పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత సౌరభము : చేతవెన్నముద్దతో ఒకపూట


14-8-1979 నాటి శ్రీకృష్ణ జయంతి సందర్భంగా గుంతకల్లు పట్టణంలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో ప్రసంగించవలసినదిగా నన్నుఆహ్వానించినారు. ఆ సభకు ఏవైనా కొత్తవిషయాలు అందిస్తే మంచిదని ఆలోచిస్తూకూర్చున్నాను. కొద్దిసేపటికి నా కళ్ళముందు —

చేతవెన్నముద్ద, చెంగల్వపూదండ,
బంగారు మొలత్రాడు, పట్టుదట్టి,
సందెతాయతులను, సరిమువ్వగజ్జెలు
చిన్నికృష్ణ నిన్ను చేరికొలుతు.

అనే పద్యం సాక్షాత్కరించింది. ఈ పద్యం రాని తెలుగువాడులేడు. బాలలకు అత్యంత ప్రియంగా ఈ పద్యాన్ని పెద్దలు పట్టిస్తుంటారు. ఎప్పుడు వ్రాశారో, కవి ఎవ్వరో తెలియదు. కాకపోతే పోతన్నదేమో అనే సందేహం కలుగకపోదు. మొత్తంమీద అందరి నాల్కలపై కాలాబాధితంగా నర్తిస్తూనేఉంది ఈ పద్యం. ఐతేనేం? ఇంతకు మించి విశేషాలేమీ లేవా? లేకపోతే ఇంతకాలం సజీవంగా ఎలా నిలబడగలిగింది? ఈ పద్యాన్ని సజీవంగా నిల్పటంలో ఛందస్సు, వర్ణనలు కాక మరేవైనా బలమైన సందేశాలున్నాయా? అంటూ రకరకాల ప్రశ్నలు వేసుకుంటూ వెళ్ళాను.

ఈలోగా ఒక మెరుపు మెరిసింది. దానికాంతి విస్తరిస్తూపోతూ నన్ను విస్తుపోయేలా చేసింది. వెనుకటికొక శాస్త్రవేత్త భౌతికసత్యమేదో కనుగొని ‘యురేకా’ (కనుగొంటిని) అంటూ కేకలు వేసుకొంటూ, ఒంటిమీద బట్టలున్నది కూడ గుర్తించకుండా బజారులో గంతులువేశాడట। ఇంచుమించు నా పరిస్థితి అదే అయింది. ఏ భావపరంపర నన్ను అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యేటట్లు చేసిందో, అది సభాసదులకు, రసజ్ఞులకు, కాన్కచేస్తే బాగుంటుందనిపించింది. ఆ విధంగా అందరినీ నా వలయంలో కట్టివేసికోగలనన్న అత్యాశకూడా నాకు కలిగింది. మంచివిషయాలలో అందరినీ భాగస్వాములను చేస్తే తప్పేముంది? అనుకున్నాను.

సభలో నేను చేసిన ప్రసంగ సారాంశం ఈ క్రింద పొందుపరుస్తున్నాను. గుణ గ్రహణ పారీణులు, రసజ్ఞులు స్వీకరిస్తారని ఆశిస్తూ గత ఇరువదినాలుగేండ్లుగా దీనికి ప్రచారం కలిగిస్తూనే ఉన్నాను. ముఖ్యంగా విద్యాసంస్థల్లో దీన్ని విద్యార్థులకు పట్టించే ప్రయత్నంచేస్తూ వస్తున్నాను. నాటినుండి పత్రికల ద్వారా, రేడియో ప్రసంగాల ద్వారా ఇందలి విషయాలు రేఖామాత్రంగానే పాఠకులకు అందుతూనే ఉన్నా దీని సమగ్రస్వరూపం ఆశించిన హిత మిత్రకోటికి ఇప్పుడైనా ఇవ్వగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది.

ఆ నాటిసభకు శ్రీ రాధాకృష్ణరాజు (డివిజనల్ పోలీస్ సూపరింటెండెంట్) అతిథులుగా విచ్చేసి, నా ప్రసంగం పట్ల స్పందించి, నేడు ఈ చిన్నిపద్యానికి ఇంత విపులంగా వ్యాఖ్యానం చేసిన ఆశావాదిని మెచ్చి ఏదైనా విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇవ్వవచ్చు అని అన్నారు. ఆ సుహృన్మతి ఎంత ప్రగాఢంగా అభివాంఛించారో ఏమో గాని ఇరువదిసంవత్సరాల అనంతరం నాకు పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం డి.లిట్., గౌరవపట్టా ప్రదానం చేసింది. ఆవశ్యవాక్కు ఇప్పు డెక్కడ ఉన్నారో తెలియదు. ఆయనకు నా జోహారులు. ఈ పురస్కారానికి కారణం ఈ పద్యవిశ్లేషణ ఒక్కటే కారణమై ఉంటుందని నేను అనుకోవటంలేదు. ఏమైనా పై పద్యంలోని బాలకృష్ణుడు ‘గోపి- కృష్ణుడు’ గా మారి నన్ను ఆశీర్వదించినట్లు భావిస్తున్నాను. దైవం మానుషరూపేణ అని విశ్వసిస్తూ చిత్తశుద్ధిగలవారి మాటకు ఎంత బలముంటుందో ఊహించుకొనేకొద్దీ ఉత్సాహం ఇనుమడిస్తూనే ఉంటుంది. సత్క్రియలకు కట్టుబడి జీవించాలనే బలమైన ఆకాంక్ష కలుగుతూనే ఉంటుంది. అస్తు. ప్రకృతమనుసరామి। ఈ పద్యంలో బాలకృష్ణుని రూపవర్ణన ముంది. ఆయన చేతిలో వెన్నముద్ద పట్టుకొన్నాడు. మెడలో చెంగల్వపూదండ వేసికొన్నాడు. మొలలో బంగారు సూత్రము ధరించినాడు. ఇక్కడ ప్రసక్తాలైన వెన్న-రుచికి, పూవు- వాసనకు, బంగారు- రంగునకు సంకేతాలు. ఈ రుచి, వాసన, రంగులు - మూడు సంస్కారాన్ని సూచించే ప్రత్యామ్నాయ పదాలు, ఎలాగ అంటే రంగు, రుచి, వాసన, లేని బ్రతుకు నిరర్ధకమని, ఫలానావాడు వాసనలేని బ్రతుకు బ్రతుకుతున్నాడు వాడిదీ ఒక బ్రతుకా అని, మనం తరచు వింటూ ఉంటాం. కాబట్టి ఇవి నిస్సందేహంగా సంస్కారం అనే అర్ధాన్ని ఇచ్చేపదాలే. ఈ విధంగా బాలకృష్ణుడు లోకుల్లారా! నాది రంగు, రుచి, వాసన గల బ్రతుకు, మీరుకూడా ఇలా నా ఆదర్శాన్ని స్వీకరించండి అనే సందేశాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ రంగు ముఖానికి పూసుకొనేదో, రుచి నాలుకకు సంబంధించిందో, వాసన ముక్కుకు సంబంధించిందో కాదనేది స్పష్టం. కృష్ణుడెలా ఈ మూడుగుణాలను ప్రదీప్తం చేసాడో భాగవతంలోని ఆయన లీలలు చదివితే అవి సుస్పష్టం చేస్తాయి.

అయినా సంస్కారం అనేది ఒకవిధమైన జీవన విధానం. దానికి నిఘంటువులో అర్ధం దొరకదు. సంస్కారానికి ప్రతీకయైన వివిధ ఘట్టాలను పరిశీలించడం ద్వారా లేదా ఏయే సందర్భాలలో సంస్కారం అనేమాట ప్రయుక్తమైందో పసికట్టటంద్వారా మాత్రమే ఈ మాటకు అర్ధం తెలిసికోవచ్చు. దీనికి కొన్ని సన్నివేశాలను చూద్దాం.

అదొక రైల్వే జంక్షన్. అక్కడ ఆగిఉన్న ఒక రైలుబండిలో ఒక ఉన్నత తరగతి కోచ్ లో బాగా చదువుకొన్నట్లున్న, చక్కగా అలంకరించుకొన్న, ఆధునిక నాగరికతకు అద్దం పడుతూ ఉన్న అమ్మలక్కలు చాలామంది కూర్చుని ఉన్నారు. అక్కడికొక ముసలవ్వ వచ్చింది. ఆమె చినిగిన బట్టలతో, చిందరవందరైన తలతో, చీకి కళ్ళతో, చీమిడిముక్కుతో, అందరూ చీకొట్టేలా ఉంది. ఆ వృద్ధస్త్రీ ఏదైనా దానంచేయండంటూ దీనంగా చేయి చాచింది. ఇది చూచిన ఆ బోగీలోని పూబోడులు చాలమంది ఆమెను అసహ్యించు కొన్నారు. సరికదా ‘వాసన వాసన’ అంటూ తమ చేతిరుమాళ్ళను ముక్కులకు అడ్డంగా పెట్టుకున్నారు. పాపం! ఆమె వైపు చూడటానికికూడా వాళ్ళ మనసు అంగీకరించలేదు.

ఇంతమందిలో ఒకే ఒకామె, తాను తినటానికై ఉంచుకొన్న ఆహారం పొట్లాన్ని ఆమె చేతిలో పెట్టింది. తర్వాత తనవ్యానిటీ బ్యాగ్ లో నుండి ఒక నోట్ బుక్, పెన్, తీసుకొని అందులో డైరీలో వ్రాస్తూ ‘వాసన వాసన అన్నది ఎవరు? వాసనలేనివాళ్ళు’ అని వ్రాసుకొనింది. ఇక్కడ ఆమెమాటలు ఎదుటివాళ్ళలోని కుసంస్కారాన్ని, కహనా నాగరికతను ప్రశ్నిస్తున్నాయి. సంస్కారమంటే ఎలా ఉండాలో ఆమె చర్య కొంతైనా తెలియజేస్తూ ఉంది. దీనావస్థలో దగ్గరకి వచ్చినవారి అవసరమేమిటో తెలిసికొని, తమకు వీలైనమేర దానిని తీర్చటానికి ప్రయత్నించటం సంస్కారి లక్షణం. అక్కడ తారసిల్లిన ఆ పండుముసలికి ఆహారమో, వస్త్రమో, ఏదోకొంత చిల్లర ఇవ్వడం ద్వారా ఆమెను సంతోషింప చేయటానికి బదులుగా, అక్కడున్నవాళ్ళంతా సాటి ఆడ దన్న సానుభూతి కూడ చూపకుండా వాసన అని ఛీత్కరించుకొన్నారు. జీవిత చదరంగంలో ఎవ్వరికెట్టి దుర్గతి ఏ క్షణంలో దాపురిస్తుందో ఊహించుకోలేకపోయారు. కాలంచే కాటువేయబడిన ఆమెపట్ల కనికరం చూపలేకపోయారు. కాబట్టి వీళ్ళను ‘వాసన లేనివాళ్ళు’, ఆమె రచయిత్రి కాబోలు, ముద్రవేసింది. ఇందులో ఆశ్చర్యంలేదు.

అట్లే సంస్కార నిర్వచనాన్ని మరొక ఘట్టం ద్వారా పరిశీలిద్దాం. అదొక జంట. ఇర్వురు అనుకూల దంపతులు. సమసౌందర్యం కలవారు. వారి పెళ్ళి దినం వచ్చింది. భర్త ఏదో కానుక పొట్లంలో భద్రపరచి తెచ్చి భార్య కిచ్చాడు. ఆమె ఏమిటండీ ఇది? అనింది. అబ్బే ఏమీలేదు! మన పెళ్ళిరోజు స్మరణగా నీకేదైనా బహుమతి ఇద్దామని దీన్ని తెచ్చాను అన్నాడు. ఆమె మళ్ళీ ఇందులో ఏముందో చెప్పవచ్చుగా అని కాస్త గొంతు పెద్ద చేసింది. అమ్మో! అంతసులభంగా చెబుతానా? నిన్ను ఆటపట్టించాలిగా! నీకో పరీక్ష అన్నాడు. ఈ ప్యాకెట్ పై వరుసగా మూడు బొమ్మలున్నాయి. వాటి ఆధారంగా అందులో ఏముందో కనుక్కోవాలి. అన్నాడు. సరే కానీయండి అంటూ భర్త సవాలును నవ్వుతూ స్వీకరించింది. ప్యాకెట్ పైభాగంలోని బొమ్మల్ని చూచింది. అవి 1. పాము, 2, శివుడు. 3, హనుమంతుడు.

ఈ బొమ్మల్ని చూచి అసలైన వస్తువేదో కనిపెట్టాలి. ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. రకరకాల ప్రశ్నలు వేసుకొంటూ మెల్లమెల్లగా సమాధానాన్ని కనిపెట్టే ప్రయత్నంచేస్తోంది శ్రీమతి. శ్రీవారి కిదంతా వేడుకా ఉంది. పాము బొమ్మను చూచి దీనికి ఆహారం ఏమిటి? గాలి. ఎటువంటిగాలి మనిషికి సుఖాన్ని ఇస్తుంది? సువాసనతో కూడుకున్నది. సువాసన ఎక్కడనుండి వస్తుంది? పూలనుండి. కాబట్టి ఇందులో పూలు ఉన్నాయి. భర్త భార్యకు పూలుకాక మరేం తెస్తాడులే అని నిర్ణయించుకొంది. అనంత సృష్టిలో పూలు అనేకానేకాలు. మరి అవి ఏవో తేల్చాలంటే తర్వాత రెండుబొమ్మల ఆధారంగా ఆలోచించాలి.శివుని బొమ్మను చూచి శివుని శత్రువెవ్వడు? మన్మధుడు. ఈ అనంగునకు ఆయుధాలేమిటి? పూలబాణాలు. అవెన్ని? ఐదు. ఇప్పటికి పెక్కుపూలనుండి ఐదుపూలదగ్గరికివచ్చింది సమాధానం. ఆ అయిదు పువ్వులలో ఏదో తేలితే తాను పరీక్షలో నెగ్గినట్లే. ఇక హనుమంతుని బొమ్మను చూస్తూ హనుమంతుని గురువెవ్వరు? సూర్యుడు. సూర్యునకు ప్రియమైన పుష్పం ఏది? పద్మం అని నిర్ధారించుకొనింది. పద్మం కదండీ. అని భర్తతో అన్నది. ఏమో పొట్లం విప్పి నీవే చూడు, తెలుస్తుంది అన్నాడు భర్త. ఆమె గబగబా పొట్లం విప్పింది. అందులో స్వర్ణపద్మం కనపడింది. ముఖం పెద్దగా చేసి ఆడవాళ్ళకు సహజంగా బంగారం మీద గల ఆసక్తిని కాస్త గొంతుజీరలో కలిపి బంగారుపువ్వండీ! అన్నది భార్య . అవునా! నీ లాగే అందంగా ఉంది కదూ! కానీ ఏంచేస్తాం. దీనికి వాసనలేదు. అన్నాడు భర్త పెదవివిరుస్తూ. అంటే ఒక వస్తువెంత విలువైనదైనా కావచ్చుగాక, కాని ఆ వస్తువునకు తప్పనిసరిగా ఉండవలసిన గుణం లేకపోతే దానికి విలువలేదు. పూవునకు తావి లాంటిది. సమాజనీతికి సంస్కారవిశేషం. మొత్తంమీద వాసన అంటే అది సంస్కారాన్ని సూచిస్తూ ఉందనేది పై అంశాలవల్ల అందరూ అంగీకరించవలసిన అంశం.

బాలకృష్ణుడు సంస్కార ప్రాధాన్యత తెలుపుతున్నాడు. అంతటితో ఆగలేదు ఆయన ఆకారం. నడుముకు పట్టు వస్త్రాన్ని దట్టీగా బిగించారు. భుజాలకు తాయెత్తులు కట్టబడి ఉన్నాయి. పాదాలకు మువ్వలగజ్జెలు అలంకరించబడ్డాయి. ఇక్కడ నడుము, భుజము పాదాలక్రమంలో ఒకసందేశ క్రమం కూడ కనిపిస్తుంది. అదేమిటంటే ఏదైనా సమస్య తలెత్తితే బెంబేలెత్తి ముసలమ్మలా మూలనక్కి ముసుగు వేసుకొని కూర్చోవటంకాదు. నడుం బిగించి, భుజం అప్పళించి, ముందడుగు వేయమని బాలకృష్ణుడు సందేశమిస్తున్నాడు. నిజానికి ఆయన పెద్దయ్యాక కౌరవ పాండవ రణ భూమిలో విల్లంబుల విడిచి వీరడియైన అర్జునునకు బోధించిన దిలాంటిదే కదా!

గజేంద్రుడు నక్రంబారినుండి తనను రక్షించమంటూ విష్ణువును ప్రార్థిస్తూ

‘నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చు
వానికేనొనర్తు నందనములు.’

అంటాడు. ఎవడు నిపుణు డంటే కింకర్తవ్యతా విమూఢుడు కాదు. భగవద్దత్తమైన దైహికబలాన్ని మేధాసంపత్తిని కరగించి పరిశ్రమించేవాడు. అట్టివాణ్ణిచూస్తే దేవుడు సంతోషిస్తాడు. మెచ్చుకుంటాడు. అంతేగాని గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కని ఏడ్చేవాడిని చూసి కాదు. వీణ్ణి చూస్తే అసహ్యించుకొంటాడట. కాబట్టి కాయకమే కైలాసం (work is worship) అన్నది అలవరచుకొమ్మని బాలకృష్ణుడు పట్టుదట్టి, సందెతాయెతులు, సరిమువ్వగజ్జెలు ధరించుటద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. శ్రీకృష్ణజయంతి సందర్భంగా మనం ఈ ఉదాత్త సందేశాన్ని హృదయభూషగా ధరిద్దాం. ఆచరణలో అనువదిద్దాం.

ఈ పండుగను నిర్వహించుకోవడంలో మన శ్రద్ధ ఏక పక్షంగా ఉంటోంది. కృష్ణవిగ్రహాన్ని చక్కగా అలంకరిస్తున్నాం. చక్కెర పొంగలి మొదలైన రుచికర నైవేద్యాలు ఉంచుతున్నాం. చుట్టుచేరి భజనలు చేస్తున్నాం. ఇదంతా బాగానే ఉంది. కాని మన కళ్ళెదుట సజీవులైన బాల కృష్ణుల్ని కొందరిని అలక్ష్యం చేస్తున్నాము. వారి దుస్థితి మరీ దయనీయంగా ఉంటోంది. వారు కన్నవారికి కాబట్టలేదు. అసలు వారిని పట్టించుకొనే వాళ్ళేలేరు. చూడండి. రైలుబండి వేగం అందుకుంటే మన గుండెల్లో రైళ్ళు పరుగెడతాయి. కాని అలా అతివేగంగా వెళ్ళే రైలుపెట్టెలపై ఈ కొసనుండి ఆ కొసదాకా, మళ్ళీ ఆచివరినుండి ఈ చివరిదాకా పరుగులు తీస్తూంటారువారు. పెళ్ళిళ్ళలో పేరంటాలలో విందుల్లో వినోదాల్లో విసరివేయబడిన విస్తర్లలోని ఎంగిలి మెతుకులకై కుక్కలతో పందులతో పోటీపడి, చూచేవాళ్ళకు పరమ అసహ్యంగా దీనంగా ఉంటున్నారు. చీమకు చక్కెరపెట్టి, పాముకు పాలుపోసి, మట్టిబొమ్మలకు హారాల్ని, చెట్టుకొమ్మలకు చీరల్ని చుట్టబెట్టే మనం ఆ దిక్కు మొక్కు లేని వాళ్ళ గురించి ఏనాడైనా ఆలోచించామా?

ప్రభుత్వం దేశరక్షణకై సైన్యంలో చేర్చుకొనేవారి ఎత్తు బరువు ఛాతీ వగైరాలు పరీక్షిస్తుంది. ఇలా బజారుపాలైన ఈ బాలుర విషయంలో వీనిని మినహాయించి, తోడునీడగా ఎవ్వరూ లేకపోయినా ఎట్లో జీవిస్తున్న వీరి ధైర్యాన్ని లేదా అవసరాన్ని పరిగణనలోనికి తీసుకొని, వీరిని మిలటరీలోనికి చేర్చుకొంటే వీరికి జీవితాన్ని కలిగించి నట్లవుతుంది. ఈ దిశగా ఎందుకు ఆ లోచించదో అర్థం కాకుండా ఉంది. బాలనేరస్థులుగా ముద్రవేసి వీరిని శిక్షలకు గురిచేసి, ప్రమోషన్ల కోసం దొంగనేరాలను వీరిపై మోపేవారికి బాసటగా ఉండటం కాక వీరి బ్రతుకుల్లో వెలుగును నింపలేమా? ఆలోచించండని అభ్యర్థిస్తున్నాను.

ఈ బాలకృష్ణుల జీవితాలను మార్చగలిగితే అదే నిజమైన కృష్ణ జయంతి అవుతుంది. వీరి కాలే కడుపులకు పుడిసెడు గంజినీళ్ళైనా పోయగలిగితే అదే నిజమైన పండుగ అవుతుంది. అంతేకాని కేవలం చిల్లులు పడేలా రామ, కృష్ణా, గోవిందా! అంటూ కేకలు వేయడంవల్ల కాదు. లేదా నేల ప్రతిధ్వనించేలా వీర విహారం చేస్తూ చిందులు వేయటం వల్లా కాదు.

బాలఘాతకుల పాలిట యమకింకరుడైనాడు. శ్రీకృష్ణుడు. గర్భస్థశిశువుల్ని రక్షించటంలో ప్రధానభూమిక పోషించాడు శ్రీకృష్ణుడు. ఉన్నది అందరికీ పంచే ఉన్నతాశయంతో జీవించాడు శ్రీకృష్ణుడు. బట్టలులేనివాళ్ళ మర్యాద కాపాడినాడు శ్రీకృష్ణుడు. అటుకులు తిని ఐశ్వర్యాన్ని ఇచ్చాడు కృష్ణుడు. రాక్షసుని బారినపడిన గురుపుత్రుని రక్షించితెచ్చాడు. కుంటివాళ్ళకు నడకను, మూగవాళ్ళకు మాటను, కురూపులైన వారికి సౌందర్యాన్ని ప్రసాదించినాడు. కరుణకు కేతనంగా మురళీనాదాన్ని ముగ్ధమోహనంగా వినిపించాడు కృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడు మనహృదయవాసు డగుగాక. ఆయన ఆదర్శం మన దైనందిన చర్యల్లో కార్యరూపం దాల్చుగాక.

కరారవిందేన పదారవిందం
ముఖారవిందే వినివేశయంతం.
వటస్య పత్రస్య పుటే శయనం
బాలం ముకుందం మనసా స్మరామి
సచ్చిదానంద రూపాయ
విశ్వోత్పత్యాది హేతవే
తాపత్రయ వినాశాయ
శ్రీకృష్ణాయ వయం నమః

ఈ విధంగా కృష్ణావతారమిచ్చే సాంఘిక సందేశాన్ని అర్థం చేసికొన్నాక, ఆ అవతార తత్త్వాన్ని కూడ కొంత పరిశీలిద్దాం.

భగవదవతారాల్లో కృష్ణావతారం సంపూర్ణావతారం. ఇది కాలక్రమాన్ని బట్టి చివరిదైనా పూర్ణ మహత్యాన్నిబట్టి మొదటిదని చెప్పడమే భాగవత లక్ష్యం. అందుకే వ్యాసులవారు భాగవతాన్ని ‘కృష్ణమూలం’ అన్నారు. కృష్ణతత్త్వం అర్థం కాకుండా కృష్ణలీలల్ని అపార్థంచేసుకొనె అవకాశం ఉంది. ఈ అవతారం సాధకులకు ఆధ్యాత్మిక సందేశం. సామాన్యులకు సాంఘిక సందేశాన్ని ఇస్తూఉంది. కృష్ణావతార తత్త్వం సమగ్రంగా అర్థంచేసికొనకపోతే కృష్ణావతార సందేశం అర్థంకాదు. అయినా అవరోహణా క్రమంలో కృష్ణ సందేశాన్ని తొల్త సమీక్షుంచుకొన్నాం. ఇక కృష్ణ తత్త్వాన్ని అవగాహన చేసికొందాం.

బ్రహ్మణోవాచకః కోయమ్
బుకారోనంత వాచకః
శివస్యవాచకష్షశ్చ
న కారో ధర్మవాచకః
అకారో విష్ణు వచన
శ్వేతద్వీప నివాసనః
నరనారాయణార్థస్య
విసర్గో వాచక స్నృతః

అను సంస్కృత భాగవతశ్లోకాన్ని బట్టి ‘కృష్ణః’ శబ్దంలోని కవర్ణం బ్రహ్మవాచకం. ఋకారం అనంతవాచకం. షకారం శివ వాచకం. నకారం ధర్మవాచకం. అకారం విష్ణువాచకం. విసర్గం నరనారాయణార్థ వాచకం అనుట స్పష్టం.

వసుదేవుడు పంపగా గర్గుడు నందుని దగ్గరకు వచ్చి కృష్ణునిగూర్చి ఇలా అన్నాడు. ‘నందా। ఈ నీ కుమారుడు పూర్ణబ్రహ్మరూపం. మాయచే భూతము లందు పుట్టి భూభారాన్ని హరింపదలచిన పురాణపురుషుడు. ప్రతియుగంలో ధర్మసంస్థాపనకై వేర్వేరు పేర్లతో వేర్వేరు రూపాలతో అవతరిస్తాడు. ద్వాపర, కలియుగ సంధికాలంలో కృష్ణవర్ణుడై అవతరించి కృష్ణుడనే నామంతో వెలుగుతాడు’ అన్నాడు. కావున వైకుంఠనాథుడైన శ్రీమన్నారాయణుడే కృష్ణుడు. అందుకే మూలంలో వ్యాసులవారు

తతోభక్తిర్భగవతి
పుత్రీ భూతే జనార్దనే।
దంపత్యోర్నితరామానీద్
గోప గోపీషు భారత॥ - (10-8-51)

అన్నారు. ఈ శ్లోకంలో ‘పుత్రీభూత’ అనునది విశిష్టపదం. కృష్ణుడుకాని ఒక వ్యక్తికి కృష్ణునివేషం వేసిన ‘కృష్ణీ కరోతి’ యనునట్లు ఇచ్చట పుత్రీభూతుడైన జనార్దను డనగా జన్మ జరా మరణాలులేని పరిపూర్ణ పరబ్రహ్మమే. మాయను అవిద్యను ఉపాధిగా గొని పుత్రుడుగా మారె నని; అంతేగాని అతడు నిజమైన పుత్రుడుకా దని తెలియజేయుటకే వ్యాసమహర్షి పుత్రీభూత అను ప్రయోగం చేసినాడు.

మగధదేశాధీశుడైన జరాసంధుడు, చేది దేశాధీశుడైన శిశుపాలుడు; కాశీరాజు, రుక్మి, కంసుడు, నరకాసురుడు, సాళ్వుడు, కేశి, ధేనుక, వత్సాసురులు ఇంకా పెక్కుమంది ధర్మహీనులై పరస్పర విరోధంతో పాపాచారులై మదోన్మత్తులై యథేచ్ఛగా విహరిస్తూ ఉండినారు. వీరి భారాన్ని భరించలేక భూదేవి గోరూపధారిణియై త్రివిష్ఠపానికి పరిగెత్తింది. ఇంద్రుడు, బ్రహ్మ మొదలైన ప్రముఖ దేవతలు భూదేవిని ముందిడుకొని విష్ణులోకానికి వెళ్ళినారు. వేదార్థ ప్రతిపాదకమగు వాక్కులద్వారా వినుతించగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైనాడు. బ్రహ్మదేవుడు భూభారాన్ని తగ్గించుమని వేడుకొనగా తానూ యోగమాయా పరతంత్రుడ నని పేర్కొనినాడు విష్ణువు. ఆపై కాలనేమి యను రాక్షసుడే కంసుడని దేవతల కెరిగించి తన సిత, కృష్ణ కేశముల రెండింటిని ధరణి యందు అవతరింపజేసినాడు. ఆ సితాసిత కేశములే కృష్ణార్జునులై జన్మించినారు.

ఏమినోముఫలమొ ఇంత ప్రొద్దొక వార్త
వింటి మబలలార వీను లలర-

అన్నట్లు నోములు ఫలించినవి. వ్రతములకు, క్రతువులకు చిక్కని లీలారతుడు పుత్రీభూతు డైనాడు. మహానందాంగనా డింభకుడుగా జన్మించినాడు. ఇది కృష్ణావతారమునకు నిమిత్తకారణం.

ఉపాధి బేధం చేత శివకేశవాది రూపాలున్నవేగాని ఉపహితచైతన్యం ఏకమై అద్వితీయమై ఉంటుంది. పోతనగారు బాలకృష్ణుని వర్ణన చేస్తూ-

తనువున నంటిన ధరణి పరాగంబు
పూసిన నెఱిభూతి పూత గాఁగ
ముందర వెలుగొందు ముక్తాలలామంబు
తొగలసంగడికాని తునుక గాఁగ
ఫాల భాగంబుపైఁ బరగు కావిరి బొట్టు
కాముని గెల్చిన కన్నుగాఁ గ
కంఠమాలిక లోని ఘననీల రత్నంబు
కమనీయమగు మెడకప్పు, గాఁగ
హారవల్లు లురగహారవల్లు గాఁగ
బాలలీలఁ బ్రౌఢ బాలకుండు
శివుని పగిది నొప్పె శివునికిఁ దనకును
వేఱులేమి దెల్ప వెలయునట్లు.

కృష్ణతత్త్వమే శివతత్త్వం. రూపాన్ననుసరించి నామమేగాని నామానికి ఉనికిలేదు. అనగా కృష్ణతత్త్వం సర్వమయత్వమేగాని ఏకదేశం కాదు. భగవంతుడు సర్వమయుడనటానికి అక్రూరుని వాక్యాలే నిదర్శనం. అక్రూరుడు యమునలో స్నానంచేయటానికి ఉద్యమించగా ఆ జలంలో శేషభోగ పర్యంక మధ్యంలో శ్రీదేవితో కూడిన బ్రహ్మరుద్రాది సంస్తూయమానుడైన పరమపురుషుణ్ణి చూచి చేతులుజోడించి స్తుతించినాడు. ఆపై విష్ణువు తిరోహితుడైనాడు. అక్రూరుడు ఆశ్చర్యచకితుడై నీరు వెడలివచ్చి రథారోహణం చేసినాడు.కృష్ణుడు ఆతనిచూసి చోద్యములేవైన జలంలో కనపడినాయా? నీవు పోయి చాలా తడవయ్యెకదా? అన్నాడు. అప్పుడు అక్రూరుడు కృష్ణునితో

నీ లోనలేని చోద్యము
లేలోకములందుఁ జెప్పరీశ్వర! నీటన్
నేలన్ నింగిని నున్నవె
నీలోఁ జోద్యంబులెల్ల నెగడు మహాత్మా - (10-1237)

అన్నాడు. ఈ సమాధానం కృష్ణుడే పరబ్రహ్మం అనే భావాన్ని వ్యక్తంచేస్తుంది. అందువల్ల -

గోప్యః కామాత్ భయాత్ కంసో
ద్వేషాచ్చైద్యాదయో నృపాః!
సంబంధాత్ వృష్ణయః స్నేహాత్
యూయం భక్త్వా వయం నృప॥ - (7.1.33)

అని నారదుడు ధర్మరాజుతో చెప్పినమాటల్లో భగవంతునితో ఏదోవిధంగా సంబంధం పెట్టుకోవడం పరమావధి యని తెలుస్తున్నది.

అనేక లీలలు చూపే పిల్లల యెడ ఇతరులు స్తుతిస్తారేమోగాని, వారిని తల్లితండ్రులు మాత్రం పసివాడుగానే భావించుట సహజం. కాని కృష్ణుడు సూతికా గృహంలో షోడశకళా పరిపూర్ణుడైన చంద్రునివలె జన్మించినాడు. అప్పుడు ఆ బాలుణ్ణి చతుర్భుజునిగా, అంబుజేక్షణునిగా, శంఖ చక్ర గదాద్యాయుధునిగా, పీతాంబరునిగా, శ్రీవత్స లాంఛనునిగా, కిరీటకుండలధారిగా, వసుదేవుడు చూసినాడు.(10.3.9.) అలా స్వస్వరూపంతో ఆవిర్భూతుడైన భగవంతుని తన బిడ్డ యని మరచి తన్మయత్వంతో వసుదేవుడు ‘విదితోపి భవాన్ సాక్షాత పురుషః ప్రకృతేఃపరః’ (10.3.12.) ఇత్యాదిగా స్తుతించినాడు. అనగా తన బిడ్డను త్రిగుణాత్మకమైన ఈ ప్రకృతికంటే పరమైన పురుషునిగా తెలుసుకున్నట్లే.

దేవకీదేవికూడా కృష్ణుని పరమాత్మగానే భావించింది. తాను జన్మనిచ్చినది ఒక సామాన్య బాలునికి కాదని బిడ్డను-

రూపం యత్తత్ర్పాహురవ్యక్తమాద్యం
బ్రహ్మజ్యోతిర్నిర్గుణం నిర్వికారమ్।
సత్తామాత్రం నిర్విశేషం నిరీహం
సత్వం సాక్షాద్విష్ణురధ్యాత్మదీపః॥ - (10.3.23)

అని స్తుతించింది. సాక్షాత్ విష్ణువే తనకు శిశువుగా జన్మించినాడని గుర్తించింది. ఈ సందర్భంలో వీరరాఘవ వ్యాఖ్య ఇలా ఉన్నది.

“తవతు తద్రూప అనన్యత్వం మృదాత్మకో ఘట ఇతివత్స్వరూపాభేదరూపమితి సాక్షాచ్ఛబ్దాభిప్రేతోzర్థః”

అనగా మృణ్మయమైన ఘటం మృత్తిక కంటే వేరుకానట్లు కార్యకారణ భావ నిబంధనచే శరీరధారి యైన భగవంతుని ఉపాధిసహితునిగా కాక ఉపహిత చైతన్యంగా భావించిరని భావం. ఇది కృష్ణావతారానికి ఉపాదానకారణం.

యథాయథాహి ధర్మస్య
గ్లానిర్భవతి భారత।
అభ్యుత్థాన మధర్మస్య
తదా-త్మానం సృజామ్యహమ్॥

అన్న “ శ్రీభగవానువాచ” కు, కంసాదులద్వారా అనగా కంసుడు తన తండ్రి యగు ఉగ్రసేనుని కారాగారంలో ఉంచుటం వల్ల, దేవకీ గర్భసంజాత శిశుసంహారాదులవల్ల ధర్మానికి హాని ఏర్పడిందని, అధర్మం పెచ్చరిల్లందని అందుకే తా నీ కృష్ణావతారాన్ని గైకొన్నానని అర్థం.

గోకులంలో మృద్భక్షణ చేస్తున్నాడన్న ఆరోపణకు కృష్ణుడు ‘ అమ్మా। మన్నుతినంగ నే శిశువునో, ఆకొంటినో, వెఱ్ఱినో, అన్నాడు. బాలకృష్ణుడు శిశువుగాక మరెవ్వరు? అనగా శిశుత్వాది వికారాలులేని ( గర్భమందుండుట, పుట్టుట, పెరుగుట, వృద్ధినొందుట, క్షీణించుట, నశించుట, అను ఆరింటికి షడ్భావ వికారా లని పేరు.) వానిగా తనను తాను పేర్కొన్నాడు. అది సత్యమని ఎరింగించుటకు యశోదకు విశ్వరూపాన్ని చూపించినాడు. ఆశ్చర్యకరమైన ఆ రూపాన్ని యశోద వైష్ణవమాయగా గుర్తించింది. (బాలు భంగి నితడు భాసిల్లుగాని, సర్వాత్ముఁ డాది విష్ణుండగుట నిజము’ అని నిశ్చయించుకొనింది.

నలకూబర, మణిగ్రీవులు విజ్ఞాన విశారదుండగు నారదుని శాపమున తరువులై ఉండగా, ఉలూఖల బంధితుడైన కృష్ణుడు వాటిని విరిచినపుడు నందాదులైన గోపాలకులువచ్చి చూచి ఆ కుఱ్ఱడగు కృష్ణుడు వాపోవక, వెఱవక, యుండుట కాశ్చర్యముపొందినారు. ఆశనిపాతంలేదు. పెనుగాలి విసరలేదు. మరి తరువులెట్లు కూలెనా యని చర్చించుకున్నారు. కృష్ణుడే తన తీరు ఎవరూ తెలియకుండా ఉండవలెనని గోపవనితల పాణి ధ్వనుల కనుగుణంగా పాడుతూ, యంత్రంవలె డుతూ పరవశుడై చేతులు త్రిప్పుతూ, అప్పుడే మనుషుల్ని చూస్తున్నట్లు చూసి నవ్వుతూ బాల్యక్రీడారతుడై భయం నటిస్తూ ఉండినాడు.

వేదిక బృందావనంగా మారింది. అఘాసురాదుల పీచమణచినాడు. అనగా దుష్టశిక్షణ, శిష్టరక్షణ వ్రతం కొనసాగుతూనేఉంది. కృష్ణునిపై గోపికలకు మధురభక్తి ఏర్పడింది. గోపికలు కారణజన్ములు. కృష్ణుడు సచ్చిదానందస్వరూపుడు. గోపికలు మానవుని అనంతమైన చిత్తవృత్తులకు ప్రతీకలు. పదునాఱువేలు అనుసంఖ్య అసంఖ్యాకము లనుట కొక ప్రతీక మాత్రమే. ఆనందానికే చిత్తం మొగ్గుచూపుతుంది. అందుకే గోపికలు కృష్ణునివైపు ఆకర్షితులైనారు. చిత్తం పరమాత్మ యందు లగ్నమైనప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది. రసోవైసః కదా! జీవుని చిత్తం వస్తువు నాశ్రయించినా ఆ వస్తువు నశిస్తుంది. కాబట్టి జీవునకి దుఃఖమే మిగులుతుంది. అందుకు నిదర్శనంగా గోపికలు తమ సమస్తాన్ని, చివరకు భర్తలను కూడా విడచి కృష్ణునే ఆశ్రయించినారు.

ఈతత్త్వాన్ని అర్ధం చేసికొన్నవారు భాగవత తత్త్వాన్ని అవగాహనచేసికొన్న వారవుతారు. అట్లుగాక అవహేళనకు పూనుకొన్నవారు ఇహపర భ్రష్టు లవుతారు. ఇందులో అవంతకూడా సందేహంలేదు.