పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 2 : నవమ 219 - 257

భగీరథుని చరితంబు

(219) అతని సుతుండు భగీరథుఁ¯ డతి తప మొనరించి కనియె నమృతాపాంగన్¯ సుతరంగన్ ముఖవనరుహ¯ రతభృంగన్ శివజటాగ్రరంగన్ గంగన్. (220) కని నమస్కరించిన గంగ గృపజేసి, వరంబు వేఁడు మనిన నా రాచపట్టి యిట్లనియె. (221) "మా వారి భస్మరాసుల¯ నీ వారిం గలిపికొనుము; నెఱి మావారల్¯ నీ వారిఁ గలయ నాకము¯ మావారికిఁ గలుగు నిది ప్రమాణము తల్లీ! (222) చెల్లన్ మదిన్ నిన్ను భజింతు గంగన్¯ ఫుల్లాంతరంగన్ బహుపుణ్యసంగం¯ గల్లోలలక్ష్మీజితకాశమల్లిం¯ దల్లిన్ సుధీకల్పలతామతల్లిన్." (223) అని వినుతి చేయుచున్న రాజకుమారునకు లోకపావ నిట్లనియె. (224) "వినువీథిం బఱతెంచి నేలఁబడు నా వేగంబునున్ నిల్ప నో¯ పినవాఁ డెవ్వడు? మేదినీతలము నే భేదించి పాతాళముం¯ జనుదున్; వచ్చితినేని నా జలములన్ సంస్నాతులై మానవుల్¯ ననుఁ బొందించు నఘవ్రజం బెచట నే నాశంబుఁ బొందించెదన్. (225) అది కారణంబుగా విచారించెద” నని పలుకుచున్న లోకమాతకు రాజన్యవర్యుండగు భగీరథుం డిట్లనియె. (226) "పరతత్త్వజ్ఞులు శాంతచిత్తులు తపః పారీణు లార్యుల్ ఘనుల్¯ బురుషశ్రేష్ఠులు వచ్చి తల్లి! భవదంభోగాహముల్ చేయఁగా¯ నరసంఘాఘము నిన్నుఁ బొందునె జగన్నాథుండు నానాఘ సం¯ హరుఁ డా విష్ణుఁడు వారిచిత్తములఁ దా నై యుంట మందాకినీ. (227) తనలో నిన్ని జగంబులుం గలుగుటం దా నిన్నిటం గల్గుటన్¯ జననీ! తంతువులందుఁ జీర గల యా చందంబునన్ విశ్వభా¯ వనుఁడై యొప్పు శివుండు గాక మఱి నీ వారిన్ నివారింప నే¯ ర్చిన వారెవ్వరు? నిన్ ధరించుకొఱకై శ్రీకంఠునిం గొల్చెదన్." (228) అని యెఱింగించి వీడ్కొని, చని, భగీరథుండు మహేశ్వరు నుద్దేశించి గ్రద్దనఁ దపంబు చేసిన. (229) భక్తవత్సలుండు ఫాలాక్షుఁ డా భగీ¯ రథుని మెచ్చి నిజ శిరంబునందు¯ శౌరిపాదపూత సలిల మై దివి నుండి¯ ధరకు వచ్చు గంగఁ దాల్చె నపుడు.

గంగాప్రవాహ వర్ణన

(230) ఇట్లమ్మహానదీప్రవాహంబు, పురారాతిజటాజూటరంధ్రంబుల వలన వెలువడి, నిరర్గళాయమానంబై, నేలకుఁ జల్లించి, నెఱసి నిండి పెల్లు వెల్లిగొని, పెచ్చు పెరిగి విచ్చలవిడిం గ్రేపువెంబడి నుఱక క్రేళ్ళుఱుకు మఱక ప్రాయంపుఁ గామధేనువు చందంబున ముందఱికి నిగుడు ముద్దుఁ జందురు తోడి నెయ్యంబునఁ గ్రయ్య నడరి చొప్పుదప్పక సాఁగి చనుదెంచు సుధార్ణవంబు కైవడిఁ బెంపుఁ గలిగి మహేశ్వరు వదనగహ్వరంబు వలన నోంకారంబు పిఱుంద వెలువడు శబ్దబ్రహ్మంబు భంగి నదభ్రవిభ్రమంబై య మ్మహీపాల తిలకంబు తెరువు వెంటనంటి వచ్చు వెలియేనుఁగు తొండంబుల ననుకరించి పఱచు వఱదమొగంబులును, వఱదమొగంబుల పిఱుందనందంద క్రందుకొని పొడచూపి తొలంగు బాలశారదా కుచకుంభంబులకు నగ్గలం బైన బుగ్గలును, బుగ్గలసంగడంబునం బారిజాతకుసుమ స్తబకంబుల చెలువంబులం దెగడు వెలినురువులును, వెలినురువుల చెంగట నర్థోన్మీలిత కర్పూరతరుకిసలయంబులఁ చక్కందనముఁ గేలిగొను సుళ్ళును, సుళ్ళ కెలంకుల ధవళజలధరరేఖాకారంబుల బాగు మెచ్చని నిడుద యేఱులును, నేఱులం గలసి వాయువశంబున నొండొంటిం దాఁకి బిట్టు మిట్టించి, మీఁది కెగయు దురితభంగంబులైన భంగంబులును, భంగంబులకొనల ఛిన్నభిన్నంబులై కుప్పించి, యుప్పరం బెగసి, ముత్తియంపు సరుల వడుపున, మల్లికాదామంబుల తెఱంగునఁ గర్పూరఖండకదంబంబుల చెలువంబున నిందుశకలంబుల తేజంబునఁ, దారకానికరంబుల పొలుపున మెఱయుచు, ముక్తి కన్యా వశీకరంబులైన శీకరంబులునుం గలిగి, మధ్యమలోక శ్రీకరంబై, శ్రీకరంబు తెఱంగున విష్ణుపదంబు ముట్టి, విష్ణుపదంబు భాతి నుల్లసితహంసరుచిరంబై, రుచిరపక్షంబురీతి నతిశోభితకువలయంబై, కువలయంబు చెన్నున బహుజీవనంబై, జీవనంబులాగున సుమనోవికాసప్రధానంబై, ప్రధాన పర్వంబు పొలుపున నేకచక్ర బక భీమ మహాభంగ సుభద్రార్జున చరిత్రారామంబై, రామచిత్తంబు మెలఁపువం దనవారిలోఁజొచ్చిన దోషాచరుల కభయప్రదాన చణంబై, ప్రదానచణ వర్తనంబు భాతి సముపాసిత మృత్యుంజయంబై, మృత్యంజయురూపంబుపోలిక విభూతి సుకుమారంబై, కుమారచరిత్రంబుఠేవను గ్రౌంచప్రముఖవిజయంబై, విజయ రథంబుభాతి హరిహయామంథరంబై, మంథరవిచారంబు గ్రద్దన మహారామగిరివనప్రవేశకామంబై, కామకేతనంబు పెల్లున నుద్దీపిత మకరంబై మకరకేతను బాణంబు కైవడి విలీనపరవాహినీకలిత శంబరంబై, శంబరారాతి చిగురు గొంతంబుసూటి నధ్వగవేదనాశమనంబై, శమనదండంబు జాడ నిమ్నోన్నత సమవృత్తంబై, వృత్తశాస్త్రంబు విధంబున వడిగలిగి సదా గురులఘువాక్యచ్ఛటా పరిగణితంబై, గణితశాస్త్రంబు కొలఁదిని ఘనఘనమూల వర్గమూల సంకలిత భిన్నమిశ్ర ప్రకీర్ణఖాతభీష్మంబై, భీష్మపర్వంబు పెంపున ననేక భగవద్గీతంబై, గీతశాస్త్రంబు నిలుకడను మహాసుషిరతను ఘన నానాశబ్దంబై, శబ్దశాస్త్రంబు మర్యాద నచ్చువడి హల్లు గలిగి, మహాభాష్యరూపావతారవృత్తి వృద్ధిగుణసమర్థంబై, యర్థశాస్త్రంబు మహిమను బహుప్రయోజన ప్రమాణ దృష్టాంతంబై, దృష్టాంతంబు తెఱంగున సర్వసామాన్య గుణవిశేషంబై, శేషవ్యాపారంబు కరణిని సుస్థిరోద్ధరణతత్పరంబై, పరబ్రహ్మంబుగరిమ నతిక్రాంతానేక నిగమంబై, నిగమంబు నడవడిని బ్రహ్మవర్ణపదక్రమసంగ్రహంబై, గ్రహశాస్త్రంబు పరిపాటిని గర్కట మీన మిథున మకరరాశి సుందరంబై, సుందరి ముఖంబు పోఁడిమిని నిర్మల చంద్రకాంతంబై, కాంతాధరంబు రుచిని శోణచ్ఛాయావిలాసంబై, విలాసవతి కొప్పునొప్పునఁ గృష్ణనాగాధికంబై, యధికమతిశాస్త్రసంవాదంబు సొంపున నపార సరస్వతీ విజయ విభ్రమంబై, విభ్రమవతిచనుదోయి పగిది నిరంతర పయో వ్యాప్తాఖిలలోక జీవనప్రద తుంగభద్రాతిరేఖా సలలితంబై, లలితవతి నగవు మించున నపహసిత చంద్రభాగధేయంబై, భాగధేయవంతుని వివాహంబు లీల మహామేఖలకన్యకావిస్తారంబై, తారకెంగేలి యొడికంబున నాక్రాంత సూర్యతనయంబై, సూర్యతనయు శరవర్షంబు పోలిక భీమరథ్యాటోపవారణంబై, వారణంబు పరుసునం బుష్కరోన్నత సంరంభంబై, రంభ నెమ్మోము డాలున సురసాతిశయ దశం బై, దశరథ తనయు బొమముడి చాడ్పున సింధుగర్వ ప్రభంజనం బై, ప్రభంజతనయు గదపెట్టు మాడ్కిని సమీపగత దుశ్సాసన దుర్మద నివారకరంబై, వారకన్యక ముంజేతి గతిని ముహుర్ముహరుచ్చలిత కంకణాలంకృతంబై, కృతయుగంబు నోజ నపంకంబై, పంకజాసనుముఖంబు నొఱపునఁ బ్రభూతముఖ్యవర్ణంబై, వర్ణగుణితంబు తెఱకువను బహుదీర్ఘబిందు విసర్గంబై, సర్గబంధకావ్యంబు విన్ననువున గంభీరభావమధురంబై, మథురాపురంబు సొబగున మహానందనందనంబై, నందనవనంబు పొందున విహరమాణ కౌశికంబై, కౌశికహయంబు రీతి సుదశధ్రువంబై, ధ్రువు తలంపు క్రియం గ్రియాబరిశీలిత విశ్వంభరంబై, విశ్వంభరుని శంఖంబు రూపున దక్షిణావర్తోత్తరంబై, యుత్తరావివాహంబు చందంబునఁ బ్రముదిత నరంబై, నరసింహు నఖరంబుల భాతి నాశ్రిత ప్రహ్లాద గురువిభవ ప్రదానంబై, దానకాండంబు సిరిం గామధేను కల్పలతాద్యభివనంబై, నవసూతికాకుచంబు పేర్మిని నిరంతర పయోవర్ధనంబై, ధనదు నిలయంబు తూనికను సంభృత మకర పద్మ మహాపద్మ కచ్ఛపంబై, కచ్ఛప కర్పరంబు బలిమిని బతితశైలసముద్ధరణంబై, ధరణీధరంబు సాటి నుత్తుంగ తటముఖ్యంబై, ముఖ్యవరాహంబు గరిమ నున్నత క్షమంబై, క్షమాసుర హస్తంబు గరగరికను సత్పవిత్ర మనోరామం బై, రామచంద్రుని బాణంబుకడింది నభాగ్యత ఖరదూషణ మదాపహరణ ముఖరంబై, ముఖర రామ కుఠారంబు రీతిని భూభృన్మూలచ్ఛే దన ప్రబలంబై, బలరామహలంబుభాతిని బ్రతికూలసన్నికర్షణ ప్రబుద్ధంబై, బుద్ధదేవునిమేని యొఱపున నభియాతి రక్షోదార మనోహరం బై, హరతాండవంబు మేర నుల్లసితానిమిషంబై, యనిమిషావతారంబు కీర్తిని శ్రుతి మంగళప్రదంబై, ప్రదాత యీగి సూటినర్థ పరంపరా వామనంబై, వామనచరణరేఖను బలివంశవ్యపనయంబై, నయశాస్త్రంబు మార్గంబున సామభేదమాయోపాయ చతురంబై, చతురాన నాండంబు భావంబున నపరిమిత భువన జంతుజాల సేవ్యమానం బై, మానినియన లోఁతు చూపక, గరితయన చడిచప్పుడు చేయక, ముగుద యన బయలు పడక, ప్రమద యన గ్రయ్యంబాఱుచుఁ, బతివ్రత యన నిట్టట్టుఁ జనక, తల్లియన నెవ్వియైన లోఁగొనుచు, దైవంబన భక్త మనోరథంబు లిచ్చుచు, నంతకంతకు విస్తరించి గుఱిగడచి, యవాఙ్మానస గోచరంబై ప్రవహించి. (231) జగతీనాథు రథంబుపజ్జ బహుదేశంబుల్ వడిన్ దాఁటి త¯ త్సగరక్ష్మాపకుమార భస్మముల మీఁదన్ ముంచి పాఱన్ మరు¯ న్నగరావాసము వారు పొందిరి నవీనశ్రీలతో గంగ నీ¯ రుగతిం గాక మహాదురంత సుజనద్రోహానలం బాఱునే. (232) హరు మెప్పించి మహా తపో నియతుఁడై యాకాశగంగానదిన్¯ ధరకుం దెచ్చి నితాంత కీర్తిలతికా స్తంభంబుగా నవ్య సు¯ స్థిర లీలం బితృకృత్య మంతయు నొనర్చెన్ వారితానేక దు¯ స్తర వంశవ్యధుఁ డా భగీరథుఁడు నిత్యశ్రీకరుం డల్పుఁడే? (233) హరిఁ దమ మనముల లోనిడి¯ హరి పాదాంభోజ జనితమైన నదిన్ సు¯ స్థిరులై క్రుంకి మునీంద్రులు¯ హరిఁ గలిసిరి త్రిగుణరహితులై యవ్వేళన్. (234) అంత నా భగీరథునకు శ్రుతుండును, శ్రుతునకు నాభావరుండును, నాభావరునకు సింధుద్వీపుండును, సింధుద్వీపునికి నయుతాయువును, నయుతాయువునకు ఋతుపర్ణుండును జనియించె; నతండు. (235) నయ విశాలబుద్ధి నలచక్రవర్తితో¯ సంగడీనితనము చాలఁ జేసి¯ యక్షహృదయ మతని కవ్యస్తముగ నిచ్చి¯ యశ్వవిద్య నేర్చె నతనివలన.

కల్మాషపాదుని చరిత్రము

(236) ఆ ఋతుపర్ణునకు సర్వకాముండును, సర్వకామునకు మదయంతీ వల్లభుండైన సుదాసుండును బుట్టె, నా రాజశేఖరుని మిత్రసహుండును, గల్మాషపాదుండు నని చెప్పుదు, రా భూవరుండు వసిష్ఠుని శాపంబున రాక్షసుడయి, తన కర్మంబున నపత్యుండయ్యె,” ననిన విని పరీక్షిన్నరేంద్రు డేమి కారణంబున సుదాసునకు గురుశాపంబు ప్రాప్తంబయ్యె” నని యడిగిన శుకుం డిట్లనియె. (237) "ఆ సుదాసుఁడు వేఁటకై వనంబున కేగి¯ గర్వించి యొక్క రక్కసునిఁ జంపి¯ వానితోఁ బుట్టిన వానిఁ బో విడిచిన¯ వాఁడును దనతోడివాని చావు¯ పోనీక కపటియై భూపాలుగృహమున¯ నడబాలతనమున నర్థిఁ గొలిచి¯ యుండ వసిష్ఠున కుర్వీశుఁ డొక్కనాఁ¯ డన్నంబు జేయంగ నతనిఁ బనుప (237.1) వాఁడు మానవ మాంసంబు వండి తెచ్చి¯ మునికి వడ్డింపఁ గోపించి ముని నరేంద్రుఁ¯ బిలిచి మనుజామిషంబును బెట్టి తనుచు¯ నలుకతో రాక్షసుఁడవు గమ్మని శపించె. (238) ఇట్లు శపియించి పదంపడి, రాక్షసుండు వండి తెచ్చుటయు, సుదాసుం డెరుంగమియుఁ దన మనంబున నెఱింగి, వసిష్ఠుఁడు పండ్రెండేండ్లు రక్కసుండవయి యుండుమని నియమించె; నయ్యవసరంబున. (239) గురువున్ మాఱుశపింతు నంచు జలముల్ గోపంబుతో దోయిటన్ ¯ నరనాథుండు ధరింపఁ దత్సతి పతిన్వారింప మిన్నుం దిశల్¯ ధరయున్ జీవమయంబకా నిఖిలముం దాఁ జూచి చల్లెన్ ధరా¯ వరుఁ డాత్మీయపదంబులం గరపుటీవాఃపూరముం బొక్కుచున్. (240) ఇట్లు మిత్రసహుండు గావునఁ గళత్రానుకూలుండై శపియింప నొల్లక సుదాసుండు రాక్షస భావంబు నొంది, కల్మషవర్ణంబు లయిన పాదంబులతో నడవులం దిరుగుచు. (241) ఆఁకట మలమల మాఁడుచు¯ వీఁక నతం డడవి నున్న విప్ర మిథునముం¯ దాఁకి తటాలున విప్రునిఁ¯ గూఁకటి చేఁబట్టి మ్రింగఁ గొనిపోవుతఱిన్. (242) అంత నా బ్రాహ్మణుని భార్య మోఁదికొనుచుం బెగ్గడిల్లి, డగ్గుత్తికతోఁ బతికి నడ్డంబు వచ్చి, యేడ్చుచు రాచరక్కసున కిట్లనియె. (243) "మానుషదేహము గలుగుట¯ భూనాయక! దుర్లభంబు పుట్టినమీదఁన్¯ దానముఁ బరోపకారము¯ భూనుతకీర్తియును వలదె పురుషున కెందున్? (244) రవి వంశాగ్రణివై సమస్తధరణీరాజ్యాను సంధాయివై¯ భువనస్తుత్యుఁడవై పరార్థరతివై పుణ్యానుకూలుండవై¯ వివరంబేమియు లేక నా పెనిమిటిన్ విప్రుం దపశ్శీలు స¯ త్ప్రవరున్ బ్రహ్మవిదున్ జగన్నుతగుణున్ భక్షింపఁగాఁ బాడియే? (245) తండ్రీ! మీకు దినేశవంశజులకున్ దైవం బగున్ బ్రాహ్మణుం¯ డండ్రా మాటలు లేవె? భూమిసుర గోహత్యాభిలాషంబు గై¯ కొండ్రే మీ యటువంటి సాధువులు? రక్షోభావ మిట్లేల? మీ¯ తండ్రిం దాతలఁ బూర్వులం దలఁపవే ధర్మంబునుం బోఁగదే. (246) అన్నా! చెల్లెల నయ్యెదన్; విడువు నీకన్నంబు బెట్టింతు; నా¯ హృన్నాథున్ ద్విజు గంగికుఱ్ఱి నకటా! హింసింప నేలయ్య? నీ¯ వెన్నం డింతులతోడఁ బుట్టవె? నిజం బిట్టైన మున్ముట్ట నా¯ పన్నన్ నన్ను శిరంబు ద్రుంచి మఱి మత్ప్రాణేశు భక్షింపవే." (247) అని కరుణ పుట్ట నాడుచు¯ వనితామణి పలవరింప వసుధాదేవుం¯ దినియె నతఁడు పులి పశువుం¯ దిను క్రియ శాపంబు కతన ధీరహితుండై. (248) అంత నా బ్రాహ్మణి గోపించి “కామార్తనయిన నాదు పెనిమిటిని భక్షించితివి గావున నీవు నెలఁతలంబొందఁ జేరినవేళ మరణంబుఁ బొందు” మని కల్మాషపాదుని శపించి, పతిశల్యంబులతో నగ్నిప్రవేశంబు జేసి సుగతికిం జనియె; నంతఁ బండ్రెండేండ్లు చనిన నా రాజు మునిశాపనిర్ముక్తుండై. (249) రతులకొఱకు నాలి రావింప నదియును¯ బెదరి విప్రసతి శపించు టెఱిఁగి¯ మగని నడ్డపెట్టి మైథునకర్మంబు¯ మాన్చె సతుల గోష్ఠి మానె నతడు. (250) అది కారణముగఁ బుత్రా ¯ భ్యుదయము లేదా సుదాసభూపాలునకుం¯ దదనుమతి నవ్వసిష్ఠుఁడు¯ మదయంతికిఁ గడుపుజేసె మదనక్రీడన్. (251) ఇట్లు సుదాసుని భార్య యగు మదయంతి వసిష్ఠునివలన గర్భిణి యై యేడేండ్లు గర్భంబు ధరించి నీళ్ళాడ సంకటపడుచున్న వసిష్ఠుండు వాఁడి యగు నశ్మంబున నా గర్భంబుఁ జీరిన నశ్మకుం డను కుమారుండు పుట్టె; నతనికి మూలకుండు పుట్టె; నతండు. (252) వీరుఁడగు పరశురాముఁడు¯ ఘోర కుఠారమున నృపులఁ గూలుచు వేళన్¯ నారీజనములు దాఁచిన¯ నారీకవచుం డనంగ నలి నుతి కెక్కెన్.

ఖట్వాంగుని చరిత్రము

(253) ఆ నారీకవచుండు నిర్మూలం బయిన రవివంశంబునకు మూలం బగుటంజేసి మూలకుండనం బరఁగె నామూలకునకు విశ్వసహుండు పుట్టె విశ్వసహునకు ఖట్వాంగుడు పుట్టి చక్రవర్తి యయ్యె; నతండు. (254) అమరులు వేఁడిన నసురనాథులఁ జంపి¯ త్రిదశులతోఁ దన బ్రతుకుకాల¯ మెంతని యడిగిన నిదె నిండుచున్నది¯ తడవులే దేమైన నడుగు మనిన¯ వరములు గోరక వరవిమానం బెక్కి¯ తనపురికేతెంచి తత్త్వబుద్ధిఁ¯ బరమేశ్వరుని యంద భావంబుఁ గీలించి¯ "కులదైవతద్విజకులముకంటె (254.1) నంగనా ప్రాణ రాజ్య పుత్రాదు లెల్ల¯ గావు ప్రియములు ధర్మంబు గడచి నాదు¯ మతి ప్రవర్తింప దెన్నఁడు మది నెఱుంగ¯ నన్య మా యీశ్వరునిఁ దక్క ననుచు మఱియు. (255) ఇలమీఁదన్ బ్రదుకేల? వేల్పులవరం బేలా? ధనం బేల? చం¯ చల గంధర్వపురీ విడంబనము లైశ్వర్యంబు లేలా? జగం¯ బులఁ బుట్టించు తలంపునం బ్రకృతితోఁ బొత్తై తుదిం బాసి ని¯ ర్మలమై వాఙ్మనసామితం బగు పరబ్రహ్మంబు నేఁ జెందెదన్." (256) అని నిశ్చయించి. (257) కలసెన్ సంగములెల్లఁ బాసి నియతిన్ ఖట్వాంగు డశ్రాంతమై¯ కల దయ్యున్ మఱిమీఁద లే దనెడిదై కల్యాణమై యాత్మలోఁ¯ దలఁపం బల్కగరానిదై పరమమై తత్త్వజ్ఞు లూహించి హృ¯ జ్జలజాతంబుల వాసుదేవుఁ డని సంస్ఠాపించు నా బ్రహ్మమున్.