పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నారాయణీయము : 65వ దశకము - రాసక్రీడకై గోపికలు తరలివచ్చుట

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము
65వ దశకము - రాసక్రీడకై గోపికలు తరలివచ్చుట

65-1
గోపీజనాయ కథితం నియమావసానే
మారోత్సవం త్వమథ సాధయితుం ప్రవృత్తః।
సాంద్రేణ చాంద్రమహసా శిశిరీకృతాశే
ప్రాపూరయో మురళీకాం యమునావనాంతే॥
1వ భావము :-
భగవాన్! గోపికలు కాత్యాయనీవ్రతము ఆచరించినప్పుడు - వారి మనోభీష్టము తీరగలదు - అని వారికి వరమునొసగియుంటివి. అది వారికి ఇప్పుడు సిద్ధింపజేయువలెనని సంకల్పించి - ఒక పున్నమినాటి రాత్రి - యమునానదీ తీరములో - నీదివ్య మురళీగానమును ఆరంభించితివి.

65-2
సమ్మూర్ఛనాభిరుదితస్వరమండలాభిః
సమ్మూర్ఛయంతమఖిలం భువనాంతరాలమ్।
త్వద్వేణునాదముపకర్ణ్య విభో। తరుణ్యః
తత్తాదృశం కమపి చిత్తవిమోహమాపుః॥
2వ భావము :-
భగవాన్! నీవు వేణువుపై సప్తస్వరములను పలికించుచూ - ఆరోహణ, అవరోహణాది ప్రక్రియలతో మ్రోగించుచుంటివి. నీ వేణుగాన మాధుర్యము సకలభువనములలోను ప్రతిధ్వనించుచుండగా , అదివినిన గోపవనితల చిత్తములు మోహపరవశములయ్యెను.

65-3
తా గేహకృత్యనిరతాస్తనయ ప్రసక్తాః
కాంతోపసేవనపరాశ్చ సరోరుహాక్ష్యః।
సర్వం విసృజ్య మురళీరవమోహితాస్తే
కాంతారదేశమయి కాంతతనో।సమేతాః॥
3వ భావము :-
మురళీమనోహరా! ఆసమయమున - గోపవనితలలో కొందరు వారివారి గృహకృత్యములందు నిమగ్నులైయుండిరి; మరికొందరు తమసంతానమును లాలించుచుండిరి; ఇంకొందరు తమ పతులసేవలలో లీనమైయుండిరి; నీ మురళీగానమునకు పరవశలైన గోపికలు - తమతమ పనులను తటిల్లున వదలి నీవద్దకు పయనమయిరి.

65-4
కాశ్చిన్నిజాంగపరిభూషణమాదధానాః
వేణుప్రణాదముపకర్ణ్య కృతార్ధభూషాః।
త్వామాగతా నను తథైవ విభూషితాభ్యః
తా ఏవ సంరుచిరే తవ లోచనాయ॥
4వ భావము :-
భగవాన్! అప్పుడు - కొందరు వనితలు పరిపూర్ణవస్త్రములను ధరించి తమశరీరములను ఆ భరణములతో అలంకరించుకొనిరి; మరికొందరు - వెంటనే నీదరిచేరవలెననెడి ఆతృతలో - అసంపూర్ణ వస్త్రధారణతో అలంకరించకొనకయే బయలుదేరిరి. ప్రగాఢ ప్రేమతత్పరులగు వీరు నీకు మరింత సొంపుగా కనిపించిరి.

65-5
హారం నితంబభువి కాచన ధారయంతీ
కాంచీం చ కంఠభువి దేవ।సమాగతా త్వామ్।
హారిత్వమాత్మ జఘనస్య ముకుంద।తుభ్యం
వ్యక్తం బభాష ఇవముగ్ధముఖీ విశేషాత్॥
5వ భావము :-
భగవాన్! ఆ క్రమములో - వారిలోని ఒక ముగ్ధరాలు మెడలో అలంకరించుకొనవలసిన తన కంఠహారమును తన నడుము క్రింది భాగమునను, అచ్చట ధరించవలసిన వడ్డాణమును కంఠభాగమునను ధరించుకొని, భాహ్యస్మృతి లేక - వడివడిగా వచ్చెను.

65-6
కాచిత్ కుచే పునరసజ్జితకంచులీకా
వ్యామోహతః పరవధూభిరలక్ష్యమాణా।
త్వామాయయౌ నిరుపమప్రణయాతిభార-
రాజ్యాభిషేకవిధయే కలశీధరేవ॥
6వ భావము :-
భగవాన్! మరియొకవనిత నిన్ను త్వరగా చేరవలెననెడి ఆతృతతో - పై వస్త్రము ధరించుట మరిచియే నీ వద్దకు పయనమయ్యెను. తోటిగోపస్త్రీలు సహితము (ఎవరి ఆతృతలో వారు ఉండుటచే) ఆమెను హెచ్చరించలేదు. ప్రభూ! ఆ గోపవనిత - నీ పట్టాభిషేకమునకు కలశములతో వచ్చుచున్నదా అనునట్లు కనిపించుచుండెను.

65-7
కాశ్చిద్ గృహత్ కిల నిరేతుమపారయంత్యః
త్వామేవ దేవ। హృదయే సుదృఢం విభావ్య।
దేహం విధూయ పరచిత్సుఖరూపమేకం
త్వామావిశన్ పరమిమా నను ధన్యధన్యాః॥
7వ భావము :-
భగవాన్! భౌతికముగా నిన్నుచేరలేని గోపికలలోని కొందరు - నిన్నేదృఢముగా తమహృదయములో భావనచేసుకొనుచూ - తమ శరీరములను త్యజించిరి. వారు - పరిపూర్ణ జ్ఞానానంద స్వరూపుడవు, పరమేశ్వరుడవు అగు నీలో ఐక్యమయిరి. వారెంత ధన్యులో కదా! ప్రభూ!

65-8
జారాత్మనా న పరమాత్మతయా స్మరంత్యో
నార్యో గతాః పరమహంసగతిం క్షణేన।
తం త్వాం ప్రకాశపరమాత్మతనుం కథంచిత్
చిత్తే వహన్నమృతమశ్రమమశ్నువీయ॥
8వ భావము :-
భగవాన్! ఈ గోపవనితలు నిన్ను భౌతికముగా చేరలేకపోయిననూ, మనసా నిన్ను స్మరించిన భాగ్యమున, పరమహంసలగు - యోగులుపొందు ఉత్తమగతిని పొందిరి. భక్తుల ఆత్మలలో ప్రకాశించు, ఓ! పరమాత్మా! ఏదోఒక విధమున -నిన్ను నాహృదయమున నిలుపుకొనెదను; అమృత్వమును పొందెదను.

65-9
అభ్యాగతాభిరభితో వ్రజసుందరీభిః
ముగ్ధస్మితార్ధ్రవదనః కరుణావలోకీ
నిస్సీమకాంతిజలధిస్త్వమవేక్ష్యమాణో
విశ్వైకహృద్య।హర మే పవనేశ। రోగాన్॥
9వ భావము :-
భగవాన్! సౌందర్యవతులైన ఆ గోపవనితలు నీ వద్దకు పరుగు పరుగున వచ్చి నీ చుట్టునూచేరిరి. కరుణార్థ్రనేత్రములతో, మందస్మిత వదనముతో, మురళీగానము చేయుచు ముగ్ధమనోహరరూపముతో వారికి నీవు కపించితివి. ప్రభూ! నీ ప్రకాశము అనంతమైనది. అట్టి విశ్వాధిపతీ! గురవాయూరు పురాధీశా! నారోగమును నిర్మూలించుము.

(గమనిక పాఠ్యం: - ఈ దశకమున తొమ్మిది శ్లోకములు మాత్రమే కలవు)

దశమ స్కంధము
65వ దశకము సమాప్తము.
-x-