పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 2 : నవమ 375 - 506

చంద్రవంశారంభము

(375) "చంద్రగౌరమైన చంద్రవంశమునందుఁ¯ జంద్రకీర్తితోడ జనిత మైన¯ యట్టి పుణ్యమతుల నైళాది రాజుల¯ నింక వినుము మానవేంద్రచంద్ర! (376) ఒక వేయితలలతో నుండు జగన్నాథు¯ బొడ్డుఁ దమ్మిని బ్రహ్మ పుట్టె; మొదల¯ నతనికి గుణముల నతనిఁ బోలిన దక్షుఁ¯ డగు నత్రి సంజాతుఁ డయ్యె; నత్రి¯ కడగంటి చూడ్కులఁ గలువలసంగడీఁ¯ డుదయించి విప్రుల కోషధులకు¯ నమరఁ దారాతతి కజుని పంపున నాథుఁ¯ డై యుండి రాజసూయంబు చేసి (376.1) మూఁడులోకములను గెల్చి మోఱకమున¯ జని బృహస్పతి పెండ్లాముఁ జారుమూర్తిఁ¯ దార నిలుచొచ్చి కొనిపోయి తన్ను గురుఁడు¯ వేడినందాక నయ్యింతి విడువఁ డయ్యె. (377) అంత వేల్పులతో రక్కసులకుఁ గయ్యం బయ్యె; బృహస్పతితోడి వైరంబునం జేసి, రాక్షసులుం దానును శుక్రుండు చంద్రునిం జేపట్టి సురాచార్యునిం బోఁదోలిన, హరుండు భూతగణసమేతుండై, తన గురుపుత్రుండైన బృహస్పతిం జేపట్టె; దేవేంద్రుండు సురగణంబులుం దానును బృహస్పతికి నడ్డంబు వచ్చె; నయ్యవసరంబున బృహస్పతి భార్యానిమిత్తంబున రణంబు సురాసుర వినాశకరం బయ్యె; నాలోన బృహస్పతి తండ్రి యగు నంగిరసుండు చెప్పిన విని, బ్రహ్మదేవుండు వచ్చి చంద్రుని గోపించి, గర్భిణియైన తారను మరల నిప్పించినం జూచి బృహస్పతి దాని కిట్లనియె. (378) "సిగ్గొకయింతలేక వెలచేడియ కైవడి ధర్మకీర్తులన్¯ బొగ్గులు చేసి జారు శశిఁ బొంది కటా! కడుపేల దెచ్చుకొం¯ టెగ్గుదలంపఁగా వలదె? యిప్పుడు గర్భము దించుకొమ్ము నిన్¯ మ్రగ్గఁగఁ జేసెదం, జెనటి! మానవతుల్ నినుఁ జూచి మెత్తురే?"

బుధుని వృత్తాంతము

(379) అని కోపించుచుండ నా చెలువకుఁ బసిండిచాయమేనుగల కుఱ్ఱండు పుట్టె. వానింజూచి మోహంబు చేసి, బృహస్పతిదన కొడుకనియునుం, జంద్రుండు దనకన్నవాఁడనియునుం జగడించి రప్పుడు. (380) వారివాదు చూచి వారింపఁగా వచ్చి¯ యేర్పరింప లేక యెల్ల మునులు¯ నమరవరుల నడుగ "నా వేడుకలకత్తె¯ యెఱుఁగుఁ గాని యితరు లెఱుఁగ" రనిరి. (381) ఆ పలుకులు విని సిగ్గుపడియున్న తారం జూచి చిన్ని కొమరుం డిట్లనియె. (382) "ఇలువరుస చెడఁగ బంధులు¯ దలవంపఁగ మగఁడు రోయఁ దల్లీ! కట్టా! ¯ వెలినేల నన్నుఁ గంటివి¯ కలిగించినవాఁడు శీతకరుఁడో? గురుఁడో?" (383) అని పలుకుచున్న కొడుకునకు మఱుమాటలాడనేరకూరక యున్న తార నేకాంతంబునకుంజీరి మంతనంబున బ్రహ్మ యిట్లనియె. (384) "చెలువా! నీ యెలసిగ్గు వాసి, గురుఁడో శీతాంశుఁడో యెవ్వడీ¯ లలితాకారుఁ గుమారుఁ గన్న యతఁ? డేలా దాఁప? నీపాటు నీ¯ తలనేపుట్టెనె? వెచ్చనూర్పకుము? కాంతల్ గాముకల్ గారె? మా¯ టల నిందేమియుఁ బోదు పో యొరులతోడంజెప్ప; విన్పింపవే." (385) అని పలికిన బ్రహ్మకు నెదురుమాటాడ వెఱచి, మంతనంబున నయ్యింతి “చంద్రునికిం గన్నదాన” ననవుడు నా బాలకునకు "బుధుం" డని పేరు పెట్టి; చంద్రున కిచ్చి బ్రహ్మ చనియె; నంత. (386) బుద్ధిమంతుఁడయిన బుధుఁడు పుత్రుండైన¯ మేను పెంచి రాజు మిన్నుముట్టె; ¯ బుద్ధిగల సుతుండు పుట్టినచోఁ దండ్రి¯ మిన్నుముట్టకేల మిన్నకుండు?

పురూరవుని కథ

(387) ఆ బుధునకుఁ దొల్లి చెప్పిన యిళాకన్యకవలనఁ బురూరవుండు పుట్టె; నా పురూరవునకుం గల శౌర్యసౌందర్యగాంభీర్యాది గుణంబులు నారదునివలన నింద్రసభలోన నూర్వశి విని; మిత్రావరుణశాపంబున మనుష్యస్త్రీరూపంబు దాల్చి, భూలోకంబునకు వచ్చి, యప్పురూరవు ముందట నిలువంబడి. (388) సరసిజాక్షు మృగేంద్రమధ్యు విశాలవక్షు మహాభుజున్¯ సురుచిరాననచంద్రమండలశోభితున్ సుకుమారు నా¯ పురుషవర్యుఁ బురూరవుం గని పువ్వుటంపఱజోదుచేఁ¯ దొరఁగు క్రొవ్విరితూపులన్ మది దూలిపోవఁగ భ్రాంతయై. (389) ఊర్వశి నిలిచి యున్నంత. (390) "భావజుదీమమో? మొగులుఁబాసి వెలుంగు మెఱుంగొ? మోహినీ¯ దేవతయో? నభోరమయొ? దీనికరగ్రహణంబు లేనిచో¯ జీవన మేటి" కంచు మరుచేఁ జిగురా కడిదమ్ము జిమ్ములం¯ దా వడఁకెం బురూరవుఁడు దామరపాకు జలంబు కైవడిన్. (391) ఇట్లా రాచపట్టి చెఱుకువింటివాని దాడికి నోడి, యెట్టకేలకు సైరణ జేసి నిలుకడఁ దెచ్చికొని, యచ్చెలువ కిట్లనియె. (392) "ఎక్కడనుండి రాక? మన కిద్ధఱకుం దగు నీకు దక్కితిన్¯ మ్రుక్కడి వచ్చెనే యలరుముల్కులవాఁ డడిదంబుఁ ద్రిప్పుచే¯ దిక్కు నెఱుంగ జూడు నను దేహము దేహముఁ గేలుఁ గేల నీ¯ చెక్కునఁ జెక్కు మోపి తగుచెయ్వుల నన్ను విపన్నుఁ గావవే." (393) అనినం బ్రోడ చేడియ యిట్లనియె. (394) "ఇవె నాకూర్చు తగళ్ళు రెండు దగ నీ వెల్లప్పుడుం గాచెదే¯ ని వివస్త్రుండవుగాక నాకడఁ దగన్ నీవుండుదేనిన్ విశే¯ షవిలాసాధిక! నీకు నా ఘృతము భక్ష్యంబయ్యెనేనిన్ మనో¯ జవినోదంబుల నిన్నుఁ దేల్తు నగునే చంద్రాన్వయగ్రామణీ!" (395) అని పలికిన వేల్పులవెలయాలి ప్రతినమాటల కియ్యకొని తన మనంబున. (396) "మంచిదఁట రూపు సంతతి¯ నంచిత యౌ దేవగణిక యఁట మరుచేతన్¯ సంచలితచిత్త యై కా¯ మించిన దఁట యింతకంటె మేలుం గలదే." (397) అని నిశ్చయించుకొని. (398) రాజు రాజముఖిని రతిఁదేల్చె బంగారు¯ మేడలందుఁ దరుల నీడలందుఁ¯ దోఁటలందు రత్నకూటంబులందును¯ గొలఁకులందు గిరులకెలఁకులందు. (399) అంత న య్యిద్ధఱకుం దగులంబు నెలకొనిన. (400) ఒకదిక్క కాని చనఁబో¯ రొకచోటన కాని నిలిచి యుండరు దమలో¯ నొకటియ కాని తలంపరు¯ నొకనిమిషముఁ బాయలేరు నువిదయు ఱేఁడున్. (401) దయ్య మెఱుంగున్ వారల¯ నెయ్యంబులు మక్కువలును నిజమరితనముల్¯ వియ్యములును నెడసందిని¯ బయ్యదకొం గడ్డమైనఁ బ్రాణము వెడలున్. (402) ఇ ట్లూర్వశియుం బురూరవుండు నొండొరులవలన మక్కువలు చెక్కులొత్త బగళ్ళు రేలు నెల్లడల విహరింప నొక్కనాఁడు దేవలోకంబున దేవేంద్రుండు గొలువుండుతఱిఁ గొలువున నూర్వశి లేకుండుటం జూచి. (403) ఇన్నిదినంబులకును మన¯ మున్న సభామధ్యవేది యూర్వశి లేమిన్¯ విన్నఁదనంబున నున్నది¯ వన్నె దఱిఁగియున్న బసిఁడివడువున ననుచున్. (404) ఇంద్రుండు గంధర్వులం బనిచిన వారు నడురేయిం జని చీఁకటి నూర్వశి పెంచుచున్న యేడకంబులం బట్టిన నవి రెండును మొఱపెట్టిన; వాని మొఱ విని రతిఖిన్నుండై మేను మఱచి కూరుకుచున్న పురూరవు కౌఁగిటనుండి యూర్వశి యిట్లనియె. (405) "అదె నా బిడ్డలఁ బట్టి దొంగలు మహాహంకారులై కొంచు ను¯ న్మదులై పోయెద; రడ్డపాటునకు సామర్థ్యంబునన్ హీనుఁడై¯ కదలం డీ మగపంద కూరుకుగతిం గన్మూసి గుర్వెట్టుచున్¯ వదలం జాలఁడు నాదుకౌఁగిలియు దా వంధ్యాత్ముఁడై చెల్లరే. (406) పగతురు దొంగల రేఁపఁగ ¯ మగఁటిమి పాటింపలేక మగతన మెల్లన్¯ మగువల కౌఁగిటఁ జూపెడు¯ మగవాఁ డగుకంటె మగఁడు మగువగు టొప్పున్. (407) అధముఁడైనవాని కా లగుకంటె న¯ త్యధికునింట దాసి యగుట మేలు; ¯ హీనుఁ బొంది యోని హింసింపఁగా నేల? ¯ యువతిజనుల కూరకుంట లెస్స. (408) ఏటికి నీ రాచఱికం¯ బాఁటది మొఱపెట్టఁ బశువులాతురపడ నో¯ యాఁటదని లేచి దొంగల¯ గీఁటవు వెడలంగ శవము క్రియనుండె దిదే. (409) వినియు వినవు రణభీరువు¯ మనుజాధము నిదురపోతు మందుని నకటా! ¯ నినుఁ జక్రవర్తిఁ జేసిన ¯ వనజాసనుకంటె వెఱ్ఱివాఁడును గలఁడే." (410) అని పెక్కుభంగుల నయ్యింతి పరుషపుపలుకులను కఱకువాలమ్ములు చెవులఁజొనుప, నా రాజశేఖరుం డంకుశంబుపోట్లనడరు మదగజంబు చందంబునఁ జీర మఱచి దిగంబరుండై లేచి వాలు కేలనంకించి, యా నడురేయి దొంగల నఱికివైచి మేషంబుల విడిపించుకొని, తిరిగివచ్చు నెడ. (411) చీరలేనిమగని జెలువ దా నీక్షించి¯ కన్నుమొఱఁగిపోయెఁ గడక నతఁడు¯ వెఱ్ఱివానిభంగి వివశుఁడై పడిలేచి¯ పొరలి తెరలి స్రుక్కి పొక్కిపడియె. (412) మఱియుఁ బురూరవుండు మదనాతురుండై, వెదకుచు, సరస్వతీ నదీతీరంబునం జెలికత్తెలతోఁ గూడియున్న యూర్వశింగని, వికసిత ముఖకమలుండై యిట్లనియె. (413) "తనుమధ్యా! యిది యేల వచ్చి తకటా! ధర్మంబె శర్మంబె మున్¯ మనలో నుంకుగనాడికొన్న పలుకుల్ మర్యాదలుం దప్పెనే¯ నిను నేఁ బాసిన యంతనుండి తనువున్నేలం బడంబాఱె మే¯ దినిపై వ్రాలకమున్న నన్నుఁ గరుణాదృష్టిన్ విలోకింపవే." (414) అనిన నూర్వశి యిట్లనియె. (415) "మగువలకు నింత లొంగెదు¯ మగవాఁడవె నీవు పశువుమాడ్కిన్ వగవం¯ దగవే మానుషపశువును¯ మృగములుఁ గని రోయుఁగాక మేలని తినునే. (416) అదియునుం గాక. (417) తలఁపుల్ చిచ్చులు మాట లుజ్వలసుధాధారల్ విభుండైన పు¯ వ్విలితున్ మెచ్చర యన్యులన్ వలఁతురే విశ్వాసముంలేదు క్రూ¯ రలు తోడుంబతినైనఁ జంపుదు రధర్మల్ నిర్దయల్ చంచలల్¯ వెలయాండ్రెక్కడ వారి వేడబము లా వేదాంతసూక్తంబులే. (418) ఇంకొక యేఁడు పోయిన నరేశ్వర! యాతలిరేయి నీవు నా ¯ లంకెకు వచ్చి యాత్మజుల లక్షణవంతులఁ గాంచె దేమియుం¯ గొంకక పొమ్ము నీ" వనుడుఁ గొమ్మను గర్భిణిఁగాఁ దలంచుచున్¯ శంక యొకింతలేక నృపసత్తముఁ డల్లన పోయె వీటికిన్. (419) ఇట్లు మరలి, తన పురంబున నొక్క యేఁడుండి, పిదప నూర్వశి కడ కేఁగి యొక్క రేయి పురూరవుం డ య్యింతికడ నున్న నా వెలందియు "గంధర్వవరుల వేఁడికొనుము నన్నిచ్చెద"; రనవుడు నతండు గంధర్వవరులం బ్రార్థించిన వార లతండు పొగడుటకు మెచ్చి యగ్నిస్థాలి నిచ్చిన, నయ్యగ్నిస్థాలి నూర్వశింగా దలంచుచు దానితో నడవిం దిరుగుచుండి యొక్కనాఁ డది యూర్వశిగాదగ్నిస్థాలి యని యెఱింగి; వనంబున దిగవిడిచి, యింటికిఁ జనుదెంచి, నిత్యంబు రాత్రి దానిన చింతించుచుండఁ ద్రేతాయుగంబు చొచ్చిన నా రాజు చిత్తంబునఁ గర్మబోధంబులయి వేదంబులు మూఁడు మార్గంబులం దోఁచిన, నా భూవరుండు స్థాలికడకుం జని యందు శమీగర్భజాతం బైన యశ్వత్థంబుఁ జూచి, యా యశ్వత్థంబుచేత నరణులు రెండు గావించి, ముందటి యరణి దానును, వెనుకటి యరణి యూర్వశియును, రెంటినడుమ నున్న కాష్ఠంబు పుత్రుండు నని, మంత్రంబు చెప్పుచుం ద్రచ్చుచుండ, జాతవేదుండను నగ్ని సంభవించి విహితారాధన సంస్కారంబునం జేసి యాహవనీయాది రూపియై నెగడి, పురూరవుని పుత్రుండని కల్పింపం బడియె; నా యగ్ని పురూరవునిఁ బుణ్యలోకంబునకుఁ బనుపం గారణం బగుటం జేసి. (420) ఆ యగ్నిచేఁ బురూరవుఁ¯ డా యజ్ఞేశ్వరు ననంతు హరి వేదమయున్¯ శ్రీయుతుఁ గూర్చి యజించె గు¯ ణాయుతుఁ డూర్వశిఁ గనంగ నరిగెడు కొఱకై. (421) ఒక్కఁడవహ్ని వేల్పు పురుషోత్తముఁ డొక్కఁడ సర్వవాఙ్మయం¯ బొక్కఁడ వేద మా ప్రణవ మొక్కఁడ వర్ణము దొల్లి త్రేతయం¯ దెక్కటిమాన్చి మూఁడుగను నేర్పఱిచెం దనబుద్ధిపెంపుచేఁ¯ జక్కఁగ నా పురూరవుఁ డశక్తులకున్ సులభంబులౌ గతిన్. (422) ఇట్లు వేదవిభాగంబు గల్పించి, యాగంబుచేసి, పురూరవుం డూర్వశి యున్న గంధర్వలోకంబునకుం జనియె నతనికి నూర్వశి గర్భంబున నాయువు, శ్రుతాయువు, సత్యాయువు, రయుండు, జయుండు, విజయుం డన నార్గురు పుత్రులు గలిగి; రందు శ్రుతాయువునకు వసుమంతుండును, సత్యాయువునకు శ్రుతంజయుండును, రయునకు శ్రుతుండు నేకుం డన నిరువును, జయునకు నమితుండును, విజయునకు భీముండును జనించి రా భీమునకుఁ గాంచనుండు, కాంచనునకు హోత్రకుండు, హోత్రకునకు గంగాప్రవాహంబు పుక్కిటం బెట్టిన జహ్నుండు, జహ్నునకుఁ బూరుండు పూరునకు బాలకుండు, బాలకునకు నజకుం, డజకునకుఁ గుశుండు, కుశునకుఁ గుశాంబుండు ధూర్తయుండు వసువు కుశనాభుం డన నలువురును సంభవించి; రందు గుశాంబునకు గాధి యను వాఁడు గలిగె నా గాధి రాజ్యంబు చేయుచుండ.

జమదగ్ని వృత్తాంతము

(423) సత్యవతిని గాధిజాతను గన్యను¯ విప్రుఁడు ఋచికుండు వేఁడికొనిన¯ గాధియు సుత కీడు గాఁడని తెల్లని¯ నవకంపు మేనులు నల్లచెవులు¯ గల గుఱ్ఱములు వేయి కన్యకు నీ వుంకు¯ విచ్చినఁ గూతు నే నిత్తు ననిన¯ వసుధామరుండును వరుణుని కడ కేఁగి¯ హరులఁ దెచ్చినఁ గూతు నాఁత డిచ్చె (423.1) నా మహాత్ము సతియు నత్తయుఁ గొడుకులఁ¯ గోరి యడుగ నియ్యకొని యతండు¯ విప్రరాజ మంత్రవితతుల వేల్పించి¯ చరువు చేసి క్రుంక నరిగె నదికి. (424) అయ్యెడం దల్లి యడిగిన, సత్యవతి బ్రహ్మమంత్రంబులఁ దనకు వేల్పించిన చరువు దల్లి కిచ్చి క్షాత్రమంత్రంబులం దల్లికి వేల్పించిన చరువు దా నందుకొని యుండ నా ముని చనుదెంచి చరువు వీడ్వడుట యెఱింగి భార్య కిట్లనియె. (425) "తల్లి చరువు నీవు దాల్చి నీ చరు వేల¯ తల్లిపాల నిడితి తరళనేత్ర! ¯ కొమ్మ! యింక నీకుఁ గ్రూరుఁడు పుట్టు మీ¯ యమ్మ బ్రహ్మవిదుని ననఘుఁ గాంచు." (426) అనిన నయ్యింతి వెఱచి మ్రొక్కి వినయంబులాడినం బ్రసన్నుండై "నీ కొడుకు సాధువై, నీ మనుమండు క్రూరుం డగుంగాక" యని ఋచికుం డనుగ్రహించిన నా సత్యవతికి జమదగ్ని సంభవించె; సత్యవతియుం గౌశకీనది యై లోకపావని యై ప్రవహించె; నా జమదగ్నియు రేణువు కూఁతురయిన రేణుకను వివాహంబై వసుమనాది కుమారులం గనియె; నందు.

పరశురాముని కథ

(427) పురుషోత్తము నంశంబున¯ ధర జమదగ్నికి జనించి ధన్యుఁడు రాముం¯ డిరువదియొకపరి నృపతుల¯ శిరములఁ జక్కడిచెఁ దనదు చేగొడ్డంటన్. (428) అనిన విని భూవరుండు శుకున కిట్లనియె. (429) "ఏటికి జంపె రాముఁడ వనీశులఁ బల్వుర వారి యందు ద¯ ప్పేటికిఁ గల్గె విప్రుఁ డతఁ డేటికి రాజస తామసంబులన్¯ వాటముఁ బొందె భూభరము వారిత మౌ టది యేవిధంబు నా¯ మాటకు మౌనిచంద్ర! మఱుమాట ప్రకాశముగాఁగఁ జెప్పవే." (430) అనిన విని శుకుం డిట్లనియె. (431) "హైహయాధీశ్వరుం డర్జునుం డనువాఁడు¯ ధరణీశ్వరులలోనఁ దగినవాఁడు¯ పురుషోత్తమాంశాంశుఁ బుణ్యు దత్తాత్రేయు¯ నారాధనముచేసి యతనివలన¯ బరపంథిజయమును బాహుసహస్రంబు¯ నణిమాదిగుణములు యశము బలము¯ యోగీశ్వరత్వంబు నోజయుఁ దేజంబుఁ¯ జెడనియింద్రియములు సిరియుఁ బడసి" (431.1) గాలికైవడి సకలలోకంబు లందుఁ¯ దనకుఁ బోరాని రారాని తావులేక¯ యెట్టిచో నైనఁ దనయాజ్ఞ యేపు మిగుల¯ ధరణి వెలుఁగొందె వినువీథిఁ దరణి మాడ్కి. (432) ఒకనాఁ డా మనుజేంద్రుఁ డంగనలతో నుద్దాముఁడై వీట నుం¯ డక రేవానది కేఁగి యందుఁ దెలినీటం జల్లుపోరాడి దీ¯ ర్ఘకరాబ్జంబుల నా నదీజలములం గట్టెన్ వడిన్ నీరు మ్రో¯ లకుఁ బెల్లుబ్బి రణాగతుండయిన యా లంకేశుపైఁ దొట్టఁగన్. (433) ఇట్లు దిగ్విజయార్థంబు వచ్చిన రావణుం డా రాజుచే కట్టందొట్టిన యేటినీటికి సహింపక రోషంబునం బోటరియుంబోలె నమ్మేటిమగని తోడి పోరాటకుం దొడరినఁ బాటింపకఁ దన బాహుపాటవంబున. (434) వీఁకమెయి నతఁడు రావణుఁ¯ గూఁకటులగలించి పట్టికొని మోకాళ్ళం¯ దాఁకించి కోఁతికైవడి¯ నాఁకం బెట్టించెఁ గింకరావళిచేతన్. (435) అంత నర్జునుండు మహిష్మతీపురంబున కేతెంచి. (436) ఆ రాజేంద్రుఁడు రావణు¯ "నోరీ! యిటమీఁద నూరకుండుము; జగతిన్¯ వీరుఁడ ననకుము; కాచితిఁ¯ బోరా!" యని సిగ్గు పఱచి పుచ్చెన్ మరలన్. (437) అంత. (438) ధరణీశుఁ డొకనాఁడు దైవయోగంబున¯ వేఁటకై కాంతారవీథి కేఁగి¯ తిరిగి యాఁకట శ్రాంతదేహుఁడై జమదగ్ని¯ ముని యాశ్రమముఁజేరి మ్రొక్కి నిలువ¯ నా మునీంద్రుఁడు రాజు నర్థితోఁ బూజించి¯ యా రాజునకు రాజుననుచరులకుఁ¯ దన హోమధేనువుఁ దడయక రప్పించి¯ యిష్టాన్నములు గురియింప నతఁడు (438.1) గుడిచి కూర్చుండి మొదవుపై గోర్కిఁ జేసి¯ సంపద యదేల యీ యావు చాలుఁగాక¯ యిట్టి గోవుల నెన్నండు నెఱుఁగ మనుచుఁ¯ బట్టి తెండని తమ యొద్ది భటులఁ బనిచె. (439) పంచిన వారలు దర్పంబునం జని. (440) "క్రేపుం బాపకుఁ" డంచును¯ "నాపదలం బడితి" మనుచు "నంబా" యనుచుం¯ "జూపోవరు నృపు" లంచును¯ వాపోవన్ మొదవుఁ గొనుచు వచ్చిరి పురికిన్.2 (441) అంత నర్జునుండు మహిష్మతీపురంబునకు వచ్చునెడ రాముండా శ్రమంబున కేతెంచి, తద్వృత్తాంతం బంతయు విని. (442) "అద్దిరయ్య! యింట నన్నంబు గుడిచి మా¯ యయ్య వల దనంగ నాక్రమించి ¯ క్రొవ్వి రాజు మొదవు గొనిపోయినాఁ డంట¯ యేను రాముఁ డౌట యెఱుఁగఁ డొక్కొ. ¯ " (443) అని పలికి. (444) ప్రళయాగ్నిచ్ఛట భంగిఁ గుంభి విదళింపం బాఱు సింహాకృతిం¯ బెలుచన్ రాముఁ డిలేశు వెంట నడచెం బృథ్వీతలంబెల్ల నా¯ కులమై క్రుంగఁ గుఠారియై కవచియై కోదండియై కాండియై¯ ఛలియై సాహసియై మృగాజినమనోజ్ఞశ్రోణియై తూణియై. (445) చని మహిష్మతీపురద్వారంబుఁ జేరి నిలుచున్న సమయంబున. (446) కనియెన్ ముందటఁ గార్తవీర్యుఁడు సమిత్కాముం బ్రకామున్ శరా¯ సన తూణీర కుఠార భీము నతిరోషప్రోచ్చలద్భ్రూయుగా¯ నన నేత్రాంచల సీము నైణపట నానామాలికోద్దాము నూ¯ తన సంరంభ నరేంద్రదార శుభసూత్రక్షామునిన్ రామునిన్. (447) కని కోపించి. (448) "బాలుఁడు వెఱ్ఱి బ్రాహ్మణుఁడు బ్రాహ్మణుకైవడి నుంట మాని భూ¯ పాలురతోడ భూరిబలభవ్యులతోడ భయంబు దక్కి క¯ య్యాలకు వచ్చినాఁడు మన యందిఁకఁ బాపము లేదు లెండులెం¯ డేల సహింప భూసురుని నేయుఁడు వ్రేయుఁడు గూల్పుఁ డిమ్మహిన్." (449) అని కదలించి దండనాయకులఁ బురికొల్పిన, వారు రథ గజ తురగ పదాతి సమూహంబులతో లెక్కకుం బదియేడక్షౌహిణులతో నెదురునడచి శర చక్ర గదాఖడ్గ భిండిపాల శూల ప్రముఖ సాధనంబుల నొప్పించిన నవ్విప్రవరుండు గన్నులకొలకుల నిప్పులుగుప్పలు కొన రెట్టించిన కట్టల్క మిట్టిపడి, యజ్ఞోపవీతంబు చక్కనిడికొని కరాళించి బిట్టు దట్టించి కఠోరం బగు కుఠారంబు సారించి మూఁకల పై కుఱికి, తొలకరి మొగంబునం గ్రొచ్చెలికపట్టునం జెట్టులు గొట్టు కృషీవలుని తెఱంగునఁ బదంబులు ద్రెంచుచుఁ, ననటికంబంబులఁ దెగనడచు నారామకారుని పగిది మధ్యంబులఁ ద్రుంచుచుఁ, దాళఫలంబులు రాల్చు వృక్షారోహకునికైవడి శిరంబులు ద్రుంచుచు, మృగంబుల వండం దుండించు సూపకారుని భంగి నవయవంబులం జెక్కుచు, నంతటం దనివిజనక విలయకాలకీలి కేలిని మంట లుమియుచు, విల్లంది యెల్లడం బిడుగుల సోనలు గురియు బలుమొగిళ్ళువడువున నప్రమాణంబు లగు బాణంబుల బఱపి, సుభటసైన్యంబుల దైన్యంబు నొందించుచు, నడ్డంబులేని యార్భాటంబులు గల బాణవర్షఘృతంబులతో రాహుతులం గోపానలంబున కాహుతులుచేయుచు, తురంగంబుల నిరంగంబులఁ గావించుచు, రథంబుల విశ్లథంబులఁగా నొనర్చుచు ద్విరదంబుల నరదంబులపైఁ బఱవం ద్రోలుచు నివ్విధంబున సేనల నంపవానల ముంచి రూపుమాపిన. (450) మత్తిల్లి భూతజాలము¯ చిత్తంబులఁ జొక్కి వేడ్కఁ జిందులుబాఱన్¯ జొత్తిల్లి సమిత్తలమున¯ నెత్తురు మేదంబు పలలనికరం బయ్యెన్. (451) అయ్యవసరంబున. (452) "మేలీ బ్రాహ్మణుఁ డొక్కఁడు¯ నేలం బడఁగూల్చె సైన్యనిచయము నెల్లన్¯ బాలార్ప నేల యీతనిఁ¯ దూలించెదఁగాక నాదు దోర్బలము వడిన్." (453) అని పలికి (454) ఒక యేనూఱుకరంబులన్ ధనువు లత్యుల్లాసియై తాల్చి వే¯ ఱొక యేనూట గుణధ్వనుల్ నిగుడ శాతోగ్రాస్త్రముల్ గూర్చి "వి¯ ప్ర! కుఠారంబును నిన్నుఁ గూల్తు" ననుచున్ భర్జించి పుంఖానుపుం¯ ఖకఠోరంబుగ నేసి యార్చె రయరేఖా ధామునిన్ రామునిన్. (455) వడిఁదూపు లెగయ గుడుసులు¯ పడి కార్ముకపంచశతము పరగ విభుఁడు సొం¯ పడరెఁ బరివేషమండలి¯ నడుమఁ గరద్యుతుల వెలయు నళినాప్తు క్రియన్. (456) ఇట్లర్జునుండు బాహువిలాసంబు చూపిన. (457) ధరణీదేవుఁడు రాముఁ డాఢ్యుఁడు జగద్ధానుష్కరత్నంబు దు¯ ష్కర చాపం బొక టెక్కుపట్టి శరముల్ సంధించి పెల్లేసి భూ¯ వరు కోదండము లొక్కచూడ్కిఁ దునిమెన్ వాఁడంతటం బోక వే¯ తరువుల్ ఱువ్వఁ గుఠారధార నఱకెం దద్బాహుసందోహమున్. (458) కరములు దునిసిన నతనికి¯ శిర మొక్కటి చిక్క శైలశిఖరముభంగిం¯ బరశువున నదియుఁ ద్రుంచెను¯ బరసూదనుఁ డైన ఘనుఁడు భార్గవుఁడు వడిన్. (459) తండ్రి పడిన నతని తనయులు పదివేలు¯ దలఁగిపోయి రతనిఁ దాకలేక¯ పరభయంకరుండు భార్గవుం డంత నా¯ గోవుఁ గ్రేపుతోడఁ గొనుచుఁ జనియె. (460) ఇట్లు హోమధేనువు మరలం దెచ్చియిచ్చి తన పరాక్రమంబు దండ్రి దోబుట్టువులకుం దెలియం జెప్పిన జమదగ్ని రామున కిట్లనియె. (461) "కలవేల్పు లెల్లఁ దమతమ¯ చెలువంబులు దెచ్చి రాజుఁ జేయుదు రకటా! ¯ బలువేల్పు రాజు వానిం¯ జలముననిట్లేల పోయి చంపితి పుత్రా! (462) తాలిమి మనకును ధర్మము¯ తాలిమి మూలంబు మనకు ధన్యత్వమునం¯ దాలిమి గలదని యీశుం¯ డేలించును బ్రహ్మపదము నెల్లన్ మనలన్. (463) క్షమ గలిగిన సిరి గలుగును ¯ క్షమ గలిగిన వాణి గలుగు సౌరప్రభయున్¯ క్షమ గలుగఁ దోన కలుగును ¯ క్షమ గలిగిన మెచ్చు శౌరి సదయుఁడు దండ్రీ! (464) పట్టపురాజును జంపుట¯ గట్టలుకన్ విప్రుఁ జంపు కంటెను బాపం¯ బట్టిట్టనకుము నీవీ¯ చెట్టజెడం దీర్థసేవచేయుము దనయా!" (465) అని తన్నుఁ దండ్రి పనిచినఁ¯ బనిపూని ప్రసాద మనుచు భార్గవుఁడు రయం¯ బున నొకయేఁడు ప్రయాణము¯ చని తీర్థము లెల్ల నాడి చనుదెంచె నృపా! (466) ఆ యెడ నొక్కనాఁడు సలిలార్థము రేణుక గంగలోనికిం¯ బోయి ప్రవాహమధ్యమునఁ బొల్పుగ నచ్చరలేమపిండుతోఁ¯ దోయవిహారముల్ సలుపు దుర్లభుఁ జిత్రరథున్ సరోజమా¯ లాయుతుఁ జూచుచుండెఁ బతి యాజ్ఞ దలంపక కొంత ప్రేమతోన్. (467) ఇట్లు గంధర్వవల్లభునిం జూచు కారణంబున దడసి. (468) "అక్కట వచ్చి పెద్దతడ వయ్యెను; హోమమువేళ దప్పె; నే¯ నిక్కడనేల యుంటి; ముని యేమనునో"యని భీతచిత్త యై¯ గ్రక్కునఁ దోయకుంభము శిరస్థలమందిడి తెచ్చియిచ్చి వే¯ మ్రొక్కి కరంబు మోడ్చి పతి ముందట నల్లన నిల్చె నల్కుచున్. (469) అప్పుడు. (470) చిత్తమున భార్య దడసిన¯ వృత్తాంతం బెఱిఁగి తపసి వేకని సుతులన్¯ "మత్తం దీనిం జావఁగ¯ మొత్తుం"డన మొత్తరైరి మునుకుచు వారల్. (471) కొడుకులు పెండ్లముఁ జంపమిఁ¯ గొడుకులఁ బెండ్లాముఁ జంప గురు డానతి యీ¯ నడుగులకు నెఱిఁగి రాముం¯ డడుగిడకుండంగఁ ద్రుంచె నన్నలఁ దల్లిన్. (472) తల్లిన్ భ్రాతల నెల్లఁ జంపు మనుచోఁ దాఁ జంపి రాకున్నఁ బెం¯ పెల్లంబోవ శపించుఁ దండ్రి తన పంపేఁ జేయుడున్ మెచ్చి దా¯ తల్లిన్ భ్రాతల నిచ్చు నిక్కము తపోధన్యాత్మకుం డంచు వే¯ తల్లిన్ భ్రాతలఁ జంపె భార్గవుఁడు లేదా చంపఁ జేయాడునే? (473) ఇవ్విధంబున. (474) అడ్డము జెప్పక కడపటి¯ బిడ్డఁడు రాముండు సుతులఁ బెండ్లము నచటన్¯ గొడ్డంటం దెగ నడచిన¯ జడ్డనఁ దలయూఁచి మెచ్చె జమదగ్ని మదిన్. (475) మెచ్చిన తండ్రిని గనుఁగొని¯ చెచ్చెర "నీ పడినవారి జీవంబులు నీ¯ విచ్చితి"నను మని మ్రొక్కిన¯ నిచ్చెన్ వారలును లేచి రెప్పటి భంగిన్. (476) పడినవారి మరల బ్రతికింప నోపును¯ జనకుఁ డనుచుఁ జంపె జామదగ్న్యుఁ¯ డతఁడు చంపె ననుచు నన్నలఁ దల్లిని¯ జనకునాజ్ఞ యైనఁ జంపఁ దగదు. (477) పరశురాముని కోడి పరుగులు పెట్టిన¯ యర్జునుపుత్రకు లాత్మ యందుఁ¯ దండ్రి మ్రగ్గుటకు సంతప్తులై పొగలుచు¯ నింతట నంతట నెడరు వేచి¯ తిరిగి యాడుచు నొక్క దివసమం దా రాముఁ¯ డడవి కన్నలతోడ నరుగఁ బిదప¯ బగఁదీర్పఁ దఱి యని పఱతెంచి హోమాల¯ యంబున సర్వేశు నాత్మ నిలిపి (477.1) నిరుపమధ్యానసుఖవృత్తి నిలిచియున్న¯ పుణ్యు జమదగ్నినందఱు బొదివి పట్టి¯ కుదులకుండంగఁ దలఁ ద్రెంచి కొనుచుఁ జనిరి¯ యడ్డ మేతెంచి రేణుక యడచికొనఁగ. (478) మఱియును. (479) "జనకుం జంపిన వైరముం దలఁచి రాజన్యాత్మజుల్ నేఁడు మీ¯ జనకుం జంపిరి రామ! రామ! రిపులన్ శాసింతు ర"మ్మంచు న¯ మ్మునిపైవ్రాలి లతాంగి మోఁదికొనియెన్ ముయ్యేడుమాఱుల్రయం¯ బున రాముం డరుదెంచి యెన్నికొన నాపూర్ణాపదాక్రాంతయై. (480) అప్పుఁడుఁ దల్లి మొఱ విని, జమదగ్ని కుమారులు వచ్చి యిట్లని విలపించిరి. (481) "వాకిలివెడలవు కొడుకులు¯ రాకుండఁగ నట్టి నీవు రాజసుతులచేఁ¯ జీకాకు నొంది పోవఁగ¯ నీకా ళ్లెట్లాడెఁ దండ్రి! నిర్జరపురికిన్." (482) అని విలపించుచున్న యన్నలఁ జూచి రాముం డిట్లనియె. (483) "ఏడువనేల తండ్రి తను వేమఱకుండుఁడు తోడులార! నే¯ సూడిదె తీర్తు"నంచుఁ బరశుద్యుతిభీముఁడు రాముఁ డుగ్రుఁడై¯ యోడక యర్జునాత్మభవులున్నపురంబున కేఁగి చొచ్చి గో¯ డాడఁగఁ బట్టి చంపె వడి నర్జునజాతుల బ్రహ్మఘాతులన్. (484) ఖండించి రిపుల శిరములు¯ గొండలుగాఁ బ్రోగు లిడియె గురురక్తనదుల్¯ నిండికొని పాఱ నుబ్బుచు¯ భండనమున విప్రరిపులు భయమంద నృపా! (485) మఱియు నంతటఁ బోక. (486) అయ్య పగకు రాముఁ డలయక రాజుల¯ నిరువదొక్కమాఱు నరసి చంపె; ¯ జగతిమీఁద రాజశబ్దంబు లేకుండ¯ సూడు దీర్పలేని సుతుఁడు సుతుఁడె? (487) మఱియు నా రాముండు శమంతపంచకంబున రాజరక్తంబులం దొమ్మిది మడుఁగులు గావించి తండ్రిశిరంబు దెచ్చి, శరీరంబుతో సంధించి, సర్వదేవమయుండగు దేవుండు దాన కావునఁ దన్నునుద్దేశించి యాగంబుంజేసి, హోతకుం దూర్పును, బ్రహ్మకు దక్షిణ భాగంబును, నధ్వరునకుఁ బడమటి దిక్కును, నుద్గాతృనకునుత్తర దిశయు, నున్నవారల కవాంతరదిశలును, గశ్యపునకు మధ్యదేశంబును, నుపద్రష్టకు నార్యావర్తంబును, సదస్యులకుం దక్కిన యెడలును గలయనిచ్చి బ్రహ్మనది యైన సరస్వతియం దవబృథస్నానంబు చేసి, కల్మషంబులం బాసి, మేఘవిముక్తుండయిన సూర్యుండునుం బోలె నొప్పుచుండె; నంత. (488) ఆప్తుఁడగు పుత్రువలనను ¯ బ్రాప్తతనుం డగుచుఁ దపము బలిమిని మింటన్¯ సప్తర్షిమండలంబున¯ సప్తముఁడై వెలుఁగుచుండె జమదగ్ని నృపా! (489) ఆ జమదగ్నితనూజుఁడు¯ రాజీవాక్షుండు ఘనుఁడు రాముఁ డధికుఁడై¯ యోజను సప్తర్షులలో¯ రాజిల్లెడు మీఁది మనువు రా నవ్వేళన్. (490) శాంతచిత్తుఁ డగుచు సంగవిముక్తుఁడై¯ భవ్యుఁడై మహేంద్రపర్వతమున¯ నున్నవాఁడు రాముఁ డోజతో గంధర్వ¯ సిద్ధవరులు నుతులు చేయుచుండ. (491) భగవంతుఁడు హరి యీ క్రియ¯ భృగుకులమునఁ బుట్టి యెల్ల పృథివీపతులన్¯ జగతీభారము వాయఁగఁ¯ బగగొని పలుమాఱుఁ జంపె బవరమున నృపా!

విశ్వామిత్రుని వృత్తాంతము

(492) అంత గాధికి నగ్నితేజుండగు విశ్వామిత్రుండు జన్మించి, తపోబలంబున రాజధర్మంబును దిగనాడి, బ్రహ్మర్షియై యేకశతసంఖ్యాగణితు లగు కొడుకులం గనియె; నయ్యెడ భృగుకులజాతుండైన యజీగర్తునికొడుకు శునశ్శేఫుండు దల్లిదండ్రులచేత హరిశ్చంద్రుని యాగపశుత్వంబునకు నమ్ముడుపడి, బ్రహ్మాదిదేవతల వినుతిచేయుచు మెప్పించి, దేవతలచేత బంధవిముక్తుండయిన వానియందుఁ గృపగలిగి విశ్వామిత్రుండు పుత్రుల కిట్లనియె. (493) "కన్నులఁ గంటిని వీనిని¯ మన్నన కొమరుండు నాకు మక్కువ మీరో¯ యన్నన్న యనుచు నీతని¯ మన్నింపుం" డనినఁ జూచి మదసంయుతులై. (494) "ఇతఁ డన్నఁటపో మాకును¯ గృతకృత్యుల మయితి" మనుచు గేలి యొనర్పన్¯ సుతులన్ "మ్లేచ్ఛులు గం"డని¯ ధృతిలేక శపించెఁ దపసి తిరుగుడుపడఁగన్. (495) అయ్యెడ నతని శాపంబునకు వెరచి, యా నూర్వురయందు మధ్యముండైన మధుచ్ఛందుం డేఁబండ్రు దమ్ములుం దానును నమస్కరించి “తండ్రీ నీచెప్పిన క్రమంబున శునశ్శేపుండు మా కన్న యని మన్నింపంగలవార” మనవుడు సంతసించి మంత్రదర్శియైన శునశ్శేపుని వారల యందుఁ బెద్దఁజేసి, మధుచ్ఛందున కిట్లనియె. (496) "పాడి చెడక వీఁడు నేఁడు మీకతమునఁ¯ గొడుకు గలిగె నాకుఁ గొడుకులార! ¯ కడుపులార! మీరు గొడుకులఁ గనుఁ డింక ¯ బ్రీతితోడ దేవరాతుఁ గూడి." (497) అని పలికె; నట్లు శునశ్శేఫుండు దేవతలచేత విడివడుటం జేసి దేవరాతుండయ్యె; మధుచ్ఛందుండు మొదలయిన యేఁబండ్రు నా దేవరాతునకుఁ దమ్ములైరి పెద్దలయిన యష్టక, హారీత, జయంత సుమదాదు లేఁబండ్రును వేఱై చనిరి; ఈ క్రమంబున విశ్వామిత్రు కొడుకులు రెండు విధంబులయినం, బ్రవరాంతంబు గలిగె” నని చెప్పి శుకుం డిట్లనియె “నా పురూరవు కొడుకగు నాయువునకు నహుషుండును, క్షత్త్రవృద్దుండును, రజియును, రంభుండును, ననేనసుండును ననువారు పుట్టి; రందు క్షత్త్రవృద్ధునకుఁ గుమారుండగు సుహోత్రునకుఁ గాశ్యుండుఁ గుశుఁడు గృత్స్నమదుండు నన ముగ్గురు గలిగి; రా కృత్స్నమదునకు శునకుండును, శునకునకు శౌనకుండును, నమ్మహాత్మునికి బహ్వృచప్రవరుండును జన్మించి; రా బహ్వృచప్రవరుండు దపోనియతుండై చనియె; కాశ్యునకుఁ గాశియుఁ గాశికి రాష్ట్రుండును, రాష్ట్రునకు దీర్ఘతపుండును జనించిరి. (498) ఆ దీర్ఘతపుని కధికుఁడు ¯ శ్రీదయితాంశమునఁ బుట్టె సేవ్యుం డాయు¯ ర్వేదజ్ఞఁడు ధన్వంతరి¯ ఖేదంబులు వాయు నతనిఁ గీర్తనచేయన్. (499) వాసుదేవాంశసంభూతుండగు నా ధన్వంతరి యజ్ఞభాగంబున కర్హుం; డతనికిఁ గేతుమంతుండు, గేతుమంతునకు భీమరథుఁడు నతనికి దివోదాసుండనం బరఁగు ద్యుమంతుండు నుదయించి; రా ద్యుమంతునకుఁ బ్రతర్దనుండు జన్మించె; నా ప్రతర్దనుండు శత్రుజిత్తనియును ఋతధ్వజుండనియుం జెప్పంబడె; నాతనికిఁ గువలయాశ్వుండు సంభవించె. (500) వసుమతీశ! విను కువలయాశ్వభూభర్త¯ లలితపుణ్యు ఘను నలర్కుఁ గనియె¯ నాతఁ డేలె నేల నఱువదియాఱు వే¯ లేండ్లు వాని భంగి నేల రెవరు. (501) అయ్యలర్కునకు సన్నతియును, నతనికి సునీతుండును, నతనికి సుకేతనుండును, నతనికి ధర్మకేతువు, నతనికి సత్యకేతువును, నాతనికి ధృష్టకేతువును, నా ధృష్టకేతువునకు సుకుమారుండును, సుకుమారునకు వీతిహోత్రుండు, వీతిహోత్రునకు భర్గుండును, భర్గునకు భార్గభూమియు జనియించిరి. (502) వాఁడు తుదయుఁ గాశ్యవసుమతీశుం డాది¯ యైనవారు కాశు లనఁగ నెగడి¯ రవనిమీఁద వార లా క్షత్రవృద్ధుని¯ వంశజాతు లగుచు వంశవర్య! (503) మఱియు, క్షత్రవృద్ధునికి రెండవకొడుకగు కుశునికిఁ బ్రీతియును, వానికి సంజయుండును, సంజయునికి జయుండును, జయునికిఁ గృతుండును, గృతునికి హర్యధ్వనుండును, హర్యధ్వనునకు, సహదేవుండును, సహదేవునికి భీముండును, భీమునకు జయత్సేనుండును, జయత్సేనునకు సంకృతియు, సంకృతికి జయుండును, జయునికి, క్షత్రధర్మండును బుట్టిరి; వీరలు క్షత్రవృద్ధుని వంశంబునం గల రాజులు; రంభునికి రభసుండును, రభసునికి గంభీరుండును గంభీరునికిఁ గృతుండును గల్గి; రా గృతునికి బ్రహ్మకులంబు పుట్టె; న య్యనేసునకు శుద్ధుండును, శుద్ధునకు శుచియు, శుచికి బ్రహ్మసారథి యైన త్రికకుత్తును జనించి; రతనికి శాంతరజుండు పుట్టె; నతండు విజ్ఞానవంతుండుఁ, గృతకృత్యుండు, విరక్తుండు నయ్యె. (504) రజియను వానికి రాజేంద్ర! యేనూఱు¯ కొడుకులు గలిగిరి ఘోరబలులు¯ వేల్పులెల్లను వచ్చి వేఁడిన నా రజి¯ దైత్యులఁ బెక్కండ్ర ధరణిఁ గూల్చి¯ నాకంబు దేవేంద్రునకు నిచ్చె నిచ్చిన¯ రజికాళ్ళకెఱిఁగి సురప్రభుండు¯ వెండియు నతనికి విబుధగేహము నిచ్చి¯ సంతోషబుద్ధి నర్చన మొనర్చె (504.1) నంతనా రజి మృతుఁడైన నతని పుత్రు¯ లమరవిభుఁడు తమ్ము నడిగికొనిన¯ నీక యింద్రలోక; మేలిరి యాగభా¯ గములు పుచ్చికొనిరి గర్వమంది. (505) వేలుపులఱేఁడు గురుచే¯ వేలిమి వేల్పించి బలిమి వెలయఁగ నిజ దం¯ భోళిని రజిసుతులను ని¯ ర్మూలము గావించి స్వర్గముం గైకొనియెన్.