పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత సౌరభము : ప్రహ్లాద జనని

ప్రహ్లాద చరిత్ర పెక్కు సంస్కృత పురాణములలో కలదు. మత్స్య, వామన, హరివంశము లందు సంగ్రహముగ అసమగ్రముగా ఉన్నది. విష్ణు, భాగవతపురాణములలో విస్తారముగా కానవచ్చును. పై పురాణముల ఆధారముగా తెలుగులో వెలసిన ఎఱ్ఱన నృసింహ పురాణము నందు కావ్యపద్ధతిలోను, పోతనభాగవతము నందు పౌరాణిక సాంప్రదాయానికి అనుగుణంగాను ప్రహ్లాదకథ దర్శనీయ మగును. వీనిలో లీలావతి పాత్రచిత్రణమును రేఖామాత్రముగా దర్శించి, ఆయా ఘట్టములలోని సామంజస్యమును ఒకకొంత విశ్లేషించుట ఈ వ్యాస పరమోద్దేశ్యము.
లీలావతి జంభాసురుని కూతు రని, కయాధువు అను మరొక పేరు కూడా ఉండినట్లు తెలియుచున్నది. తన తల్లి పేరును పోతమాంబగా పేర్కొనిన ఎఱ్ఱన ఎందుకో ప్రహ్లాద జనని నామమును ఎక్కడా చెప్పలేదు. ఆయన ‘సర్వమార్గేచ్ఛావిహారిత్వము’ లో ఇదియు నొక గుణమే కావచ్చును.
హిరణ్యకశిపుడు ‘మదిరాపాన మత్తలైన మత్తకాశినుల మధ్య ఉద్వృత్త విహారములు’ సల్పినట్లు ( నృ.పు.తృ.ఆ.103) ఎఱ్ఱన తెలిపినాడు. ఇక పోతన్న యేమో ప్రహ్లాదుడు తండ్రి విధించిన శిక్ష లనుభవించుచో ‘మాతృసంఘము వసించు గృహంబులోనికిన్ దూరడు’ ( భాగ.7/194) అని చెప్పినాడు. ఈ దళాలను బట్టి హిరణ్య కశిపునకు భార్య లనేకు లని రూఢి యగుచున్నది. కాగా పోతన స్పష్టముగా ప్రహ్లాదుని తల్లి లీలావతి యని చెప్పినాడు.
‘లీలావతి’ యనునది పేరు కాదని, అదొక స్త్రీ జాతి విశేషమని, ఏ స్త్రీలో యవ్వనపు పొంగులు, విలాస విభ్రమములు తొందరగా నశించకుండ చిరకాల ముండునో అట్టి స్త్రీని లీలావతి యని పండితులు అభిప్రాయపడిరి. కథాగతి నవలోకించిన ఇదియు నిజమేనేమో। అనిపించును.
డా॥ వేదుల సత్యనారాయణశాస్త్రి. వారి ‘అంతరార్థ భాగవతము’ నందు లీలావతి, ప్రహ్లాద శబ్దములకు గూఢార్థ విచారణచేయుచు, లీల అనగా భగవంతుని విలాస మని, ప్రహ్లాద మనగా శ్రేష్ఠమైన ఆనంద మని అర్థ ముండుటచే, లీలావతికి ప్రహ్లాదుడు దయించె ననుటకు భగవల్లీల కారణముగా బ్రహ్మానందము అనగా ఆత్మానందము కల్గు నని చెప్పినారు.
లీలావతి పాత్ర గుణాధికములు సూక్ష్మముగా చెప్పవలసివస్తే, ఎఱ్ఱనలో ఆమె హరిద్వేషి యైన పతికి ఎదురాడని ఉత్తమ గృహిణి. స్వప్నవృత్తాంతమును కుల గురువైన శుక్రునకు మాత్రమే తెలిపి దాని ఫలితమును తెలిసికొన్న ఉచితజ్ఞ. గర్భవతిగా నున్నపుడు పొందిన భక్తిభావముతో, పుత్రుడైన ప్రహ్లాదుని అభ్యుదమునకు లోలోనననే ఆనందించిన మాతృహృదయ.
కథాగతి ననుసరించిన పాత్రచిత్రణము :
ఎఱ్ఱన చిత్రణలో ఈమె భర్తతో పాటు ‘దివ్య మదిరా మధురామృత పాన కేళి’ ( తృ.అ.94) దేలినట్లు కలదు. పిమ్మట ‘లలితోత్తరచ్ఛందం బగు తలిమంబున…… రాగాకుల సుప్తి’ ( తృ.ఆ.104) పొందినది. రేయినిద్రలో కలవరము గూర్చు కల గన్నది. ఉదయమే తన యొద్దకు శుక్రాచార్యుడు వచ్చినాడు.

గురు దా దవ్వుల గాంచి సంభ్రమము చక్షుప్రీతియున్ భక్తి త
త్పర భావంబును నొప్ప నప్పుడు వెసన్ పద్మాక్షి ప్రత్యుద్గమా
దర సంసక్తి నమస్కరించె మహితోద్యత్ పీఠ విన్యాస సు
స్థిర సంపూజ లొనర్చి తత్కృప శుభాశీరుక్త కల్యాణియై

( నృ.పు.తృ.స్కం.119 )

గురువునకు విషయము తెల్పి, ఫలిత మానతిమ్మని కోరినది. అతడు విస్పష్టముగా ఏమీ తెల్పక ‘భక్తి విస్తారకు హరి పేరుకొన్న మదిసైపడు మేలిమి యెట్లు గల్గెడిన్’ నీ భర్త కని, నీ మగని తేజమున సుతు డుదయించు నని, నీవైనా జగదావాసు వాసుదేవుని నిత్యము స్మరించి సుగతి నొందు మని, అట్లైనచో అసురవంశము విధ్వంశము నొందక వర్థిల్లు ననినాడు. ఆ మేరకే ఆమె వివిధ వితర్కములు మనస్సులో నుండియు ‘పంకజోదర చరణ స్మరణ’ తో ప్రవర్తిల్లినది.
పోతనలో తల్లిచేత నలంకృతుడైన (భాగ.7/157) కులదీపకుని భార్గవనందనుడు దానవేశ్వరుని సన్నిధికి పునర్విద్యా పరీక్షార్థము తీసికొని పోయినట్లు మాత్రము కలదు. కాని దైత్యనందనులు తనను

‘సేవింతుము నిన్నెప్పుడు,
భావింతుము రాజవనుచు, బహుమానములం
గావింతుము, తెలియుము నీ
కీవింత మతిప్రకాశ మేక్రియ గలిగెన్”
(7/220)


అని అడిగి నప్పుడు ప్రహ్లాదుడు తన తల్లి వృత్తాంతము నెరింగించినాడు.
ఆ విషయము లేవనగా - తన తండ్రి దేవతా విజయాకాంక్షియై వరములు పొందుటకై తపమునకు వెళ్ళినాడు. అదే అదనుగా ఆ సురారి రాజ్యముపై నిర్జరులు దాడిచేసినారు. అప్పుడు లీలావతీగృహము జొచ్చి అమరేశ్వరుడు ఆమెను చెఱపట్టినాడు. ఆమె సిగ్గుతో విలవిలలాడి ‘కురరి’ యను పులుగువలె రోదించినది. దైవయోగమున నారదు డెదురైనాడు. ఆమె గర్భిణి యని, భయవిహ్వల యని, కల్మషురాలు కాదని, విడిచిపెట్టు మని హితవు పల్కినాడు.
ఆమె గర్భమున హిరణ్యకశిపుని వీర్యము వృద్ధిపొందుచున్న కారణముగా ఆమెను ప్రసవించు దాక బందీచేసి, పుట్టిన బిడ్డను వధించి, నిశ్చింతగా నుండదలచినట్లు దేవేంద్రుడు నారదునితో నన్నాడు. కాని ఆమె గర్భమున నున్నది నిర్భీకుడైన ప్రశస్తభాగవతు డని, ఎన్ని ఉపాయములు పన్నినను, ఆ బాలు నెవ్వరు చంపలేరని చెప్పిన దేవఋషి మాటలు మన్నించి సురాధిపుడు ఆమెను విడిచి ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించి వెనుదిరిగినాడు.
నారదు డామెను ఊరడించి, నిజాశ్రమమునకు గొనిపోయి, నీ పెనిమిటి వచ్చుదాక నీ విక్కడే ఉండు మని అభయ మిచ్చినాడు. గర్భస్థుడైన ప్రహ్లాదు నుద్దేశించి ధర్మతత్త్వమును నిర్మల జ్ఞానమును ఉపదేశించినాడు. ఈ ఉపదేశములు కాలాంతరమున ఆమె మరచిపోయినట్లును, దైవయోగమున తనకు మాత్రము జ్ఞప్తికున్నట్లును తోడిబాలురకు ప్రహ్లాదుడు చెప్పినాడు.
ఈ సందర్భముననే పోతనకూడ లీలావతిలోని గురుభక్తికి సాక్ష్య మనదగిన క్రింది పద్యమును ప్రహ్లాదునిచేత పలికించినాడు.

యోషారత్నము, నాథదేవత, విశాలోద్యోగ మా తల్లి, ని
ర్వైషమ్యంబున నాథురాక మదిలో వాంఛించి నిర్దోషయై
యీషద్భీతియులేక గర్భపరిరక్షేచ్ఛన్ విచారించి శు
శ్రూషల్ సేయుచునుండె నారదునకున్ సువ్యక్త శీలంబునన్.
(భాగ.7/233)


ఎఱ్ఱనలో దైవభావన హిరణ్యకశిపుని భార్యకు కులగురువు చేతనే కలిగినది. పోతనలో సురర్షియైన నారదునిచే అందినది. రెండుచోటుల ఆమె శుశ్రూష మాత్రము రూపము దాల్చిన గురుభక్తిని ప్రదర్శించినది. కాగా ఆమె గుణగణాధికములు లెస్సగా పోతనచేతనే అనేక విశేషణములచే అభివ్యక్తీకరింపబడినట్లు పై పద్యము వలన తెలియుచున్నది.
విషయ విశ్లేషణ: సురారియైన హిరణ్యకశిపునకు బ్రహ్మ ప్రత్యక్షమై ‘ఉత్సుకతన్’ జలాన్నము నొల్లక ఈ క్రియ నూఱు దివ్యసంవత్సరముల్ శరీరమున వాయువుల్ నిలుపంగవచ్చునే’ అని ఆశ్చర్యపూర్వకమైన అభినందన తెలిపినాడు. దీనినిబట్టి ప్రహ్లాదుడు లీలావతి గర్భములో అన్నేండ్లు ఉండినట్లే. ఏలనగా తన భర్త తిరిగివచ్చేదాక తాను ప్రసవించకుండు విధముగా వరము పొందినది లీలావతి. ఇన్నాళ్ళు నారదుని బోధలు ప్రత్యక్షముగా ఆమె, పరోక్షముగా కడుపున నున్న కొడుకు విన్నట్లే. కాని వీటి నెల్ల ఆమె మరచిన దనుట సరికాదు. దానిని సమర్థించు నిమిత్తమై

తత్తుకాలస్యదీర్ఘత్వాత్
స్త్రీత్వాన్ మాతుస్తితిరోదధే,
ఋషీణానుగృహీతమ్ మాం
నాధునాప్యజహాత్ స్మృతిః”

అను శ్లోకము చెప్పబడినది. ఇది మిగుల చింత్యము. దీర్ఘకాలము మరపునకు కారణము కావచ్చుగాక। కాని తనను రక్షించిన వ్యక్తి బోధలే ఆమె మరచిన దన్నచో ఆమెకు కృతఘ్నురాలు అను కళంకము వచ్చును. తోడుగా ఎన్నోఏండ్లపాటు నిరంతరాయముగా విన్న ఉదాత్తమైన విషయాలనే మరచిన దనిన ఆమెకు ఏ విషయములై శ్రద్ధ యుండినట్లు? అనిపించును. స్త్రీ యగుటచే మరచిన దనుట సరికాదు. పురుషులకు మరుపురాదా? అనుప్రశ్న ఉదయించును. ఆమెను ‘మందమతి’ యనుటకు సాక్ష్యములు లేవు. పోనీ ఆమె తన పేరునకు తగినట్లు విలాసయుక్త జీవితముననే అధిక కాలము గడిపి మందమతియైనదా? తోడుగా తనకొడుకు తండ్రిచే ఘోరాతిఘోరమైన శిక్షకులకు గురి యగుచుండిన విషయము ఆమె దృష్టికి రాలేదా? వచ్చియుండిన ఏ ఒక్కమారైనా మాతృప్రేమపూర్ణయై భర్తను ఇదేమిటని ఎందుకు అధిక్షేపించలేదు?భర్త యొక్క దృఢనిశ్చయమునో లేదా కర్కశత్వమునో తెలిసి ఎట్టి ఆందోళన వెలిగ్రక్కనీక లోలోననే మూగబాధ అనుభవించినదా?
హిరణ్యకశిపు వధానంతరము నృకేసరి ప్రహ్లాదు నెత్తుకొని తొడలపై కూర్చొనజేసి శరీరమును నిమురుచూ ప్రేమతో దయగలవాడై ‘క్వేదం వయఃక్వచవపుఃసుకుమారమేతత్ క్షంతవ్యమంగయది మే సమయేవిలంబః” (నీ వయ స్సెంత చిన్నది, నీ శరీర మెంత కోమలము….. నిన్ను రక్షించుటకు వచ్చుటలో ఆలస్యమైనదేమో క్షమించుము”) అన్నాడట. ఇంతటి వాత్సల్యానికి అనుగ్రహానికి పరాకాష్ఠగా ఆ దైవమే నిల్వగా, పెక్కేడులు గర్భము మోసి, కనిపెంచిన తల్లి కనీసము చాటుగా నైనా ఒక్క కన్నీటిచుక్కను వదలలేదా?
ప్రహ్లాదుడు తండ్రికి పరలోకక్రియలు సల్పిన అనంతరము రాజ్యాభిషిక్తుడైన వేళకూడా ఆమెను తెరపైకి తీసుకొనిరాని ఆ కవీంద్రుల ఆంతర్య మేమై యుండును?
లీలావతి ఆత్మశుద్ధికలదై నారదుని ఆశీర్వచనముల ఆంతర్యమును గ్రహించినదై ఎట్టి విక్రియకు లోనుకాలేదేమో అనిపించును. భగవంతుని నమ్మినవారు లౌకికమైన కొండంత వేదనయైన పిసరంతగాకూడ కనబడనీయని ధీరచిత్తలు కాబోలు। కవి జీవించిన లేదా కథాకాలమునాటి సమాజము, స్త్రీని కేవలము గృహమునకే బందీచేసి సంతానసేవ దగ్గరే నిల్పినదా?లేక ప్రహ్లాద చరిత్రలోనే నారదముఖముగా క్రింది పద్యాలలో చెప్పబడిన పరిమితులలోనే స్త్రీలు ఒదిగిపోయి యుండిరా?

నిలయము పాటించి నిర్మల దేహయై
శృంగారమే ప్రొద్దు చేయవలయు
సత్యప్రియాలాప చతురియై ప్రాణేశు
చిత్తంబు ప్రేమ రంజింపవలయు
దాక్షిణ్య సంతోష ధర్మ మేధాదుల
దైవతమని ప్రియు దలపవలయు
నాథు డేపద్ధతి నడచు నా పద్ధతి
నడచి సద్బంధుల నడుపవలయు
మార్దవమున పతికి మజ్జన భోజన శయన పాన రతులు జరుపవలయు
విభుడు పతితుడైన వెలది పాతివ్రత్య మహిమ పుణ్యు జేసి మనుపవలయు

ఇట్టి సందేశములచే స్త్రీల నోటిని నొక్కినారనే ఆధునికుల విమర్శకు ఇందు సమాధానము లభింపదు. ఏమైనను గ్రంథస్థాంశములు ఆధారముగా కాక ఇతరములైన పోకడలు పోవుట, మహాకవుల దారులు ఇట్లుండవలె నని నిర్దేశించుట, ఒక విధముగా మూఢత్వమునకు సాక్ష్య మగునేమో? వారి పథము నందుకోలేని లోపమేదో మనలో కలదేమో అనిపించును.
పోతన ఆర్యాజన సమారాధకు డాయన. నందాంగనా డింభక స్మరణతో కావ్యమునకు శ్రీకారము చుట్టినాడు. అమ్మలగన్న యమ్మ యైన భవానీచే మహత్వ కవిత్వ పటుత్వ సంపద ఆశించినాడు. తన తల్లి లక్కసానికి అన్య మానిను లీడుగా రని, ఆమె బహమాన నివారిత దీన మానస గ్లాని యని తనివిదీరా శ్లాఘించినాడు. ఇట్లు సత్త్వగుణము లెల్ల సంఘములై రూపొందిన పోతన, స్త్రీపాత్రలు సహజ సౌకుమార్యులు లె మ్మని సరిపెట్టుకోవలెనా?
తన చిన్నారులను ఊచకోతకోసిన అశ్వత్ధామను కర్ణకటువుగా ఒక్క పల్కాడని ద్రౌపదిని, సంపదనెల్ల హరించు తంతు ఇంట జరుగుచుండగా పల్లెత్తుమాట పలక్క చోద్యము చూచుచుండిన బలిభార్య వింధ్యావళిని సృష్టించిన పోతనలో తన బిడ్డను రక్షించుటకై ముందుకు వచ్చిన సాక్ష్యము లేవీ లీలావతి నిల్పుకోలేకపోయినదా? కావ్యమార్గము ద్రొక్కిన ఎఱ్ఱన్నయు ఆమె పాత్రను తల్లి స్థానములో ఎందుకు నిలబెట్టలేకపోయినాడు? వీరిర్వురు మూలమునకు విధేయులై ఊరకుండిరా? ఇవన్నియు సమాధానము దొరకని ప్రశ్నలు.
భాగవత తాత్పర్యము అనదగిన క్రింది మాటలలో విశ్వాసము నిల్పి కొడుకువలె లీలావతియు సర్వము ఆ అంతర్యామికి వదలిన దని భావించుటయే లెస్స.

“పుణ్య శ్రవణ కీర్తనుండైన విష్ణువు తన కథలు వినువారి హృదయకమలము లందు నిలిచి శుభము లాచరించు; అశుభములు నిరసించు; అశుభంబులు నష్టంబు లైన భాగవతశాస్త్ర సేవావిశేషంబున నిశ్చలభక్తి యుదయించు; భక్తి గలుగ రజస్తమోగుణ ప్రభూతంబు లైన కామ లోభాదులకు వశంబుగాక చిత్తంబు సత్త్వగుణంబున ప్రసన్నం బగు; ప్రసన్నమనస్కుం డైన ముక్తిసంగు డగు; ముక్తిసంగు డైన నీశ్వరజ్ఞానంబు దీపించు”.