పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెఱ పోతన చరిత్రము : బమ్మెఱ పోతన చరిత్రము - 3

బమ్మెరపోతన చరిత్రము — ఉత్తరవంశం

మ.
అరిజూచున్ హరిసూచు సూచకములై । యందంద మందారకే
సరమాలామకరంద బిందుసలిల । స్యందంబు లందంబులై
దొరగంబయ్యెద కొంగొకింత దొలగం । దోట్తోశరాసారమున్
దరహాసామృతసారముం గురియుచుం। దన్వంగి కేళీగతిన్.
దశమస్కంథము

మ.
పరుఁ జూచున్ వరుఁ జూచు నొంప నలరింపన్, రోషరాగోదయా
విరతభ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరగం; గన్నులఁ గెంపు సొంపుఁ బరఁగం జండాస్త్రసందోహమున్
సరసాలోక సమూహమున్ నెఱపుచుం, జంద్రాస్య హేలాగతిన్.

నన్నయ తిక్కనాదుల శైలికిని పోతనశైలికిని భేదములు గాన వచ్చుచున్నది. నన్నయాదుల కవిత్వము వ్యాకరణప్రయోగ ఫ్రౌఢిమగల్గి యన్వయకాఠిన్యము గల్గియుండును. పోతనశైలియందు సులభమగు నన్వయమును, బదలాలిత్యమును, శబ్దాలంకారచిత్రములును గలిగి యుండును. మరియు పోతన రచించిన పద్యములలో పాదాంతమునకును, విశ్రమస్థానమునకు పదములు సంపూర్తి జెందుచుండుటచే చదువుట కెంతయు ననుకూలముగానుండును. ఈవిషయనిరూపణమునకై భారత భాగవతములనుండి యుదాహరణము లొసంగుచున్నాడను.

మాలిని
ఏచితల్చిరి తనర్చిన క్రోవుల। నిమ్మగుదావుల జొంపములం
బూచిన మంచియశోకములన్ సుర । పొన్నలబొన్నలగేదగులం
గాచి బెడంగుగబండిన యాసహ । కారములం గదళీతతులం
జూచుచు వీనులకింపెసగన్ వినుచున్ । శుకకోకిలసుస్వరముల్.

కవిరాజవిరాజితము.
చనిచని ముందటనాజ్యహవిర్ధృత । సౌరభదూమలతాతతులం
బెనగినయాకుల కొమ్మలమీద న। పేతలతాంతములైనను బా
యనిమధుపప్రకరంబులజూచి జ । నాధిపుడంత నెఱింగెపో
వనమిదియల్లదె దివ్యమునీంద్రని। వాసము దానగునంచునెదన్.

సీ.
శ్రవణసుఖంబుగా । సామగానంబులు
చదివెడు శుకముల । చదువుదగిలి
కదలక వినుచుండు ।కరులయుగరికర
శీతలచ్ఛాయద । చ్ఛీకరాంబు
కణములచల్లని । గాడ్పాసపడివాని
జెంది సుఖంబున్న। సింహములయు
భూసురప్రవరులు । భూతబలుల్ దెచ్చి
పెట్టునీవారాన్న । పిండతతులు
గడగి భక్షింపనొక్కట । గలసియాడు
చున్న యెలుకపిల్లుల । యొండుసహజ
వైరిసత్వంబులయు సహ । వాసమపుడు
చూచిమునిశక్తి కెంతయు । జోద్యమంది”.
భారతము ఆదిపర్వము ఆ5వకణ్వమహాున్యాశ్రమ వర్ణనము

భాగవతమున,
ఉ.
అందుఁ దమాల సాల వకుళార్జున నింబ కదంబ పాటలీ
చందన నారికేళ ఘనసార శిరీష లవంగ లుంగ మా
కంద కుచందనక్రముక కాంచన బిల్వ కపిత్థ మల్లికా
కుంద మధూక మంజులనికుంజములం దనరారి వెండియున్”.

క.
పరిపక్వఫలభరానత
తరుశాఖానికర నివసితస్ఫుట విహగో
త్కర బహుకోలాహలరవ
భరితదిగంతములు గలిగి భవ్యం బగుచున్.

క.
అతి నిశిత చంచు దళన
క్షత నిర్గత పక్వఫలరసాస్వాదన మో
దిత రాజశుక వచోర్థ
శ్రుతఘోషము సెలఁగ శ్రవణసుఖదం బగుచున్.”

క.
లలితసహకారపల్లవ
కలితాస్వాదన కషాయకంఠ విరాజ
త్కలకంఠ పంచమస్వర
కలనాదము లుల్లసిల్లఁ గడురమ్యములై..

క.
అతుల తమాల మహీజ
ప్రతతిక్షణజాత జలదపరిశంకాంగీ
కృత తాండవఖేలన విల
సితపింఛవిభాసమాన శిఖి సేవ్యంబై.”

తృతీయస్కంథము కర్దమాశ్రమవర్ణనము.
మరియు నీతఁడు భాగవతమును ఆంధ్రీకరించుచు నిట్లు నుడివి యున్నాఁడు.

క.
కొందఱకుఁ దెనుఁగు గుణమగుఁ
గొందఱకును సంస్కృతంబు గుణమగు రెండుం
గొందఱికి గుణములగు నే
నందఱ మెప్పింతుఁ గృతుల నయ్యై యెడలన్.

అని వచించినయట్లు భాగవతమును రచించియుండెను. దశమస్కంధమున శ్రీ కృష్ణావతారఘట్టమును చదువున్నప్పుడు సాధారణముగా సుబోధకముగాను. దానికి వేరుగా నర్ధమును వివరింపవలసిన పని యుండదు.

భాగవతమున నవరసములనును నుచితరీతిని పోషింపబడియున్నవి.
జగన్మోహనావతారఘట్టము, గోపికావస్త్రాపహరణఘట్టము, రాసక్రీడ మున్నగుతావుల శృంగార రసము చిప్పిలుచుండును. నరసింహావతారఘట్టమున రౌద్రము మూర్తీభవించి యుండుటను గమనింపవచ్చును. ఇట్లే అయ్యైయెడల నాయారసములను బాగుగా పోషించి యున్నాఁడు.

పోతనవిరచితభాగములందు పద్యాంతము లతిమనోహరములై యుండును.
ఇందులకు ఉదాహరణములు.
క.
కలఁ డందురు దీనుల యెడఁ,
గలఁ డందురు పరమయోగి గణముల పాలం,
గలఁ డందు రన్నిదిశలను,
గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో.
భాగవతషష్టస్కంథము.

భాగవతములోని యితరభాగముల పూరించినవారెవ్వరును అవలింబింపని పద్ధతులను సింగన యవలంబించియున్నాఁడు.ఈతఁడు తాను భాగవత షష్టస్కంథమును పూర్ణముగా దెనిగించుచుంటి నని వక్కాణించి యున్నాఁడు. ఏకాదశస్కంధములను పూరించినవెలిగందల నారాయణ మున్నగువారు తాము సంపూర్ణముగా స్కంథమును రచించునప్పుడైనను, యిట్లు వక్కాణించియుండలేదు.

ఇందలి మొదటిపద్యము.

శా.
శ్రీవత్సాంకిత కౌస్తుభస్ఫురిత లక్ష్మీచారు వక్షస్థల
శ్రీవిభ్రాజితు నీలవర్ణు శుభరాజీవాక్షుఁ గంజాత భూ
దేవేంద్రాది సమస్తదేవ మకుటోద్దీప్తోరు రత్నప్రభా
వ్యావిద్ధాంఘ్రిసరోజు నచ్యుతుఁ గృపావాసుం బ్రశంసించెదన్.

ఈపద్యమున నాతఁడు నారాయణుని యభినందించియున్నాఁడు. ఇంతియెగాక నీతఁడు హయగ్రీవస్తుతియును, గణపతిప్రార్థనము మున్నగువానిని గావించియున్నాఁడు. మరియు నితడు బమ్మెర పోతరాజు నిట్లభివర్ణించియున్నాఁడు .

ఉ.
ఎమ్మెలు చెప్పనేల? జగమెన్నఁగఁ బన్నగరాజశాయికిన్
సొమ్ముగ వాక్యసంపదలు సూఱలు చేసినవాని భక్తి లో
నమ్మినవాని భాగవత నైష్ఠికుఁడై తగువానిఁ బేర్మితో
బమ్మెఱ పోతరాజుఁ గవిపట్టపురాజుఁ దలంచి మ్రొక్కెదన్.

ఈతఁడు తనకు దివ్యవాణి సాక్షాత్కరించినట్లుగా యీ విధంబున వక్కాణించి యున్నాఁడు.

సీ.
ఉరవడిఁ బ్రాగ్వీథి నుదయించు మార్తాండ;
కోటిబింబచ్ఛాయ గూడినట్లు
హరిహర బ్రహ్మల యాత్మలలో నుబ్బి;
కరుణ యొక్కట మూర్తి బెరసినట్లు
ఖరకర కర తీవ్ర గతినిఁ గరంగుచు;
హేమాద్రి చెంతఁ బె ల్లెగసినట్లు
ఫణిరాజ ఫణరాజి మణిగణ విస్ఫూర్తి;
సుషిరంపు వెలిఁదల చూపినట్లు
లుట్టిపడ్డట్లు కట్టెఱ్ఱ నూఁదినట్లు
తేజ మెసఁగంగ నా మ్రోల దివ్యవాణి
పూని సాక్షాత్కరించి సంపూర్ణదృష్టిఁ
జూచి యిట్లని పలికె మంజులముగాను.

ఈతఁడు యితరులవలెగాక దన వంశానుక్రమణికనుగూడ యిట్లు వక్కాణించి యున్నాఁడు.

సీ.
శ్రీవత్స గోత్రుండు శివభక్తి యుక్తుఁ డా;
పస్తంబ సూత్రుఁ డపార గుణుఁడు
నేర్చూరి శాసనుం డెఱ్ఱన ప్రెగ్గడ;
పుత్రుండు వీరన పుణ్యమూర్తి
కాత్మజుం డగు నాదయామాత్యునకుఁ బోల;
మాంబకు నందను లమితయశులు
కసువనామాత్యుండు ఘనుఁడు వీరనమంత్రి;
సింగధీమణియు నంచితగుణాఢ్యు.
లుద్భవించిరి తేజంబు లూర్జితముగ
సొరది మూర్తి త్రయం బన శుభ్రకీర్తిఁ
బరఁగి రందులఁ గసువనప్రభువునకును
ముమ్మడమ్మను సాధ్వి యిమ్ములను వెలసె.

ఉ.
ఆడదు భర్తమాట కెదురాడదు వచ్చినవారి వీఁడగా
నాడదు పెక్కుభాష లెడనాడదు వాకిలి వెళ్ళి, కల్ల మా
టాడదు మిన్నకేని సుగుణావళి కిందిరగాక సాటి యే
చేడియ లేదు చూరికుల శేఖరు కస్వయ ముమ్మడమ్మకున్.

క.
ఆ కసువయమంత్రికిఁ బు
ణ్యాకల్పశుభాంగి ముమ్మడమ్మ మమున్న
వ్యాకుల చిత్తుల నిరువుర
శ్రీకర గుణగణులఁ బుణ్యశీలురఁ గాంచెన్.

క.
అంగజసమ లావణ్య శు
భాంగులు హరి దివ్యపదయుగాంబుజ విలస
ద్భృంగాయమాన చిత్తులు
సింగయ తెలగయలు మంత్రిశేఖరు లనగన్.

క.
అందగ్రజుండు శివపూ
జం దనరినవాడ విష్ణు । చరితామృత ని
ష్యంది పటువాగ్విలాసా
నందోచితమానసుండ । నయకోవిదుడన్.

ఈతఁడు షష్ఠ్యంతములుగూడ వ్రాసియున్నాడు.

క.
శ్రీపతికి మత్పతికి నుత
గోపతికిఁ ద్రిలోకపతికి గురుజనబుధ సం
తాప నివారణ మతికిని
బ్రాపితసనకాది తతికి బహుతర ధృతికిన్,

భాగవతము నశించినభాగమును పూరించినవారు భాగవతములోని యుత్సన్న భాగముల పూరించినవారిలో సింగన పోతనకవిత్వగమనికలను గమనించియే రచించియున్నాడని దోచుచున్నది. ఈ క్రిందిపద్యములీ విషయమును రూఢిసేయునవిగా నున్నవి.

క.
పుణ్యంబై, మునివల్లభ
గణ్యంబై, కుసుమ ఫల నికాయోత్థిత సా
ద్గుణ్యమయి నైమిశాఖ్యా
రణ్యంబు నుతింపఁ దగు నరణ్యంబులలోన్.

క.
మోదం బై పరిదూషిత
ఖేదం బై శాబరీద్ధ కిలికించిత దృ
గ్భేదం బై బహుసౌఖ్యా
పాదం బై యొప్పు వింధ్యపాదంబునకున్.

క.
విడిచితి భవబంధంబుల
నడఁచితి మాయావిమోహ మైన తమంబు
న్నొడిచితి నరివర్గంబులఁ
గడచితి నా జన్మ దుఃఖ కర్మార్ణవమున్.

క.
పుట్టితి వజు తనువునఁ జే
పట్టితివి పురాణపురుషు భజనము పదముల్
మెట్టితివి దిక్కులం దుది
ముట్టితివి మహాప్రబోధమున మునినాథా!

ఇతడును పోతనవలె షష్ఠస్కంథమును అద్వైతపరముగనే తెనిగించెను.ఇందులకు ఉదాహరణములు.

షష్ఠస్కంథము
సీ.
అఖిల భూతములందు నాత్మరూపంబున;
నీశుండు హరి యుండు నెల్ల ప్రొద్దు
బుద్ధ్యాది లక్షణంబులఁ గానఁబడును మ;
హత్సేవనీయుఁ డహర్నిశంబు
వందనీయుఁడు భక్త వత్సలుం డత్యంత;
నియతుఁడై సతతంబు నియతబుద్ధి
నాత్మరూపకుఁడగు హరికథామృతమును;
గర్ణ పుటంబులఁ గాంక్ష దీరఁ
గ్రోలుచుండెడు ధన్యులు కుటిలబహుళ
విషయ మలినీకృతాంగముల్ వేగ విడిచి
విష్ణుదేవుని చరణారవింద యుగము
కడకుఁ జనుదురు సిద్ధంబు కౌరవేంద్ర!

వ.
దేవా। రజ్జవునందు సర్పభ్రాంతి గలుగునట్లు ద్రవ్యాంతరంబు చేత బ్రహ్మంబైన నీ యందు బ్రబంచభ్రాంతి గలిగెడిని.

వ.
కావున గుణంబులును, గుణియును, భోక్తయును, భోగ్యంబును …. హర్తయు హాస్యంబును నుత్పత్తిస్థితిలయైక కర్తయై సర్వాత్కృష్ణుండైన యప్పరమేశ్వరుండె కాని యన్యంబులేదు.

ఈతఁడును దనకు సహాయముగా శ్రీధరుల వ్యాఖ్యానమునేయూతగొని యున్నాఁ డు. ఇతఁడు భాగవతములోని యితర భాగముల దెనిగించినవారికంటె నెక్కువవాడని బేర్కొనవచ్చును.

గంగన
ఈతఁడు పంచమస్కంధమును దెనిగించెను. ఈతనికవిత్వము సింగన కవిత్వముకంటె దక్కువయని చెప్పవచ్చును . అయినను యితని కవిత్వము లలితముగను సుకుమారముగను నుండును. ఇతఁడు మూలమును సరిగాననుసరింపలేదు. మూలమున నున్నదానిని చాలవరకు తగ్గించినట్లు గనపడుచున్నది. ఈతని ఆంధ్రీకరణమున కుదాహరణములు.

శ్లో
బాణావిమౌ భగవతశ్శతపత్రౌకాంతావపుంఖరుచిరావతితిగ్మదంతతౌ।
కస్మైయుయుక్షంసివనేవిహరన్న విద్మక్షేమాయనోజడధియాంతవలిక్రమోస్తు.

తెనుగు
క.
పొలుపగుచున్న విలాసం
బుల నంగజుబాణములను । బోలెడు నీచం
చల సత్కటాక్షవీక్షణ
ముల నెవ్వని నింతి। చిత్త । మునఁగలచెదవే.
ఈపద్యమున మూలమునందలి విశేషణములు పెక్కులు కానరావు.

శ్లో
శిష్యా ఇమేభగవతః పరితః పఠంతి
గాయంతి సామ సరహాస్యమజస్రమీశః
యుష్మచ్ఛిఖావిలులతాస్సుమనోభివృష్టీః
సర్వేభజంత్యషిగణా. ఇవవేదశాఖాః

చ.
చెదరగవేదముల్ చదువు । శిష్యులపైఁదగ బుష్పవృష్టిస
మ్మదమున వంతలోఁగురియు । మాడ్కిని మన్మథసామగానముల్
చదివెడు శిష్యులో యనఁగ । షట్పదపంక్తులు మ్రోయఁ గావడిం
బదపడి మీదరాలు గచ । భారమునందుల జారుక్రొవ్విరుల్.

రెండవదానియందు మూలార్థరీతి గానుపించదు. పోతనాదుల కవిత్వమునందుగల స్వకపోలకల్పితములగు వర్ణనలు యీతని కవిత్వమున నెందును గానరావు. ఈతడును శ్రీధరులవారి వ్యాఖ్యానమునే సహాయముగా గొనియుండెను. మరియు నీతఁడీ స్కంథమును నద్వైతపరముగనే తెనిగించెను.

వెలిగందల నారయ
ఈతడు ఏకాదశద్వాదశస్కందములను రచించెను. ఈ రెండు స్కందము లును మూలమునకు సరిగానుండక మిగుల క్లుప్తీకరింపబడినవి. కొన్నియెడల మూలమునందలి యభిప్రాయములకు విరుద్ధముగా గూడ నుండును.

ఏకాదశస్కందమున త్రయోదశాధ్యాయమున శ్రీ విష్ణుండు హంస రూపియైచేసిన తత్త్వోపదేశము. “వస్తునోయదా నానాత్వమాత్మనః ప్రశ్న ఈశ్వరః” అను శ్లోకములు గలవు. వానిని ఆంధ్రీకరించునెడల నైదారుపంక్తుల వచనముతో వదలివైచెను. ఈస్కందమున సంస్కృుతంబునగల భిక్షుతాదులు ఆంధ్రమున లేవు. మొత్తముమీద నీ స్కందమున నాల్గవపాలుమాత్రమే తెనిగింపబడినదని చెప్పవచ్చును. మరియు నీ రెండు స్కందములును వ్రాతప్రతులు పరిశీలించిన నెందును అద్వైతపరముగా నాంధ్రీకరింపబడినట్లు దోపదు కాని యచ్చుప్రతులందు స్పష్టముగా నద్వైతపరముగా దెనిగింపబడినట్లు గాన్పించుచున్నది. వ్రాతపతుల పాఠములను గమనించితిమేని యవి రెండును విశిష్టాద్వైతపరముగా దెనిగింపబడినవనుట తెల్లముగాగలదు.

పోతన భాషాంతరీకరణము.
పోతన భాషాంతరీకరణము యెంతవఱకుమూలము ననుసరించి యున్నదో తెలుపుటకు మరికొన్ని యుదాహరణము లిచ్చుచున్నాడను.

శ్లో.
ఆత్మారామశ్చమునయో నిర్గ్రంధా అప్యురుక్రమే
కుర్వంతహైతుకీంభక్తి మిత్థంభూతగుణో హరిః

క.
ధీరులు నిరపేక్షులు నా
త్మారాములునైన మునులు హరిభజనము ని
ష్కారణమ చేయుచుందురు
నారాయణుఁ డట్టి వాఁ, డనవ్యచరిత్రా!

శ్లో
నమః పరస్మై పురుషాయభూయసే
సదుద్భవస్థాననిరోధలీలయా
గృహీతశక్తి త్రితయాయదేహినా
మంతర్భవాయాననపలభ్య వర్త్మనే

మ.
పరుఁడై, యీశ్వరుఁడై, మహామహిముఁడై, ప్రాదుర్భవస్థానసం
హరణక్రీడనుఁడై, త్రిశక్తియుతుడై, యంతర్గతజ్యోతియై,
పరమేష్టిప్రము ఖామరాధిపులకుం బ్రాపింపరాకుండు దు
స్తర మార్గంబునఁ దేజరిల్లు హరికిం దత్త్వార్థినై మ్రొక్కెదన్.

శ్లో
యత్కీర్తనం యత్స్మరణంయదీక్షణం
యద్వందనం యచ్ఛ్రవణం యదర్హణం
లోకస్య సద్యో విధునోతికల్మషం
తస్మైసుభద్రశ్రవసే నమోనమః

ఉ.
ఏ విభువందనార్చనములే విభుచింతయు నామకీర్తనం
బే విభులీల లద్భుతము లెప్పుడు సంశ్రవణంబు సేయ దో
షావలిఁ బాసి లోకము శుభాయతవృత్తిఁ జెలంగు నండ్రు నే
నా విభు నాశ్రయించెద నఘౌఘనివర్తను భద్రకీర్తనున్.

శ్లో
ఏకస్స్వమాయోజగతస్సిసృక్షయా
ద్వితీయయాత్మన్యది యోగమాయయా
సృజస్యదః పాసిపునర్గ్రసిష్యసే
యదోర్ణనాభిర్బగవన్ స్వశక్తిభిః.

క.
ఒకపరి జగములు వెలి నిడి
యొకపరి లోపలికిఁ గొనుచు నుభయముఁ దానై
సకలార్థ సాక్షి యగు న
య్యకలంకుని నాత్మమూలు నర్థిఁ దలంతున్.

శ్లో.
దిదృక్షవోయస్యపదసహి మంగళం
విముక్తిసంగామునయస్సుసాధవః
చఠంత్యలోకవ్రతమవ్రణంవనే
భూతాత్మభూతాస్సుహృదస్సమేగతిః.

ఆ.
ముక్తసంగులైన మునులు దిదృక్షులు
సర్వభూత హితులు సాధుచిత్తు
లసదృశవ్రతాఢ్యులై కొల్తు రెవ్వని
దివ్యపదము వాఁడు దిక్కు నాకు.

శ్లో
కస్యాంశ్చిత్పూతనాయంత్యాం కృష్ణాయంత్యపిబత్త్ససం
తోకయిత్వారుదంత్యన్యాపదాహంచ్ఛకటాయతీం
దైత్యయిత్వాజహారాన్యా మేకా కృష్ణార్బభావనాం
కృష్ణరామాయితే ద్వేతుగోపవత్సయితాః పరాః
వత్సయితాన్ గృహీత్వాన్యాభ్రామయిత్వావ్యపాతయత్
కృష్ణాయితాజఘానాన్యాతత్రై కాంతుబకాయితాం
అహూయ దూరగాయద్వత్కృష్ణస్తమనుకుర్వతీం.

సీ.
పూతన యై యొక్క పొలఁతి చరింపంగ;
శౌరి యై యొక కాంత చన్నుగుడుచు;
బాలుఁడై యొక భామ పాలకు నేడ్చుచో;
బండి నే నను లేమఁ బాఱఁదన్ను;
సుడిగాలి నని యొక్క సుందరి గొనిపోవ;
హరి నని వర్తించు నబ్జముఖియు;
బకుఁడ నే నని యొక్క పడఁతి సంరంభింపఁ;
బద్మాక్షుఁడను కొమ్మ పరిభవించు;
నెలమి రామకృష్ణు లింతు లిద్దఱు గాఁగ
గోపవత్సగణము కొంద ఱగుదు
రసురవైరి ననుచు నబల యొక్కతె చీరుఁ
బసుల మనెడి సతుల భరతముఖ్య!

శ్లో
జయతి తేధికంజన్మనా వజ్ర
శ్రయతయిందిరా శశ్వదత్రహి
దయిత దృశ్యతాందిక్షుతావ కా
స్త్వయిదృతాసవస్త్వాం విచిన్వతే.

క.
నీవు జనించిన కతమున
నో! వల్లభ! లక్ష్మి మంద నొప్పె నధికమై
నీ వెంటనె ప్రాణము లిడి
నీ వా రరసెదరు చూపు నీ రూపంబున్.

శ్లో.
శరదుదాశయే సాధుజాతస
త్సరసిజోదర శ్రీమృషాదృశా
సర తనాధతే శుల్క దాసికా
వరదనిఘ్నతో నేహకిం వధః.

క.
శారదకమలోదరరుచి
చోరకమగు చూపువలన సుందర! మమ్ముం
గోరి వెల యీని దాసుల
ధీరత నొప్పించు టిది వధించుట గాదే?.

శ్లో.
ప్రణతదేహినాం పాపకర్శనం
తృణచరానుగం శ్రీనికేతనం
ఫణిఫణార్పణం తేపదాంబుజం
కృణుకు చేషువః కృంధిహృచ్ఛయం.

ఉ.
గోవుల వెంటఁ ద్రిమ్మరుచుఁ గొల్చినవారల పాపసంఘముల్
ద్రోవఁగఁజాలి శ్రీఁ దనరి దుష్ట భుజంగఫణా లతాగ్ర సం
భావితమైన నీ చరణపద్మము చన్నులమీఁద మోపి త
ద్భావజ పుష్పభల్ల భవబాధ హరింపు వరింపు మాధవా!.

పోతన —వర్ణనములు
ఒకచో వర్ణించినవిషయమునే వర్ణించునెడల పోతనయుత్తరోత్తర మెక్కుడు రసవంతముగా నుండునట్లు వర్ణించును.

ఉ.
అందుఁ దమాల సాల వకుళార్జున నింబ కదంబ పాటలీ
చందన నారికేళ ఘనసార శిరీష లవంగ లుంగ మా
కంద కుచందనక్రముక కాంచన బిల్వ కపిత్థ మల్లికా
కుంద మధూక మంజులనికుంజములం దనరారి వెండియున్.

క.
పరిపక్వఫలభరానత
తరుశాఖానికర నివసితస్ఫుట విహగో
త్కర బహుకోలాహలరవ
భరితదిగంతములు గలిగి భవ్యం బగుచున్.

క.
అతి నిశిత చంచు దళన
క్షత నిర్గత పక్వఫలరసాస్వాదన మో
దిత రాజశుక వచోర్థ
శ్రుతఘోషము సెలఁగ శ్రవణసుఖదం బగుచున్.

క.
లలితసహకారపల్లవ
కలితాస్వాదన కషాయకంఠ విరాజ
త్కలకంఠ పంచమస్వర
కలనాదము లుల్లసిల్లఁ గడురమ్యములై.

క. అతుల తమాల మహీజ
ప్రతతిక్షణజాత జలదపరిశంకాంగీ
కృత తాండవఖేలన విల
సితపింఛవిభాసమాన శిఖి సేవ్యంబై.

క.
కారండవ జలకుక్కుట
సారస బక చక్రవాక షట్పద హంసాం
భోరుహ కైరవ నవక
ల్హార విరాజిత సరోరుహాకర యుతమై.

క.
కరి పుండరీక వృక కా
సర శశ భల్లూక హరిణ చమరీ హరి సూ
కర ఖడ్గ గవయ వలిముఖ
శరభప్రముఖోగ్ర వన్యసత్త్వాశ్రయ మై.

తృతీయస్కందమున జెప్పబడిన యీవర్ణనమును మార్చి పెంచి అష్టమస్కందమున గజేంద్రమోక్షమున త్రికూటమునందలి మహారణ్యము వర్ణించు వచనమున పెంపొందించియున్నాఁడు. ఆ వచనమంతయు నిచ్చట నొసంగిన గ్రంథ విస్తరమగునను తలంపున విరమింపబడియెను.

పోతన – అంత్యానుప్రాసము
పోతన అంత్యానుప్రాసమును యెక్కువగా వాడియున్నాఁడు. క్రియతోనే పద్యము ప్రారంభమైనను యది చక్కని యంత్యప్రాసతో నలరారుచు చదువుటకు ముద్దులు మూటగట్టుచుండును.

శా,
పూరించెన్ హరి పాంచజన్యముఁ, గృపాంభోరాశి సౌజన్యమున్,
భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్,
సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాది రాజన్యమున్,
దూరీభూత విపన్నదైన్యమును, నిర్ధూతద్విషత్సైన్యమున్.

మ.
అటఁ గాంచెం గరిణీవిభుండు నవఫుల్లాంభోజకల్హారమున్
నటదిందిందిర వారముం, గమఠ మీనగ్రాహ దుర్వారమున్,
వట హింతాల రసాల సాల సుమనో వల్లీకుటీతీరముం,
జటులోద్ధూత మరాళ చక్ర బక సంచారంబుఁ గాసారమున్.

మ.
కరుణాసింధుఁడు శౌరి వారిచరమున్ ఖండింపఁగాఁ బంపె స
త్త్వరితాకంపిత భూమిచక్రము, మహోద్యద్విస్ఫులింగచ్ఛటా
పరిభూతాంబర శుక్రమున్, బహువిధబ్రహ్మాండభాండచ్ఛటాం
తరనిర్వక్రముఁ, బాలితాఖిల సుధాంధశ్చక్రముం, జక్రమున్.

మ.
కని రా రాజకుమారికల్‌ పరిమళత్కౌతూహలాక్రాంతలై
దనుజాధీశ చమూవిదారు నతమందారున్ శుభాకారు నూ
తనశృంగారు వికారదూరు సుగుణోదారున్ మృగీలోచనా
జన చేతోధనచోరు రత్నమకుటస్ఫారున్ మనోహారునిన్.

మ.
కనె నక్రూరుఁడు పద్మనేత్రులను రంగద్గాత్రులన్ ధేను దో
హన వాటీగతులన్ నలంకృతుల నుద్యద్భాసులం బీత నీ
ల నవీనోజ్జ్వలవాసులం గుసుమమాలాధారులన్ ధీరులన్
వనితాకాములఁ గృష్ణరాముల జగద్వంద్యక్రమోద్దాములన్.

మ.
జలజాతాక్షుఁడు శౌరి డగ్గఱె మహాసౌధాగ్రశృంగారకం
గలహంసావృతహేమపద్మపరిఖా కాసారకం దోరణా
వళిసంఛాదితతారకం దరులతావర్గానువేలోదయ
త్ఫలపుష్పాంకుర కోరకన్ మణిమయప్రాకారకన్ ద్వారకన్.

మ.
దివిజానీకవిరోధి మ్రొక్కెఁ, గని వాగ్దేవీమనోనేతకున్
సవిశేషోత్సవ సంవిధాతకు, నమత్సంత్రాతకున్, సత్తపో
నివహాభీష్ట వర ప్రదాతకు, జగన్నిర్మాతకున్, ధాతకున్,
వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాతకున్.

క.
కనియెన్ నారదుఁ డంతన్
వినయైక విలాసు నిగమ విభజన విద్యా
జనితోల్లాసున్ భవదుః
ఖనిరాసున్ గురుమనోవికాసున్ వ్యాసున్.

మ.
కనియెం గృష్ణుఁడు సాధునీరము మహాగంభీరముం బద్మకో
కనదాస్వాద వినోద మోద మదభృంగ ద్వంద్వ ఝంకారమున్
ఘనకల్లోల లతావితాన విహరత్కాదంబ కోలాహల
స్వనవిస్ఫారము మందవాయుజ కణాసారంబుఁ గాసారమున్.

మ.
సవరక్షార్థము దండ్రి పంపఁ జని విశ్వామిత్రుఁడుం దోడరా
నవలీలం దునుమాడె రాముఁ డదయుండై బాలుఁడై కుంతల
చ్ఛవిసంపజ్జితహాటకం గపటభాషావిస్ఫురన్నాటకన్
జవభిన్నార్యమఘోటకం గరవిరాజత్ఖేటకం దాటకన్.

ఉ.
పుణ్యుఁడు రామచంద్రుఁ డట పోయి ముదంబునఁ గాంచె దండకా
రణ్యముఁ దాపసోత్తమ శరణ్యము నుద్దత బర్హి బర్హ లా
వణ్యము గౌతమీ విమల వాఃకణ పర్యటనప్రభూత సా
ద్గుణ్యము నుల్లసత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్.

ఉత్తరహరివంశమున ఎఱ్ఱాప్రగడ ఈ అలంకారమును వాడి యున్నాడు.

క.
ధీమంతులంతగాంచిరి
గోమంతము విపినకుసుమ । కుంచితశబరీ
సీమంతము నిర్ఘరకణ
హేమంతము గనకమ । హీమంతంబున్.

క.
చారుశరీరద్యుతిజిత
శారదనీరదుడు ధీవి । శారదుడు భవో త్తారదు డాశ్రితవితతికి
నారదుడు తదీయగృహము । కు నేతెంచెన్.

ఈ అలంకారమునే అనేకవిధములుగామార్చి పోతన వాడియున్నాడు.

క.
భూషణములు వాణికి నఘ
పేషణములు మృత్యుచిత్త భీషణములు హృ
త్తోషణములు కల్యాణ వి
శేషణములు హరి గుణోపచితభాషణముల్.

క .
పావనములు దురితలతా
లావనములు నిత్యమంగళప్రాభవ సం
జీవనములు లక్ష్మీ సం
భావనములు వాసుదేవు పదసేవనముల్

క.
మంతనములు సద్గతులకుఁ
బొంతనములు ఘనములైన పుణ్యముల కిదా
నీంతనపూర్వమహాఘ ని
కృంతనములు రామనామ కృతి చింతనముల్.

క.
ధృతిచెడి లోఁబడె మల్లుం
డతులిత భవజలధితరికి హతరిపు పురికిన్
జితకరికిన్ ధృతగిరికిం
దత హరిరవ భరిత శిఖరిదరికిన్ హరికిన్.

క.
స్ఫురితవిబుధజన ముఖములు
పరివిదళిత దనుజనివహపతి తనుముఖముల్
గురురుచి జిత శిఖిశిఖములు
నరహరిఖరనఖము లమరు నతజనసఖముల్.

చ.
చనిచని కాంచిరంత బుధసత్తము లంచిత నిత్య దివ్యశో
భన విభవాభిరామముఁ బ్రపన్నజనస్తవనీయ నామమున్
జనన విరామమున్ సుజన సన్నుత భూమము భక్తలోకపా
లన గుణధామముం బురలలామముఁ జారువికుంఠధామమున్.

చ.
మనమున మోదమందుచు నుమాతరుణీమణి గాంచె దారు మృ
త్కనక కుశాజినాయస నికాయ వినిర్మిత పాత్ర సీమము
న్ననుపమ వేదఘోష సుమహత్పశు బంధన కర్మ భూమమున్
మునివిబుధాభిరామము సముజ్జ్వల హోమము యాగధామమున్.

ఉ,
భాసురలీలఁ గాంచిరి సుపర్వులు భక్తజనైక మానసో
ల్లాసముఁ గిన్నరీజన విలాసము నిత్యవిభూతి మంగళా
వాసము సిద్ధ గుహ్యక నివాసము రాజత భూవికాసి కై
లాసముఁ గాంతి నిర్జిత కులక్షితిభృత్సుమహద్విభాసమున్.

గీర్వాణపదముల — భూయిష్ఠము — సప్తమస్కందము
క.
అడిగెద నని కడువడిఁ జను;
నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్;
వెడవెడ సిడిముడి తడఁబడ
నడు గిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్.

క.
నిగమములు వేయుఁ జదివిన
సుగమంబులు గావు ముక్తిసుభగత్వంబుల్
సుగమంబు భాగవత మను
నిగమంబుఁ బఠింప ముక్తినివసనము బుధా!"

సింగన కూడ నీ యలంకారమును అనుసరించియున్నాడు.

మ.
కనియెన్ బ్రాహ్మణుఁ డంత్యకాలమున వీఁకన్ రోషనిష్ఠ్యూతులన్
ఘనపీనోష్ఠ వికారవక్త్ర విలసద్గర్వేక్షణోపేతులన్
జన సంత్రాస కరోద్యతాయత సుపాశశ్రేణికా హేతులన్
హననవ్యాప్తి విభీతులన్ మువుర నాత్మానేతలన్ దూతలన్.

శా.
హాలా ఘూర్ణిత నేత్రతో మదన తంత్రారంభ సంరంభతో
ఖేలాపాలన యోగ్య భ్రూవిభవతోఁ గీర్ణాలకాజాలతో
హేలాలింగన భంగి వేషవతితోఁ నిచ్ఛావతీమూర్తితోఁ
గేళిం దేలుచునున్నవానిఁ గనెఁ బుంఖీభూత రోమాంచుఁడై.

ప్రధమస్కందము- పోతన
మ.
త్రిజగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ బ్రాభాత నీ
రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.

మ.
హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై
రయజాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో
జయముం బార్థున కిచ్చువేడ్క నని నాశస్త్రాహతిం జాల నొ
చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్.

మ.
నరుమాటల్ విని నవ్వుతో నుభయసేనామధ్యమక్షోణిలో
బరు లీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచుం
బరభూపాయువు లెల్లఁ జూపులన శుంభత్కేళి వంచించు నీ
పరమేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుఁడై.

క.
తనవారిఁ జంపఁజాలక
వెనుకకుఁ బో నిచ్చగించు విజయుని శంకన్
ఘన యోగవిద్యఁ బాపిన
మునివంద్యుని పాదభక్తి మొనయున్ నాకున్.

సీ.
కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి;
గగనభాగం బెల్లఁ గప్పికొనఁగ;
నుఱికిన నోర్వక యుదరంబులో నున్న;
జగముల వ్రేఁగున జగతి గదలఁ;
జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ;
బైనున్న పచ్చనిపటము జాఱ;
నమ్మితి నాలావు నగుఁబాటు సేయక;
మన్నింపు మని క్రీడి మరలఁ దిగువఁ;
గరికి లంఘించు సింహంబుకరణి మెఱసి
నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు
విడువు మర్జున యనుచు మద్విశిఖ వృష్టిఁ
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.

మ.
తనకున్ భృత్యుఁడు వీనిఁ గాఁచుట మహాధర్మంబు వొమ్మంచు న
ర్జునసారథ్యము పూని పగ్గములు చేఁ జోద్యంబుగాఁ బట్టుచున్
మునికోలన్ వడిఁ బూని ఘోటకములన్ మోదించి తాడించుచున్
జనులన్మోహము నొందఁ జేయు పరమోత్సాహుం బ్రశంసించెదన్.

క.
పలుకుల నగవుల నడపుల
నలుకల నవలోకనముల నాభీరవధూ
కులముల మనముల తాలిమి
కొలుకులు వదలించు ఘనునిఁ గొలిచెద మదిలోన్.

ఆ.
మునులు నృపులుఁ జూడ మును ధర్మజుని సభా
మందిరమున యాగమండపమునఁ
జిత్రమహిమతోడఁ జెలువొందు జగదాది
దేవుఁ డమరు నాదు దృష్టియందు.

మ.
ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై.

షష్ఠస్కందము—సింగన
సీ.
బ్రహ్మహత్యానేక పాపాటవుల కగ్ని;
కీలలు హరినామ కీర్తనములు;
గురుతల్ప కల్మష క్రూరసర్పములకుఁ;
గేకులు హరినామ కీర్తనములు;
తపనీయ చౌర్య సంతమసంబునకు సూర్య;
కిరణముల్ హరినామ కీర్తనములు;
మధుపాన కిల్బిష మదనాగ సమితికిఁ;
గేసరుల్ హరినామ కీర్తనములు;
మహిత యోగోగ్ర నిత్యసమాధి విధుల
నలరు బ్రహ్మాది సురలకు నందరాని
భూరి నిర్వాణ సామ్రాజ్య భోగభాగ్య
ఖేలనంబులు హరినామ కీర్తనములు;

సీ.
ముక్తికాం తైకాంత మోహన కృత్యముల్;
కేలిమై హరినామ కీర్తనములు;
సత్యలోకానంద సౌభాగ్యయుక్తముల్;
కేలిమై హరినామ కీర్తనములు;
మహిత నిర్వాణ సామ్రాజ్యాభిషిక్తముల్;
కేలిమై హరినామ కీర్తనములు;
బహుకాల జనిత తపఃఫల సారముల్;
కేలిమై హరినామ కీర్తనములు;
పుణ్యమూలంబు లనపాయ పోషకంబు
లభిమతార్థంబు లజ్ఞాన హరణ కరము
లాగమాం తోపలబ్దంబు లమృతసేవ
లార్తశుభములు హరినామ కీర్తనములు.

దశమస్కందము—ఉత్తరభాగము—పోతన
సీ.
కుచకుంభములమీఁది కుంకుమతో రాయు;
హారంబు లరుణంబు లగుచు మెఱయఁ;
గరపల్లవము సాఁచి కదలింప నంగుళీ;
యక కంకణప్రభ లావరింపఁ;
గదలిన బహురత్న కలిత నూపురముల;
గంభీర నినదంబు గడలుకొనఁగఁ;
గాంచన మణికర్ణికా మయూఖంబులు;
గండపాలికలపై గంతు లిడఁగఁ;
గురులు నర్తింపఁ బయ్యెద కొంగు దూఁగ;
బోటిచే నున్న చామరఁ బుచ్చుకొనుచు
జీవితేశ్వరు రుక్మిణి సేర నరిగి
వేడ్క లిగురొత్త మెల్లన వీవఁ దొడఁగె.

వ.
అప్పుడు.

మ.
పతి యే రూపము దాల్చినం దదనురూపంబైన రూపంబుతో
సతి దా నుండెడు నట్టి రూపవతి నా చంద్రాస్య నా లక్ష్మి నా
సుతనున్ రుక్మిణి నా యనన్యమతి నా శుద్ధాంతరంగం గళా
చతురత్వంబున శౌరి యిట్లనియెఁ జంచన్మందహాసంబుతోన్.

మ.
బలశౌర్యంబుల భోగమూర్తి కులరూపత్యాగ సంపద్గుణం
బుల దిక్పాలురకంటెఁ జైద్యముఖరుల్‌ పూర్ణుల్‌ ఘనుల్‌; వారికిన్
నెలఁతా! తల్లియుఁదండ్రియుం సహజుఁడున్ నిన్నిచ్చినంబోక యీ
బలవద్భీరుల వార్ధిలీనుల మముం బాటింప నీ కేటికిన్?.

సీ.
లోకుల నడవడిలోని వారము గాము;
పరులకు మా జాడ బయలు పడదు;
బలమదోపేతులు పగగొండ్రు మా తోడ;
రాజపీఠములకు రాము తఱచు;
శరణంబు మాకు నీ జలరాశి సతతంబు;
నిష్కించనుల మేము; నిధులు లేవు;
కలవారు చుట్టాలు గారు; నిష్కించన;
జనబంధులము; ముక్తసంగ్రహులము.
గూఢవర్తనులము; గుణహీనులము; భిక్షు
లైన వారిఁ గాని నాశ్రయింప;
మిందుముఖులు దగుల; రిటువంటి మముబోఁటి
వారి నేల దగుల వారిజాక్షి!.

క.
సిరియును వంశము రూపును
సరియైన వివాహసఖ్య సంబంధంబుల్‌
జరుగును; సరి గాకున్నను
జరగవు; లోలాక్షి! యెట్టి సంసారులకున్.

క.
తగదని యెఱుఁగవు మమ్ముం
దగిలితివి మృగాక్షి! దీనఁ దప్పగు; నీకుం
దగిన మనుజేంద్రు నొక్కనిఁ
దగులుము; గుణహీనజనులఁ దగునే తగులన్?.

చ.
అలికుల వేణి తన్నుఁ బ్రియుఁ డాడిన యప్రియభాష లిమ్మెయిన్
సొలవక కర్ణరంధ్రముల సూదులు సొన్పిన రీతిఁగాఁగ బె
బ్బులి రొద విన్న లేడి క్రియఁ బొల్పఱి చేష్టలు దక్కి నేలపై
వలనఱి వ్రాలెఁ గీ లెడలి వ్రాలిన పుత్తడిబొమ్మ కైవడిన్.

వ.
ఇట్లు వ్రాలిన.

మ.
ప్రణతామ్నాయుఁడు కృష్ణుఁ డంతఁ గదిసెన్ బాష్పావరుద్ధారుణే
క్షణ విస్రస్త వినూత్నభూషణ దురుక్తక్రూర నారాచ శో
షణ నాలింగితధారుణిన్ నిజకులాచారైక సద్ధర్మ చా
రిణి విశ్లేషిణి వీతతోషిణిఁ బురంధ్రీగ్రామణిన్ రుక్మిణిన్.

సీ.
కని సంభ్రమంబునఁ దనువునం దనువుగా;
ననువునఁ జందనం బల్ల నలఁది
కన్నీరు పన్నీటఁ గడిగి కర్పూరంపుఁ;
బలుకులు సెవులలోఁ బాఱ నూఁది
కరమొప్ప ముత్యాలసరుల చి క్కెడలించి;
యురమునఁ బొందుగా నిరవుకొలిపి
తిలకంబు నునుఫాలఫలకంబుపైఁ దీర్చి;
వదలిన భూషణావళులఁ దొడిగి.
కమలదళ చారు తాలవృంతమున విసరి
పొలుచు పయ్యెదఁ గుచములఁ బొందుపఱిచి
చిత్త మిగురొత్త నొయ్యన సేదఁదీర్చి
బిగియఁ గౌఁగిటఁ జేర్చి నె మ్మొగము నిమిరి.

సీ.
నీరదాగమమేఘనిర్యత్పయః పాన;
చాతకం బేగునే చౌటి పడెకుఁ?
బరిపక్వ మాకంద ఫలరసంబులు గ్రోలు;
కీరంబు సనునె దుత్తూరములకు?
ఘనర వాకర్ణనోత్కలిక మయూరము;
గోరునే కఠిన ఝిల్లీరవంబుఁ?
గరికుంభ పిశిత సద్గ్రాస మోదిత సింహ;
మరుగునే శునక మాంసాభిలాషఁ
బ్రవిమలాకార! భవదీయ పాదపద్మ
యుగ సమాశ్రయ నైపుణోద్యోగచిత్త
మన్యుఁ జేరునె తన కుపాస్యంబు గాఁగ?
భక్తమందార! దుర్భర భవవిదూర!