గజేంద్రమోక్షణ రహస్యార్థం : భుగభుగాయిత
సీ||
భుగభుగాయితభూరి బుద్భుదచ్ఛటలతోఁ;
గదలుచు దివికి భంగంబు లెగయ;
భువన భయంకరఫూత్కార రవమున;
ఘోరనక్రగ్రాహకోటి బెగడ;
వాలవిక్షేప దుర్వార ఝంఝానిల;
వశమున ఘమఘమావర్త మడరఁ;
గల్లోలజాల సంఘట్టనంబులఁ దటీ;
తరులమూలంబులై ధరణిఁ గూల;
తే||
సరసిలోనుండి పొడగని సంభ్రమించి
యుదరి కుప్పించి లంఘించి హుంకరించి
భానుఁ గబళించి పట్టు స్వర్భానుపగిది
నొక్క మకరేంద్రుఁ డిభరాజు నొడిసిపట్టె.
బాహ్య|| -భుగ భుగాయిత ధ్వని జనిత బుద్బుద సముదాయముతో నంతరిక్షమునకుఁదరంగంబు లెగయు కరణిఁజవించుచుండ లోకభయం కరములగు నుచ్ఛ్వాసములచే మకరాది లగ్నస్థ గ్రహకోటి భయము నొందుచుండఁ వాల విక్షేపముచే ఘుమఘుమ యని సుడులు పడుచుండు దరంగ సంఘట్టనచేఁ దీరస్థ వృక్షములు సమూలముగాఁ గూలుచుండ, సరస్సులోని గజమును జూచి యాటోపంబునఁ గుప్పించి పైకుఱికి, హుంకార ధ్వనితో రాహుగ్రస్త సూర్యగ్రహణమువలె నొక్క మకరేంద్రము గజేంద్రునిఁ బట్టె నని తాత్పర్యము. -
రహ|| -(జీవుఁడు కామగ్రస్తుఁ డగుట) ఇంతవఱకు మనోసరస్సు శుద్ధ వృత్తి యుక్త మైనట్లు ప్రయుక్తమైనది. యట్టి శుద్ధ సాత్విక మనస్సు నందుఁ గామ మెట్లు జనించు నను సంశయ ముదయింప వచ్చును, కాని, యెపుడు జీవచైతన్యము విషయ సాన్నిధ్య మగునో, యపుడే తద్విషయ గ్రహణేచ్ఛ జనించును, తోడనే బీజమంకురమై, పల్లవ, పత్ర, పుష్ప, శాఖాదులతో నశ్వత్థము వృద్ధియై నటు లిచ్ఛయే కామముగాఁ బరిఢవిల్లును. "శ్రు|| చితోరూపమిదం బ్రహ్మన్ క్షేత్రజ్ఞ ఇతి కధ్యతే-వాసనాః కల్పయంత్సోపి-యాత్యహంకారతాంపునః - అహంకారో వినిర్ణేత-కళంకీబుద్ధిరుచ్యతే బుద్ధి సంకల్పితాకారా-ప్రయాతి మనసాస్పదం - మనోఘన వికల్పంతు గచ్ఛతీంద్రియతాంశనై - ఏవంజీ వోహివాసనారజ్జు కల్పితః
తా|| చిత్స్వరూపియైన పరమాత్మ క్షేత్రజ్ఞుఁడని చెప్పఁబడుచున్నాడు. వాసనా కల్పితుఁడై నియామకత్వంబున నహంకార రూపమును బొందుచున్నాడు. పిమ్మటఁగళంకయుక్తబుద్ధి, సంకల్పరూప మనస్సును ఇంద్రియత్వమును, గ్రమక్రమంబునఁ బరిణమించి వాసనా సంకల్పరూప రజ్జవులచే జీవుఁడు బంధింపఁబడుచున్నాడు. అనగా విషయ సంకల్పములు కూడదని భావము "శ్రు|| యస్యస్త్రీ తస్యభోగేచ్ఛా, నిస్త్రీ కస్యక్వభోగభూః - స్త్రీయంత్యక్తాజ్జగత్త్యక్తం జగత్యక్తాత్సుఖీభవేత్" ఎవనికి స్త్రీ సంపర్కములేనిచో *భోగేచ్ఛ యెచ్చట? నుండ దని తాత్పర్యము. - స్ర్రీని విడుచుట వలన జగత్తును విడిచి నట్లగును జగత్తును విడిచిన సుఖి యగును - కావున, గజము నిమిత్తమాత్రముగా నుండి జలపానముచేఁ దృప్తినొందక నింద్రియార్థమను పుష్పగ్రహణాది విషయ సంకల్పముచే గలత నొందె నని భావము. ఇట్లు ఋష్య శృంగ, సౌబల, విశ్వామిత్ర, ప్రభృతులు దృష్టాంతములు - భుగ భుగాయిత భూరి బుద్బదము లనగా, భయంకరములైన దుస్సంకల్పములు, వానినే మనోరాజ్యములోఁదీవ్రసంకల్పములని చెప్పుదురు.
"శ్లో|| అశాస్త్రీయమపిద్వైతం తీవ్రం మందమితిదిందా - కామఃక్రోధాదికం తీవ్రం మనోరాజ్యంతధే తరత్"
ద్వైతమనగా నశాస్త్రీయమైన సంకల్పము. తీవ్ర మందము లని ద్వివిధముగాఁ జెప్పబడెను. కామక్రోధాదులు తీవ్ర మనియుఁ దద్రహిత సంకల్పము మనోరాజ్యము (జాగ్రత్స్వప్నము) బాధించ నిదిగాఁ జెప్పినది. యట్టి తీవ్రసంకల్ప బుద్బుదము" "మన్మథ సంబంధకామ దోషాదికము, బడబానలము వంటి యుగ్రతేజోవంతమైనది. మఱియు, దుస్సంకల్ప వికల్ప పూత్కారము. (ఉచ్ఛ్వాస నిశ్వాసము) లితర సంకల్పముల నడఁగ ద్రొక్కుచుండ, వాల విక్షేపముగా నన్నమయాది కోశములకుఁ బుచ్ఛములు (తోకలు) ఆధార మని పరిగణింప బడిఁనవి, యట్టి యాధార మగు పుచ్ఛమును బహువిధములుగా జలింపఁజేసి , యనఁగా గాముకుని లక్షణములు, బుద్ధి చలించుట, మాటలు తడబడుట, గగుర్పాటుఁ జంచలదృష్టి మున్నగు సన్నిపాత గుణములవంటి గుణములు - విక్షేప మనబడును, అట్టి విక్షేపమగు మోహవర్తములను సుడిగుండములు గలుగుచుండ దుస్సంకల్ప కల్లోలము (పెద్దకెరటముచే) ధైర్య ద్రుమము సమూలముగాఁ బతనమగుచుండఁ బొంచి, జీవుఁడు। పరాజ్ముఖుఁడైనపుడు సమయముఁజూచి కుప్పించి, లంఘించి, రాహుగ్రస్త సూర్యగ్రహణమువలె జీవగజమును గామరూప నక్రము పట్టె నని తాత్పర్యము-
శ్లో|| దేహేంద్రియాది సర్వ విషయేషుపరికల్ప్యరాగం బధ్నాతి తేనపురుషం పశువద్గుణేన
కామాభిలాష వివిధో రగదంశి తస్య"
తా|| విషయములందు రాగమును గల్పించి, పశువును ద్రాటిచే బంధించి నటులు బంధించుచున్నది ఏది?
కామము. కామాభిలాషలను వివిధములగు నురగము (పాములచే) గరువఁబడి బాధింపఁబడితిని.
సీ|| గంగిరెద్దును దగు। శృంగార మొనరించి
జిగితాళ్ల నాసిక। బిగియఁగట్టి
యింటింటఁద్రిప్పెడి । యెద్దుభంగినిసదా
పురుషుండు స్త్రీ వెంటఁ। దిరుగుచుండు
విషయాను రాగదు ।ర్విలసిత యరుపాశ
బద్ధుఁడై యువతుల ।బారిఁజిక్కి
యాటలాడు మటన్న।నాడుచుఁగామాది
రజ్జుప్రోతముల ని ।రంకుశముగ
తే|| నురులలోఁబీకబిగియంగ।నరశవంబు
గతిని వహియించి శిరము సం ।తతము వణఁక
బంధమును వీడదెంత ని ।ర్భాగ్యదశయొ
యేమి చెప్పుదు నిద్థరఁ గామ మహిమ||
వ|| ఇట్లు జీవుఁడు గ్రహింపఁబడి