పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అలంకారములు : అలంకారములు - 1

అ. శబ్దాలంకారములు

1. వృత్యనుప్రాసము -
2. చేకాను ప్రాసము -
3. లాటానుప్రాసము -
4. అంత్యనుప్రాస -
5. యమకము -
6. ముక్తపద గ్రస్తము -
7. చిత్రాలంకారములు


ఇ. అర్థాలంకారములు

1. ఉపమాలంకారము
2. ఉత్ప్రేక్షాలంకారము
3. రూపకాలంకారము
4. శ్లేషాలంకారము
5. అర్ధాంతరన్యాసము -
6. అతిశయోక్తి
7. దృష్టాంతము
8. స్వభావోక్తి
9. వ్యాజస్తుతి / వ్యాజనింద

అలంకారములు

అలంకారోతి ఇతి అలంకారః” అనీ, “అలంక్రియతే అనేన యితి అలంకారః” అనీ అలంకారానికి వ్యుత్పత్తులు. అంటే అలంకారం చేసేవి అలంకారాలు. ఏవి అలంకరిస్తాయో అవి అలంకారాలు. ఇవి వ్యక్తులకైతే అందమైన ఆభరణాలు. అలాగే రచన సౌందర్యాన్ని ద్విగుణీకృతంగా పెంపొందజేసే ప్రక్రియలు కావ్యానికి అలంకారాలు. కావ్యాన్ని కన్యతో పోలుస్తారు. కన్యకు కావ్యానికి అలంకారాలు బహిరంతస్సౌందర్యాన్ని మరింత భాసింపజేస్తాయి.

అలా భాషకు అందాన్ని ఇవ్వడానికి, పాఠకుని మనసుకు బాగా పట్టడానికి వాడే ప్రత్యేక ప్రక్రియలు అలంకారములు. ఎంత అందం కలవారికైనా తగిన అలంకారం ఆహార్యం లేకపోతే ఏం బావుంటుంది చెప్పండి. కావ్యమైనా కవిత్వమైనా చమత్కారం పండకపోతే రాణించదు కదా. చమత్కారం పండడానికి భాషకు వన్నె పెట్టాలి, శైలికి జిగిబిగి అద్దాలి, భావానికి సొబగులు దిద్దాలి, లోతులు చూపాలి. వీటికోసం వాడే ప్రక్రియలను అలంకారాలు అంటారు. అవి శబ్దాలంకారములు, అర్ధాలంకారములు అని రెండు రకాలు. అర్థానికన్నా శబ్దానికి అధిక ప్రాముఖ్యతను ఇచ్చేవి శబ్దాలంకారాలు. ఇవి శైలికి జిగిబిగాదులను అద్దడం కోసం వాడతారు. శబ్దానికన్నా అర్థానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవి అర్థాలంకారాలు. ఇవి సొబగును, గాంభీర్యతాదులను పోషిస్తాయి.

ఇకపోతే, మన బమ్మెఱ పోతనామాత్యుల వారు తన భాగవతాన్ని పరిపుష్టం చేయడానికి, సందర్భోచితమైన ఛందస్సును, ఉభయ అలంకారాలను విస్తృతంగానూ వాడారు. వారి పద్యాల నడకలు ఏ ఛందస్సును ఎక్కడ వాడాలో ముందే నిర్ణించుకున్నరా అన్నట్లు ఉంటాయి. అంత అలవోకగానూ అలంకారాల అలంకరణకూడా సాగడం కనిపిస్తుంది. శబ్దాలంకారాలలో అనుప్రాస, అర్థాలంకారాలలో ఉపమ సింహభాగం ప్రయోగించారు. వీటిని పద్యాలలోనే కాదు గద్యాలలో సైతం పలుకుల శ్రవణోపేయత; భావవ్యక్తీకరణ నిశ్శంక విస్పష్టతలు ఉద్దీపితమగునట్లు తీర్చిదిద్దారు. పోతన పద్యాలూ, వచన రీతులూ వృత్యనుప్రాసాన్వితమై హొయలుపోతూ, సొబగు లీనుతూ, భావగర్భితంగా, రసాత్మకంగా సాగుతుంటాయి. ఉపమలు విషయాన్ని తేటతెల్లంగా చేయుటలో మిక్కిలి ప్రయోజనకారంగా కనబడతాయి. ప్రయోగించిన ఇతర అలంకారాలు సైతం మనోజ్ఞంగా సందోర్భోచితంగా ఉంటూ సార్థకంగా చేస్తుంటాయి. అలంకారములు విశిష్ఠత నెరిగిన డా. గోదావరి మురళీమోహను గారు, “పోతన మహాభాగవతం - అలంకార వైభవం” అను పరిశోథనాంశం తీసుకొని 2013లో పిహెచ్.డి పట్టా పొదారు.

అద్భుతమైనట్టి ఈ అలంకారాలలో కొన్నిటి లక్షణాల పరిచయాలు చూద్దాం.

అ. శబ్దాలంకారములు

శబ్దమే ప్రధానముగా కల అలంకారములను శబ్దాలంకారము అందురు. శబ్ధాలంకారాలు పండించడానికి కవికి అక్షర కూర్పులు చేయుట యందు మంచి పనితనం, అర్థభంగం కాకుండా చూసుకునే నేర్పు ఉండాలి. అర్థాలంకారాలతో సమంగా శబ్దాలంకారాలను ప్రయోగించడంలో పోతన గారు దిట్ట. ప్రధాన శబ్దలంకారాలు – 1. వృత్యనుప్రాస, 2. ఛేక, 3. లాట, 4. అంత్యనుప్రాస, 5. యమకం, 6. ముక్తపదగ్రస్తం. ఇవికాక 7. చిత్రాలంకారా లని ఉన్నాయి. కొందరు వీటిని అలంకారాలలో కలపరాదు అంటారు. కొందరు కలపాలి అంటారు. ఇక శబ్ధాలంకారాల పరిచయం…

1. వృత్యనుప్రాసము -

రసానుగతమూ, శ్రేష్ఠమూ, హల్లుల పునరుక్తుల విన్యాసము “అనుప్రాస”. అందు వృత్యనుప్రాస మొదటిది. ఒక హల్లు అనేక పర్యాయములు తిరిగి తిరిగి వచ్చినచో (ఆవృత్తి) అది వృత్తానుప్రాసాలంకారము అనబడును.

ఉదా –
1-8-ఉ.
శాదనీరదేందు, ఘనసార, పటీర, మరాళ, మల్లికా
హా,తుషార, ఫేన, రజతాచల, కాశ, ఫణీశ, కుంద, మం
దా,సుధాపయోధి, సితతామర, సామరవాహినీ శుభా
కాత నొప్పు నిన్ను మదిఁ గానఁగ నెన్నఁడు గల్గు, భారతీ!

ఈ పద్యంలో “దకార”, “రకారా”లతో వృత్యనుప్రాసల ప్రయోగం చూడవచ్చు

8-103-క.
డిగెద నని కడువడిఁ జను;
డిగినఁ దను మగుడ నుడుగఁ ని నడ యుడుగున్;
వెవెడ సిడిముడి తడఁబడ
డుగిడు; నడుగిడదు జడిమ డు గిడునెడలన్.

ఈ వృత్యనుప్రాసాలంకార శోభితమైన ఈ పద్యంలోని “డకారం” ఆవృత్తి ఆమె అడుగుల ధ్వనికి, సందర్భానికి అనుసంధానమైన తీరు అద్భుతం

1-15-వ. వచనంలో “... నభ్రంకష శుభ్ర సముత్తుంగభంగ యగు గంగకుం జని, …” అంటూ “బిందుపూర్వక గ కారం”తో వృత్యనుప్రాస రాణించింది

2. చేకాను ప్రాసము –

పలుకు కమ్మదనం తెలిసినవారిని “ఛేకులు” అంటారు. అట్టివారికి ఇష్టమైనది కనుక ఛేకానుప్రాసము. అర్ధ భేధముతో రెండక్షరములను వెంటవెంటనే ప్రయోగిస్తే ఛేకానుప్రాసము. గమనిక: అచ్చుతో కూడిన హల్లుల పునరుక్తి ఐతే యమకము. కేవలం హల్లుల జంటకు ఆవృత్తి ఐతే ఛేక.

ఉదా -

8-55-వ
... హరి హరియును గిరి గిరియునుం దాఁకి ...

8-526-క.
రిహరి; సిరి యురమునఁ గల
రిహరిహయుకొఱకు దనుజు డుగం జనియెన్.

3. లాటానుప్రాసము -

అర్ధమునందుగాక, తాత్పర్యమందునందు మాత్రమే భేదముండునట్లు ఒక పదమును వెంటవెంటనే ప్రయోగిస్తే లాటానుప్రాస.

ఉదా –
7-169-సీ.
మలాక్షు నర్చించు రములు కరములు-
  శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు-
  శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు-
  ధువైరిఁ దవిలిన నము మనము;
గవంతు వలగొను దములు పదములు-
  పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;
దేవదేవుని చింతించు దినము దినము;
క్రహస్తునిఁ బ్రకటించు దువు చదువు;
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు;
తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి.

10.1-1252-సీ. క్రింది తేటగీతి ఉపపద్యం
వీఁడు లేకున్న పుర మటవీస్థలంబు
వీనిఁ బొందని జన్మంబువిగత ఫలము
వీనిఁ బలుకని వచనంబువిహగ రుతము
వీనిఁ జూడని చూడ్కులువృథలు వృథలు.

4. అంత్యానుప్రాస -

పాదాంతాలలో లేదా పదాంతలలో అనుప్రాస ప్రయోగిస్తే అంత్యానుప్రాసము

ఉదా –
1-29-ఉ.
హారికి, నందగోకులవిహారికిఁ జక్రసమీరదైత్య సం
హారికి, భక్తదుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో
హారికి, దుష్టసంపదపహారికి, ఘోషకుటీపయోఘృతా
హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితాప్రహారికిన్.

8-622-శా.
ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.

5. యమకము -

అర్ధభేధము గల అక్షరముల సముదాయము మరల మరల ఉచ్చరింపబడినచో యమక మగును. గమనిక: అచ్చుతో కూడిన అచ్చుతో పునరుక్తి ఐతే యమకము. కేవలం హల్లుల జంటకు ఆవృత్తి ఐతే ఛేక.

ఉదా -
1-46-క.
భూణములు వాణికి, నఘ
పేణములు, మృత్యుచిత్త భీషణములు, హృ
త్తోణములు, కల్యాణ వి
శేణములు, హరి గుణోపచితభాషణముల్.

(షణములు పునరుక్తి ఐంది కనుక యమకము)

10.2-172-క
లేమా!దనుజుల గెలువఁగ
లేమా?నీ వేల కడఁగిలేచితి? విటు రా
లేమాను మాన వేనిన్
లేమావిల్లందికొనుములీలం గేలన్.

(లేమా పునరుక్తి వలన యమకము)

6. ముక్తపద గ్రస్తము -

పాదభాగము లేదా పాదము లేదా వాక్యము చివరనుండు పదముతో తరువాత పదమును ప్రారంభిస్తే ముక్తపదగ్రస్తము. ఈ రెండింటిని పాదాంత పాదాది ముక్తపదగ్రస్తము, సింహావలోకన ముక్తపదగ్రస్తము అని అంటారు.

ఉదా -
8-303-సీ.
పాలిండ్లపై నున్న య్యెద జాఱించు-
  జాఱించి మెల్లన క్క నొత్తు
ళ్కు దళ్కను గండలకంబు లొలయించు-
  నొలయించి కెంగేల నుజ్జగించుఁ
టు మెఱుంగులు వాఱు డకన్ను లల్లార్చు-
  ల్లార్చి ఱెప్పల నండఁ గొలుపు
వరని దరహాస చంద్రికఁ జిలికించుఁ-
  జిలకించి కెమ్మోవిఁ జిక్కుపఱచు

(పై సీసపద్యంలో జాఱించు, ఒలయించు, అల్లార్చు, చిలికించు పదాలు ఆయా పాదభాగలలో ముక్తాలై (విడిచినవి) వెంటనే గ్రస్తాలయ్యాయి (గ్రహింపబడినవి) కనుక ముక్తపదగ్రస్తాలంకారం. ఇక్కడ మరొక సౌందర్యం. ఈ నాలుగు పదాలు విడువడానికి చెందినవి, అలా విడిచిన జగన్మోహిని, వెంటనే గ్రహించడం లేదా స్వీకరించడం చేసింది. అలా అలంకారంతో పాటు ఆమె చేష్టలు కూడా అనుసంధానం అయ్యాయి.

8-447-వ.
... వ్రేఁకలగు మ్రాకుల ప్రోక లకుఁ బేఁట లగు పెందోఁటలును; దోఁటల గాటంబులై నివ్వటిల్లు ...

7. చిత్రాలంకారము -

చిత్రకవిత్వం అని చెప్పబడే ప్రక్రియను చిత్రాలంకారము లని శబ్దాలంకారాలలో చేర్చవచ్చును అని కొందరి అభిమతం. ఇవి సాముగరిడీల వంటివి, అలంకారాలు కావు అని మరి కొందరు అంటారు. చిత్రకవిత్వంలో (1) బంధకవిత్వం - పద్యం మందలి అక్షరములను పద్మం, చక్రం, సర్పం మున్నగు ఆకారాలలో వచ్చేటట్లు కూర్చడం. (2) ఏకాక్షరి (ఒక హల్లు మాత్రమే ఉండునది, ద్విక్షరి (రెండే హల్లులు మాత్రమే ఉండే పద్యం) ... , (3) సర్వలఘు (పద్యంలో అన్నీ లఘువులే వేసిన పద్యం), (4) గర్భములు (ఒకేపద్యంలో రెండు అంతకన్నాఎక్కువ ఛందస్సులతో పద్యాలను కూర్చినట్టి ప్రక్రియ) వంటివి

బంధ కవిత్వం - ఉదా.
శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారు, తితిదే పుస్తక ప్రచురణ విభాగంలో పనిచేసి పదవీవిరమణ చేసిన విశిష్ఠ పండితులు. బమ్మెఱ పోతనామాత్యుని పరమ భక్తులు, వైష్ణవోత్తముడు. వీరి దృష్టి బంధకవిత్వంలో చూపిన వ్యాసభాగవతంలోని శ్లోకంపై ప్రసరించింది. మన పోతనకవీంద్రుని భాగవత పద్యాలలో ఉండాలి కదా అని. పద్యపద్యాన్ని తడివితడివి చూసి స్పందించి అనేక పద్యాలకు బంధకవిత్వరూపు బహిర్గతంచేసారు. ఆ మహాత్ముని కృషిలోనుండి ఒక చక్రబంధ పద్యం “హరిసుతు పరిచరుఁగాఁ గొఁని…”

CkraBandha-Harisutu-padyam

2-165-క.
రిసుతుఁ బరిచరుఁగాఁ గొని
రిసుతుఁ దునుమాడి పనిచె రిపురమునకున్;
రివిభునకు హరిమధ్యను
రిరాజ్యపదంబు నిచ్చె రివిక్రముఁడై.

సర్వలఘు ప్రక్రియకు ఉదా.

8-103-క.
డిగెద నని కడువడిఁ జను;
డిగినఁ దను మగుడ నుడుగఁ ని నడ యుడుగున్;
వెవెడ సిడిముడి తడఁబడ
డుగిడు; నడుగిడదు జడిమ డు గిడునెడలన్.

ఇది వృత్యనుప్రాస పూర్ణమే కాక సర్వలఘు కందపద్యము కూడ.

మరొకటి

11-72-ససీ.
వ వికచ సరసిరుహయనయుగ! నిజచరణ-
గగనచరనది జనిత!నిగమవినుత!
లధిసుత కుచకలశలిత మృగమద రుచిర-
రిమళిత నిజహృదయ!రణిభరణ!
ద్రుహిణముఖ సురనికరవిహిత నుతికలితగుణ!-
టిఘటిత రుచిరతరనకవసన!
భుజగరిపు వరగమన!రజతగిరిపతివినుత!-
తతజపరత! నియమరణి చరిత!
తిమి, కమఠ, కిటి, నృహరి, ముదిత బలి నిహి
పద, పరశుధర, దశవన విదళన,
మురదమన, కలికలుష సుముదపహరణ!
రివరద! ముని నర సురరుడ వినుత!



ఇ. అర్ధాలంకారములు

అర్థమే ప్రధానంగా కలవి అర్థాలంకారాలు. ఇవి సుమారు వంద కలవు అంటారు. వానిలో ఉపమా, ఉత్ప్రేక్ష, రూపక, శ్లేష, అర్థాంతరన్యాసము, అతిశయోక్తి, దృష్టాంతము, స్వభావోక్తి, వ్యాజ్యస్తుతి ప్రసిద్ధమైనవి. అర్థాలంకారల సంఖ్యా విస్తార రీత్యా ఈ తొమ్మిది అలంకారాల పరిచయం చేసుకుందాం.

1. ఉపమాలంకారము -

ఉపమాన ఉపమేయాలకు గల పోలికను మనోహరముగా వర్ణించును. ఉపమలు వేయుటలో మన పోతన్న సిద్ధహస్తుడు. పోతనకు ఉపమాలంకారం మిక్కిలి ఇష్టం. అందుకే, భాగవతంలో 400కు పైగా గోచరిస్తున్నాయి. ఉపమ సర్వాలంకార బీజభూతం అని అంటారు. అన్ని శబ్దాలంకారలకు ఉపమ మాతృక అనవచ్చు. ఒక వస్తువును మరొక వస్తువుతో మనోహరంగా పోల్చితే అది ఉపమాలంకారం. ఉపమాలంకారంలో ఉపమానం ప్రసిద్ధంగా ఉంటుంది. ఉత్ప్రేక్షలో ఉపమానం కేవలం ఊహ కనుక ప్రసిద్దం కాదు, అసాధ్యం కూడ.

ఉదా –
(అ) 1-96-మ.
రినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ
సురుచిభ్రాజితమైన మానస సరస్స్ఫూర్తిన్ వెలుంగొందు; శ్రీ
రినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం బయ్యు, శ్రీ
మై యుండ; దయోగ్యదుర్మదనదత్కాకోల గర్తాకృతిన్.

ఇందు రెండు ఉపమాలంకారలు ఉన్నాయి. అవి-
ఉపమానాలు 1. హరినామస్తుతి సేయు కావ్యము, 2. హరినామ స్తుతి లేని కావ్యం.
ఉపమేయాలు 1. మానససరోవరం, 2. బురదగుంట,
సామ్యధర్మాలు 1. వొలుగొందడం, 2. శ్రీకరమై ఉండకపోవడం

(ఆ) 1-223-సీ. ... (భీష్ముని చంపుతానని వస్తున్న శ్రీకృష్ణుడు) కరికి లంఘించు సింహంబు కరణి మెఱసి. .

(ఇ) 1-16-సీ. లోని ఐదు (5) ఉపమలు..,
(1) మెఱుఁగు చెంగటనున్న మేఘంబు కైవడి-
  నువిద చెంగట నుండ నొప్పువాఁడు,
(2) చంద్రమండల సుధాసారంబు పోలిక-
  ముఖమునఁ జిఱునవ్వు మొలచువాఁడు,
(3) ల్లీయుత తమాల సుమతీజము భంగిఁ-
  లువిల్లు మూఁపునఁరఁగువాఁడు,
(4) నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి-
  న కిరీటము దలఁ లుగువాఁడు,
(5) పుండరీకయుగముఁ బోలు కన్నుల వాఁడు,

2. ఉత్ప్రేక్షాలంకారము -

ఉపమేయమును ఊహించుటను ఉత్ప్రేక్షాలంకారము అందురు. ఉపమాన ధర్మాలు ఉపమేయంలో లేనప్పుడు, ఆ ధర్మాలను అనుసరించి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే ఉపమాలకారం

ఉదా -2-144-మ.
మృతోత్పాదన యత్నులై విబుధ దైత్యానీకముల్, మందరా
ముఁగవ్వంబుగఁ జేసి యబ్ధిదఱువంగాఁగవ్వపుంగొండ వా
ర్థిమునుంగన్ హరి కూర్మరూపమున నద్రిందాల్చెఁ దత్పర్వత
భ్రణవ్యాజత వీఁపుఁదీట శమియింపంజేయఁగా నారదా!

ఇక్కడ శ్రీహరి కూర్మావతారం ఎత్తడం గిరగిర తిరిగే కొండతో వీపు దురద తీరడం కాదు, సాగరాన్ని మథిస్తుంటే మునిగిపోతున్న కొండకు ఆధారం కోసం. ఇలా హేతువు కాని దానిని హేతువుగా చూపడం వలన ఉత్ప్రేక్షాలంకారం ఐంది.

3. రూపకాలంకారము -

ఉపమాన, ఉపమేయములకు భేధమున్నను అభేధము చెప్పుటను లేదా ఉపమాన లక్షణాన్ని ఉపమేయంలో ఆరోపించుటను రూపకాలంకారము అందురు. పోతన భాగవతంలో ఉపమ తరువాత అధికంగా కనబడునది రూపకము.

ఉదా -1-22-మ.
... వెయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్సద్ద్విజశ్రేయమై.

భాగవతం కల్పతరువు కాకపోయినా భాగవతాఖ్యకల్పతరువు అని అభేదం చెప్పబడింది కనుక రూపకాలంకారము

4. శ్లేషాలంకారము -

అనేక అర్ధములు వచ్చునట్లు చెప్పుట శ్లేషాలంకారము. పోతన భాగవతంలో శ్లేష అద్భుతమైన రీతిలో కనబడుతుంది.

ఉదా –1-22-మ.
లితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జుతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై
వెయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్సద్ద్విజశ్రేయమై.

  భావము:- బ్రహ్మదేవుడికైన పరమశివునికైన భాగవతమును తెలిసి పలుకుట చిత్రమైనట్టి శ్రీమద్భాగవతం కల్పవృక్షంతో సాటిరాగలిగి ప్రకాశించేది. ఏమాత్రం సందేహం లేదు. దీనిని రెండు రకాల అన్వయార్థాలు గల పదప్రయోగాలతో ఇలా వివరించారు. కల్పవృక్షం కొమ్మలతో మనోజ్ఞ మైంది అయితే భాగవతం స్కంధాలనే 12 భాగాలతో లలిత మనోహర మైనది. కల్పవృక్షం నల్లగా ఉండే వేళ్ళు కలది అయితే భాగవతానికి మూలం భగవాను డైన శ్రీకృష్ణుడుగా కలది. కల్పవృక్షం చిలుకల పలుకలతో సతతం కూడి మనోహరంగా ఉంటుంది, అలాగే భాగవతం శుకమహర్షి మధుర వాగ్ధారలతో మనోజ్ఞంగా ఉంటుంది. కల్పవృక్షం అందమైన పూల తీగలచే అలంకరింప బడినది, మరి భాగవతం మనోహర మైన వాక్కులుతో అలరారేది. కల్పవృక్షం మంచి రంగురంగుల పూలతో శోభిల్లు తుంటుంది, అదేవిధంగా భాగవతం అక్షర సార్థక మై సజ్జనుల మనసులు అలరించేది. కల్పవృక్షం సుందరంగా ఉజ్వలంగా ప్రకాశిస్తు గుండ్రంగా ఉంటుంది, అదే మరి భాగవతమో సుందరము ఉజ్వలము అయిన చక్కటి పద్య వృత్తాలు గలది. కల్పవృక్షం ఎంత గొప్ప కామితార్థాల నైనా అందిస్తుంది, అయితే భాగవతం కైవల్యాది కామిత ప్రయోజనాలు సర్వం సమకూర్చేది. కల్పవృక్షం విశాలమైన చుట్టుకొలత గల మాను కలిగినది, అలాగే భాగవతం స్వచ్ఛమైన వ్యాస కృత వ్యాసాలతో నిండినది. కల్పవృక్షం స్వర్గంలో విలసిల్లు తుంది, మరి భాగవతమో భూలోకంలో విరాజిల్లుతోంది. కల్పవృక్షం శుక పికాది పక్షులకు సైతం శ్రేయస్కర మైనది, అదే భాగవతం అయితే ఉత్తములకు సద్బ్రాహ్మణులకు శ్రేయోదాయక మైనది. ఎంత చక్కటి చిక్కటి శ్లేష

10.1-1010-సీ.
"పున్నాగ కానవే! పున్నాగవందితుఁ-
  దిలకంబ! కానవే తిలకనిటలు;
నసార! కానవే నసారశోభితు-
  బంధూక! కానవే బంధుమిత్రు;
న్మథ! కానవే న్మథాకారుని-
  వంశంబ! కానవే వంశధరునిఁ;
జందన! కానవే చందనశీతలుఁ-
  గుందంబ! కానవే కుందరదను;
నింద్రభూజమ! కానవే యింద్రవిభవుఁ;
గువల వృక్షమ! కానవే కువలయేశుఁ;
బ్రియకపాదప! కానవే ప్రియవిహారు;"
నుచుఁ గృష్ణుని వెదకి ర య్యబ్జముఖులు.

ఈ పద్యంలో పున్నాగ- పొన్నచెట్టు, పురుషపుంగవుడు, తిలకం- బొట్టుగచెట్టు, నుదుటిబొట్టు, ఘనసార- కప్పురపుచెట్టు, పరాక్రమం, బంధూక- మంకెనచెట్టు, సద్బంధుడు, మన్మథ- వెలగచెట్టు, మన్మథాకారు, వంశ- వెదురుపొద, వేణువు, చందన- చందనవృక్షం, గంధం, కుందన- మొల్లచెట్టు, మొగ్గలవంటి దంతసౌందర్యం, ఇంద్ర- మరువంమొక్కలు, ఇంద్రవైభవం, కువల- రేగుచెట్టు, రాజ్యాధికారం, ప్రియక- కడపచెట్టు, ప్రియవిహారం ఇలా అందంగా రెండేసి అర్థాల పదాలతో గోపకాంతలకు గల కృష్ణ ప్రేమను, ప్రకృతితో సహచర్యాన్ని వర్ణిస్తూ అందమైన శ్లేషను వాడారు మన పోతనామాత్యులవారు.

5. అర్ధాంతరన్యాసము -

సామాన్యమును విశేషము చేతను, విశేషమును సామాన్యము చేతను సమర్ధించుట.

ఉదా -2-187-శా.
ప్తాబ్దంబుల బాలుఁడై నిజభుజాస్తంభంబునన్ లీలమై
ప్తాహంబులు “శైలరాజము లసచ్ఛత్త్రంబుగాఁ దాల్చి”, సం
గుప్తప్రాణులఁ జేసె మాధవుఁడు గోగోపాలకవ్రాతమున్
“సప్తాంభోధి పరీతభూధరున కాశ్చర్యంబె చింతింపఁగన్.”

సప్తసముద్రాలతో చుట్టబడిన భూమండలాన్నే ధరించిన మహాత్ముడు కదా. ఈ కొండను గొడుగులా పట్టుకోవడం ఎంత అంటూ అర్థాంతరన్యాసము ప్రయోగించారు.



6. అతిశయోక్తి -

ఒక విషయము ఉన్నదానికంటే అధికము చేసి వర్ణించుట. గొప్పగా కాని, అధికంగా కాని వర్ణించాలి

ఉదా -8-36-క.
తొండంబుల మదజలవృత
గండంబులఁ గుంభములను ట్టన చేయం
గొంలు దలక్రిందై పడు
బెండుపడున్ దిశలు చూచి బెగడున్ జగముల్.

7. దృష్టాంతము -

ఉపమాన ఉపమేయములకు, బింబ ప్రతిబింబ భావము ఉండునట్లు వర్ణించుట. సామాన్య ధర్మం బింబప్రతిబింబ భావనలలో చెప్పాలి.

ఉదా-1-453-చ.
క్రమున మింటికై యెగయుఁగాక విహంగము మింటిదైన పా
ముగన నేర్చునే? హరిపరాక్రమ మోపినయంతఁ గాక స
ర్వమువివరింప నెవ్వఁడు ప్రర్తకుఁడౌ? మునులార! నాదు చి
త్తమునకు నెంత గానఁబడెఁ ప్పక చెప్పెద మీకు నంతయున్.

ఉపమేయం- విష్ణుమూర్తి వైభవం గురించి ఎంత తెలిసనవారు సమగ్రంగా వర్ణించలేరు,

ఉపమానం- పక్షి ఎంత ఎగిరినా ఆకాశం అంచు కనలేదు.

ఈ రెంటినీ బింబప్రతిబింబ భావాలుగా వ్యక్తపరచారు కనుక దృష్టాంతాలంకారం.

8. స్వభావోక్తి -

జాతి గుణ స్తితి స్వభావములను ఉన్నదున్నట్లు మనోహరముగా వర్ణించుట. కేవలం ఉన్నదున్నట్లు వర్ణించినంత మాత్రాన అది స్వభావోక్తి కాలేదు. అది సహృదయ హృదయంగమంగా ఉండాలి. అప్పుడే స్వభావోక్తి.

పోతన భాగవతంలో స్వభావోక్తి అలంకారాలు యందు శ్రీకృష్ణుని, వారికి సంబంధించిన వానిని వర్ణించేవీ సీసపద్యాలూ అధికం.

ఉదా -3-99-సీ.
ట్టి సరోజాక్షుఁ డాద్యంతశూన్యుండు-
  సుభగుండు త్రైలోక్యసుందరుండు
మనీయ సాగరన్యకాకుచకుంకు-
  మాంకిత విపులబాహాంతరుండు
కలదిక్పాలభాస్వత్కిరీటన్యస్త-
  ద్మరాగారుణపాదపీఠుఁ
జుఁ డనంతుఁడు సమానాధికవిరహితుం-
  డిద్ధమూర్తిత్రయాధీశ్వరుండు
నైన హరి ...

9-361-ఉ.
ల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు మహాశుగంబులున్
విల్లును దాల్చువాఁడు గడు విప్పగు వక్షమువాఁడు మేలు పైఁ
ల్లెడువాఁడు నిక్కిన భుజంబులవాఁడు యశంబు దిక్కులం
ల్లెడువాఁడు నైన రఘుత్తముఁ డిచ్చుత మా కభీష్టముల్.

9. వ్యాజస్తుతి / వ్యాజనింద-

స్తుతిచేత నిందను గాని, నిందచేత స్తుతిని గాని, వ్యక్తపరుస్తే వ్యాజస్తుత్యలంకారం

ఉదా -3-99-సీ.

10.1-1292-ఆ.
ళలు గలుగుఁ గాక;మల తోడగుగాక;
శివుని మౌళిమీఁదఁజేరుఁ గాక;
న్యు నొల్లఁ దపనుఁడైన మత్పతి యని
సాధ్విభంగిఁ గమలజాతి మొగిడె.

 చంద్రుని లక్షణాలు చెప్పి ఐనా, చంద్రుడిపొత్తు వద్దు అందిట కమల జాతి.

10.1-1343-సీ.
లమున నను డాసిలరాశిఁ జొరరాదు-
నిగిడి గోత్రముదండనిలువరాదు;
కేడించి కుంభినిక్రిందికిఁ బోరాదు-
నుజసింహుఁడ ననిలయరాదు;
చేరినఁ బడవైతుఁజెయి చాపఁగారాదు-
బెరసి నా ముందటఁబెరుఁగరాదు;
భూనాథ హింసకుఁబోరాదు నను మీఱి-
శోధింతుఁ గానలఁజొరఁగరాదు;.
ప్రబలమూర్తి ననుచుభాసిల్లఁగారాదు;
రఁ బ్రబుద్ధుఁడ ననిఱుమరాదు;
లికితనము చూపిర్వింపఁగారాదు;
రముగాదు; కృష్ణ!లఁగు తలఁగు.

ఇక్కడ చాణూర మల్లుడు కృష్ణుని తృణీకరిస్తుంటే దశావతారాల వర్ణన వ్యక్తమవుతున్నది. కనుక నిందాస్తుతి, లేక వ్యాజనింద