పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థాశ్వాసము : అశ్వాసాంతము

4-232-లగ్రా.
శంర! హలాహలభయంకర! పినాకధర! ;
కింర దిగీశ! యకళంకతరమూర్తీ!
పంజభవాభినుత! పంకజభవాండభవ! ;
సంలితదైత్యకులసంకట! సుథాప
ర్యంకనుతనాగకరకంకణవిరాజితక;
ళంక! గిరిజాకుచశుభాంకపరివిలస
త్పంకితనితాంత పులకాంకిత యురస్థ్సలమృ;
గాంకశతకోటినిభ! పంకజదళాక్షా!

టీక :-
కింకరులు = సేవకులు; దిగీశులు = దిక్పతులు; భవ = పుట్టుక; సంకలిత = ప్రోగు చేయబడిన; పర్యంక = మంచము; విలసిత = ప్రకాశింపబడిన; నితాంత = మిక్కిలి; ఉరము = రొమ్ము; మృగాంక = చంద్రుడు; నిభ = సమానము.
భావము :-
శంకరా! మహావిషభయంకరా! పినాకమనే విల్లును ధరించినవాడా! దిక్పతులే సేవకులుగా గలవాడా! మచ్చలేని గుణములు కలవాడా! బ్రహ్మచే పొగడబడేవాడా! బ్రహ్మాండభాండములు పుట్టించిన వాడా! గుమిగూడిన దైత్యులను బాధించేవాడా! పాలకడలిలో శయనించే నారాయణునిచే స్తుతించబడేవాడా! నాగులను కరకంకణములుగా ధరించేవాడా! గిరిజాదేవి కుచకౌగిలిచే పులకితుడైన రొమ్ము, శతకోటి చంద్రులతో సమానమైన ప్రకాశము కలవాడా! కమలదళనయనా!

4-233-క.
త్రిపురాటవీ ధనంజయ!
త్రిపురాసుర ఘోరశైల దేవాధిపతీ!
త్రిపురాంబుధి బడబానల!
విపులదయాంభోధిచంద్ర! విశ్వస్తుత్యా!

టీక :-
ధనంజయ = అగ్ని; విపుల = మిక్కిలి.
భావము :-
త్రిపురములనే అడవిని దహించినవాడా! త్రిపురాసురులను సంహరించిన దేవాధిదేవా! త్రిపురాంబుధిలో బడబాగ్ని వంటివాడా! అపారమైన దయ కలిగిన వాడా! లోకాలన్నింటిచేతా పూజింపబడేవాడా!

4-234-మా.
ఖిలభువనపాలా! స్తకాంతత్రిశూలా!
శిఖినయనలలాటా! శీతధామార్ధజూటా!
నిఖిలనిగమసంగా! నిర్వికారాంతరంగా!
సమయవిజృంభా! మంగళస్పూర్తిధామా!

టీక :-
అఖిల = అంతయు; శిఖి = అగ్ని; శీత = చల్లని; ధామము = చోటు; నిగమము = వేదము; మఖ = యజ్ఞము; మంగళము = శుభము.
భావము :-
అన్ని లోకాలనూ పాలించేవాడా! చేతియందు త్రిశూలము కలవాడా! లలాటమునందు అగ్ని నేత్రము కలవాడా! చంద్రశేఖరా! వేదములు రూపముగా కలవాడా! నిర్వికారుడా! దక్షయజ్ఞము నందు విజృంభించినవాడా! శుభములిచ్చేవాడా!

4-235-గ.
ఇది శ్రీమన్నహామహేశ్వర యివటూరిసోమనారాధ్య దివ్వశ్రీ పాదపద్మారాధక కేసనామాత్యపుత్త్ర పోతయనామధేయ ప్రణీతంబైన శ్రీవీరభద్ర విజయం బను మహాపురాణ కథయందు దక్షు యాగంబును, దధీచి వివాదంబును, దేవతల పరాజయంబును, వనజనయన వనజభవప్రముఖలు మహేశ్వరుని స్తుతించుటయు, వారల మహేశ్వరుండు కరుణించుటయు నన్నదిసర్వంబును జతుర్థాశ్వాసము.

టీక :-
వనజనయన = నారాయణుడు; వనజభవుడు = బ్రహ్మదేవుడు.
భావము :-
ఇది శ్రీ యివటూరి సోమన శిష్యుడు కేసనామాత్య పుత్రుడైన పోతన రచించిన శ్రీ వీరభద్ర విజయమను మహా పురాణ కథయందు దక్షయాగము, దధీచి వివాదమును, దేవతల పరాజయము, నారాయణుడు బ్రహ్మ మెదలైన వారు మహేశ్వరుని స్తుతించడము, వారిని శివుడు కరుణించటము అనుకథలు గల చతుర్థాశ్వాసము. సుసంపూర్ణము.