భాగవత పారాయణ - 2 : నవమ 258 - 374
శ్రీరాముని కథనంబు
(258) అట్టి ఖట్వాంగునకు దీర్ఘబాహుండు, దీర్ఘబాహునకు రఘువు, రఘువునకుఁ బృథుశ్రవుండుఁ, బృథుశ్రవునకు నజుండు, నజునకు దశరథుండును, పుట్టి; రా దశరథునకు సురప్రార్థితుండై పరబ్రహ్మమయుండైన హరి నాల్గువిధంబులై శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్న నామంబుల నిజాంశ సంభూతుండై జన్మించె; తచ్చరిత్రంబు వాల్మీకి ప్రముఖులైన మునులచేత వర్ణితంబైనది; యైననుం జెప్పెద సావధానమనస్కుండవై యాకర్ణింపుము. (259) అమరేంద్రాశకుఁ బూర్ణచంద్రుఁ డుదితుండై నట్లు నారాయణాం¯ శమునం బుట్టె మదాంధ రావణశిరస్సంఘాతసంఛేదన¯ క్రమణోద్దాముఁడు రాముఁ డా గరితకుం గౌసల్యకున్ సన్నుతా¯ సమనైర్మల్య కతుల్య కంచితజనుస్సంసారసాఫల్యకున్. (260) సవరక్షార్థము దండ్రి పంపఁ జని విశ్వామిత్రుఁడుం దోడరా¯ నవలీలం దునుమాడె రాముఁ డదయుండై బాలుఁడై కుంతల¯ చ్ఛవిసంపజ్జితహాటకం గపటభాషావిస్ఫురన్నాటకన్¯ జవభిన్నార్యమఘోటకం గరవిరాజత్ఖేటకం దాటకన్. (261) గారామునఁ గౌశిక మఖ¯ మా రాముఁడు గాచి దైత్యు నధికు సుబాహున్¯ ఘోరాజిఁ ద్రుంచి తోలెన్¯ మారీచున్ నీచుఁ గపటమంజులరోచున్. (262) ఒక మున్నూఱు గదల్చి తెచ్చిన లలాటోగ్రాక్షుచాపంబు బా¯ లకరీంద్రంబు సులీలమైఁ జెఱకుఁగోలం ద్రుంచు చందంబునన్¯ సకలోర్వీశులు చూడఁగా విఱిచె దోశ్శక్తిన్ విదేహక్షమా¯ పక గేహంబున సీతకై గుణమణిప్రస్ఫీతకై లీలతోన్. (263) భూతలనాథుఁడు రాముఁడు ¯ ప్రీతుండై పెండ్లియాడెఁ బృథుగుణమణి సం¯ ఘాతన్ భాగ్యోపేతన్¯ సీతన్ ముఖకాంతివిజిత సితఖద్యోతన్. (264) రాముఁడు నిజబాహుబల¯ స్థేమంబున భంగపఱిచె దీర్ఘకుఠారో¯ ద్దామున్ విదళీకృతనృప¯ భామున్ రణరంగభీము భార్గవరామున్. (265) దశరథుఁడు మున్ను గైకకు¯ వశుఁడై తానిచ్చి నట్టి వరము కతన వా¯ గ్దశ చెడక యడివి కనిచెను¯ దశముఖముఖకమలతుహినధామున్ రామున్. (266) జనకుఁడు పనిచిన మేలని¯ జనకజయును లక్ష్మణుండు సంసేవింపన్¯ జనపతి రాముఁడు విడిచెను¯ జనపాలారాధ్య ద్విషదసాధ్య నయోధ్యన్. (267) భరతున్ నిజపదసేవా¯ నిరతున్ రాజ్యమున నునిచి నృపమణి యెక్కెన్¯ సురుచిర రుచి పరిభావిత¯ గురుగోత్రాచలముఁ జిత్రకూటాచలమున్. (268) పుణ్యుఁడు రామచంద్రుఁ డట పోయి ముదంబునఁ గాంచె దండకా¯ రణ్యముఁ దాపసోత్తమ శరణ్యము నుద్దత బర్హి బర్హ లా¯ వణ్యము గౌతమీ విమల వాఃకణ పర్యటనప్రభూత సా¯ ద్గుణ్యము నుల్లసత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్. (269) ఆ వనంబున రాముఁ డనుజ సమేతుడై¯ సతితోడ నొక పర్ణశాల నుండ¯ రావణు చెల్లలు రతిఁ గోరి వచ్చిన¯ మొగి లక్ష్మణుఁడు దాని ముక్కు గోయ¯ నది విని ఖరదూషణాదులు పదునాల్గు¯ వేలు వచ్చిన రామవిభుఁడు గలన¯ బాణానలంబున భస్మంబు గావింప¯ జనకనందన మేని చక్కఁదనము (269.1) విని దశగ్రీవుఁ డంగజ వివశుఁ డగుచు¯ నర్థిఁ బంచినఁ బసిఁడిఱ్ఱి యై నటించు¯ నీచు మారీచు రాముఁడు నెఱి వధించె¯ నంతలో సీతఁ గొనిపోయె నసురవిభుఁడు. (270) ఆ యసురేశ్వరుండు వడి నంబరవీథి నిలాతనూజ న¯ న్యాయము చేసి నిష్కరుణుఁడై కొనిపోవఁగ నడ్డమైన ఘో¯ రాయతహేతిఁ ద్రుంచె నసహాయత రామనరేంద్రకార్యద¯ త్తాయువుఁ బక్షవేగపరిహాసితవాయువు నజ్జటాయువున్. (271) అంతనా రామచంద్రుండు లక్ష్మణసహితుండై, సీత వెదక నరుదెంచి, నిజకార్యనిహతుండైన జటాయువునకుఁ పరలోకక్రియలు గావించి, ఋశ్యమూకంబునకుం జని. (272) "నిగ్రహము నీకు వల దిఁక¯ నగ్రజు వాలిన్ వధింతు" నని నియమముతో¯ నగ్రేసరుఁగా నేలెను¯ సుగ్రీవుం జరణఘాతచూర్ణగ్రావున్. (273) లీలన్ రామవిభుం డొక¯ కోలం గూలంగ నేసె గురు నయశాలిన్¯ శీలిన్ సేవితశూలిన్¯ మాలిన్ వాలిన్ దశాస్యమానోన్మూలిన్. (274) ఇలమీఁద సీత వెదకఁగ¯ నలఘుఁడు రాఘవుఁడు పనిచె హనుమంతు నతి¯ చ్ఛలవంతున్, మతిమంతున్, ¯ బలవంతున్, శౌర్యవంతు, బ్రాభవవంతున్. (275) అలవాటు కలిమి మారుతి¯ లలితామిత లాఘవమున లంఘించెను శై¯ వలినీగణసంబంధిన్¯ జలపూరిత ధరణి గగన సంధిం గంధిన్. (276) ఇట్లు సముద్రంబు దాఁటి సీతం గని, హనుమంతుండు దిరిగి చనుదెంచుచు నక్షకుమారాదుల వధియించి. (277) సముదగ్రత ననిలసుతుం¯ డమరాహిత దత్త వాల హస్తాగ్నుల భ¯ స్మము చేసె నిరాతంకన్¯ సముదాసురసుభటవిగతశంకన్ లంకన్. (278) ఇట్లు లంకాదహనంబు చేసివచ్చి వాయుజుండు సీతకథనంబు చెప్పిన విని రామచంద్రుండు వనచరనాథ యూధంబులుం దానును చనిచని. (279) ఆ రాజేంద్రుఁడు గాంచె భూరివిధరత్నాగారమున్ మీన కుం¯ భీరగ్రాహకఠోరమున్ విపుల గంభీరంబు నభ్రభ్రమ¯ ద్ఘోరాన్యోన్యవిభిన్నభంగభవనిర్ఘోషచ్ఛటాంభఃకణ¯ ప్రారుద్ధాంబరపారమున్ లవణపారావారముం జేరువన్. (280) కని తనకుఁ ద్రోవ యిమ్మని వేఁడిన నదియు మార్గంబు చూపక మిన్నందిన నా రాచపట్టి రెట్టించిన కోపంబున. (281) మెల్లని నగవున నయనము¯ లల్లార్చి శరంబు విల్లు నందిన మాత్రన్¯ గుల్లలు నాఁచులుఁ జిప్పలుఁ¯ బెల్లలునై జలధి పెద్ద బీడై యుండెన్. (282) ఇట్లు విపన్నుండగు సముద్రుండు నదులతోఁ గూడి మూర్తి మంతుండయి చనుదెంచి రామచంద్రుని చరణంబులు శరణంబు జొచ్చి యిట్లని స్తుతియించె. (283) "ఓ కాకుత్స్థకులేశ! యోగుణనిధీ! యో దీనమందార! నే¯ నీ కోపంబున కెంతవాఁడ? జడధిన్; నీవేమి భూరాజవే? ¯ లోకాధీశుఁడ; వాదినాయకుఁడ; వీ లోకంబు లెల్లప్పుడున్¯ నీ కుక్షిం బ్రభవించు; నుండు; నడఁగున్; నిక్కంబు సర్వాత్మకా! (284) ధాతల రజమున దేవ¯ వ్రాతము సత్త్వమున భూతరాశిఁ దమమునన్¯ జాతులఁగా నొనరించు గు¯ ణాతీతుఁడ వీవు గుణగణాలంకారా! (285) కట్టుము సేతువు; లంకం¯ జుట్టుము; నీ బాణవహ్ని సురవైరితలల్¯ గొట్టుము నేలంబడఁ; జే¯ పట్టుము నీ యబల నధికభాగ్యప్రభలన్. (286) హరికి మామ నగుదు; నటమీఁద శ్రీదేవి¯ తండ్రి; నూరకేల తాగడింప? ¯ గట్టఁ గట్టి దాఁటు కమలాప్తకులనాథ! ¯ నీ యశోలతలకు నెలవుగాఁగ" (287) అని విన్నవించిన రామచంద్రుండు సముద్రునిం బూర్వప్రకారంబున నుండు పొమ్మని వీడుకొల్పె; నంత. (288) ఘన శైలంబులుఁ దరువులు¯ ఘనజవమునఁ బెఱికి తెచ్చి కపికులనాథుల్¯ ఘనజలరాశిం గట్టిరి¯ ఘనవాహప్రముఖదివిజగణము నుతింపన్. (289) ఇట్లు సముద్రంబు దాఁటి రామచంద్రుండు రావణు తమ్ముం డైన విభీషణుండు శరణంబు వేఁడిన నభయం బిచ్చి; కూడుకొని లంకకుఁ జని విడిసి వేడెపెట్టించి లగ్గలుపట్టించిన. (290) ప్రాకారములు ద్రవ్వి పరిఖలు పూడిచి¯ కోటకొమ్మలు నేలఁ గూలఁ ద్రోచి¯ వప్రంబు లగలించి వాకిళ్ళు పెకలించి¯ తలుపులు విఱిచి యంత్రములు నెఱిచి¯ ఘనవిటంకంబులు ఖండించి పడవైచి¯ గోపురంబులు నేలఁ గూలఁ దన్ని¯ మకరతోరణములు మహిఁ గూల్చి కేతనం¯ బులు చించి సోపానములు గదల్చి (290.1) గృహము లెల్ల వ్రచ్చి గృహరాజముల గ్రొచ్చి¯ భర్మకుంభచయము పాఱవైచి¯ కరులు కొలను చొచ్చి కలఁచిన కైవడిఁ¯ గపులు లంకఁ జొచ్చి కలఁచి రపుఁడు. (291) అంత నయ్యసురేంద్రుండు పంచినఁ గుంభ, నికుంభ, ధూమ్రాక్ష, విరూపాక్ష, సురాంతక, నరాంతక, దుర్ముఖ, ప్రహస్త, మహాకాయ ప్రముఖులగు దనుజవీరులు శర శరాసన తోమర గదాఖడ్గ శూల భిందిపాల పరశు పట్టిస ప్రాస ముసలాది సాధనంబులు ధరించి మాతంగ తురంగ స్యందన సందోహంబుతో బవరంబు చేయ సుగ్రీవ, పవనతనయ, పనస, గజ, గవయ, గంధమాదన, నీలాం గద, కుముద, జాంబవదాదు లా రక్కసుల నెక్కటి కయ్యంబు లందుఁ దరుల గిరులఁ గరాఘాతంబుల నుక్కడించి త్రుంచి; రంత. (292) ఆ యెడ లక్ష్మణుఁ డుజ్జ్వల¯ సాయకములఁ ద్రుంచె శైలసమకాయు సురా¯ జేయు ననర్గళమాయో¯ పాయున్ నయగుణ విధేయు నయ్యతికాయున్. (293) రామచంద్రవిభుఁడు రణమున ఖండించె¯ మేటికడిమి నీలమేఘవర్ణు¯ బాహుశక్తిపూర్ణుఁ బటుసింహనాదసం¯ కుచిత దిగిభకర్ణుఁ గుంభకర్ణు. (294) అలవున లక్ష్మణుఁ డాజి¯ స్థలిఁ గూల్చెన్ మేఘనాదుఁ జటులాహ్లాదున్¯ బలభేదిజయవినోదున్¯ బలజనితసుపర్వసుభటభావవిషాదున్. (295) అంత. (296) తనవా రందఱు మ్రగ్గిన¯ ననిమిషపతివైరి పుష్పకారూఢుండై¯ యనికి నడచి రామునితో¯ ఘనరౌద్రముతోడ నంపకయ్యము చేసెన్. (297) అ య్యవసరంబున. (298) సురపతిపంపున మాతలి¯ గురుతరమగు దివ్యరథముఁ గొనివచ్చిన, నా¯ ధరణీవల్లభుఁ డెక్కెను¯ ఖరకరుఁ డుదయాద్రి నెక్కు కైవడి దోఁపన్. (299) ఇట్లు దివ్యరథారూఢుండయి రామచంద్రుండు రావణున కిట్లనియె. (300) "చపలత్వంబున డాఁగి హేమమృగమున్ సంప్రీతిఁ బుత్తెంచుటో¯ కపటబ్రాహ్మణమూర్తివై యబల నా కాంతారమధ్యంబునం¯ దపలాపించుటయో మదీయశితదివ్యామోఘబాణాగ్ని సం¯ తపనం బేగతి నోర్చువాఁడవు? దురంతం బెంతయున్ రావణా! (301) నీ చేసిన పాపములకు¯ నీచాత్మక! యముఁడు వలదు నేఁడిట నా నా¯ రాచముల ద్రుంచి వైచెద¯ ఖేచర భూచరులు గూడి క్రీడం జూడన్." (302) అని పలికి. (303) బలువింటన్ గుణటంకృతంబు నిగుడన్ బ్రహ్మాండ భీమంబుగా¯ బ్రళయోగ్రానలసన్నిభం బగు మహాబాణంబు సంధించి రా¯ జలలాముండగు రాముఁడేసె ఖరభాషాశ్రావణున్ దేవతా¯ బలవిద్రావణు వైరిదారజనగర్భస్రావణున్ రావణున్. (304) దశరథసూనుండేసిన¯ విశిఖము హృదయంబుఁదూఱ వివశుం డగుచున్¯ దశకంధరుండు గూలెను¯ దశవదనంబులను రక్తధారలు దొరఁగన్. (305) అంతనా రావణుండు దెగుట విని. (306) కొప్పులు బిగి వీడి కుసుమమాలికలతో¯ నంసభాగంబుల నావరింప¯ సేసముత్యంబులు చెదరఁ గర్ణిక లూడఁ¯ గంఠహారంబులు గ్రందుకొనఁగ¯ వదనపంకజములు వాడి వాతెఱ లెండఁ¯ గన్నీళ్ళవఱద లంగములు దడుప¯ సన్నపు నడుములు జవ్వాడఁ బాలిండ్ల¯ బరువులు నడుములఁ బ్రబ్బికొనఁగ (306.1) నెత్తి మోఁదికొనుచు నెఱిఁ బయ్యెదలు జాఱ¯ నట్టు నిట్టుఁ దప్పటడుగు లిడుచు¯ నసురసతులు వచ్చి రట భూతభేతాళ¯ సదనమునకు ఘోరకదనమునకు. (307) ఇట్లు వచ్చి తమతమ నాథులం గని, శోకించి; రందు మండోదరి రావణుం జూచి యిట్లనియె. (308) "హా! దనుజేంద్ర! హా! సురగణాంతక! హా! హృదయేశ! నిర్జరేం¯ ద్రాదుల గెల్చి నీవు కుసుమాస్త్రునికోలల కోర్వలేక సో¯ న్మాదముగన్ రఘుప్రవరుమానిని నేటికిఁ దెచ్చి? తప్పుడేఁ¯ గాదని చెప్పినన్ వినక కాలవశంబునఁ బొంది తక్కటా. (309) ఎండఁ గాయ వెఱచు నినుడు వెన్నెలఁ గాయ¯ వెఱచు విధుఁడు గాలి వీవ వెఱచు¯ లంకమీఁద; నిట్టి లంకాపురికి మాకు¯ నధిప! విధవభావ మడరె నేఁడు. (310) దురితముఁ దలపరు గానరు¯ జరుగుదు రెటకైన నిమిష సౌఖ్యంబుల కై¯ పరవనితాసక్తులకును¯ బరధనరక్తులకు నిహముఁ బరముం గలదే?" (311) అని విలపింప నంత విభీషణుండు రామచంద్రుని పంపుపడసి, రావణునకు దహనాది క్రియలు గావించె; నంత రాఘవేంద్రుండు నశోకవనంబున కేఁగి, శింశుపాతరు సమీపంబు నందు. (312) దైతేయప్రమదా పరీత నతిభీతన్ గ్రంథి బంధాలక¯ వ్రాతన్ నిశ్శ్వసనానిలాశ్రుకణ జీవం జీవదారామ భూ¯ జాతన్ శుష్కకపోల కీలిత కరాబ్జాతం బ్రభూతం గృశీ¯ భూతం బ్రాణసమేత సీతఁ గనియెన్ భూమీశుఁ డా ముందటన్. (313) కని రామచంద్రుండును దాపంబు నొంది, భార్యవలన దోషంబు లేకుంట వహ్నిముఖంబునం బ్రకటంబుజేసి, దేవతల పంపున దేవిం జేకొని. (314) శోషితదానవుండు నృపసోముఁడు రాముఁడు రాక్షసేంద్రతా¯ శేషవిభూతిఁ గల్పసమజీవివి గమ్మని నిల్పె నర్థి సం¯ తోషణుఁ బాపశోషణు నదూషణు శశ్వదరోషణున్ మితా¯ భాషణు నార్యపోషణుఁ గృపాగుణభూషణు నవ్విభీషణున్. (315) ఇట్లు విభీషణసంస్థాపనుండయి రామచంద్రుఁడు సీతాలక్ష్మణ సమేతుండయి సుగ్రీవ హనుమదాదులం గూడికొని, పుష్పకారూఢుం డయి, వేల్పులు గురియు పువ్వులసోనలం దడియుచుఁ దొల్లి వచ్చిన తెరువుజాడలు సీతకు నెఱిఁగించుచు, మరలి నందిగ్రామంబునకు వచ్చె; నయ్యవసరంబున. (316) రామచంద్రవిభుని రాక వీనుల విని¯ భరతుఁ డుత్సహించి పాదుకలను¯ మోచికొనుచు వచ్చి ముదముతోఁ బురజను¯ లెల్ల గొలువ నన్న కెదురువచ్చె. (317) వచ్చి పాదుకల ముందట నిడికొని, యెడనెడ సాష్టాంగదండప్రణామంబులు చేయుచు, మెల్లమెల్లన డాసి, రామచంద్రుని పాదంబులు దన నొసలం గదియించి, తచ్చరణరేణువులు దుడిచి, శిరంబునం జల్లికొని, తనివి చనక, మఱియు నప్పదకమలంబు లక్కున మోపి కొనుచు, సంతసంపుఁ గన్నీటం గడిగి, క్షేమంబు లరయుచుండె; నంత సీతాలక్ష్మణ సహితుండయి విభుండును, దన కెదురువచ్చిన బ్రాహ్మణ జనంబులకు నమస్కరించి, తక్కినవారలచేత మన్ననలు పొంది, వారల మన్నించె; నయ్యవసరంబున. (318) నృపవర! పెక్కునాళ్ళఁగొలె నిన్ గనకుండిన యట్టి నేఁడు మా¯ తపములుపండె నిందఱము ధన్యులమైతి మటంచుఁ బుట్టముల్¯ చపలతఁ ద్రిప్పి పువ్వుల వసంతములాడుచుఁ బాడుచున్ గత¯ త్రపులయి యాడుచుం బ్రజలు దద్దయుఁ బండుగ జేసి రెల్లెడన్. (319) కవ గూడి యిరుదెసఁ గపిరాజు రాక్షస¯ రాజు నొక్కటఁ జామరములు వీవ¯ హనుమంతుఁ డతిధవళాతపత్రముఁ బట్ట¯ బాదుకల్ భరతుండు భక్తిఁ దేర¯ శత్రుఘ్ను డమ్ములుఁ జాపంబుఁ గొనిరాఁగ¯ సౌమిత్రి భృత్యుఁడై చనువుచూప¯ జలపాత్రచేఁబట్టి జనకజ గూడిరాఁ¯ గాంచనఖడ్గ మంగదుఁడు మోవఁ (319.1) బసిఁడి కేడె మర్థి భల్లూకపతి మోచి¯ కొలువఁ బుష్పకంబు వెలయ నెక్కి ¯ గ్రహము లెల్లఁ గొలువఁ గడు నొప్పు సంపూర్ణ¯ చంద్రుపగిది రామచంద్రుఁ డొప్పె. (320) ఇట్లు పుష్పకారూఢుండై, కపి బలంబులు చేరికొలువ. శ్రీరాముం డయోధ్యకుం జనియె; నంతకు మున్న యప్పురంబునందు. (321) వీథులు చక్కఁ గావించి తోయంబులు¯ చల్లి రంభా స్తంభచయము నిలిపి¯ పట్టుజీరలు చుట్టి బహుతోరణంబులుఁ¯ గలువడంబులు మేలుకట్లుఁ గట్టి¯ వేదిక లలికించి వివిధరత్నంబుల¯ మ్రుగ్గులు పలుచందములుగఁ బెట్టి¯ కలయ గోడల రామకథలెల్ల వ్రాయించి¯ ప్రాసాదముల దేవభవనములను (321.1) గోపురంబుల బంగారు కుండ లెత్తి¯ యెల్ల వాకిండ్ల గానిక లేర్పరించి¯ జనులు గైచేసి తూర్యఘోషములతోడ¯ నెదురు నడతెంచి రా రాఘవేంద్రుకడకు. (322) సమద గజదానధారల¯ దుమదుమలై యున్న పెద్ద త్రోవలతోడన్¯ రమణీయ మయ్యె నప్పురి¯ రమణుఁడు వచ్చినఁ గరంగు రమణియపోలెన్. (323) రామచంద్రవిభుని రాకఁ దూర్యములతో¯ రథ గజాశ్వ సుభటరాజితోడ¯ నమరెఁ బురము చంద్రుఁ డరుదేర ఘూర్ణిల్లు¯ జంతుభంగమిలిత జలధిభంగి. (324) ఇట్లొప్పుచున్న యప్పురంబు ప్రవేశించి, రాజమార్గంబున రామచంద్రు డరుగుచున్న సమయంబున. (325) "ఇతఁడే రామనరేంద్రుఁ డీ యబలకా యింద్రారి ఖండించె న¯ ల్లతఁడే లక్ష్మణుఁ డాతఁడే కపివరుం డా పొంతవాఁడే మరు¯ త్సుతుఁ డా చెంగట నా విభీషణుఁ" డటంచుం చేతులం జూపుచున్¯ సతులెల్లం బరికించి చూచిరి పురీసౌధాగ్రభాగంబులన్. (326) ఇట్లు సమస్తజనంబులు చూచుచుండ రామచంద్రుండు రాజమార్గంబునం జనిచని. (327) పటికంపు గోడలు బవడంపు వాకిండ్లు¯ నీలంపుటరుగులు నెఱయఁ గలిగి¯ కమనీయ వైడూర్య స్తంభచయంబుల¯ మకరతోరణముల మహిత మగుచు¯ బడగల మాణిక్యబద్ధ చేలంబులఁ¯ జిగురుఁ దోరణములఁ జెలువు మీఱి¯ పుష్పదామకముల భూరివాసనలను¯ బహుతరధూపదీపముల మెఱసి (327.1) మాఱువేల్పులభంగిని మలయుచున్న¯ సతులుఁ బురుషులు నెప్పుడు సందడింప¯ గుఱుతు లిడరాని ధనముల కుప్ప లున్న¯ రాజసదనంబునకు వచ్చె రామవిభుఁడు. (328) ఇట్లు వచ్చి. (329) తల్లులకెల్ల మ్రొక్కి తమ తల్లికి వందన మాచరించి య¯ ల్లల్ల బుధాళికిన్ వినతుఁడై చెలికాండ్రను దమ్ములం బ్రసం¯ పుల్లతఁ గౌగలించుకొని భూవరుఁ డోలిఁ గృపారసంబు రం¯ జిల్లఁగఁ జాల మన్ననలు చేసె నమాత్యులఁ బూర్వభృత్యులన్. (330) తత్సమయంబునఁ దల్లులు (331) కొడుకులుఁ బెద్దకోడలును గొబ్బున మ్రొక్కిన నెత్తి చేతులం¯ బుడుకుచు మోములుందలలుబోరన ముద్దులుగొంచునవ్వుచుం¯ దొడలకు వారి రాఁదిగిచి తోఁగఁగఁ జేసిరి నేత్రధారలన్¯ వెడలిన ప్రాణముల్ దగఁ బ్రవిష్టములయ్యె నటంచు నుబ్బుచున్. (332) అంత వసిష్ఠుం డరుగుదెంచి. శ్రీరామచంద్రుని జటాబంధంబు విడిపించి, కులవృద్దులుం దానును సమంత్రకంబుగ దేవేంద్రుని మంగళస్నానంబు చేయించు బృహస్పతి చందంబున, సముద్రనదీజలంబుల నభిషేకంబు చేయించె; రఘువరుండును, సీతాసమేతుండై, జలకంబులాడి, మంచి పుట్టంబులు గట్టికొని, కమ్మని పువ్వులు దుఱిమి, సుగంధంబు లలందికొని, తొడవులు దొడిగికొని, తనకు భరతుఁడు సమర్పించిన రాజసింహాసనంబునం గూర్చుండి, యతని మన్నించి కౌసల్యకుఁ బ్రియంబు చేయుచు, జగత్పూజ్యంబుగ రాజ్యంబు జేయుచుండె; నప్పుడు. (333) కలఁగు టెల్లను మానెఁ జలధు లేడింటికి¯ జలనంబు మానె భూచక్రమునకు; ¯ జాగరూకత మానె జలజలోచనునకు¯ దీనభావము మానె దిక్పతులకు; ¯ మాసి యుండుట మానె మార్తాండవిధులకుఁ¯ గావిరి మానె దిగ్గగనములకు; ¯ నుడిగిపోవుట మానె నుర్వీరుహంబుల¯ కడఁగుట మానె ద్రేతాగ్నులకును; (333.1) గడిఁది వ్రేఁగు మానెఁ గరి గిరి కిటి నాగ¯ కమఠములకుఁ బ్రజల కలఁక మానె; ¯ రామచంద్రవిభుఁడు రాజేంద్రరత్నంబు¯ ధరణిభరణరేఖఁ దాల్చు నపుడు. (334) మఱియును. (335) పొలఁతుల వాలుచూపుల యంద చాంచల్య¯ మబలల నడుముల యంద లేమి; ¯ కాంతాలకములంద కౌటిల్యసంచార¯ మతివల నడపుల యంద జడిమ; ¯ ముగుదల పరిరంభముల యంద పీడన¯ మంగనాకుచముల యంద పోరు; ¯ పడఁతుల రతులంద బంధసద్భావంబు¯ సతులఁబాయుటలంద సంజ్వరంబు; (335.1) ప్రియులు ప్రియురాండ్ర మనముల బెరసి తార్పు¯ లంద చౌర్యంబు; వల్లభు లాత్మ సతుల¯ నాఁగి క్రొమ్ముళ్ళు పట్టుటం దక్రమంబు; ¯ రామచంద్రుఁడు పాలించు రాజ్యమందు. (336) తండ్రి క్రియ రామచంద్రుఁడు¯ తండ్రుల మఱపించి ప్రజలఁ దా రక్షింపన్¯ తండ్రుల నందఱు మఱచిరి¯ తండ్రిగదా రామచంద్రధరణిపుఁ డనుచున్. (337) మఱియు, నా రామచంద్రుండు రాజర్షిచరితుండును, నిజధర్మనిరతుండును, నేకపత్నీవ్రతుండును, సర్వలోకసమ్మతుండును నగుచు ధర్మవిరోధంబు గాకుండఁ గోరిక లనుభవించుచుఁ ద్రేతాయుగంబైన గృతయుగధర్మంబుఁ గావించుచు, బాలమరణంబు మొదలగు నరిష్టంబులు ప్రజలకుఁ గలుగకుండ రాజ్యంబుచేయుచుండె; నయ్యెడ (338) సిగ్గుపడుట గల్గి సింగారమును గల్గి¯ భక్తిగల్గి చాల భయముఁ గలిగి¯ నయముఁ బ్రియముఁ గల్గి నరనాథు చిత్తంబు¯ సీత దనకు వశము చేసికొనియె. (339) అనిన విని పరీక్షిన్నరేంద్రుం డిట్లనియె. (340) "భ్రాతృజనుల యందు బంధువులందును¯ ప్రజల యందు రాజభావ మొంది¯ యెట్లు మెలఁగె? రాఘవేశ్వరుం డెవ్వనిఁ¯ గూర్చి క్రతువు లెట్లు గోరి చేసె?" (341) అనిన శుకుం డిట్లనియె. (342) "భగవంతుఁడగు రామభద్రుండు ప్రీతితో¯ దేవోత్తముని సర్వదేవమయునిఁ¯ దనుఁదాన కూర్చి యధ్వరములు చేసెను¯ హోతకుఁ దూరుపు నుత్తరంబు¯ సామగాయకునికి శమనదిగ్భాగంబు¯ బ్రహ్మకుఁ గ్రమమునఁ బడమ రెల్ల¯ నధ్వర్యునకు శేష మాచార్యునకు నిచ్చి¯ సొమ్ములఁ బంచి భూసురుల కొసఁగి (342.1) తనదు రెండు పుట్టంబులు దనకు నయిన¯ మెలఁత మంగళసూత్రంబు మినుకుఁ దక్క¯ వినతుఁడై యుండె; నా రాము వితరణంబు¯ పాండవోత్తమ! యేమని పలుకవచ్చు? (343) అంత నా రామచంద్రుని దానశీలత్వంబునకు మెచ్చి విప్రవరులు దమతమ భూములు మరల నిచ్చి యిట్లనిరి. (344) "ధరణి వలదు మాకుఁ దపసుల కేల? నీ¯ వఖిలలోక గురుఁడవైన హరివి; ¯ మా మనంబు లందు మలయు చీఁకటిఁ బాపు¯ భవ దుదారరుచులఁ బార్థివేంద్ర!" (345) అని పలికి బ్రహ్మణ్యదేవుండైన రామచంద్రుని వినయోక్తులం బూజించి మునులు చని; రిట్లు పెద్దకాలంబు రాజ్యంబుచేసి, రాఘవేంద్రుం డొక్కదినంబున.
శ్రీరామాదుల వంశము
(346) వసుధపైఁ బుట్టెడు వార్త లాకర్ణించు¯ కొఱకునై రాముండు గూఢవృత్తి¯ నడురేయి దిరుగుచో నాగరజనులలో¯ నొక్కఁడు దన సతి యొప్పకున్న¯ "నొరునింటఁ గాపురంబున్న చంచలురాలిఁ¯ బాయంగలేక చేపట్ట నేమి¯ తా వెఱ్ఱి యగు రామధరణీశ్వరుండనే¯ బేల! పొ"మ్మను మాట బిట్టు పలుక (346.1) నాలకించి మఱియు నా మాట చారుల¯ వలన జగములోనఁ గలుగఁ దెలిసి¯ సీత నిద్రపోవఁ జెప్పక వాల్మీకి¯ పర్ణశాలఁ బెట్టఁ బనిచె రాత్రి. (347) అంత; సీతయు గర్భిణి గావునఁ గుశలవు లనియెడి కొడుకులం గనియె; వారికి వాల్మీకి జాతకర్మంబు లొనరించె; లక్ష్మణునకు నంగదుండును, జంద్రకేతుండును భరతునకుఁ దక్షుండును, బుష్కలుండును శత్రుఘ్నునకు సుబాహుండును, శ్రుతసేనుండును సంభవించి; రయ్యెడ. (348) బంధురబలుఁడగు భరతుఁడు¯ గంధర్వచయంబుఁ ద్రుంచి కనకాదుల స¯ ద్బంధుఁ డగు నన్న కిచ్చెను¯ బంధువులును మాతృజనులుఁ బ్రజలున్ మెచ్చన్. (349) మధువనంబులోన మధునందనుం డగు¯ లవణుఁ జంపి భుజబలంబు మెఱసి¯ మధుపురంబు చేసె మధుభాషి శత్రుఘ్నుఁ¯ డన్న రామచంద్రుఁ డౌ ననంగ. (350) అంతఁ గొంతకాలంబునకు రామచంద్రుని కొమారులయిన కుశ లవులిద్దఱను వాల్మీకివలన వేదాదివిద్యల యందు నేర్పరులై పెక్కు సభల సతానంబుగా రామకథాశ్లోకంబులు పాడుచు నొక్కనాఁడు రాఘవేంద్రుని యజ్ఞశాలకుం జని. (351) వట్టి మ్రాకులు పల్లవింప నవారియై మధుధార దా¯ నుట్టఁబాడిన వారిపాటకు నుర్వరాధిపుఁడుం బ్రజల్¯ బిట్టు సంతస మంది; రయ్యెడఁ బ్రీతిఁ గన్నుల బాష్పముల్¯ దొట్ట నౌఁదల లూఁచి వారలతోడి మక్కువ పుట్టఁగాన్. (352) అంతనా రామచంద్రుండు కుమారుల కిట్లనియె. (353) "చిన్నయన్నలార! శీతాంశుముఖులార! ¯ నళినదళవిశాలనయనులార! ¯ మధురభాషులార! మహిమీఁద నెవ్వరు¯ దల్లిదండ్రి మీకు ధన్యులార? " (354) అనిన వార “లేము వాల్మీకి పౌత్రులము; రాఘవేశ్వరుని యాగంబు చూడ వచ్చితి” మనవుడు; మెల్లన నగి “యెల్లి ప్రొద్దున మీ తండ్రి నెఱింగెద; రుండుం” డని యొక్క నివాసంబునకు సత్కరించి పనిచె; మఱునాఁడు సీతం దోడ్కొని కుశలవుల ముందట నిడుకొని వాల్మీకి వచ్చి రఘుపుంగవునిం గని యనేక ప్రకారంబుల వినుతించి; యిట్లనియె. (355) "సీత సుద్దరాలు, చిత్తవాక్కర్మంబు¯ లందు సత్యమూర్తి యమలచరిత¯ పుణ్యసాధ్వి విడువఁ బోలదు చేకొను¯ రవికులాబ్ధిచంద్ర! రామచంద్ర!" (356) అని వాల్మీకి పలుక, రామచంద్రుండు పుత్రార్థి యై విచారింపఁ, గుశ లవులను వాల్మీకికి నొప్పగించి, రామచంద్రచరణధ్యానంబు చేయుచు నిరాశ యై సీత భూవివరంబు జొచ్చె; నయ్యెడ. (357) "ముదితా! యేటికిఁ గ్రుంకి తీవు మనలో మోహంబు చింతింపవే¯ వదనాంభోజము చూపవే మృదువు నీ వాక్యంబు విన్పింపవే¯ తుది చేయం దగ" దంచు నీశ్వరుఁడునై దుఃఖించె భూపాలుఁ డా¯ పదగాదే ప్రియురాలిఁ బాసిన తఱిన్ భావింప నెవ్వారికిన్?" (358) అని వగచి, రామచంద్రుండు బ్రహ్మచర్యంబు ధరియించి, పదుమూఁడువేల యేం డ్లెడతెగకుండ నగ్నిహోత్రంబు చెల్లించి తా నీశ్వరుండు గావునఁ దన మొదలినెలవుకుం జనియె నివ్విధంబున. (359) ఆదిదేవుఁడైన యా రామచంద్రుని¯ కబ్ధి గట్టు టెంత యసురకోటి¯ జంపు టెంత కపుల సాహాయ్య మది యెంత¯ సురల కొఱకుఁ గ్రీడ జూపెఁగాక. (360) వశుఁడుగ మ్రొక్కెదన్ లవణవార్ధి విజృంభణతా నివర్తికిన్¯ దశదిగధీశమౌళిమణి దర్పణమండిత దివ్యకీర్తికిన్¯ దశశతభానుమూర్తికి సుధారుచిభాషికి సాధుపోషికిన్¯ దశరథరాజుపట్టికిని దైత్యపతిం బొరిగొన్న జెట్టికిన్. (361) నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు మహాశుగంబులున్¯ విల్లును దాల్చువాఁడు గడు విప్పగు వక్షమువాఁడు మేలు పైఁ¯ జల్లెడువాఁడు నిక్కిన భుజంబులవాఁడు యశంబు దిక్కులం¯ జల్లెడువాఁడు నైన రఘుసత్తముఁ డిచ్చుత మా కభీష్టముల్. (362) రామచంద్రుఁ గూడి రాకలఁ పోకలఁ¯ గదిసి తిరుగువారుఁ గన్నవారు¯ నంటికొన్నవారు నా కోసలప్రజ¯ లరిగి రాదియోగు లరుగు గతికి. (363) మంతనములు సద్గతులకుఁ¯ బొంతనములు ఘనములైన పుణ్యముల కిదా¯ నీంతనపూర్వమహాఘ ని¯ కృంతనములు రామనామ కృతి చింతనముల్. (364) ఆ రామచంద్రునకుఁ గుశుండును, గుశునకు నతిథియు, నతిథికి నిషధుండును, నిషధునకు నభుండును, నభునికిఁ బుండరీకుండును బుండరీకునకు క్షేమధన్వుండును, క్షేమధన్వునకు దేవానీకుండును, దేవానీకునకు నహీనుండును, నహీనునకుఁ బారియాత్రుండును, బారియాత్రునకు బలుండును, బలునకుఁ జలుండును, జలునకు నర్కసంభవుం డగు వజ్రనాభుండును, వజ్రనాభునకు శంఖణుండును, శంఖణునకు విధృతియు, విధృతికి హిరణ్యనాభుండును జనియించి; రతండు జైమిని శిష్యుండైన యాజ్ఞవల్కముని వలన నధ్యాత్మయోగంబు నేర్చి, హృదయకలుషంబులం బాసి యోగచర్యుండయ్యె నా హిరణ్యనాభునకుఁ బుష్యుండును, బుష్యునకు ధ్రువసంధియు, ధ్రువసంధికి సుదర్శనుండును, సుదర్శనునకు నగ్నివర్ణుండును, నగ్నివర్ణునకు శీఘ్రుండును, శీఘ్రునకు మరువను రాజశ్రేష్ఠుండును బుట్టి: రా రాజయోగి సిద్ధుండయి కలాపగ్రామంబున నున్నవాఁడు కలియుగాంతంబున నష్టంబయ్యెడు సూర్యవంశంబుఁ గ్రమ్మఱఁ బుట్టింపంగలవాఁ; డా మరువునకుఁ బ్రశుశ్రుకుండును, నా ప్రశుశ్రుకునకు సంధియు, నతనికి నమర్షణుండును, నా యమర్షణునికి మహస్వంతుండును, నా మహస్వంతునకు విశ్వసాహ్యుండును, నా విశ్వసాహ్యునకు బృహద్బలుండును, జనియించి; రా బృహద్బలుఁడు భారతయుద్ధంబున మీ తండ్రి యగు నభిమన్యు చేత హతుండయ్యె; వినుము.
భవిష్యద్రా జేతిహాసము
(365) పరఁగ నిక్ష్వాకుఁడును బృహద్బలుఁడు మొదలు ¯ దుదయుఁ గాఁగల రాజులఁ దోడుతోడ¯ నెఱుఁగఁ జెప్పితి నీవారి; నింకమీఁదఁ¯ బుట్టఁ గలవారిఁ జెప్పెద భూవరేంద్ర! (366) ఆ బృహద్బలునకు బృహద్రణుండును బృహద్రణునకు నురుక్షతుండును, నాతనికి వత్సప్రీతుండును, వత్సప్రీతునకుఁ బ్రతివ్యోముండును, బ్రతివ్యోమునకు భానుండును, భానునకు సహదేవుండును, సహదేవునకు బృహదశ్వుండును, బృహదశ్వునకు భానుమంతుండును, భానుమంతునకుఁ బ్రతీకాశ్వుండును, బ్రతీకాశ్వునకు సుప్రతీకుండును, సుప్రతీకునకు మేరుదేవుండును, మేరుదేవునకు సుతక్షత్రుండును, సుతక్షత్రునకు ఋక్షకుండును, ఋక్షకునకు నంతరిక్షుండును, నంతరిక్షునకు సుతపుండును, సుతపునకు నమిత్రజిత్తును, నతనికి బృహద్వాజియు, నతనికి బర్హియు, బర్హికి ధనంజయుండును, ధనంజయునకు రణంజయుండును, నతనికి సృంజయుండును, సృంజయునకు శాక్యుండును, శాక్యునకు శుద్ధాదుండును, శుద్ధాదునకు లాంగలుండును, లాంగలునకుఁ బ్రసేనజిత్తును, నతనికి క్షుద్రకుండును, క్షుద్రకునకు ఋణకుండును, ఋణకునకు సురథుండును, సురథునకు సుమిత్రుండును బుట్టుదురు; సుమిత్రుని యనంతర కాలంబున సూర్యవంశంబు నశింపఁ గలదు వీరలు బృహద్బలునినుండి క్రమంబునం బుట్టం గలవార” లని చెప్పి శుకుం డిట్లనియె.
నిమి కథ
(367) "ధన్యుఁడా యిక్ష్వాకు తనయుఁడౌ నిమి యాగ¯ మాచరింపఁగఁ గోరి యా వశిష్ఠు¯ నార్త్విజ్యమునకుఁ దా నర్థింపఁ గని యాతఁ¯ డింద్రునిమఖము చేయింప నియ్య¯ కొనినాఁడ మఱి వత్తుఁ గొదవలే దన వచ్చి¯ "సంసార మెంతయు చంచలంబు¯ కాలయాపనమేల? క్రతువు చేసెద" నని¯ యన్య ఋత్విక్కుల నతఁడు గూర్చి (367.1) చేయ నింద్రుని యాగంబు చెల్లఁజేసి¯ గురుఁడు చనుదెంచి శిష్యుపైఁ గోప మెత్తి¯ "యోరి నా వచ్చునందాక నుండ" వనుచు. ¯ నతని దేహంబు పడుఁగాత మని శపించె (368) ఇట్లు వశిష్ఠుండు శపించిన, నిమియును వశిష్ఠుని దేహంబు పడుఁ గాక యని మరల శపియింప, నవ్వశిష్ఠుండు మిత్రావరుణుల వలనఁ గడపట నూర్వశికి జన్మించె; గురుశాపంబున బ్రహ్మజ్ఞాని యైన నిమి విగతదేహుండైన, నతని దేహంబు మునీశ్వరులు గంధ వస్తువులం బొదివి, దాఁచి దొరకొన్న సత్త్రయాగంబు చెల్లంచిరి; కడపట దేవగణంబులు మెచ్చి వచ్చిన వారలకు నిమిదేహంబు చూపి “బ్రదుకం జేయుం” డనవుడు వారలు “నిమిప్రాణంబు వచ్చుం గాక” యని పలికిన నిమి తనదేహంబు చొరనొల్లక యిట్లనియె. (369) "అతి మోహాకులితంబు సాంద్రమమతాహంకారమూలంబు సం¯ తత నానాసుఖదుఃఖపీడిత మనిత్యం; బిట్టి దేహంబు సం¯ కృతి నా కేటికి? మీనజీవనము భంగిన్ భీతి బాహుళ్య మం¯ చితరుల్ పెద్దలు దీనిఁ జేకొనరు సర్వేశున్ హరిం గొల్చుచున్." (370) అని పలికిన నిమిమాటలు క్రమ్మఱింపనేరక "శరీరులు గన్నులు దెఱచినప్పుడును, మూసినప్పుడును నిమి గానవచ్చుంగాక"యని పల్కి దేవతలు చని; రంత. (371) పెద్దలైన మునులు పృథివీస్థలికి రాజు¯ లేమిఁ జూచి నిమికళేబరంబు¯ దరువ నొకఁడు పుట్టెఁ దనయుండు వానిని¯ జనకుఁ డనుచుఁ బలికె జగము లెల్ల. (372) మఱియు నతండు విదేహజుండు గావున వైదేహుం డనియు మథనజాతుండు గావున మిథిలుం డనియు ననం బరగె; నమ్మిథులుని చేత నిర్మితం బయినది మిథిలానగరంబు నాఁ బరగె; నా జనకునకు నుదావసుండును, నుదావసునకు నందివర్ధనుండును, నందివర్థనునకు సుకేతుండును, సుకేతునకు దేవరాతుండును, దేవరాతునకు బృహద్రథుండును బుట్టిరి; ఆతనికి మహావీర్యుండును, నతనికి సుధృతియు, నతనికిఁ ధృష్టకేతుండును, నతనికి హర్యశ్వుండును, నతనికి మరువును, నతనికిఁ బ్రతింధకుండును, నతనికిఁ గృతర యుండును, నతనికి దేవమీఢుఁడును, నతనికి విధృతుండును, నతనికి మహాధృతియు, నతనికి గీర్తిరాతుండును, నతనికి మహారోముండును, నతనికి స్వర్ణరోముండును, నతనికి హ్రస్వరోముండును, నత నికి సీరధ్వజుండును పుట్టిరి. (373) అతఁడు మఖము చేయ నవని దున్నింపంగ¯ లాంగలంబుకొనను లక్షణాంగి¯ సీత జాత యయ్యె సీరధ్వజుం డనఁ¯ దానఁ జెప్పఁబడియె ధన్యుఁ డతఁడు. (374) ఆ సీరధ్వజునకుఁ గుశధ్వజుండును, గుశధ్వజునకు ధర్మధ్వజుండు, ధర్మధ్వజునకుఁ గృతధ్వజ మితధ్వజులను వారిద్ధఱుఁ బుట్టి; రందుఁ గృతధ్వజునకుఁ గేశిధ్వజుం డుదయించె నతండు తన్నుఁ దానెఱింగెడి విద్య యందు నేర్పరి యయ్యె; మితధ్వజునకు ఖాండిక్యుం డనువాఁడు జన్మించి తండ్రివలన నెఱుక గలవాఁడయి, కర్మతంత్రంబు నేర్చి కేశిధ్వజునివలన భీతుండయి యేఁగె; ఖాండిక్యునకు భానుమంతుండును, భానుమంతునకు శతద్యుమ్నుండును శతద్యుమ్నునికి శుచియు, శుచికి సనధ్వాజుండు, సనధ్వాజునకు నూర్ధ్వకేతుండును, నూర్ధ్వకేతునకు నజుండును, నజునకుఁ గురుజిత్తును, గురుజిత్తునకు నరిష్టనేమియు, నరిష్టనేమికి శ్రుతాయువును, శ్రుతాయువునకుఁ బార్శ్వకుండును, బార్స్వకునకుఁ జిత్రరథుండును, చిత్రరథునకు క్షేమాపియు, క్షేమాపికి హేమరథుండును, హేమరథునకు సత్యరథుండును, సత్యరథునకు నుపగురుండును, నుపగురునకు నగ్నిదేవు ప్రసాదంబున నుపగుర్వుండును, నుపగుర్వునకు సావనుండును, సావనునకు సువర్చసుండును, గల్గి; రతండె సుభూషణుండని వినంబడు; నా సుభూషణునకు జయుండును, జయునకు విజయుండును, విజయునకు ధృతుండును, ధృతునకు ననఘుండును, ననఘునకు వీతిహవ్యుండును, వీతిహవ్యునకు ధృతియు, ధృతికి బహుళాశ్వుండును, బహుళాశ్వునకుఁ గృతియుఁ, గృతికి మహావశియును జన్మించిరి; వీరలు మైథిలులగు రాజులని చెప్పంబడుదురు; యోగీశ్వరప్రసాదంబున గృహస్థులయి యుండియు, బంధనిర్ముక్తులయి, యాత్మజ్ఞానంబు గలిగి నిరంతర బ్రహ్మానుసంధానంబు చేయుచునుండుదు” రని పలికి శుకయోగీంద్రుం డిట్లనియె.