గజేంద్రమోక్షణ రహస్యార్థం : అన్యాలోకన భీకరంబులు
శా||
అన్యాలోకన భీకరంబులు జితాశానేకపానీకముల్
వన్యేభంబులు కొన్ని మత్తతనులై వ్రజ్యావిహారాగతో
దన్యత్వంబున భూరి భూధరదరీ ద్వారంబులందుండి సౌ
జన్యక్రీడల నీరుగాలిపడి కాసారావగాహార్థమై.
బాహ్య|| చూడ్కులకు భయంకరములును-జిత+ఆశా+అనేకప+(అనీకముల్) దిగ్దంతావళులను మీఱియుండు కొన్ని యడవి యేనుఁగు గుంపులు, మదించిన శరీరములుగలవై ప్రయాణ విహారముచేఁగలిగిన బడలికచే, నుదన్యత్వంబు - నీరుఁద్రాఁగుట కిచ్ఛచేఁబర్వత గుహలనుండి వెడలెనని తాత్పర్యము.
రహ|| అన్యాలోకన భీకరంబులు సమాధియం దాత్మాకారవృత్తులు వినా యితరముఁదోచనందున దానిని-అస్పర్శయోగమని యోగులు భయముఁజెందిరి.
శ్లో|| అస్పర్శయోగో వైనామ-దుర్దర్శస్సర్వయోగిభిః
యోగినోబిభ్యతిహ్యాస్మాదభయే భయదర్శినః
అభయమగు సమాధియందు యోగులు (ద్వైతులు) భయమును గల్పించుకొని దుర్ణిరీక్షణమని చెప్పుచున్నారు.
అనగాఁదటస్ధలక్షణుఁడగు-కూటస్థ-సదాశివ , ఈశ్వర, హిరణ్మయ, బ్రహ్మ, విష్ణు, రుద్ర, ప్రాజ్ఞ. పారమార్ధిక జీవాదులకు స్ధానములగు, సహస్రార ఆజ్ఞ , (అవ్యక్త) బ్రహ్మబిల, మూలాధారాది గుహలనుండి పరాగ్దృష్టులకు భయంకరములై దిగ్దేవతలగు నింద్రాదులను జయించు నవియై, కూటస్థాది చైతన్యరూప గజములు జన్మ, కర్మాది, సుఖాభాసములగు విలాసేచ్ఛలచే - క్షుత్పిపాసాది, షడూర్ముల స్ధానమగు మనోరూప కాసారమును, గూర్చి వెడలెనని తాత్పర్యము. (షడూర్ములనగా నాకలి, దప్పులు - శోక మోహములు - జరామరణములు). -