గజేంద్రమోక్షణ రహస్యార్థం : అలయక సొలయక
వ|| ఇవ్విధంబున
కం||
అలయక సొలయక వేసట
నొలయకఁ గరి మకరితోడ నుద్దండత రా
త్రులు సంధ్యలు దివసంబులు
సలిపెం బో రొక్క వేయి సంవత్సరముల్.
బాహ్య|| అలసట - విముఖతఁజెందక, శ్రమనొందక నీ రీతి గజేంద్రుఁడు, మొసలితోడ రాత్రింబవళ్లు, వేయి సంవత్సరములు పోరాటము సలిపెను.
రహ|| జీవుఁడు కామముతోడ వేయి సంవత్సరము లనగా అనేక జన్మలయందు విముఖతఁ జెందక పోరాడెనని భావము.