పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థాశ్వాసము : పరమేశ్వరునితో వీరేశ్వరుండు ధ్వంసవృత్తాంతమంతయుఁ దెల్పుట.

4-188-సీ.
"ది సరస్వతి ముక్కు; యిది దక్షు తుండంబు;
యిదె వహ్ని నాలుక వధరింపు;
మిదె హవ్యవాహుని యిల్లాలి చనుముక్కు
భాసురం బగుచున్ననాసికంబు;
యివె పావకుని చేతు; లివె దేవతల తలల్
నిడుద ముక్కును; భర్గు నేత్రములును
వె; గజదంతంబు లివె; దేవగణముల
కాళ్లును చేతులు కాయచయము;

4-188.1-ఆ.
తెచ్చినాఁడ సురల దేవరా ట్టాదిగాఁ
ట్టితెచ్చినాడఁ రఁగనింక
నేమినేయువాఁడ నీశాన! యానతి
నీవె నాకుఁ గరుణ నేర్పడంగ."

టీక :-
తుండము = ముఖము; అవధరించు = వినుము; హవ్యవాహనుడు = అగ్ని; పావకుడు = అగ్ని; నిడుద = పొడవైన; కాయము = శరీరము; చయము = సమూహము; పరగ = ఒప్పుగా.
భావము :-
“విను. ఇది సరస్వతి ముక్కు. ఇది దక్షుని ముఖము. ఇది అగ్ని నాలుక. ఇది స్వాహాదేవి చనుమొన, ఇది ముక్కు. ఇవి అగ్ని చేతులు. ఇవి దేవతల తలలు. పొడవైన ముక్కు. ఇవి భర్గుని కళ్ళు. ఇవి గజదంతములు. ఇవి దేవతల కాళ్ళు, చేతులు. ఇవి వారి శరీరములు. నారాయణుడు మొదలైన వారితో సహాదేవతలను పట్టి తెచ్చాను. ఈశా! ఇంకనూ ఏమి చేయవలెనో దయతో సెలవియ్యి. "

4-189-వ.
అని విన్నవించి ముకుళితహస్తుం డై వీరభద్రేశ్వరుండు నిలిచియున్న సమయంబున.

టీక :-
ముకుళిత = నమస్కంరించిన.
భావము :-
ఇలా అన్నీ తెలిపి చేతులు జోడించి వినయంగా వీరభద్రుడు నిలుచున్న సమయంలో…..

4-190-క.
లఁగుచు తలఁగుచుఁ గొంకుచు
వెవెల నై సిగ్గుపడుచు వెఱపున నమరుల్
రుహనయనుఁడు మొదలుగఁ
లుమరుఁ బ్రణమిల్ల నంత వుఁ డిట్లనియెన్.

టీక :-
కలగు = కలతపడు; తొలగు = ఒదుగు; కొంకు = సంకోచించు; వెలవెల = పాలిపోవు; జలరుహనయనుడు = విష్ణుమూర్తి; ప్రణమిల్లు = నమస్కరించు; భవుడు = శివుడు.
భావము :-
కలత చెందుతూ, ఒదుగుతూ, సంకోచిస్తూ, పాలిపోయి, సిగ్గుపడుతూ, భయపడుతూ దేవతలు నారాయణుడు మొదలైనవారంతా నమస్కరించగా శివుడిలా అన్నాడు.

4-191-సీ.
మిమ్మెల్లఁ గాఁచితి మేలైన కరుణను
వెఱవకుండుఁడు మీరు వేల్పులార!
యేను గోపించిన మానుపింపఁగ మీకు
దిక్కేది చెప్పుఁడా దివిజులార!
ఱియు దక్షునిఁ గూడి మ్మిట్లు మఱతురే
తెలిసియుండవలదె దివ్యులార!
వుఁగాక మీసేఁయు పరాధములుగాచి
భయంబు లిచ్చితి మరులార!”

4-191.1-ఆ.
నుచు నీలకంఠుఁ ల్లన నగవుతో
నానతిచ్చి కరువు మరియున్న
చ్చిమరలఁ బుట్టి చ్చినవారైరి
సంతసిల్లె దేవ సంఘమెల్ల.

టీక :-
దివిజులు = దేవతలు; దివ్యులు = దేవతలు; అమరులు = దేవతలు; కరువు = గర్భము.
భావము :-
"దేవతలారా! శరణిచ్చి మిమ్మల్నందరినీ దయతో రక్షించాను. భయపడకండి. దివిజులారా! నేను కోపిస్తే నాకోపం తగ్గించే దిక్కు మీకేది చెప్పండి? దక్షునితో కలసి మమ్ములను ఇలా మరచిపోతారా! మీరు దివ్యులు కదా! మీకు తెలిసుండాలి కదా! సరే! దేవతలారా! మీ అపరాధాలను క్షమించి అభయమిచ్చాను." అంటూ నీలకంఠుడు చిరునవ్వుతో ఆనతీయగా కరువులో యుండి చచ్చి మరలా పుట్టినట్లై దేవతా సమూహాలన్నీ సంతోషించాయి.

4-192-వ.
అయ్యవసరంబున సరోజసంభవుండు పరమేశ్వరునకు పాష్టాంగదండ ప్రణామంబు లాచరించి కరమలంబులు నిటలంబున ఘటియించి విశేష తాత్పర్యచిత్తుం డై " సర్వేశ్వరా! యొక్క విన్నపంబవధరింపు" మని యిట్లనియె.

టీక :-
సరోజసంభవుడు = బ్రహ్మ; నిటలము = నుదురు; తాత్పర్యము = ఉద్దేశ్యము = అవధరింపు = విను.
భావము :-
ఆ సమయంలో బ్రహ్మ పరమేశ్వరునకు సాష్టాంగ నమస్కారము చేసి చేతులు నుదుటికి తాకించి శ్రద్ద కల మనస్సుతో "సర్వేశ్వరా! ఒక విన్నపము విన"మంటూ ఇలా అన్నాడు.

4-193-క.
ప్పులు చేసినవీరలఁ
ప్పులకున్ దగినభంగి దండించి దయం
జెప్పుదును నీ క్రమంబున
నిప్పుడు మన్నించు టొప్పు నిభచర్మధరా!

టీక :-
ఒప్పు = తగినది, తప్పుకు వ్యతిరేకము; ఇభము = ఏనుగు.
భావము :-
"కరిచర్మధరా! శంకరా! తప్పులు చేసిన వీరిని ఆ తప్పులకు తగినట్లుగా దండించావు. ఇప్పుడు ఆ క్రమములోనే వారిని మన్నించుట బాగుంటుంది.

4-194-క.
పుట్టింప నీవె నేర్తువు
నెట్టన రక్షింప నీవె నేర్తువు గడిమిం
గిట్టింప నీవె నేర్తువు
యిట్టిదయారసమె చెల్లు నీకు మహేశా!

టీక :-
నెట్టన = అనివార్యముగా; కడిమి = అతిశయము; గిట్టు = నశించు.
భావము :-
మహేశ్వరా! పుట్టించడం నీకే తెలుసు. తప్పకుండా రక్షించడం కూడా నీకే తెలుసు. అతిశయమున నాశనం చెయ్యటం కూడా నీకే తెలుసు. ఆ దయారసమే ఇప్పుడు తగినది.

4-195-క.
సుసంఘములకు నీచేఁ
బొరిఁజచ్చుట వారివారి పుణ్యము సుమ్మీ
సురుచిరముగఁ బ్రాణంబులు
మేశా! యేము మగుడఁ డయుట గాదే.

టీక :-
పొరి = మిక్కిలి; సురుచిరముగ = చక్కగా; మగుడ = తిరిగి; పడయు = పొందు.
భావము :-
దేవతా సమూహాలు నీచే చనిపోవుట వారి పుణ్యమే సుమా! పరమేశా! అలాగే చక్కగా ప్రాణములను తిరిగి పొందటం కూడా కదా!

4-196-క.
దేతల యంగకంబులు
దేర చేఁజేతఁ ముట్టి తెచ్చె ననంగా
దేతలకుఁ బెద్దఱికము
దేవా! ప్రాప్తించె వినుము దేవాధిపతీ!

టీక :-
అంగకము = అవయవము.
భావము :-
దేవతల అవయవములు దేవర చేత ముట్టుకొని వచ్చాయంటే దేవా! వినుము. దేవతలకు పెద్దరికము లభించినట్లే.

4-197-క.
ఖండేందుజూట! నీచే
ఖండింపఁగఁ బడినచోట్లు క్రతుభుక్కులకున్
మంనములు దొడిగిన క్రియ
నొండొండ వెలింగి యొప్పుచున్నవి దేవా!

టీక :-
ఖండము = ముక్క; ఇందు = చంద్రుడు; క్రతుభుక్కులు = యాగ హవ్యములను భుజించువారైన దేవతలు; మండనము = భూషణము; ఒండొండ = క్రమముగా.
భావము :-
చంద్రవంకను జూటమునందు ధరించినవాడా! దేవా! నీచేత ఖండించబడిన చోట్ల దేవతలకు ఆభరణములు తొడిగినట్లుగా చక్కగా ప్రకాశిస్తున్నవి."

4-198-వ.
అని విన్నవించిన నప్పరమేశ్వరుండు.

టీక :-
విన్నవించు = మనవిచేయు.
భావము :-
అని బ్రహ్మ మనవి చేయగా ఆ పరమేశ్వరుడు.

4-199-ఉ.
లోదయాళుఁ డై నిఖిల లోకవిభుండు శివుండు కొండరా
చూలి ముఖేందుమండలముఁ జూచుచు నిట్లను “వీరభద్రుఁడున్
వేలుపుమూకలన్ గనలి వేగఁ గలంచి యలంచెఁ గోపమున్
జాలును వీరలన్మనకు సైరణచేయఁగఁ బోలు నంగనా!

టీక :-
లోల = మిక్కిలి యిచ్ఛగలది; నిఖిలము = సమస్తము; కొండరాచూలి = గౌరి; మండలము = బింబము; కనలిక = కోపించుట; కలచు = కలతపెట్టు; అలచు = బాధించు; సైరణ = సహించు.
భావము :-
సమస్తలోక ప్రభువైన శివుడు మిక్కిలి దయకలవాడై గౌరీదేవి ముఖచంద్రబింబము చూస్తూ ఇలా అన్నాడు. "పార్వతీ! వీరభద్రుడు దేవతా సమూహాలను కోపించి వేగముగా కలతపెట్టి బాధించాడు. ఇక చాలు. వీరికి మనము సహనాన్ని చూపించాలి.

4-200-క.
నేము చేసినవీరుల
వీరిం దెగటార్చ మనము వీక్షించినచో
వారింపఁగ దిక్కెవ్వరు
గౌరీ! యిఁకఁ గరుణతోడఁ గావఁగవలయున్.”

టీక :-
వీక్షించు = చూచు; తెగటార్చు = చంపు.
భావము :-
గౌరీ! నేరము చేసిన దేవతలను చంపడం మనం చూస్తూ ఊరకుంటే ఆపే దిక్కు ఎవరు? మనమే దయతో రక్షించాలి."

4-201-వ.
అని సకలభువనప్రతిష్ఠుం డగు పరమేశ్వరుండు కరుణాకటాక్షుం డై.

టీక :-
ప్రతిష్ఠ = నిలుపు.
భావము :-
అని సకల లోకాలనూ నిలిపే పరమేశ్వరుడు చల్లని చూపులు కలవాడై.