పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 2 : అష్టమ స్కంధము 1 - 109


పోతన తెలుగు భాగవతం
అష్టమ స్కంధము

ఉపోద్ఘాతము

(1) శ్రీమన్నామ! పయోద¯ శ్యామ! ధరాభృల్లలామ! జగదభిరామా! ¯ రామాజనకామ! మహో¯ ద్ధామ! గుణస్తోమధామ! దశరథరామా! (2) మహనీయ గుణగరిష్ఠు లగు నమ్మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుం డిట్లనియె; నట్లు ప్రాయోపవిష్టుం డైన పరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రుం గనుంగొని.

స్వాయంభువాది చరిత్ర

(3) "వినఁబడియెను స్వాయంభువ¯ మనువంశము వర్ణ ధర్మ మర్యాదలతో¯ మనుజుల దనుజుల వేల్పుల¯ జననంబులు స్రష్ట లెల్ల జనియించుటయున్. (4) ఏ మనుకాలమందు హరి యీశ్వరుఁ డేటికి సంభవించె? నే¯ మేమి యొనర్చె? నమ్మనువు లే? రతఁ డే క్రియఁ జేయుచున్నవాఁ? ¯ డేమి నటించు మీఁద? గత మెయ్యది? సజ్జనులైనవారు ము¯ న్నేమని చెప్పుచుందురు? మునీశ్వర! నా కెఱిఁగింపవే దయన్." (5) అనిన శుకుం డిట్లనియె. (6) "ఈ కల్పంబున మనువులు ¯ ప్రాకటముగ నార్వురైరి పదునలువురలో; ¯ లోకముల జనుల పుట్టువు¯ లాకథితము లయ్యె వరుస నఖిలములు నృపా!

1స్వాయంభువ మనువు చరిత్ర

(7) ప్రథమ మనువువైన స్వాయంభువునకు నాకూతి దేవహూతు లను నిరువురుఁ గూఁతులు గలరు; వారిఁకి గ్రమంబునఁ గపిల యజ్ఞ నామంబుల లోకంబులకు ధర్మజ్ఞాన బోధంబు జేయుకొఱకు హరి పుత్రత్వంబు నొందె; నందుఁ గపిలుని చరిత్రంబు మున్నఁ జెప్పంబడియె; యజ్ఞుని చరిత్రంబు చెప్పెద వినుము. (8) శతరూపాపతి కామభోగ విరతిన్ సంత్యక్త భూ భారుఁడై¯ సతియుం దానును గాన కేఁగి, శతవర్షంబుల్ సునందానదిన్¯ వ్రతియై యేక పదస్థుఁడై నియతుఁడై వాచంయమస్ఫూర్తితో¯ గతదోషుండు తపంబుజేసె భువనఖ్యాతంబుగా భూవరా! (9) ఇట్లు తపంబు జేయుచు స్వాయంభువ మనువు తన మనంబులోన. (10) “సృష్టిచే నెవ్వఁడు చేతనపడకుండు?¯ సృష్టి యెవ్వని చేఁతచే జనించు? ¯ జగములు నిద్రింప జాగరూకత నొంది;¯ యెవ్వఁడు బ్రహ్మాండ మెఱుఁగుచుండు? ¯ నాత్మ కాధారంబు నఖిలంబు నెవ్వఁడౌ?¯ నెవ్వని నిజధనం బింతవట్టుఁ¯ బొడగాన రాకుండఁ బొడఁగను? నెవ్వెడే;¯ నెవ్వని దృష్టికి నెదురులేదు? (10.1) జనన వృద్ధి విలయ సంగతిఁ జెందక¯ యెవ్వఁ డెడపకుండు నెల్ల యెడలఁ? ¯ దన మహత్త్వతత్త్వ సంజ్ఞఁ నెవ్వఁడు దాన¯ విశ్వరూపుఁ డనఁగ విస్తరిల్లు?" (11) అని మఱియు "నిరహంకృతుండును నిర్గతబుద్ధుండును నిరాశియుఁ బరిపూర్ణుండును ననన్య ప్రేరితుండును నృశిక్షాపరుండును నిజమార్గ సంస్థితుండును నిఖిలధర్మ భావనుండును నైన పరమేశ్వరునకు నమస్కరించెద"నని యుపనిషదర్థంబులు పలుకుచున్న మనువుం గనుంగొని. (12) రక్కసులు దినఁగఁ గడఁగిన¯ వెక్కసముగ యజ్ఞనామ విష్ణుఁడు వారిం¯ జక్కడిచెఁ జక్రధారల¯ మిక్కుటముగ వేల్పులెల్ల మేలని పొగడన్. (13) ఇది ప్రథమ మన్వంతరం; బింక ద్వితీయ మన్వంతరంబు వినుము.

2స్వారోచిషమనువు చరిత్ర

(14) స్వారోచిషుం డన సప్తార్చిబిడ్డఁడు¯ మనువు; వానికి నా ద్యుమత్సుషేణ¯ రోచిష్మదాదు లారూఢ పుత్రులు ధాత్రి¯ నేలిరి; రోచనుఁ డింద్రుఁ డయ్యె; ¯ అధికులు తుషితాదు లమరు లూర్జస్తంబ¯ ముఖ్యు లాఢ్యులు సప్తమునులు నాఁడు; ¯ వేదశిరుం డను విప్రుని దయితకుఁ¯ దుషితకుఁ బుత్రుఁడై తోయజాక్షుఁ (14.1) డవతరించెను విభుఁ డన నశీత్యష్ట స¯ హస్ర మునులు నధికు లయినవారు; ¯ ఘను లనుగ్రహింపఁ గౌమారకబ్రహ్మ¯ చారి యగుచు నతఁడు సలిపె వ్రతము. (15) తదనంతరంబ.

3ఉత్తమమనువు చరిత్ర

(16) మనువు మూఁడవవాఁడు మనుజేంద్ర! యుత్తముం¯ డనఁ బ్రియవ్రతునకు నాత్మజుండు¯ పాలించె నిల యెల్లఁ బవన సృంజయ యజ్ఞ¯ హోత్రాదు లాతని పుత్రు లధిక¯ గుణులు; వసిష్ఠుని కొడుకులు ప్రమథాదు¯ లైరి సప్తర్షులు; నమరవిభుఁడు¯ సత్యజిత్తనువాఁడు; సత్యభద్రాద్యులు¯ సురలు; ధర్మునికిని సూనృతకును (16.1) బుట్టి సత్యనియతిఁ బురుషోత్తముఁడు సత్య¯ సేనుఁ డనఁగ దుష్టశీలయుతుల¯ దనుజ యక్షపతుల దండించె సత్యజి¯ న్మిత్రుఁ డగుచు జగము మే లనంగ.

4తామసమనువు చరిత్ర

(17) చతుర్థమనువు కాల ప్రసంగంబు వివరించెద. (18) మానవాధీశ్వర! మనువు నాలవవాఁడు¯ తామసుం డనఁగ నుత్తముని భ్రాత;¯ పృథ్వీపతులు కేతు వృష నర ఖ్యాత్యాదు¯ లతని పుత్రులు పద్గు రధిక బలులు; ¯ సత్యకహరి వీర సంజ్ఞలు వేల్పులు¯ త్రిశిఖనామమువాఁడు దేవవిభుఁడు; ¯ మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు; హరి పుట్టె¯ హరిమేధునకుఁ బ్రీతి హరిణియందు; (18.1) గ్రాహబద్ధుఁ డయిన గజరాజు విడిపించి ¯ ప్రాణభయము వలనఁ బాపి కాచె;¯ హరి దయాసముద్రుఁ డఖిలలోకేశ్వరుఁ"¯ డనిన శుకునిఁ జూచి యవనివిభుఁడు.

గజేంద్రమోక్షణ కథా ప్రారంభము

(19) "నీరాట వనాటములకుఁ¯ బోరాటం బెట్లు కలిగెఁ? బురుషోత్తముచే¯ నారాట మెట్లు మానెను?¯ ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్. (20) మునినాథ! యీ కథాస్థితి¯ వినిపింపుము వినఁగఁ నాకు వేడుక పుట్టెన్; ¯ వినియెదఁ గర్ణేంద్రియముల¯ బెనుఁబండువు సేయ మనముఁ బ్రీతిం బొందన్. (21) ఏ కథల యందుఁ బుణ్య¯ శ్లోకుఁడు హరి చెప్పఁబడును సూరిజనముచే¯ నా కథలు పుణ్యకథలని¯ యాకర్ణింపుదురు పెద్ద లతి హర్షమునన్." (22) ఇవ్విధంబునఁ బ్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుండు బాదరాయణి నడిగె"నని చెప్పి సభాసదులైన మునుల నవలోకించి సూతుండు పరమహర్ష సమేతుండై చెప్పె; నట్లు శుకుండు రాజున కిట్లనియె.

త్రికూటపర్వత వర్ణన

(23) రాజేంద్ర! విను సుధారాశిలో నొక పర్వ¯ తము త్రికూటం బనఁ దనరుచుండు; ¯ యోజనాయుతమగు నున్నతత్వంబును¯ నంతియ వెడలుపు నతిశయిల్లుఁ; ¯ గాంచనాయస్సారకలధౌతమయములై¯ మూఁడు శృంగంబులు మొనసియుండుఁ; ¯ దట శృంగబహురత్న ధాతుచిత్రితములై¯ దిశలు భూనభములుఁ దేజరిల్లు; (23.1) భూరి భూజ లతా కుంజ పుంజములును ¯ మ్రోసి పఱతెంచు సెలయేటి మొత్తములును¯ మరఁగి తిరిగెడు దివ్యవిమానములును¯ జఱులఁ గ్రీడించు కిన్నరచయముఁ గలిగి. (24) అది మఱియును మాతులుంగ, లవంగ, లుంగ, చూత, కేతకీ, భల్లాత, కామ్రాతక, సరళ, పనస, బదరీ, వకుళ, వంజుళ, వట, కుటజ, కుంద, కురవక, కురంటక, కోవిదార, ఖర్జూర, నారికేళ, సింధువార, చందన, పిచుమంద, మందార, జంబూ, జంబీర, మాధవీ, మధూక, తాల, తక్కోల, తమాల, హింతాల, రసాల, సాల, ప్రియాళు, బిల్వామలక, క్రముక, కదంబ, కరవీర, కదళీ, కపిత్థ, కాంచన, కందరాళ, శిరీష, శింశు పాశోక, పలాశ, నాగ, పున్నాగ, చంపక, శతపత్ర, మరువక, మల్లికామతల్లికా ప్రముఖ నిరంతర వసంతసమయ సౌభాగ్య సంపదంకురిత, పల్లవిత, కోరకిత, కుసుమిత, ఫలిత, లలిత, విటప, విటపి, వీరున్నివహాలంకృతంబును; మణివాలుకానేక విమల పులినతరంగిణీ సంగత విచిత్ర విద్రుమలతా మహోద్యాన శుక పిక నికర నిశిత సమంచిత చంచూపుట నిర్ధళిత శాఖిశాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర ప్రవర్షిత రసప్రవాహ బహుళంబును; కనకమయ సలిల కాసార కాంచన, కుముద, కల్హార, కమల పరిమళ మిళిత కబళాహార సంతతాంగీంకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర విటసముదయ సమీప సంచార సముదంచిత శకుంత, కలహంస, కారండవ, జలకుక్కుట, చక్రవాక, బక, బలాక, కోయష్టిక ముఖర జలవిహంగ విసర వివిధ కోలాహల బధిరీ భూత భూనభోంతరాళంబును; తుహినకరకాంత, మరకత, కమలరాగ, వజ్ర, వైఢూర్య, నీల, గోమేధిక, పుష్యరాగ మనోహర కనక కలధౌత మణిమయానేక శిఖరతట దరీ విహరమాణ విద్యాధర, విబుధ, సిద్ధ, చారణ, గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష మిథున సంతత సరస సల్లాప సంగీత ప్రసంగ మంగళాయతనంబును; గంధగజ, గవయ, గండభేరుండ, ఖడ్గ, కంఠీరవ, శరభ, శార్దూల, శశ, చమర, శల్య, భల్ల, సారంగ, సాలావృక, వరాహ, మహిష, మర్కట, మహోరగ, మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సమర సన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమన కింకరంబునై యొప్పు నప్పర్వత సమీపము నందు. (25) భిల్లీ భిల్ల లులాయక¯ భల్లుక ఫణి ఖడ్గ గవయ వలిముఖ చమరీ¯ ఝిల్లీ హరి శరభక కిటి¯ మల్లాద్భుత కాక ఘూక మయమగు నడవిన్.

త్రికూట మందలి గజములు

(26) అన్యాలోకన భీకరంబులు, జితాశానేకపానీకముల్, ¯ వన్యేభంబులు కొన్ని మత్తతనులై, వ్రజ్యావిహారాగతో¯ దన్యత్వంబున భూరి భూధరదరీ ద్వారంబులందుండి సౌ¯ జన్యక్రీడల నీరుగాలిపడి కాసారావగాహార్థమై. (27) అంధకార మెల్ల నద్రిగుహాంతర¯ వీథులందుఁ బగలు వెఱచి డాఁగి¯ యెడరు వేచి, సంధ్య నినుఁడు వృద్ధత నున్న¯ వెడలె ననఁగ గుహలు వెడలెఁ గరులు. (28) తలఁగవు కొండలకైనను;¯ మలఁగవు సింగములకైన మార్కొను కడిమిం;¯ గలఁగవు పిడుగుల కైనను¯ నిల బలసంపన్న వృత్తి నేనుఁగు గున్నల్. (29) పులుల మొత్తంబులు పొదరిండ్లలోఁ దూఱు¯ ఘోరభల్లూకముల్ గుహలు సొచ్చు; ¯ భూదారములు నేల బొఱియలలో డాఁగు¯ హరిదంతముల కేఁగు హరిణచయము; ¯ మడువులఁ జొరఁబాఱు మహిషసంఘంబులు¯ గండశైలంబులఁ గపులు ప్రాఁకు; ¯ వల్మీకములు జొచ్చు వనభుజంగంబులు¯ నీలకంఠంబులు నింగి కెగయు; (29.1) వెఱచి చమరీమృగంబులు విసరు వాల¯ చామరంబుల విహరణశ్రమము వాయ, ¯ భయదపరిహేల విహరించు భద్రకరుల¯ గాలివాఱిన మాత్రాన జాలిఁ బొంది. (30) మదగజ దానామోదముఁ¯ గదలని తమకములఁ ద్రావి, కడుపులు నిండం¯ బొదలుచుఁ దుమ్మెదకొదమల¯ కదుపులు జుం జుమ్మటంచు గానము సేసెన్. (31) తేటి యొకటి యొరు ప్రియకును¯ మాటికి మాటికిని నాగ మదజల గంధం¯ బేటి కని, తన్నుఁ బొందెడి¯ బోటికి నందిచ్చు నిండు బోఁటు దనమునన్. (32) అంగీకృత రంగ న్మా¯ తంగీ మదగంధ మగుచు దద్దయు వేడ్కన్¯ సంగీత విశేషంబుల¯ భృంగీగణ మొప్పె మ్రానుపెట్టెడి మాడ్కిన్. (33) వల్లభలు పాఱి మునుపడ¯ వల్లభ మని ముసరి రేని వారణదానం¯ బొల్లక మధుకరవల్లభు¯ లుల్లంబులఁ బొందిరెల్ల యుల్లాసంబుల్. (34) అప్పుడు. (35) కలభంబుల్ చెరలాడుఁ బల్వలము లాఘ్రాణించి మట్టాడుచున్¯ ఫలభూజంబులు రాయుచుం జివురు జొంపంబుల్ వడిన్ మేయుచుం¯ బులులం గాఱెనుపోతులన్ మృగములం బోనీక శిక్షించుచుం¯ గొలఁకుల్ జొచ్చి కలంచుచున్ గిరులపై గొబ్భిళ్ళు గోరాడుచున్. (36) తొండంబుల మదజలవృత¯ గండంబులఁ గుంభములను ఘట్టన చేయం¯ గొండలు దలక్రిందై పడు¯ బెండుపడున్ దిశలు చూచి బెగడున్ జగముల్.

గజేంద్రుని వర్ణన

(37) ఎక్కడఁ జూచిన లెక్కకు¯ నెక్కువ యై యడవి నడచు నిభయూధములో¯ నొక్క కరినాథుఁ డెడతెగి¯ చిక్కె నొక కరేణుకోటి సేవింపంగన్. (38) ఇట్లు వెనుక ముందట నుభయ పార్శంబులఁ దృషార్థితంబులై యరుగుదెంచు నేనుంగు గములం గానక తెఱంగుదప్పి తొలంగుడుపడి యీశ్వరాయత్తంబైన చిత్తంబు సంవిత్తంబు గాకుండుటంజేసి తానును దన కరేణుసముదయంబును నొక్కతెరువై పోవుచు. (39) పల్వలంబుల లేఁత పచ్చిక మచ్చికఁ¯ జెలుల కందిచ్చు నచ్చికము లేక; ¯ నివురుజొంపములఁ గ్రొవ్వెలయు పూఁగొమ్ములఁ¯ బ్రాణవల్లభలకుఁ బాలువెట్టు; ¯ ఘనదానశీతల కర్ణతాళంబుల¯ దయితల చెమటార్చుఁ దనువు లరసి; ¯ మృదువుగాఁ గొమ్ముల మెల్లన గళములు¯ నివురుచుఁ బ్రేమతో నెఱపు వలపు; (39.1) పిఱుదు చక్కట్ల డగ్గఱి ప్రేమతోడ¯ డాసి మూర్కొని దివికిఁ దొండంబు జాఁచు¯ వెద వివేకించుఁ గ్రీడించు విశ్రమించు¯ మత్తమాతంగ మల్లంబు మహిమతోడ. (40) తన కుంభముల పూర్ణతకు డిగ్గి యువతుల¯ కుచములు పయ్యెదకొంగు లీఁగఁ; ¯ దన యానగంభీరతకుఁ జాల కబలల¯ యానంబు లందెల నండగొనఁగఁ; ¯ దన కరశ్రీఁ గని తలఁకి బాలల చిఱు¯ దొడలు మేఖలదీప్తిఁ దోడు పిలువఁ; ¯ దన దంతరుచి కోడి తరుణుల నగవులు¯ ముఖచంద్ర దీప్తుల ముసుఁగు దిగువఁ; (40.1) దనదు లావణ్యరూపంబుఁ దలఁచిచూఁడ¯ నంజనాభ్రము కపిలాది హరిదిభేంద్ర¯ దయిత లందఱుఁ దనవెంటఁ దగిలినడవఁ; ¯ గుంభివిభుఁ డొప్పె నొప్పులకుప్ప బోలె. (41) మఱియు నానాగహన విహరణ మహిమతో మదగజేంద్రంబు మార్గంబుఁ దప్పి, పిపాసాపరాయత్త చిత్తంబున మత్తకరేణువుల మొత్తంబునుం దానునుం జని చని. (42) అటఁ గాంచెం గరిణీవిభుండు నవఫుల్లాంభోజకల్హారమున్¯ నటదిందిందిర వారముం, గమఠ మీనగ్రాహ దుర్వారమున్, ¯ వట హింతాల రసాల సాల సుమనో వల్లీకుటీతీరముం, ¯ జటులోద్ధూత మరాళ చక్ర బక సంచారంబుఁ గాసారమున్.

గజేంద్రుని కొలను ప్రవేశము

(43) ఇట్లనన్య పురుష సంచారంబై నిష్కళంకంబైన యప్పంకజాకరంబుఁ బొడగఁని. (44) తోయజగంధంబుఁ దోఁగిన చల్లని¯ మెల్లని గాడ్పుల మేను లలరఁ¯ గమల నాళాహార విమలవాక్కలహంస¯ రవములు చెవుల పండువులు చేయ¯ ఫుల్లదిందీవరాంభోరుహా మోదంబు¯ ఘ్రాణరంధ్రంబుల గారవింప¯ నిర్మల కల్లోల నిర్గతాసారంబు¯ వదన గహ్వరముల వాడు దీర్పఁ (44.1) త్రిజగ దభినవ సౌభాగ్య దీప్తమైన¯ విభవ మీక్షణములకును విందు చేయ¯ నరిగి, పంచేంద్రియ వ్యవహారములను¯ మఱచి మత్తేభయూధంబు మడుఁగుఁ జొచ్చె. (45) తొండంబులఁ బూరించుచు¯ గండంబులఁ జల్లుకొనుచు, గళగళరవముల్¯ మెండుకొన వలుఁదకడుపులు¯ నిండన్ వేదండకోటి నీటిం ద్రావెన్. (46) అప్పుడు. (47) ఇభలోకేంద్రుఁడు హస్తరంధ్రముల నీరెక్కించి, పూరించి, చం¯ డభ మార్గంబున కెత్తి, నిక్కి, వడి నుడ్డాడించి పింజింప నా¯ రభటిన్ నీరములోనఁ బెల్లెగసి నక్రగ్రాహ పాఠీనముల్¯ నభమం దాడెడు మీన కర్కటములన్ బట్టెన్ సురల్ మ్రాన్పడన్. (48) మఱియు న గ్గజేంద్రంబు నిరర్గళవిహారంబున. (49) కరిణీకరోజ్ఝిత కంకణచ్ఛటఁ దోఁగి¯ సెలయేటి నీలాద్రి చెలువుఁ దెగడు¯ హస్తినీ హస్త విన్యస్త పద్మంబుల¯ వేయిగన్నులవాని వెరవు సూపుఁ¯ గలభసముత్కీర్ణ కల్హార రజమునఁ¯ గనకాచలేంద్రంబు ఘనతఁ దాల్చు¯ గుంజరీ పరిచిత కుముద కాండంబుల¯ ఫణిరాజ మండన ప్రభ వహించు (49.1) మదకరేణు ముక్త మౌక్తిక శుక్తుల¯ మెఱుఁగు మొగిలుతోడ మేలమాడు¯ నెదురులేని గరిమ నిభరాజ మల్లంబు¯ వనజగేహకేళి వ్రాలునపుడు. (50) మఱియు నా సరోవరలక్ష్మి మదగజేంద్ర వివిధ విహారవ్యాకులిత నూతన లక్ష్మీవిభవయై యనంగ విద్యానిరూఢ పల్లవ ప్రబంధపరికంపిత శరీరాలంకార యగు కుసుమ కోమలియునుం బోలె వ్యాకీర్ణ చికుర మత్తమధుకర నికరయు; విగతరస వదనకమలయు; నిజస్థాన చలిత కుచరథాంగ యుగళయు; లంపటిత జఘనపులినతలయునై యుండె; నంత.

కరి మకరుల యుద్ధము

(51) భుగభుగాయితభూరి బుద్భుదచ్ఛటలతోఁ¯ గదలుచు దివికి భంగంబు లెగయ; ¯ భువన భయంకరఫూత్కార రవమున¯ ఘోరనక్రగ్రాహకోటి బెగడ; ¯ వాలవిక్షేప దుర్వార ఝంఝానిల¯ వశమున ఘుమఘుమావర్త మడరఁ; ¯ గల్లోలజాల సంఘట్టనంబులఁ దటీ¯ తరులమూలంబులై ధరణిఁ గూల; (51.1) సరసిలోనుండి పొడగని, సంభ్రమించి, ¯ యుదరి కుప్పించి, లంఘించి, హుంకరించి, ¯ భానుఁ గబళించి పట్టు స్వర్భానుపగిది¯ నొక్క మకరేంద్రుఁ డిభరాజు నొడిసిపట్టె. (52) వడిఁ దప్పించి కరీంద్రుఁడు¯ నిడుదకరం బెత్తి వ్రేయ నీరాటంబుం¯ బొడ వడఁగినట్లు జలములఁ¯ బడి కడువడిఁ బట్టెఁ బూర్వపదయుగళంబున్. (53) పదములఁ బట్టినం దలకుబా టొకయింతయు లేక శూరతన్¯ మదగజవల్లభుండు ధృతిమంతుఁడు దంతయుగాంత ఘట్టనం¯ జెదరఁగఁ జిమ్మె; న మ్మకరిచిప్పలు పాదులు దప్పనొప్పఱన్¯ వదలి జలగ్రహంబు కరివాలముమూలముఁ జీరెఁ గోఱలన్. (54) కరిఁ దిగుచు మకరి సరసికిఁ¯ గరి దరికిని మకరిఁ దిగుచు గరకరి బెరయన్¯ గరికి మకరి మకరికిఁ గరి¯ భర మనుచును నతల కుతల భటు లరుదు పడన్. (55) ఇట్లు కరిమకరంబులు రెండును నొండొండ సముద్దండదండంబులై తలపడి నిఖిల లోకాలోకన భీకరంబులై, యన్యోన్య విజయశ్రీ వశీకరంబులై, సంక్షోభిత కమలాకరంబులై, హరి హరియును గిరి గిరియునుం దాఁకి పిఱుతివియక పెనంగు తెఱంగున నీరాటం బయిన పోరాటంబునం బట్టుచు, వెలికి లోనికిం దిగుచుచుఁ, గొలంకు గలంకంబొందఁ గడువడి నిట్టట్టుఁ బడి తడఁబడక, బుడబుడానుకారంబులై బుగులు బుగు ల్లను చప్పుళ్ళతో నురువులుఁ గట్టుచు, జలంబు లుప్పరం బెగయం జప్పరించుచుఁ, దప్పక వదనగహ్వరంబుల నప్పళించుచు, నిశితనితాంత దురంతదంత కుంతంబుల నింతింతలు తునియ లయి నెప్పళంబునం బునుక చిప్పలుఁ గుదుళ్ళుఁ దప్పి రక్తంబులుఁ గ్రమ్ముదేర హుమ్మని యొక్కుమ్మడిం జిమ్ముచు, నితరేతర సమాకర్షణంబులం గదలక పదంబుల మొదలిపట్టు వదలక కుదురై వర్తించుచు, బరిభ్రమణ వేగంబున జలంబులం దిరుగుచు, మకర కమఠ కర్కట గండక మండూకాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా నొండొంటిం దాఁకు రభసంబున నిక్కలుబడ మ్రక్కం ద్రొక్కుచు, మెండుచెడి బెండుపడి నాఁచు గుల్లచిప్ప తండంబులఁ బరస్పర తాడనంబులకు నడ్డంబుగా నొడ్డుచు, నోలమాసగొనక గెలుపు దలంపులు బెట్టిదంబులై రెట్టింప నహోరాత్రంబులుం బోలెఁ గ్రమక్రమ విజృంభమాణంబులై బహుకాల కలహ విహారంబులయి నిర్గత నిద్రాహారంబులై యవక్రపరాక్రమ ఘోరంబులై పోరుచున్న సమయంబున. (56) జవమును జలమును బలమును¯ వివిధములుగఁ బోరు కఱటివీరతకు భువిన్¯ దివి మకర మీన కర్కట¯ నివహము లొక్కటన మిత్రనిలయముఁ బొందెన్. (57) ఆటోపంబునఁ జిమ్ము ఱొమ్మగల వజ్రాభీల దంతంబులం¯ దాటించున్, మెడఁ జుట్టిపట్టి హరి దోర్దండాభ శుండాహతిన్¯ నీటన్ మాటికి మాటికిం దిగువఁగా నీరాటమున్ నీటి పో¯ రాట న్నోటమిపాటుఁ జూపుట కరణ్యాటంబు వాచాటమై. (58) అప్పుడు. (59) మకరితోడఁ బోరు మాతంగవిభుని నొ¯ క్కరుని డించి పోవఁ గాళ్ళు రాక¯ గోరి చూచు చుండెఁ గుంజరీయూధంబు¯ మగలు దగులుఁ గారె మగువలకును? (60) అంత. (61) జీవనంబు దనకు జీవనంబై యుంట¯ నలవుఁ జలము నంతకంత కెక్కి¯ మకర మొప్పెఁ; డస్సె మత్తేభమల్లంబు¯ బహుళపక్ష శీతభాను పగిది. (62) ఉఱుకుం గుంభయుగంబుపై హరి క్రియన్ హుమ్మంచుఁ; బాదంబులం ¯ నెఱయం గంఠము వెన్నుదన్ను; నెగయున్ హేలాగతిన్; వాలముం ¯ జఱచుం; నుగ్గుగఁ దాఁకు; ముంచు; మునుగుం; శల్యంబులుం దంతముల్ ¯ విఱుఁగన్ వ్రేయుచుఁ బొంచిపొంచి కదియున్ వేదండ యూధోత్తమున్. (63) పొడగానంబడకుండ డాఁగు; వెలికిం బోవంగ దా నడ్డమై¯ పొడచూపుం; జరణంబులం బెనగొనుం; బో రాక రా రాక బె¯ గ్గడిలం గూలఁగఁదాఁచు; లేచుతఱి నుద్ఘాటించు; లంఘించుఁ; బ¯ ల్విడిఁ జీరుం; దలఁగున్; మలంగు; నొడియన్ వేధించుఁ; గ్రోధించుచున్. (64) ఇట్లు విస్మిత నక్రచక్రంబయి నిర్వక్రవిక్రమంబున నల్పహృదయజ్ఞాన దీపంబు నతిక్రమించు మహా మాయాంధకారంబునుంబోలె నంతకంతకు నుత్సాహ కలహసన్నాహ బహువిధ జలావగాహం బయిన గ్రాహంబు మహాసాహసంబున. (65) పాదద్వంద్వము నేలమోపి, పవనున్ బంధించి, పంచేంద్రియో¯ న్మాదంబుం బరిమార్చి, బుద్ధిలతకున్ మాఱాకు హత్తించి, ని¯ ష్ఖేదబ్రహ్మపదావలంబనరతిం గ్రీడించు యోగీంద్రు మ¯ ర్యాదన్ నక్రము విక్రమించెఁ గరిపాదాక్రాంతనిర్వక్రమై. (66) వనగజంబు నెగచు వనచారిఁ బొడగని, ¯ వనగజంబ కాన వజ్రిగజము¯ వెల్ల నై సురేంద్రు వేచి, సుధాంధులు¯ పట్టఁ బట్టనీక బయలు ప్రాఁకె. (67) ఊహ గలంగి జీవనపుటోలమునం బడి పోరుచున్ మహా¯ మోహలతా నిబద్ధపదమున్ విడిపించుకొనంగ లేక సం¯ దేహముఁ బొందు దేహి క్రియ దీనదశన్ గజ ముండె భీషణ¯ గ్రాహ దురంత దంత పరిఘట్టిత పాదఖురాగ్ర శల్యమై. (68) ఇ వ్విధంబున. (69) అలయక, సొలయక, వేసట¯ నొలయకఁ, గరి మకరితోడ నుద్దండత రా¯ త్రులు, సంధ్యలు, దివసంబులు¯ సలిపెం బో రొక్క వేయి సంవత్సరముల్.

గజేంద్రుని దీనాలాపములు

(70) పృథుశక్తిన్ గజ మా జలగ్రహముతోఁ బెక్కేండ్లు పోరాడి, సం¯ శిథిలంబై, తన లావు వైరిబలముం జింతించి, మిథ్యామనో¯ రథమిం కేటికి? దీని గెల్వ సరి పోరం జాలరా దంచు స¯ వ్యథమై యిట్లనుఁ బూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితోన్. (71) "ఏ రూపంబున దీని గెల్తు? నిటమీఁ దేవేల్పుఁ జింతింతు? నె¯ వ్వారిం జీరుదు? నెవ్వరడ్డ? మిఁక ని వ్వారిప్రచారోత్తమున్¯ వారింపం దగువార లెవ్వ? రఖిలవ్యాపార పారాయణుల్¯ లేరే? మ్రొక్కెద దిక్కుమాలిన మొఱాలింపం బ్రపుణ్యాత్మకుల్. (72) నానానేకపయూధముల్ వనములోనం బెద్దకాలంబు స¯ న్మానింపన్ దశలక్షకోటి కరిణీనాథుండనై యుండి మ¯ ద్ధానాంభః పరిపుష్ట చందన లతాంతచ్ఛాయలం దుండ లే¯ కీ నీరాశ నిటేల వచ్చితి? భయం బెట్లోకదే యీశ్వరా! (73) ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై; ¯ యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం¯ బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ¯ డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్. (74) ఒకపరి జగములు వెలి నిడి¯ యొకపరి లోపలికిఁ గొనుచు నుభయముఁ దానై¯ సకలార్థ సాక్షి యగు న¯ య్యకలంకుని నాత్మమూలు నర్థిఁ దలంతున్. (75) లోకంబులు లోకేశులు¯ లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం¯ జీకటి కవ్వల నెవ్వం¯ డేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్. (76) నర్తకుని భంగిఁ బెక్కగు¯ మూర్తులతో నెవ్వఁ డాడు? మునులు దివిజులుం¯ గీర్తింప నేర? రెవ్వని¯ వర్తన మొరు లెఱుఁగ? రట్టివాని నుతింతున్. (77) ముక్తసంగులైన మునులు దిదృక్షులు¯ సర్వభూత హితులు సాధుచిత్తు¯ లసదృశవ్రతాఢ్యులై కొల్తు రెవ్వని¯ దివ్యపదము వాఁడు దిక్కు నాకు. (78) భవము దోషంబు రూపంబుఁ గర్మంబు నా¯ హ్వయమును గుణము లెవ్వనికి లేక¯ జగములఁ గలిగించు సమయించు కొఱకునై¯ నిజమాయ నెవ్వఁ డిన్నియునుఁ దాల్చు¯ నా పరేశునకు, ననంతశక్తికి, బ్రహ్మ¯ కిద్ధరూపికి, రూపహీనునకునుఁ, ¯ జిత్రచారునికి, సాక్షికి, నాత్మరుచికినిఁ¯ బరమాత్మునకుఁ, బరబ్రహ్మమునకు, (78.1) మాటలను నెఱుకల మనములఁ జేరంగఁ¯ గాని శుచికి, సత్త్వగమ్యుఁ డగుచు¯ నిపుణుఁ డైనవాని నిష్కర్మతకు మెచ్చు¯ వాని కే నొనర్తు వందనములు. (79) శాంతున కపవర్గ సౌఖ్య సంవేదికి¯ నిర్వాణ భర్తకు నిర్విశేషు¯ నకు; ఘోరునకు గూఢునకు గుణధర్మికి¯ సౌమ్యున కధిక విజ్ఞాన మయున¯ కఖిలేంద్రియద్రష్ట కధ్యక్షునకు బహు¯ క్షేత్రజ్ఞునకు దయాసింధుమతికి¯ మూలప్రకృతి కాత్మ మూలున కఖిలేంద్రి¯ య జ్ఞాపకునకు దుఃఖాంత కృతికి (79.1) నెఱి నసత్య మనెడి నీడతో వెలుఁగుచు¯ నుండు నెక్కటికి, మహోత్తరునకు, ¯ నిఖిల కారణునకు, నిష్కారణునకు న¯ మస్కరింతు నన్ను మనుచు కొఱకు. (80) యోగాగ్ని దగ్ధకర్ములు¯ యోగీశ్వరు లే మహాత్ము నొం డెఱుఁగక స¯ ద్యోగ విభాసిత మనముల¯ బాగుగ వీక్షింతు రట్టి పరము భజింతున్. (81) సర్వాగమామ్నాయ జలధికి, నపవర్గ¯ మయునికి, నుత్తమ మందిరునకు, ¯ సకలగుణారణిచ్ఛన్న బోధాగ్నికిఁ¯ దనయంత రాజిల్లు ధన్యమతికి, ¯ గుణలయోద్దీపిత గురు మానసునకు, సం¯ వర్తితకర్మనిర్వర్తితునకు, ¯ దిశ లేని నా బోఁటి పశువుల పాపంబు¯ లడఁచువానికి, సమస్తాంతరాత్ముఁ (81.1) డై వెలుంగువాని, కచ్ఛిన్నునకు, భగ¯ వంతునకుఁ, దనూజ పశు నివేశ¯ దారసక్తు లయినవారి కందఁగరాని¯ వాని కాచరింతు వందనములు. (82) ¯ మఱియును. (83) వరధర్మకామార్థ వర్జితకాములై;¯ విబుధు లెవ్వాని సేవించి యిష్ట¯ గతిఁ బొందుదురు? చేరి కాంక్షించువారి క;¯ వ్యయ దేహ మిచ్చు నెవ్వాడు కరుణ? ¯ ముక్తాత్ము లెవ్వని మునుకొని చింతింతు?¯ రానందవార్ధి మగ్నాంతరంగు¯ లేకాంతు లెవ్వని నేమియుఁ గోరక¯ భద్రచరిత్రంబుఁ బాడుచుందు? (83.1) రా మహేశు, నాద్యు, నవ్యక్తు, నధ్యాత్మ¯ యోగగమ్యుఁ, బూర్ణు, నున్నతాత్ము, ¯ బ్రహ్మమయిన వానిఁ, బరుని, నతీంద్రియు, ¯ నీశు, స్థూలు, సూక్ష్ము నే భజింతు." (84) అని మఱియు నిట్లని వితర్కించె. (85) "పావకుండర్చుల, భానుండు దీప్తుల¯ నెబ్భంగి నిగిడింతు, రెట్ల డంతు¯ రా క్రియ నాత్మకరావళిచేత బ్ర¯ హ్మాదుల, వేల్పుల, నఖిలజంతు¯ గణముల, జగముల, ఘన నామ రూప భే¯ దములతో మెఱయించి తగ నడంచు, ¯ నెవ్వఁడు మనము బుద్ధీంద్రియంబులుఁ దాన¯ యై, గుణ సంప్రవాహంబు నెఱపు, (85.1) స్త్రీ నపుంసక పురుష మూర్తియునుఁ గాక, ¯ తిర్య గమర నరాది మూర్తియునుఁ గాక, ¯ కర్మ గుణ భేద సదసత్ప్రకాశిఁ గాక, ¯ వెనుక నన్నియుఁ దా నగు విభుఁ దలంతు. (86) కలఁ డందురు దీనుల యెడఁ, ¯ గలఁ డందురు పరమయోగి గణముల పాలం, ¯ గలఁ డందు రన్నిదిశలను, ¯ గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో? (87) కలుగఁడే నాపాలికలిమి సందేహింపఁ¯ గలిమిలేములు లేకఁ గలుగువాఁడు? ¯ నా కడ్డపడ రాఁడె నలి నసాధువులచేఁ¯ బడిన సాధుల కడ్డపడెడువాఁడు? ¯ చూడఁడే నా పాటుఁ జూపులఁ జూడకఁ¯ జూచువారలఁ గృపఁ జూచువాఁడు? ¯ లీలతో నా మొఱాలింపఁడే మొఱఁగుల¯ మొఱ లెఱుంగుచుఁ దన్ను మొఱగువాఁడు? (87.1) అఖిల రూపముల్ దనరూప మైనవాఁడు¯ ఆదిమధ్యాంతములు లేక యడరువాఁడు¯ భక్తజనముల దీనుల పాలివాఁడు¯ వినఁడె? చూడఁడె? తలఁపడె? వేగ రాఁడె? (88) విశ్వకరు విశ్వదూరుని¯ విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్¯ శాశ్వతు నజు బ్రహ్మప్రభు¯ నీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్." (89) అని పలికి, తన మనంబున నగ్గజేంద్రుం డీశ్వర సన్నిధానంబు కల్పించుకొని యిట్లనియె. (90) "లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్¯ ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్; ¯ నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్; ¯ రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా! (91) విను దఁట జీవుల మాటలు¯ చను దఁట చనరానిచోట్ల శరణార్థుల కో¯ యను దఁట పిలిచిన సర్వముఁ¯ గను దఁట సందేహ మయ్యెఁ గరుణావార్ధీ! (92) ఓ కమలాప్త! యో వరద! యో ప్రతిపక్షవిపక్షదూర! కు¯ య్యో! కవియోగివంద్య! సుగుణోత్తమ! యో శరణాగతామరా¯ నోకహ! యో మునీశ్వర మనోహర! యో విమలప్రభావ! రా¯ వే! కరుణింపవే! తలఁపవే! శరణార్థిని నన్నుగావవే!" (93) అని పలికి మఱియు "నరక్షిత రక్షకుండైన యీశ్వరుం డాపన్నుఁడైన నన్నుఁ గాచుఁ గాక"యని నింగి నిక్కి చూచుచు, నిట్టూర్పులు నిగడించుచు, బయ లాలకించుచు నగ్గజేంద్రుండు మొఱచేయుచున్న సమయంబున.

విష్ణువు ఆగమనము

(94) విశ్వమయత లేమి వినియు నూరక యుండి¯ రంబుజాసనాదు లడ్డపడక¯ విశ్వమయుఁడు, విభుఁడు, విష్ణుండు, జిష్ణుండు¯ భక్తియుతున కడ్డపడఁ దలంచె. (95) అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా¯ పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో¯ త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి¯ హ్వల నాగేంద్రము "పాహిపాహి"యనఁ గుయ్యాలించి సంరంభియై. (96) సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే¯ పరివారంబునుఁ జీరఁ; డభ్రగపతిం బన్నింపఁ; డాకర్ణికాం¯ తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో¯ పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై. (97) ఇట్లు భక్తజనపాలన పరాయణుండును, నిఖిల జంతు హృదయారవింద సదన సంస్థితుండును నగు నారాయణుండు కరికులేంద్ర విజ్ఞాపిత నానావిధ దీనాలాపంబు లాకర్ణించి, లక్ష్మీకాంతా వినోదంబులం దగులు సాలించి, సంభ్రమించి దిశలు నిరీక్షించి, గజేంద్రరక్షాపరత్వంబు నంగీకరించి, [నిజపరికరంబు మరల నవధరించి] గగనంబున కుద్గమించి వేంచేయు నప్పుడు. (98) తనవెంటన్ సిరి; లచ్చివెంట నవరోధవ్రాతమున్; దాని వె¯ న్కనుఁ బక్షీంద్రుఁడు; వాని పొంతను ధనుఃకౌమోదకీ, శంఖ, చ¯ క్రనికాయంబును; నారదుండు; ధ్వజినీకాంతుండు రా వచ్చి రొ¯ య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్. (99) తదనంతరంబ, ముఖారవింద మకరందబిందు సందోహ పరిష్యందమానానం దేందిందిర యగు న య్యిందిరాదేవి గోవింద కరారవింద సమాకృష్యమాణ సంవ్యానచేలాంచల యై పోవుచు. (100) "తన వేంచేయు పదంబుఁ బేర్కొనఁ; డనాథస్త్రీ జనాలాపముల్¯ వినెనో? మ్రుచ్చులు మ్రుచ్చలించిరొ ఖలుల్ వేదప్రపంచంబులన్? ¯ దనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో? భక్తులం¯ గని చక్రాయుధుఁ డేఁడి చూపుఁ డని ధిక్కారించిరో? దుర్జనుల్." (101) అని వితర్కించుచు. (102) తాటంకాచలనంబుతో, భుజనటద్ధమ్మిల్లబంధంబుతో, ¯ శాటీముక్త కుచంబుతో, నదృఢచంచత్కాంచితో, శీర్ణలా¯ లాటాలేపముతో, మనోహరకరాలగ్నోత్తరీయంబుతోఁ, ¯ గోటీందుప్రభతో, నురోజభర సంకోచద్విలగ్నంబుతోన్. (103) అడిగెద నని కడువడిఁ జను;¯ నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్;¯ వెడవెడ సిడిముడి తడఁబడ¯ నడు గిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్. (104) నిటలాలకము లంట నివుర జుంజుమ్మని¯ ముఖసరోజము నిండ ముసురుఁ దేంట్లు; ¯ నళులఁ జోపఁగఁ జిల్క లల్ల నల్లన చేరి¯ యోష్ఠబింబద్యుతు లొడియ నుఱుకు; ¯ శుకములఁ దోలఁ జక్షుర్మీనములకు మం¯ దాకినీ పాఠీనలోక మెసఁగు; ¯ మీన పంక్తుల దాఁట మెయిదీఁగతో రాయ¯ శంపాలతలు మింట సరణిఁ గట్టు; (104.1) శంపలను జయింపఁ జక్రవాకంబులు¯ కుచయుగంబుఁ దాఁకి క్రొవ్వుజూపు; ¯ మెలఁత మొగిలు పిఱిఁది మెఱుఁగుఁదీవయుఁ బోలె¯ జలదవర్ణు వెనుకఁ జనెడునపుడు. (105) వినువీథిన్ జనుదేరఁ గాంచి రమరుల్ విష్ణున్, సురారాతి జీ¯ వనసంపత్తి నిరాకరిష్ణుఁ, గరుణావర్ధిష్ణుఁ, యోగీంద్ర హృ¯ ద్వనవర్తిష్ణు, సహిష్ణు, భక్తజనబృందప్రాభవాలంకరి¯ ష్ణు, నవోఢోల్ల సదిందిరా పరిచరిష్ణున్, జిష్ణు, రోచిష్ణునిన్. (106) ఇట్లు పొడగని. (107) "చనుదెంచెన్ ఘనుఁ డల్లవాఁడె; హరి పజ్జం గంటిరే లక్ష్మి? శం¯ ఖ నినాదం బదె; చక్ర మల్లదె; భుజంగధ్వంసియున్ వాఁడె; క్ర¯ న్నన యేతెంచె"నటంచు వేల్పులు "నమోనారాయణాయేతి"ని¯ స్వనులై మ్రొక్కిరి మింట హస్తిదురవస్థావక్రికిం జక్రికిన్. (108) అ య్యవసరంబునఁ గుంజరేంద్రపాలన పారవశ్యంబున దేవతానమస్కారంబు లంగీకరింపక మనస్సమాన సంచారుం డై పోయిపోయి, కొంతదూరంబున శింశుమారచక్రంబునుం బోలె గురుమకరకుళీర మీనమిథునంబై; కిన్నరేంద్రుని భాండాగారంబునుంబోలె స్వచ్ఛ మకరకచ్ఛపంబై; భాగ్యవంతుని భాగధేయంబునుంబోలె సరాగ జీవనంబై; వైకుంఠపురంబునుంబోలె శంఖచక్ర కమలాలంకృతంబై; సంసార చక్రంబునుంబోలె ద్వంద్వసంకుల పంక సంకీర్ణంబై యొప్పు నప్పంకజాకరంబుఁ బొడగని.