పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నారాయణీయము : 69వ దశకము - రాసకేళి

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము
69 వ దశకము - రాసకేళి

69-1
కేశపాశధృత పింఛికావితతి సంచలన్మకరకుండలం
హారజాలవనమాలికాలలితమంగరాగఘనసౌరభవమ్।
పీతచేలదృతకాంచికాంచితముదంచదంశుమణినూపురం
రాసకేళిపరిభూషితం తవ హి రూపమీశ। కలయామహే॥
1వ భావము :-
భగవాన్! సుందర కేశాలంకరణతో - ఆ కేశములపై కదలాడు నెమలి పింఛముతో - చెవుల మకర కుండలములతో - కంఠమున వనమాల హారములతో - సుగంధ పరిమళద్రవ్యములు వెదజల్లు శరీరముతో- ప్రకాశించుచున్న చిరుగజ్జల మొలనూలుతో - మణులుపొదిగిన కాలియందయల కాంతులు తళుక్కుమనుచుండగా, ప్రభూ! పీతాంబరధారివై - ఆ గోపస్త్రీలతో విహరించుచుండిన (అపురూపము, అద్వితీయము అయినట్టి) నీ రూపమును ధ్యానింతుము.

69-2
తావదేవ కృతమండనే కలితకంచుళీకకుచమండలే
గండలోలమణికుండలే యువతిమండలే౾థ పరిమండలే।
అంతరా సకలసుందరీయుగళమిందిరారమణ। సంచరన్
మంజులాం తదను రాసకేళిమయి కంజనాభ। సముపాదధాః॥
2వ భావము :-
భగవాన్! ఆ గోపస్త్రీలు అందమయిన రవికలు, వస్త్రములు, చెవులకు మణికుండలములు ధరించియుండిరి. సౌందర్యవతులైన ఆ స్త్రీలు నీవద్దకుచేరి - నీ చుట్టును వృత్తాకారముగా నిలచిరి. ప్రభూ! లక్మీరమణా! పద్మనాభా! నీవు ప్రతి ఇద్దరు రమణులమధ్య ఒకడుగా నిలచి, అప్పుడు – ప్రతి గోపికకూ జంటగా నీవే ఉంటూ, వారితో రాసక్రీడ నృత్యము చేసితివి. ఆహా! ఎంతటి కమనీయ దృశ్యమది!

69-3
వాసుదేవ! తవ భాసమానమిహ రాసకేళిరససౌరభం
దూరతో౾పి ఖలు నారదాగదితమాకలయ్య కుతుకాకులా।
వేషభూషణవిలాసపేశలవిలాసినీశతసమావృతా
నాకతో యుగపదాగతా వియతి వేగతో౾థ సురమండలీ॥
3వ భావము :-
భగవాన్! నీవట్లు రాసక్రీడ నృత్యము చేయుచుండగా చూచి - ఆ ఆనందరస సౌరభమును ఆస్వాదించిన - నారదమహర్షి, దేవలోకమునకు వెళ్ళి - దేవతలకు నీ రాసక్రీడను వివరించిచెప్పెను. అదివినిన దేవతలు నీ రాసక్రీడను చూడవలెనని వేగిరమే బయలుదేరిరి. ప్రకాశించుచున్న వస్త్రములు , నగలు ధరించిన ఎందరో దేవతా స్త్రీలు - (యమునానదీ) ఆకాశ వీధులలో గుమిగూడి ప్రభూ! నీ రాసక్రీడను తిలకించి, పులకాంకితులయిరి.

69-4
వేణునాదకృతతానకలగానరాగగతియోజనా
లోభనీయమృదుపాదపాతకృతతాళమేళనమనోహరమ్।
పాణిసంక్వణితకంకణం చ ముహురంసలంబితకరాంబుజం
శ్రోణిబింబచలదంబరం భజత రాసకేళిరసడంబరమ్॥
4వ భావము :-
భగవాన్! మధురమయిన నీ వేణుగానమునకు అనుగుణముగా - గోపికలు రాగయుక్తముగా ఆలాపించుచుండిరి; లయబద్ధముగా వారు వేయుచున్న అడుగుల శబ్దము మనోహరముగా నున్నది. ఆ గోపికలు హర్షముతో చేయుచున్న కరతాళధ్వనులు వారి కరకంకణములతో కలిసి మృదు మధురముగా వినిపించుచుండెను. ఆ గోపవనితలు ఒకరి హస్తముతో ఇంకొకరి హస్తమును పట్టుకొని నృత్యము చేయుచుండగా -వారి వస్త్రముల కదలిక హృద్యముగానున్నది. అట్టి రాసక్రీడను మేము ధ్యానింతుము.

69-5
శ్రద్ధయా విరచితానుగానకృతతారతారమధురస్వరే
నర్తనే౾థ లలితాంగహారలులితాంగహారమణిభూషణే।
సమ్మదేన కృతపుష్పవర్షమలమున్మిషద్దివిషదాం కులం
చిన్మయే త్వయి నిలీయమానమివ సమ్ముమోహ సవధూకులమ్॥
5వ భావము :-
భగవాన్! ఒకరి తరువాత ఇంకొకరు పాడుచూ - ఆసక్తికరముగా ఆ గోపస్త్రీలు చేయు నృత్యగానము తారాస్థాయుకి చేరినది. చేయుచున్న నృత్య భంగిమలకు ఆగోపవనితల అవయవములపైనున్న హారములు చెదిరిపోయినవి; మణిభూషణములు - కంఠహారములు కదిలిపోయినవి. మీ రాసలీలను చూచి - దేవతలు సమ్మోహితులయిరి; ఆనందముతో ప్రభూ! నీపై పుష్పవర్షము కురిపించిరి. తమ దేవలోకపు స్త్రీలతో కలిసి - చిదానందరూపముతో నీవుచేయుచున్న నృత్యములో లీనమయ్యి సోలిపోయిరి.

69-6
స్విన్నసన్నతనువల్లరీ తదను కా౾పి నామ పశుపాంగనా
కాంతమంసమవలంబతే స్మ తవ తాంతిభారముకులేక్షణా।
కాచిదాచలితకుంతలా నవపటీరసారఘనసౌరభం
వంచనేన తవ సంచుచుంబ భుజమంచితోరుపులకాంకురా॥
6వ భావము :-
భగవాన్! ఆ రాసక్రీడ ఆడునప్పుడు - ఒక గోపాంగన శ్రమభారమునకు అలిసి చెమటబిందువులు చిందుచుండగా నిన్ను ఆలంబనముచేసుకొని నీ భుజముపై వాలుచుండెను. వేరొకవనిత తన చెదిరిన ముంగురులను సవరంచుకొనుచూ నీ భుజముపై తనహస్తమును ఉంచుచుండెను. ఒక గోపాంగన నీ దేహమునుండి వెలువడుచున్న సుగంధపరిమళములకు మైమరచి, ప్రభూ! నిన్ను తటాలున చుంబించుండెను.

69-7
కా౾పి గండభువి సన్నిధాయ నిజగండమాకులితకుండలం
పుణ్యపూరనిధిరన్వవాప తవ పూగచర్వితరసామృతమ్।
ఇందిరావిహృతిమందిరం భువనసుందరం హి నటనాంతరే
త్వామవాప్య దధురంగనాః కిము న సమ్మదోన్మదదశాంతరమ్॥
7వ భావము :-
భగవాన్! ఇంకొక పుణ్యాత్మురాలగు గోపికాంగన - తన చెవి కుండలములు కదలాడుచుండగా - తనచెక్కిలిని నీ చెక్కిలికి చేర్చి - నీ నోటిలోని అమృతమయమయిన తాంబూలరసమును స్వీకరించుచు పులకించుచుండెను. ప్రభూ! భువనైకసుందరము - లక్ష్మీదేవికి నివాసము అయిన నీ వక్షస్తలమును - ఆ రాసక్రీడలో - ఆ గోపభామినులు వారి పుణ్యవశమున ఆశ్రయించి పరమానందమును పొందిరి.

69-8
గానమీశ।విరతం క్రమేణ కిల వాద్యమేళనముపారతం
బ్రహ్మసమ్మదరసాకులాస్సదసి కేవలం ననృతురంగనాః।
నావిదన్నపి చ నీవికాం కిమపి కుంతలీమపి చ కంచులీం
జ్యోతిషామపి కదంబకం దివి విలంబితం కిమపరం బ్రువే॥
8వ భావము :-
భగవాన్! క్రమక్రమముగా ఆ గోపికల గానము ఆగిపోయెను. వాద్యశబ్ధములు నిలిచిపోయెను. అయుననూ ఆ గోపకాంతలు బ్రహ్మానందపరవశముతో నృత్యమును చేయుచునేయుండిరి. వారా సమయములో- తమ కేశబంధములు విడివడుటగాని, తమ పైవస్త్రములు చెదురుచుండుటనుగాని గమనించరైరి. తారామండలములో గ్రహసంచారము కూడా స్తంభించినది అనగా ప్రభూ! నీ పరమాద్భుతమగు రాసక్రీడనుగురించి చెప్పవలసినది వేరేయేమున్నది?

69-9
మోదసీమ్ని భువనం విలాప్య విహృతిం సమాప్య చ తతో విభో।
కేళిసమ్మృదితనిర్మలాంగనవఘర్మలేశసుభగాత్మనామ్।
మన్మథాసహనచేతసాం పశుపయోషితాం సుకృతచోదితః
తావదాకలితమూర్తిరాదధిథ మారవీరపరమోత్సవాన్॥
9వ భావము :-
భగవాన్! పరమానందముగా నీ రాసక్రీడ ముగిసినది. సకలలోకములకు ఆనందము కలిగించితివి. ఆ గోపాంగనల సుకృతమేమో! - నీవు ఒక్కడివే అయినను - ప్రతిఒక్కరతోను నీవే ఉన్నభావనను కలుగజేసి వారిని ప్రేరేపించితివి. చమటలు చిందించితివి. ఆ గోపాంగనలకు రాసోత్సవమును అనుగ్రహించితివి.

69-10
కేళిభేదపరిలోలితాభిరతిలాలితాభిరబలాలిభిః
స్వైరమీశ నను సూరజాపయసి చారునామ విహృతిం వ్యధాః।
కాననే-పి చ విసారిశీతలకిశోరమారుతమనోహరే
సూనసౌరభమయే విలేసిథ విలాసినీశతవిమోహనమ్॥
10వ భావము :-
భగవాన్! ఎనలేని విలాసముతో, వేడుకతో - ఆ గోపికలను మురిపించితివి. వారితో కలిసి ఆ యమునానదీ జలములలో జలక్రీడలు జరిపితివి. ఆ యమునానదీతీరమున చల్లని పిల్లగాలులు - పువ్వులు వెదజల్లు పరిమళముతో వీచుచుండగా - ఆ పరిమళమును ఆస్వాదించుచు, ప్రభూ! కొంత సమయము - నీవు ఆ గోపకాంతలతో విహరించితివి.

69-11
కామినీరితి హి యామినీషు ఖలు కామనీయకనిధే! భవాన్
పూర్ణసమ్మదరసార్ణవం కమపి యోగిగమ్యమనుభావయన్।
బ్రహ్మశంకరముఖానపీహ పశుపాంగనాసు బహుమానయన్
భక్తలోకగమనీయరూప! కమనీయ! కృష్ణ! పరిపాహి మామ్॥
11వ భావము :-
సకలసద్గుణ సంపన్నుడవగు ఓ! పరమాత్మా! ఆ గోపికలకు-నీవు -ఆ వెన్నెలరాత్రిలో- మహాయోగులకు మాత్రమే సిద్ధించగల పరిపూర్ణానందమును అనుగ్రహించితివి. ఈ అనుభవముతో - ఆ గోపికలకు బ్రహ్మరుద్రాదిదేవతల గౌరవము సహితము దక్కినది. ప్రభూ! శ్రీకృష్ణా! నీ ఈ తత్వము నీ భక్తులకు మాత్రమే గోచరము. అట్టి - గురవాయూరు పురాధీశా। నన్ను రక్షింపుము.

దశమ స్కంధము
69వ దశకము సమాప్తము
-x-