పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత వైజయంతిక : పుట్టం బుట్ట పద్యార్థము

“పుట్టం బుట్ట” పద్యార్థము.

- శ్రీ కుమార దేవ

సౌజన్యము:- భాగవత జయంతిక - ఆర్కైవ్.ఆర్గ్ (archive.com)

ఆంధ్ర భాగవతమున స్తుత్యాదికములందు పోతన మహాకవి తన నమ్రతను స్పష్టీకరించుచు-

పుట్టంబుట్ట శరంబునన్ మొలవ నంభో యానపాత్రంబునన్
నెట్టం గల్గను గాళిఁ గొల్వను బురాణింపన్ దొరం కొంటి మీఁ
దెట్టేవెంట రచింతుఁ దత్సరణి నీ వీవమ్మ; యో యమ్మ; మేల్
ట్టున్ మానకువమ్మ; నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ; దయాంభోనిధీ!

అని సరస్వతిని ప్రార్థించినాడు. ఈ పద్యమునకు సాధారణముగా మనలో నించుమించందరు జెప్పుకొనెడి యర్థము: పుట్టంబుట్ట = వాల్మీకిని గాను, శరంబునన్ మొలవ = శరవణభవుడు గాను, అంభోయాన పాత్రంబునన్ నెట్టన్ గల్గను = వ్యాసుడను గాను, కాళిగొల్వను = కాళదాసుడనుగాను, పురాణింపన్, దొరంకొంటి= పురాణింప బూనుకొంటిని.
ఈ పద్యమును చదివినప్పుడెల్ల రెండవవ్యక్తియగు శరంబునన్ మొలచిన శరవణభవుడు కవియనిగాని, పురాణకర్తయనిగాని ప్రసిద్ధి యెచ్చటను గనపడక పెద్దల ననేకులను ప్రశ్నించితిని. అందరు “అచ్చటనే మాకును సందేహ” మనెడువారును, “చూడవలెను” అనువారును దప్ప ఒక్కరైన సుబ్రహ్మణ్యదేవుడు కవియనిగాని, గ్రంథకర్తయనిగాని నిరూపింపరైరి. సందేహనివారణార్థము చెన్నపురి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమున నున్న వ్రాతప్రతు లన్నిటిని శోధించి చూచితిని. అన్నిటను “బ్రౌను దొరవారు శుభ్రం చేయించిన గ్రంథము” లో గూడ “శరంబునన్“ అనియే యున్నది.
వాల్మీకి, వ్యాసుల నడుమ జిక్కిన “శరంబునన్ మొలవ” శబ్దములను మరల మరల మననము చేయుచుండగా నొక్కపాఠము స్ఫురించినది. అందలి సామంజస్యమును పెద్దలకు వదలి నాకు దోచినది పాఠకలోకమునకు సమర్పించుకొనుచున్నాడను.
పద్యమును ప్రతి పదార్థమునకు విరుచునప్పుడు “ పుట్టం బుట్ట శంబునన్ మొలవ” అను రెండు భాగములుగా విరువక ఒక్కటిగా “ పుట్టన్ పుట్టశిరంబునన్ మొలవ” అని శరమును శిరముగా చదివినచో “పుట్ట= వల్మీకము, శిరంబునన్ మొలవ= తలపై పుట్టునట్లుగా, పుట్టన్= పుట్టలేదు. అంభోయాస-. = పడవయందు పుట్టలేదు.
అనగా “వ్యాసుడనుగాను” అనుకున్నచో అన్వయార్థాదులు చక్కగా లభించుచున్నవి. ఏనాడో ఎవ్వరో తాటాకు వ్రాతప్రతులనుండి యుద్ధరించిన తొల్తటివారు “శిరంబునన్” అనుదానిని “శరంబునన్” అని చదువుకొని దానికి ఏదో అర్థమును సమన్వయించుకొని యుండవచ్చును. జిలుగక్షరములలో “శి” “ శ” గా మారుటయందు వింతలేదు. ఉన్నదానికేదో యొక అర్థము కుదిరిన వెనుక దానిని గురించి యాలోచన కూడ తప్పి యుండవచ్చును. కావున నీ పద్యమున పై పాఠాంతరమును పాటించినచో విద్యార్థు లనేకుల కిట్టి సంశయములు మానగలవు.