పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

రచనలు : నారాయణ శతక వ్యాసం

పోతన నారాయణ శతకము హరిభక్తుల కర్ణ రసాయనము
సౌజన్యము: శ్రీ నాగవరపు రవీంద్ర గారు, సంస్కృతి-సంప్రదాయం-భక్తి వర్డుప్లస్సు బ్లాగు
బహు చక్కని ఈ వ్యాసము యొక్క పాఠము క్రింద ఉల్లేఖించబడింది. ఈ వ్యాసం మూల పాఠం కోసం ఈ లింకు నొక్కండి.

తెలుగు శతక సాహిత్యంలో నారాయణ శతకానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. వేమన, సుమతీ, దాశరథీ శతకాల వలె ఈ శతక పద్యాలు కూడ తెలుగువారికి కంఠోపాఠం. ఈ పద్యాలు జ్ఞానసముపార్జనతో పాటుగా ఓ విధమైన అలౌకిక అనందాన్ని కలుగజేస్తుంటాయి. కాలం ఎంతో మారిపోయింది.

ఓ యాభై సంవత్సరాల క్రితం దాకా ఆంధ్రదేశంలో పల్లెలలో, పట్టణాలలో ఒక సాంప్రదాయం ఉండేది. దసరా నవరాత్రుల సమయంలో, ప్రాథమిక పాఠశాలల్లో చదివే పిల్లలు, గుంపులుగుంపులుగా వాళ్ళ ఉపాధ్యాయుల వెనక నడుస్తూ ఉళ్ళో ఇల్లిల్లూ తిరిగేవారు. ‘పిల్లవాళ్ళకు పప్పుబెల్లాలు, అయ్యవారికి చాలు ఐదువరహాలు’ అంటూ తమాషాగా పాడుతూ సందడిగా తిరుగుతుంటే వాళ్లకు ప్రతి ఇంట్లో స్వాగాతమూ, ఆతిథ్యము లభించేవి. పిల్లలకు ప్రతి ఇంట్లోనూపప్పూబెల్లాలో, మరమరాలో, మరొకటో ప్రేమగా పంచిపెట్టెవాళ్ళు ఇంటిపెద్దలు. అయ్యవారిని కూడా యథాశక్తి దక్షిణలతో సత్కరించి పంపేవాళ్ళు. ఆ రోజుల్లో అయ్యవార్లకు ఆదాయం తక్కువ, సంఘంలో గౌరవం ఎక్కువ. ఆ బాలబృందాలు బిలబిలా ఇళ్ళలోకి వస్తూ ఈ అధ్బుతమైన పద్యం చదివేవారు:

సింహాసనమై నభంబు గొడుగై ద్దేవతల్ భృత్యులై
మామ్నాయము లెల్ల వందిగణమై బ్రహ్మాండ మాగారమై
సిరిభార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై
రుసన్ నీఘనరాజసంబు నిజమై ర్ధిల్లు నారాయణా!

ఇలా దైవస్తుతి చేసి, బాలవాక్కు బ్రహ్మవాక్కుగనక, ‘జయ విజయీ భవ! దిగ్విజయీ భవా!’ అని ఆ ఇంటిల్లి పాదనీ ఆశీర్వదించి, పప్పుబెల్లాలు తృప్తిగా తిని, మళ్ళీ బిలబిలా మరో ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఆ దృశ్యాలు చూస్తుంటేనే ఒళ్ళు పులకరించేది. ‘ధర సింహాసనమై’ అనే పద్యం ‘నారాయణ శతకం’ లోని పద్యం.

ఈ శతకాన్ని ఆంధ్రుల అభిమానకని పోతన రాశారని ఒక ప్రతీతి ఉంది. ఆ పరమభాగవతుడు భాగవతం తెలుగులోకి అనువదించే బృహత్కార్యం ఆరంభించే ముందు అభ్యాసం కోసం ఈ శతకం రచించాడని కొందరంటారు. దానికి తగ్గట్టుగా ఈ శతకంలో పద్యాలూ, వాటి భావాలూ, నడకా భాగవత పద్యాలను గుర్తుచేస్తూ లలితంగా, మధురంగా, భక్తిరసం చిందిస్తూ ప్రకాశిస్తాయి. వ్యాకరణ పాండిత్యంకన్నా, విష్ణుభక్తి ప్రకటనకు ప్రాధాన్యతనిస్తాయి. సరళంగా, రసవంతంగా సాఫీగా, కర్ణపేయంగా ఉంటాయి. భీభత్సమైన సమాసాలు లేకుండా, నోట పట్టేందుకు అనువుగా ఉంటాయి.

చరిత్రకారులూ, వీరేశలింగం, దివాకర్ల వెంకటావధాని వంటి పండితులూ ఈ శతకాన్ని పోతన రచనలలో ఒకటిగా గుర్తించలేదు. అయితే ఇది ప్రాచీనశతకం అని మాత్రం అంగీకరించారు. అంతేకాదు, సుమారు పోతానగారి కాలంనాటితో, అంతకు కొంచెం తరువాతిదో, స్థూలంగా పోతన కవిత్వానికీ, నారాయణ శతకం శైలికీ పోలికలున్నా, ఈ శతకం పోతనగారు రాసింది కాదేమోననే అనిపిస్తుంది అన్నారు స్వామి శివశంకరస్వామి. పోతనను అభిమానించి, ఆరాధించే తరవాతి కవి ఎవరో, పోతన భాగవతానువాదంతో బాగా ప్రభావితుడై, ఆ శైలిని చక్కగాఅనుసరిస్తూ ఈ శతకం రాసి ఉండచ్చు.

నారాయణశతకం పద్యాలన్నీ ‘నారాయణా!’ అనే మకుటంతో ఉంటాయి. కనుక, పద్యాలన్నీ శార్దూల వృత్తంలో గానీ, మత్తేభ వృత్తంలో గానీ కవాతు చేస్తూ నడుస్తాయి. అన్నీ శ్రీమన్నారాయణుడిని స్తుతించే పద్యాలే. కల్లాకపటం లేని భక్తుడు తన స్వామికి నిష్కామంగా, నిరాడంబరంగా, నిశ్చల భక్తితో మొక్కటం ఈ శతకంలో విషయం. మల్లె పూలలాంటి పద్యాలు:

నీపుత్రుండు చరాచరప్రతతులం నిర్మించి పెంపారఁగా
నీపుణ్యాంగన సర్వజీవతతులం నిత్యంబు రక్షింపఁగా
నీపాదోదక మీజగత్త్రయములం నిష్పాపులం జేయఁగా
నీపెంపేమని చెప్పవచ్చు సుగుణా! నిత్యాత్మ నారాయణా!

ఓ సర్వసుగుణశాలీ! నిత్యాత్మా! నారాయణా! నువ్వు ధన్యుడివయ్యా! నీ కుమారుడేమో స్రుష్టికర్త బ్రహ్మదేవుడు, ఈ చరాచర జగత్తుకు నిర్మాత. నీ ధర్మపత్ని శ్రీ మహాలక్ష్మి జీవకోటికి సంపదలనిచ్చి రక్షిస్తుంది. ముల్లోకాలకూ పాపనాశని అయిన, పరమపవిత్రమైన గంగానది నీ పాదాలనుంచి ఉద్భవించిన పాదోదకం. నీ ఘనత ఏమని లాంటివి. పోగిడేది! నారాయణ శతకంలో మొత్తం నూట అయిదు పద్యాలు. ఈ శతకం ద్వారా తను కోరుకునేదేమిటో కవి ఆఖరు పద్యంలో చెప్పాడు.

నీమూర్తుల్ గన నీకథల్ వినఁ దుదిన్ నీపాదనిర్మాల్య ని
ష్ఠామోదంబు నెఱుంగ, నీచరణతోయంబాడ, నైవేద్యముల్
నీమంబొప్ప భజింప నీజపము వర్ణింపన్ గృపం జేయవే
శ్రీమించన్ బహుజన్మజన్మములకున్ శ్రీయాది నారాయణా!

ఆదినారాయణా! నేను ఎన్నిజన్మలెత్తినా, జన్మ జన్మలోనూ నీరూపమే చూచి పులకించేటట్టూ, నీ కథలే విని ఆనందించేటట్టూ, నీ పాదాల చెంత నిర్మాల్యపు వాసనలు ఆఘ్రాణించేటట్టూ, నీ పాదోదకం తీర్థంగా స్వీకరించేటట్టూ, నీ నైవేద్యాలు నియమప్రకారం భుజించేటట్టూ, నీ నామ జపం నిత్యం చేసుకొనేటట్టూ అనుగ్రహిస్తే చాలు!

నారాయణ శతకంలో ఏడు భాగాలున్నాయి. మొదటి పది పద్యాలూ శతకానికి ఉపోద్ఘాతం.

నేనీదాసుఁడ నీవు నాపతివి నిన్నేకాని యొండెవ్వరిన్
ధ్యానింపం బ్రణుతింప నట్లగుటకున్నానేర్చు చందంబునన్
నీనామస్తుతు లాచరించు నెడలన్నేతప్పులుం గల్గినన్
వానింలోఁగొనుమయ్య తండ్రి! విహితవ్యాపార నారాయణా!

లాంటి అపరాధ క్షమాపణ విషయాలు ఈ భాగంలో కనిపిస్తాయి.

శతకం రెండో భాగం అవతార దశకం. నారాయణుడి దశావతారాలనూ స్మరించి స్తుతిస్తాడు. మచ్చుకు కూర్మావతార స్తుతి:

రుల్ రాక్షసనాయకుల్ కడకతో త్యంతసామర్ధ్యులై
భ్రరీదండము మందరాచలముగా బాథోనిధిం ద్రచ్చగా
కించెన్ భువనత్రయంబును గిరుల్ దంతావళుల్ మ్రొగ్గినం
ఠంబై ధరియించి మించిన జగత్కల్యాణ నారాయణా!

దేవతలూ, రాక్షసులూ పట్టుదలతో, సామర్థ్యంతో మందరపర్వతాన్ని బ్రమరీదండం కవ్వంగా చేసి, సముద్రాన్ని మథించగా, మూడు లోకాలూ చలించి పోయాయి. భూభారాన్ని మోసే పర్వతాలూ, దిగ్గజాలూ కుంగిపోయాయి. ఆ సమయంలో కూర్మావతారం ధరించి నీ శక్తి చూపి, జగత్కళ్యాణం చేసినవాడివి.

ఇక మూడవ భాగంలో, పది పద్యాలతో నారాయణుడి దివ్య మహిమలను వర్ణిస్తాడు. వాటిలో ఒక పద్యం:

భూవ్రాతము నంబజాసనుఁడవై పుట్టింతు విష్ణుండవై
ప్రీతింబ్రోతు హరుండవై చెఱుతు నిర్భేద్యుండవై త్రైగుణో
పేతంబై పరమాత్మవై నిలుతు నీపెంపెవ్వరుం గాన ర
బ్జాతోద్భూత! సుజాత పూజిత పదాబ్జశ్రేష్ఠ నారాయణా!

పద్మం ఆసనంగాగల బ్రహ్మవై భూతకోతిని పుట్టిస్తావు. విష్ణువుగా ఆ భూతకోటిని రక్షిస్తావు. శివుడిగా నాశనం చేస్తావు. తెలియరానివాడివై, త్రిగుణోపేతుడివై, పరమాత్మగా వ్యాపించి ఉంటావు.నీ గొప్పతనం ఎవరూ తెలియలేరు. అప్ – జాత – ఉద్భూత – సుజాత – పూజిత పదాబ్జ శ్రేష్ఠ! (నీటిలో – పుట్టిన కమలంలో నిలిచిన సుందరి లక్ష్మీదేవి చేత – పూజింపబడ్డ – పాదకమలాల (శ్రేష్ఠుడా!)

శతకంలో తరవాతి పదిపద్యాలు నారాయణుడి నామ ప్రభావం వర్ణించేవి. వాటిలో, వాచవిగా ఒకటి:

మంబై పరతత్వమై సకలసంత్సారమై భవ్యమై
సుసిద్ధోరగ యక్షపక్షిముని రక్షోహృద్గుహాభ్యంతర
స్థిసుజ్జానసుదీపమై శ్రుతికళాసిద్ధాంతమై సిద్ధమై
రిలేకెప్పుడు నీదునామ మమరున్ త్యంబు నారాయణా!

నారాయణా! అన్నింటికీ (అతీతమై, పరతత్త్వమై, సకల సంపదలసారమై, మంగళకరమై, సుర-సిద్ధ-నాగ-యక్ష-గరుడ-ముని-రాక్షస జాతుల హృదయకుహరంలో స్థిరంగా నిలిచే జ్ఞానదీపమై, వేదార్థానికీ సకల కళలకూ సారాంశమై, సాటిలేనిదై నీ నామం ఒప్పుతోంది.

నామప్రభావం చెప్పిన తర్వాత, మరో ఇరవయ్యయిదు పద్యాలలో కృష్ణావతారవర్ణన – ముఖ్యంగా బాల కృష్ణ లీలలు కనిపిస్తాయి. శతకమంతా పరచుకొని ఉన్న నారాయణ భక్తితోపాటు, కృష్ణావతారవర్ణన చూస్తుంటే నారాయణ శతకం ఒక భాగవత సంగ్రహంలా కనిపిస్తుంది. ‘కృష్ణాకర్ణామృతం’లో రాధాకృష్ణుల అనురాగాన్ని వర్ణించే ఒక అద్భుతమైన శ్లోకాన్ని అనుసరించి చెప్పిన ఈ ముచ్చటైన పద్యం, ఈ భాగంలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది.

పెరుగుల్ ద్రచ్చుచు నొక్కగోపిక మిముం బ్రేమంబునం జూచి రా
సావేశత రిత్త ద్రచ్చనిడ నావ్వంబు నీవున్ మనో
లీలం గనుఁగొంచు థేనువని యయ్యాఁబోతునుం బట్టితీ
వృత్తాంతము లేను పుణ్యకథగా ర్ణింతు నారాయణా!

ఒక గోపిక. ఆమెకు కృష్ణుడి మీద వల్లమాలిన ప్రేమ. ఒకనాడు పెరుగు చిలకబోతుండగా ఆమెకు సమీపంలో పాలు పితికేందుకు వచ్చిన కృష్ణుడు కనిపించాడు. అమె ఇక బాహ్యప్రపంచమే మరిచిపోయింది. ఆ పరధ్యానంలో కుండలో పెరుగు పోయకుండానే, ఖాళీ కుండలో కవ్వం వేసి తిప్పుతూ, ఆ గోపాలుడినే చూస్తూ ఉండిపోయింది. ఆమె ప్రేమావేశాన్ని గమనించిన కృష్ణుడు తనూ అంతటి అనురాగావేశాన్ని ప్రదర్శిస్తూ పరధ్యానంగా, పాలు పితికేందుకు ఆవును బదులు ఆబోతును పట్టుకొన్నాడు. నారాయణా! కృష్ణావతారంలోని ఇలాంటి ఘట్టాలను నేను పుణ్య కథలుగా వర్ణిస్తాను.

నారాయణ శతకం పోతన అభ్యాసం కోసం వ్రాసిన శతకం అనే ప్రతీతి ఉందని ముందు చెప్పుకొన్నాం. అదే నిజమైతే, కవి తను భవిష్యత్తులో భాగవతం రాస్తాననీ, అందులో ఇలాంటి ఘట్టాలు పుణ్యకథలుగా వర్ణిస్తానని సూచన చేసినట్టు.

నారాయణ శతకంలో తరవాతి ఇరవై పద్యాలను జ్ఞాన వింశతి అని చెప్పుకొంటారు. అవి జ్ఞానవిషయాన్ని బోధిస్తాయి కాబట్టి. అయితే ఈ శతకకర్తకు విష్ణుభక్తినీ, హరినామ స్మరణనూ మించిన ప్రయోజనకరమైన జ్ఞానం ఏదీ కనపడదు. విష్ణుభక్తి లేనివాడు వేద, పురాణాలు పఠించటం అరణ్యరోదనం అంటాడు. పుణ్యతీర్థస్నానాలు గజ స్నానాలు వ్యర్థం అంటాడు.

యన్వేదములున్ బురాణములు బ్రఖ్యాతంబుగా తెల్పి మీ
నన్ భక్తివిహీనుఁడైనపిదపన్ వ్యర్థప్రయత్నంబెపో
గుకాంతామణి గొడ్డువోయినగతిం గ్రొవ్వారు సస్యంబు దా
కాలంబున నీచపోవుపగిదిన్ ద్మాక్ష నారాయణా!

అలాగే శతకం చిట్ట చివరిభాగంలో ఇరవై పద్యాలతో ‘మోక్షవింశతి’ ఉన్నది. ‘సర్వం హరిమయమైన’ నారాయణ శతకకర్తకు మోక్షమంటే నారాయణ కృపతో, నారాయణ పాదపద్మాలను చేరటమే.

వెయన్ యౌవనకాలమందు మరుడుఁన్ వృద్ధప్యకాలంబునన్
లురోగంబులు నంత్యమందు యముఁడుం బాధింపఁనట్లైన యీ
లుజన్మంబులు చాలదూలితి ననుం బాలింపవే దేవ మీ
లితానంద దయావలోకనము నాపైఁజూపు నారాయణా!

మరుడూ, రోగాలూ, యమడూ పెట్టేబాధలు భరిస్తూ చాలా జన్మలు గడిపాను. పరమానందాన్ని ఫలముగా ప్రసాదించే నీ కృపా దృష్టి నా మీద ప్రసరించు.

ముల్ మంత్రసమస్త యజ్ఞఫలముల్ దానక్రియారంభముల్
ముల్ పుణ్యసుతీర్ధసేవ ఫలముల్ ద్వేదవిజ్ఞానమున్
వాసవ్రత శీలకర్మ ఫలముల్ యొప్పార నిన్నాత్మలో
నుమింపం గలవారికే గలుగు వేయున్నేల నారాయణా!

భాగవత పద్యాల లాగా ఇలాంటి పద్యాలు కంఠస్థం చేసుకోనేందుకు అనువుగా ఉంటాయి. భాగవత సద్యాలలాగే, ఈ శతకంలో పద్యాలు కొన్ని కంఠస్థం చేసుకొన్న భక్తుడికి ఒంటరితనం అనేది ఉండదు. ఒంటరిగా అనేది ఉండదు. ఒంటిరిగా ఉన్న సమయాల్లో ఇలాంటివి మననం చేసుకొంటే ఆ శ్రీమన్నారాయణుడి తోడు ఉండనే ఉంటుంది గదా!