పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత సౌరభము : వదాన్యులకాదర్శం - వామన ఘట్టం

‘నహి జ్ఞాన సదృశం ధనం’ (జ్ఞానానికి మించిన ధనంలేదు), ‘విద్యయా అమృతమశ్నుతే’ (విద్యవల్లనే అమృతత్వం సిద్దిస్తుంది) అని వేదం వక్కాణిస్తుంది. ఆదైవీయ జ్ఞానాన్ని, మోక్షవిద్యను ప్రసాదించడంలో భాగవతానిదే అగ్రస్థానం. ఇందలి వామనావతార ఘట్టం వదాన్యులకు ఆదర్శమార్గాన్ని నిర్దేశిస్తూ ఉంది.

గొడ్డుటావు పితుక కుండ గొంపోయిన
పండ్ల నూడదన్ను పాలనీదు
లోబివాని నడిగి లాభంబు లేదయా।

అని వేమన్న హెచ్చరిస్తాడు. బలిచక్రవర్తిని ‘గతలోభ స్ఫూర్తి’ గా పేర్కొంటాడు పోతన. అనగా అతని దగ్గర లోభానికి తావులేదు. ఎట్టివారైనా అతనిని చేరి తమ ప్రయోజనాలను పండించుకోవచ్చు. ఆయన యొద్ద దాన దర్పం లేని ‘సత్యకరుణా ధర్మోల్లసన్మూర్తిమత్వం’ గోచరిస్తుంది. ‘తాను చేసిన ధర్మంబు తన్ను కాచు’ అనే ప్రబలమైన విశ్వాసం కలవాడు బలి.
కవులు తమ కల్పనల్లో శబ్ద లేదా అర్థగతమైన శిల్పాన్ని పాటించకుండా ఉండలేరు. వామనుడు బలిచక్రవర్తి దగ్గరకు ఎట్లు చేరినది -

వెడవెడ నడకలు నడచుచు
ఎడనెడ నడుగిడుచు నడరి యిలదిగబడగా
బుడిబుడి నుడువులు నుడువుచు
చిడిముడి తడబడగ వడుగు చేరెన్ రాజున్.

అంటూ ఆయనను అడుగుటకై వెళ్ళినట్లు చెప్పిన రెండు పద్యాలు సర్వలఘు కందాలే. దీనివల్ల పరులను యాచించేవాని తక్కువదనాన్ని స్ఫురింపజేసినాడు. అయితే తన దైవం పరహితానికే దాన మడుగుచున్నాడు కాన అది మంచిపనియే అని

పరహిత రతి మతియుతులగు దొరలకు నడుగుటయు నొడలి తొడవులు గాదే.

అని సమర్థించినాడు. దాన మిచ్చేటప్పుడు యాచకుని ఊరు పేరు అడుగరాదని శాస్త్రము నిర్దేశిస్తున్నది. అయితే ఇక్కడ బలి ‘వడుగా। ఎవ్వరి వాడ వెవ్వడవు? సంవాసస్థలం బెయ్యది?’ అని అడుగుచున్నాడు. అడిగినవాడు పరమభాగవతుడు. వచ్చినవాడు ఆశ్చర్యం గొలుపు బ్రహ్మవటువు. అంతేకాక వెంటనే ‘నీ వరుదెంచుటన్ సఫల మయ్యెన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడ నైతి’ అనుటలో బలి ఉదాత్తత ద్యోతక మగుచున్నది. అతిథి రాకపట్ల ఆనందాన్ని సంతృప్తిని వ్యక్తం చేయాలే తప్ప ముఖం మాడ్చుకోరాదు. ఇట బలి ఉత్తమ గృహమేధియై దర్శనమిస్తున్నాడు.
చెరుకు తియ్యగా ఉందని బుడమదాకా లాగరాదనే సామెత తరచూ వింటూంటాం. ఇక్కడ యదృచ్ఛాలాభ సంతృప్తి వ్యక్తంచేస్తున్నాడు వామనుడు. అట్లే దాతగా ప్రశస్తి గన్న బలి ‘అభ్యాగత స్వయం విష్ణుః’ అని భావించి తృప్తిగా ఎంతైనా ఇచ్చుటకు సంసిద్ధుడైనాడు. కాని ‘ఒకటి రెండడుగుల మేర ఇమ్ము’ అన్న పొట్టి వడుగుతో దాత స్థాయిని బట్టి అడుగనక్కర లేదా?’ అనే సందేహాన్ని వ్యక్తం చేసినాడు బలి. అప్పుడు వామనవటువు ‘నీవు రాజు వనుచు నిఖిలంబు నడుగుట తగవు కాదు’ అని ‘సంతుష్టుడు ముల్లోకాలలో పూజ్యు డగు’ నని, సంతోషికి ఎప్పుడూ సుఖమే ప్రాప్తిస్తుం దని, సంతోషమే ముక్తిమార్గ మని, లభించినదానితో తృప్తిపడేవాని తేజస్సు పెరుగుతూ ఉంటుం దని, ఎవడు నిస్సంతోషుడో వాడు కోర్కెలు తీర్చుకోవటానికై మళ్ళీ మళ్ళీ జన్మ నెత్తుతూ నరకకూపంలో పడి కాంతి చెడుతా డని చెప్పినాడు. ఇది అసంతృప్తులకు కన్నులు తెరిపించే నీతి.
దాన విషయంలో బలి, అతని గురువు శుక్రుడు, ఇరువురు రెండు భిన్న ధృవాలు. శాశ్వతంగా రాజభోగాలమధ్య చక్రవర్తిగా బలిని ఇక్కడే ఉంచా లన్నది శుక్రుని తపన. ‘కులమున్ రాజ్యము తేజమున్ నిలుపుము’ అంటాడు. శుక్రుని దృష్టిలో కుబ్జుని కోర్కె వంచనతో కూడినది. కాని బలి ఇహము వదలి పరముని సన్నిధిలో సాయుజ్యము పొందడానికి ఇదొక వరంగా భావించినాడు. మూర్ఖుడు తన దగ్గర ఉన్నది కాస్తా ఇస్తూ పోతే దరిద్రు డవుతా నని భయపడుతాడు. సమ్యక్ దృష్టి ప్రసాదించవలసిన గురువు ఇక్కడ సంకుచిత మనస్తత్వం ప్రదర్శించినాడు. అలనాడు భక్తి విషయంలో తండ్రిని దిద్దిన తనయుడుగా ప్రహ్లాదుడు వెలిగినాడు. నేడు గురువును దిద్దే శిష్యుడుగా ప్రహ్లాదుని మనవడు బలి బలమైన పునాది పై నిలబడినాడు. ‘చిన్నిపాపని త్రోసిపుచ్చగ చిత్త మొప్పదు’ అని ‘మాట తిరుగ లేరు మానధనులు’ అని ‘రానిమ్ము కానిమ్ము పో….. తిరుగన్నేరదు నాదు జిహ్వ’ అని ఘంటాపథంగా పలికినాడు. దానిని ఆచరణలో చూపినాడు. అవకాశవాదానికి చోటీయక మంచికి బలి అయినాడు. శుక్ర లక్షణం జారిపోవడం. అనగా స్థిరత లేనిది. కావున దానికి విలువ ఈయనక్కరలేదు.
ఒక వ్యక్తిని ఉన్నత సోపానాల చేర్చేది శాశ్వతమైన తిరుగులేని నిర్ణయమే. స్వార్ధపరులకు పనికివచ్చేది తాత్కాలిక నీతి మాత్రమే. అందుకే -

వారిజాక్షులందు వైవాహికములందు
ప్రాణవిత్తమాన భంగమందు……

బొంకవచ్చు ననే దుర్నిర్ణయాన్ని బలి త్రోసిరాజన్నాడు. చిట్టెడు విత్తి పుట్టెడు రాల్చుకొను రైతునకు వలె దాతకూడా మంచి మనస్సుతో దానం చేస్తే అది కొంచెమైనా అనంతమైన ఫలితాలను ఇస్తుందనే విశ్వాసాన్ని ప్రకటించినాడు. ‘మేరువు తలక్రిందైనను…. తప్పక ఇత్తున్’ అన్నది ఆయన తుది నిర్ణయం. దానం ఇచ్చేటప్పుడు “విప్రాయ ప్రకట వ్రతాయ। భవతే విష్ణు స్వరూపాయ।” అనటంలో పోతన భాషామర్యాద చూపినాడు. ఈ సంబోధనలన్నీ చతుర్థీ విభక్త్యంతాలు. ఒక వస్తువుపై తనకు గల హక్కును సంపూర్ణంగా వదులుకొని ఇచ్చేటప్పుడే చతుర్థి వాడాలనే సంస్కృత వ్యాకరణ సంప్రదాయం పాటించినాడు. పాత్ర నెరిగి చేసిన దానమే గుర్తింపబడుతుంది.

కమలనాభు నెరిగి, కాలంబు దేశంబు
నెరిగి, శుక్రు మాట లెరిగి, నాశ
మెరిగి, పాత్ర మనుచు నిచ్చె దానము బలి,
మహి వదాన్యు డొకడు మరియు గలడె।

అంటాడు పోతన్న. ‘తముదామె వత్తు రర్ధులు, క్రమ మెరిగిన దాత కడకు రమ్మన్నారా కమలమ్ములున్న చోటికి భ్రమరమ్ముల’ అనేది ప్రకృతినీతి. తుమ్మెద యొక్క పాదతాడనకు వెరువక, దాని నలుపునకు తనకు పులుముతున్న దని ఈసడింపక, గుండెలోతుల మాధుర్యాన్ని కొల్లగొడుతున్నా చలింపక, పద్మము తుమ్మెదను ఆహ్వానిస్తుంది. అర్హులైనవారికి అవసరమైనది అందించుటలో గల ఆనందం ఇట్లే ఉండును.
ఇక్కడ అవతలి వ్యక్తి ఎవ్వరో, ఎందుకు వచ్చాడో బలిచక్రవర్తికి తెలుసు. శ్రీహరి స్వయముగా తనకోసమే వామనుడై అవతరించాడంటే ఆ శ్రియఃపతి తనను దీవించి మోక్షమీయడానికే అన్నది తనలో రూఢి అయ్యింది. మనం అనుభవిస్తున్న సంపద అంతా మనదా? కాదు. భగవంతుడు ఇచ్చినదే. ఆయనది ఆయనకే కైంకర్యం చేయడంలో మనం నిమిత్తమాత్రులై ఉపాధిస్థానీయులై ఉండటంలో ఎంతో గొప్పతనం ఉంది. అలాకాకపోతే ఒక్కమారు మన అనుభవంలోనికి వచ్చిన దానిని వదులుకోవడానికి చాలా ఆవేదన చెందవలసివస్తుంది. అందుకై బలి త్యాగానికి పీటవేశాడు. దైవార్పణగా పరుల కిచ్చిన దానికంటే దైవమే గ్రహించిన దాని ఫలితం ఎంతో గొప్పదని పోతన్నయే క్రింది పద్యంలో పేర్కొన్నాడు.

పరమేశ్వరార్పణంబుగ
పర జనులకు భిక్ష యిడిన పరమ పదంబుం
బరగెదరట తుది సాక్షా
త్పరమేశుడు భిక్ష గొన్న ఫలమెట్టిదియో!

అన్నాడు. ప్రస్తుతం బలి పదునాలుగులోకాల తర్వాత సుతలంలో ఉన్నాడని, రాబోయే ఎనిమిది మన్వంతరాలలో అనగా ఇప్పటికి ఏడు మన్వంతరాలు గడచిన దృష్ట్యా ఇంకొక్క మన్వంతరానికి ఇంద్రు డవుతాడని పురాణాలు చెబుతున్నాయి. సుతలం అనగా శ్రేష్ఠస్థానం. భగవత్ప్రాప్తిని మించిన మంచిచోటు వేరే ఏముంది? బలి వదాన్యత కారణంగా విష్ణువే సుతల ద్వారపాలకుడై ఉన్నా డని పలకటం బలి యొక్క మహద్భాగ్యం.
కష్టంలో కూడ స్థిరమైన భక్తితో ఉండటం భాగవతుని లక్షణం. బలి దానమీయడానికి సన్నద్ధుడైన వేళ అతనిలో అధైర్యము గాని నిరాశ గాని లేదు. ఎందు కిస్తా నన్నానా అనే పశ్చాత్తాపం గాని, శుక్రుని మాట విని ఉంటే బాగుండేది కదా అనే ఆలోచన గానీ, భార్య నడిగి అంగీకారం తీసుకోవాలని గాని అనుకోలేదు. అంతా హరికృప అనుకున్నాడు. “అణోరణీయాన్ మహతో మహీయాన్” అయిన ఆ పరాత్పరునకు ఎవ్వరిని ఎప్పుడు ఎక్కడ ఎట్లా వాడుకోవాలో తెలుసు. అందుకు మానసిక సంసిద్థతతో మనం ఉండటమే మహనీయ మార్గం. వామనుడు దాన మడిగిన తీరు చాలా విచిత్రంగా ఉంది. మూడడుగులు దాన మిమ్మని స్పష్టంగా పలుకక ‘ఒకటి రెండడుగుల మేర’ అన్నాడు. ఏమిటిది? ఒకటి, రెండు కలిపితే మూడనే అర్ధం వచ్చేటట్లు పద్యాన్ని తీర్చినాడా పోతన్న? కాదు. ఒకటి భూమి, రెండు ఆకాశం. వామనుడికి ఉన్న రెండు పాదాలు భూమిని, ఆకాశాన్ని ఆక్రమించాయి. ఇక మూడవ అడుగునకు చోటెక్కడిది? అదే బలి శిరం. తద్వారా బలికి విష్ణుసాయుజ్యం. మూడడుగుల దానమిస్తే నేను నీవాడినై నీతో ఉండి నిన్ను కాపాడుతాను అన్నాడు హరి. ఈ మూడడుగులు జీవుని సర్వస్వాలైన జాగ్రత్, స్వప్న, సుషుప్తులు అనబడే అవస్థలే. ఇవి నాది అనే భవబంధానికి కారణం. ‘తవైవ వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే’ అని భగవంతునికే సమర్పిస్తే ఆయనే ‘యోగక్షేమం వహామ్యహమ్’ అంటూ కాపాడుతాడు. ఈ అద్భుత సత్యాన్ని వ్యాసులవారు వామన ఘట్టం ద్వారా స్పష్టం చేసినాడు. ఈ నిగూఢార్థం బలికి శుక్రునకు ఇరువురకు తెలిసినప్పటికి వారివారి సంస్కారాలకు అనుగుణంగా వారు తమతమ మార్గాలు నిర్దేశించుకున్నారు.
తనను దానం ఈయలేని వానిగా చేసి హరి పాదాలతో తనను తొక్కడమే బలికి కావాలి. అదే ఆయనకు ఆనందం. అనగా భగవంతుడు భక్తుణ్ణి తన పాదాల దగ్గర పడవేసికోవడం. అందుకే బలి దానం ఇచ్చితీరుతానన్న దృఢనిశ్చయాన్నే వ్యక్తం చేసినాడు. బలిది పారలౌకిక దృష్టి. శుక్రునిది ఇహలోకదృష్టి ‘రాజ్యంతే నరకం ధ్రువమ్’. కాబట్టి, రాజ్యబంధంనుండి విడివడితేనే ఏకాగ్ర మనస్కత. ధ్యానంతో సాధ్యమయ్యే దీనిని త్యాగంతో సాధించుకోగలిగినాడు బలి. వ్యామోహంలో పడినవాడు ఎన్ని జన్మ లెత్తినా తనను చేరజాలడని, నిర్మలచిత్తంతో తన తత్త్వం తెలిసినవాడే స్వాయానుగ్రహానికి పాత్రుడవుతాడని, తాను అనుగ్రహింప దలచినవారి రాజ్యాన్ని ఐశ్వర్యాన్ని సమస్తాన్ని హరిస్తానని బలిభార్యతో హరి పలకటంకూడా దీనికి పోషకంగా ఉంది. బలి అనగా మాయను తెలిసికోగల ఆత్మబలం ఉన్నవాడు. అందుకే ఆయన. ఎదుట దుర్బలు డయ్యాడు శుక్రుడు. దైవీయ విషయంలో ప్రతి వ్యక్తి బలి సదృశుడు కావాలి.
ఈ ఘట్టంలో చివర “తత్త్వజ్ఞునకు ఇంద్రపదవి అక్కరలేదని, అది ఏకోశాన విష్ణుపాదసేవకు సమానం కాజాలదని, పదవీ గర్వం గలవానికి సంపదల మధ్య తులతూగుతున్న కారణంగా చెవులు వినబడ వని, మనస్సు కాడుపడుతుందని, దానితో భగవత్సేవకు దూరమౌతా డని, నేడు బలిని పదవీచ్యుతుణ్ణి చేసి, అతని సంపద నెల్లా నీ అధీనంలోనికి తెచ్చుకోవడం ద్వారా, రక్షించి మేలు చేసావు.” అని ప్రహ్లాదుడు విష్ణువుతో అంటాడు. సాధారణంగా అన్య దేవతలు భక్తుల్ని కరుణిస్తే దానికి సాక్ష్యంగా రకరకాల ఐశ్వర్యాలను ఇస్తారేమో కాని విష్ణువు దీనికి భిన్నంగా మోక్ష మిచ్చే దృష్టితో భక్తుని సర్వస్వాన్ని హరిస్తాడు. వామనునకు పోతన్నకు భేదం లేదనిపిస్తుంది. వామనుని పాదాలు ముల్లోకాలను ఆశ్రయించినట్లే ఈ వామనచరిత్రలోని పోతన్న పద్యాలు మూలానికి మూడింత లైనాయి. వామనుని కృప ఆశ్రితులకు వినమ్రులకు ముక్తిని ప్రసాదించినట్లే. పోతన కవిత భాగవత పాఠకులకు పునర్జన్మ లేకుండా చేసింది.
వామనుని ఆవిర్భావంలో వలె మనలో జ్ఞానోదయం తొందరగా కలగాలి. వామన పాదఘాతంచే బ్రహ్మాండం చిట్లి ఆకాశగంగ చిమ్మినట్లు, అజ్ఞానావరణం బ్రద్దలై జ్ఞాన స్రోతస్సు ప్రవహించాలి. దానికి మన సంపదను కీర్తి కండూతితో గొప్పకార్యాలకు ఖర్చుపెట్టక ఉత్తమ కార్యాలకు అర్హులైన ఆశ్రితవర్గాలకు సమంగా వ్యయించాలి. యాచన అనివార్యమైతే మంచిపనులకే చేయిచాచాలి. దానం స్వీకరించవలసివస్తే అవసరాన్నిమించి తీసుకోరాదు. ప్రపంచం విశ్వాసంమీద నడుస్తున్న దృష్ట్యా దాన్ని పెంపొందించుకోవాలి. విశ్వాసం ఎట్టివాని నైనా రక్షిస్తుంది.