పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 2 : నవమ 100 - 218

దూర్వాసుని కృత్య కథ

(100) అని ధర్మసందేహంబు పాపిన, నా రాజర్షిశ్రేష్ఠుండును మనంబున హరిం దలంచి నీరు పారణంబు చేసి, జలంబుల మునింగిన తపసి రాక కెదురుచూచుచున్న సమయంబున. (101) యమునలోఁ గృతకృత్యుఁడై వచ్చి రాజుచే¯ సేవితుండై రాజుచేష్టితంబు¯ బుద్దిలో నూహించి బొమముడి మొగముతో¯ నదరెడి మేనితో నాగ్రహించి¯ రెట్టించి యాఁకలి గొట్టుమిట్టాడంగ¯ "నీ సంపదున్మత్తు నీ నృశంసు¯ నీ దురహంకారు నిందఱుఁ గంటిరే?¯ విష్ణుభక్తుఁడు గాడు వీఁడు; నన్నుఁ (101.1) గుడువ రమ్మని మునుముట్టఁ గుడిచినాఁడు¯ ధర్మభంగంబు చేసి దుష్కర్ముఁ డయ్యె; ¯ నయిన నిప్పుడు చూపెద నన్ని దిశల¯ నేను గోపింప మాన్చువాఁ డెవ్వఁ?" డనుచు. (102) పెటపెటఁ బండ్లు గీఁటుచును భీకరుఁడై కనుఁ గ్రేవ నిప్పుకల్¯ పొటపొటరాల గండములుపొంగ మునీంద్రుఁడు హుంకరించుచున్¯ జట మొదలంటఁగాఁ బెఱికి చక్కన దానన కృత్య నాయుధో¯ త్కట వరశూల హస్తయుతఁగా నొనరించి కవించె రాజుపైన్. (103) అంత. (104) కాలానల సన్నిభయై¯ శూలాయుధహస్త యగుచు సుఱసుఱ స్రుక్కన్¯ నేలఁ బదంబులఁ ద్రొక్కుచు¯ వాలి మహాకృత్య మనుజవల్లభుఁ జేరెన్. (105) ఆ ప్రకార మెఱిఁగి హరి విశ్వరూపుండు¯ వెఱ్ఱి తపసి చేయు వేడబంబుఁ¯ జక్కఁబెట్టు మనుచుఁ జక్రంబుఁ బంచిన¯ వచ్చె నదియుఁ బ్రళయవహ్ని పగిది. (106) వచ్చి మునిపంచిన కృత్యను దహించి, తనివిచనక ముని వెంటం బడిన, మునియును మేరుగుహ జొచ్చిన నదియు నురగంబు వెనుకొను దవానలంబు చందంబునఁ దోన చొచ్చి మఱియును. (107) భువిఁదూఱన్ భువిదూఱు; నబ్ధిఁ జొర నబ్ధుల్ జొచ్చు; నుద్వేగియై¯ దివిఁ బ్రాకన్ దివిఁ బ్రాకు; దిక్కులకుఁ బో దిగ్వీథులం బోవుఁ; జి¯ క్కి వెసం గ్రుంగినఁ గ్రుంగు; నిల్వ నిలుచుం; గ్రేడింపఁ గ్రేడించు; నొ¯ క్కవడిన్ దాపసు వెంటనంటి హరిచక్రం బన్యదుర్వక్రమై. (108) ఏ లోకంబున కైన వెంటఁబడి తోనేతెంచు చక్రానల¯ జ్వాలల్ మానుపువారు లేమిఁ జని దేవజ్యేష్ఠు లోకేశు వాఁ¯ డాలోకించి "విధాత! విశ్వజననవ్యాపారపారీణరే¯ ఖాలీలేక్షణ! కావవే కరుఁణ జక్రంబున్ నివారింపవే." (109) అనిన బ్రహ్మ యిట్లనియె. (110) "కర మర్థిన్ ద్విపరార్థ సంజ్ఞ గల యీ కాలంబుఁ గాలాత్ముఁడై¯ సొరిదిన్ నిండఁగఁ జేసి లోకములు నా చోటున్ విభుం డెవ్వఁడో¯ పరిపూర్తిన్ గనుఁ గ్రేవఁ గెంపుగదురన్ భస్మంబుగాఁజేయు నా¯ హరి చక్రానల కీల కన్యుఁ డొకరుం డడ్డంబు గా నేర్చునే? (111) ఏను భవుఁడు దక్షుఁ డింద్రాదులును బ్రజా¯ పతులు భృగుఁడు భూతపతులు శిరము¯ లందుఁ దాల్తు మతని యాజ్ఞ జగద్ధితం¯ బంచు భూరికార్యమతుల మగుచు. (112) కావున సుదర్శనానల నివారణంబునకు నోప” నని విరించి పలికిన దుర్వాసుండు కైలాసంబునకుం జనుదెంచి, శర్వు నాలోకించి చక్రా నలంబు తెఱం గెఱింగించిన నమ్మహాదేవుం డిట్లనియె. (113) "వినవయ్య! తండ్రి! ఈ విశ్వేశ్వరుని యందుఁ¯ జతురాస్య జీవకోశములు పెక్కు¯ వేల సంఖ్యలు గూడి వేళతో నిబ్బంగి¯ నగుచుండుఁ జనుచుండు; నదియుఁగాక¯ యెవ్వానిచే భ్రాంతి నేమందుచున్నార¯ మేను దేవలుఁ డసురేంద్ర సుతుఁడు, ¯ నారదుఁ డజుఁడు సనత్కుమారుఁడు ధర్ముఁ¯ డా కపిలుఁడు మరీచ్యాదు లన్య (113.1) పారవిదులు సిద్ధపతులు నెవ్వని మాయ¯ నెఱుఁగలేము దాన నింత పడుదు¯ మట్టి నిఖిలనాథు నాయుథశ్రేష్ఠంబుఁ¯ దొలఁగఁ జేయ మాకు దుర్లభంబు. (114) మునీంద్ర! నీవు నమ్మహాత్ముని శరణంబు వేఁడుము; అతండు మేలు చేయంగలవా” డని పలికిన నీశ్వరునివలన నిరాశుండై దుర్వాసుండు వైకుంఠనగరంబునకుం జని. (115) ఆ వైకుంఠములోని భర్మ మణి సౌధాగ్రంబు పై లచ్చితోఁ¯ గ్రేవన్ మెల్లన నర్మభాషణములం గ్రీడించు పుణ్యున్ హరిన్¯ దేవాధీశ్వరుఁ గాంచి "యో వరద! యో దేవేశ! యో భక్తర¯ క్షావిద్యాపరతంత్ర! మానుపఁగదే చక్రానలజ్వాలలన్, (116) నీ మహిమార్ణవంబు తుది నిక్కముగా నెఱుఁగంగ లేక నీ¯ ప్రేమకు వచ్చు దాసునకుఁ గ్రించుతనంబున నెగ్గు చేసితిన్¯ నా మఱపున్ సహింపు మట నారకుఁడైన మనంబులో భవ¯ న్నామము చింత చేసిన ననంత సుఖస్థితి నొందకుండనే?" (117) అని పలికి పాదకమలంబులకు మ్రొక్కి, లేవక యున్న దుర్వాసునిం గని హరి యి ట్లనియె. (118) "చలమున బుద్ధిమంతులగు సాధులు నా హృదయంబు లీల దొం¯ గిలి కొనిపోవుచుండుదు రకిల్బిషభక్తిలతాచయంబులన్¯ నిలువఁగఁ బట్టి కట్టుదురు నేరుపుతో మదకుంభికైవడిన్; ¯ వలలకుఁ జిక్కి భక్తజన వత్సలతం జనకుందుఁ దాపసా! (119) నాకు మేలు గోరు నా భక్తుఁ డగువాఁడు¯ భక్తజనుల కేన పరమగతియు; ¯ భక్తుఁడెందు జనినఁ బఱతెంతు వెనువెంట¯ గోవు వెంటఁ దగులు కోడె భంగి. (120) అదియునుం గాక. (121) తనువు మనువు విడిచి, తనయులఁ జుట్టాల¯ నాలి విడిచి, సంపదాలి విడిచి, ¯ నన్నకాని యన్య మెన్నఁడు నెఱుఁగని¯ వారి విడువ నెట్టివారి నైన. (122) పంచేంద్రియముల తెరువుల¯ వంచించి మనంబునందు వరమతులు ప్రతి¯ ష్టించి వహింతురు నన్నును¯ మంచివరుం బుణ్యసతులు మరగిన భంగిన్. (123) సాధుల హృదయము నాయది; ¯ సాధుల హృదయంబు నేను; జగముల నెల్లన్¯ సాధుల నేన యెఱుంగుదు¯ సాధు లెఱుంగుదురు నాదు చరితము విప్రా! (124) ధారుణీసురులకుఁ దపము విద్యయు రెండు¯ ముక్తి చేయుచుండు ముదముతోడ; ¯ దుర్వినీతులగుచు దుర్జనులగువారి¯ కివియుఁ గీడు జేయ కేల యుండు? (125) నా తేజము సాధులలో¯ నాతతమై యుండు వారి నలఁచు జనులకున్¯ హేతి క్రియ భీతి నిచ్చుం¯ జేతోమోదంబుఁ జెఱచు సిద్ధము సుమ్మీ. (126) అదె పో బ్రాహ్మణ! నీకును¯ సదయుఁడు నాభాగసుతుఁడు జనవినుత గుణా¯ స్పదుఁ డిచ్చు నభయ మాతని¯ మది సంతసపఱచి వేఁడుమా శరణంబున్." (127) అని శ్రీవల్లభుఁ డానతిచ్చిన మహోద్యచ్చక్రకీలావళీ¯ జనితాయాసుఁడు నిర్వికాసుఁ డుదితశ్వాసుండు దుర్వాసుఁడ¯ ల్లన యేతెంచి సుభక్తిఁ గాంచెఁ గరుణాలావణ్య వేషున్ విదో¯ షు నయోదారమనీషు మంజుమితభాషున్ నంబరీషున్ వెసన్. (128) కని దుఃఖితుండయి, యమ్మహీవల్లభు పాదంబులు పట్టి విడువకున్న నా నరేంద్రచంద్రుండు చరణస్పర్శనంబునకు నోడుచుఁ గరుణారసభరిత హృదయుండయి, హరిచక్రంబు నిట్లని స్తుతియించె. (129) "నీవ పావకుఁడవు; నీవ సూర్యుండవు¯ నీవ చంద్రుండవు; నీవ జలము; ¯ నీవ నేలయు; నింగి నీవ; సమీరంబు¯ నీవ; భూతేంద్రియ నికర మీవ; ¯ నీవ బ్రహ్మంబును; నీవ సత్యంబును¯ నీవ యజ్ఞంబును; నీవ ఫలము; ¯ నీవ లోకేశులు; నీవ సర్వాత్మయు¯ నీవ కాలంబును; నీవ జగము; (129.1) నీవ బహుయజ్ఞభోజివి; నీవ నిత్య¯ మూలతేజంబు; నీకు నే మ్రొక్కువాఁడ¯ నీరజాక్షుండు చాల మన్నించు నట్టి¯ శస్త్రముఖ్యమ! కావవే చాలు మునిని. (130) హరిచే నీవు విసృష్టమై చనఁగ మున్నాలించి నీ ధారలన్¯ ధరణిన్ వ్రాలుట నిక్కమంచు మునుపే దైత్యేశ్వరవ్రాతముల్¯ శిరముల్ పాదములున్ భుజాయుగళముల్ చేతుల్ నిజాంగంబులం¯ దురులన్ బ్రాణసమీరముల్ వదలు నీ యుద్ధంబులం జక్రమా! (131) కలఁగి నిద్రపోవఁ గలలోన వచ్చిన¯ నిన్నుఁ జూచి దీర్ఘనిద్ర పోదు¯ రసురవరులు శయ్యలం దున్న సతులు ప్ర¯ భాతమందు లేచి పలవరింప. (132) చీఁకటిఁ బాపుచున్ వెలుఁగు జేయుచు సజ్జనకోటినెల్ల స¯ శ్రీకను జేయు నీరుచులు చెల్వుగ ధర్మసమేతలై నినున్¯ వాకున నిట్టి దట్టిదని వర్ణన చేయ విధాత నేరఁ డ¯ స్తోకము నీదు రూపు గలదుం దుది లేదు పరాత్పరాద్యమై. (133) కమలలోచనుండు ఖలుల శిక్షింపంగఁ¯ బాలు చేయ నీవు పాలు పడితి¯ వైన నింకఁజాలు నాపన్నుఁడై యున్న¯ తపసిఁ గావు మీవు ధర్మవృత్తి." (134) అని వినుతించి కేలుఁ దమ్మిదోయి నొసలం బొసంగించి యిట్లనియె. (135) "ఏ నమస్కరింతు నింద్రశాత్రవ ధూమ¯ కేతువునకు ధర్మ సేతువునకు¯ విమల రూపమునకు విశ్వదీపమునకుఁ¯ జక్రమునకు గుప్త శక్రమునకు." (136) అని మఱియు నిట్లనియె. (137) "విహిత ధర్మమందు విహరింతు నేనియు¯ నిష్టమైన ద్రవ్యమిత్తునేని¯ ధరణిసురుఁడు మాకు దైవతం బగునేని¯ విప్రునకు శుభంబు వెలయుఁగాక. (138) అఖిల గుణాశ్రయుఁ డగు హరి¯ సుఖియై నా కొలువు వలనఁ జొక్కెడి నేనిన్¯ నిఖిలాత్మమయుం డగుటకు¯ సుఖమందుం గాక భూమిసురుఁ డివ్వేళన్." (139) అని యివ్విధంబునం బొగడు పుడమిఱేనివలన మన్నించి, తపసిని దాహంబు నొందింపక, రక్కసులగొంగచక్రంబు తిరిగి చనియె; నంత దుర్వాసుండు శాంతిం బొంది మెల్లని మేలి మాటల నా రాజుం దీవించి, యిట్లనియె. (140) "నరనాథోత్తమ! మేలు చేసితి కదా! నా తప్పు మన్నించి శ్రీ¯ హరి పాదాబ్జము లింత ముట్టఁగొలుతే? యాశ్చర్యమౌనెన్నుచో¯ నరుదండ్రే నినుబోఁటి సాధునకుఁ దానై యిచ్చుటల్ గాచుటల్¯ సొరిదిన్ నైజగుణంబులై సరస వచ్చుం గాదె మిత్రాకృతిన్. (141) అదియునుం గాక. (142) ఒక మాటెవ్వని పేరు కర్ణములలో నొయ్యారమై సోకిఁనన్¯ సకలాఘంబులు పల్లటిల్లి తొలఁగున్ సంభ్రాంతితో నట్టి స¯ త్సుకరున్ మంగళతీర్థపాదు హరి విష్ణున్ దేవదేవేశుని¯ న్నకలంకస్థితిఁ గొల్చు భక్తులకు లే దడ్డంబు రాజాగ్రణీ! (143) తప్పు లోఁగొని చక్రపావక దాహముం బెడఁబాపి తౌ¯ నొప్పునొప్పు భవద్ధయారస మో నరేశ్వర! ప్రాణముల్¯ చెప్ప మున్నును పోయి క్రమ్మఱఁ జేరె ధన్యుఁడ నైతి నీ¯ కెప్పుడున్ శుభ మేను గోరెద నింకఁ బోయెద భూవరా!" (144) అనిన విని రాజముఖ్యుఁడు¯ మునివల్లభు పాదములకు మ్రొక్కి కడున్ మ¯ న్ననచేసి యిష్ట భోజన¯ మనువుగఁ బెట్టించెఁ దృప్తుఁ డయ్యె నతండున్. (145) మఱియు నమ్మునీంద్రుం డిట్లనియె. (146) "కంటిన్ నేఁటికి నిన్ను నీ వచనముల్ కర్ణద్వయిం బ్రీతిగా¯ వింటిన్నన్నముఁ గొంటి నీ గృహమునన్ వేడ్కన్ ఫలం బందె నే¯ మంటిం బోయెద; నీ చరిత్ర మమరుల్ మర్త్యుల్ సుఖాసీనులై¯ మింటన్ మేదిని సన్నుతింపఁగల రీమీఁదన్ నరేంద్రాగ్రణీ!" (147) అని చెప్పి దుర్వాసుం డంబరీషుని దీవించి కీర్తించి మింటి తెరువున బ్రహ్మలోకంబునకుం జనియె, మునీశ్వరుండు వచ్చి మగుడం జనువేళకు నొక్కవత్సరంబు నిండి వ్రతంబు పరిపూర్ణం బైన. (148) అవనిసురుఁడు గుడువ నతి పవిత్రంబైన¯ వంటకంబు భూమివరుఁడు గుడిచెఁ¯ దపసి నెగులు మాన్పఁ దానెంత వాఁడను¯ హరి కృపామహత్వ మనుచుఁ దలఁచి. (149) మఱియును. (150) హరి గొల్చుచుండువారికిఁ¯ పరమేష్ఠిపదంబు మొదలు పదభోగంబుల్¯ నరకసమము లను తలఁపున¯ ధరణీ రాజ్యంబుతోడి తగులము మానెన్. (151) ఇట్లు విరక్తుండై. (152) తనకు సదృశులైన తనయుల రావించి¯ ధరణి భరము వారిఁ దాల్పఁ బంచి¯ కాననంబు చొచ్చెఁ గామాది విజయుఁడై¯ నరవిభుండు హరిసనాథుఁ డగుచు. (153) ఈ యంబరీషు చరితముఁ¯ దీయంబున విన్నఁ జదువ ధీసంపన్నుం¯ డై యుండును భోగపరుం¯ డై యుండును నరుఁడు పుణ్యుఁడై యుండు నృపా! (154) విను మయ్యంబరీషునకు విరూపుండును, గేతుమంతుండును, శంభుండును ననువారు మువ్వురు గొడుకు; లందుఁ గేతుమంతుడును శంభుండును హరింగూర్చి తపంబు చేయువారై వనంబునకుం జనిరి; విరూపునికిఁ బృషదశ్వుండును, బృషదశ్వునకు రథీతరుండును గలిగి; రమ్మహాత్మునికి సంతతి లేకున్ననంగిరసుఁ డను మునీంద్రుం డతని భార్యయందు బ్రహ్మతేజోనిధు లయిన కొడుకులం గలిగించె వారలు రథీతరగోత్రులు నాంగిరసులను బ్రాహ్మణులునై యితరు లందు ముఖ్యులయి ప్రవర్తిల్లి' రని చెప్పి శుకుం డిట్లనియె.

ఇక్ష్వాకుని వంశము

(155) ఒకనాఁడు మనువు దుమ్మిన¯ వికలుఁడు గా కతని ఘ్రాణవివరము వెంటం¯ బ్రకటయశుం డిక్ష్వాకుం¯ డకలంకుఁడు పుట్టె రవికులాధీశుండై. (156) ఇక్ష్వాకునకుఁ బుత్రు లెలమిఁ బుట్టిరి నూర్వు¯ రమర వికుక్షియు నిమియు దండ¯ కుండు నాతని పెద్దకొడుకులు మువ్వు రా¯ ర్యావర్త మందు హిమాచలంబు¯ వింధ్యాద్రిమధ్య ముర్వీమండలము గొంత¯ యేలిరి యిరువదియేవు రొక్క¯ పొందున నా తూర్పుభూమి పాలించిరి¯ యందఱు పడమటి కధిపులైరి (156.1) యున్ననలువది యేడ్వురు నుత్త రోర్వి¯ దక్షిణోర్వియుఁ గాచిరి తండ్రి యంత¯ నష్టకాశ్రాద్ధ మొనరింతు ననుచు నగ్ర¯ సుతు వికుక్షి నిరీక్షించి శుద్ధమైన¯ మాంసఖండంబు దెమ్మనె మహితయశుఁడు.

వికుక్షి చరితము

(157) అగుఁగా కంచు వికుక్షి వేఁటజని ఘోరారణ్యభూమిం దగన్¯ మృగసంఘంబులఁ జంపి బిట్టలసి తా; మే నొల్లఁబో నాకటన్¯ సగమై యొక్క శశంబుఁ బట్టి తిని శేషంబైన మాంసంబు శీ¯ ఘ్రగతిం దండ్రికిఁ దెచ్చి యిచ్చె నకలంకస్ఫూర్తి వర్ధిల్లగాన్. (158) కులగురుండు వసిష్ఠుఁ డంత వికుక్షి కుందెలు దింట లో¯ పల నెఱింగి యనర్హ మెంగిలి పైతృకం బొనరింపఁగా¯ వలదు వీఁడు దురాత్మకుం డన వాని తండ్రియు వానిఁ జెం¯ తలను జేరఁగనీక దేశము దాఁటి పో నడిచెన్ వడిన్. (159) కొడుకు వెడలఁగొట్టి గుణవంతుఁ డిక్ష్వాకుఁ¯ డా వసిష్ఠుఁ డేమి యానతిచ్చె¯ నదియుఁ జేసి యోగి యై వనంబునఁ గళే¯ బరము విడిచి ముక్తి పదము నొందె. (160) జనకుఁడు ముక్తి కేఁగ నయశాలి వికుక్షి శశాదుఁ డంచు భూ¯ జనులు నుతింప నీ ధరణిచక్ర మశేషము నేలి యాగముల్¯ గొనకొని చేసెఁ బ్రీతి హరిఁగూర్చి పురంజయుఁ బుత్రుఁ గాంచెఁ బే¯ ర్కొనె నమరేంద్ర వాహుఁడుఁ గకుత్స్థుఁడు నంచును వాని లోకముల్. (161) కృతయుగాంతంబున దితిసుతామరులకు¯ రణ మయ్యె; నందు నా రాక్షసులకు¯ నమర వల్లభుఁ డోడి హరితోడఁ జెప్పిన¯ జలజనేత్రుఁడు పురంజయుని యందు¯ వచ్చి నే నుండెద వాసవ! వృషభంబ¯ వై మోవు మని పల్క నమరవిభుఁడు¯ గోరాజమూర్తిఁ గకుత్ప్రదేశంబున¯ నా పురంజయు మోచె నంత నతఁడు (161.1) విష్ణుతేజంబు దనయందు విస్తరిల్ల¯ దివ్యచాపంబు చేఁబట్టి దీర్ఘ నిశిత¯ బాణములఁ బూని వేల్పులు ప్రస్తుతింప¯ నంతఁ గాలాగ్ని చాడ్పున ననికి నడచె. (162) నడచి శరావళిన్ దనుజనాథుల మేనులు చించి కంఠముల్¯ దొడిఁదొడిఁ ద్రుంచి కాలుపురి త్రోవకుఁ గొందఱఁ బుచ్చి కొందఱన్¯ వడి నురగాలయంబున నివాసము చేయఁగ దోలి యంతనూ¯ ఱడక నిశాచరేంద్రుల పురంబులు గూల్చెఁ బురంజయాఖ్యతన్. (163) ఇవ్విధంబున శశాదపుత్రుండు రాక్షసుల పురంబులు జయించిన కతనం బురంజయుండును, వృషభరూపుండైన యింద్రుండు వాహనంబగుటం జేసి యింద్రవాహనుండును, నతని మూఁపురం బెక్కి రణంబు చేసిన కారణంబునఁ గకుత్థ్సుండును నన నీ మూఁడు నామంబులం బ్రసిద్ధికెక్కి, దైత్యుల ధనంబుల నింద్రున కిచ్చె నప్పురంజయుని పుత్రుం డనేనసుం, డతని పుత్రుండు పృథుండు; పృథుని కొడుకు విశ్వగంధుండు; విశ్వగంధునకు నందనుండు చంద్రుండు; చంద్రుసుతుండు యవనాశ్వుండు; యవనాశ్వతనూభవుండు శవస్తుం; డతడు శావస్తి నామ నగరంబు నిర్మించె; శవస్త తనయుండు బృహదశ్వుండు; బృహదశ్వతనూజుండు గువలయాశ్వుండా నరేంద్రుండు. (164) లావు మెఱసి యిరువది యొక¯ వేవురు నందనులుఁ దాను వీరుఁ డతఁడు భూ¯ దేవుఁ డుదంకుడు పనుప దు¯ రావహుఁడై చంపె దుందు నమరాబంధున్. (165) అది కారణంబుగా దుందుమారుం డన నెగడె నయ్యసురముఖానలంబునఁ గువలయాశ్వకుమారు లందఱు భస్మంబై; రందు దృఢాశ్వుండును, గపిలాశ్వుండును, భద్రాశ్వుండును ననువారలు ముగ్గురు చిక్కి; రందు దృఢాశ్వునకు హర్యశ్వుండును, హర్యశ్వునకు నికుంభుండును, నికుంభునకు బర్హిణాశ్వుండును, బర్హిణాశ్వునకుఁ గృతాశ్వుండును, గృతాశ్వునకు సేనజిత్తును, సేనజిత్తునకు యువనాశ్వుండును, జనించి; రయ్యువనాశ్వుండు గొడుకులు లేక నూర్వురు భార్యలుం దానును నివ్వెఱ పడియుండ నా రాజునకు మునులు గృపచేసి యింద్రుని గూర్చి సంతతికొఱకు నైంద్రయాగంబు చేయించిరి; అందు.శ్వునకుఁ గృతాశ్వుండును, గృతాశ్వునకు సేనజిత్తును, సేనజిత్తునకు యువనాశ్వుండును, జనించి; రయ్యువనాశ్వుండు గొడుకులు లేక నూర్వురు భార్యలుం దానును నివ్వెఱ పడియుండ నా రాజునకు మునులు గృపచేసి యింద్రుని గూర్చి సంతతికొఱకు నైంద్రయాగంబు చేయించి; రందు.

మాంధాత కథ

(166) భూమీశు భార్యకుఁ బుత్రలాభమునకై¯ పోయు తలంపున భూమిసురులు¯ జలములు మంత్రించి జలకలశము దాఁచి¯ నియమంబుతోఁ గూడి నిద్రపోవ¯ ధరణీశ్వరుఁడు పేరుదప్పితోఁ నా రాత్రి¯ ధృతి లేక యజ్ఞమందిరముఁ జొచ్చి¯ యానీరు ద్రావిన నంత మేల్కని వార¯ లెవ్వఁడు ద్రావె నీరెందుఁ బోయె; (166.1) ననుచు రాజు ద్రావు టంతయు భావించి¯ యెఱిఁగి చోద్య మంది యీశ్వరాజ్ఞ¯ యెవ్వఁ డోపుఁ గడవ; నీశ్వరునకు నమ¯ స్కార మనుచు నేది కార్య మనుచు. (167) వారలు దుఃఖించుచుండు నంతఁ గొంత తడవునకు యువనాశ్వుని కడుపు వ్రక్కలించుకొని చక్రవర్తి చిహ్నంబులు గల కుమారుండు జన్మించి తల్లి లేని కతంబునఁ గడుపునకు లేక యేడ్చుచుండ, నింద్రుండు వచ్చి, శిశువునకు నాకఁలి దీఱుకొఱకు వాని నోటం దన వ్రేలిడినం, ద్రావిన కతంబున వాని పేరు మాంధాత యని నిర్దేశించి చనియె; నివ్విధంబున. (168) కడుపు పగుల ముద్దుకొడుకు జన్మించినఁ¯ దీఱఁ డయ్యెఁ దండ్రి దేవ విప్ర¯ కరుణ యట్లకాదె? కడిఁది దైవములావు¯ కలుగువాఁడు బ్రతుకుఁ గాక చెడునె? (169) ఇట్లు బ్రతికి యున్న యువనాశ్వుండు గొంతకాలంబునకుఁ దపంబుచేసి సిద్ధిం బొందె; నంత. (170) పడమటఁ బొడమెడు బాలచంద్రుని మాడ్కిఁ¯ బూటపూటకు వృద్ధిఁబొందె బాలుఁ; ¯ డల్లన పరిపూర్ణ యౌవనారూఢుఁడై¯ రావణాది రిపుల రాజవరుల¯ దండించి తనుఁ ద్రసదస్యుఁ డంచు సురేంద్రుఁ¯ డంకింప శూరుఁడై యఖిలదేవ¯ మయు నతీంద్రియు విష్ణు మాధవు ధర్మాత్ము¯ నజుని యజ్ఞాధీశు నాత్ముఁ గూర్చి (170.1) చేసెఁ గ్రతువులు భూరిదక్షిణల నిచ్చి ¯ ద్రవ్య యజమాన విధి మంత్ర ధర్మ యజ్ఞ¯ కాల ఋత్వి క్ప్రదేశ ముఖ్యంబు లెల్ల¯ విష్ణురూపంబు లనుచు భావించి యతఁడు. (171) బలిమి నడంచుచు నరులం¯ జలి వెలుఁగున్ వేఁడివెలుగుఁ జనుచో ట్లెల్లన్¯ జలరుహనయనుని కరుణను¯ జెలువుగ మాంధాత యేలె సిరి నిండారన్. (172) అంతనా రాజునకు శతబిందుని కూఁతురగు బిందుమతి యందుఁ బురుక్సుతుండును, నంబరీషుండును, ముచుకుందుండును, ననువారు ముగ్గురు గొడుకులు నేబండ్రు గూఁతులును జనియించి పెరుఁగుచున్న యెడ. (173) యమునాజలములోన నధికుఁడు సౌభరి¯ తపము చేయుచు జలస్థలమునందుఁ¯ బిల్లలుఁ దన ప్రాణవల్లభయును గూడి¯ మెలఁగ నానందించు మీనరాజుఁ¯ గనుఁగొని సంసారకాంక్షియై మాంధాత¯ నొక కన్య నడుగ నృపోత్తముండు¯ దరుణి నిత్తును స్వయంవరమునఁ జేకొను¯ మనవుడు "ననుఁ జూచి యౌవనాంగి (173.1) యేల ముసలిఁ గోరు నిట్టట్టు వడఁకెడి¯ వాఁడఁ జాల నరసినాఁడ నొడల¯ జిగియు బిగియు లేని శిథిలుండఁ గరఁగింప¯ బాలఁ దిగిచికొను నుపాయ మెట్లు? (174) అదియునుం గాక. (175) బాల పువ్వుఁబోడి ప్రాయంపు వానిని¯ జెన్నువాని ధనము జేర్చువాని¯ మరిగెనేనిఁ గొంత మరుగుఁగా కెదిరిఁ ద¯ న్నెఱిఁగి ముసలితపసి నేల మరుగు?" (176) అని విచారించి సౌభరి దన తపోబలంబునం జేసి ముసలితనంబు విడిచి యెల ప్రాయంపుఁ గొమరుం డయి యలంకరించుకొని ముందట నిలువంబడిన మాంధాతయుఁ గన్నియల నగరు గాచికొని యున్నవారికి సెలవు జేసిన వా రమ్మునీంద్రుని నా రాజపుత్రిక లున్న యెడకుఁ గొనిపోయి చూపిన. (177) "కోమలులార! వీఁడు నలకూబరుఁడో; మరుఁడో; జయంతుఁడో; ¯ యేమఱి వచ్చె; వీనిఁ దడవేల వరింతుము నేమ యేమ" యం¯ చా మునినాథుఁ జూచి చలితాత్మికలై సొరదిన్ వరించి రా¯ భామిను లందఱుం గుసుమబాణుఁడు గీ యని ఘంట వ్రేయఁగన్. (178) ఇట్లు రాజకన్యకల నందఱం జేకొని సౌభరి నిజతపఃప్రభావంబున ననేక లీలావినోదంబులఁ గల్పించి. (179) గృహరాజముల యందుఁ గృతకాచలములందుఁ¯ గలువలు విలసిల్లు కొలఁకులందుఁ¯ గలకంఠ శుక మధుకర నినాదములచే¯ వర్ణనీయములైన వనములందు¯ మణివేదికలయందు మహనీయ పర్యంక¯ పీఠ లీలాశైల బిలములందు¯ శృంగారవతులగు చెలువలు పలువురు¯ తనపంపు చేయ సుస్థలములందు (179.1) వస్త్ర మాల్యానులేప సువర్ణహార¯ భూరి సంపద నిష్ఠాన్న భోజి యగుచుఁ¯ బూఁటపూఁటకు నొక వింత పొలుపుఁ దాల్చి¯ రాజకన్యల నందఱ రతులఁ దేల్చె. (180) పెక్కండ్రు రాజముఖులకు¯ నొక్కఁడు మగఁ డయ్యుఁ దనియకుండె మునీంద్రుం¯ డెక్కుడు ఘృతధారలచే¯ నక్కజమై తృప్తి లేని యనలుని భంగిన్. (181) ఇవ్విధంబున. (182) ఆరామంబున మునివరుఁ¯ డా రామలతోడ బహువిహారమయుండై¯ గారాములఁ దన కిట్టటు¯ పోరాములు చేసి కొన్ని ప్రొద్దుల్ పుచ్చెన్. (183) అంత నొక్కనాఁడు మాంధాతృమేదినీవల్లభుండు “మునీశ్వరుం డెందుఁ బోయెఁ గూఁతు లెక్కడ నలజడి పడుచున్నవారలో” యని తలంచి వెదకవచ్చి, యొక్క మహాగహనంబున మణిమయ సౌధంబులం జక్రవర్తియుంబోలెఁ గ్రీడించుచున్న తాపస రాజుం గని, సంతసించి, వెఱఁగుపడి, మన్ననలం బొంది మెల్లన కూఁతులం బొడగని సత్కరించి యిట్లనియె. (184) "నాతోడులార! మీ పతి¯ మీ తోడే? పనుల యెడల మే లే" యనుడున్¯ "నాతోడిదె నాతోడిదె¯ తాతా! మే" లనుచు ననిరి తరుణులు వరుసన్. (185) అంతఁ గొంతకాలమునకు బహుభార్యాచర్యుండగు సౌభరి యేకాంతంబునఁ దన్నుఁ దాన చింతించుకొని, మీనమిథున సంగదోషంబునం గాఁపురంబు దనకు నగపడుట యెఱింగి, పశ్చాత్తాపంబున నిట్లనియె. (186) "ఉపవాసంబుల డయ్యుటో? విషయసంయోగంబు వర్జించుటో? ¯ తపముం బూని చరించుటో? హరిపదధ్యానంబునన్ నిల్చుటో? ¯ యపలాపంబున నేల పొందితి? హతంబయ్యెం దపంబెల్ల నీ ¯ కపటస్త్రీపరిరంభముల్ మునులకుం గైవల్య సంసిద్ధులే? (187) మునినఁట; తత్త్వవేదినఁట; మోక్షమకాని సుఖంబులెవ్వియుం¯ జనవఁట; కాంత లేఁబదట; సౌధచయంబఁట; వాసదేశముం, ¯ దనయులు నైదువేలఁట; నిదానము మీనకుటుంబి సౌఖ్యముం¯ గనుటఁట; చెల్లరే! నగవుగాక మహాత్ములు చూచి మెత్తురే? (188) తపము జేయువాఁడు తత్త్వజ్ఞుడగువాఁడు¯ నెలమి మోక్ష మిచ్ఛయించువాఁడు¯ నేకతంబు విడిచి యేర్పడనేరఁడు¯ కాఁపురంబు జేయుఁ గఱటి తపసి." (189) అని దుఃఖించి, తన్నుం దాన నిందించుకొని, తన వేడబంబు వివేకించుచు, నిహపరసాధకుండై, కాపురంబువిడిచి, సతులుం దానును వానప్రస్థధర్మంబున నడవికిం జని, ఘోరతపంబు జేసి, శరీరంబు గుదియించి, యగ్నిసహితుండై, పరబ్రహ్మంబు జొచ్చె; నంత. (190) మునిపతి వనమున కరిగిన¯ వనితలుఁ తోనరిగి ప్రాణవల్లభు గతికిం¯ జనిరి వెనుతవిలి విడువక¯ యనలము చన శిఖలు నిలువ కరిగిన భంగిన్.

పురుక్సుతుని వృత్తాంతము

(191) అంత మాంధాత పెద్దకొడుకగు నంబరీషునిం దత్పితామహుండగుటంజేసి యువనాశ్వుండు దనకుఁ బుత్రుండు గావలయునని కోరి పుచ్చుకొనియె; నయ్యంబరీషునకు యౌవనాశ్వుం, డతనికి హారితుండు జనియించి రది కారణంబుగా నంబరీష యౌవనాశ్వ హారితులు మాంధాతృ గోత్రంబునకు ప్రవరు లయిరి; మాంధాత రెండవ కొడుకు పురుకుత్సుఁ; డతని నురగలోకంబునకుఁ గొనిపోయి నాగకుమారులు దమ చెల్లెలు నర్మదయను కన్యకను వివాహంబు చేసిరి; పురుకుత్సుండు నక్కడ ననేక గంధర్వ నాథుల వధించి తన నాగ లోకసంచరణంబు దలంచువారికి నురగభయము లేకుండ వరంబు పడసి తిరిగి వచ్చె; నా పురుకుత్సునకుఁ ద్రసదస్యుండుఁ, ద్రసదస్యునకు ననరణ్యుండు, నా యనరణ్యునకు హర్యశ్వుండు, హర్యశ్వునకు నరుణుండును, యరుణునకుఁ ద్రిబంధనుండుఁ, ద్రిబంధనునకు సత్యవ్రతుండును జన్మించి రా సత్యవ్రతుండ త్రిశంకుం డనం బరగె; నతండు.

హరిశ్చంద్రుని వృత్తాంతము

(192) గురుశాపవశమునఁ గూలి చండాలుఁడై¯ యనఘాత్ముఁ గౌశికు నాశ్రయించి; ¯ యతని లావున దివిజాలయంబున కేఁగ¯ మన్నింప కమరులు మరలఁ ద్రోయఁ; ¯ దల క్రిందుగాఁ బడి దైన్యంబుతో రాఁగఁ¯ గౌశికుఁ డెప్పటి ఘనత మెఱసి¯ నిలిపె నాకసమున; నేఁడు నున్నాడు త్రి¯ శంకుఁ; డాతఁడు హరిశ్చంద్రుఁ గనియె; (192.1) నా హరిశ్చంద్రుఁ గౌశికుఁ డర్థిఁ జేరి¯ యాగదక్షిణామిషమున నఖిలధనముఁ¯ గొల్లగొని మీఁదఁ గులహీనుఁ గొలువఁ బెట్ట; ¯ బొంక కలజడిఁ బొందె నా భూవరుండు. (193) ఇట్లు విశ్వామిత్రుండు హరిశ్చంద్రు నెగులపఱచుట విని వసిష్ఠుండు విశ్వామిత్రునిఁ గృధ్రమ్మవు గమ్మని శపించె; విశ్వామిత్రుండును వసిష్ఠుని బకంబవు గమ్మని శపించె; పక్షిరూపు లయ్యును వైరంబు మానక యయ్యిరువురును యుద్ధంబు చేసి రంత హరిశ్చంద్రుండు పుత్రులు లేక నారదు నుపదేశంబున వరుణోపాసనంబు నతి భక్తితోఁ జేయ నా వరుణుండు ప్రత్యతక్షంబైన నతనిక మ్రొక్కి యిట్లనియె. (194) "వరుణదేవ! నాకు వరవీరగుణముల¯ కొడుకు పుట్టెనేని కొడుకుఁ బట్టి¯ పశువుఁ జేసి నీవు పరిణమింపఁగ వేల్తుఁ¯ గొడుకు నీఁ గదయ్య కొసరు లేక." (195) అని పలికినం గుమారుండు గలిగెడు మని వరంబిచ్చి వరుణుండు చనియె; నంత హరిశ్చంద్రునకు వరుణప్రసాదంబున రోహితుఁడను కుమారుండు జన్మించె; వరుణుండును హరిశ్ఛంద్రకుమారు నుద్దేశించి. (196) పురిటిలోపల వచ్చి పుత్రు వేలుపు మన్నఁ¯ బురుడు బోయినగాని పొసఁగ దనియె; ¯ బలురాకమును వచ్చి బాలు వేలుపు మన్న¯ బండ్లు లేకుండ నభావ్యుఁ డనియెఁ; ¯ బండ్లు రాఁజూచి డింభకుని వేలుపు మన్నఁ¯ బడి పండ్లురామి నభావ్యుఁ డనియె; ¯ బడిపండ్లు పొడమినఁ గొడుకు వేలుపు మన్నఁ¯ బోరుల కొదవక పోల దనియెఁ; (196.1) దొడరి యిట్టు గొడుకుతోడి మోహంబునఁ¯ బ్రొద్దు గడుపుచుండె భూవరుండు¯ దండ్రి తలఁపుకొలఁది దనలోనఁ జింతించి¯ యింట నుండ కడవి కేఁగెఁ గొడుకు. (197) ఇట్లు వనంబునకుఁ జని శరశరాసన ధరుండయి రోహితుండు దిరుగుచుండి వరుణగ్రస్తుండై హరిశ్చంద్రుండు మహోదరవ్యాధిచేఁ బీడితుండుగా నుండుట విని పురంబునకుం దిరిగిరా గమకింప నింద్రుండు ముసలి తపసియై వచ్చి నిట్లనియె. (198) "పుణ్యభూము లరుగు; పుణ్యతీర్థంబులఁ¯ గ్రుంకు; పుణ్యజనులఁ గోరి చూడు; ¯ పుణ్యకథలు వినుము భూపాలపుత్రక! ¯ మేలు గలుగునట్టి మేర గలదు." (199) అని యిట్లు మగిడించినం దిరిగి చని రోహితుం డొక్క యేఁ డవ్వనంబునం దిరిగి క్రమ్మఱఁ జనుదేర నింద్రుండు వచ్చి తొంటి యట్ల నివారించె; ఇవ్విధంబున. (200) ఐదేండ్లు మరలించె నమరేంద్రుఁ డా బాలు¯ నాఱవ యేఁటఁ దా నడవినుండి¯ యింటికి వచ్చుచు నెలమి నజీగర్తు¯ మధ్యమ పుత్రు సన్మాన్యచరితు¯ ఘను శునశ్శేపునిఁ గొని యాగపశువుగ¯ నా హరిశ్చంద్రున కాతఁ డిచ్చెఁ; ¯ బురుషమేధము చేసి భూపాల వర్యుఁడు¯ వరుణాది నిఖిల దేవతలఁ దనిపె (200.1) హోత కౌశికుఁ; డధ్వర్యుఁ డొనర భృగువు; ¯ బ్రహ్మ జమదగ్ని; సామంబు పాడువాడు¯ ముని వసిష్ఠుఁ; డా మఖమున ముదముఁ బొంది¯ కనకరథ మిచ్చె నింద్రుఁ డా మనుజపతికి. (201) శునశ్శేపుని ప్రభావంబు వెనుక వివరించెద; నంత భార్యాసహితుం డైన హరిశ్చంద్రు వలనం బ్రీతుండై విశ్వామిత్రుండు నిరస్తదోషుం డైన యతనికి ముఖ్యజ్ఞానంబు గృప జేసిన మనం బన్నమయంబు గావున, మనంబున నన్నరూపి యైన పృథివి నెఱంగి, పృథివిని జలంబువలన నడంచి, జలంబుఁ దేజంబువలన నింకించి, తేజంబు వాయువు వలనం జేరిచి, వాయువు నాకాశంబునం గలిపి, యాకాశంబుఁ దామసాహంకారంబునందు లయంబు చేసి, యహంకారత్రయంబు మహత్తత్త్వంబునందు డిందించి, పరతత్త్వంబునకు లోకంబులు సృజించెద నను తలంపైన మహత్తత్త్వంబు నందు విషయాకారంబు నివర్తించి, విషయవర్జితంబైన మహత్తత్త్వంబును బరతత్త్వంబుగా నెఱుంగుచు నయ్యెఱుకవలన సంసారహేతువైన ప్రకృతిని భస్మంబు చేసి, యయ్యెఱుకను నిర్వాణసుఖపారవశ్యంబునం బరిహరించి, సకలబంధవిముక్తుండై హరిశ్చంద్రుం డవాఙ్మానస గోచరంబయిన నిజరూపంబుతో వెలుంగుచుండె; నతని కుమారునకు రోహితునకు హరితుండు పుట్టె; హరితునకుఁ జంపనామ ధేయుఁడు జనియించె; నతండు దనపేర జంపానగరంబు నిర్మించె; నా చంపునికి సుదేవుండు, సుదేవునికి విజయుండు, విజయునకు రురుకుండు, రురుకునకు వృకుండు, వృకునకు బాహుకుండు జనియించి; రందు బాహుకుండు

సగరుని కథ

(202) దండించి పగవారు దనభూమిఁ జేకొన్న¯ నంగనలును దాను నడవి కేఁగి¯ యడవిలో ముసలియై యాతఁడు చచ్చిన¯ నాతని భార్య దా ననుగమింపఁ¯ గదియుచో నా స్త్రీకి గర్భంబు గలుగుట¯ యౌర్వమునీశ్వరుఁ డాత్మ నెఱిఁగి¯ వారించె; నంత నవ్వనజాక్షి సవతులు¯ చూలు నిండారినఁ జూడఁ జాల (202.1) కర్థి నన్నంబు గుడుచుచో నందుఁ గలిపి¯ విషము పెట్టిరి; పెట్టిన విరిసి పడక¯ గరముతోఁ గూడ సగరుండు ఘనుఁడు పుట్టి¯ వరయశస్ఫూర్తితోఁ జక్రవర్తి యయ్యె. (203) చండస్ఫూర్తి నతండు తండ్రిపగకై సంగ్రామరంగంబులం¯ జెండెన్ హైహయబర్బరాదుల; వధించెం దాళజంఘాదులన్; ¯ ముండీభూతులుగా నిరంబరులుగా మూర్తుల్ సబీభత్సలై¯ యుండంజేసె, నిజారులన్ సగరనామోర్వీవిభుం డల్పుఁడే. (204) ఖగరాజరుచులు గల యిల¯ పగరాజుల నడఁచి యేలె బాహాశక్తిన్¯ నగరాజధీరు శూరున్¯ సగరున్ హతవిమతనగరుఁ జను వినుతింపన్. (205) ఔర్వుండు చెప్పంగ నమర వేదాత్మకు¯ హరి నీశు నమృతు ననంతుఁగూర్చి¯ వాజిమేధంబులు వసుధేశ్వరుఁడు చేసె¯ నందొక్క మఖమున హయము విడువ¯ నగభేది గొనిపోయి నాగలోకంబునఁ¯ గపిలుని చేరువఁ గట్టి తొలఁగెఁ; ¯ నంత గుఱ్ఱముఁ గాన కా రాజు దన పుత్ర¯ నివహంబు దిశలకు నెమకఁ బంప (205.1) వారు నిల యేడు దీవుల వరుస వెదకి¯ మఖతురంగంబు లేకున్న మగిడి రాక ¯ ప్రాభవంబున దోర్దండబలము మెఱసి ¯ గ్రొచ్చి కోరాడి త్రవ్విరి కుతల మెల్ల. (206) ఇట్లు సుమతికొడుకులు నేలంద్రవ్వి పాతాళంబునం దూర్పుముట్టి యున్న నుత్తరభాగంబునం గపిలమునిపొంతనున్న తురగంబుఁ గని. (207) "ఎఱిఁగితి మద్దిరయ్య తడవేటికి? గుఱ్ఱపుదొంగ చిక్కె; నీ¯ జఱభుని బట్టి చంపుఁ; డతిసాధుమునీంద్రుఁడుఁబోలె నేత్రము¯ ల్దెఱవక బాకినోరు మెదలింపక బైసుక పట్టె" నంచు న¯ య్యఱువది వేవురున్ నిజకరాయుధముల్ జళిపించి డాయుచోన్. (208) కపిలుఁడు నేత్రముల్ దెఱవఁగాఁ దమ మేనుల మంట పుట్టి తా¯ రపగతధైర్యులై పడి యఘాళికతంబున మూఢచిత్తులై¯ నృపసుతు లందఱున్ ధరణి నీఱయి రా క్షణమంద; సాధులం¯ దపసులఁ గాసిఁ బెట్టెడి మదస్ఫురితాత్ములు నిల్వనేర్తురే?. (209) కొందఱు కపిలుని కోపానలంబున¯ మ్రందిరి సగరకుమారు లనుచు¯ నందు రా ముని శాంతుఁ డానందమయమూర్తి¯ తొడరి కోపించునే? దువ్వ నేలఁ¯ గాక జన్మించునే గగనస్థలంబున?¯ నే సాంఖ్యమతమున నిద్ధమతులు¯ భవసముద్రము మృత్యుపదమును లంఘింతు¯ రా బుద్ధిఁ జేయు పరాత్మభూతుఁ (209.1) డఖిలబోధకుఁ డతనికి నరసిచూడ¯ సఖు లమిత్రులు నెవ్వరు? సగరసుతులు¯ దాము దయచేయు నేరమిఁ దనువులందు¯ ననలకీలలు పుట్టి నీఱైరి గాక. (210) మఱియు సగరుండు గేశిని యందు గన్న పుత్రుం డసమంజసుం డనువాఁడు, సమంజస గుణంబులు లేక పూర్వజన్మంబున యోగీశ్వరుండై యుండి, సంగదోషంబువలన యోగభ్రష్ఠుండయి సగరునకు జన్మించి, జాతిస్మరజ్ఞానంబు గలిగి లోకంబువారలకుఁ దమ వారలకు నప్రియంబగు వర్తనంబునం దిరుగుచు నొక్కనాఁడు. (211) వరుస నయోధ్యలోనఁ గలవారల నాడెడు పిన్నవాండ్ర నా¯ సరయువులోనఁ వైచి జనసంఘముఁ దండ్రియుఁ దిట్టుచుండ వాఁ¯ డురుమతిఁ గొన్ని ప్రొద్దులకు యోగబలంబునఁ జేసి బాలురం¯ దిరిగి పురంబు లోపలికిఁ దెచ్చిన నివ్వెఱఁ గంది రందఱున్. (212) అయ్యసమంజసుని కొడు కంశుమంతుం డనువాఁడు వినీతుండై తన యొద్దఁ బనులు జేయుచుండు నంత; సగరుండమ్మనుమని నంశుమంతు నశ్వంబు వెదకి తెమ్మనిపంచిన నతండు దనతండ్రుల చొప్పునం జని, వారలు ద్రవ్విన మహాఖాతంబుచొచ్చి, యందు భస్మరాసులపొంత నున్న హయంబుఁ గని, యా సమీపంబు నందున్న కపిలాఖ్యుం డయిన విష్ణుదేవునికి దండప్రణామంబు చేసి, యిట్లని స్తుతియించె. (213) "మతిచిక్కఁబట్టి సమాధి గౌరవమున¯ వాసిగాఁ దనకు నవ్వల వెలుంగు¯ నినుఁ గానఁ డొకనాఁడు నిన్నెఱుంగునె? బ్రహ్మ¯ యజుని మనంబున నవయవముల¯ బుద్ధి జన్మించిన భూరిజంతువులందు¯ హీనులమైన మా కెఱుఁగ వశమె? ¯ తమలోన నీ వుండఁ దా మెఱుంగరు నిన్ను¯ గుణములఁ జూతురు గుణములైనఁ (213.1) గాన రొకవేళఁ జీఁకటిఁ గందు రాత్మ¯ లందుఁ దెలియరు వెలుపల నమరు బొందు¯ లరయుదురు దేహధారు లత్యంధు లగుచుఁ¯ గడిఁది నీ మాయ నెన్నఁడుఁ గడువ లేక." (214) అని వినుతి చేయుచు, హయంబు విడువు మని చె