సంధులు : సంధులు - 1
సంధులు
...
మన భారతీయ భాషలలో పదములు రెండు ప్రక్కప్రక్కన వచ్చినప్పుడు, అక్షరాల (స్వరాల) కలయిక జరుగుతుంది. రెండు పదాలు కలిసిపోయి మరొక పదం ఏర్పడుతుంది, అలా జరగితే సంధి జరిగింది అంటారు; ఇవి భాషా సౌలభ్యానికి, సౌందర్యానికి, పురిపుష్టికి దోహదం చేస్తాయి;
అలా సంధి జరిగినప్పుడు, మొదటి పదం చివరి అక్షరాన్ని లేదా స్వరాన్ని పూర్వ స్వరం అంటారు, రెండవ పదం మొదటిదానిని పరస్వరం అంటారు, ఇలా పూర్వ పర స్వరాలు కలిసిపోయి మరొక స్వరం రావడాన్ని ఏకాదేశం అంటారు, ఈ ప్రవృత్తి తప్పక (నిత్యం) జరుగుట లేదా బహుళముగా నగుట జరుగవచ్చును;
బహుళముగా నగుట:- 1 ప్రవృత్తి (నిత్యముగా జరుగుట), 2 అప్రవృత్తి (అసలు జరుగకపోవుట), 3 విభాష (ఒకమారు వచ్చుట, ఒకమారు రాకపోవుట), 4 అన్యకార్యము (ఇతర స్థలములలో మరొకలా జరుగుట,
ఉదా, ముని+ ఇంద్ర = మునీంద్ర, తన+ఈడు = తనయీడు ;
ఈ సంధులు అనేక విధములు, కొన్ని ప్రముఖమైన సంధులు వాటి నియమాలు పరిచయం చేసుకుందాం,
1, సవర్ణదీర్ఘ సంధి
2, గుణసంధి
3, వృధ్ది సంధి
4, యణాదేశ సంధి
5, అనునాశిక సంధి
6, శ్చత్య సంధి
7, విసర్గ సంధి
8, అకార సంధి
9, ఇకార సంధి
10, ఉకార సంధి
11, యడాగమ సంధి
12, ఆమ్రేడిత సంధి
13, త్రిక సంధి
14, గసడదవాదేశ సంధి
15, పుంప్వాదేశ సంధి
16, రుగాగమ సంధి
17, పడ్వాది సంధి
18, టుగాగమ సంధి
19, సుగాగమ సంధి
20, ప్రాతాది సంధి
21, ద్రుత సంధి
22, ద్విగు సమాస సంధి
23, బహువ్రిహి సమాస సంధి
24, అల్లోప సంధి
25, దుగాగామ సంధి
26. ద్విరుక్తటకారసంధి.
1, సవర్ణదీర్ఘ సంధి
ఆ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములగు అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘములు ఏకాదేశంబగును,
ఉదా - సుర+అరులు = సురారులు (1-10-ఉ.), మందారవన+ అంతర+అమృతసరః = మందారవనాంతరామృతసరః (8-95-మ.), ముని+ ఇంద్ర = మునీంద్ర (1-44-చ.)
2, గుణసంధి
అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమయినపుడు ఏ, ఓ, ఆర్ లు ఏకాదేశముగా వచ్చెను,
ఉదా - దేవ+ ఇంద్ర = దేవేంద్ర (1-177-శా.), ప్రాంత+ ఇందుకాంత+ ఉపల + ఉత్పలపర్యంకము = ప్రాంతేందుకాంతోత్పలోపలపర్యంకము (8-95-మ.), సర్వ+ ఉపగతుడు = సర్వోపగతుడు (7-275-క.), రాజ+ఋషి = రాజర్షి (1-78-వ.)
3, వృధ్ది సంధి
అకారమునకు ఏ, ఐలు పరమైన ఐ కారమును; ఓ, ఔలు పరమైన ఔ కారమును ఏకాదేశముగా వచ్చును,
ఉదా - రక్ష + ఏక = రక్షైక (1-1-శా.), పద+ఔన్నత్యము = పదౌన్నత్యము (3-160-మ.)
4, యణాదేశ సంధి
ఇ,ఉ,ఋ లకు అసవర్ణములగు అచ్చులు పరమగునపుడు వరుసగా య,వ,ర ఔ ఆదేశముగా వచ్చెను,
ఉదా - అతి + అంత = అత్యంత (1-58-వ.), మను + అంతరము = మన్వంతరము(9-3-సీ.)
5, అనునాశిక సంధి
క,చ,ట,త,ప లుకు స,మ లు పరమైనపుడు వరుసగా జ,ణ,జ్ఞ,మ లు వికల్పముగా ఆదేశమగును
ఉదా - వాక్ + మానసంబులకు = వాజ్మానసంబులకు (1-430-వ.)
6, శ్చత్య సంధి
స, త, థ, ద, ధ, స లకు శ, చ, చ, జ, ఝ, జ్ఞ లు పరమైనపుడు వరుసగా శ, జ, జ్ఞ, ణ, మ లు వికల్పముగా ఆదేశంగును, ఇదా - మునివచస్ + శాపావధి = మునివచశ్శాపావధి (7-25-శా.), జగత్ + జన = జగజ్జన (1-5-ఉ.)
7, విసర్గ సంధి
విసర్గమునకు శ,ష,స లు పరమైనపుడు వరుసగా శ,ష,స లు ఆదేశబగును
ఉదా – చతుః + శ్లోక = చతుశ్శోక (2-257-సీ.), చతుః + సాగర = చతుస్సాగర (1-232-వ.)
8, అకార సంధి
అత్తునకు సంధి బహుళముగా నగును,
ఉదా - మేన + అత్త = మేనత్త (1-348-సీ.), , తన+ఈడు = తనయీడు (4-402-చ.),
9, ఇకార సంధి
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వికల్పము
ఉదా - ఏమి + అని = ఏమని (1-189-సీ.)
10, ఉకార సంధి
ఉత్తున కచ్చు పరం బగునపుడు సంధి యగు (నిత్యము),
2) ప్రథమేతర విభక్తిశత్రర్థచువర్ణంబులం దున్న యుకారమునకు సంధి వైకల్పికముగా నగును,
ఉదా - వేనుడు + అనంగ = వేనుడనంగ (4-401-చ)
11, యడాగమ సంధి
సంధిలేని చోట స్వరంబుకంటే పరం బయిన స్వరంబునకు యడాగమంబగు,
రెండు అచ్చులకు సంధి జరగనపుడు వాని మధ్య 'య్' అనునది ఆగమముగా వచ్చును,
ఉదా - మా + అమ్మ - మాయమ్మ (1-10-ఉ)
12, ఆమ్రేడిత సంధి
అచ్చునకు ఆమ్రేడితము పరమగునపుడు సంధి తరచుగానగును,
ఉదా - ఏమి + ఏమి = ఏమేమి (8-143-మ)
13, త్రిక సంధి
ఆ,ఈ,ఏ,యను సర్వనామములకు త్రికమని పేరు, త్రికమము మీది అసంయుక్త హల్లు పరమైన ద్విత్వం బహుళంగా వస్తుంది. ద్విరుక్తమైన హల్లు పరమతే అచ్చికమైన దీర్ఘానికి హ్రస్వం వస్తుంది.
ఉదా - ఆ + తెఱంగు = అత్తెఱంగు (3-100-వ.), ఏ+చోటు = ఎచ్చోటు (1-254-క.)
14, గసడదవాదేశ సంధి
ప్రథమము మీది పరుషములకు గ,స,డ,ద,వ లు బహుళములగును,
ఉదా - రాముఁడు + తాను = రాముఁడుఁదాను (3-120-ఉ.) , ధమ్మిల్లము+ చక్కనొత్తడు = ధమ్మిల్లముఁ జక్కనొత్తడు (8-96-మ.)
15, పుంప్వాదేశ సంధి
కర్మధారయ సమాసమున సువర్ణమునకు పుంపు లగును,
ఉదా - వాటము + మాట = వాటపుమాట (12-38-చ.)
16, రుగాగమ సంధి
పేదాదుల కాలు పరమయినపుడు రగాగము వచ్చును,
ఉదా - పేద + ఆలు = పేదరాలు, ముద్దు + ఆలు= ముద్దరాలు (1-11-మ.), కల్మషమానస + ఆలు = కల్మషమానసురాలు (7-227-ఉ.)
17, పడ్వాది సంధి
పడ్వాదులు పరమగునపుడు సువర్ణమునకు లోప పూర్ణబిందువులు వికల్పములగును,
ఉదా - భయము + పడి = భయపడి (8-212-క.)
18, టుగాగమ సంధి
కర్మధారయ సమాసమునందు ఉకారాంత పదమునకు అచ్చు పరమైనపుడు టుగాగమంబగు,
ఉదా - చిగురు + ఆకు = చిగురుటాకు (10.1-610-సీ.), తలకుబాటు+ ఒకయింతయు = తలకుబాటొకయింతయు (8-53-చ.)
19, నుగాగమ సంధి
షష్టీ తత్పురుష సమాసమునందు ఉకార ఋకారాంత శబ్దములకు అచ్చు పరమగునపుడు నుగాగమము వచ్చును,
ఉదా - చేయు + అతడు = చేయునతడు, జొనుపు + ఎప్పుడు = జొనుపునెప్పుడు (11-57-సీ.), తెలియు+ అప్పుడు = తెలియునప్పుడు (1-67-వ.)
20, ప్రాతాది సంధి
సమాసములందు ప్రాతాదుల తొలి అచ్చుమీది వర్ణములకెల్ల లోపంబు బహుళముగానగును
ఉదా - క్రొత్త + అగుచు = క్రొత్త యగుచు (10.1-521-ఆ.)
21, ధృత సంధి లేదా సరళాదేశ సంధి
ద్రుత ప్రకృతికముల మీద పరుషములకు సరళమగును,
ఉదా - మాధుర్యమునన్ + తేలు = మాధుర్యమునఁదేలు (7-150-సీ.)
22, ద్విగు సమాస సంధి
సమానాధికారణంబగు ఉత్తరు పదంబు పరంబగునపుడు మూడు శబ్దములలో డు వర్ణమునకు లోపంబగును, మీది హాల్లునకు ద్విత్వంబగును,
ఉదా - మూడు + లోకములు = ముల్లోకములు (4-271-సీ.)
23, బహువ్రిహి సమాస సంధి
బహువ్రీహిని స్త్రీ వాచ్యంబునగుచో ఉపమానంబు మీది మేనునకు బోడి అగును
ఉదా - అలరు + మేను = (10.2-180-సీ.)
24, అల్లోప సంధి
అది, అవి శబ్దముల అకారమునకు సమాసమున లోపము బహుళముగానగు,
ఉదా - నా + అది = నాది (3-66-క.)
25, దుగాగామ సంధి
నీ,నా,తన శబ్దములకు ఉత్తర పదము పరమగునపుడు దుగాగమము వికల్పముగా వచ్చును,
ఉదా - నీ + సుస్వరూపము = నీదుసుస్వరూపము (3-296-క.)
26. ద్విరుక్తటకారసంధి.
కుఱు..చిఱు...కడు...నిడు.,.నడు...శబ్దము లందలి ఱ..,డ లకు అచ్చు పరమగునప్పుడు ద్విరుక్త టకారంబగు
ఉదా - కుఱు+ఉసురు..,కుట్టుసురు
చిఱు+అడవి.....చిట్టడవి.
కడు+ఎదురు..కట్టెదుర..(10.2-794-వ)
నడు+అడవి...నట్టడవి...(డ్+10.1-1056-క.)
నిడు+ఊర్పు.ల..నిట్టూర్పుల..(4-77-సీ.)