పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమాశ్వాసము : కవివంశాభివర్ణనము

1-23-క.
వేరు జగములు సేయఁగ
ధీతిఁ బరమేశు నానతిని దక్షుం డై
శ్రీమాధవుపొక్కిటఁ గల
తార నొక నలుమొగాల ధాత జనించెన్.

టీక :-
వేమరు = పలుమార్లు; ధీమతి = బుద్ధిశాలి; ఆనతి = ఆజ్ఞ; దక్షుడు = నిష్ణాతుడు; పొక్కిలి = బొడ్డు; శ్రీమాధవుడు = లక్ష్మీదేవి భర్త యైన విష్ణుమూర్తి.
భావము :-
లోకాలను సృష్టించడంలో నిష్ణాతుడైన నాలుగు ముఖములు కల వాడైన బ్రహ్మదేవుడు పలుమార్లు పరమేశ్వరుని ఆజ్ఞతో విష్ణువు నాభి కమలము నుండి పుట్టాడు.

1-24-క.
విదితముగ నతని మొగములఁ
దువులు నాల్గును జనించె రసతగాన
చ్చదువులు నాతని సృష్టికి
మలుఁడు వసిష్ఠతపసి ననం బయ్యెన్.

టీక :-
విదితము = తెలియబడునట్లు; చదువులు నాల్గు = చతుర్వేదములు (ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేదములు); సరసత = సారస్యము, సారము కలిగి యుండుట; సదమలుడు = సత్ అమలుడు.
భావము :-
బ్రహ్మదేవుని నాలుగు ముఖములనుండి నాలుగు వేదములూ పుట్టాయి. సకల సారములు నిండుగా గల ఆ వేదములను సృష్టించిన బ్రహ్మదేవునికి మిక్కిలి నిర్మలుడైన వశిష్ఠ మహర్షి పుట్టాడు.

1-25-వ.
అట్టి వసిష్ఠపుత్రుం డగు కౌండిన్యుండు.
భావము :-
అటువంటి వశిష్ఠుని కుమారుడైన కౌండిన్యుడు.

1-26-మ.
దుం డాయతపుణ్యమూర్తి మునిమందారుండు సన్మాన్యుఁడు
న్ముని నిర్నిద్రదయాత్ముఁడున్మహితుఁడున్మార్తాండ తేజుండు భూ
యాధీశ్వరవర్ణనీయుఁడు తపోణ్యుండు నైనట్టి కౌం
డికుం డన్ముని సన్మునీంద్రపరుఁడై యీ ధాత్రిఁ గీర్తింపఁగన్.

టీక :-
ధనదుడు = దాత; ఆయతము = నిడుపైన, ఆయత్తమైన ; మునిమందారుడు = మునులలో శ్రేష్ఠుడు; సన్మాన్యుడు = సజ్జనులచే గౌరవింపబడువాడు; నిర్నిద్ర = జాగరూకత కలిగిన; దయాత్ముడు = దయ హృదయుడు; మహితుడు = గొప్పవాడు; మార్తాండుడు = సూర్యుడు; తపోగణ్యుడు = తాపసులలో ఎన్నదగినవాడు; కౌండినకుడు = కౌండిన్యుడు; మహితుడు = గొప్పవాడు.
భావము :-
దానశీలుడు, గొప్ప పుణ్యమూర్తి, మునులలో శ్రేష్ఠుడు, మంచివారిచే గౌరవింపబడువాడు, అప్రతిహత దయామయుడు, గొప్పవాడు, సూర్యుని తేజస్సు వంటి తేజస్సు కలిగినవాడు, శ్రీరామునిచేత సైతము పొగడదగినవాడు, తాపసులలో ఎన్నదగినవాడు అని ఈ లోకమంతా కీర్తింపబడెడిది కౌండిన్య మహర్షి, గొప్పమునీశ్వరుడు …...

1-27-వ.
అట్టి కౌండిన్య గోత్రంబునం దాపస్తంబసూత్రంబున.
భావము :-
అటువంటి కౌండిన్య గోత్రమున ఆపస్తంభసూత్రము అను ధర్మశాస్త్రమును అనుసరించు వాడు …..

1-28-ఉ.
ల్లయభీమనాహ్వయకుమారకుఁ డన్నయమంత్రికిన్ దయా
వెల్లికి గౌరమాంబ కరవిందదళేక్షణుఁ డై జనించి వ
ర్థిల్ల వెలుంగు సజ్జనవిధేయుఁడు సోమననామధేయుఁ డా
ల్లమ యందుఁ గాంచె సుకుమారుల ధీరుల సత్కుమారులన్.

టీక :-
ఆహ్యయుడు = పేరు కలవాడు; వెల్లి= ప్రవాహము, పరంపర; అరవిందదళేక్షణుడు = తామరరేకులవంటి కన్నులు కలవాడు; వెలుంగు = ప్రకాశించు; నామధేయుడు = పేరు కలవాడు; కాంచెన్ = కనెను, పుట్టించెను.
భావము :-
మల్లయ భీమన అను పేరు గలవాని పుత్రుడు అన్నయమంత్రి. ఆయనకు, మిక్కిలి దయామయి యైన గౌరమాంబకు కలిగిన సంతానం సోమన. సోమన వద్ధిపొంది సజ్జనవిధేయునిగా ప్రకాశించెను. ఆ సోమనకు మల్లమ వలన కోమలులూ, గుణవంతులూ యైన చక్కటి కొడుకులు కలిగారు.

1-29-ఉ.
నీతి యుగంధరుం డనఁగ నిర్మలుఁడై ఘన నాగరీకుఁడై
యాత కీర్తి రేచనయు న్నయమంత్రియు సర్వశైవలో
కాతురహారుఁ డెల్లనయు య్యలు ప్రగ్గడయున్ దయాగుణ
వ్రావిభూషణుండు జనవంద్యుఁడు మాచయ నాఁగ నున్నతిన్.

టీక :-
యుగంధరుడు = ప్రతాపరుత్రుని మంత్రి, అతి యుక్తిశాలి; నాగరీకుడు= సంస్కృతిమంతుడు; ఆతత = విస్తారమైన; ఆతురత = ఆదుర్దా; హారుడు = పోగొట్టువాడు; వ్రాతము = సమూహము; వంద్యుడు = నమస్కరింపబడువాడు.
భావము :-
వారిలో యుగంధరుడు అంత నీతి కలవాడు, నిర్మలుడు, సంస్కార వంతుడు రేచన పెద్దవాడు. అన్నయమంత్రి రెండవ వాడు. సకల శైవుల ఆదుర్దాలను హరించువాడు ఎల్లన మూడవ వాడు. అయ్యలు ప్రగ్గడ నాలుగవవాడు. దయాగుణం కలిగి జనులచే గౌరవింపబడువాడుగా గొప్ప పేరు పొందినవాడు మాచన అయిదవ వాడు.

1-30-క.
అందుల మధ్యముఁ డెల్లన
మంరధీరుండు నీతిమంతుఁడు వనితా
కంర్పుఁడు మాచాంబిక
నందంబుగఁ బెండ్లియాడె భినవ కీర్తిన్.

టీక :-
అందుల = వారిలో; మందర = కవ్వపుకొండ; కందర్పుడు = మన్మథుడు;.
భావము :-
వారిలో మధ్యముడైన ఎల్లన కొండంత ధైర్యశాలి, నీతిమంతుడు, స్త్రీలకు మన్మథుని వంటివాడు. అతను మాచాంబికను పెండ్లియాడెను

1-31-ఉ.
మానిని మాచమాంబకుఁ గుమారుఁడు యెల్లనకుం బ్రసిద్ధిగా
మానుగ నుద్భవించిరి కుమారులు కేసనయుం గుణావళి
న్మానితుఁ డైన మాధవుఁడు మాన్యుఁడు నిమ్మడి నాఁగ మువ్వురున్
భూనుతు లైరి తేజమునఁ బోలిరి ధర్మజ భీమ పార్థులన్.

టీక :-
మానిని = అభిమానము గలామె, స్త్రీ; కుమారుడు = బాలుడు; నాఁగ = అను.
భావము :-
మాచమాంబ, ఎల్లనలకు కేసన, గుణవంతుడైన మాధవుడు, గొప్పవాడైన ఇమ్మడి అనే ముగ్గురు కుమారులు జన్మించారు. వారు తేజస్సులో ధర్మరాజు, భీముడు, అర్జునులవలె లోకంలో ప్రసిద్ధులయ్యారు..

1-32-ఉ.
మ్ముల నర్థి కోటి ధన మిమ్మని పల్కిన పల్కుకంటెఁ దా
నిమ్మడి నిచ్చు నిచ్చు మది నిమ్మడి పుణ్యముఁ బొందుభాతి లో
మ్ములఁ గీర్తిఁ జెంద గణవ్రజమాన్యుఁడు మానికంబు మా
యిమ్మడి సర్వమార్గముల నిమ్మడి గాక తలంప నల్పమే.

టీక :-
ఇమ్ములను = ఇచ్చునపుడు; ఇమ్మడి = రెట్టింపు, అధికుడు; గణకుడు = కరణము (గ్రామ గణాంకాలు నిర్వహించువాడు); వ్రజము = సమూహము, కెంపు, శ్రేష్ఠము; మానికము = రత్నము, కెంపు, శ్రేష్ఠము.
భావము :-
ఇచ్చునపుడు ఎవరైనా కోటి ధనమిమ్మని అడిగితే దానికి రెట్టింపు ధనాన్ని మనఃపూర్వకంగా యిస్తాడని లోకంలో కీర్తి పొందాడు. దానంచేయటంలో రెట్టింపు పుణ్యం పొందినట్లు. కరణాలు అందరిలో శ్రేష్ఠుడు మా ఇమ్మడి. అన్నింటా అతను ఎక్కువే గాని తక్కువ కాదు.

1-33-క.
సాధుగుణాఢ్యుఁడు కేసన
మావనందనుఁడు రూపహిత విభూతిన్
మావతల్పము దక్షత
మావుఁ డనుకంపవృత్తి మాధవుఁ డయ్యెన్.

టీక :-
మాధవనందనుడు = మన్మథుడు; మాధవతల్పము = ఆదిశేషుడు; మాధవుడు = విష్ణుమూర్తి
భావము :-
కేసన సద్గుణాలలో సాధువు; అందంలో మన్మథుడు; ఓర్పు నేర్పులలో శేషుడు; దయలో విష్ణువు.

1-34-ఉ.
భూసురవంద్యునిన్ సుగుణభూషణు నాశ్రితకల్పవృక్షమున్
దాజనప్రపన్ను శివతత్వమనోరథకౌతుకోన్నతున్
కేనమంత్రి సత్యనిధిఁ గీర్తివిశాలుఁ జిరాయు రున్నతున్
జేసియుమామహేశ్వరులు చెన్నుఁగఁ గాతురుగాక సత్కృపన్.

టీక :-
భూసుర = విప్రుడు; సుగుణభూషణుడు = సుగుణములు భూషణములుగా కలవాడు; దసజనులు = ఆశ్రయించి ఉండు వారు; కౌతుకము = ఉత్సాహము; చిరాయుః = దీర్ఘ ఆయుస్సు కలవాడు; చెన్నుగ = చక్కగా.
భావము :-
మాన్యుడైన బ్రాహ్మణుడు కేసనమంత్రి గుణవంతుడు, తననాశ్రయించిన వారి విషయంలో ప్రసన్నుడు, శివతత్వమందు మిక్కలి ఆసక్తి కలిగిన శ్రేష్ఠుడు, సత్యవంతుడు, విశాలమైన కీర్తి కలవాడు. అతనికి ఉమామహేశ్వరులు దయతో చక్కటి చిరాయువు, ఉన్నతి కలుగజేతురు గాక.

1-35-క.
మంచిగుణంబుల నీతఁడు
మంచిగదా మంచిపేరు హిఁ దగు ననఁగా
నంచిత వితరణఖనియై
మించిన తేజమ్ముతోడ మెఱసె ధరిత్రిన్.

టీక :-
వితరణఖని = దానములు చేయుటలో గని వంటివాడు; అంచిత = పూజింపబడినది; గౌరవింపబడినది.
భావము :-
కేసన మంచిగుణాల వలన మంచివాడుగా పేరుతెచ్చుకున్నాడు. గౌరవప్రదంగా దానాలు చేస్తూ వితరణఖనిగా భూమిపై పేరు తెచ్చుకున్నాడు.

1-36-ఉ.
ట్టిఘనుండు మంచికి దయాగుణధీమణి మాచమాంబకుం
బుట్టిన లక్ష్మికన్య యనఁ బొల్పగు గోపన కూర్మి చెల్లెలిన్
నెట్టనఁ బెండ్లియాడె మహనీయుఁడు కేసనమంత్రి శ్రీసతిన్
ట్టపు వేడ్కఁ గేశవుఁడు దాను వరించిన భంగిఁ బొంగుచున్.

టీక :-
ఘనుడు = గొప్పవాడు; పొల్పగు = భాసించు.
భావము :-
నారాయణుడు శ్రీదేవిని వరించిన విధంగా, అటువంటి మహనీయుడైన కేసనమంత్రి దయామయి మాచమాంబకు పుట్టిన, గోపన యొక్క చెల్లెలైన లక్ష్మిని మిక్కిలి వేడుకగా పరిణయమాడాడు.

1-37-ఉ.
పానగంగ భోగశచి భాగ్యపుగౌరి గభీరభూమి సం
భానకుంతి రూపగుణభారతి సంపదలక్ష్మిదేవి సం
సేవితసంఙ్ఞ నిశ్చలవిశేష యరుంధతి యైన లక్ష్మి దాఁ
గేలకన్యయే తలఁపఁ గీర్తనసేయఁదగున్ ధరాస్థలిన్.
భావము :-
ఆ లక్ష్మి (లక్కమాంబ) పవిత్రతలో గంగ, భోగంలో శచీదేవి, సౌభాగ్యంలో గౌరీదేవి, గంభీరంలో భూదేవి, ఆదరించుటలో కుంతి, గుణరూపములలో సరస్వతి, సంపదలో లక్ష్మీదేవి, సేవలో సూర్యుని భార్య సంజ్ఞ వంటిది. నిశ్చలమైన పతిభక్తిలో అరుంధతి. భూమిపై ఆమెను కీర్తించవలసిందే కానీ ఆమె సామాన్య కన్య కాదు.

1-38-క.
ఆ దంపతులకు సంతత
మోదిత చిత్తులకు మిథునముఖ్యులకు దయా
పాదితగుణులకు శంకర
పాయుగాంభోజ భక్తి పారీణులకున్.

టీక :-
మోదిత = సంతోషించిన; చిత్తులు = మనసు కలవారు; దయ ఆపాదిత = కృప కలిగించిన; గుణులు = సుగుణములు కలవారు; పారీణులు = మిక్కలి నేర్పరులు.
భావము :-
నిరంతర సంతోషంగా యుండు మనసు కలవారూ, దయామయులూ, శివపాదపగ్మముల యందు సేవాతత్పరులూ అయిన ఆ దంపతులకు. . .

1-39-శా.
సారాచారుఁడు కాంతివైభవగతిన్ సంపూర్ణచంద్రుండు భూ
దారాహీంద్రసమానదక్షుఁడు సదార్మాకరుం డర్థి మం
దారుండంచితరూపరేఖలను గంర్పుండు భూయోయశ
శ్రీమ్యుం డగు తిప్పనార్యుఁడు జనించెన్వంశవర్ధిష్టుఁ డై.

టీక :-
సార = శ్రేష్ఠమైన; ఆచారుడు = ఆచారాములు కలవాడు; భూదారము = వరాహము; అహీంద్రుడు = సర్పములకు ప్రభువైన ఆదిశేషుడు; కందర్పుడు = మన్మథుడు; భూయః = మఱల; శ్రీ = శ్రీకరమగు; రమ్యుడు = మనోజ్ఞమైనవాడు.
భావము :-
శ్రేష్ఠమైన ఆచారపరుడు, పూర్ణ చంద్రునిలా చల్లని వైభవం అను కాంతి కలవాడు, దక్షతలో వరాహ ఆదిశేషులకు సమానుడు, నిత్య ధార్మికుడు, అర్థుల ఎడ కల్పవక్షము అయినవాడూ, మన్మథుని వంటి అందగాడు ఇంకా శ్రీకరమైన మనోజ్ఞమైనవాడు అయిన తిప్పనార్యుడు వంశోద్ధారకుడై జన్మించాడు.

1-40-వ.
తదనుజుండ నై యేను జన్మించి పోతయ నామధేయుండ నై పరఁగి జనకశిక్షిత విహితాక్షరాస్యుండనై వీరభద్రప్రసాదలబ్ద కవితాతిశయంబున.

టీక :-
తత్ = అతని; అనుజుడు = సోదరుడు; ఏను = నేను; పరగు = ప్రసిద్ధుడగు, ప్రవర్తిల్లు; విదిత = విహితమైన.
భావము :-
నేను ఆ తిప్పనకు తమ్ముడనై జన్మించి, పోతన అనే పేరుతో ప్రసిద్ధుడనైతిని. తండ్రిగారి శిక్షణలో పద్దతిగా చదువుకున్నవాడనై, వీరభద్రుని అనుగ్రహం వలన గొప్ప కవిత్వం పొంది…..

1-41-ఉ.
భావతప్రబంధ మతిభాసురతన్ రచియించి దక్షదు
ర్యాకథాప్రసంగమున ల్పవచస్కుఁడ నైతి తన్నిమి
త్తాతవక్త్రదోష పరిహారముకై యజనైకశైవశా
స్త్రామ వీరభద్రవిజయంబు రచించెద వేడ్కనామదిన్.
భావము :-
[గమనిక: ఈ పద్యము పెక్కు మాతృకల యందుఁ గాన్పించదు, ప్రక్షిప్తము కానోపును.] భాగవత ప్రబంధం రచించినపుడు దానిలో దక్షయజ్ఞము గురించి తక్కువగా వర్ణించాను. ఆదోష పరిహారార్ధం శైవశాస్త్ర ఆగమనం చెప్పినట్లు మనసారా వీరభద్రవిజయం రచిస్తాను.