పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అవతార మీమాంస : అవతార విషయము వేదశాస్త్రములందు గలదా?

  శతపథబ్రాహ్మణము కా 1, అ 8, బ్రా 1, కండిక 1, 6 లో మాయావతారమును గురించి బాగుగా వర్ణింపబడియున్నది.
అధర్వవేదము 12, అను 1 లో ఇట్లున్నది.:—
“వరాహేణ పృథివీ సంవిదానా శూకరాయ విజిహీతేమృగాయ”

  వరాహరూపుడగు భగవానుడు ఈ పృథ్వి నుద్ధరించెను.
ఋగ్వేదసంహిత మ 1, అ 21, సూ 154 నందిట్లు వర్ణింపబడియున్నది.
ప్రతద్విష్ణుః స్తవతే వీర్యేణమృగో నభీమః కుచరోగిరిష్ఠాః

  నృసింహ రూపధారియును, భయంకరుడు నగు భగవంతుడు స్తుతింపబడుచున్నాడు.
సామవేదము 18-2-8-2-5-1-2 లో ఇట్లున్నది.:—
“త్రీణిపదా విచక్రమేవిష్ణుర్గోపా అదాభ్య ॥ అతోధర్మాణిధారయన్”
“ఇదం విష్ణుర్విచక్రమేత్రేథా నిదధేపదమ్” 18-2-1

  ప్రపంచమును రక్షించెడి భగవంతుడు ధర్మరక్షణము కొరకు వామనావతారమునందు 3 పాదములతో 3 లోకములను ఆవరించుచున్నాడు.
ఐతరేయబ్రాహ్మణము 3-5-34 నందట్లున్నది:—
“ ప్రోవాచరామో భార్గవేయో విశ్వన్నరాయ”

  భృగుకులతిలకుడగు పరశురాముడు విశ్వన్నరునితో చెప్పెను.
సామవేదసంహిత ఉత్తరార్చికము 15-2-1-3 నందిట్లున్నది.
భద్రోభద్రాయ సచమాన ఆగాత్ స్వసారంజారో అధ్యేతిపశ్చాత్

శ్రీ రామచంద్ర భగవానుడు సీతాదేవితో అరణ్యమునకు పోయెను. దుర్మార్గుడగు రావణుడు రామచంద్రుని పరోక్షమున సీతను అపహరింపవలయునని వచ్చెను.
ఛాందోగ్యము పరి 3, ఖండము 17 నందిట్లున్నది:-
“ఏతద్ఘోర అంగిరసః కృష్ణాయ దేవకీపుత్రాయోక్త్వావాచేతి”

  అంగిరసుడు ఈమాటలను దేవకీపుత్రుడగు కృష్ణునితో చెప్పి నాతోచెప్పెను.
“సమిష్టి కర్మాధీనంతత్”

  అవతారము ఏదో ఒక జీవియొక్క కళ్యాణముకొరకు జరుగదు. సమిష్టిజీవుల కళ్యాణముకొరకే జరుగును. అవతారములు 5 విధములై యున్నవి.:-
“కళాభేదేనా పూర్ణాంశత్వమ్”
నిమిత్తాద్ విశేషావిశేషౌ”
“అంతరావిర్భావస్య నిత్యత్వమ్”

  కళాభేదమువలన పూర్ణావకృతారములనియు, అంశావతారములనియు రెండువిధములు. తొమ్మిది కళలనుండి 15 కళళ వరకుని అంశావతారమనబడును. 16 కళలుగల అవతారము పూర్ణావతారమనబడును. నిమిత్త భేదమువలన విశేష అవతారములనియు, అవిశేష అవతారములనియు రెండు విధములుగా నుండును. అంతఃకరణమునందు ప్రకటమగు శ్రీభగవానునకు మత్స్యావతారమని పేరు. ఈ ప్రకారముగా, పూర్ణావతారము, అంశావతారము, విశేషావతారము, అవిశేషావతారము, నిత్యావతార మని, అవతారము లైదు విధములై యున్నవి.

  ప్రతి యుగమునందును ధర్మముయొక్క వికాసము ఆ యుగమందలి మనుష్యుల సమిష్టికర్మ ననుసరించి యుండును. ఈ నియమమునందు బాధకలుగనంతవరకును అవతారముయొక్క ఆవశ్యకతలేదు. ఒకానొకప్పుడట్టి అసామంజస్య మొదవినను, 8 కళలకు లోపలనేగల భగవద్విభూతిద్వారా ధర్మము సువ్యవస్థిత మొనర్చుటకు వీలుగాని యెడల ఏదో ఒక విశేష కేంద్రముద్వారా 8 కళలకుపైగా గల భగవచ్ఛక్తి ప్రవహించి, ధర్మమును నిరాటంక మొనర్పవలయును. రామావతారమునుగూర్చి రామాయణము.
బాలకాండమునందిట్లు చెప్పబడినది
సహితేపేతపస్తీవ్రం దీర్ఘకాలమరిందమః
యేనతుష్టోzభవద్భ్రహ్మ లోకకృల్లోకపూర్వజః
సంతుష్టః ప్రదౌతస్మై రాక్షసాయవరంప్రభుః
నానావిధేభ్యోభూతేభ్యో భయంనాన్యత్రమానుషాత్
అవజ్ఞాతాఃపురాతేన వరదానేహిమానవాః॥ ఏవంపితామహత్తస్మాత్
వరదానేనగర్వితః॥ ఉత్పాదయతిలోకాంస్త్రీన్ స్త్రీయశ్చావ్యుపకర్షతి
తస్మాత్తస్యవధోదృష్టో మానుషేభ్యఃపరంతప
ఉద్వేజయతిలోకాం స్త్రీనుచ్ఛ్రితాన్ ద్వేష్టి దుర్మతిః॥
శక్రంత్రిదశరాజానం ప్రధర్షయితుమిచ్ఛతి॥
ఋషీన్ యక్షాన్ సగంధర్వాన్ బ్రాహ్మణానసురాంస్తథా
అతిక్రామతిదుర్థర్షో వరదానేనమోహితః॥
నైనంసూర్యఃప్రతపతి పార్శ్వేవాతినమారుతః
చలోర్మిమాలీతందృష్ట్వా సముద్రోపినకంపతే॥
తన్మహన్నోభయంతస్మా ద్రాక్షసాత్ ఘోరదర్శనాత్
వధార్ధంతస్యభగవన్ను సాయంకర్తుమర్హసి॥

  రాక్షసరాజగు రావణుడు చాలకాలము కఠినమగు తపమాచరించెను. దానివలన బ్రహ్మదేవుడు సంతుష్టిజెంది “నీకు మనష్యులవలన తప్ప ఇతరప్రాణులవలన ఏ విధమైన అపాయము లేకుండుగాక” యని వరమొసంగెను. ఈ వర ప్రభావమువలన గర్వించి రావణాసురుడు స్త్రీలను బలాత్కరించి ప్రజలను బాధింపసాగెను. కావున, వానిని వధింపవలసినయెడల మనుష్యుడే వధింపవలసియుండును. రావణుడు సమస్తలోకములను, స్త్రీలను, ఋషి యక్ష గంధర్వ బ్రాహ్మణాదుల నందరను బాధింపుచుండెను. వానినిచూచి సూర్యుడు భయపడి సరిగా ప్రకాశింపజాలకుండెను. వాయువు సరిగా వీయజాలకుండెను. సముద్రము భయముతో కంపించుచుండెను అందరును భగవంతుని ప్రార్థించిరి. ఇక భగవంతుడే వీనిని సంహరించుటకు అవతరించవలసి వచ్చెను.