భాగవత సౌరభము : ఆళ్వారుల సమదర్శనం
నతి:-
అల పన్నిద్దరు సూరులందును, సముద్యల్లీల కాపున్న బె
గ్గలికం దాపము బాపనన్, నిజమనః కంజాత సంజాత పు
ష్కల మాధ్వీక ఝరిన్ మురారి సగియంగా, చొక్కి ధన్యత్ములౌ
ఇల పన్నిద్దరు సూరులన్ దలతు మోక్షేచ్ఛామతిన్ దివ్యులన్.
శ్రీహరి ద్వాదశ ఆదిత్యుల్లో నివసిస్తున్న కారణంగా కొంత తాపానికి గురిఅవుతున్నాడుట. ఆ తాపం పోగొట్టుకోవడానికా అన్నట్లుగా ఆయన ఆళ్వారుల హృదయకమలాల్లో ప్రవేశించినాడు. అచ్చటి భక్తి మకరందాన్ని తృప్తిగా త్రాగుతున్నాడు. ఇది ఆళ్వారుల పరవశత్వానికి కారణం అవుతుంది. అట్టి దేవతా స్వరూపులు, పుణ్యాత్ములు, జ్ఞానులు, అయిన పన్నిద్దరాళ్వారులను శ్రీకైవల్యపదంబు చేరుటకు తన మనోవీధిలో స్మరించినాడు. ఆముక్తమాల్యదా కర్త శ్రీకృష్ణదేవరాయలు.
ఆళ్వారుల జీవితం ఒక అమృతభాండం. దాని ఉపరితలంలో మాత్రమే పరిభ్రమిస్తున్న ఒక పిపీలికాన్నిమాత్రమే నేను. విషయం అతి జటిలం. ‘పలికిన భవహర మగును’ అనేది నా నమ్మకం.
ఆళ్వారు లెవ్వరు?
భక్తి అనే సిద్ధాంజనంచే బద్ధచేతనుల అజ్ఞాన అంధకారాన్ని దూరంచేసి, వారికి జ్ఞాన ప్రకాశాన్ని అందించడానికై ఆ దేవదేవునిచే సృష్టించబడినవారు ఆళ్వారులు. వీరినే దివ్యసూరులు అని కూడా అంటారు. సూరి నగా మోక్షస్థానమైన విష్ణులోకంలో నిలచి నిత్యం శ్రీవత్సలాంఛనుణ్ణి దర్శనం చేసికొనే భగవంతుని పరివారంలోవారు అని అర్థం. అందుకే వీరిని విష్ణుమూర్తి యొక్క వివిధ అంశాలతో జన్మించినవారుగా, ఆ విష్ణువు యొక్క వస్తువాహనాలకు ప్రతిరూపాలుగా విష్ణుభక్తులు విశ్వసిస్తారు.
ఆళ్వారులు భగవంతుని అనుభవం అనే ప్రవాహంలో పరిపూర్ణంగా మునిగితేలినవారు. భగవంతుని సన్నిహితత్త్వాన్ని పరమతీవ్రంగా కాంక్షించినవారు. అందరివలె కర్మబద్ధులైనా భగవంతుని నిర్హేతుక జాయమాన కృపచేత దివ్య అనుగ్రహాన్ని పొందినవారు. ప్రేమకు నెలవైన హృదయంతో ధ్యానసిద్ధిని అందినవారు. శ్రియఃపతియే పరదైవం అనే ప్రగాఢవిశ్వాసంతో జీవించినవారు. తమ వాక్కుల ద్వారా భగవద్వాణిని లోకులకు వినిపించిన ఉపకారులు. ఆ పరాత్పరుని గుణగానంతో తన్మయులై సామాన్యుల్ని కూడా ఆ పరిధిలోనికి చేర్చుకొన్న విశాలహృదయులు.
ఆళ్వారుల కాలం :-
క్రీ.శ. తొలి శతాబ్దాల్లో జైన బౌద్ధాది అవైదికమతాలు తమిళదేశంలో ప్రవేశించి, వైదికధర్మంలోని యజ్ఞయాగాది కలాపాలను, వర్ణవ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించినాయి.ఈ నూతన మతాల మోజులో వైదికమతం అదృశ్యం అవుతుందేమో అనే అనుమానం వచ్చింది. ఇట్టి సంకట పరిస్థితుల్లో ఆశ్వారులు అవతరించారు. వైష్ణవ ప్రపత్తిద్వారా భక్తి ఉద్యమాన్ని పతాకస్థాయికి చేర్చినారు.
మతం సామాన్యుని స్థాయికి చేరాలంటే, అందరికీ దైవీయ జ్ఞానం అందాలంటే తమ బోధలు సులువుగా అర్థమయ్యే ప్రాంతీయభాషల్లో, శ్రవఃపేయమైన గేయరూపంలో ఉండాలని గుర్తించారు. అంతవరకు మతవిషయాలకు ప్రచారవాహికగా ఉండిన సంస్కృతభాషను పరిహరించారు. భక్తిని వేదాంతాన్ని మేళవించి ద్రావిడభాషలో అనేకంగా పాశురాలు ఆలపించారు. అవే తర్వాతి కాలంలో తమిళ దివ్యప్రబంధాలుగా కూర్చబడ్డాయి. తాము జీవించిన కాలం నాటి జాతికి, అవసరమైన భాష, సాహిత్యం, ప్రక్రియాదుల్ని. ఎన్నుకోవటంలో కృతకృత్యులయ్యారు. రాగతాళ లయాత్మకమైన ఛందస్సు ఆధారంగా తమ భావాలను ప్రచారంలోకి తెచ్చి ప్రజాకవు లయ్యారు.ఈ దివ్యసూరుల సమిష్టి కృషి వల్ల ధర్మం పునరుజ్జీవాన్ని పొందింది. అవైదిక మతాలకు ప్రజలమీద పట్టుతొలగింది. ఈ ప్రభావమే తర్వాత తెలుగుపొలంపై తాళ్ళపాక అన్నమాచార్యుల రచనల్లో ప్రతిఫలించింది.సమదర్శన ఆవశ్యకత:-
నయన గోచరమైన ప్రకృతిలో వివిధవర్ణాలు ఆనందాన్ని ఇస్తాయి. కాని ఆ వర్ణాలు మానవుల్లో మాత్రం ఆత్మన్యూనతా భావాలకు, సకల పరాభవాలకు కారణం అవుతున్నాయి. ఇంతటి దుస్సహ చిత్తవికారం మరొక్కటి ఉండదు. ఈ ద్వేషాన్ని ప్రదర్శించేవారి బుద్ధి వక్రగతిలో ఉండటం అట్లుండగా దీనికి గురియైనవారి శీలం కూడ నాశనం కావటమేకాక తరచూ పరిసరాలను నరకకూపంగా మార్చివేస్తుంది. అందుకే మహాత్ములు వసుధైక కుటుంబ స్థాపనలో భగస్వాములై మానవునిలోనే మాధవదర్శనం చేస్తూ ‘తన యందు అఖిల భూతము లందు ఒక భంగి సమహితత్వంబును జరుపువారు’ గా తపించి తరించినారు.
వర్ణసమానత్వ విషయంలో గీతాచార్యుని సందేశమే మనకు ఆవశ్య ఆచరణీయం. ఆయన అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పవలసివస్తే - ధర్మవిజయులై, భీమబలురై, నకులసహదేవులై, మెలిగితే నేను మీ పక్షమే – అంటున్నాడు శ్రీకృష్ణుడు. కాని మనం అధర్మవిజయాకాంక్షులమై కామబలంతో కులసహిత దీను లగుచున్నాం. అచ్యుతునకు దూర మగుచున్నాం. భారతీయతకు తీరని కళంకం ఆపాదిస్తున్నాం.
సర్వ భూతస్థ మాత్మానం
సర్వ భూతాని దాత్మని
ఈక్షతే యోగయుక్తాత్మా
సర్వత్ర సమదర్శనః॥
అంటుంది గీత. దీనినిబట్టి తనను సర్వభూతాలలో ఉన్నవానిగాను, సర్వభూతాలు తనలో ఉన్నవిగాను యోగయుక్తుడై ఎవడు చూస్తాడో అతనికి అంతట సమబుద్ధి ఏర్పడుతుందని తెలుస్తున్నది. నిజమైన సమదర్శనం అంటే ఇదే. అంతేకాక
చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణకర్మ విభాగశః।
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తార మవ్యయం॥
అంటున్నాడు గోవిందుడు. భగవంతుడు గుణకర్మలనుబట్టి జనుల్ని విభజించి సృష్టిక్రియల్ని ఆచరిస్తున్నప్పటికి, ఆయన కర్తృత్వ రహితుడై నిర్వికారుడుగానే ఉంటున్నాడు.- అనటంలో మహనీయులు సంగరహితులై క్రియల్ని ఆచరిస్తారని, వారికి కర్మబంధం ఏమాత్రం అంటదని తెలుస్తూఉంది. ఆళ్వారు లందరు నిస్సంగులై క్రియాయోగంలో నిల్చినవారే. సత్త్వగుణ ప్రధానులై సర్వాత్మనా సమదర్శనాన్ని పాటించిన ఋషితుల్యులే.
పతితులకు బాసటగా ఆళ్వారులు:-
ఆళ్వారులు తమ అపార విజ్ఞానం వల్ల, అమాయకమైన ముగ్ధభక్తి వల్ల, పరమ విశుద్ధమైన వర్తన వల్ల అత్యంత ఆదరణీయమైన గౌరవాలకు పాత్రు లయ్యారు. వీరి మహోపదేశాలు సర్వ శిరోధార్యా లయ్యాయి. వారి మత ప్రబోధం కుల, వర్ణ, వర్గ, పరిధుల్ని దాటి జనహితమై విస్తరించింది. భగవదనుగ్రహం ముక్కు మూసికొని తపస్సు చేసికొనే ఏ కొద్దిమందికి మాత్రమే లబిస్తుం దన్న పాక్షికవిశ్వాసాన్ని పటాపంచలుచేసి, అవ్యాజ భక్తితో శరణుజొచ్చిన అందరికీ సాధ్యం అవుతుందనే సత్యాన్ని స్థాపించినారు. వేదాలను కేవలం పెదవులపై వల్లించేవారు కాక, వేద అధీశునకు తమ హృదయాన్ని సదనంగా చేసినవారే ఉన్నత కులస్థులు అవుతారని చాటినారు. ఈ ప్రబోధంవలన పతితులు,
భ్రష్టులు, శోచనీయస్థితిలో కొట్టుమిట్టాడుతూ నామరూపాలులేకుండా ఉన్నవాళ్ళు తమకూ భగవంతుణ్ణి చేరుకొనే మార్గం ఉందన్న ఓదర్పును, తమలో గూడుకట్టుకున్న నైరాశ్యానికి విముక్తిని పొందినారు.
ఆళ్వారుల వర్ణాలు:-
ఆళ్వారులు భిన్నభిన్న కులాలకు చెందినవాళ్ళు. వారిమధ్య అవగాహన, ఆరాధన, అనుబంధం ఉంది. ఎక్కడైనా కులసంబంధమైన సరిపడని సంగతులు తలెత్తితే వాటిని సహనంతో సద్యః పరిజ్ఞానం తో దాటుకోగలిగినారు. కొన్నిమారులు దేవుడే వచ్చి సమస్యకు కారణమైనవారికి జ్ఞానోదయం కల్గించిన కథనాలు లేకపోలేదు. తిరుప్పణాళ్వారును అగ్రవర్ణంవాళ్ళు రాళ్ళతో కొట్టగా, గుడిలో ఆదెబ్బలు దేవుని నుదుట రక్తపు చారికలు కట్టి కనబడటం, తిరుమళిశై ఆళ్వారును అధమవర్ణుడని అవజ్ఞకు గురిచేసిన విప్రులకు, వేదపఠనం గుర్తురాకుండా చేసి, వారు తప్పుతెలిసికొన్నాక పురాస్మృతి వచ్చునట్లు చేయడం, తొండరడిప్పొడి ఆళ్వారును రక్షించుటానికై భగవంతుడే రాజుదగ్గరకు కలలో రాయభారం వెళ్ళటం మున్నగు అంశాలు దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
లభించిన ఆధారాలను బట్టి చూస్తే పన్నిద్దరాళ్వారుల్లో పొయిఘై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్ లు అయోనిజులు. వరికంకి నుండి పుట్టినట్లు చెప్పబడే తిరుప్పణా ళ్వార్, తులసిపాదునుండి లభించినట్లు తెలియవచ్చే ఆండాళ్ తల్లి ఒకవిధంగా అయోనిజులే. తిరువళిశై ఆళ్వారు తల్లితండ్రులకు కాబట్టక, వెదురుపొదలో విడువబడి, ఒకవేటగాని రక్షణలో పెరిగినాడు. తానే తన పుట్టుకను గూర్చి ‘కులంగళాయ యీరిరండిన్ ఒండ్రిలుం పిరండివేన్’ అని చెప్పుకొన్నాడు.అంటే కులాల నాల్గింటిలో దేని యందును జన్మించనివాడను నేను, అని ఈ మాటకు అర్థం. నమ్మాళ్వార్ శూద్రజాతికి చెందినవాడు. కులశేఖరాళ్వార్ క్షత్రియుడు. తిరుమంగై ఆళ్వారు చతుర్థకులజుడైన ఒక దళపతి కుమారుడు. ఇక అగ్రవర్ణాలవారుగా కనిపించేవారు పెరియాళ్వార్, తొందరడిప్పొడిఆళ్వార్, మధురకవి ఆళ్వారులు మువ్వురే.
ఇక్కడ పెద్దలు మన్నిస్తే ఒకమాట.నిజానికి స్వయంభువుడు, అయోనిజుడు, జనన మరణ రహితుడు ఒక్క భగవంతుడు మాత్రమే కదా। అయితే ఎవరి జన్మ ఇదమిత్థం అని నిర్ణయించలేమో అట్టివారు మహిమోపేతులో, మహోన్నతులో అయి నప్పుడు వారికి అగ్రవర్ణం అంటగట్టుటో లేదా అయోనిజు లనుటో జరుగును. అట్లే ఎవరు సమాజంచే ఛీత్కరింపబడే వాతావరణంలో పుట్టి ఆ పరాత్పరుని అపారకృపకు పాత్రులై అనూహ్య సమధికస్థానం అధిరోహిస్తారో అట్టివారినికూడ ఉన్నత కులస్థులుగా ముద్రవేయటం అసంబద్ధమేమీ కాదు. ఆశ్చర్యం అంతకంటే కాదు. ఋషిమూలం, నదీమూలం తెలిసికోలే మంటారు పెద్దలు. ఈ దృష్టితో చూచి నప్పుడు ఆళ్వారుల్లో కడమజాతులవాళ్ళే ఎక్కువ, వీరి జన్మ ఎలాంటి దైనా స్వయంతీర్ణః పరాన్ స్తారయతి’ ఏకైక లక్ష్యంగా జీవించి జగదాధారాధ్యు లైనారు.
ఒకనాడు పంచముడు వీధుల్లో ఉమ్మివేయడానికి వీల్లేదు. వాడు మూతికి ముంత కట్టుకోవలసి వచ్చింది. నడిచే టప్పుడు వాని పాదముద్రలు భూమిపై పడరాదు. ఆ గుర్తుల్ని తుడుచుకుంటూపోవడానికి నడుముకు కంప కట్టుకున్నాడు. పర్వదినాల్లో ప్రధానవీధుల్లో తిరుగరాదు. అనివార్యమైతే ‘పెద్దింటివాడు వస్తున్నాడయ్యా, తప్పుకోండి’ అంటూ కేకలువేస్తూ వెళ్ళాలి. అప్పుడు ఇతర కులాలవాళ్ళు ఇళ్ళలోనికి వెళ్ళి వాకిళ్ళు వేసికొనేవాళ్ళు. ఈ విధంగా అస్పృశ్యుల్ని అధఃపాతాళానికి త్రొక్కి శూద్రుల్ని వేదబాహ్యుల్ని చేసిన ప్రాచీన సమాజ దమననీతికి సవాలుగా ఆళ్వారుల్లో అన్నికులాలవాళ్ళు ఉన్నారు.కించిత్ దృష్టి గల వాళ్ళకు కనువిప్పు కలిగించారు. వీళ్ళందరు మహిత సద్గుణ ఖనులు. అమలిన ప్రేయోరాశులు. వేదసౌరభ వీచికా వినుత మార్గులు. అతి సామాన్య కుటుంబాల్లో పుట్టి శరణాగతిని ఆశ్రయించి జీవితాలను లీలగా నడిపినవాళ్ళు. ఇక్కడ లీల అంటే అద్భుతం అని కాదు. ఇతరులకు ఉపయోగపడే నిమిత్తం తమకు తామే ఏర్పరుచుకున్న ఒక ఉన్నత జీవన విధానం. అందుకే వారు కారణజన్ములు.
కులరహిత యోగత్రయ ప్రవృత్తులు:-
"లోకాసమస్తా స్సుఖినో భవంతు” అనేది సార్వకాలీన, సార్వజనీన స్వస్తివాచకం. సమాజాన్ని తమ బోధల ద్వారా, రచనలద్వారా ప్రభావితం చేసేవారేకాక, సాధుజీవనం ద్వారా, ఆదర్శవర్తనం ద్వారా ప్రభావితం చేసేవారని కూడ ఆవశ్యం ఆచరింపదగిన మహోన్నత ధర్మం ఇది.
అయితే భిన్నభిన్న జీవనగతులు, విశ్వాసాలు గల లోకుల్ని ఒక బాటలో నడుపగలిగి, ఒకగాట కట్టివేయ గల సామర్థ్యం దేని కున్నట్లు? ఆలోచిస్తే ‘భక్తిః సర్వాధికార’ అనుచో భక్తికి, ‘జ్ఞానాదేవతు కైవల్యమ్’ అనుచో జ్ఞానానికి, కర్మణ్యేవాధికారస్తే’ అనుచో కర్మకు, పీటవేయవలసివస్తుంది. ఇట్టి భక్తి జ్ఞాన కర్మల సమ్యక్ సమ్మేళనం గల చోట ఉచ్ఛ నీచాలకు తావే లేదు. ఈ సత్యాన్ని అచంచలంగా నడిపినవాళ్ళు ఆళ్వారులు. వారు అక్కడే ఆగిపోకుండా ‘ప్రపత్తి’ అనే ఉత్తరోత్తర బలీయ మార్గాన్ని ఎన్నుకొని, దానివల్ల ఏ జీవుడైనా దేవుణ్ణి చేరుకోగల డని ప్రవచించారు.
అహంకార విదూరమై అజ్ఞాతశక్తికి అంజలించేది భక్తి. నిత్యగవేషణ గలదై తన్మూలమైన వేదరహస్యాన్ని అందుకోదగింది జ్ఞానం. కర్తవ్యనిష్ఠ గలదై తదేకమగ్నతతో సాధింపదగింది కర్మ. గురూపదిష్ఠ మార్గంలో సర్వేశ్వరుని యందు సర్వభారం ఉంచటం ప్రపత్తి. ఈ నాల్గింటి పరిపుష్ఠికి అంకితభావం తప్ప, పుట్టుక, పెరుగుదల, విద్య, సంపాదనాదులు పరిగణన లోనికి రానేరావు.
వర్ణ సమైక్యతా భక్తి:-
"తపస్సు, యోగం, అనేవి క్లేశంతో కూడినవి. సంసారవ్యధల్ని తొలగింపజాలవు. పరమపదప్రాప్తికి భక్తియే ఏకైకమార్గం. దానివల్ల లభించే సుఖం స్వర్గం కంటే గొప్పది. కలిమాయా విడంబనానికి దూరం కావాలంటే భక్తియే శరణ్యం. భక్తి గలవాడు నరకం పొందడు. భక్తిహీనుడు తల్లిగర్భానికి కళంకం ఆపాదిస్తాడు. భూమికి బరు వవుతాడు.” – ఈ మాటలు. దివ్యప్రబంధాలనుండి పదేపదే వినవచ్చే హెచ్చరికలు. ఇవి ఆనాటి సమాజంలో భక్తిని మహావటవృక్షంగా పెంచటానికి దోహదం చేసినాయి.
ద్రావిడ పాశురాలు వినేవారికి కష్టపరంపరలు దూర మౌతా యని కులశేఖరాళ్వార్ వక్కాణించగా, మ్రుక్కడి మానవుల్ని గాక సర్వశ్రేష్ఠు డైన భగవంతుణ్ణే కీర్తించ మని నమ్మాళ్వార్ ప్రబోధించినాడు. భగవన్నామం ఒక్కసారి స్మరిస్తే చాలు. ఆయన మనమనస్సుల్లో నివసిస్తా డని పేయాళ్వార్ విశ్వాసం ప్రకటించగా, పురుషోత్తముని పాదపద్మాలే మీకు శరణ్య మని పూదత్తాళ్వార్ హితవు పల్కినాడు. అహర్నిశలు భగవంతుణ్ణి ధ్యానిస్తూ చేతులుజోడించి నమస్కరించే భక్తు లున్న ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎంతో అదృష్టవంతు లని పేయాళ్వార్ తృప్తిగా ప్రశంసించినాడు.
"ఓ మనసా! మూర్ఖులమాట వినకు. గోపాలకృష్ణుని దాస్యం అంగీకరించి ధన్యత్వం పొందు.” అని తిరుమళిశై ఆళ్వారు హెచ్చరించగా, శ్రీకృష్ణుడు గోపకులమధ్య గల సఖ్యభావం పరమ రమణీయ మైందిగా పేయాళ్వార్ వర్ణించినాడు. దీపంలేని చోటు గాక అచ్చమైన భక్తి లేని చోటే చీకటితో నిండింది అవుతుం దని గుర్తుచేసినాడు. ఇట్టి నవవిధ భక్తిమార్గాల వల్ల అప్పుడే ప్రసవమైన దూడ యొక్క దేహమాలిన్యాన్ని సాధువైన గోవు భక్షించి శుద్ధపరచినట్లు భగవంతుడు కూడ తనను ఆశ్రయించిన భక్తుల దోషాలను భోగ్యంగా గ్రహించి, వాత్సల్యంతో దరిజేర్చుకొంటాడు. అనేది ఆళ్వారులు ఋజువు చేసినారు.ఇట్టి భక్తి గల చోట వర్ణసమానత్వం రూపుదిద్దుకోవటంలో ఆశ్చర్యం లేదు.
వర్ణ సమాక్యతా జ్ఞానం:-
"జ్ఞానవాన్ మాం ప్రపద్యతే” అంటాడు గీతాచార్యుడు. భగవంతుణ్ణి ఆశ్రయించిన జ్ఞానం. ప్రార్థన సంస్కారరూపమై భగవంతునిచేతనే ఎన్నుకోబడిన ఉపాధి కూడ కలదై యుంటుంది. పెరియాళ్వార్ పాండ్యరాజు ఆ స్థానంలో విష్ణువునే పరముడుగా స్థాపించటం, నమ్మాళ్వార్ ఎక్కడికీ వెళ్ళకున్నా ఉన్నచోటే సకల దివ్యక్షేత్రాలు సందర్శించగలగటమే కాక ఏనాడూ విద్యాభ్యాసం చేయకపోయినా పరమాద్భుత మాకంద మధుర కవితాధారను జాలువార చేయటం, తార్కాణాలుగా చెప్పవచ్చు. భగవంతుడే స్వయంగా తన దివ్యానుభూతిని ఆళ్వారులకు అందించి వారిచేత పాడించుకొన్నాడా! అన్నంతగా ఆశ్చర్యకర భావాలతో వారి పాశురాలు నిండి ఉన్నాయి.
విజ్ఞానిని నేను గురువుగా భావిస్తాను అంటారు ఆదిశంకరులు. అంటే భగవంతునకు ప్రత్యామ్నాయం గురువే అని, ఆయన పాదపీఠిలో జ్ఞానం పొందాలని అర్థం. అందుకే ఆళ్వారులు ఆచార్యపరంపరను అవిచ్ఛన్నంగా కాపాడుకుంటూ వచ్చినారు. తాము పొందిన దివ్యజ్ఞానతేజంతో పరిసరాలను కూడ ప్రభాపూర్ణంగాను, ప్రతిభావంతంగానూ, ప్రభావితం చేసినారు. అజ్ఞానదశలో అట్టడుగున ఉండే జీవు లందరు, జ్ఞానదశలో సంస్కారులై సమున్నతులు కావాలని త్రికరణశుద్ధిగా, ఆశించినారు. తమ అనుభవాలను జోడించి ఆచరణసాధ్యం చేసినారు. అహర్నిశలు లోకోజ్జీవనానికై పాటుపడినారు. వీరు ఒక్కొక్కమెట్టే అధిగమించుకొంటూ, భగవంతునకు మనిషికి గల సంబంధాన్ని దాటి, ప్రేయసీ ప్రేమికుల తాదాత్మ్యంగా రూపాంతరం చెంది, చివరకు పరమాత్మల అభిన్నతాదర్శన దిశగా ఎదిగి, జ్ఞానం యొక్క పరమావధిని వారి పాశురాల్లో ఆవిష్కరించినారు. విశాల హృదయులై కులాల్ని లెక్కింపక, గుణ సంపన్నులైన జ్ఞాను లందరిని భూషించినారు. సర్వ వర్ణ సమానత్వాన్ని ప్రబోధించినారు.
కులశేఖరాళ్వార్ ‘అయ్యా! నేను వేంకటాద్రి యందు ఒక మెట్టును కాగలిగినచో భక్తుల పాద ప్రహారాల వల్ల ధన్యుడనై ఉండేవాడిని.’ అంటాడు. దైవదర్శనానికై కాలినడకతో మెట్లెక్కుతూ వెళ్ళే భక్తులు ఒక వర్గానికో వర్ణానికో, ఒకవృత్తికో ప్రవృత్తికో చెందినవాళ్ళని చెప్పలేం కదా. ఎవరైతేనేం? వారు భక్తిభావ నిర్భరులైతే చాలు. తవదాస దాసోహమని వారి పాదతాడనాల్ని సైతం సహించే భావం వ్యక్తం చేసినాడు. వారి చరణ ధూళిచే పునీతుడ నౌతాను అనే తిరుగులేని విశ్వాసం ప్రకటించినాడు. ఇదంతా సర్వవర్ణ సమత్వంకాక మరేమిటి? దీనికి పొడిగింపుగానే ఆళ్వారుల తర్వాత రామానుజాచార్యులవారు ‘న జాతిః కారణం లోకే, గుణాః కల్యాణహేతవః’, అని ఉద్ఘాటించి అన్ని వర్గాలవారిని కలుపుకొని ఆళ్వారుల ప్రస్ఫుట పథాన్ని మరింత వేగవంతమూ విశదమూ చేసినారు
వర్ణ సమైక్యతా కర్మ:-
గజేంద్రుడు విష్ణువునకు స్తుతులు చెల్లిస్తూ "నిపుణుడైనవాని నిష్కర్మతకు మెచ్చువానికే నొనర్తు వందనములు” అంటాడు.( పోతనభాగవతం) .
ఎవడు నిపుణుడు, నిష్కర్ముడో అట్టివానిని భగవంతుడు మెచ్చుకుంటాడుట! అట్టి భగవంతునకు నేను నమస్కరిస్తాను అని అర్థం. ఎవడు నిపుణుడు? గాలిలో దీపం పెట్టి నీవే దిక్కు అనే వాడు కాదు. దేవు డిచ్చిన మెదడును కండల్ని, కరగించి కష్టఫలితం పొందాలను కొనేవాడు. ఎవడు నిష్కర్ముడు? ప్రాప్తించిన విజయంతో గర్వించక తన దేమీ లేదు. వెనుక ఒక అజ్ఞాత శక్తి ఉంది. అది అందర్నీ నడిపిస్తున్నది. నేను నిమిత్తమాత్రుణ్ణి అని విశ్వసించే వాడు. ఇక్కడ కర్మాచరణ సూక్ష్మం తెలియజేయబడింది.
తిరుమంగై ఆళ్వారు జీవితం ఈ విధానానికి ప్రబలమైన ఉదాహరణ. ఆయన తొల్త భార్యా ప్రాప్తికై వైష్ణవ తదీయారాధనలో ఆస్తి సర్వస్వం పోగొట్టుకొన్నాడు. లోభుల్ని అవినీతి పరులైన ధనవంతుల్ని కొల్లగొట్టి ఆ పుణ్యకార్యంలో నిమగ్ను డౌతాడు. భక్తులైతే చాలు, వారి కులంతో నిమిత్తం లేకుండా అన్న సంతర్పణ చేసినాడు. అతిథుల్ని అభాగ్యుల్ని సాక్షాత్ విష్ణువుగా భావించినాడు. దారిదోపిడీల్లో ప్రోగుచేసిన ధన మంతా శ్రీరంగ దేవాలయ నిర్మాణానికి వినియోగించినాడు. తానేమో ఐదు గుమ్మాల్లో భిక్షమెత్తిన ఐదు పిడికిళ్ళ ధాన్యంతో జీవితయాత్ర సాగించినాడు. చివరకు శ్రీమన్నారాయణుని చేతనే జ్ఞానభిక్షగా మోక్షమంత్రం పొందినాడు. మొత్తం మీద తిరుమంగై ఆళ్వార్ యొక్క కర్తవ్యనిష్ఠ కర్మయోగ రహస్యాల్ని ఆ విష్కరించింది.
అట్లే నమ్మాళ్వార్ ఒకానొక సందర్భంలో
‘వినుడు విద్వాంసులారా।
మనుగడ సాధింప పనిపాటులను చేయుడు,
స్వేద బిందువులోడ్చి యేల భజించెదరు శ్రీమంతులను,
నిజముగా శ్రీమంతుడెవడు?
ఇలను భజింపుడు ఆ దేవదేవుని”
అనుట కర్మయోగాన్ని అభినందిస్తూ, కర్మయోగుల పక్షాన నిల్చుటే. కర్మసిద్ధాంతాన్ని నమ్మినవారికి లౌకికమైన వర్ణభేదాలు లెక్కలోనికి రావు. వారికి లోకమే కుటుంబం. తొందరడిప్పొడి ఆళ్వార్ దినచర్యలుగా చెప్పబడిన కసవూడ్చుట, నీళ్ళుతెచ్చుట, పల్లకీమోయుట, పూమాలలు కట్టుట, గొడుగు పట్టుట, వీవనవిసురుట, దివ్వెలు వెలిగించుట వంటి పనులు వివిధ వృత్తులవారు కూడ భగవత్కృపకు పాత్రు లగుటయే గాని వేరు కాదు.
వర్ణ సమైక్యతా ప్రపత్తి:-
భక్తి జ్ఞాన కర్మ ప్రపత్తుల్లో ప్రపత్తి ద్వారానే జీవుడు దేవుణ్ణి సులభంగా చేరుకోగలుగుతాడు. ఆచార్య సమాశ్రయణంలో ఈశ్వరునిపై భారం ఉంచటం ప్రపత్తి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదు లందు గాని, దేహ సంబంధులైన బంధువు లందు గాని ప్రీతి లేకుండ, మానవ మాత్రు లెవ్వరో రక్షిస్తా రనే విశ్వాసం కూడ వదలిపెట్టి పరమాత్ముని మీదే తన యోగక్షేమాదుల్ని విడుచుట ప్రపత్తి. ఈ మార్గంలో ఉండే భక్తుడు చాతకపక్షి నేలరాలిన జలాన్ని ఆశించకుండ నేరుగా మేఘంనుండి పడుతున్ననీరు త్రాగటానికి ఏ విధంగా నిరీక్షిస్తుందో ఆ విధంగా భగవంతుని కృపకై వేచి యుంటాడు. అట్లే భక్తుడు భగవద్వియోగాన్ని ఏ మాత్రము సహించలేడు. ఇట్టి శరణాగతివల్ల పశుపక్ష్యాదులకు కూడ ముక్తి కరతలామలకం అంటారు నమ్మాళ్వార్. ఆళ్వారు లందరు సిద్ధాంతపరంగా ధ్రువీకరించిన ఈ మార్గాన్నే మధురభక్తితో మిళితం చేసి తన జీవితాన్నే భగవంతునికి అర్పించింది ఆండాళ్.
ముగింపు:-
ఈ విధంగా ఆళ్వారులందరూ భగవద్గుణ అనుసంధానం, భగవద్వైభవం, జీవోద్ధరణలు తప్ప, వైయుక్తికమైన లేదా ప్రాపంచికమైన విషయాలను గాని, తమ కాలంలో తలెత్తిన రాజకీయాది సంక్షోభాలను గూర్చి గాని , ఏ మాత్రం పట్టించుకోకుండా భక్తి జ్ఞాన కర్మ ప్రపత్తుల ద్వారా సామూహిక శ్రేయస్సు కాంక్షించినారు. తమ మార్గంలో తాము బలంగా నిల్చుట అనే గొప్ప సందేశాన్ని అందించినారు.
"త్వమేవ మాతాచ పితా త్వమేవ,
త్వమేవ బందుశ్చ గురుస్త్వమేవ,
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ,
త్వమేవ సర్వం మమ దేవదేవ”
అనటం ఎంత హాయి. ఎంత బరువును తగ్గించుకోవడం. అందుకే మనందరం దీనికి శ్రుతి కలుపుదాం. శుభమస్తు।
‘జయంతితే సుకృతినో రససిద్ధాః’ హరిజనాః