పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత సౌరభము : శ్రీమద్భాగవత వైశిష్ఠ్యం

వెనుకటిదినాల్లో మనవాళ్ళు భారత భాగవత రామాయణాలను అనునిత్యం చదువుకునేవారు. అందలి వివిధఘట్టాలు తమకు వివిధ విపత్కర సమయాల్లో ఊరట నిచ్చేవిగానే కాక, ప్రయోజనాల్ని సంతరించే మంత్రాలుగా భావించేవారు. ఈ పురాణ త్రయంలోని అనేక శ్లోకాలు, పద్యాలు, వారి నాల్కలపై తాండవించేవి. ఇష్టాగోష్ఠులలో, సభావేదికలలో తాదాత్మ్యంగా వందలకొద్దీ పద్యాలు అప్పజెప్పేవారు. ఆ కవుల జయంతులో, ఆ గ్రంథాల సప్తాహాలో జరుపుకొని కవుల ఆత్మతను, గ్రంథాల్లోని వెలుగును దర్శించేవారు.

దీనికి సాక్ష్యంగా ఒక శ్లోకం ఈ విధంగా వినవస్తోంది.
ప్రాతర్జూద ప్రసంగేన
మధ్యాహ్నే స్త్రీ ప్రసంగకః
రాత్రౌ చోర ప్రసంగేన
కాలో గచ్ఛంతి ధీమతాః

ఈ శ్లోకం పైకి విరుద్ధార్థాన్నిస్తోంది. ఉదయం జూదమాడు మని, మధ్యాహ్నం స్త్రీల సాంగత్యంలో ఉండు మని, రాత్రిపూట చోరక్రియలో పాల్గొన మని, కాని మాటతీరును మాటుచేసి చెప్పే కళాధర్మాన్ని ఆశ్రయించిన మన పూర్వులు ఈ శ్లోకానికి ఉద్దేశించిన అర్థం ఇది కాదు. జూదమాడి అడవులపాలైన పాండవుల కథ భారతం ఉదయం పూట చదువుకొమ్మన్నారు. స్త్రీ వ్యామోహియైన రావణుణ్ణి తెగటార్చిన రామునికథ రామాయణాన్ని మధ్యాహ్నం అధ్యయనం చేయం డన్నారు. వెన్నదొంగ యైన శ్రీకృష్ణుని గాథ భాగవతం రాత్రిపూట పఠించండని సెలవిచ్చినారు. ఇది ఆనాటి ఆరోగ్యకరమైన ఆలోచనల్లో తేలియాడే సహృదయ పాఠకుల వాతావరణం.
కాని కాలం మారింది. పారిశ్రామిక యుగంలో పరుగులు తీస్తున్నారు మానవులు. వినోదం కోసం అథమ పద్ధతుల్ని ఆశ్రయిస్తున్నారు. మట్కా మహమ్మారి, కుటుంబంతో చూడడానికి వీలులేని సినిమాలు యువకుల్ని నిర్వీర్యం చేస్తున్నాయి. వారిలోని రకరకాల బలహీనతల్ని రెచ్చగొడుతున్న టీ.వి చానళ్ళు మనిషిని మానవత్వానికి దూరంగా ఈడ్చుకొనిపోతున్నాయి. మళ్ళీ పురాణాల గుబాళింపుల్ని అంతట విరజిమ్మవలసిన అవసరం ఆసన్నమైంది. వాటికి ప్రాణం పోసే సదసద్వివేక చర్చల సదస్సులు ఏర్పడాలి.
భారతీయ ఆధ్యాత్మిక సంపదకు మూలకందములు వేదోపనిషత్తులు, ధర్మశాస్త్రేతిహాసములు ఇవి మన ప్రాచీన సాంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని చాటిచెప్పగలవి. చతుర్విధ పురుషార్థ సాధనలో ప్రముఖపాత్ర వహించినవి. కాగా ఇవి సర్వసులభ సాధ్యాలు కావు. అట్లుగాక కథోపాఖ్యానాలవల్ల వేదవేదాంగాల సారభూతమైన విషయాలను సామాన్యునికి సైతం స్పష్టం చేయగలవి పురాణాలు మాత్రమే. సంఘం నైతికంగా పతనమై ధర్మవ్యతిరిక్తమై కింకర్తవ్యవిమూఢమై భీతావహ దశలో ఉన్నపుడు మిత్రునివలె ధైర్యం చెప్పి బోధించగల సామర్థ్యం గలవి పురాణాలే. ఇట్టి పురాణాల్లో భాగవతానికి ప్రత్యేక స్థాన ముంది. దీని కర్త వ్యాసమహర్షి వక్త శుకయోగి. శ్రోత పరమభాగవతశ్రేష్ఠు డైన పరీక్షిత్తు.
వేదవిహిత ధర్మాలు దెల్పుచు భారతాఖ్యానం రచించినప్పటికి, అశాంతికి లోనైన వ్యాసుణ్ణి ఊరడిస్తూ నారదుడిలా అంటాడు.

ఉ॥
అంచితమైన ధర్మచయ మంతయు చెప్పితి వందులోన నీ
వించుకగాని విష్ణుకథలేర్పడ జెప్పవు ధర్మముల్ ప్రపం
చించిన మెచ్చునే? గుణ విశేషము లెన్నినగాక నీకు నీ
కొంచెము వచ్చుటెల్ల హరికోరి నుతింపమి ఆర్య పూజితా।

తెలివితేటలు చూడు మనుట కంటె, హృదయ శుద్ధి గమనింపు మనుటయే గొప్ప. కేవలం ధర్మబోధ గాక, భక్త కథనంలోనే శాంతి యున్న దనుట తెల్లము. ఇట్టి నారద సందేశానుసారము వ్యాసుడు భాగవతం రచించి శాంతి సంధానుడైనాడు. ఆ నారదుడే-

కం॥
నిగమములు వేయు చదివిన
సుగమంబులు గావు, భక్తి సుభగవతమునన్
సుగమంబు భాగవతమను
నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా।

అంటూ భాగవత పఠనం పునర్జన్మ రాహిత్యకారణంగా పేర్కొన్నాడు
.వ్యాసభాగవతాన్ని ఇంచుమించు భారతదేశంలో అన్ని భాషలు అనువదించుకొన్నాయి. వరదరాజు అయ్యంగారు తమిళంలో విశిష్టాద్వైత సంప్రదాయానుగుణంగా రచించినాడు. చాటు విఠలనాథుడు కన్నడంలో భామినీ షట్పది వృత్తాలలో సంగ్రహించినాడు. ఎజుత్తచ్చన్ మళయాళంలో కొన్ని స్కంధాలు మాత్రం వ్రాసినాడు. మహాభక్తుడు ఏకామ్రనాథుడు మహారాష్ట్రంలో కీర్తన సదృశాలైన పద్యాలు రచించి పేరుగాంచినాడు. రత్నేశ్వరుడు గుజరాతీభాషలో సంక్షిప్తీకరించినాడు. జగన్నాథదాసు ఒరియా భాషలో వంగదేశ వైష్ణవ సంప్రదాయానుసారంగా అనువదించినాడు. అంతగా ప్రచారానికి నోచుకోకపోయినప్పటికీ బెంగాలీభాషలో మాలాధార దాసు రచన యొక టున్నది. శంకరదేవుడు అస్సామీభాషలో రచించినాడు. సూరదాసు ‘సూరసాగర్’ అనేపేర హిందీభాషలో కృష్ణకథా ప్రియత్వం చాటుతూ వ్రాసినాడు. కాగా సదాసఖిపాల్ భాగవతం అమూలాగ్రంగా గద్యానువాదం చేసినాడు.
అంతేగాక భాగవతానికి అనేక వ్యాఖ్యలు వెలసినవి. వానిలో శ్రీధరుని భావ ప్రదీపిక, సుదర్శన సూరి శుకపక్షీయము, వీరరాఘవాచార్య భాగవత చంద్రిక, విజయధ్వజాచార్య పదరత్నావళి, శుకదేశికాచార్య సిద్ధాంత ప్రదీపనము, వల్లభాచార్య సుబోధిని, గిరిధరాచార్య ఆధ్యాత్మిక టీక, శ్రీ సనాతనులవారి వైష్ణవతోషిణి, రాజీవగోస్వామి క్రమసందర్భము, విశ్వనాథ చక్రవర్తి సారార్థ దర్శిని, మధుసూదన గూఢార్ధదీపిక ప్రశస్తిగాంచినవి.
ఎవరెన్ని తీరుల ఏఏభాషలలో రచించినప్పటికీ తెలుగులో పోతన అనువాదంతో దీటురాగల గ్రంథం మరొక్కటి లేదు. పోతన భాగవతం మాధుర్యగుణభూషితమై, భక్తితాదాత్మ్యాన్ని ఆత్మగా గలది యై యున్నది. ఇట్లు భాగవతం భారతజాతి నెల్ల కుదిపిన దనుట అతిశయోక్తి కాదు. భాగవతం-

శ్రవణం కీర్తనం విష్ణో
స్మరణం పాదవేవనమ్
అర్చనం వందనం దాస్యం
సఖ్య మాత్మనివేదనమ్॥

అంటూ నవవిధ భక్తిమార్గాలను పేర్కొన్నది. వీనికి ఉపబలకమైన కథాంశాలతో భాగవతం పరమ ప్రామాణికంగా వెలసింది. శ్రవణంవల్ల పరీక్షిత్తు, కీర్తనంవల్ల శుకమహర్షి, స్మరణంచే ప్రహ్లాదుడు, పాదసేవనంతో లక్ష్మి, పూజనంచే పృథుచక్రవర్తి, అభివందనంచే అక్రూరుడు, దాస్యంవల్ల ఆంజనేయుడు, సఖ్యంచే అర్జునుడు, ఆత్మనివేదనంతో బలి ప్రకాశించినారు.
భాగవతంలో శక్తివంతమైన భాగం శ్రీకృష్ణచరితం. శ్రీకృష్ణ జీవితాన్ని సంతరించడంలో భాగవతం ఉత్తమమానవుణ్ణి దివ్యునిగా చేయుటయే కాదు, దివ్యుని మానవునిగా సమకూర్చింది. అత్యుత్తమ స్థాయిలో కుమారునిగా, క్రీడాశక్తునిగా, వీరునిగా, దుష్టశిక్షకునిగా, వైదిక దైవము లందు సౌమ్యునిగా, రాజతంత్రజ్ఞునిగా, సాంఘిక మతప్రవర్తకునిగా శ్రీకృష్ణుని ప్రదర్శించింది. దేవుని యొక్క విశేషాలు అందునా ఎక్కువగా విష్ణు వనబడే శ్రీకృష్ణావతార తత్త్వం చెప్పటానికే వ్యాసునిచే భాగవతం వ్రాయబడిం దనడంలో సందేహంలేదు.
అయితే, అవతారప్రసంగం ఎందుకు కల్పింపబడింది. ఆ అవతార రహస్యం ఏమిటి? అనేది తెలుసుకుంటే తప్ప భాగవత వైశిష్ట్యం, అట ప్రతిపాదింపబడిన పరమాత్మ తత్త్వం అర్ధం కాదు. సోపాధిక స్వయంప్రకాశక బ్రహ్మానందస్వామి యిలా అంటారు. "దేనికీ కర్త గాక, ఎట్టి మార్పులు లేక ఉండేదే పరమాత్మ. పరమాత్మతత్త్వం తప్ప అనంత విశ్వంలో మరొక్కటి లేదు. నామ, రూప గుణాతీతుడైన పరమాత్మ లోకరక్షణార్థం మాయా మానుష రూపంలో ఆవిర్భవించాడనీ అతని లీలలే అవతారవిశేషాలని చెప్పరాదు. పరమాత్మకు లోకులవలె సంసారాన్ని అంటగట్టి, జననమరణాదులు శత్రుత్వ మిత్రత్వాదులు, సుఖదుఃఖాలు, శోకమోహాలు, దయాకాఠిన్యాలు అంటించడం తప్పు. అది వేదవిరుద్ధం. కాగా కర్మబద్ధులైన జీవుల మధ్య కొందరు పూర్వపుణ్యవశాన ప్రజ్ఞాతిశయం గలవారుగా ఉంటారు. అట్టి విశిష్టజ్ఞానైశ్వర్యం గలవారు అనంతకాలంలో భగవదవతారాలుగా భావింపబడి పూజ లందుకొంటారు. దీనికి భాగవతంలోని ఈ క్రింది శ్లోకమేసాక్ష్యం.

ఏవం జన్మాని కర్మాణిః
ఆకర్తుం ఆజనస్యచ
వర్ణయంతిస్మ కవయో
వేద గుహ్యేన హృత్పతేః
నాన్య కర్మాణి జన్మాదౌ
పరశస్యాను విధీయతే
కర్తృత్వ ప్రతిషేదార్ధం
మయయా - రోపితమ్ హితత్॥

కావున అవతారాలు నిజంగా జరిగిన చరిత్రలు కావు. అవి అర్థవాదాలు. అర్థవాదాలంటే ఏదేనొక ప్రయోజనాన్ని దృఢపరిచే నిమిత్తం చెప్పిన కల్పనా విషయాలు. ఈ కల్పన లన్నీ నిజం అనుకోరాదు. అవతారకథల్లో చెప్పబడిన వ్యంగ్యవిషయాలు తదుద్దిష్టమైన పరమార్థం మాత్రమే గ్రహించాలి. కేవలం పరమార్థమే చెబితే అర్ధంచేసికోలేని అజ్ఞానుల్ని జ్ఞానుల్ని చేయడానికి పురాణకథా పద్ధతి పాటింపబడింది.
వేదాల్లో కూడా పరమార్థ విషయ యదార్థ్యానికే అఖ్యాయికలు కల్పించబడ్డాయి. సులువుగా గ్రహించి జ్ఞప్తికుంచుకోవటానికి వీలుగాని నిరాకార నిర్గుణ పరమాత్మకు సంబంధించిన విషయాల్ని ఎన్నాళ్ళైనా జ్ఞాపకం ఉంచుకొనేలా ,మనస్సుకు హత్తుకొనేలా చేయాలంటే ఈ పద్ధతి తప్పనిసరి. వ్యంగ్యరచనాశైలిలో చెప్పిన వీటిని వివేచనా దృష్టితో పరిశీలించాలి. ఈ విషయాలను చెప్పే నామవాచక పదాలకు వ్యుత్పత్యర్ధాలతో అర్థం చెప్పుకోవాలి. అప్పుడు ఆ పదాలు కీలకపదాలుగా అనగా ‘కీవర్డ్స్’ గా పనిచేసి అంతరార్థ రత్నాలను సులువుగా కరతలామలకం చేస్తాయి.
అక్కడుండే అసందర్భాలు, అశ్లీల శృంగారాలు తొలగి అసలైన తత్త్వ విషయం బోధపడుతుంది. ఇదంతా జ్ఞాపకశక్తిని పరీక్షించడానికి కనిపెట్టిన సులభ బోధనారహస్యం. వ్యాసాదులు ప్రకృతిని పురుషునిలో ఐక్యం చేయడమనే సాయుజ్యముక్తికి సంబంధించిన ఆధ్యాత్మికతత్త్వాన్ని ప్రచారంచేయడానికే జీవించినారు. కావున వారి రచనలకు ఆధ్యాత్మికపరంగా అర్థంచెప్పడమే న్యాయం. అక్కడ చరిత్రకు ప్రాధాన్యం లేదు.
అయినా బాహిరంగంగా విస్పష్టంగా భాగవతంలోని ఉపాఖ్యానాలు అందిస్తున్న ఆదర్శాన్ని ఒంటబట్టించుకోవడంలో కూడా ఎంతో ప్రయోజనం ఉంది. జీవన్ముక్తుడు కాగోరు భక్తుడు వయస్సు, లింగం, వర్ణాదులతో నిమిత్తం లేకుండా భగవదనుగ్రహం పొందవచ్చు నని ధ్రువోపాఖ్యానం, రుక్మిణీకల్యాణం, కుబ్జ ఉదంతాలు సాక్ష్యమిస్తున్నాయి. శరీర సంపుటీకరణ విషయ వివరణాన్ని పురంజనోపాఖ్యానం తెలియజేస్తున్నది. కొన్ని జన్మల తర్వాత నైన కర్మ క్షయమై ముక్తి లభిస్తుం దనే సూత్రాన్ని జడభరతోపాఖ్యానం వివరిస్తున్నది. భగవన్నామోచ్ఛారణము భవతారక మని అజామిళోపాఖ్యానం తెలుపుతున్నది. పుత్రాది సంబంధాల హుళక్కిని గూర్చి చిత్రకేతూపాఖ్యానం విశదం చేస్తున్నది. జననమరణాలు దుఃఖకారణాలనే విషయాన్ని సుయజ్ఞోపాఖ్యానం ప్రకటిస్తున్నది. అహంకారాన్ని అణచివేయాలని నీతిని ప్రతిష్టించాలని అంబరీషోపాఖ్యానం స్పష్టం చేస్తున్నది. పూర్వజన్మ దుష్క్రియలవల్ల కలిగిన దారిద్ర్యరూప పీడలనుండి భగవంతుని దర్శన స్పర్శనలు విముక్తుణ్ణి చేస్తా యని కుచేలోపాఖ్యానం చాటుచున్నది.
సంప్రదాయం విశ్వసించేవారి మేడల్లోనే కాదు, పూరిగుడిసెల్లో కూడ భాగవతం సమర్చన లందుకొంటోంది. సత్ చర్చల మధ్య రసస్యందినిగా గుర్తించబడుతోంది.

హరిమయము విశ్వమంతయు,
హరివిశ్వమయుండు, సంశయము పనిలే దా
హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే।


అంటూ ఘంటాపధంగా భాగవతం ఘోషిస్తున్నది. నేటి పరమాణుయుగంలో అణువు నందలి విశ్వ వశీకరణ శక్తి గుర్తు చేస్తున్నది. కావున ఆ అణువు నందలి హరితత్త్వాన్ని అనగా ఆధ్యాత్మికతను గుర్తించడం విశ్వకల్యాణ హేతువు. అదే జన్మసాఫల్యతకు సేతువు.