పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థాశ్వాసము : వీరభద్రుం డింద్రాదులతోఁ బోరాడుట.

4-161-క.
క్కడ వచ్చెద రిచటికి
వ్రక్కలు గావింతు నన్న వాసవుఁ డనిలో
గ్రక్కున వజ్రము వైచెను
చిక్కెను వజ్రంబు వీరసింహునిచేతన్.

టీక :-
వ్రక్కలు = ముక్కలు; వాసవుడు = ఇంద్రుడు; అని = యుద్ధము.
భావము :-
వీరేశ్వరుడు మీరిలా వస్తే ముక్కలు చేసేస్తానన్నాడు. ఇంతలో ఇంద్రుడు యుద్ధములో వెంటనే వజ్రాయుధము విసిరెను. అది వీరసింహుని చేతిలో చిక్కింది.

4-162-క.
అందంద వీరకాహళ
దుందుభి నిప్సాణ శంఖ తూర్య రవంబుల్
క్రందిల్లె వీరసారథి
బృందారకబృంద మెల్లఁ బొరిఁబొరి వణఁకెన్.

టీక :-
అందంద = అప్పటికప్పుడే; కాహళము = బాకా; దుందుభి = భేరి; నిస్సాణము = చర్మవాద్య విశేషము; తూర్యము = వాద్యము; క్రందిల్లు = మ్రోగు; బృందారకము = వేల్పులు; పొరిపొరి = చాలా.
భావము :-
అప్పటికప్పుడే బాకా భేరి చర్మవాద్య విశేషములు శంఖనాదము వాద్యములు ప్రమథగణాలు మ్రోగించారు. దేవతా గణాలు చాలా వణకిపోయాయి.

4-163-వ.
ఇట్లు తన కెదురుపడ నారాయణేంద్రాది దేవగణంబుల నాలంబున పలాయమానంబులం జేసి తనివిచనని కోపంబున నొకని నొకనికిం బది నూఱు వేయు లక్ష కోటిరూపులై విజృంభించి ప్రళయకాలాగ్ని చందంబున వలయాకారంబుఁ గొని కొఱవి ద్రిప్పిన తెఱంగున నెక్కడఁ జూచినఁదానయై కనుపట్టి చంపుచు; నెదురులేని మదగజేంద్రంబు చందంబున నవ్వీరగణ కంఠీరవుండు ఘోరవీరతాండవాడంబరుం డై సమరకేళీవిహారంబు సలుపుచున్న సమయంబున నిలింప దేవ సంఘంబులు వీరభద్రునిచే భల్లభగ్నాంగులై శిరంబులు దెగి అర్ధచంద్ర నిశిత విఖంబులఁ గంఠంబులు దెగిపడి బెగడి జేవురు గొండల తెఱంగున నెత్తుటఁ జొత్తిల్లువారును; తమ బంధుజనంబులం బాయఁజాలక వారి కెదురుపడి చచ్చువారును; గుముర్లు కట్టి వీరభద్రు రణంబు చూచి భీతచిత్తులై ప్రాణంబులు విడుచువారును; దావానలంబునం బడి కాలు భూరి జంతుచయంబుల చాడ్పున భద్రుఫాలానలంబున భస్మీభూతు లగువారును మఱియు శివద్రోహుల మగు పాపకర్ములకింత వలవదే యని తమలోన నెఱింగించుకొను వారును మఱియుఁ గులశైలగుహాంతరములలో డాగువారును; గాఱడవుల దూఱువారును; నేరుల మునుంగువారును; నెఱ్ఱెలు చొఱఁబాఱువారును; బీనుఁగుల మఱువు దీసికొనువారును; రూపు చెడి దేహయష్టి తుత్తుమురులైనవారును; ‘వీరభద్ర వీరభద్రా శరణంబు శరణం’ బనువారును; భల్లాయుధంబులచేత దేహంబులువ్రయ్యలై పలుమాఱు నెలుంగెత్తి యేడ్చువారును; వూరి గఱచుకొని నిరాయుధులై పడువారును నైరయ్యవసరంబున కొండలరాసులు వ్రేగులప్రోవులు నెముకలతిప్పలు మాంసంబులు పీనుఁగుతలలు పెంటలు మెదడు రొంపియు నెత్తురుటేరులును నై పీనుంగులు జలచరంబుల చాడ్పునను ధవళచామరంబులు వెలినురుఁగుల చందంబునను గంధర్వ దివిజ శల్యంబుల తెట్టలు కొండలకైవడియు నై పడియున్న దేవభట్టారకు లరవిందపుఁ దూండ్లభంగియుఁ దునిసిన ధవళఛత్రంబులు పుండరీకంబుల కరణియు రాలిన కరకంకణాది భుషణజాలంబులు మరాళాది జలపక్షుల లాగునను గుప్పలుగొని పడియున్న శిరంబులు శంఖంబులును దట్టంబులు నానా ద్వీపంబులును మార్తాండమండల కిరణంబులవలనఁ దేరి చూడరాని నెత్తురుటేరులును శరంబులచేత నురంబులుపగిలి పఱచు నిలింప సంఘంబులు తరంగంబుల చందంబునను మహాభీతచిత్తులై పఱచు నార్తారవంబులు మ్రోఁతయు నై మహార్ణవంబుతో ననుకరించె నప్పుడు శరచ్చంద్రికా మయూఖవిలసితుం డైన చందురుండునుం బోలె రక్తార్ణవంబు నుబ్బించుచు వీరభద్రుం డొప్పుచుండె నయ్యవసరంబున.

టీక :-
ఆలము = యుద్ధము; పలాయనము = పాఱిపోవు; భల్ల = బల్లెము; నిశిత = వాడియైన, సానబెట్టబడిన; విశిఖము = బాణము; బెగడు = భయపడు; జేవురు = ఎర్రని; జొత్తిల్లు = ఎర్రనగు; గుముర్లు కట్టు = గుంపుకట్టు; చాడ్పు = విధము; పూరి = గడ్డి; చామరము = వింజామర; తునియు = ఖండితమగు; పుండరీకము = తెల్లతామర; మరాళము = హంస.
భావము :-
ఇలా తనకెదురుపడ్డ నారాయణుడు ఇంద్రుడు మొదలైన దేవగణాలను యుద్ధములో పారిపోయేలా చేసి ఇంకనూ తృప్తి చెందక కోపముతో ఒకటి పది వంద వేయి లక్ష కోటి రూపులై విజృంభించి ప్రళయకాల రుద్రునివలె గుండ్రముగా కొరివిని (మండుచున్న కట్టెను) తిప్పిన విధముగా ఎక్కడ చూసినా తానై కనబడుతూ చంపుతూ ఎదురులేని మదపుటేనుగువలె ఆ వీరసింహము ఘోరమైన వీర తాండవం చేస్తూ యుద్ధమనే ఆట ఆడుతున్నాడు. ఆ సమయంలో దేవ సమూహాలు వీరభద్రునిచే బల్లెములచేత భంగపడిన శరీరము కలవారై తలలు తెగి వాడి అర్థచంద్రాకార బాణములచే కంఠములు తెగిపడి భయపడి ఎర్రని కొండలవలె రక్తముతో ఎర్రనైనవారును తమ బంధువులను వదలలేక వారికెదురుపడి చనిపోయేవారును గుంపుకట్టి వీరభద్రుని యుద్ధము చూసి భయపడి ప్రాణములు విడుచువారును అడవిలో పుట్టిన అగ్నిలో పడి కాలిపోయే పెద్ద జంతు సమూహములవలె భద్రుని ఫాలాగ్ని జ్వాలలలో భస్మమైనవారును మరియు శివద్రోహులమైన పాపులకు ఇలా జరగవలసిందే యని తమలో తాము అనుకునేవారును ఇంకనూ కుల పర్వత గుహలలో దాగువారును కారడవులలో దూరువారును ఏరులలో మునుగువారును భూమి పగుళ్ళలోనికి చొచ్చుకుపోయేవారును శవములచాటున దాగేవారును దేహము పొడిపొడియై రూపము మారినవారును వీరభద్రా శరణు శరణు యనే వారును బల్లెములవంటి ఆయుధములచేత దేహములు ముక్కలైనవారును పలుమారు గట్టిగా ఏడ్చేవారును నిరాయుధులై గడ్డికరచుకొని పడినవారును అయ్యి ఆ సమయంలో ప్రేగులప్రోవులు కొండలరాసులై ఎముకలు చిన్న కొండలై మాంసములు శవాల తలలు పెంటలు మెదడు బురదలై రక్తపుటేరులై ఆ శవాలు నీటి ప్రాణులవలె తెల్లని వింజామరలు తెల్లని నురుగుల వలె గంధర్వుల దేవతల ఎముకలగుట్టలు కొండలవలె పడి యుండగా దేవ భట్టారకులు తామరతూండ్లవలె ముక్కలైన తెల్ల గొడుగులు తెల్ల తామరలవలె రాలిన కర కంకణ భూషణములు హంసల వంటి పక్షుల వలె కుప్పలు పడియున్న తలలు శంఖాల వలె సూర్యమండల కిరణాల వలన చూడరాని రక్తపుటేరులును బాణములచేత రొమ్ములు పగిలిన దేవ సమూహములు అలల వలె భయముతో అరచే ఆర్తనాదములు సముద్ర ఘోషవలె మహా సముద్రమును అనుకరించెను. శరత్కాలవెన్నెలతో వెలుగుతున్న చంద్రుని వలె ఎర్రని వీరభద్రుడు ప్రకాశిస్తున్న సమయంలో.

4-164-మత్త.
టించె రణంబులోఁ బడియున్న మాధవముఖ్యులన్
సాసంబునఁ జేరి వెండియుఁ జండకోపముతో “శివ
ద్రోహులిద్దఱు నెల్ల వెంటనఁ దూలి పోవఁగ నీక మీ
రావంబునఁ బట్టు డిందఱి” నంచుఁ బల్కె గణాధిపుల్.

టీక :-
ఓహటము = వెనుదీయుట; వెండియు = మరియు; ఆవహము = కలిగించునది.
భావము :-
వెనుకడుగు వేసి యుద్ధములో పడియున్న మాధవ ముఖ్యులను చేరి చాలా కోపముతో శివద్రోహులను ఇలా తూలిపోనీకూడదు. పట్టుకోండి వీరి నందరినీ అంటూ గణాధిపులు పలికారు.

4-165-త.
కువేల్పులఁ బట్టు వారల కాళ్లుసేతులు పొట్టలున్
మొలు కూఁతలు వెట్ట నుగ్రత ముష్టిఘాతల నొంచుచున్
వగం జననీక శృంఖల బంధనంబులు చేసి తా
రిమురిన్ రణకేళి సల్పెను నాత్మ నెంతయు సోలుచున్.

టీక :-
కఱకు = కఠినమైన; మొర = ఆర్తనాదము; శృంఖల = సంకెల; అరిమురి = అత్యంత.
భావము :-
వీరభద్రుడు మిక్కిలి రణకేళిని విహరిస్తున్నాడు. దేవతావీరులను పట్టుకొని వారి కాళ్ళు చేతులు పొట్టలపై పిడికిళ్ళతో కొడుతుంటే వారు ఆర్తనాదాలు కేకలు పెడుతున్నారు. వారిని పారిపోనీక సంకెలలతో బంధిస్తున్నాడు. అలా విహరిస్తూ తాను మనసులో పరవశిస్తున్నాడు.”

4-166-వ.
అనిన విని మునీంద్రులు విస్మయాత్మకు లై వాయుదేవు నుపలక్షించి తమలో నిట్లనిరి.

టీక :-
విస్మయము = ఆశ్చర్యము; ఉపలక్షించు = చూచు.
భావము :-
అనగా విని మునీంద్రులు ఆశ్చర్యపడి వాయుదేవుని చూసి ఇలా అన్నారు.

4-167-క.
“శినిందయు స్మృతినిందయు
శిభక్తులుగానివారి సేవించుటయున్
భునమునఁ గాదు దక్షుఁడు
శినిందను దలఁచి యిట్లు చెడియెన్ ధరణిన్.

టీక :-
స్మృతి = ధర్మశాస్త్రము; భువనము = లోకము.
భావము :-
శివనింద, వేదనింద, శివభక్తులు కాని వారిని సేవించడము లోకంలో మంచిది కాదు. ధక్షుడు శివనింద చేయడం వల్లనే చెడిపోయాడు.

4-168-సీ.
లలితంబుగ జన్న శాలలు భస్మమై
తోరణంబులు డుస్సి ధూళిఁ గలసె
హోమగుండము లెల్ల నొగి నెత్తురులఁ దోఁగి
బ్రహ్మలు వేల్పులు రఁగఁ జచ్చె
బృందారకావలిఁ బొలియించెఁ గులవధూ
నవిలాపంబులు సందడిల్లె
భాసురం బగు లక్ష్మితిఁ బట్టి కట్టిరి
పసులు పెద్దలు రణిఁ గూలె

4-168.1-ఆ.
బెరసి తలలగములు పీనుఁగుపెంటలు
దపుకుప్పలైన మాంసములును
క్తనదులు మెదడు రాసులు నెముకలు
గుట్టలయ్యెఁ జెప్ప జెట్టలగుచు.

టీక :-
జన్నము = యాగము; డుయ్యు = ఊడదీయు; పరగ = ఒప్పుగా; బృందారకులు = దేవతలు; ఆవళి = వరుస; భాసురము = ప్రకాశించునది; బెరసు = క్రూరము; గమి = సమూహము; మదము = , ఏవనుగు మదము, అహంకారము, క్రొవ్వు; చెట్ట = చెడ్డ.
భావము :-
యాగశాలలు భస్మమయ్యాయి. తోరణములు ఊడి మట్టిలో కలసిపోయాయి. హోమగుండాలన్నీ నెత్తురుతో నిండిపోయాయి. యాగ నిర్వహణ చేయు బ్రాహ్మణులూ దేవతలూ చనిపోయారు. దేవతా సమూహాలు హింసింపబడ్డాయి. కులస్త్రీల ఏడుపులతో సందడిగా యుంది. విష్ణువును పట్టి కట్టేశారు. తాపసులు పెద్దలు నేల కూలారు. క్రూరముగా తలల గుంపులు, శవాల పెంటలు, క్రొవ్వు, మాసము కుప్పలు, రక్తపుటేరులు, మెదళ్ళ కుప్పలు, ఎముకల గుట్టలు చెప్పడానికే బహు చెడ్డగా ఉన్నాయి.

4-169-ఆ.
గిరిశుఁగూర్చి సేయు గురుపాతకంబైన
పుణ్య మధికమగుచుఁ బొరయుచుండు
శ్రీగిరీశు వేఱు సేయు పుణ్యంబైన
పాతకంబు నెల్ల భంగులందు.

టీక :-
పాతకము = పాపము; పొరయు = కలుగు.
భావము :-
పరమేశ్వరుని స్మరిస్తూ చేసే గొప్ప పాపమైనా అధికమైన పుణ్యమును కలుగచేస్తుంది. పరమేశ్వరుని నిర్లక్ష్యంచేసి చేసే పుణ్యమైనా అది అన్నిరకాలుగానూ పాపమే అవుతుంది.

4-170-వ.
అని మునీంద్రులు సముచితాలాపంబులం బల్కుచు వాయుదేవుం జూచి "మహాత్మా! మఱియును దత్సంగ్రామంబున వీరభద్రుం డెవ్విధంబునం జరియించె వినుపింపు" మని యడిగిన నతం డిట్లనియె.

టీక :-
సముచితము = తగిన; చరియించు = తిరుగు.
భావము :-
అని మునీంద్రులు తగిన విధముగా మాట్లాడుతూ వాయుదేవుని చూచి “ఆ యుద్ధములో వీరభద్రుడు ఇంకనూ ఏ విధంగా వర్తించాడో వినిపించ”మని అడుగగా వాయుదేవుడిలా అన్నాడు.

4-171-క.
“ఈవిధమున గణనాథులు
దేవానీకములఁ బట్టి తెరలని బలిమిన్
బోని శృంఖలబంధము
గావించిరి సంగరమునఁ లుషాత్మకులన్.

టీక :-
అనీకము = గుంపు; తెరలు = బయలుదేరు.
భావము :-
“ఈ విధముగా సేనా ముఖ్యులు యుద్ధములో పాపాత్ములైన దేవతా సమూహాలను పట్టి వెళ్ళడానికి వీలులేకుండా గట్టి శృంఖలములతో కట్టివేశారు.

4-172-వ.
తత్సమయంబున.

4-173-క.
చారుతరభక్తితోడను
సాథి యై మెలఁగుచున్న నవునఁ బ్రీతిన్
వీగణాధీశ్వరునకు
భాతిపతి మ్రొక్కి నిలిచి లికెన్ గడఁకన్.

టీక :-
చారుతరము = మిక్కిలి చక్కనిది; కడకన్ = స్థైర్యముతో, ప్రయత్నించి.
భావము :-
మిక్కలి చక్కని భక్తితో సారథిగా వర్తిస్తూ యున్న చనువుతో బ్రహ్మ ప్రీతిగా వీరభద్రునకు నమస్కరించి స్థైర్యముతో ఈ విధముగా పలికాడు.

4-174-శా.
వీరాంభోనిధి! నేఁడు మీ యలుకకున్ వీరెంతవారయ్య త్వ
త్కారుణ్యంబునఁ గాతు గాక యని యా ష్టాత్ములన్ బోరిలోఁ
గాఱింపం గబళింప నీ ప్రమథుఁ డొక్కండైన జాలండె దు
శ్చారుల్ దివ్వులు వీరి నెన్నక మదిన్ సైరించి రక్షింపవే.

టీక :-
అంబోనిధి = సముద్రము; అలుక = కోపము; త్వత్ = నీది; కాఱించు = ఓడించు; కబళించు = మింగు; దుశ్చారులు = దుష్టవర్తనులు; దివ్వులు = దేవతలు.
భావము :-
“వీర సముద్రుడా! వీరభద్రుడా! నేడు నీ కోపానికి వీరెంతవారయ్యా? ఈ దురాత్ములను యుద్ధములో ఓడించి గెలవడానికి నీ ప్రమథ గణంలోని ఒక్కడు చాలు నయ్యా. నీవు రక్షించే స్వభావం కలవాడివి కనుక వీరిని కాపాడుము. వీరు దేవతలు దుష్ట వర్తనులు యైనా వీరి తప్పులను మనసున పెట్టుకోక సహించి రక్షింపుము.

4-175-క.
ప్పులు చేసిన బిడ్డల
ప్పులకును శిక్షఁ బెట్టి తండ్రులు దెలియం
జెప్పుదురుగాక యెందును
ప్పులకును ద్రుంతురయ్య రుణేందుధరా!

టీక :-
త్రుంచుట = చంపుట; తరుణేందుధర = చంద్రశేఖరుడు.
భావము :-
తప్పులు చేసిన పిల్లలను తప్పు తెలిసేలా తండ్రులు శిక్షిస్తారు. అంతేకానీ చంద్రశేఖరా! వీరేశ్వరుడా! తప్పుచేసాడని తల తీసేస్తారా?

4-176-క.
తారేవెట్టిన తరువుల
తారే వెఱుకుదురె పతికి దాసీజనముల్
నేక యెఱుఁగక చేసిన
నేరంబులు సైఁప వలదె నీలగ్రీవా!”

టీక :-
తరువులు = చెట్లు; సైపు = సహించు.
భావము :-
తాము నాటిన మొక్కలను తామే ఎవరూ పీకరు కదా. సేవకులు తెలియక చేసిన తప్పులను యజమాని సహించాలి కదా! నీలకంఠా! భద్రేశ్వరా!”

4-177-క.
ని యిట్లు బ్రహ్మదేవుఁడు
వినుతులు సేయంగఁ బ్రీతి వీరాధిపుఁడు
న్మమున దయ గరుణించుట
ని హరియును సురలు బ్రహ్మ టితాంజలులై.

టీక :-
వినతి = విజ్ఞప్తి.
భావము :-
అని ఈ విధముగా బ్రహ్మదేవుడు ప్రార్థించగా ప్రీతి చెంది వీరుడు మనస్సునందు దయతలచుట చూసి విష్ణువు దేవతలు బ్రహ్మ చేతులు రెండూ జోడించి...

4-178-వ.
ఇట్లు స్తుతియింపం దొడంగిరి.

4-179-క.
“జజయ నిర్జరమదహర!
జయ రణరంగభీమ! శౌర్యోద్దామా!
జయ వీరాంభోనిధి!
జయ లోకైక వీర! సంతతధీరా!

టీక :-
నిర్జరులు = దేవతలు.
భావము :-
“దేవతల గర్వమును హరించినవాడా! జయము.జయము. రణరంగ భయంకరుడా! జయము జయము. మహాశూరుడా! జయము.జయము. వీర సముద్రుడా! జయము. జయము. జగదేకవీరా! ఎడతెంపులేని ధీరత్వము కలవాడా! జయము.జయము.

4-180-దం.
శ్రీవీరరూపా! శివా ద్రోహగండా! ప్రచండప్రతాపా! సుపర్వాణసంఘా! తమోభానుబింబప్రదీపా! మహాకోప రూపాదివీరాంకవీరా! పురారాతి సంహార ఘోరావతారా! శివాచారమందార! బృందారకాధీశగర్వాపహారా! దయాకార! నాగేంద్రహారా! సనందాదియోగీంద్రచేతోవిహారా! జనాధార! నీ దివ్య తత్త్వంబు భావింపఁగా లేక గర్వాంధకారాంధు లేమైతిమో నీదు రూపంబు రూపింప నజ్ఞాన బంధంబులం జిక్కి వేదప్రకారంబులన్ మించి యిచ్చోటికిం దక్షయాగంబు వీక్షింపఁగా నిన్ను మారాక యెల్లం గడుం దప్పులై యుండు సైరింపవే దేవదేవా! శివద్రోహు లైనట్టి మమ్మున్ విజృంభించి శిక్షించితీవింక నీదైన వైరంబుచాలింపు తండ్రీ! మముం గూర్చి మే మెంతవారమ్ము నీ యానతిం గాదె యీ బ్రహ్మ లోకంబులం బ్రాణనిర్మాణుఁ డై యుంట; నీ యానతిన్ గాదె యీ విష్ణు లోకైకరక్షాభుజాదక్షుఁ డై యుంట; నీ యానతిం గాదె రుద్రుండు సర్వప్రపంచారి యై యుంట; నీ యానతిం గాదె రేయుందినంబుల్ వెలుంగొందుచుం జంద్రసూర్యాదులున్ భవ్వు లై యుంట; నీ యానతిం గాదె దేవేంద్ర నాగేశ ముఖ్యుల్ ప్రతాపించి దిక్పాలు రై యంట; నీ యానతిం గాదె దేవౌఘముఖ్యుల్ సులోకోపకారార్థు లై యుంట; నీ యందుఁ గాదే సరోజాతజాతాండముల్ దొంతులై యుంట; నీ యున్న చందంబు నేమెంత యూహింపఁగావచ్చు; వేదంబులున్నీవ; వాదంబులున్నీవ; ధైర్యంబులున్నీవ; మర్మంబులున్నీవ; యీ బ్రహ్మయున్నీవ; యీ విష్ణువున్నీవ; యీరుద్రుఁడున్నీవ; సర్వంబునున్నీవ సుమ్మీ; జగన్నాధ! నీ పెంపు నీకుం దలంపంగఁ జిత్రంబు మాబోఁటి వారెల్ల నిన్నున్ విచారింపఁగా నేర్తురే? నీవు కారుణ్యదృష్టిన్బ్రసన్నుండ వై వీరు నా వారు నా దాసు లంచున్ ముదంబొప్ప మన్నించి దివ్యప్రబోధప్రపాదంబులన్ జేసి రక్షింపగా నీకు భారంబు గాకుండు నజ్ఞానభావంబులంబాపి సుజ్ఞాన మార్గంబులం జేసి నిష్కర్ము లై నిత్య సమ్మోదు లై యేకచిత్తంబునంబొంది నిర్వాణు లై నిష్కళంకంబులన్ బొంది మిన్నంది మీ యందు భావంబు గీలించి; నీదివ్య రూపంబు దా నెట్టిదౌఁ గాక యంచుం దలం పొంది భావించు వా రెల్ల దృగ్గోచరం బైన నిన్నేర్పడం గానఁగా లేక విభ్రాంతు లై చిక్కువడ్డార దెందేనిమిత్తంబునం జేసి నీచందమున్నీ విలాసంబులున్నీదు రూపంబునుం జూచియున్నీవు దండించు పుణ్యంబులున్బొందఁగల్గెన్; మహాధన్యులమ్మైతి మో దేవ! దేవాదిదేవా! మహాదేవ! నీ లెంక లైనట్టి నీ దాసులైనట్టి మమ్ముం దయాళుండ వై ప్రీతి రక్షింపవే; దేవ! వీరెవ్వరుం గానఁగా లేరు నేరంబు సైరింపవే దేవ! మన్నింపవే దేవ! శ్రీవీరభద్రా! శరణ్యంబు రుద్రా! నమస్తే!నమస్తే! నమస్తే! నమః.

టీక :
శ్రీ = కీర్తి; సైరించు = సహించు; కీలించు = చేర్చు; లెంకలు = సేవకులు.
భావము:

టీక :-
శ్రీ = కీర్తి; సైరించు = సహించు; కీలించు = చేర్చు; లెంకలు = సేవకులు.
భావము :-
వీరుడనే కీర్తిని పొందినవాడా! శివ ద్రోహుల పాలిట గండము వంటివాడా! మిక్కిలి ప్రతాపము కలవాడా! అనేక సూర్యబింబములకు సమానమైన ప్రకాశము కలవాడా! వీరులకే వీరుని వంటి రూపము కలవాడా! త్రిపురాసుర సంహారా! ఘోరమైన అవతారము కలవాడా! శివాచారుల పాలిట కల్పవృక్షము వంటివాడా! దేవతా బృందాల గర్వమును పోగొట్టినవాడా! దయాకరా! నాగులను హారములుగా కలవాడా! సునందాది యోగీంద్రుల మనస్సులలో సంచరించేవాడా! జనాధారా! నీ దివ్య తత్వము తెలుసుకోలేక గర్వముతో అంధులమయ్యాము; నీ రూపము నిరూపించుకోలేక అజ్ఞానంలో పడి వేదము చెప్పిన దానిని అతిక్రమించి దక్షయాగము చూచుటకు వచ్చి చాలా తప్పు చేశాము.  అజ్ఞానబంధాలలో. మా తప్పులను సహించుము. దేవదేవా! శివ ద్రోహులైన మమ్ములను విజృంభించి శిక్షించావు. ఇంక నీ వైరము చాలించు తండ్రీ! నీ ముందు మేమెంతటివారము నీ యాజ్ఞతోనే కదా బ్రహ్మ లోకంలో ప్రాణులను పుట్టించేది; నీ యాజ్ఞతోనే కదా విష్ణువు లోకాలను రక్షించేది; నీ యాజ్ఞతోనే కదా శివుడు లోకాలను నశింపచేసేది; నీ యాజ్ఞతోనే కదా సూర్యచంద్రులు రేయింబగళ్ళను ఏర్పరచేది; నీ యాజ్ఞచేతే కదా దేవేంద్రుడు మొదలైనవారు దిక్పాలకులై యుండుట; నీ యాజ్ఞచేతే కదా దేవతా ముఖ్యులు లోకాలకు యుపకారులై యుండుట; నీలోనే కదా బ్రహ్మాండ భాండములు యున్నది; నీవుండే విధానము మేమూహింప గలమా? వేదములు నీవే; వాదములు నీవే; ధైర్యము నీవే; మర్మము నీవే; ఈ బ్రహ్మయు నీవే; ఈ విష్ణువు నీవే; ఈ రుద్రుడు నీవే; సర్వము నీవే సుమా; జగన్నాథా1 నీ పెంపు నిన్ను తలచుకుంటే మాకు ఆశ్చర్యం కలుగుతుంది. మాలాంటి వారు నీ గురించి ఆలోచించగలరా? నీవు దయతో ప్రసన్నుడవై వీరు నావారు నా దాసులు యనుకొని సంతోషంతో మమ్ములను క్షమించి నీ దివ్య ప్రబోధము చేసి రక్షించడం నీకు భారమా? మా అజ్ఞానాన్ని పోగొట్టి మంచి మార్గములో నడిపించి నిష్కర్ములుగా నిత్య సంతోషులుగా అధ్వైతాన్ని పొంది ముక్తిని పొంది కళంకం లేకుండా మీ యందు భక్తిభావము చేర్చి నీ దివ్యరూపము ఎటువంటిదో కదా యని భావించువారికి కనపడే నిన్ను చూడలేక విభ్రాంతులై చిక్కు పడేలా చేసి నీ విధానము నీ విలాసము నీ రూపము చూసి నీచేత దండింపబడి మహా పుణ్యులమయ్యాము. దేవదేవా! మహాదేవా! నీ సేవకులమైన నీ దాసులమైన మమ్ములను దయాళువై ప్రీతితో రక్షించు. వీరెవ్వరూ తెలియలేరు. నేరమును క్షమించు. మన్నించు వీరభద్రా! శరణు రుద్రా! నమస్కారము. నమస్కారము. నమస్కారము.

4-181-క.
జయ లోకారాధిత!
జయ ఫాలాగ్ని నేత్ర శిరవినయనా!
జయ శూలాయుధకర!
జయ సోమార్ధజూట! ర్వజ్ఞనిధీ!

టీక :-
శశి = చంద్రుడు; సోముడు = చంద్రుడు.
భావము :-
లోకారాధ్యా! జయము జయము. నుదుటియందు అగ్ని నేత్రము కలవాడా! సూర్యచంద్రులు నేత్రములుగా కలవాడా! జయము.జయము. శూలాయుధమును ధరించినవాడా! జయము. జయము. అర్థచంద్రుని జూటమందు ధరించినవాడా! జయము.జయము. సమస్తమూ తెలిసినవాడా! జయము. జయము.

4-182-క.
నినుఁగాన లేవు చదువులు
నినుఁ గానవు జగము లిట్టు నీవిచ్చోటం
నుదెంచి శిక్షవెట్టుట
నిగొని మాతపము లెల్ల పండుట గాదే.

టీక :-
చదువులు = వేదములు.
భావము :-
వేదములు నిన్ను చూడలేవు. లోకాలూ నిన్ను చూడలేవు. నీవిక్కడకు వచ్చి మమ్మల్ని శిక్షించడమంటే మా తపస్సులు ఫలించడమే కదా.

4-183-క.
పాపంబని చింతింపక
పాపాత్ముని దక్షుఁ గూడి తిమాలి వెసం
బాపు జన్నముఁ జూచిన
పాపాత్ముల కింత వలదె పాపము ధరణిన్.

టీక :-
వెసన్ = వేగముగా; జన్నము = యాగము.
భావము :-
పాపమని ఆలోచించక పాపాత్ముడైన దక్షునితో కలసి బుద్ధి లేకుండా వెంటనే పాపపు యాగమును చూసిన పాపాత్ములకు ఇలా జరగ వలసిందే.

4-184-శా.
భూమిన్ బాలురు సేయు వెఱ్ఱితనముల్ పోషించి యెవ్వారలం
బ్రేమన్ ముద్దులు సేయఁగావలయునో పెంపార నూహింపుమా
మేమెల్లన్ భవదీయపుత్త్రులము గామే తండ్రి! మానేరముల్
స్వామిద్రోహరగండ! సైఁచి కరుణన్ సంప్రీతి రక్షింపవే.

టీక :-
సైచి = సహించి.
భావము :-
లోకంలో పిల్లలు చేసే వెర్రి పనులను సహించి, వారిని పోషించేవారు. ప్రేమతో ముద్దు చెయ్యాలి కదా! పెద్ద మనసుతో ఆలోచించు. మేమంతా నీ పుతృలమే కదా. స్వామి ద్రోహము చేసేవారి పాలిట ప్రమాదమైనవాడా! మా నేరములు సహించి కరుణతో ప్రేమతో మమ్ములను రక్షించు.

4-185-క.
థారు వీరవిక్రమ!
దీయ మహోగ్రకోప పావకకీలన్
విరంబన నిట్లైతిమి
మత్తుల కింతి వలయుఁ బావనమూర్తీ!

టీక :-
అవధారు = వినుము; భవదీయ = మీయొక్క; భవము = సంసారము.
భావము :-
వీరవిక్రమా! విను. నీయొక్క మహోగ్రమైన కోపాగ్ని జ్వాలకి ఇలా అయ్యాము. పావనమూర్తీ! సంసార మోహము కలవారికి ఇలా కావలసిందే.

4-186-క.
క్షింపుము కరుణాకర!
క్షింపుము లోకనాథ! మ్యాకారా!
క్షింపుము రిపుసంహర!
క్షింపుము వీరభద్ర! రౌద్రసముద్రా!

టీక :-
రిపుడు = శతృవు.
భావము :-
దయామయా! రక్షించు. జగన్నాథా! రమణీయ స్వరూపా! రక్షించు.శత్రుసంహారా! రక్షించు. సముద్రమంత రౌద్రము కలవాడా! వీరభద్రా! రక్షించు.

4-187-వ.
అని మఱియు ననేక ప్రకారంబుల దామోదర విరించీంద్రాది సుర గణంబులు వినుతింప ననుకంపాయత్త మానసుండై వీరావేశంబుఁ జాలించి, గోవింద పురందర దేవగణసమూహంబులకు శృంఖలాబంధ మోచనంబులు చేయించి యప్పరమేశ్వరుం డున్నయెడకుఁ జనుదెంచి సాష్టాంగదండప్రణామంబు లాచరించి తన కడిమి మెఱసి దక్షాధ్వరంబు చుట్టుముట్టుకొని పట్టితెచ్చిన దేవతలను దదీయాంగకంబులును నమ్మహాదేవు సన్నిధిం బెట్టి వేర్వేఱ నెఱింగించువాఁడై యిట్లనియె.

టీక :-
విరించి = బ్రహ్మ; అనుకంపితము = జాలిపడు; మోచనము = విడుపు ; కడిమి = అతిశయము; మెఱయు = బయలుపరచు; అధ్వరము = యాగము.
భావము :-
అని ఇంకనూ బహు విధములుగా విష్ణు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలు ప్రార్థించగా దయాపూరిత మనస్కుడై వీరావేశము చాలించి విష్ణు ఇంద్ర దేవ గణములకు శృంఖలాలను విడిపించి పరమేశ్వరుడు యున్న వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారము చేసి దక్షయజ్ఞాన్ని చుట్టుముట్టి పట్టి తెచ్చిన దేవతలనువారి అంగములను ఆ మహాదేవుని వద్ద పెట్టి తన అతిశయము తెలియపరచే విధముగా ఎవరెవరి అంగములో విడివిడిగా వివరిస్తూ ఇలా అన్నాడు.