పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అవతార మీమాంస : కూర్మావతారము

  కూర్మావతారము దైవరాజ్యావతారమై యున్నది. ఒకానొకప్పుడు దైవీశక్తి అసురీశక్తివలన ఓడింపబడెను. దీనివలన ప్రపంచమునందు అధర్మము పెరిగిపోయెను. అపుడు భగవంతుడు దేవతలతో “మీరు రాక్షసులతో సంధిచేసుకొని, యిరువురును కలిసి సముద్రమును మధించుడు, దానినుండి వెలువడెడి అమృతమును త్రాగినయెడల మీరు జయించి ధర్మమును పునఃస్థాపన మొనర్చగలరని” చెప్పెను. అటులనే సముద్రమును మధించునపుడు మందర పర్వతము క్రిందికి కృంగిపోవుచుండగా భగవానుడు కూర్మరూపమును ధరించి ఆ పర్వతమును తన వీపుపై నిడుకొని కాపాడెను. అపుడు లక్ష్మి, పారిజాతము, ధన్వంతరి, అమృతము మొదలగునవి ఉద్భవించెను. ప్రపంచమునందు సహితము రెండు విరుద్ధ శక్తుల సంఘర్షణ వలననే ఏదైన కార్యము జరుగును. కాని, దాని సామంజస్యమును కాపాడుటకొరకు ధర్మశక్తి వానిని తన వీపుపై ధరించినపుడే, ఉత్తమ వస్తువులన్నియు ఉద్భవించును.