పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

శ్రీరామ

వీరభద్ర విజయము

బమ్మెఱ పోతనామాత్య విరచితం
[లఘు టీక, భావాముల సహితము]

 

సంకలనము:-

1. శ్రీ భాగవత గణనాధ్యాయి గారు.
2. శ్రీమతి నందవరపు సర్వలక్ష్మీ గణేశ్ గారు

ముందుమాట

 శ్రీ మదాంధ్ర సాహిత్యం అనే గంగానది వెయ్యెండ్లకు పూర్వము క్రీ,శ 11వ శతాబ్దములో రాజరాజనరేంద్రుని ఆస్థానమున నన్నపాచార్యుని ఘంటంనుండి సర్వాంగ సుందరంగా దర్శనమివ్వడంతో ఉజ్వలంగా ప్రకాశించడం మొదలయింది. ఆ మహా తీర్థంలో క్రుంకులిడి తరించిన తెలుగు మహాకవులు ఎందరో తరించారు. వీరందరూ అపారమైన లౌకిక ప్రజ్ఞ అసాధారాణ కవితా ప్రతిభ, అనన్య సాధారణమైన ఆర్ష విభూతి కలిగి అలౌకిక ఆనందమును సాహిత్యమును తెలుగులకు ప్రసాదించారు.  వీరిలో నాలుగు శతాబ్దాల పిమ్మట క్రీ.శ. 15వ శతాబ్దపు బమ్మెఱ పోతనామాత్యుల వారు ఈనాటికీ నవనవీనంగా శోభించే వారిలో ఒకరు. వీరు తన సాహితీ గంగాఝరిని ప్రవహింపజేసి, ఆ గంగాలహరిలో తెలుగులను ఓలలాడిస్తూ పునీతులను కావిస్తున్న మహాభాగ్యశాలి. వీరి వీరభద్ర విజయము అలా కాల పరీక్షకు నిలిచిన గొప్ప గ్రంథము.   ఈ వీరభద్ర విజయము అనునది ఆంధ్ర మహా భాగవత ప్రణీతం చేసిన కవిగా ప్రసిద్ధుడైన బమ్మెఱ పోతన రచించిన పద్య కావ్యము. దీనిని తన గురువు ఇవ్వటూరి సోమనాథుని అనుజ్ఞ మేరకు రచించారు. భాగవతము ఆంధ్రీకరణ శ్రీరాముని ఆనతి మేర చేసారు.  ఇది వీరభద్రుని చరిత్రకు సంబంధించిన కావ్యము. వీరభద్రని జన్మ కారణము, మరియు దక్ష యజ్ఞము యొక్క కథాగమనముతో సాగే రచన. ఇందులోని వృత్తాంతం వాయు పురాణం నుండి గ్రహింపబడింది. భాగవత ఆంధ్రీకరణ పిమ్మట వీరభద్రవిజయము చేసారని కొందరు అంటారు. కానీ, శైలి స్థాయి బట్టి ఇదియే ముందర రచింపబడినది అని తెలియును.   ఇది పదకొండు వందల అరవైయేడు (1167) పద్యగద్యలు గల నాలుగు ఆశ్వాసాల బహుళ ప్రసిద్ధమైన ప్రబంధం. వీరభద్ర విజయము, భాగవత ఆంధ్రీకరణలు కాకుండా బమ్మెఱ పోతనామాత్యుల వారు, నారాయణ శతకము, భోగినీ దండకము అని మరి రెండు రచనలు కూడా చేసారు.

వీరభద్ర విజయము

కథాసంగ్రహము

 కైలాసంపైన పరమేశ్వరుడు పార్వతీదేవితో కొలువై వున్న సమయంలో దేవాసురులులందరూ అక్కడకేతెంచి శివుని స్తుతిస్తుండగా దక్షుడు అక్కడికి వస్తాడు. శివుడు వారినందరిని గౌరవించిన అనంతరం దక్షుణ్ని గౌరవిస్తాడు. దక్షుడు తనకు తగినట్లు గౌరవించుట జరప లేదని, శివుడు తనని అవమానించినట్లు భావించి, కోపగించి ప్రతికారంగా శివుడు లేని యాగాలు చెయ్యడానికి నిశ్చయించుకొంటాడు. దేవతలు, మునులు అందరినీ ఆహ్వానించి శివుడు లేకుండా యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. ఆ వార్త నారదునివల్ల తెలుసుకొన్న దాక్షాయణి శివునికా వార్తను తెలుపుతుంది. శివుని ఆజ్ఞ గైకొని యజ్ఞాన్ని చూడడానికి బయలుదేరుతుంది. దక్షుడు ఆమెను పిలవని పేరంటానికి వచ్చినందుకు తిరస్కరించడమే కాకుండా శివుణ్ణి నిందిస్తాడు. అది భరించ లేని దాక్షాయణి శివయోగాగ్నిలో దేహత్యాగం చేస్తుంది. శివుడు ఆగ్రహించి దక్షుడిని “వైవశ్వత మన్వంతరంలో ఇంద్రుని కొడుకుగా పుట్టిన నిన్ను సంహరిస్తాను” అని శపిస్తాడు. దాక్షాయణి హిమవంతుని అనుగ్రహించి కూమార్తెగా పుడుతుంది. పిమ్మట హిమవంతుడు శైలజను శివునికి శుశ్రూష చేయడానికి పంపుతాడు.  అమరావతిపైకి తారకాసురుడు దండెత్తి వస్తాడు. తారకాసురునికి శివునికి పుట్టిన వానిచేతిలో తప్ప మరణ లేదు. శివుడు విరాగి తపస్సులో ఉంటాడు. కనుక, ఇంద్రుడు శివుని కరగించమని మన్మథుని ఆజ్ఞాపిస్తాడు. నగజ శుశ్రూష చేస్తుండగా మన్మథుడు శివుని మీద బాణం వేస్తాడు. తపోభంగమైన శివుడు మూడవకన్ను తెఱచి మన్మథుని బూడిదచేస్తాడు. హిమవంతుడు కూతురు పార్వతీదేవిని ఇంటికి తీసుకువెళతాడు. శంకరుడు ఎఱుకసాని వలె వచ్చి అంతఃపురంలోని శైలజకు ఎఱుక చెప్తాడు. పార్వతీదేవి తపస్సుకు వనానికి వెళ్తుంది, ఆమె తపస్సుకు శివుడు మెచ్చి ప్రత్యక్షమవుతాడు.  పార్వతీ పరమేశ్వరుల వివాహం జరుగుతుంది. ఆ సమయంలో భూమి సమత్వంకోసం శివుడు అగస్త్యుని దక్షిణదిక్కుకు పంపుతాడు. కల్యాణశుభవేళ బ్రహ్మాదులు మన్మథుని గురించి చెప్తారు. అశరీరుడుగా మన్మథుడు పునరుజ్జీవితుడు అవుతాడని శివుడు వరం ఇస్తాడు. పార్వతీదేవి అడుగగా శివుడు నీలగళానికి కారణమైన హాలాహలభక్షణ వృత్తాంతం చెప్తాడు.  వైవశ్వత మన్వంతరంలో దక్షుడు శివరహితముగా మఖముచేయ దొడంగెను. అది దధీచి శివునికి తెలుపగా, కోపంతో శివుడు చేసిన హుంకారం నుండి వీరభద్రుడు పుడతాడు. పార్వతీదేవి కోపం నుండి భద్రేశ్వరి పుడుతుంది. ఇద్దరూ యాగశాలకు దండత్తి వెళ్తారు. దక్షుని తల ఖండించి. వెళ్ళి పరమశివునకి దక్షాధ్వర ధ్వంసం విన్నవిస్తారు. అలా దక్షుడు విగతజీవుడు కావడంతో, దేవతలందురూ బ్రహ్మదేవునితో కూడి వెళ్ళి శంకరుని వేడుకుంటారు. ఆయన ప్రసన్నుడు అవుతాడు. పిమ్మట, గొఱ్ఱె తల తీసుకువచ్చి దక్షుని శరీరానికి తగిలించి అతనిని పునరుజ్జీవుని చేస్తారు. శివుడు వీరభద్రునికి పట్టంగట్టుతాడు.