పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నారాయణీయము : 5వ దశకము - విరాట్పురుషోత్పత్తి ప్రకార వర్ణనము

||శ్రీమన్నారాయణీయము||
ద్వితీయ స్కంధము
5వ దశకము - విరాట్పురుషోత్పత్తి ప్రకార వర్ణనము

5-1-శ్లో.
వ్యక్తావ్యక్తమిదం న కించిదభవత్ ప్రాక్ ప్రాకృతప్రక్షయే
మాయాయాం గుణసామ్యరుద్ధవికృతౌ త్వయ్యాగతాయాం లయం।
నో మృత్యుశ్చ తదామృతం చ సమభూన్నాహ్నో న రా త్రేః స్థితిః
తత్రైకస్త్వమశిష్యథాః కిల పరానందప్రకాశాత్మనా||
1వ భావము.
  ప్రభూ! ప్రాచీన ప్రళయకాలమున సృష్టి ఆవిర్భావమునకు ముందు; వ్యక్తమగు స్ధూలరూపము కాని, అవ్యక్తమగు సూక్ష్మరూపము కాని లేవు. ఆసమయమున నీ జ్ణానశక్తి నీ యందే ఐక్యమయి ఉన్నది. ఆ శక్తి ప్రకృతిగతమై, త్రిగుణములుగా పరిణామము చెందని దశలో నీ యందే లయ మయి ఉన్నది . రాత్రి, పగలు, మృత్యువు, అమరత్వము, (అమృతము) అనునవి లేని ఆ స్ధితిలో ఙ్ఞానానందమును అనభవించుచూ, ప్రకాశించుచూ నీవు మాత్రమే ఉన్నావు.

5-2-శ్లో.
కాలః కర్మ గుణాశ్చ జీవనివహ విశ్వం చ కార్యం విభో!
చిల్లీలారతిమేయుషి త్వయి తదా నిర్లీనతామాయయుః।
తేషాం నైవ వదంత్య సత్త్వమయి భోః! శక్త్యాత్మనా తిష్ఠతాం
నో చేత్ కిం గగనప్రసూనసదృశాం భూయో భవేత్ సంభవః||
2వ భావము.
  ప్రభూ! ప్రకృతి తత్వములగు కాలము, కర్మము, త్రిగుణములు మరియు ప్రాణమున్న జీవులు నీ వలననే సృష్టించబడినవి. ప్రాచీన ప్రళయకాలమున నీవు చిదానంద ప్రకాశకుడివై ఉన్న ఆ సమయమున ప్రకృతి ఏకీకృతశక్తిగా నీ యందు ఐక్యము పొందెను. ప్రభూ! సృష్టి ఆధారములేక గగనకుసుమమువలె ఏవిధముగా ఆవిర్భవించును? విశ్వము నిరాధారమయినది కాదు అని వేదములు చెప్పుచున్నవి . నీ యందు ఐక్యము పొందిన శక్తివలననే విశ్వము సృష్టించబడినది. విశ్వసృష్టి కార్యమునకు నీ సంకల్పమే కారణము.

5-3-శ్లో.
ఏవం చ ద్విపరార్ధకాలవిగతావీక్షాం సిసృక్షాత్మికాం
బిభ్రాణే త్వయి చుక్షుభే త్రిభువనీభావాయ మాయా స్వయమ్।
మాయాతః ఖలు కాలశక్తిరఖిలాదృష్టం స్వభావో౾పి చ
ప్రాదుర్భూయ గుణాన్ వికాస్య విదధుస్తస్యాః సహాయక్రియాం||
3వ భావము.
  భగవాన్! ప్రాకృత ప్రళయాంతరమై రెండు పరార్ధముల కాలము గడిచెను. సృష్టిచేయు సంకల్పముతో నీ యందు నిభిడీకృతమై యున్న శక్తిపై నీ దృష్టి నిలిచినది. ఆ వీక్షణమునకు మాయ క్షోభించెను. ఆ స్ధితి యందు, మాయ నుండి త్రిలోకములు, కాలము, కర్మము, స్వభావము వాటి సహాయముతో ప్రకృతిగతమయిన త్రిగుణములు వికాసము నొందెను..

5-4-శ్లో.
మాయా సన్నిహితో౾ప్రవిష్టవపుషా సాక్షీతి గీతో భవాన్
భేదైస్తాం ప్రతిబింబతో వివిశవాన్ జీవో౾పి నైనాపరః।
కాలాదిప్రతిబోధితా౾థ భవతా సంచోదితా చ స్వయం
మాయా సా ఖలు బుద్ధితత్త్వమసృజద్యో౾సౌ మహానుచ్యతే||
4వ భావము.
  భగవాన్! నవ్వు మాయను సృష్టించి, సన్నిహితముగా ఉన్నప్పటికీ మాయ యందు నీ స్వరూపము అగోచరము. అయినను ప్రభూ! ప్రకృతి భేధములతో జీవుడిగా వ్యవహరించుచున్నది నీ ప్రతిరూపమే కాని వేరు కాదు. అందువలననే నిన్ను సాక్షి అని వేదములు కీర్తించుచున్నవి. నీ సంకల్పము వలన కాలము, కర్మము, స్వభావములచే మహత్తు అను బుద్ధితత్వము సృష్టించబడినవి.

5-5-శ్లో.
తత్రాసౌ త్రిగుణాత్మకో౾పి చ మహాన్ సత్త్వప్రధాన స్స్వయం
జీవే౾స్మిన్ ఖలు నిర్వికల్పమహం ఇత్యుద్బోధనిష్పాదకః।
చక్రే౾స్మిన్ సవికల్పబోధకమహంతత్త్వం మహాన్ ఖల్వసౌ
సంపుష్టం త్రిగుణైస్తమో౾తిబహులం విష్ణో! భవత్ప్రేరణాత్||
5వ భావము.
  మూడు గుణములతో కలిసి సంభవించిన మహత్తత్వం జీవులలో అహం అనే తత్వాన్ని ప్రేరేపించినది. మహత్తత్వములోని అహం సత్వగుణముతో కలిసి జీవులలో నిర్వికల్పముగా (బయటకు కనపడని విధముగా) జ్ఞానమును ఉద్భోధించును. మహత్తత్వమలోని అహం తమోగుణముతో కలిసి బయటకు కనబడు విధముగా తామసమును ప్రేరేపించును. ప్రభూ! విష్ణుమూర్తీ! ఇదంతా నీ ప్రేరణతోనే జరుగును.

5-6-శ్లో.
సో౾హం చ త్రిగుణక్రమాత్ త్రివిధతామాసాద్య వైకారికో
భూయస్తైజసతామసావితి భవన్నాద్యేన సత్త్వాత్మనా।
దేవానింద్రియమానినో౾కృత దిశావాతార్క పాశ్యశ్వినో
వహ్నీంద్రాచ్యుతమిత్రకాన్. విధువిధి శ్రీరుద్రశారీరకాన్||
6వ భావము.
  అహం తత్వం త్రివిధములు. క్రమముగా అవి, సత్వగుణ ప్రధానముగా వైకారికము, రజోగుణ ప్రధానముగా తైజసము, తమోగుణ ప్రధానముగా తామసము ఏర్పడినవి. వైకారికము నుండి పంచఙ్ఞానేంద్రియములకు అధిదేవతలగు దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినులు సృష్టించబడెను. కర్మేంద్రియములకు అధిదేవతలుగా అగ్ని, ఇంద్రుడు, విష్ణువు, మిత్రుడు, ప్రజాపతులు సృష్టించబడెను. అంతఃకరణకు అధిదేవతలుగా చంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, క్షేత్రజ్నుడు సృష్టిఃచబడిరి. 

5-7-శ్లో.
భూమన్! మానస బుద్ధ్యహంకృతి మిలచ్చిత్తాఖ్య వృత్త్యన్వితం
తచ్చాంతః కరణంవిభో! తవ బలాత్ సత్త్వాంశ ఏవాసృజత్।
జాతస్తైజసతో దశేంద్రియ గణ స్తత్తామసాంశాత్ పునః
తన్మాత్రం నభసో మరుత్పురపతే! శబ్దో౾జని త్వద్బలాత్||
7వ భావము.
  సత్వగుణరూప మయిన వైకారిక అహంకారము మనస్సు, బుద్ధి, చిత్తము, అహం కలిగిన అంతఃకరణను సృష్టించెను. తైజసాహంకారము ఐదు జ్ఞానేంద్రియములను, ఐదు కర్మేంద్రియములను సృష్టించెను. తామసాహంకారము పంచ భూతములను సృష్టించెను. గురవాయూరు పురాధిపతీ! నీ సంకల్పము వలననే పంచభూతములలోని ఆకాశమునకు తన్మాత్ర అయిన శబ్దము ఆవిర్భవించెను.

5-8-శ్లో.
శబ్దాద్వ్యోమ తత- ససర్జిథ విభో! స్పర్శం తతో మారుతం
తస్మాద్రూపమతో మహో౾థ చ రసం తోయం చ గంధం మహీమ్
ఏవం మాధవ! పూర్వపూర్వకలనాదాద్యాద్యధర్మాన్వితం
భూతగ్రామమిమం త్వమేవ భగవన్ ప్రాకాశయస్తామసాత్||
8వ భావము.
  భగవాన్! శబ్దము నుండి ఆకాశము, ఆకాశము నుండి స్పర్శ, స్పర్శ నుండి వాయువు, వాయువు నుండి రూపము, రూపము నుండి తేజము, తేజము నుండి రసము, రసము నుండి జలము, జలము నుండి గంధము, గంధము నుండి పృధ్వి సృష్టించబడినవి. మాధవా! తామసాహంకార మూలముగా ఏర్పడిన పంచభూతములు పరస్పర సంబంధము కలిగి ఉండుటకు, పూర్వ పంచభూత ధర్మముతో తదితర పంచభూతములు ప్రకట మగుటకు, నీ సృష్టియే కారణము.

5-9-శ్లో.
ఏతే భూతగణాస్తథేంద్రియగణా దేవాశ్చ జాతాః పృథక్
నో శేకుర్భువనాండనిర్మితివిధౌ దేవైరమీభిస్తదా।
త్వం నానావిధసూక్తిభిర్నుతగుణస్తత్వ్యాన్యమూన్యావిశన్
చేష్టాశక్తిముదీర్య తానిఘటయన్ హైరణ్యమండం వ్యధాః||
9వ భావము.
  భగవాన్! నీచే సృష్టించబడిన పంచభూతములు, ఇంద్రియ గణములు, అధీకృత దేవతలు భువనాండమును నిర్మించుటలో విఫలమయ్యెను. అనంతరము, దేవతలు నీ గుణములను నానావిధ సూక్తులచే స్తుతించిరి. తత్క్షణమే నీవు ఆ తత్వములను నీ శక్తులచే ప్రభావితము చేసి, హిరణ్మయ మగు అండమును సృష్టించితివి.

5-10-శ్లో.
అండం తత్ఖలు పూర్వసృష్టసలిలే౾తిష్ఠత్ సహస్రం సమాః
నిర్భిందన్నకృథాశ్చతుర్దశజగద్రూపం విరాడాహ్వయమ్।
సాహస్రైః కరపాదమూర్ధనివహైర్నిశ్శేషజీవాత్మకో
నిర్భాతో౾సి మరుత్పురాధిప! స మాం త్రాయస్వ సర్వామయాత్||
10వ భావము.
  ప్రభూ! ఇంతకుపూర్వము సృష్టించబడిన బ్రహ్మాండము వేల సంవత్సరములు జలము నందు ఉండెను. దానిని నీవు భేధించి, పధ్నాలుగు లోకములతో ప్రకాశించు జగద్రూపు డగు విరాట్పురుషుని ఆవిష్కరించితివి. వేలకొలది కరములు, పాదములు, శిరములు కలిగి, అశేష జీవాత్మలతో కలిసిన రూపముతో భాసించుచున్న గురువాయూరు పురాధిపతీ! నన్ను పీడించుచున్న సర్వ రోగముల నుండి రక్షించుము.

ద్వితీయ స్కంధ
5వ దశకము సమాప్తము.
-x-