పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నారాయణీయము : 93వ దశకము - ఇరువదినాలుగుమందిగురువులు

||శ్రీమన్నారాయణీయము||
ఏకాదశ స్కంధము
93- వ దశకము - ఇరువదినాలుగుమందిగురువులు

93-1
బంధుస్నేహం విజహ్యాం తవ హి కరుణయా త్వయ్యుపావేశితాత్మా
సర్వం త్యక్త్వా చరేయం సకలమపి జగద్వీక్ష్య మాయావిలాసమ్।
నానాత్వాత్ భ్రాంతిజన్యాత్ సతి ఖలు గుణదోషావబోధే విధిర్వా
వ్యాసేధో వా కథం తౌ త్వయి నిహితమతేర్వీతవైషమ్యబుద్ధేః॥
1వ భావము:-
భగవాన్! కృష్ణా! నా చిత్తమున నీరూపమును నిలుపుకొని నీ కరుణతో స్వజనులను, బంధువులను విడిచి బంధవిముక్తుడనగుదును. సకలజగత్తూ నీ మాయావిలాసమే అన్న ఎరుకతో ఉందును; భ్రాంతివలన పలువిధముల భావనలు కలుగును. దానితో గుణదోష విచక్షణ మరియు కర్తవ్యము యెడ విచారణ కలుగును. నా సర్వస్వము నీకే అర్పించి భ్రాంతి రహితుడనగుదును; స్థిరముగా నీయందే చిత్తమును నిలిపి, విరోధబుద్ధిని వీడెదను, గుణదోషములకు అతీతుడనగుదును; ప్రభూ! ఆత్మానుభూతిని పొందిన స్థితప్రజ్ఞునికి విధినిషేదములు వర్తించవుకదా!

93-2
క్షుత్తృష్ణాలోపమాత్రే సతతకృతధియో జంతవస్సంత్యనంతాః
తేభ్యో విజ్ఞానవత్త్వాత్ పురుష ఇహ వరసజ్జనిర్దుర్లభైవ।
తత్రాప్యాత్మాత్మనః స్యాత్ సుహృదపి చ రిపుర్య స్త్వయి న్యస్తచేతాః
తాపోచ్ఛిత్తేరుపాయం స్మరతి స హి సుహృత్ స్వాత్మవైరీ తతో౾న్యః॥
2వ భావము:-
భగవాన్! కృష్ణా! ఈ లోకమున ఆకలిదప్పికలు తీర్చుకొనుటలో నిమగ్నమై జీవించు జీవులు అనేకములు. జీవులలో జ్ఞానతృష్ణగల జన్మ ‘మానవజన్మ’. అది సకల జన్మలలోను ఉత్కృష్టమయినది. అట్టి జన్మ దొరకుటయే దుర్లభము. తన బుద్ధిని నీయందు నిలిపి సంసారతాపమును అధిగమించు వానికి, వాని ఆత్మయే వానికి మిత్రుడు. అట్లుకానివానికి అతని ఆత్మయే అతనికి శత్రువగును; అట్టి జీవులు వారివారి కర్మఫలములను అనుభవించుచు మరలమరల అనేక జన్మలనెత్తుచుందురు.

93-3
త్వత్కారుణ్యే ప్రవృత్తే క ఇవ న హి గురుర్లోకవృత్తే౾పి భూమన్।
సర్వాక్రాంతాపి భూమిర్న హి చలతి తతః సత్ క్షమాం శిక్షయేయమ్ ।
గృహ్ణీయామీశ। తత్తద్విషయపరిచయే౾ప్యప్రసక్తిం సమీరాత్
వ్యాప్తత్వం చాత్మనో మే గగనగురువశాద్భాతు నిర్లేపతా చ॥
3వ భావము:-
. భగవాన్! కృష్ణా! నీ దయకు పాత్రులయినవానికి ఈ లోకమునందలి సమస్తమూ గురువులే అగును. జగధీశ్వరా! భూమిని ఆక్రమించి జీవులు పలువిధములుగా బాధించినను ఆ భూమి చలించదు. ‘భూమిని’ గురువుగా చూచి ‘క్షమాగుణమును నేర్చుకొందును’. వాయువు వీచునప్పుడు వివిధ విషయ ధర్మములగు శీతము, ఉష్ణము, సువాసన, దుర్వాసన అనునవి ఆ వాయువుతో వచ్చును; అయుననూ వాయువునకు అవి అంటవు. గురువుగా గ్రహించి ‘వాయువు’ వలన ‘విషయముల యెడ నిస్సంగత్వమును నేర్చుకొందును’. సకలమున వ్యాపించియున్నను ఏ దోషములు అంటని ‘ఆకాశమును' గురువుగా స్వీకరించి ‘నిర్లిప్తతను, సర్వవ్యాపకత్మముగల ఆత్మకు ఉపాధి దోషములు అంటవు అని తెలుసుకొందును’.
గురువులు - నేర్చుకున్న జావితాః-
(1) ‘భూమి’ - 'క్షమాగుణమును నేర్చుకొందును’.
(2) ‘వాయువు’ - ’విషయముల యెడ నిరాసక్తతను నేర్చుకొందును’.
(3) ‘ఆకాశము' - ’నిర్లిప్తతను, సర్వవ్యాపకత్మముగల ఆత్మకు ఉపాధి దోషములు అంటవు అని తెలుసుకొందును’.
(4) 'జలము' - ’ఆత్మానుభూతిని పొందుటకు స్వచ్ఛము నిష్కల్మషము అయున అంతఃకరణను కలిగియుండవలె నని తెలుసుకొందును’.
(5) 'అగ్ని' - ’ఉపాధి దోషము దేహమునకేగాని ఆత్మకు అంటదని తెలుసుకొందును ’.
(6) ‘చంద్రకళలు’ - ’వృద్ధిక్షయములు శరీరమునకేగాని ఆత్మకు కాదని గ్రహించెదను’.
(7) 'సూర్యుడు' - ’సకల భూతములలో ప్రకాశించునది ఒకే పరమాత్మ అని తెలుసుకొందును’.
(8) ‘కపోతము’ - ‘మమకారపాశమున పడకూడదని తెలుసుకొందును’.
(9) ‘కొండచిలువ’ - ’ఓర్పును నేర్చుకొందును.’ .
(10) ‘సముద్రమును’ - ’నిశ్చలముగను, గంభీరముగాను ఉండవలనని గ్రహించెదను’.
(11) ‘మిడత’ - ’స్త్రీ ఆకర్షణ అను అగ్నికి దూరముగానుండవలెనని గ్రహింతును’.
(12) ‘భ్రమరము’ - ’ఆశకుపోయి సిరులు కూడబెట్టుటకు నేను పాల్పడకుండ ఉందును’.
(13) ‘మగ ఏనుగు’ - ’స్త్రీవ్యామోహమునకు వశమగక ఉందును’.
(14) ‘తేనెటీగ’ - ‘సిరిసంపదలు ఆర్జన యందు ఆసక్తి లేక ఉందును’.
(15) ‘జింక’ - ‘ఇంద్రియ మోహమునకు వశము కాక ఉందును’ .
(16) ‘చేప’ - ‘జిహ్వ చాపల్యము కలగకుండ ఉందును’ .
(17) వేశ్య’ - ‘ఆశలను త్యజించుట వలన నిశ్చింతగా నిద్రించెదను’.
(18) ‘లకుముకి పిట్ట’ - ‘వస్తువులపై మమకారమును వదులుకొని దుఃఖమునకు దూరమగుదును’.
(19) ‘శిశువు’ - ‘మానాభిమానముల ఎరుక లేక ఉందును’ .
(20) ‘కన్య’ - ‘సద్దులేక ఒంటరిగా సంచరింతును’.
(21) ‘కమ్మరి’ - ‘భగవంతునిపై ఏకాగ్రచిత్తముతో ఉందును’.
(22) ‘ఎలుకలు’ - ‘మమకార భావనను వదలి వసించెదను’.
(23) ‘సాలీడు’ - ‘నీవు సృష్టించిన జగత్తు నీలోనే లయమగునని గ్రహింతునుట’.
(24) 'కీటము' - ‘నిన్ను ధ్యానించి ధ్యానించి నీలో ఐక్యమై నీ సాయుజ్యమును పొందెదను’

93-4
స్వచ్ఛస్య్సాం పావనో౾హం మధుర ఉదకవత్ వహ్నివన్మా స్మ గృహ్ణాం
సర్వాన్నీనో౾పి దోషం తరుషు తమివ మాం సర్వభూతేష్వవేయామ్।
పుష్టిర్నష్టిః కలానాం శశిన ఇవ తనోర్నాత్మనో౾స్తీతి విద్యాం
తోయాదివ్యస్త మార్తాండవదపి చ తనుష్వేకతాం త్వత్ప్రసాదాత్॥
4వ భావము:-
భగవాన్! కృష్ణా! స్వచ్ఛము, నిర్మలము, మధురము అయిన 'జలము' నుండి నేను ‘ఆత్మానుభూతిని పొందుటకు స్వచ్ఛము నిష్కల్మషము అయున అంతఃకరణను కలిగియుండవలె నని తెలుసుకొందును’. సకలమును భక్షించు 'అగ్ని'కి - భక్ష్యదోషము అంటనట్లు, ‘ఉపాధి దోషము దేహమునకేగాని ఆత్మకు అంటదని తెలుసుకొందును’. ‘చంద్రకళలు’ చూచి చంద్రుని వృద్ధిక్షయములు చంద్రుని కళలేగాని అవి చంద్రమండలమునకు కాదను నట్లుగా, 'వృద్ధిక్షయములు శరీరమునకేగాని ఆత్మకు కాదని గ్రహించెదను’. 'సూర్యుడు' ఒకడే అయిననూ సకల జలములలో భిన్న ప్రతిబింబములుగా కనిపించునట్లు, ‘సకల భూతములలో ప్రకాశించునది ఒకే పరమాత్మ’ అని, ప్రభూ! నీ అనుగ్రహమువలన తెలుసుకొందును.

93-5
స్నేహాద్వ్యాధాత్తపుత్రప్రణయమృతకపోతాయితో మా స్మ భూవం
ప్రాప్తం ప్రాశ్నన్ సహేయ క్షుధమపి శయువత్ సింధువత్ స్యామగాధః।
మా సప్తం యోషిదాదౌ శిఖిని శలభవద్భృంగవత్ సారభాగీ
భూయాసం కిం తు తద్వద్ధనచయన వశాన్మాహమీశ। ప్రణేశమ్॥
5వ భావము:-
భగవాన్! కృష్ణా! వేటగాడి వలలోచిక్కిన సంతానమును చూచి మమకారముతో తానూ ఆ కపోతితో పాటు మరణించన ‘కపోతమును’ చూచి, ‘మమకారపాశమున పడకూడదని తెలుసుకొనెదను’. దొరికినప్పుడు తినుచు లేనప్పుడు పస్తులుండు ‘కొండచిలువని’ చూచి ‘ఓర్పును నేర్చుకొందును. ‘సముద్రమును’ చూచి ‘నిశ్చలముగను, గంభీరముగాను ఉండవలనని గ్రహించెదను’. మంటకు ఆకర్షింపబడి ఆ అగ్నిలోపడి మరణించు ‘మిడతను’ చూచి, ‘స్త్రీ ఆకర్షణ అను అగ్నికి దూరముగానుండవలెనని గ్రహింతును. ‘భ్రమరము’ పుష్పములనుండి గ్రహించిన మకరందము పరులపాలగుట చూసి, ‘ఆశకుపోయి సిరులు కూడబెట్టుటకు నేను పాల్పడకుండెదను గాక!’

93-6
మా బద్ధ్యాసం తరుణ్యా గజ ఇవ వశయా నార్జయేమం దనౌఘం
హర్తా న్యస్తం హి మాధ్వీహర ఇవ మృగవన్మా ముహం గ్రామ్యగీతైః।
నాత్యాసజ్జేయ భోజ్యే ఝష ఇవ బడిశే పింగళావన్నిరాశః
సుప్యాం భర్తవ్యయోగాత్ కురర ఇవ విభో సామిషో౾న్యైర్నహన్యై॥
6వ భావము:-
భగవాన్! కృష్ణా! ‘మగ ఏనుగు’ ఆడ ఏనుగుకు వశమై, ఆ బంధమున చిక్కి అనాయాసముగా మావటివానిచే బంధించబడిన విధముగా నేను ‘స్త్రీవ్యామోహమునకు వశమగకుండు గాక!’ ‘తేనెటీగ’ కూడబెట్టిన తేనె పరుల పాలయినట్లు అధికముగా ఆర్జించిన సంపద ఇతరుల పాలగును. నాకు ‘సిరిసంపదలు ఆర్జన యందు ఆసక్తి లేకుండుగాక!’ మధుర స్వర ఆలాపనకు ఆకర్షితమై ‘జింక’ వేటగానికి చిక్కినట్లు నేను ‘ఇంద్రియ మోహమునకు వశము కాకుండుగాక!’ ఎరకు ఆశపడి గాలమునకు చిక్కిన ‘చేప’ వలె - నాకు ‘జిహ్వ చాపల్యము కలగకుండుగాక!’ ధనార్జనపై అత్యాశతో నిద్రలేక ఆ ద్రవ్యార్జన ఆశను వీడిన పిదపనే సుఖముగా నిద్రించిన పింగళ అను ‘వేశ్య’ వలె, నేను ‘ఆశలను త్యజించుట వలన నిశ్చింతగా నిద్రించెదను’. ‘కురరము’ (లకుముకి పిట్ట) మాంసఖండముపైగల మక్కువతో దానిని విడువక, తననువెంబడించిన ఇతర కరురములనుండి ప్రాణహాని తెచ్చుకొనినట్లుకాక, నేను ‘వస్తువులపై మమకారమును వదులుకొని దుఃఖమునకు దూరమగుదును’.

93-7
వర్తేయ త్యక్తమానః సుఖమతిశిశువన్నిస్సహాయశ్చరేయం
కన్యాయా ఏకశేషో వలయ ఇవ విభో। వర్జితాన్యోన్యఘోషః।
త్వచ్ఛిత్తో నావబుధ్యై పరమిషుకృదివ క్ష్మాభృదాయానఘోషం
గేహేష్వన్యప్రణీతేష్వహిరివ నివసాన్యుందురోర్మందిరేషు॥
7వ భావము:-
భగవాన్! కృష్ణా! ‘శిశువు’ మానాభిమానముల ఎరుక లేక చిద్విలాసముగా ఉండును; అట్లే నేనును ‘మానాభిమానముల ఎరుక లేక’ ఉందును. సద్దులేక ఉండుటకు ‘కన్య’ తన ముంజేతికి ఒకటే కంకణము ధరించినట్లు నేనును ‘సద్దులేక ఒంటరిగా సంచరింతును’. ఏకాగ్రతతో బాణము చేయు ‘కమ్మరి’ - ఇతరులుచేయు ఘోషనాది సందడులయందు ధ్యాసలేక మహారాజు వచ్చుచుండినను గమనించని రీతిలో ప్రభూ! ‘నీపై ఏకాగ్రచిత్తముతో ఉందును’. ‘ఎలుకలు’ చేసిన కన్నములలో సర్పములు నివసించినట్లు ‘మమకార భావనను వదలి వసించెదను.’

93-8
త్వయ్యేవ త్వత్కృతం త్వం క్షమయసి జగదిత్యూర్ణనాభాత్ ప్రతీయాం
త్వచ్చింతా త్వత్స్వరూపం కురుత ఇతి దృఢం శిక్షయే పేశకారాత్।
విడ్భస్మాత్మా చ దేహో భవతి గురువరో యో వివేకం విరక్తిం
ధత్తే సంచింత్యమానో మమ తు బహురుజాపీడితో౾యం విశేషాత్॥
8వ భావము:-
భగవాన్! కృష్ణా! తననోటినుండి తాను వదలిన నూలును – ‘సాలీడు’ తానే గ్రహించుట చూచి, ‘నీవు సృష్టించిన జగత్తు నీలోనే లయమగునని గ్రహింతునుట’. తన గుడ్డునించి బయల్పడిన 'కీటము' చుట్టూ భ్రమరము, బ్రమరించగా బ్రమరించగా ఆ కీటము తానూ భ్రమరమే అని తలచితలచి భ్రమరము అయునట్లు, ప్రభూ! నేనును ‘నిన్ను ధ్యానించి ధ్యానించి నీలో ఐక్యమై నీ సాయుజ్యమును పొందెదను’. ఆలోచించిచూడగా - రోగములచే పీడించబడి చివరకు ధూళి, ధూసరము అగు నా ఈ దేహమే నాకు గురువు అని తోచుచున్నది. ఏలయనగా ఈ ‘దేహము’ వలననే నాకు ‘భక్తిజ్ఞాన వైరాగ్యములు కలుగుచున్నవి’

93-9
హీ హీ మే దేహ మోహం త్యజ పవనపురాధీశ యత్ ప్రేమహేతోః
గేహే విత్తే కళత్రాదిషు చ వివశితాస్త్వత్పదం విస్మరంతి।
సో౾యం వహ్నేశ్శునో వా పరమిహ పరతస్సాంపత్రం చాక్షికర్ణ-
త్వగ్జిహ్వాద్యా వికర్షంత్యవశమత ఇతః కో౾పి న త్వత్పదాబ్జే॥
9వ భావము:-
గురవాయూరు పురాధీశా! దేహముపైగల మమకారముతో మనుషులు గృహము, భార్య, సంపద అనువానిపట్ల ఆసక్తి పెరిగి వాటిపట్ల వివశులై నీ పాదపద్మములకు దూరమగుచుందురు. కళ్ళు, చెవులు, ముక్కు, మొదలగు ఇంద్రియములు మానవుని మనసును ఇంద్రియ సుఖములవైపునకే లాగుచుండును; నీ దరి చేరనీయవు. ప్రభూ! కృష్ణా! అగ్నికో లేదా జంతువునకో ఆహారము కాగల నా ఈ దేహముపై నాకు మోహమును పోగొట్టుము. నీ పాదపద్మములకు దూరము కానీయకుము.

93-10
దుర్వారో దేహమోహో యది పునరధునా తర్హి నిశ్శేషరోగాన్
హృత్వా భక్తిం ద్రఢిష్ఠాం కురు తవ పద పంకేరుహే పంకజాక్ష।
నూనం నానాభవాంతే సమధిగతమిమం ముక్తిదం విప్రదేహం
క్షుద్రే హ హంత మా మా క్షిప విషయరసే పాహిమాం మారుతేశ॥
10వ భావము:-
భగవాన్! కృష్ణా! ఈదేహముపై మోహమును త్యజించు భాగ్యము నాకొసగుట కుదరదనిచో నా సకల రోగములను హరించి నీ పాదపద్మములయెడ నాకు ధృఢభక్తిని ప్రసాదించుము. పెక్కుజన్మల పిదప లభించిన నా ఈ విప్రుని జన్మను, క్షుద్రమగు విషయములపట్ల ఆసక్తికి గురిచేయ వలదు. గురవాయూరూ పురవాసా! నిన్ను ప్రార్ధించుచున్నాను; నన్ను రక్షించుము.

ఏకాదశ స్కంధము
93వ దశకము సమాప్తము
-x-