పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నారాయణీయము : 14వ దశకము - కపిలోపాఖ్యానము.

||శ్రీమన్నారాయణీయము||
తృతీయ స్కంధము
14వ దశకము - కపిలోపాఖ్యానము.

14-1-శ్లో.
సమమనుస్మృత తావకాంఘ్రియుగ్మః స మమః పంకజసంభవాంగజన్మా।
నిజమంతరమంతరాయహీనం చరితం తే కథయన్ సుఖం నినాయ||
1వ. భావము.
భగవాన్! పద్మసంభవుడగు బ్రహ్మదేవుని శరీరమునుండి జన్మించిన స్వాయంభువ మనువు - నీ పాదపద్మములను స్మరించుచూ, నీ చరితమును కీర్తించుచూ నిరంతరాయముగా జీవితాంతము సుఖముగా గడిపెను.

14-2-శ్లో.
సమయే ఖలు తత్ర కర్దమాఖ్యో దృహిణచ్చాయ భవస్తదీయవాచా।
ధృతసర్గరసో నిసర్గరమ్యం భగవంస్త్వామయుతం సమస్సిషేవే||
2వ. భావము.
అదే సమయమున బ్రహ్మదేవుని ఛ్ఛాయవలన జన్మించిన “కర్దమ ప్రజాపతి”, ఆ బ్రహ్మచే నిర్దేశింపబడినవాడై, జగత్తును సృష్టించవలయునన్న ప్రబలమైన కోరికతో, పదవేల సంవత్సరములు సృష్టికతీతమైన నీ దివ్యరూపమును సేవించెను.

14-3-శ్లో.
గరుడోపరి కాలమేఘక్రమం విలసత్కేళిసరోజపాణిపద్మమ్।
హసితోల్లసితానావనం విభో! త్వం వపురావిష్కురుషే స్మ కర్దమాయ||
3వ. భావము.
ప్రభూ! నీవు నీలిమేఘచ్ఛాయతో ప్రకాశించుచూ - విలాసముగా కరమున కలువలను ధరించి, హృదయానందమగు మందహసముతో, గరుడవాహనుడవై - తపమాచరించుచున్న “కర్దమునికి” సాక్షాత్కరించితివి.

14-4-శ్లో.
స్తువతే పులకావృతాయ తస్మై మనుపుత్రీం దయితాం నవాపి పుత్రీః
కపిలం చ సుతం స్వమేవ పశ్చాత్ స్వగతిం చాప్యనుగృహ్య నిర్గతో౾భూః||
4వ. భావము.
ప్రభూ! నీ సాక్షత్కారముచే పులకితుడైన ఆ కర్దముడు నిన్ను కీర్తించెను. అప్పుడు, “కర్దమమునికి” , స్వాయంభువ మనువు పుత్రిక అయిన “దేవహూతి”ని పత్నిగా అనుగ్రహించితివి. వారిరువురికి తొమ్మిదిమంది కుమార్తెలను అనుగ్రహించి, తదనంతరము స్వయముగా నీ ఆత్మాంశతో, “కపిలుడు” అను పుత్రునిగా నిన్ను పొందు భాగ్యమును ప్రసాదించితివి. ఆ కర్దమునుకి జీవితాంతమున నీ యందే ఐక్యమగు వరమును కూడా ప్రసాదించి అంతర్దానమైతివి.

14-5-శ్లో.
స మనుశ్శతరూపయా మహిష్యా గుణవత్యా సుతయా చ దేవహూత్యా।
భవదీరితనారదోపదిష్టః సమగాత్ కర్దమమాగతి ప్రతీక్షమ్||
5వ. భావము.
ప్రభూ! నీచే ప్రేరేపింపబడిన నారదుడు ఆ స్వాయంభువ మనువుతో - "పత్ని మరియు మహారాణి అయిన “శతరూపతో” కలిసి , గుణవతి అయిన తమ పుత్రిక “దేవహూతి”ని తోడ్కొని కర్దముని ఆ శ్రమమునకు వెళ్ళమని" చెప్పెను. స్వాయంభువ మనువు వచ్చునని నీ వలన ఎరిగిన కర్దమముని, ఆసమయమున, వారి రాకకై నిరీక్షించెను.

14-6-శ్లో.
మనునోపహృతాం చ దేవహూతిం తరుణీరత్నమవాప్య కర్ధమోసౌ।
భవదర్చననిర్వృతో౾పి తస్యాం దృఢశుశ్రూషణయా దధౌ ప్రసాదమ్||
6వ. భావము.
“తన కుమార్తెను వివాహమాడమని “ స్వాయంభువ మనువు కోరగా, కర్దముడు తరుణీరత్నమగు ఆ దేవహూతిని పరిణయమాడెను. నిరంతరమూ భగవదర్చన చేయుచూ ఆనందించువాడును, భగవదనుగ్రహము పొందిన వాడును అగు కర్దముడు, దేవహూతి తనకు చేయు శుశ్రూషలకు సంతృప్తుడై ఆమెను అనుగ్రహించెను.

14-7-శ్లో.
స పునస్త్వదుపాసనప్రభావాత్ దయితాకామకృతే కృతే విమానే।
వనితాకులసంకులే నవాత్మా వ్యహరద్దేవపథేషు దేవహూత్యా||
7వ. భావము.
కర్దమముని, తన పత్నియగు దేవహూతి కోరికను నెరవేర్చుటకొరకై, నిన్ను ఉపాసించి, ఆ ప్రభావముచే ఒక అద్భుతమైన విమానమును సృష్టించెను. మరియు, దేవహూతికి సపర్యలు చేయుటకై వనితా సమూహమును కూడా సృష్టించెను. తానునూ ఒక నూతన దివ్యరూపమును ధరించి, దేవహూతీ సమేతుడై ఆ విమానము నధిరోహించి, దేవతలు విహరించు ఉద్యానవనమున విహరించెను.

14-8-శ్లో.
శతవర్షమథ వ్యతీత్య సో౾యం నవకన్యాస్సమవాప్య ధన్యరూపాః।
వనయాసముద్యతో౾పి కాంతాహితకృత్ త్వజ్జననోత్సుకో న్యవాత్సీత్||
8వ బావము.
కర్దమముని, అట్లు నూరుసంవత్సరములు గడిపిన అనంతరము ఆ దంపతులకు - రూపవతులగు తొమ్మండుగురు కుమార్తెలు జన్మించిరి. తదనంతరము వనవాసమునకు పోవలయునని తలచిననూ, భార్యయగు దేవహూతికి హితము చేకూర్చువలెననని - కర్దముడు, ప్రభూ! సాక్షాత్తు నిన్నే సంతానముగా పొందగోరి, అచటనే మరికొంతకాలము గడిపెను.

14-9-శ్లో.
నిజభర్తృగిరా భవన్నిషేవానిరతాయామథ దేవ! దేవహూత్యామ్।
కపిలస్త్యమజాయథా జనానాం ప్రథయిష్యన్ పరమాత్మతత్వ్తవిద్యామ్||
9వ. భావము.
ప్రభూ! భగవంతుని సేవించమని కర్దమునిచే ఆదేశించబడిన దేవహూతి, నిరంతరమూ భక్తితో నిన్నే సేవించుచుండెను. అనంతరము - భగవాన్! “పరమాత్మ తత్వ-విద్య”ను, భోధించుటయే పరమావధిగా దేవహూతికి - నీవు కుమారుడవై జన్మించితివి.

14-10-శ్లో.
వనమేయుషి కర్దమే ప్రసన్నే మతసర్వస్వముపాదిశఞ్జనన్యై।
కపిలాత్మక! వాయుమందిరేశ! త్వరితం త్వం పరిపాహి మాంగదౌఘాత్||
10వ. భావము.
పిదప, సంతుష్టుడైన కర్దమముని వనవాసమునకు వెడలెను. భగవాన్! “భగవత్తత్వము యొక్క సర్వస్వమును” నీవు తల్లియైన దేవహూతికి ఉపదేశించితివి. కపిల రూపమున అవతరించిన ఓ పరమాత్మా! గురవాయూరు మందిరేశా! అనారోగ్యమునుండి నన్ను త్వరితగతిని రక్షింపుము.

తృతీయ స్కంధము
14వ దశకము సమాప్తము.
-x-