పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నారాయణీయము : 98వ దశకము - బ్రహ్మవలన జగదుత్పత్యాదివర్ణనము

||శ్రీమన్నారాయణీయము||
ద్వాదశ స్కంధము
98- వ దశకము - బ్రహ్మవలన జగదుత్పత్యాదివర్ణనము

98-1
యస్మిన్నేతద్విభాతం యత ఇదమభవద్యేన చేదం య ఏతద్
యోస్మాదుత్తీర్ణరూపః ఖలు సకలమిదం భాసితం యస్య భాసా।
యో వాచాం దూరదూరే పునరపి మనసాం యస్యదేవా మునీంద్రాః
నో విద్యుస్తత్వరూపం కిము పునరపరే కృష్ణ।తస్మై నమస్తే॥
1వ భావము:-
భగవాన్! ఎవని వలన సమస్త జగత్తు ఈరూపమున ఈ విధముగా వ్యక్తమగుచున్నదో, ఆ ఎవని వలన సకలసృష్టి ఆవిర్భమగుచున్నదో, ఎవని ప్రకాశము వలన అది ప్రకాశించుచున్నదో, తిరిగి ఈ సమస్తము ఆ ఎవనిలో లీనమగుచున్నదో, మనస్సుకు వాక్కుకు అందనంత దూరముగా ప్రకాశించుచున్న ఆ తత్వరూపమే, కృష్ణా! నీరూపము. సామాన్యులకు కించిత్తుకూడా తెలియనిది, మునీంద్రులు మరియు దేవతలకు సహితము ఇది అని ఇదమిత్థముగా అవగతముకానిది అయిన నీ ఈ రూపమునకు ప్రభూ! నమస్కారము.

98-2
జన్మాథో కర్మ నామ స్ఫుటమిహ గుణదోషాదికం వా న యస్మిన్
లోకానామూతయే యః స్వయమనుభజతే తాని మాయానుసారీ।
బిభ్రచ్ఛక్తీరరూపో౾పి చ బహుతరూపో౾వభాత్యద్భుతాత్మా
తస్మై కైవల్యధామ్నే పరరసపరిపూర్ణాయ విష్ణో। నమస్తే॥
2వ భావము:-
భగవాన్! కృష్ణా! జన్మము, కర్మము, నామము, గుణదోషములు మొదలగు వాటికి నీవు అతీతుడివే అయినను లోకరక్షణార్ధము మాయను అనుసరించి వాటిని నీవు ఆశ్రయించుచుంటివి. నిరాకారుడివే అయినను అనేకరూపములలో అనేకశక్తులుతో ప్రకాశించు అద్భుతరూపుడవు నీవు. మోక్షమే నీ స్థానము. పరిపూర్ణ పరమానందమే నీ స్వరూపము. అట్టి విష్ణుమూర్తీ! నీకు నమస్కారము.

98-3
నో తిర్యంచం న మర్త్యం న చ సురమసురం న స్త్రియం నో పుమాంసం
న ద్రవ్యం కర్మజాతిం గుణమపి సదసద్వాపి తే రూపమాహుః।
శిష్టం యత్స్యాన్నిషేధే సతి నిగమశతైర్లక్షణావృత్తితస్తత్
కృచ్ఛ్రేణావేద్యమానం పరమసుఖమయం భాతితస్మై నమస్తే॥
3వ భావము:-
పరమాత్మా! నీరూపము ‘పక్షి, జంతువు, మనిషి, దేవతలు, దానవులు, ఆడ - మగ రూపము, ద్రవ్యము, కర్మము, జాతి, గుణము, సత్ - అసత్ మొదలగువాని దేనికిని చెందినదికాదు’ అని జ్ఞానులు చెప్పుచున్నారు. నీరూపము 'ఇదికాదు, ఇదికాదు' అని నిషేదించి నిషేదించగా మిగిలినది ఏమిటి? అనునది వందలు వేలులలోగల వేదములు సహితము చెప్పలేక అవి సహితము లక్షణావృత్తిలో మాత్రమే చెప్పుచున్నవి. మిక్కిలిశ్రమతో మాత్రమే అది గ్రాహ్యమగుచున్నది. అట్టి జ్ఞానానందమయ రూపుడవగు కృష్ణా! నీకు నమస్కారము.

98-4
మాయాయాం బింబితస్త్వం సృజసి మహదహంకారతన్మాత్రభేదైః
భూతగ్రామేంద్రియాద్యైరపి సకలజగత్స్వప్నసంకల్పకల్పమ్।
భూయస్సంహృత్య సర్వం కమఠ ఇవ పదాన్యాత్మనా కాలశక్త్యా
గంభీరే జాయమానే తమసి వితిమిరో భాసి తస్మై నమస్తే॥
4వ భావము:-
భగవాన్! నీవు మాయయందు ప్రతిబింబించుచు ‘మహత్, అహంకారము, పంచతన్మాత్రలు, పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, వేయేల సకలజగత్తును, సకలమును’, స్వప్నమందు మనోసంకల్పముతో సృష్టించు రీతిలో నీవు సృష్టించుచుంటివి. తాబేలు తనకాళ్ళను తనలోనికే ముడుచుకొనినట్లు, కాలాంతమున ఈ సమస్తమును నీవు నీయందే ఉపసంహరించుకొనినప్పుడు, కాలశక్తిచే ఎల్లెడలా గాడాంధకారము దట్టముగా ఆవరించగా, పరమాత్మా! కృష్ణా! ఆ అంధకారములో నీవు మాత్రమే ప్రకాశించుచు వసించెదవు. అట్టి నీకు నమస్కారము!

98-5
శబ్దబ్రహ్మేతి కర్మేత్యణురితి భగవన్।కాల ఇత్యాలపంతి
త్వామేకం విశ్వహేతుం సకలమయతయా సర్వథా కల్ప్యమానమ్।
వేదాంతైర్యత్తు గీతం పురుషపరచిదాత్మాభిధం తత్తు తత్త్వం
ప్రేక్షామాత్రేణ మూలప్రకృతివికృతికృత్ కృష్ణ। తస్మై నమస్తే॥
5వ భావము:-
భగవాన్! విశ్వమునకు ఆధారమయినది, సర్వమూ తానే అయినది, తానే సర్వమూ అయి కనిపించునది అయిన ఏకైక తత్వమే నీవు. అట్టి నీ తత్వము శబ్ధబ్రహ్మమనియు, కర్మమనియు, అణువనియు, కాలరూపమనియూ వివిధరకములుగా చెప్పబడుచున్నది. ఉపనిషత్తులు 'పరమపురుష' అనియు, 'చిదానందరూప' అనియు కీర్తించుచున్నట్టి నీ తత్వరూపమునకు నమస్కారము. కేవలము ఈషణ్మాత్రముననే మూలప్రకృతినుండి అనేకనేక రూపములతో ఈ జగత్తును సృష్టించిన ఓ! పరమాత్మా! కృష్ణా! నీకు నమస్కారము.

98-6
సత్త్వేనాసత్తయా వా న చ ఖలు సదసత్త్వేన నిర్వాచ్యరూపా
ధత్తే యాసావవిద్యా గుణఫణిమతివద్విశ్వదృశ్యావభాసమ్।
విద్యాత్వం సైవ యాతా శ్రుతివచనలవైర్యత్కృపాస్యందలాభే
సంసారణ్యసద్యస్త్రుటనపరశుతామేతి తస్మై నమస్తే॥
6వ భావము:-
భగవాన్! సత్యమైనది, అసత్యమైనది, సత్యాసత్యమైనది ఇది అని స్పష్టముగా నిర్వచింపలేనట్టి అవిద్య త్రాడును సర్పమని భ్రమింపజేసినట్లుగా, అవిద్యయే కనిపించు జగత్తుయే పరతత్వమను భ్రమను కలిగించుచున్నది. నీ కృపారసము ప్రసరింపగనే ఆ అవిద్య వేదవచనములచే విద్యయై, సంసారమను అరణ్యమును ఛేదించు గండ్రగొడ్డలివలె పరతత్వజ్ఞానమునకు ఉపకరించును. అట్టి అవిద్యను తొలగించు కృపాసాగరా! పరతత్వరూపా! కృష్ణా! నీకు నమస్కారము.

98-7
భూషాసు స్వర్ణవద్వా జగతి ఘటశరావాదికే మృత్తికావ-
త్తత్త్వే సంచింత్యమానే స్ఫురతి తదధునాప్యద్వితీయం వపుస్తే।
స్వప్నద్రష్టుః ప్రబోధే తిమిరలయవిధౌ జీర్ణరజ్జోశ్చ యద్వత్
విద్యాలాభే తథైవ స్ఫుటమపి వికసేత్ కృష్ణ।తస్మై నమస్తే॥
7వ భావము:-
భగవాన్! ‘స్వర్ణాభరణములలోని మూలపదార్ధమగు బంగారమువలెను’, ‘మట్టితో చేయబడు మూకుడు, కుండలలోని మూలపదార్ధమగు మృత్తికవలెను’ జగత్తువిషయమున కూడా నీ ఏకైక తత్వమే స్పురించును. నిదురలోను, సుషుప్తావస్థలోను ఉన్నవానికి మెలుకువరాగానే వాస్తవస్థితి తెలిసినట్లు, అంధకారముతొలగి వాస్తవస్థితి తెలియగానే తాడు తనసహజరూపముతో (పాముకాదని ) కనిపించు విధముగా, అజ్ఞానము తొలగగానే నీ రూపము స్పష్టముగా ప్రకాశించును. అట్టి ప్రభూ! కృష్ణా! నీకు నమస్కారము.

98-8
యద్భీత్యోదేతి సూర్యో దహతి చ దహనో వాతి వాయుస్తథా౾న్యే
యద్భీతాః పద్మజాద్యాః పునరుచితబలీనాహరంతే౾ను కాలమ్।
యేనైవారోపితాః ప్రాజ్నిజపదమపి తే చ్యావితారశ్చ పశ్చాత్
తస్మై విశ్వం నియంత్రే వయమపి భవతే కృష్ణ।కుర్మః ప్రణామమ్॥
8వ భావము:-
భగవాన్! ఎవని భయమువలన సూర్యుడు గతితప్పక ఉదయించుచున్నాడో, అగ్ని మండుచున్నదో, వాయువు వీచుచున్నదో, బ్రహ్మాదిదేవతలు నివేదనలు సమర్పించుచున్నారో, ఎవని కృపతో వారు ఉన్నత స్థానమున నియమించబడి తొలగించబడుచున్నారో, ఈ సకల విశ్వమును ఎవరు నియంత్రించుచున్నారో అట్టి పరమాత్మా! కృష్ణా! నీకు నమస్కారము.

98-9
త్రైలోక్యం భావయంతం త్రిగుణమయమిదం త్ర్యక్షర స్యైకవాచ్యం
త్రిశానామైక్యరూపం త్రిభిరసి నిగమైర్గీయమానస్వరూపమ్।
తిస్రో౾వస్థా విదంతం త్రియుగజనిజుషం త్రిక్రమాక్రాంత విశ్వం
త్రైకాల్యే భేదహీనం త్రిభిరహమనిశం యోగభేదైర్భజే త్వామ్॥
9వ భావము:-
భగవాన్! త్రిగుణమయమగు త్రిలోకములనుసృష్టించిన తత్వమును, మూడు అక్షరములు కలిసిన 'ఓం' అను ఒకే అక్షరముగా ప్రణవ నాదము సూచించుచున్న తత్వరూపమును; త్రిమూర్తులు కలిసియున్న ఏకైకరూపముగా ప్రకాశించు రూపమును; మూడువేదములచేత కీర్తించబడిన రూపమును; స్వప్నావస్థ, జాగృదావస్థ, మరియు సుషుప్తావస్థ అను అవస్థాత్రయము మూడింటిలో చైతన్యమై ఉండురూపమును; త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అను మూడుయుగములలోను అవతరించినరూపమును; మూడు అడుగులతో విశ్వమును ఆక్రమించినరూపమును; భూతకాలము, వర్తమానకాలము, భవిష్యత్కాలములలో త్రికాలజ్ఞానము కలిగియున్న నీ రూపమును భక్తి, జ్ఞాన, కర్మ యోగములతో ఆరాధింతును.

98-10
సత్యం శుద్ధం విబుద్ధం జయతి తవ వపుర్నిత్యముక్తం నిరీహం
నిర్ద్వంద్వం నిరీకారం నిఖిలగుణగణ వ్యంజనాధార భూతమ్।
నిర్మూలం నిర్మలం త న్నిరవధి మహిమోల్లాసి నిర్లీన మంత
ర్నిస్సంగానాం మునీనాం నిరుపమ పరమానంద సాంద్రప్రకాశమ్॥
10వ భావము:-
భగవాన్! కృష్ణా! నిరుపమ పరమానందరూపమే నీవు. సత్యము, శుద్ధము, జ్ఞానములతో ప్రకాశించు నీ రూపము బంధములేనిది; కోరికలేనిది; ద్వంద్వములేనిది; సకలగుణములకు ఆధారమయినది; మూలములేనిది; నిర్మలమయినది; నిస్సంగులైన మునీశ్వరుల అంతః కరణయందు నిలిచియుండు నీ రూపము నిరుపమానమయినది. పరమానందకరమయినది.

98-11
దుర్వారం ద్వాదశారం త్రిశతపరిమిళత్ షష్టిపర్వాభివీతం
సంభ్రామ్యత్ క్రూరవేగం క్షణమను జగదాచ్ఛిద్య సంధావమానమ్।
చక్రం తే కాలరూపం వ్యథయతు న తు మాం త్వత్పదైకావలంబం
విష్ణో। కారుణ్యసింధో। పవనపురపతే। పాహి సర్వామయౌఘాత్॥
11వ భావము:-
భగవాన్! వారింపశక్యముగానిది; పన్నెండు మాసములు అను పన్నెండు అరలు కలిగినది; మూడువందల అరువది దినములు అను కణుపులతో ప్రతిక్షణము అత్యంత వేగముతో జగత్తును నశింపజేయుచు కాలరూపములో తిరుగుచున్న నీ చక్రము నీ పాదములను శరణుకోరిన నన్ను బాధించకుండ ఉండుగాక! విష్ణుమూర్తీ! కారుణ్యసింధో! గురవాయూరు పురాధీశా! నా రోగమునుండి రక్షింపుము, నన్ను కాపాడుము.

ద్వాదశ స్కంధము
98వ దశకము సమాప్తము
-x-