పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయాశ్వాసము : గజాననుని పార్వతీపరిణయమునకుఁ దీసికొని పోవుట

3-100-శా.
రావోకుఱ్ఱఁడ! యంచుఁ గౌఁగిటికిఁ జేరం బిల్చియూరార్చి య
ద్దేవుండేనుఁగుతుండముం బుణికి మూర్ధఘ్రాణముం జేసి స
ద్భావుండంకతలంబుపై నునిచి సంభావించి ప్రేమాబ్ధిఁ దా
దైవారం దన ముద్దుపట్టికిని గందర్పాంతకుం డిట్లనెన్.

టీక :-
ఊరార్చి = ఊరడించు; పుణికి = వేళ్ళతో తాకి; మూర్ధఘ్రాణము = తల వాసన చూచు; అంకము = ఒడి; సంభావించు = ఆదరించు; అబ్ధి = సముద్రము; దైవారు = పొరలిపారు.
భావము :-
శివుడు వినాయకునితో “కుఱ్ఱవాడా! రా” అంటూ పిలిచెను; కౌగిలించి, వాత్యల్యము చూపెను; తొండము నిమిరి తలను వాసన చూసి తొడపై కూర్చోబెట్టుకొనెను; ఆదరించి తనలో ప్రేమ పొంగిపొరలగా తన ముద్దుల పట్టితో ఆ మదనారి ఇలా అనెను.

3-101-శా.
లెమ్మాశీతనగేంద్రపట్టణమునన్ లీలార్ధ మైయున్న మీ
మ్మందేవలె నుండనీ దగవు నీ వాయత్త మై తోడితే
మ్మా!నీవును నీ గణంబులును సంరంభమ్ముతో ముందఱం
బొమ్మా!మేమును గూడ వచ్చెదము సమ్మోదంబుతోఁ బుత్త్రకా!”

టీక :-
ఆయత్తము = సిద్ధము.
భావము :-
పుత్రా! లేనాయనా! హిమవంతుని పట్టణంలో మీ అమ్మ లీలార్ధమై యున్నది. మీ అమ్మను తీసుకురావాలి. నీవు ఇంకా ఇక్కడే ఉంటేఎలా. ముందుగా నీవు సిద్దమై నీ గణములతో బయలుదేరి వెళ్ళు. మేము కూడా వస్తాము నాయనా.