పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ ఆశ్వాసము : ఆశ్వాసాంతము

2-312-ఉ.
రాజితరాజరాజ దినరాజ భుజంగమరాజ భారతీ
రా నిలింపరాజ మునిరాజ పయోనిధిరాజ రాజగో
రా విహంగరాజ యమరాజ సరోజనివాసవాసినీ
రా సురాధిరాజ గిరిరాజ నిరంతరవంద్య శంకరా!

టీక :-
రాజిత = ప్రకాశించినది; రాజరాజు = చంద్రుడు; దినరాజు = సూర్యుడు; భుజంగము = పాము; భారతీరాజు = బ్రహ్మ; నిలింపవిభుడు = ఇంద్రుడు; పయోనిధి = సముద్రము; విహంగరాజు = గరుడుడు; యమరాజ = యమధర్మరాజు; సరోజ నివాస వాసిని = లక్ష్మీదేవి; సురాధిపుడు = ఇంద్రుడు; గిరిరాజు = హిమవంతుడు = వంద్య = నమస్కరింపదగినవాడు.
భావము :-
శంకరా! నీవు, ప్రకాశించే చంద్రుడు, సూర్యుడు, ఆదిశేషుడు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, మునిరాజు, వరుణుడు, నందీశ్వరుడు, గరుడుడు, యమధర్మరాజు, విష్ణుమూర్తి, హిమవంతులచే ఎల్లప్పుడూ నమస్కరింపబడువాడివి.

2-313-క.
 సామజాజినాంబర!
యుయార్కసహస్రకోటి సూజ్జ్వలతేజా!
నోన్మదహరలోచన!
మలయోగీంద్రహృదయ రనిధిచంద్రా!

టీక :-
సామజము = ఏనుగు; చీనాంబరము = పట్టువస్త్రము; అర్కుడు = సూర్యుడు; మదనుడు = మన్మథుడు; లోచనము = కన్ను; శరనిధి = సముద్రము.
భావము :-
మదగజ చర్మధరా! సహస్ర కోటి సూర్య ప్రకాశం కలవాడా! మదనుని గర్వమంతా దహనంచేసిన ముక్కంటీ! సుయోగీంద్రుల హృదయసముద్రానికి చంద్రుని వంటి వాడా!

2-314-మా.
ళవృషభవాహా! తారశైలేంద్రగేహా!
హరణగరిష్ఠా! ద్మజాండప్రతిష్ఠా!
దివిజరిపువిదారా! దేవదైత్యాస్థిహారా!
దివిజవినుతమూర్తీ! దేవతాచక్రవర్తీ!

టీక :-
ధవళము = తెల్లని రంగు; వృషభము = ఎద్దు; శైలేంద్రము = హిమాలయ పర్వతము; గేహము = గృహము; భవహరణము = పుట్టుక లేకుండా చేయు; గరిష్టము = మిక్కిలి బలమైనది; పద్మజాతాండము = బ్రహ్మాండము; దివిజ = దేవత; రిపు = శతృవు; విదార = చీల్చుట; ఆస్థిత = చెందిన.
భావము :-
తెల్లని నందిని వాహనంగా కలవాడా! కైలాస పర్వతము ఇల్లుగా కలవాడా! పుట్టుక లేకుండా చేయు గొప్పవాడా! బ్రహ్మాండం అధిష్టానంగా కలవాడా! రాక్షసులను సంహరించేవాడా! దేవతలకూ, దైత్యులకూ చెందినవాడా! దేవతలచే స్తుతింపబడేవాడా! దేవతా చక్రవర్తీ!.

2-315-గ.
ఇతి శ్రీమన్మహామహేశ్వర యివటూరి సోమనారాధ్య దివ్యశ్రీపాదపద్మారాధక కేసనామాత్య పుత్ర పోతయనామధేయ ప్రణీతంబైన శ్రీవీరభద్రవిజయంబను మహాపురాణకథ యందుఁ దారకాసుర సంగ్రామంబును; దేవతల పరాజయంబును; దేవేంద్ర బ్రహ్మ సంవాదంబును; అమరుల యమరావతీ ప్రవేశంబును; మరుండు సురనగరంబునకుఁ బ్రయాణంబు సేయుటయు; మన్మథ పురందర సంవాదంబును; మదన రతీ సంవాదంబును; జిత్తజుండు పరమేశ్వరునిపై దండెత్తిపోవుటయుఁ; గామదహనంబును; రతీవిలాపంబును; గపటదైవజ్ఞవృత్తాంతంబును; గౌరీదేవి తపంబుసేయిచుండ శివుండు బ్రహ్మచారి వేషంబున వచ్చుటయుఁ; బార్వతీదేవి తపఁప్రయాసంబునకు నీశ్వరుండు మెచ్చి ప్రత్యక్షంబగుటయు నన్న ద్వితీయాశ్వాసము.

టీక :-
నామధేయము = పేరు.
భావము :-
ఇది శ్రీమన్మహామహేశ్వర యివటూరి సోమనాథుని ఆరాధకులైన కేశనామాత్యుని కుమారుడైన పోతన రచించిన శ్రీ వీరభద్ర విజయము అను మహాపురాణ కథలో తారకాసుర యుద్ధము, దేవతల పరాజయము, దేవేంద్రుడు-బ్రహ్మదేవుల సంభాషణ, దేవతలు తిరిగి అమరావతికి వచ్చుట, మన్మథుని అమరావతీ ప్రయాణము, మన్మథుని-ఇంద్రుని సంవాదము, మన్మథుని-రతీదేవి సంవాదము, మదనుడు శివునిపై దండెత్తి పోవడము, కామ దహనము, రతీ విలాపము, కపట ఎఱుకలసాని వృత్తాంతము, గౌరీదేవి తపము చేయుచుండగా శివుడు బ్రహ్మచారి వేషములో వచ్చుటయు, పార్వతీదేవి కఠోర తపస్సుకు ఈశ్వరుడు మెచ్చి ప్రత్యక్షమగుటయు కలిగిన ద్వితీయాశ్వాసము.