద్వేసృతీదేవనిర్మితే
శుకోవిహంగమః ప్రోక్తో - వామదేవః పిపీలికా||
కైవల్యమునకు, శుక - వామదేవమార్గము లను మార్గ ద్వయము కలదు. అందు శుకమార్గము, విహంగ - (సద్యోముక్తి)మార్గ మనియు, వామదేవ, మార్గము, పిపీలికామార్గ మనఁగాఁ గ్రమముక్తి యని, శుకమార్గ మనఁగా?
శ్రు||
అతద్వ్యావృత్తిరూపేణ - సాక్షాద్విధిముఖేనవా
మహావాక్యవిచారేణ - సాంఖ్యయోగసమాధినా
విదిత్వా స్వాత్మనోరూపం - అసంప్రజ్ఞాధితః
శుకమార్గేణవిరజాః - ప్రయాంతి పరమంపదం||
ప్రపంచాభివృత్తి (సంకల్పము) మరలించుటవల్లను బ్రహ్మాకార వృత్తితోఁ జూచుటవల్లను, విధి, (బ్రహ్మ) ముఖాంబుజగళిత మగు చతుర్విధ మహావాక్యముల బోధచేగాని, సాంఖ్యయోగసమాధి, తత్వములను విచారణచేసి పురుషుఁ డసంగచిద్రూపుఁ డని తెలియుటచేగాని, యసంప్రజ్ఞాత (ధీనిలయ) సమాధిచేగాని, స్వస్వరూపమును దెలిసికొని రాగ విరహితులై శుకమార్గముచే, నా జన్మమునందే ముక్తి నొందుచున్నారు. కావున నట్టి విహంగమార్గ ప్రదర్శకుఁ డగు శుకుం డిట్లు చెప్పె నని రహస్యార్థము -