భాగవత సౌరభము : ఆంధ్రమహాభాగవతం - పోతన వ్యక్తిత్వం
పోతనకు గల జనాకర్షణ:
తెలుగుదేశంలో ఏ గ్రామీణ ప్రాంతానికి వెళ్ళినా, ఎవరినోట విన్నా, గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర, వామనావతారం, రుక్మిణీ కల్యాణం మొదలైన ఘట్టాల్లోంచి పద్యాలు కోకొల్లలుగా వినవస్తూ ఉంటాయి. అవి చదువుతూ భక్తిభావతత్పరతతో పొంగిపోతూ ఉంటారు. ఆ అమాయక ప్రజలు ఏ చెట్టు క్రిందనో, ఏ పొలం గట్టుననో, ఏ రచ్చబండ దగ్గఱ, భాగవత సంబంధమైన గోష్ఠులు సాగిస్తూనే ఉంటారు. ఆ చర్చలు వింటూ ఉంటే మనకు తెలియకుండానే కళ్ళుచెమ్మగిల్లుతాయి. కనుకనే పోతన “ప్రజాకవి” అయ్యాడు. ప్రజాహృదయాలను ఎంతగానో ఆకర్షించాడు. ఆయన కున్న అపారజనాకర్షణ అట్టిది.
చెప్పినదానిలో జీవించేలక్షణం:
మాటల కలిమితో నిలబడేవాడు కవి. ఇతరమైన ఎన్నో వర్గాల మనష్యుల కంటె కవి చెప్పిన దానిలో జీవించవలసిన అవసరం ఉంది. అలా రచనకు, జీవితానికి విడివోని లంకె గల వ్యక్తిత్వ మున్న కవులే ఏనాటికైనా స్మరింపబడుతారు. తక్కినవారు ఉప్పెన లాగ పొంగి తాత్కాలికంగా ఎంత గుర్తింపు పొందినా అచిరకాలంలోనే నీటిబుడగలా అదృశ్యమౌతారు. బలమైన వ్యక్తిత్వపు పునాదుల మీద కీర్తిసౌధాన్ని నిలబెట్టుకున్నవాడు పోతన.
గ్రంథాదార వ్యక్తిత్వం:
నేటి కవుల వలె పూర్వు లెవ్వరు తమ వ్యక్తిత్వాలను గూర్చి వ్రాసికొనలేదు, సరికదా తమ శిష్యులతోనో, ఆప్తులతోనో, తమ్ము గూర్చి చెప్పించుకొనే ప్రయత్నం చేయ లేదు. దీనికి పోతన్న అపవాద మేమీ కాదు. మనకు వినవస్తున్న పోతన జీవితం లోని చాల అంశాలు దంతకథల నాశ్రయించినవే. అందలి నిజానిజాలు చాలవరకు సందేహాస్పదాలు. కాబట్టి ఆయన వ్యక్తిత్వం కవితా వ్యక్తిత్వంగా విరాట్ స్వరూపం ధరించి భాగవతంలో ఎలా దర్శనమిస్తుందో చూడటంలోనే ఆయన పవిత్రాత్మకు శాంతిని సంధానించిన వాళ్ళ మవుతాం. అందుకే కవితా గౌరవం భావ గంభీర్యం, ఏ మాత్రం సడలువోక ప్రసక్తవశాన వచ్చిన వివిధ ఘట్టాలలోని కొన్ని పద్యాలు, అవతారికను ఆధారంగా చేసికొని మాత్రమే ఆయన వ్యక్తిత్వాన్ని బేరీజు వేసి పోతన్నకు న్యాయం చేకూర్చుదాం.
భక్తికి పట్టం కట్టిన వైనం:
శ్రీకైవల్యపదంబు చేరుటకై చింతించెదన్,లోకర
క్షైకారంభకు,భక్తపాలన కళాసంరంభకున్, దానవో
ద్రేకస్తంభకు, కేళిలోల విలసత్ దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు,మహానందాంగనా డింభకున్.
ఈ మంగళా చరణ పద్యంతోనే జనన మరణ రహితమైన ముముక్షుత్వాన్ని కోరి పోతన శ్రీ కృష్ణు నాశ్రయించినాడు. ‘మాధవ శేముషీ తరణి సాంగత్యంతో గాక, సుతవధూ మీనోగ్ర వాంచా మద క్రోధోల్లోల విశాల సంస్కృతి’ దాటడం అసాధ్య మని భావించినాడు. భక్తికి కేతన మెత్తిన భాగవత రచనకే త్రికరణ శుద్ధిగా జీవితాన్ని అంకితం చేసినాడు. ఆ భక్తి తన్మయత్వంతోనే భాగవతం ఆద్యంతం రచన సాగించినాడు. ఈ విధంగా ఇహపర సాధనాల రెండింటికి పరమపద సోపానమైన భాగవతాన్ని పోతన ఆంధ్రు లందరికి కాన్క చేసినాడు.
ఈయన స్వయంగా గొప్పభక్తుడు. ఆయనకు హృదయమే శాస్త్రం. విశ్వాసమే మంత్రము. ఆత్మార్పణయే పూజ. ఈయన దృష్టిలో శ్రీమన్నారాయణుడు, శ్రీ కృష్ణుడు, శ్రీరాముడు వేరు వేరు కాదు. అభిన్నులు. ఈయన తన తొలిపూజ వీరికే చెల్లిస్తాడు.
సరస్వతీ సమారాధకత్వం:
ఆపై మిన్నగా పోతన కొలిచే ఇష్టదైవం సరస్వతి. ఆమెను “క్షోణితలంబునన్ ....”, “పుట్టన్ పుట్ట శిరంబునన్ మొలువ....”, “శారద నీరదేందు....”మున్నగు పద్యములలో స్తుతించినాడు. అంతటితో ఆగక “మహత్వ పటుత్వ కవిత్వ సంపద” నిమ్మని “అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ” యైన దుర్గాప్రార్థనలో కూడా భారతీ భావనయే చేసినాడు. ఈయన దృష్టిలో జ్ఞాన స్వరూపిణి యైన ఆ విద్యాదేవియే సంపూర్ణ మానవత్వాన్ని సంధానించే మహత్తరశక్తి. అందుకే ఆమెను ‘అక్షదామ శుక వారిజ పుస్తక రమ్యపాణి’ అంటాడు. ఏ చతుర్విధ పురుషార్థాలనైతే మానవుడు సాయుజ్యము నందుటకై అవశ్యము సాధించవలసి యుంటుందో, వాటికి ప్రతీకగా సరస్వతీమాత తన నాలుగు చేతుల్లోనూ నాల్గు విశిష్ఠ” వస్తువుల్ని పూనింది. అక్షదామం అనగా జపమాల. అది ఏకాగ్రతా సాధనమై మోక్షా న్నిస్తుంది. శుకం అనగా చిలుక. అది మన్మథ వాహన మైన కారణంగా కామ సాఫల్యా న్నిస్తుంది. వారిజం అనగా పద్మం. అది లక్ష్మి ఆవాసస్థాన మై అర్థాన్ని ప్రసాదిస్తుంది. ఇక పుస్తకం మంచిచెడులను వింగడించి ధర్మప్రభోధం చేస్తుంది. అట్టి తల్లిని అంగడిలో వస్తువు వలె అమ్మటానికి ఇష్టపడలేదు, పోతన. “ఓ హాటకగర్భురాణి నిను నాకటికిన్ గొనిపోయి అల్ల కర్ణాట కిరాత కీచకుల క్రమ్మ త్రిశుధ్ధిగ నమ్ము….”మని మధుర మార్ధవమైన మాటలతో ఓదార్చినాడు.
“బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ కూళల కిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటె సత్కవుల్ హాలికులైన నేమి?”యని పవిత్ర సంతృప్తి మిగిలించుకొన్న గుణవంతు డైనాడు. ఈ విధమైన స్వతంత్ర ప్రవృత్తికి గీటురాయిగా నిల్చి పోతన తెలుగుబిడ్డలకు ఆదర్శతేజు డైనాడు. కవిత్రయం తర్వాత తెనుగునాట విశేష కీర్తి ప్రతిష్టలు ఆర్జించుకొన్నాడు. ఆంధ్ర మహాకవుల్లోనే విశిష్ఠ వ్యక్తిత్వం గలవాడై ఆరాధింపబడినాడు.
త్రికాల కవులపట్లవినయం:
“విద్యా దదాతి వినయమ్” అను సూక్తిని పోతన నిలువెల్ల అణువణువున జీర్ణించుకొన్నాడు. నేడు తనకు రాచబాటవంటి సుగమమార్గం ఏర్పడటానికి, ఋషితుల్యు లైన అలనాటి సాహితీ మూర్తుల కృషియే కారణ మనే సత్యాన్ని గ్రహించినాడు. అందుకే వ్యాస వాల్మీకులు, కాళిదాస భారవులు, మాఘబాణులు, నన్నయ తిక్కనలు మున్నగు సంస్కృతాంధ్ర పూర్వకవులను పేరుపేరున పెక్కు విశేషణాలతో సంభావనము చేసినాడు.
అంతటితో ఆగక సమకాలీనుల ప్రజ్ఞను కూడ గుర్తించిన సహృదయుడై వర్తమానకవులకు ప్రియము పల్కినాడు. చివరకు రాబోవు అభ్యుదయాన్ని సైతము మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ భావికవులను బహూకరించినాడు. ఇట్లు క్రాంతదర్శియై నిన్నటిని, నేటిని, రేపటిని విస్మరింపని విశాల మనస్తత్వము గలవా డైనాడు. తెలుగు కవులలో పాల్కురికి సోమన, ఎఱ్ఱనల ప్రభావాలకు తాను లోనైనట్లు గ్రంథంలో ఎన్నో సాక్ష్యా లున్నా వారిని మాత్రం పేర్కొన లేదు. కాగా నన్నయ తిక్కనలను పునరుక్తి దోషం లేకుండా స్మరించినాడు. బహశః ఆ యిర్వురి ప్రక్కన నిలబడ గల శక్తి తనకు మాత్రమే ఉందని ధ్వనింపజేయడమేమో అనిపిస్తుంది.
డబ్బుకు దాసోహం అనలేదు:
అంకితమనేది ఒక ఆరోగ్యకరమైన భావన. అందుకే ఈ నాటికీ ఈ సాంప్రదాయం కొనసాగి వస్తున్నది. కాగా స్వప్రయోజనం కోరి లాభసాటి మార్గంలో కృతిపతి నెన్నుకోనే వాళ్ళ సంఖ్యయే ఎక్కువ. పోతన అట్టి సంకుచిత భావనకు లొంగలేదు. ఈ విషయంలో విప్లవం సృష్టించినాడు. ఎవని కరుణా విశేషణంతో తనకు వాక్కుల కలిమి ప్రాప్తించిందో, ఆ సంపదను ఆ పరాత్పరుని సన్నిధినే ఉంచదలంచినాడు.
ఒకానొక శుభవేళ మహేశ్వర ధ్యానమగ్నుడై యుండగా ఆ రామభద్రుడే ‘కన్నుగవ నెదుర కానబడి నాడు’ ‘మన్నామాంకితబుగా శ్రీ మహాభాగవతంబు తెనుంగు సేయుము” నీకు భవబంధములు తెగు” నని ఆనతి నిచ్చినాడు. ఇంకేమున్నది. సర్వవిశ్వంభరాపూర్ణు డైన ఆ తేజోమయునే విశ్వసించినాడు. తక్కిన మ్రుక్కడి మానేశ్వరులను లెక్కగొనలేదు. లోకహితాకాంక్షియై కల్యాణ సాహితీ కార్యమునకు కంకణము కట్టుకొన్నాడు. అవరోధముల లెక్కగొనక నిడుదాట వెళ్ళినాడు. కృతిపతి నెన్నుకొనుటలో తిరుగులేని నిర్ణయము చేసికొన్నాడు.
ఉ॥
ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే
సమ్మెట వ్రేటులన్ బడక సమ్మతితో హరికిచ్చి చెప్పె నీ
బమ్మెరపోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్.
అని శిలాశాసనమే వేయించినాడు. భౌతిక లంపటత్వము నంటని స్వేచ్ఛామార్గము నెన్నుకొన్నాడు. రాజుల నాశ్రయించి వారి ప్రాపకముతొ అప్పటికే కొందరు కవిసార్వభౌములు అవమానములు నెదుర్కొన్న సంఘటనలు తెలిసికొన్నాడు. కలలో కూడా తన కట్టి దౌర్భాగ్యము దాపురింప రాదని దృఢనిశ్చయము చేసికొన్నాడు. కలవారి నీడ నసహ్యించుకొన్నాడు. ఐహికవిషయ విరాగము, భగవంతుని యందు అనురాగము పెంచుకొన్నాడు.
ఏకేశ్వరోపాసన:
ఆ రోజులలో వీరశైవులు మతావేశంతో శైవులు గాని వారి పట్ల దయాదాక్షిణ్యాలకు దూరులై హింసలు జరుపుతూ ఉండేవారు. అది ఇష్టం లేని దయామూర్తి పోతన్న. శైవసంప్రదాయం పుణికిపుచ్చుకొన్న వీరమహేశ్వర కుటుంబంలో జన్మించినప్పటికి సమదర్శియైన పోతన ‘చేతులారంగ శివుని పూజింప’ వలెనని, ‘నోరు నొవ్వంగ హరికీర్తి నుడువ’ వలెనని శివకేశవుల మధ్య అభేదాన్ని చాటినాడు. సర్వ దేవతామూర్తులను సమాన ప్రతిపత్తితో ఆరాధించినాడు. భగవంతుడు నామరూపరహితుడు, తేజోమయుడు అయినప్పుడు, తమ తృప్తికై ఏర్పరుచుకొన్న నామ రూపముల కారణంగా తగాదాలు అక్కరలే దన్నాడు.
ఆదర్శవతి యైన తల్లి దయాసత్యములను తన సంతానానికి ఉగ్గుపాలతో నేర్పుతుందని, ఏ బిడ్డలు దయాసత్యాల మార్గంలో నడువరో అట్టివారు తల్లుల కడుపున చెడబుట్టినవా రని ఖండితంగా చెప్పినాడు. ఈ దయా సత్యములు పోతన బహిఃప్రాణమును వ్యక్తము చేయు పదగుంఫనాలు. వీటిని రంతిదేవుని కథ, వామన చరిత్రలలో చాల చక్కగా నిరూపణము గావించినాడు.
రచనాధికార ప్రకటన:
భాగవత రచనకు తన కున్న అర్హతను ఎంతో గొప్పగా చమత్కరిస్తాడు - పోతన ఆ పద్య మిది -
ఆ.వె.
భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు
విబుధ వరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు....
ఇక్కడి దళాలన్నీ మనల్ని ఎంతగానో ఆలోచింపచేస్తాయి. పోతన ధ్వని ప్రధానంగా వినయ ప్రకటన చేస్తూనే, మూడులోకాలను మూడుపాదాలతో కొలచిన వామనమూర్తిలా ఎలా ఎదిగిపోతాడో అర్ధం చేసికొంటే ఆశ్చర్యం కలుగుతుంది. సంయమన శీలి యైన పోతన వ్యక్తిత్వం పట్ల మనకు అమితమైన గౌరవం కుదురుకుంటుంది.
తెలియుట శూలిపని. అనగా సర్వజ్ఞుడైన శివుని కార్యం. పలుకుట తమ్మిచూలి పని. అనగా పద్మోద్భవుడైన బ్రహ్మకార్యం. ఈ యిర్వురికీ భాగవతము తెలిసి పలుకుట సాధ్యము కా దన్నాడు. ఇక కథానాయకు డేమో శ్రీమన్నారాయణుడు. ఆయన కథ ఆయనకే తెలిసి పలుక సాధ్యము కాదనుటలో ఔచిత్యము లేదు. అందుకే జాగ్రత్తగా శ్రియఃపతిని వదిలినాడు. ఎదుటవారిని అయోమయంలో పడవేయని స్పష్ట మార్గంలో, భాగవతసారామృతాన్ని తేటతెల్లం చేస్తా నంటున్నాడు. ఈ శక్తి తన కెలా వచ్చిందంటే –“విబుధవరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చి నంత అట...” విబుధ శబ్దంలో మళ్ళీ శ్లేష, బుధు లనగా పండితులు, దేవతలు, సూరివరుల పాదపీఠిలో కూర్చొని నేర్చుకొన్న దని ఒక అర్థం. కావ్యరచనా సందర్భంగా తపస్సదృశ మైన సమాధిలో ఉన్నప్పుడు తనకు దేవతా శ్రేష్ఠులు చెవులలో ఊదినవి, అంతర్నేత్రానికి కనపడేటట్లు చేసినవి అని మరో అర్థం. ఇది ఇట్లుండగా అప్పటికే బహుళ ప్రచారంలో నున్న శ్రీధర వ్యాఖ్యను విన్నాడు. తదేక పఠనా మగ్నుడై సంస్కృత భాగవతంలో వ్యాసహృదయాన్ని కన్నాడు. నిరంతర మననశీలతతో తన మేధస్సుకు ఎన్నో తెలియవచ్చాయి. ఈ విధంగా విన్నంత కన్నంత తెలియవచ్చి నంత -ముప్పేటలుగా ముడిపడిన మూలానికి తెలుగుభాగవతం రాసిలో వాసిలో ఉత్తరోత్తరా బలీయంగా పెరిగింది.
ఒక వ్యక్తికి ఎంత తెలు సన్నది ముఖ్యం కా దని, ఆ తెలిసినది యేకొంత యైనా స్పష్టంగా చెప్పడమే ముఖ్య మని, అదే పరిశోధక లక్షణం అన్నట్లుగా పోతన విశ్లేషించినాడు. నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు సూతు నుద్దేశించి -
కం.
మన్నాడవు చిరకాలము
కన్నాడవు పెక్కులైన గ్రంథార్ధములన్
విన్నాడవు వినదగినవి
ఉన్నాడవు పెద్దలొద్ద నుత్తమ గోష్టిన్.
అని అభినందించిన పద్యంతోనే ఈ సందర్భంలో మనం కూడా పోతన్నకు కైవారం ఒసంగడం సముచితంగా ఉంటుంది.
భాషాసామరస్యం:
పోతనకాలం నాటి కింకా భాషా సంబంధ మైన తగవు లుండేవి కాబోలు. శ్రీనాథుడు కూడా అంతకు పూర్వమే ‘ప్రౌఢి పలికింప’ అనే పద్యంలో ‘నా కవిత్వంబు నిజము కర్ణాటభాష’ అంటూ పెదవి విరచి వెటకారంగా సమాధాన మిచ్చాడు. కాగా నోరు పారవేసుకోలేని పోతన్న మాత్రం -
కం.
కొందరకు తెనుగు గుణమగు
కొందరకు సంస్కృతమ్ము గుణమగు రెండుం
కొందరకు గుణములగు నే
నందర మెప్పింతు కృతుల నాయా యెడలన్.
అంటూ ఉభయ భాషాభిమానుల మెప్పించు పద్ధతిలో తన రచన సాగిస్తానని వినయంగా చెప్పికొన్నాడు. సందర్భశుద్ధిని పాటించి నడిపిననా కవన శిల్పాన్ని గుర్తించం డని అభ్యర్ధించినాడు.
గర్వరహిత కార్యశీలం:
ఒక వ్యక్తి ఏదైనా పనిచేయవలసివస్తే, ఆ పని తన అదృష్ట విశేషం వల్ల తన పాలిట పడినట్లు భావించాలి. అప్పుడే అతడా పనిని తుదముట్టినట్లు నిర్వహించి న్యాయం చేయగలడు. ‘పురాణ రచనకు సమర్థులై నడుముబిగించిన కవిత్రయం భాగవతం కూడా తెనిగించి యుండవచ్చు కదా. వా రాపని చేయ లేదు. అది తన వల్ల జరగా లని దైవనిర్ణయం కాబోలు’ - అని విశ్వసించాడు పోతన. అది తన జన్మసార్థక్యతకు కారణ మౌతుందని -
మ.
ఒనరన్ నన్నయ తిక్కనాది కవులీయుర్విన్ పురాణావళుల్
తెనుగున్ జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో
తెనుగున్ జేయరు మున్నుభాగవతమున్ దీనిని తెనింగించి నా
జననంబున్ సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్।
అన్నాడు. నిజమే తెలుగులో పోతనభాగవతం తర్వాత మరోభాగవతానికి పునర్జన్మ లేదు. ఆ భాగవత పాఠకులకు మలిపుట్టుక లేదు. రచయిత పోతన్నకూ లేదు.
సత్కార్య నిర్వహణకు నడుము బిగించే ఏ వ్యక్తి, అహంకారంతో ఎకాయెకి సాగటం మంచిది కా దనుకొన్నాడు. పెద్దల ఆశీస్సులు తన కార్యసాఫల్యతకు శ్రీరామరక్ష అనుకొన్నాడు. ‘గురు, వృద్ధ, బుధ, బంధుజనుల అనుమతి గైకొన్న తర్వాతనే భాగవతాంధ్రీకరణకు శ్రీకారం చుట్టినాడు.
ఋణత్రయ విముక్తికైన ఆరాధన:
ఈయనకు గల మాతృ పితృ భక్తి మిగుల కొండాడదగినది. తన తండ్రి కేసనమంత్రి ‘బహుకళానిధి, లలితమూర్తి, దాన మాన నీతి ధనుడు, ఘనుడు, సుగుణశీలి, వితరణ మూర్తి, శైవశాస్త్ర సంపన్నుడు’ - అంటూ పెక్కు విశేషణాలతో నుతిస్తాడు. ఇక తల్లి లక్కమాంబ. ‘ఆమె కేసన ధర్మపత్ని. మహా ఇల్లాలు. తన ఇల్లు విడచి పరుల ఇంటికి ఎన్నడు పోయేది కాదు. పతి యాజ్ఞను శిరసావహిస్తూ విబుధుల మన్ననలు మాన్యతలు గైకొన్న సాధ్వి, పరమ పతివ్రత, అన్నపూర్ణకు సమఉజ్జీ’ అని పేర్కొని, అంతటితో ఆగక తన కతి ప్రియమైన అంత్యానుప్రాసతో తన తల్లికి నిలువెత్తు అక్షరముకురం నిర్మించినాడు.
ఉ॥
మానిను లీడుగారు బహుమాన నివారిత దీనమాన
గ్లానికి దాన ధర్మమతి గౌరవ మంజులతా గభీరతా
స్థానికి ముద్దసానికి సదాశివ పాదయు గార్చనానుకం
పానయ వాగ్భవానికిని బమ్మెరకేసయ లక్కసానికిన్।
అంటూ తల్లి నెంతగానో ప్రస్తుతించినాడు. ప్రశంసించినాడు. తనకు జన్మ నిచ్చిన మాతృమూర్తి పట్ల ఆయనకు గల భక్తి ప్రపత్తి అంత గొప్పవి.
పోతన తనకు తాను ‘సాధు నయయుక్తుడు’ గా చెప్పికొన్నాడు. అయినా నిరుపమాన మధురస కవితాధారా ప్రవాహ తరంగమాలికా డోలికలలో చదువరుల నానందింప జేసినాడు. భగవద్భక్తి పారవశ్యమున సాత్త్వికుల నెల్ల నోలలాడించినాడు. వాల్మీకిమహర్షి వలె కారణజన్ము డనబడినాడు. గ్రంధారంభం నందు మోక్షసాధనకు ప్రాధాన్యత నిచ్చినప్పటికి, రచనావిషయంలో ఈయన శ్రద్ధ కనబరచినాడు. అందుకే ఇహాన్ని క్షుద్రంగా భావించి, కేవలం మోక్షం వైపే మొగ్గుచూపక, శృంగారాది రసాలను వర్ణించు సంధర్భంలో కూడ లోకజ్ఞత, నేర్పు కనపరచినాడు. దీని కెన్నేని సాక్ష్యాలు భాగవతం నుండి చూపవచ్చు. నేల విడచి సాముచేయని దక్షత, ప్రజ్ఞ, సంయమనం ప్రత్యక్షరంలోను ప్రత్యక్షీకరించినాడు.
శ్రీ శంకర భగవత్పాదులు ప్రవచించిన అద్వైత భావనను తాను జీర్ణించుకొని. భగవత గ్రంథంలో దాని అతిలోకదర్శనం చేసి, ప్రతిభతో లోకానికి అందించినాడు. అద్వైత సిద్ధాంత రహస్యాలను, సారాన్ని బహు కోణాల నుండి వీక్షించి, లోకానికి తన పవిత్ర రచన ద్వారా సమారాధన చేసిన పునీతుడు. పుణ్యాత్ముడు – పోతన్న.