తృతీయాశ్వాసము : శివుఁడు భూసమత్వంబునకై యగస్త్యుని దక్షిణదిక్కునకుఁ బంపుట.
3-139-వ.
అనవుడు సర్వేశ్వరుండు.
టీక :-
అనవుడు = అనేసరికి.
భావము :-
విష్ణువు అలా అనేసరికి శివుడు.
3-140-త.
వరమునీశ్వర పద్మజాసన వర్ణనీయుమహాత్మునిన్,
శరధు లెల్లను లీలఁ ద్రావిన చండకోపునిఁ గోటి భా
స్కరసమాన విభున్, ధరాసమసత్త్వుఁ, గుంభజుఁ బంపె సు
స్ధిరతమై సమ మయ్యె దక్షిణదిక్కు ధారుణి చెచ్చెరన్.
టీక :-
పద్మజాసనుడు = బ్రహ్మ; శరధులు = సముద్రాలు; కుంభజుడు = కుంభమున జన్మించిన అగస్త్యుడు; చెచ్చెర = శీఘ్రముగ.
భావము :-
మునీశ్వరులలో శ్రేష్ఠుడు, బ్రహ్మచే కీర్తింపబడేవాడు, సముద్రాన్ని దోసిట పట్టి తాగినవాడు, తీప్ర కోపము కలవాడు, కోటి సూర్యుల తేజస్సుతో సమానమైనవాడు, భూమితో సమానమైన బలం కలవాడు యైన అగస్త్యుని దక్షిణ దిక్కుకు పంపగా వెంటనే భూమి స్థిరత్వాన్ని కలిగి సమమయ్యింది.
3-141-వ.
అంత.
భావము :-
అంతట
3-142-మ.
వెలయన్ శంభుఁడు శైలరాజుపురికిన్ వేంచేసె నమ్మూకతో
నలినవ్వేళఁ బురాంగనాజనము లానందంబుతో నందఱున్
జెలులుం దామును నుత్సవం బొదవఁగా శృంగారముం జేసి త
త్కలధౌతాచలనాధుఁ జూడ మదిలోఁ గాంక్షించియోర్తోర్తుతోన్.
టీక :-
వెలయించు = ప్రకటించు; నలి = ఉత్సాహము; కలధౌత = వెండి.
భావము :-
శివుడు హిమవంతుని నగరానికి తన సమూహముతో వచ్చాడని తెలిసి ఉత్సాహంతో ఆ రోజు పురజనమంతా ఆనందంగా తమ సతులతో ఉత్సవానికి సరియగు అలంకరణలు చేసుకొని కైలాసనాథుని చూడాలనే కోరికతో ఒకరితోనొకరు…..