ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : శ్రీకృష్ణుఁడు జరాసంధుని కుమాఁరుడు సహదేవుని రాజ్యమందునిచి,కారాగృహవాసులగు రాజులను విడిచి వుచ్చుట:
హరియు జరాసంధియగు సహదేవుఁ
బరగ మగధరాజ్య పట్టంబుఁ గట్టి; - 580
యఱిముఱిఁ జరసాల యందున్న నృపుల
వెఱవాపిఁ యందఱ విడిచి వుత్తెంచె.
కారాగృహంబునఁ గడుమాసి సొచ్చి
క్రూరబాధలఁ గంది కుందుచునున్న
యిరువదివేవురు నెనమనూటాఱ్వు
రురుచయ భ్రాంతులై యొండొండ వెడలి
చనుదెంచి కనిరి వాసవలోకవంద్యు
ననుపమదివ్యభూషాంబరాభరణు
భీమార్జునసమేతుఁ బృథుదీర్ఘబాహు
కామితార్థప్రదుఁ గడు భక్తి మ్రొక్కి;
“శ్రీనాథ! గోవింద! శ్రీవత్సచిన్హ!
దానవాంతక! కృష్ణ! తామరసాక్ష!
ధారుణి రక్షింప ధర్మంబు నిలుపఁ
గ్రూరదైత్యులఁ ద్రుంపఁ గోరి జన్మించి
యాజనార్దునుఁడ వీవామ్నాయరూప!
ఈ జరాసంధుచే నీబాధనొంది
నునికియు నిది మహదుపకారమయ్య!
ఘనయోగవర్యులు గానఁగలేని
3-24 నినుఁజూడఁ గంటిమి నిఖిలాండ నిలయ! - 590
తలఁపులుఁ దనువులు దయనిచ్చితీవు
జలజాక్ష! ఇది పునర్జన్మంబు మాకు!
ఖలు జరాసంధు నొక్కట జీరివైచి
బలియుఁడై పేర్చెనీ బకవైరి లావు!”
అని దీనవదనులై యర్థి కీర్తించు
జననాయకులఁ గృపాజలరాశిఁ దేల్చి
జలజాక్షుఁడంత మజ్జనభోజనముల
నలరించి భూషాంబరాదు లర్పించి
వారల నూరార్చి వలనొప్పఁ బలికె.
“క్రూరాత్ము చరసాలఁ గుంది లోఁగంది
ముచ్చట నున్నారు; మొగిరాజ్య లీల
లచ్చుగ భోగించుఁ డరుగుడు వేడ్క
మదమత్సరంబులు మాని యేప్రొద్దు
మదిలోన నన్ను నేమఱకుండుఁ” డనుచు
రాజుల ననిచి జరాసంధి చేతఁ
బూజలు గొని రథంబులు వేడ్క నెక్కి
యనిలజార్జునులతో యతివైభవమున
దనుజారి వచ్చె నింద్రప్రస్థపురికి.
3-24 ఒకే పాదమున్నది