పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత సౌరభము : భాగవత - పురుషార్థాలు

ఒకసూర్యుండు సమస్తజీవులకు తానొక్కక్కడై తోచు పో
లిక నే దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ
పకుడై యొప్పుచునుండు నట్టి హరినే ప్రార్థింతు శుద్థుండనై.

ఒకే సూర్యుడు సకల జీవరాసుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కడుగా కనిపిస్తాడు. అట్లేతాను సృష్టించిన అనేకములైన ప్రాణుల హృదయపద్మాలలో నానావిధాలైన రూపాలతో, లీలావిలాసాలతో, భగవంతుడు నిరంతరం ప్రకాశిస్తూ ఉంటాడు. అట్టి భగవంతుణ్ణి పరిశుద్ధులమై ప్రార్థిద్దాం.
కనబడే సూర్యుని దర్శనం స్థూలదృష్టి. కారణం ఆయన ప్రత్యక్ష కర్మసాక్షి. కనబడని భగవంతుని దర్శనం సూక్ష్మదృష్టి. కారణం ఆయన పరోక్ష కర్మసాక్షి. అందుకే ఆ హరికి, సర్వపాప విదారికి నమస్కారం. ఇట్టి ప్రార్థన చేస్తూ మనలో ఆధ్యాత్మిక భావనా భాస్కర తేజాన్ని బలీయం చేసికుందాం.
సాధారణ జీవితం ఒక సరళరేఖ. దాని ఆద్యంతాలు అర్థం, కామం, అంతకుమించి అది ఎదగటంలేదు. కాని ఈ రెండింటిని ఊర్ధ్వ ముఖంగా మళ్ళించి వాటిని ఒకచోట కలపటమే ధర్మం. అప్పుడు అర్థకామాలు అనగా సంపాదనా సుఖాలు ధర్మబద్ధా లవుతాయి. అదే ఆదర్శమార్గం. ఇట్టి ధర్మార్థకామాల మూడింటిని పరివేష్ఠించి యుండే చరమ ఫలమే మోక్షం. ఈ విధంగా ప్రతి జీవి ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే చతుర్విధ పురుషార్థాల సాధనామార్గంలో అచంచలంగా పయనించాలి.
కాని ప్రస్తుత సమాజానికి అర్థమే పరమార్థ మయింది. కామం వికార రూపం ధరించింది. ధర్మం సుదూరంగా నెట్టివేయబడింది. మోక్షం స్మృతి పథంలోనే లేదు. ద్రవ్యార్జనకు ఎట్టి నీచమార్గాన్నైనా ఆశ్రయిస్తోంది. కామసాఫల్యానికి ఎంతటి క్రౌర్యాని కైనా ఒడిగడుతూ ఉంది. ధర్మాన్ని పిసరంత కూడ కనబడనీకుండ భూస్థాపితం చేస్తోంది. ఇక మోక్షమా! అదొక శూన్యవాదం. అర్థరహితమైన అనుభూతి.
ప్రాజ్ఞులు ఈ పురుషార్థాలను వేముఖాల ఘోషించే ప్రయత్నం చేస్తూన్నారు. వాటి స్వరూపం లెస్సగా భావింపజేయడానికే భారత భాగవత రామాయణాది పురాణ కావ్యాలు వ్రాసినారు. భారతం ప్రధానంగా అర్థాన్ని, రామాయణం కామాన్ని, ఎలా ధర్మబద్ధంగ చేయవచ్చునో చెబుతాయి. ఇక భాగవతమేమో మోక్షపురుషార్థాన్ని ప్రభోధిస్తుంది. అందుకే కవు లంటే ఇట్టి ఉత్తమ రచనల్ని చేసినవాళ్ళే. వీరంతా ఋషితుల్యులు. క్రాంతి దర్శిత్వం కలవారు.
శ్రీకృష్ణుడు పరమపదం చేరిన 30 సంవత్సరాల తర్వాత భాద్రపద కృష్ణనవమినాడు శుకమహర్షి పరీక్షుత్తునకు భాగవతాన్ని వినిపించినట్లు తెలుస్తున్నది. కాబట్టి క్రీ.పూ.6 వ శ॥ పూర్వమే భాగవతం రచింపబడి ఉండాలి.
సమాజం ఒక చైతన్య స్రవంతి.అది నిన్న ఉండింది. నేడు ఉంది. రేపటికి ఉంటుంది. భాగవత రచనాకాలం నాటి సమాజం ఎట్లా ఉండేదో అంతగా మనకు తెలీదు. కాని భాగవతంలో ప్రతిబింబించే సమాజం, వర్తమాన కాలానికి ఎలా ఉపకరిస్తుందో చూడటం అవసరం. ప్రధానంగా భాగవతంలో సత్త్వరజస్తమోగుణాలు, జననమరణాలు, భక్తిజ్ఞాన కర్మయోగాలు, ధర్మాధర్మ వివేచన, పారమార్ధికాంశాలు ప్రతిపాదింపబడినాయి. భాగవతంలోని వివిధ పాత్రల తీరుతెన్నుల ఆధారంగా పురుషార్థాల పాత్ర అంచనా వేయవచ్చు.

ధర్మార్థకామమోక్షాణాం
యస్త్వైకో-పి న విద్యతే
అజాగళస్తనస్యేవ
తస్తజన్మనిరర్థకం-

ధర్మం అర్థం కామం మోక్షం అనే వీటిలో ఏ ఒక్కటైనా చక్కగా తెలిసికొని సరైన మార్గంలో నడువలేనివాడు మేక మెడచన్నులా నిరర్థకజన్మ కలవాడని మనపూర్వులు ఏనాడో చెప్పినారు.

ధర్మం:
నారదుడు గత జన్మలో దాసీపుత్రుడు. అడవిలో వచ్చి పోయేవాళ్ళకు నీళ్ళిస్తూ యోగులకు సపర్యలు చేస్తూండేవాడు. ఆ వేదవేత్తలు భుజించగా మిగిలిన అన్నాన్ని తినేవాడు. వారి ఆజ్ఞలు నెరవేర్చుతూ చివరకు జ్ఞానోదయం పొందినాడు. గుణవంతుణ్ణి చూచి సంతోషించడం గుణహీనుణ్ణి కరుణించడం అనే మహత్తర ధర్మం నేర్చుకున్నాడు.
ఉద్ధవుడు ధర్మప్రతిష్ఠాపనకే శ్రీ కృష్ణుడు పుట్టాడని విశ్వసించినాడు. కృష్ణ నిర్యాణానంతరం శ్రీకృష్ణ బోధల్ని ప్రచారంచేసే కార్యంలో నిమగ్నుడైనాడు. కర్దముని భార్య సంతానవతి కాగానే సన్యసించాలనే ధర్మాన్ని గుర్తెరిగింది. అంగుడు దుర్మార్గుడైన కొడుకును, వాడిని వెనుక వేసుకువచ్చే భార్యను త్యజించాలన్న ధర్మాన్ని పాటించినాడు. చిత్రకేతు తనయుడు పునర్జీవితుడయ్యే అవకాశం కలుగుతూ ఉంటే కూడ, అది ధర్మకార్య నిర్వహణకు ప్రతిబంధక మని తలచినాడు. పరశురాముడు తొల్త తండ్రిమాట పాటించి సోదరులను తల్లిని చంపినా, వరము కోరుమన్నప్పుడు స్వార్థచింతన మాని ధర్మబుద్ధితో తనచే నిహితులైన వారిని బ్రతికించుకున్నాడు. అంబరీషుడు ధర్మవీరానికి ప్రతీకగా నిల్చి, అదే మోక్షహేతు వని నిరూపించినాడు. భాగవతారంభంలో శ్రీ కృష్ణుడు శిశురక్షణకు ఉద్యమించినాడు. బాలఘాతుకుడైన అశ్వత్థామను చంపుటకు ఉద్యుక్తుడైన అర్జునునితో ద్రౌపది వెరచినవానిని చంపుట ధర్మము కాదని వారించింది. ధర్మాత్మునకు పశుపక్ష్యాదులు కూడ తోడ్పడుట రాముని పాత్ర ద్వారా, అధర్మవర్తనుని తమ్ము లైనను విడిచివెళ్ళుట రావణుని పాత్ర ద్వారా మనకు తెలుస్తూనే ఉంది.

అర్థం: కాసులు గలవాడు రాజు కావచ్చు. అర్థం లేని బ్రతుకు నిరర్థకం కావచ్చు. కాని ధనం దుర్మతులకు మదం కలిగిస్తూ ఉండగా, ఉత్తమకీర్తులు ఆత్మహితాన్ని మాని పరశ్రేయానికే ఆనందానికే తమ దగ్గర గల ధనమేగాక చివరకు శరీరాన్ని కూడా వ్యయిస్తారు. షిర్డిసాయి ‘తా తిన్నది మట్టిపాలు, పరులకు పెట్టింది తన పాలు’ అన్నాడు. అర్థాన్ని (ధనాన్ని) పరార్థంగా వినియోగించేవారే ధన్యులు. అందుకే ప్రతి మతగ్రంథం దానంచేయవలసిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. క్రైస్తవుల్లో దశమభాగం, ముస్లిముల్లో జికార్తా, హిందువుల్లో నాల్గవవంతు ఇట్టివే.
పరిక్షిత్తు తాను రాజుననే గర్వంతోనే తపోమగ్నుడైన మునిమెడలో సర్పాన్ని వేసినాడు. ద్రుపదుడు బాల్యస్నేహితుడైన ద్రోణుని ‘ధనపతితో దరిద్రునకు’ పొత్తుకుదర దని, నీవెవ్వరో నాకు తెలీదు పొమ్మని అవమానించినాడు. ఇంద్రుడు ఐశ్వర్యమదంచేత గురువులు వస్తే కూడ ఆసనం నుండి దిగని గ్రుడ్డివా డయ్యాడు. కంసుడు ధనంకోసం తండ్రినే చెరసాలలో పెట్టినాడు.
ఐతే పై వ్యక్తులకు భిన్నంగా, అర్థానికి దాసులు కాకుండ, దానిని పరోపకారంగా మళ్ళించిన పూజ్యులూ ఉన్నారు. రంతీదేవుడు అతని ఆలుబిడ్డలు, తమ ఆకలిని సైతం లక్ష్యపెట్టక, దప్పితీర్చుకోవడానికి మిగిలి యున్న నీటినికూడ, దాహం అంటూ వచ్చిన పుల్కసునకు పోసినారు.
ఆపదలో నున్న వారికి సుఖం గూర్చటంకంటే మించిన ధర్మం లేదని విశ్వసించినారు. బలిచక్రవర్తి సిరిమూటకట్టుకొని ఎవ్వడు పోడని, అతిథుల్ని సాక్షాత్తు భగవత్స్వరూపులుగా సంభావించి, వారి కోర్కెలు తీర్చుటలో గల ఆనందం అనుభవించినాడు. కుచేలుడు అర్థార్థియై శ్రీకృష్ణుని యొద్దకు వెళ్ళినా, ఆయన దర్శనంతోనే సర్వం ఒనగూడిన తృప్తితో ఏమికోరకనే వెనుదిరిగి వచ్చినాడు. సుదాముడు.

నీ పాదకమల సేవయు,
నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాం
తాపార భూతదయయును
తాపసమందార! నాకు దయసేయుగదే - అన్నాడు.

కామం: దితి అసురసంధ్య వేళ రతికూడదని భర్త చెప్పినా వినక, బలవంతంగా తన పంతం నెగ్గించుకొని లోకకంటకులైన సుతులకు తల్లి అయ్యింది. పురంజనుడు కామాసక్తితో స్వాతంత్ర్యం కోల్పోయినాడు. పెంపుడుజంతువులా భార్య ఏంచేస్తే అది తానూ చేస్తూ ఆమెకు వశు డైనాడు. అవిద్యతోకూడిన దేహకర్మ కారణంగా, బహుజన్మ బంధాలకు మూలమైనాడు. కామము చేత భ్రష్టాచారుడై శబరకాంతా సంగమంతో తండ్రి యైనాడు. ఉత్తానపాదుడు ఇద్దరు భార్యల్ని కట్టుకొని ఒక్క భార్యపై మాత్రమే మమకార వ్యామోహాలు పెంచుకొన్నాడు. ఆమెచే సవతికొడుకు తన ఎదుటే ఉపాలంభింపబడితే కూడ మౌనం వహించాడు. చ్యవనుడు తాను పుట్టలో నుండగా తెలియక కళ్ళుపొడిచిన స్త్రీని, తనను పెళ్ళి చేసుకుంటే క్షమిస్తానని ఆంక్షలు విధించినాడు. యయాతి తన వార్థక్యాన్ని కుమారుల కిచ్చి, వారి యౌవనాన్ని తాను స్వీకరించి సుఖలోలుపుడు కాదలచినాడు. వసుదేవుడు భార్యలేనిదే బ్రతుకలేని బలహీనతతో కావాలంటే పుట్టిన పిల్లల్ని అందరినీ ఇస్తాను చంపుకో నాభార్యను మాత్రం నాకు వదలు మని కంసుణ్ణి కోరినాడు. రాక్షసులు మోహిని అందాన్ని చూస్తూ అమృతం పంపకంలో ఆమె చేసిన మోసాన్ని గమనించలేకపోయారు.
శ్రీకృష్ణ గోపికల మధ్య ప్రవర్తమానమైన అనురాగం జీవాత్మ పరమాత్మల ఐక్యానుసంధానానికి సాక్ష్యంగా నిలిచింది. అది కామం కాదు. మధుర భావనలతో లౌకిక సుఖానికై తపన చెందిన గోపికలకు కృష్ణుడు నవ్వే సమాధానంగా ఇచ్చి ఆత్మారాముడై వారితో రమించినట్లు పోతన భాగవతం సాక్ష్య మిస్తున్నది. ఇట మలినరహితమైన ప్రేమను, అనుభూతిప్రదమైన తృప్తిని వారి కిచ్చుట ద్వారా కృష్ణుడు సామాన్యులు భావించే శారీరక సుఖానికి భిన్న మైన అనుబంధాన్ని గోపికలతో సాగించినట్లు గుర్తించవలసి ఉంది.
శ్రీ కృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి అనే తిరుగులేని సత్యాన్ని భీష్ముడే ధ్రువీకరించినాడు. కృష్ణుడు శిఖిపింఛమౌళి అగుటయే దానికి ప్రబలమైన సాక్ష్యం. స్త్రీ పుం మయూరాలమధ్య రతిక్రీడ లేదు. ఆడునెమలి అందాన్ని తిలకిస్తూ మగనెమలి బాష్పాలను రాల్చగా, ఆ కన్నీటిబిందువుల్ని తన్మయత్వంతో ఆడునెమలి స్వీకరిస్తుంది. అదే దాని గర్భధారణకు కారణ మవుతుంది. భోగమనగా సర్పం. దానికి శత్రువు నెమలి. భోగశయనునివలె కనిపించినా భోగి (కాళీయుని) గర్వాన్ని అణచినవాడు కృష్ణుడు.
అంతేకాక పంచేంద్రియ స్థానీయులు పాండవులు. వారికి భోగనిధానమైన దేహమే ద్రౌపది. శ్రీకృష్ణుడు పాండవపక్షంలో నిల్చి ద్రౌపదిని రక్షించాడంటే ఇంద్రియాలను అదుపులో ఉంచడం ద్వారా దేహాన్ని కాపాడినా డనుట. ఇట్టి తాత్త్విక భూమిక ద్వారా శ్రీకృష్ణుని పవిత్రత స్పష్టమవుతూ ఉంది. ఇట్టి ఔన్నత్యాన్ని తెలిసికోలేని అల్పజ్ఞులు కృష్ణలీలలకు వికృతార్థాలు తీసి దూయబట్టటం క్షమింపరాని దోషం.

మోక్షం:
జీవిత పరమావధి మోక్షమే సుమా! అని సనాతన ధర్మం ప్రబోధిస్తుంది. మోక్షం తాత్త్వికతా యుక్తమైన భక్తిచేతనే సాధ్యం. భక్తి అనేది ఒక విధమైన చిత్త పరిపాకం. ఆకలిగొన్న లేగదూడ అమ్మ పాలకై అలమటించునట్లు, తల్లి ఒడిలోని పసికూన పాలిండ్లను తడుముటలో పొందు అనిర్వచనీయమైన అనుభూతిలాగ, యువతి మనోహరుని పరిష్వంగ సుఖానికై ఆరాటపడు విధంగా, భక్తుని అంతరాత్మ అఖండజ్యోతి దర్శనానికి, తద్వారా లభించే చిన్మయానందానికి పలవరిస్తుంది.
భాగవతంలోని పాత్రలలో ఖట్వాంగుడు ముహుర్తకాలంలో మోక్షార్హత సంపాదించుకొన్నాడు. తాను బ్రతికేది కేవలం ఏడుదినాలే అని తెలిసి ఆ లోపలే ముక్త సంగులైన మునులబోధల పట్ల పరీక్షుత్తు సంసక్త మనస్కుడైనాడు. కపిలుడు తల్లికే మోక్షకారణమైన తత్త్వాన్ని బోధించినాడు. తత్త్వశూన్యులు సంసార వ్యామోహులు అయినవారి సాంగత్యం మోక్ష ప్రతిబంధకంగా వృత్రాసురుడు పేర్కొనినాడు. మృకండుడు లోకాలను భ్రాంతిలో ముంచుతున్న మాయను తెలిసికొనే జ్ఞానం పొందుటపట్ల ఆసక్తి చూపినాడు.
సర్పయాగం చేసిన జనమేజయుని ఉద్దేశించి నారదుడిలా అంటాడు. "ఒకరు తనను బాధించినారని, తానొకరిని బాధించగలనని భ్రమచెంది జీవి దుఃఖాన్ని తెచ్చుకుంటాడు." కాబట్టి ఈ మాయా వికారాదులకు దూరంగా ఉంటూ ప్రతివ్యక్తి హరిభక్తి పెంపొందించుకోవలసి ఉంది. త్రిపురాసుర సంహారకథ చెప్పిన తరువాత నారదుడు ధర్మరాజుతో వర్ణాశ్రమ ధర్మాలు చెప్పినాడు. అవి 1.సత్యము,2.దయ,3శౌచము, 4.సహనము, 5.దానము, 6జపము, 7.అహింస, 8.సంతోషము, 9.సమభావము, 10.మనోమార్దవము, 11.వృద్ధసేవ, 12.మనోనిగ్రహము, 13.ఇంద్రియ జయము, 14.బ్రహ్మచర్యము, 15.యుక్తాయుక్త వివేకము, 16.ఉపవాసవ్రతాదులు. సూక్ష్మంగా పరిశీలిస్తే ఇవన్నీ ఏ విధంగా మోక్షసోపానాలు కాగలవో తెలుస్తుంది. మోక్షసోపానాలు కాగలవో తెలుస్తుంది. మోక్షాకాంక్షులు పశుసహజ వాంఛలకు, నిష్ఫల క్రియలకు, అధిక ప్రసంగాలకు దూరంగా ఉండాలి.
భాగవత భక్తులలో తమోగుణ ప్రధానుడైన గజేంద్రుడు, రజోగుణ దీప్తుడు ధ్రువుడు, సత్త్వగుణ ప్రకాశుడు ప్రహ్లాదుడు ఉన్నారు. జ్ఞాన తేజులైన ఋషులు, భక్తి నిర్భరులైన మునులు, రక్తిమయులై అభిన్నత కోరిన గోపికలు, వైరంతో భగవత్ర్పాప్తి నొందిన రాక్షసులు కనిపిస్తారు.

ముగింపు:
ధర్మార్ధ కామములు ఆచరించటం మోక్షపథానికి సోపానపంక్తిని నిర్మించుకోవటమే. ధర్మం ఆచరించే సమయంలో వ్యక్తి బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలలో దేని యందుంటాడో ఆ ధర్మాన్ని ఆచరించాలి. బ్రహ్మచారి నిష్ఠతో గురుశిశ్రూష ఆచరించి అధ్యయనం చేయాలి. నైష్ఠిక బ్రహ్మచర్యం నుండి చలిస్తే అది ధర్మం కాదు.
భాగవతంలో గృహస్థుడైన అంబరీషుడు దూర్వాస మునిని ఏకాదశీవ్రత పరిసమాపన వేళ అతిథిగా ఆదరించ దలచుకొన్నాడు. ద్వాదశి ఘడియలు దాటిపోతున్నా నదీ స్నానానికి వెళ్ళిన ముని రాలేదు. అంబరీషుడు ధర్మచర్చ చేసి ‘సలిల భక్షణంబు సమ్మతంబు’ అని తీర్థం మాత్రమే పుచ్చుకొన్నాడు. ఆ పిమ్మట వచ్చిన ముని ‘కుడువ రమ్మని మునుముట్ట కుడిచినాడు, ధర్మభంగంబు జేసి దుష్కర్ముడయ్యె’ నని క్రుద్ధు డైనాడు. తరువాతి కథ ఎట్లున్నా అతిథికన్నా ముందు గృహస్థుడు భోజనం చేయరాదనే ధర్మం ఇట నిర్దేశింపబడింది.
వాన ప్రస్థాన్ని గైకొనేటప్పుడు కూడా సంసారాన్ని అంటిపెట్టుకొన్నవారు దుఃఖాన్ని అనుభవింపక తప్పదు. రాజ్యార్హుడైన కుమారుని నీతికోవిదుణ్ణి జేసి పట్టాభిషిక్తుని చేయనందుకే గదా కంసుడు తన తండ్రిని కారాగారంలో ఉంచి రాజ్యం ఆక్రమించినాడు. ఇట కంసుని క్రూరత్వం అటుంచితే, అతని తండ్రి వ్యామోహమే బంధానికి కారణం అయ్యింది. అంతేగాక పరమ భాగవతోత్తముడైన విదురుడు ‘పుట్టంధువు, గ్రుడ్డివాడవు. . .. నీ పట్టెల్లం జెడిపోయె’ ననువరకు ధృతరాష్ట్రుడు మేల్కొన్నాడా?

దేహము నిత్యముగాదని మోహముఁ దెగఁ గోసి సిద్ధ మునివర్తనుడై గేహము వెలువడు నరుడే ముక్తి సంపదజెందునని భాగవతం ఇట నిశ్చయంగా చెబుతున్నది.
వానప్రస్థంలో సన్యాసధర్మాలు పూర్తి సంసార రహితమై యుంటాయి. సన్యాసికి సంసారంపట్ల వ్యామోహం పుడితే అతడు శ్లేష్మంలో పడ్డ ఈగవలె గిలగిలలాడుతూ, తపశ్శక్తిని కోల్పోతాడు. మీన సంతతిని చూచి, మాయలోపడి, మాంధాతపుత్రికల వరించిన సౌభరియే దీనికి నిదర్శనం. సన్యాసి అంటే జనన జరామరణాది తగులాలు తలపుల్లో లేనివాడని శాస్త్రం.

దేసన్యసాశ్రమధర్మం.

ఈ విధంగా మానవుడు అన్ని దశల్లోనూ ధర్మం ఆచరించాలని భాగవతం ప్రతీక పాత్రలద్వారా ప్రత్యక్షీకరిస్తుంది. ధర్మం ఆచరిస్తూ శరీర పోషణ పట్ల, ఆశ్రితజన పరిరక్షణ కొరకు అర్థం సంపాదించాలి. ధర్మబద్ధమైన అర్థార్జన మోహానికి తావీయదు. ఎప్పుడైనా వాటిని తేలికగా త్యజించే మనఃస్థితిని కలుగజేస్తుంది. రంతిదేవుడు రాజైనా భోగపరాయణుడు కాకుండా తన సంపద నంతా దానంచేసినాడు. భాగవతం ఐహిక అర్థాన్నివిడనాడి, పారమార్థిక అర్థాన్ని సముపార్జించుకొ మ్మని, అనగా మోక్షసామ్రాజ్యం పొంద మని ప్రబోధిస్తుంది. బలిచరిత్ర మిట్టిదే. "విత్త మార్జనచేసి విఱ్ఱవీగుటగాక" యజన, దానాదుల కుపయోగించి కర్మ సంగత్వం పొందక భగవదర్పణ బుద్ధితో మెలగటమే చరమ లక్ష్యం కావలెను.
కామాన్ని ముక్తికి సోపానంగా మలచవలెనంటే దానితో ధర్మాన్ని జోడించాలి. తలపులను అన్యాక్రాంతం కానీయకుండా సాధన చేయాలి. భాగవతం ‘కన్నుదోయికి అన్యకాంతలడ్డమై’ నపుడు మాతృభావంతో మసలుకొమ్మన్నది. మోహినివలలో చిక్కిన శివుడు, ఒక గంధర్వుని రతిక్రీడలను చూచి భర్త కోపానికి గురైన రేణుక, పరుల రతిని జూచి భ్రష్టుడైన అజామిళుడు, ఆధునిక సమాజం యొక్క పోకడలకు హెచ్చరిక పాత్రలు. అట్టి కామాన్ని ఆహార, విహారాది నియమాల ద్వారా అణచి ముక్తిని పొందాలి.
మోక్షం చరమ పురుషార్థం. మానవజన్మ ఉత్తమం. భవహర మగు శ్రీకైవల్యపదంబును పొందుటయే మానవ జీవిత కర్తవ్యం. అందుకు భాగవతం దారిబత్తెం కాగలదు. కావున,

భాసమతులైన భాగవతులారా! పిబత! భాగవతరసం,
భవబంధ విముక్త్యర్థం స్వస్తితే నిత్యమస్తు.