పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయాశ్వాసము : శివుఁడుగౌరితో సుఖముగా నుండుట.

3-197-ఉ.
వేలుపుఱేఁడు శంకరుఁడు విశ్వవిభుండు గురుండు కొండరా
చూలియుఁ దానుఁ గూడి బహుసుందరలీలల వెండికొండపై
సోలుచు నుండె లోకములు సుస్ధితిఁ బొందె ననేక కాలమున్
లాలితవృత్తితోడ నకలంకగతిన్ గడచెన్ ముదంబునన్.

టీక :-
వేలుపురేడు = దేవదేవుడు; అకలంకము = మచ్చలేనిది; సోలు = పరవశించు.
భావము :-
దేవదేవుడు, జగదేకపతి, గురుడు యైన శంకరుడు పార్వతీదేవి తానూ కలసి చాలా ఆనందంగా వెండికొండపై పరవశిస్తూ యున్నారు. లోకాలన్నీ సుఖంగా యున్నాయి. ఏ ఆటంకమూ లేకుండా సంతోషంగా ఇలా చాలా కాలం గడచింది.

3-198-వ.
అని గౌరీదేవి వివాహోత్సవ క్రమంబు తెలియం జెప్పిన విని వాయుదేవునకు నమ్మహామునులిట్లనిరి.

టీక :-
క్రమము = విధము.
భావము :-
అలా వాయుదేవుడు గౌరీ కళ్యాణం జరిగిన విధానం తెలియచేయగా విని, ఆ మహామునులు వాయుదేవునితో ఇలా అన్నారు.

3-199-క.
నీగళుం డను నామము
ఫాలాక్షున కెట్లు వచ్చె ర్గుఁడు కడిమిన్
హాలాహలవిషవహ్నుల
నేలాభక్షించె మాకు నేర్పడఁ జెపుమా.

టీక :-
కడిమి = అతిశయము.
భావము :-
“ఫాలాక్షునకు నీలకంఠుడనే పేరెలా వచ్చింది? శంకరుడు అతిశయమున హాలాహల విషాన్ని ఎలా మింగాడు? మాకు తెలియచేయుము” అని మునులు వాయుదేవుని అడిగారు.