పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 2 : నవమ స్కంధము 1 - 99

పోతన తెలుగు భాగవతం
నవమ స్కంధము

ఉపోద్ఘాతము

(1) శ్రీరాజిత! మునిపూజిత! ¯ వారిధి గర్వాతిరేక వారణ బాణా! ¯ సూరిత్రాణ! మహోజ్జ్వల¯ సారయశస్సాంద్ర! రామచంద్ర నరేంద్రా! (2) మహనీయ గుణగరిష్ఠులగు నమ్ముని శ్రేష్ఠులకు నిఖిలపురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుం డిట్లనియె; నట్లు ప్రాయోపవిష్టుం డయిన పరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రుం గనుంగొని.

సూర్యవంశారంభము

(3) "మనువుల నడవళ్ళు మర్యాదలును వింటి¯ మన్వంతరంబున మాధవుండు¯ దిరిగిన జాడలు దెలిసె సత్యవ్రతుం¯ డను రాజు ద్రవిళదేశాధిపుండు¯ పోయిన కల్పాంతమున విష్ణు సేవించి¯ విజ్ఞానమును బొంది వెలుఁగుఱేని¯ కతఁడు వైవస్వతుండై పుట్టి మను వయ్యె¯ నతనికి నిక్ష్వాకుఁడాదిగాఁగఁ (3.1) బదురు గొడుకులు గల రండ్రు, పరఁగ వారి ¯ వంశ మేరీతి వర్తించె? వారిలోనఁ¯ జనినవారిని, జనువారిఁ, జనెడువారిఁ¯ జెప్పవే వ్యాసనందన! చిత్తగించి. (4) చెవులార నేఁడు వినియెద ¯ రవివంశమునందుఁ గలుగు రాజుల కీర్తుల్¯ వివరింపు వరుసతోడను¯ భువిఁ బుణ్యుల కీర్తి వినినఁ బుణ్యము గాదే! " (5) అనినం బరాశరముని మనుమం డిట్లనియె. (6) "వినుము, మనువుకులము వేయి నూఱేండ్లును¯ బరఁగ విస్తరించి పలుకరాదు, ¯ నాకుఁ దోచినంత నరనాథ! వేగంబ ¯ యెఱుకపడఁగఁ బ్రీతి నేర్పరింతు. (7) ఎక్కువ దక్కువ పొడవుల¯ కెక్కటి మొదలయిన పురుషుఁ డింతయుఁ జెడఁ దా¯ నొక్కఁడుఁ గల్పాంతంబున¯ నక్కజమై నిల్చె విశ్వ మతఁడై యుంటన్.

వైవస్వతమనువు జన్మంబు

(8) భూమీశ! యమ్మహాపురుషుని నాభిమ¯ ధ్యమున బంగారుఁ గెందమ్మి మొలిచె; ¯ నా దమ్మిపూవులో నటమీఁదఁ దనయంత, ¯ నాలుగు మోముల నలువ పుట్టె; ¯ నాబ్రహ్మమనమున నట మరీచి జనించెఁ¯ గశ్యపుం డతనికిఁ గలిగెనంత, ¯ నా కశ్యపునికి దక్షాత్మజ యదితికిఁ¯ గొమరుఁడై చీఁకటి గొంగ పొడమె; (8.1) జలజ బంధుని పెండ్లాము సంజ్ఞ యందు ¯ శ్రాద్ధదేవుండు మనువు సంజాతుఁ డయ్యె; ¯ మనువునకు శ్రద్ధ యనియెడి మగువ యందుఁ¯ బదురు గొడుకులు గలిగిరి భద్రయశులు. (9) వార లిక్ష్వాకుండును, నృగుండును, శర్యాతియు, దిష్టుండును, ధృష్టుండును, గరూశకుండును, నరిష్యంతుడును, బృషద్ధ్రుండును, నభగుండును, గవియు నన నెగడి; రటమున్ను మనువు గొడుకులు లేని వాఁడయి, మిత్రావరుణుల నుద్దేశించి.

సుద్యుమ్నాదుల చరిత్ర

(10) మనువు బిడ్డలు పుట్ట మఖ మాచరించుచో¯ నతని భార్యయు హోత నాశ్రయించి ¯ "కూఁతురు పుట్ట నాకుం జేయు"మని పల్కి¯ వరభక్తితోఁ బయోవ్రతము సలిపె; ¯ నా సతి చెప్పిన ట్లధ్వర్యుఁడును హోత¯ నగుఁగాక! వేలుపు మనుచుఁ బలికె; ¯ హవి సందుకొని కూఁతు రయ్యెడు మని వష¯ ట్కారంబు చెప్పుచుఁ గదిసి వేల్వ (10.1) హోత పెడచేత నిల యను నువిద పుట్టె¯ దానిఁ బొడగని మనువు సంతాప మంది, ¯ "కొడుకుమేల్ గాక; యేటికిఁ గూతు? రకట¯ చెప్పవే"యని పోయె వసిష్ఠుకడకు. (11) చని యిట్లనియె. (12) "అయ్యా! కొడుకుల కొఱకై ¯ యియ్యాగము నీ యనుజ్ఞ నేఁ జేయంగా¯ నియ్యాఁడు దేల పుట్టెను? ¯ మియ్యంతటివారి కొండు మేరయుఁ గలదే! (13) అదియునుంగాక; మీరు బ్రహ్మవాదులరు; మంత్రవాదులరుఁ; బాపంబు లందకుండం జేయించువా; రిది యేమి?” యనవుడు మా తాత వసిష్ఠుండు హోతృవ్యభిచారం బెఱింగి, మనువున కిట్లనియె. (14) "అధిప! సంకల్ప వైషమ్య మగుటఁ జేసి¯ హోతకల్లతనంబుననువిదగలిగె¯ నైనఁగలిగింతు నీకుఁబ్రియాత్మజునిగ¯ నీవు మెచ్చంగఁజూడు నా నేర్పుబలిమి." (15) అని పలికి భగవంతుండగు వసిష్ఠుండు గీర్తితత్పరుండు గావున మనువు కూఁతు మగతనంబు కొఱకు నేక చిత్తంబున నాదిపురుషుం డగు హరిం బొగడిన నప్పరమేశ్వరుండు మెచ్చి, తపసి కోరిన వరం బిచ్చె; నది నిమిత్తంబుగా నిలాకన్యక సుద్యుముండను కుమారుండయి రాజ్యంబు చేయుచు. (16) ప్రొద్దు పో కొకనాఁడు పోయి, పేరడవుల¯ వెంట వేఁటాడుచు, వేడ్కతోడఁ¯ గొందఱు మంత్రులుగూడ రా, సైంధవం¯ బయిన గుఱ్ఱము నెక్కి, యందమైన¯ బలువిల్లుఁ గ్రొవ్వాడి బాణంబులును దాల్చి¯ పెను మెకంబులవెంట బిఱుసుతోడ¯ నుత్తరదిశను మహోగ్రుఁడై చనిచని¯ మేరువు పొంతఁ గుమారవనముఁ (16.1) జేరె; నందు మహేశుండు శివయు నెపుడు¯ రతి సలుపుచుందు; రందుఁ జొరంగఁ బోవ¯ నాఁడుదయ్యెను రాజు; రాజానుచరులుఁ¯ బడఁతులైరి; తదశ్వంబు బడబ యయ్యె. (17) ఇట్లు మగతనంబు చెడి మగువలై యొండొరుల మొగంబులు చూచి మఱుఁగుచుండి"రనిన విని శుకునకు రాజిట్లనియె. (18) "రాజుఁ తోటివారు రమణు లై రంటివి; ¯ కాంత లగుట యేమి కారణమున? ¯ నిట్టి దేశ మెఱుఁగ మెన్నఁడు; నా కథల్ ¯ వేడ్కదీర నాకు విస్తరింపు. (19) అదియునుం గాక. (20) మగువతనము మాని మగవాఁడు గావచ్చుఁ; ¯ గాక పేరుఁ బెంపు గాసి గాఁగ¯ మగతనంబు మాని మగువ గావచ్చునె¯ మానవంతుఁ డైన మానవునకు?" (21) అని యడిగిన నర్జునపౌత్రునకు వ్యాసపుత్రుం డిట్లనియె. (22) "పురవైరి కొకనాఁడు పొడచూపు వేడుకఁ¯ దద్దయు దిక్కుల తమము లెల్లఁ¯ దమతమ వెలుఁగులు దగిలి గొందులు సొరఁ¯ గొందఱు మౌనులు గోరి రాఁగఁ, ¯ బ్రాణేశు తొడలపై భాసిల్లు నంబిక¯ వారలఁ జూచి మై వలువ లేమి¯ సిగ్గు పుట్టిన లేచి చీరఁ గట్టినఁ జూచి¯ దేవియు దేవుండు దీర్ఘ లీల (22.1) నొంటి దమలోనఁ "గ్రీడించుచున్నవారు¯ మనకు సమయంబు గా"దని, మరలి మునులు¯ నరుఁడు నారాయణుండు ననారతంబు¯ మెలఁగు చోటికి నడచిరి మేదినీశ! (23) అది కారణంబుగా, భగవంతు డగు శివుండు దన ప్రియురాలి వేడుకల కొఱకు నిట్లని వక్కాణించె. (24) "ఈ నెల వెవ్వఁడు జొచ్చిన ¯ మానిని యగు"ననిన తొంటి మాట కతమునన్, ¯ మానవుఁడు మగువ పోఁడిమి ¯ మానక పేరడవులందు మఱియుం దిరిగెన్. (25) ఇట్లు చెలికత్తియల మొత్తంబులుం, దానును, నా రాచపూఁబోడి వాఁడిచూపుల నాఁడు పోఁడిమి నెఱపుచు, దైవయోగంబున సోమ సుతుండును, భగవంతుడును నగు బుధుని యాశ్రమంబు జేరి, మెలఁగుచున్న యెడ. (26) రాజు కొడుకుఁ జూచె రాజీవదళనేత్ర; ¯ రాజవదనఁ జూచె రాజుపట్టి;¯ దొంగ కాముఁ డంత దొందడిఁ జిగురాకు¯ వాలు వెఱికి యుఱికి, వారి మొత్తె. (27) ఇట్లలరువిల్తుని నెఱబిరుదు చిగురు టడిదంబు మొనకు నోహటించి, వారలిరువురుం బైపడి వేడుకలకుం జొచ్చిన, వారలకుం బురూరవుం డను కుమారుండు పుట్టె; నివ్విధంబున. (28) మనుసుతుండు ఘనుఁడు మగనాలి తనమునఁ¯ గొడుకుఁ గాంచి, విసివి, కుందికుంది, ¯ చింతఁ బొంది, గురు వసిష్ఠుని భావించె, ¯ నతని తలఁపుతోన యతఁడు వచ్చె. (29) వచ్చి సుద్యుమ్నుండు మగవాఁడగు కొఱకు, నమ్మునిపుంగవుండు శంకరు నారాధింప, నీశ్వరుండును దపసి ప్రయాసంబునకు సంతసిల్లి, యిట్లనియె. (30) "తను మున్నాడిన మాటయున్ నిజముగాఁ, దన్మౌనికిం బ్రీతిగా, మనుజుండున్ నెల వో నెలం బురుషుఁడై, మాసాంతరంబైనఁ గా మినియై, యీ గతి వీడు పాటమర భూమిం దాన రక్షించుఁ బొ"మ్మనినన్ వచ్చె వసిష్ఠుఁ; డా మనుసుతుండారీతి రాజ్యస్థుఁడై. (31) మగువ యగుచు మరల మగవాఁడు నగుచును¯ భూతధాత్రి యంత నాతఁ డేలెఁ ¯ బ్రజలు సంతసింప బాహాబలముతోడఁ¯ గురుని కరుణఁ జేసి కువలయేశ! (32) అతనికి నుత్కళుండును, గయుండును, విమలుండును నను కొడుకులు మువ్వురు గలిగి, ధర్మపరులై యుత్తరాపథంబునకు రాజులైరి; సుద్యుమ్నుండు ముదుసలి యయి ప్రతిష్ఠానపురంబు విడిచి, పురూరవునకు భూమి నిచ్చి, వనంబునకుం జనియె; నివ్విధంబున. (33) కొడుకు సుద్యమ్నుండు ఘోరాటవుల కేఁగ¯ వందుచు మనువు వైవస్వతుండు¯ దనకు బిడ్డలు గల్గఁ దప మాచరించెను¯ హరిఁగూర్చి నూఱేండ్లు యమునలోన, ¯ హరి యంత నిక్ష్వాకుఁ డాదిగాఁ బదుగురు¯ పుత్రుల నిచ్చెను, బొసఁగ; వారి¯ యందుఁ బృషద్ధ్రాఖ్యుఁ డనువాఁడు, గురునాజ్ఞ¯ విమల ధర్మంబులు వెలయఁబూని (33.1) పసుల కదుపులఁ గాచుచు, బలుమొగిళ్ళు¯ వచ్చి నడురేయి జోరున వాన గురియ, ¯ మంద విడియించి, చుట్టు నేమఱక యుండె¯ నడవి మొకములు చొరకుండ నరసికొనుచు. (34) అంత. (35) ప్రబ్బికొనిన పెంజీఁకటి¯ నిబ్బరముగ నడిఁకినడిఁకి, నింగికి వడితో¯ గొబ్బున నెగసి, తటాలున¯ బెబ్బులి మందావుఁ బట్టెఁ బెలుకుఱి యఱవన్. (36) ఉల్లములు గలఁగి మొదవుల¯ వెల్లువ లన్నియును లేచి, విచ్చలవిడితోఁ¯ జెల్లాచెదురై, పాఱెను¯ బెల్లుగ నంబే యటంచు బెబ్బులి గాలిన్. (37) అయ్యవసరంబున. (38) ఆ పెంజీకటి మ్రోలఁ గాన కడిదం బంకించి శార్దూల మం¯ చా పుల్లావు శిరంబుఁ ద్రుంచి, తెగదో యంచుం, బులిన్ వెండియున్¯ వాపోవం దెగ వ్రేసి, భూవరుఁడు ద్రోవన్ ఖడ్గరక్తంబుచేఁ¯ బైపై గీయుచుఁ, జేరి చూచెఁ దల ద్రెవ్వంబడ్డ యద్ధేనువున్. (39) చూచి, దుఃఖితుండయి యున్న పృషద్ధ్రునిం గని, కులగురుం డగు వసిష్ఠుండు కోపించి, “నీవు రాజత్వంబునకుఁ బాసి, యీ యపరాధంబున శూద్రుండవు గ” మ్మని శపియించె; నతండును గృతాంజలి యయి, తన కులాచార్యుని వలన మరలం గైకోలు వడసి, యతని యనుమతంబున. (40) అఖిలాత్ముఁ డగుచున్న హరియందుఁ, బరునందు;¯ భక్తితోఁ జాలఁ దత్పరత మెఱసి, ¯ యూర్ధ్వరేతస్కుఁ డై యున్న ప్రాణులకెల్ల¯ నాప్తుఁడై, సర్వేంద్రియములు గెల్చి, ¯ సంగంబునకుఁ బాసి, శాంతుండు నపరిగ్ర¯ హుండునై, కోరక యుండి, తనకు¯ వచ్చిన యదియ జీవనము గావించుచుఁ¯ దనుఁదాన నిలుపుచు, ధన్యబుద్ధి (40.1) జడుని తెఱగున, నంధుని చందమునను, ¯ జెవిటి భంగిని, మహి నెల్లఁ జెల్లఁ దిరిగి, ¯ యడవులకు నేఁగి, కార్చిచ్చునందుఁ జొచ్చి¯ చిక్కి, నియతుఁడై బ్రహ్మంబుఁ జెందె నతఁడు. (41) కవి యను కడపటి కొమరుఁడు¯ భవనము రాజ్యంబు విడిచి, బంధులతో నేఁ¯ గి, వనమునఁ బరమపురుషునిఁ ¯ బ్రవిమలమతిఁ దలఁచితలఁచి, పరముం బొందెన్. (42) మఱియుఁ గరూశుండను మానవునివలనం గొందఱు కారూశులు క్షత్రియులు గలిగి, ధర్మంబుతోడి ప్రియంబున బ్రహ్మణ్యులై యుత్తరాపథంబునకు రక్షకులైరి; ధృష్టుని వలన ధార్ష్టం బను వంశంబు గలిగి, భూతలంబున బ్రహ్మభూయంబు నొంది నెగడె; నృగుని వంశంబున సుమతి పుట్టె; నతనికి భూతజ్యోతి పుట్టె; నతనికి వసువు జనించె; వసువునకుం బ్రతీతుండు గలిగెఁ; బ్రతీతునికి నోఘవంతుండు జనించె; నతని కూఁతు నోఘవతి యను కన్యకను సుదర్శనుండు వివాహంబయ్యె; నరిష్యంతుండను మనుపుత్రునికి జిత్రసేనుం; డా విభునకు దక్షుం; డా పుణ్యునకు మీఢ్వాంసుం; డా సుజనునికి శర్వుం; డమ్మహాత్మునికి నింద్రసేనుం; డా రాజునకు వీతిహోత్రుం; డా సుమతికి సత్యశ్రవుం; డా ఘనునికి నురుశ్రవుం; డా వీరునకు దేవదత్తుం; డా పండితునకు నగ్నివేశుండు సుతు లయి జనియించి; రయ్యగ్నివేశుండు గానీనుం డన నెగడి, జాతకర్ణుండను మహర్షి యై వెలసె; నతని వలన నాగ్నివేశ్యాయనం బను బ్రహ్మకులంబు గలిగెను. ఇవ్విధంబున. (43) తెలుపఁబడె, నరిష్యంతుని¯ కుల మెల్లను నీకు, దిష్టకులముం దెలియం¯ దెలిపెద రాజేంద్రోత్తమ! ¯ తెలియుము సర్వంబు నీకుఁ దేటపడంగన్.

మరుత్తుని చరిత్ర

(44) దిష్టుని కొడుకు నాభాగుం డనువాఁడు కర్మవశంబున వైశ్వత్వంబు నొందె; నా నాభాగునికి హలంధనుండు కలిగె; నతనికి వత్సప్రీతియు, వత్సప్రీతికిఁ బ్రాంశువు, నతనికిఁ బ్రమతియుఁ, బ్రమతికి ఖమిత్రుండు, ఖమిత్రునికిఁ జాక్షుషుండు, నతనికి వివింశతియు, వివింశతికి రంభుండు, రంభునికి ధార్మికుండైన ఖనినేత్రుండు, నతనికిఁ గరంధనుండు, గరంధనున కవిక్షిత్తు, నా యవిక్షిత్తునకు మరుత్తుండు జనియించి; రా మరుత్తుండు చక్రవర్తి యయ్యె; నతని చరిత్రంబు వినుము. (45) అంగిరస్సుతుఁడు మహాయోగి సంవర్తుఁ¯ డతని యాగమునకు యాజకుండు; ¯ దిరిగి యుండెడివారు మరుదాఖ్యగణము; లొ¯ ప్పారు విశ్వేదేవు లచటి సభ్యు; ¯ లధిక దక్షిఁణల బ్రాహ్మణకోటిఁ దనిపెను¯ సోమపానంబున సురవరుండు¯ మది నుబ్బి, బంగారు మయము గావించెను¯ యాగవస్తువులెల్ల; నధిక నియతి (45.1) నా మరుత్తుఁడు జేసిన యట్టిభంగి¯ ధీరభావంబుఁ జాగంబుఁ దెంపు గలిగి¯ మఖము జేసినవారిని మఱియు నెఱుఁగ¯ మెల్ల లోకములందు నరేంద్రముఖ్య! (46) ఆమరుత్తునకు దముండును, దమునకు రాజవర్ధనుండును, రాజ వర్ధనునకు సుధృతియు, సుధృతికి సౌధృతేయుండును, సౌధృతే యునకు గేవలుండును, కేవలునకు బంధుమంతుడును, నతనికి వేదవంతుండును, వేదవంతునికి బంధుండును, బంధునకుఁ దృణబిందుండును సంభవించి; రంత. (47) అచ్చరకన్య యలంబుస ¯ గ్రచ్చఱఁ దృణబిందుఁ జూచి కామించి, తుదిం¯ బచ్చవిలుకాని యమ్ముల¯ ముచ్చిచ్చున వచ్చి, పొందె మోహాతురయై

తృణబిందు వంశము

(48) ఆ దంపతులకు నిలబిల యనుగూఁతురుం జన్మించె; నా కొమ్మను విశ్రవసుండు పొందిన నైలబిలుండనం గుబేరుండు పుట్టె; మఱియు నా తృణబిందునకు విశాలుండును, శూన్యబంధుండును, ధూమ్రకేతుండును ననువారు మువ్వురు గొడుకులు గలిగి రందు విశాలుండు వంశవర్ధనుండయి వైశాలి యను నగరంబు నిర్మించె; నా రాజునకు హేమచంద్రుం, డా నరేంద్రునకు ధూమ్రాక్షుం, డా పుడమిఱేనికి సహదేవుం; డా బలిష్ఠునకుఁ గృశాశ్వుం; డాతనికి సోమదత్తుండు జన్మించె; నతండు. (49) అమరవిభుఁడు మెచ్చ నశ్వమేధము జేసి¯ భూరిపుణ్యగతికిఁ బోయె నెలమి; ¯ సోమదత్తుకొడుకు సుమతికి జనమేజ¯ యుం డనంగఁ గొమరు డుప్పతిల్లె. (50) వీరులు వైశాలు రనం బరఁగి తృణబిందుని కీర్తివహించి, రాజ్యంబు జేసిరి; మఱియును.

శర్యాతి వృత్తాంతము

(51) శర్యాతి యను రాజు జనియించె బ్రహ్మప¯ రుండైన మనువుకు రూఢితోడ; ¯ నతఁ డంగిరుని సత్రమందు రెండవనాఁటి¯ విహితకర్మము లెల్ల వెలయఁ జెప్పె; ¯ నతని కూఁతురు సుకన్యక యను వనజాక్షి¯ దన తండ్రితోఁ దపోవనికి నరిగి, ¯ చ్యవనాశ్రమముఁ జేరి, సఖులును దానును¯ ఫలపుష్పములు గోయఁ బాఱి, తిరిగి (51.1) యొక్కపుట్టలోన నొప్పారు జ్యోతుల¯ రెంటిఁ గాంచి, వాఁడి ముంటఁ బొడిచెఁ; ¯ గన్య ముగుద మఱచి, ఖద్యోతయుగ మంచు, ¯ దైవవశముకతనఁ దమకి యగుచు. (52) జ్యోతుల ముంటం బొడిచిన, ¯ వాతుల నెత్తురులు గురిసె, వసుధేశభట¯ వ్రాతముల కెల్ల నచ్చట, ¯ నా తఱి మలమూత్రబంధమయ్యె; నరేంద్రా! (53) వారలంజూచి, రాజర్షి యగు శర్యాతి విస్మితుండై, “మీర లియ్యాశ్రమ దూషణంబు చేయనోపుదు; రది కారణంబుగా మీకీ నిరోధంబు సిద్ధించె” నని పలుకు నవసరంబునఁ దండ్రికి సుకన్యక యిట్లనియె. (54) "అయ్య! యీ పుట్టచేరువ నాడి యాడి, ¯ యిందులో రెండు జ్యోతుల నేను గాంచి, ¯ కంటకంబునఁ బొడువ రక్తంబు గురిసె, ¯ నే విధంబునఁ గురిసెనో? యెఱుఁగు మీవు." (55) అనిన శర్యాతి భీతుండై కూఁతుం దోడ్కొని, వల్మీకంబు కడకుం జని, యందుఁ దపంబు జేయుచున్న చ్యవనునిం గని, తన నేర్పున నతని వలనఁ బ్రసన్నత పడసి తపసి చిత్తంబు నెఱింగి, తన పుత్రిక నిచ్చి, యెట్టకేలకుం బ్రదికినవాఁడై, మునీశ్వరుని వీడ్కొని, పురంబునకుం జనియె; నంత. (56) పరమకోపుఁ డయిన భార్గవుఁ బతిఁ జేరి¯ మిగులఁ బనుల యెడల మెచ్చఁ దిరిగి¯ యతని పర్ణశాల నా సుకన్యక యను¯ మగువ గొన్ని యేండ్లు మనువు మనియె. (57) అంత నొకనాఁ డయ్యాశ్రమంబునకు వేల్పువెజ్జులైన నాసత్యు లిద్దఱు వచ్చిన వారలం బూజించి, తన ముదిమి జూపి, చ్యవనుం డిట్లనియె “మీకు మున్ను యాగభాగంబుల లేని సోమపానంబు నేఁడు గల్పించి యిచ్చెద; సోమపాన సమయంబునఁ బానపాత్రంబు మీకు నందిచ్చెద, నా ముదిమి మానుపుం” డని యిట్లనియె. (58) "నవకంబగు ప్రాయంబున¯ జవరాండ్రఁ గరంచు మేని చక్కఁదనంబున్¯ శివతరముగఁ గృప జేయుఁడు¯ దివిజాధిప వైద్యులార! దీవింతు మిమున్." (59) అనిన నశ్వినిదేవతలు సంతోషించి “సిద్ధనిర్మితంబయిన యీ మడుఁగున మునుఁగు” మని పలికి. (60) ముసలితాపసుఁ బట్టి, మొగి నెత్తుకొనిపోయి¯ ముగురు నా మడుఁగున మునిఁగి లేచి, ¯ వనితాజనుల నెల్ల వలపించువారలై¯ సుందర మూర్తులై, సుభగు లగుచుఁ, ¯ గమలమాలికలతోఁ, గనకకుండలముల¯ తోఁ, మంచిచీరలతోడఁ దుల్యు¯ లై సూర్యతేజస్కులై యున్నవారల¯ మువ్వురఁ బొడగాంచి, ముగుద బాల (60.1) యిందుఁ బెనిమిటి వీఁ డని యెఱుఁగ లేక¯ గరిత గావున నిజనాథుఁ గానఁ గోరి¯ "సుభగమతులార! నా నాథుఁ జూపుఁ"డనుచు¯ నశ్విదేవతల కపు డ య్యబల మ్రొక్కె. (61) వార లా పతివ్రత నిజమరితనంబునకు మెచ్చి, వయోరూపసంపన్నుం డయిన చ్యవనుం జూపి, దంపతుల వీడ్కొని, విమానారూఢులై వేలుపుల ప్రోలికిం జని రంత. (62) యాగంబు చేయంగ నర్థించి శర్యాతి¯ చ్యవనమునీంద్రు నాశ్రమము కడకుఁ¯ గూఁతు నల్లునిఁ దోడుకొనిపోవు వేడుక¯ వచ్చి పుత్రికకుఁ బార్శ్వంబు నందు¯ సూర్యతేజంబున సొంపారు వరుఁ గని¯ "వీ డెవ్వఁడో దీని విభుఁడు గాఁడు, ¯ చెల్లరే!"యని పుత్రి చేసిన ప్రియములు¯ మొక్కులు నొల్లక మోము వాంచి (62.1) మాఱుమాటాడ దీవింప మనసు రోసి ¯ "చ్యవనుఁ డధికుండు మునిజన సత్తముండు¯ భువన సన్నుతుఁ డతఁ డెందు బోయె నాతఁ¯ డెట్లు వంచింపఁబడియె? వీఁడెవ్వఁ? డబల! (63) తగవే? ధర్మమె? శీలమే? కులజ వై, దర్పించి మోదింప, నా¯ జగదారాధ్యునిఁ, బుణ్యశీలుఁ, దపసిన్, సాధ్వీమనస్సమ్మతున్, ¯ మగనిన్ మాని, భుజంగుఁ బొందఁ దగునే? మానంబు వాటింపఁగా¯ దగదే? దుర్గతిఁ ద్రోచితే కఠిన వై తండ్రిం బతిం గూఁతురా! (64) పద్మనయన! మగఁడు ప్రాయంపు వాడైనఁ¯ గాపు పెట్టి కొంతఁ గావ నేర్చుఁ¯ గడఁగి ముసలి తపసి గావంగ నేర్చునే¯ యువతి ముదుకఁ గూర్ప నొప్ప దెందు." (65) అని పలికిన నప్పరమప్రతివ్రతాలలామంబు చిఱునగవు చెక్కుటద్దంబులఁ జిడిముడిపడఁ దండ్రి కిట్లనియె. (66) "నియ్యల్లు డితఁడు భార్గవుఁ¯ డయ్యా! జారుండు గాఁడు; హర్షముతోడన్¯ నెయ్యంబు నిల్పు"మంచును¯ దొయ్యలి సర్వంబుఁ దండ్రితో వినిపించెన్. (67) అంత శర్యాతియు నప్రమత్తుండై, కూఁతుం గౌగలించుకొని, గారవంబున “నయిదువవు గ” మ్మని దీవించె; నంత భార్యాసహితుండై చ్యవనుండు చని, తన మామకు యాగంబు చేయించి, యొక్క పాత్రంబున సోమభాగంబుఁ బట్టి, నిజ తపోబలంబున నశ్విదేవతల కర్పించినం జూచి. (68) కోపముతోడను వాసవుఁ¯ డేపున ముని పైని వజ్రమెత్తిన, మరలం¯ దాపసుఁడు వజ్రిభుజమున, ¯ నా పవి నిలిపెన్ జగంబు లాశ్చర్యపడన్. (69) ఇవ్విధంబున నశ్విదేవత లిద్దఱు వైద్యులై, సోమపానంబు లేని వారయ్యుఁ, జ్యవను సామర్థ్యంబునఁ బ్రాప్తభాగులయి చనిరి; శర్యాతికి నుత్తానబర్హియు, నానర్తుండును, భూరిషేణుండు నను మువ్వురు గొడుకులు గలిగి; రందు.

రైవతుని వృత్తాంతము

(70) ఆనర్తునకు రైవతాహ్వయుం డుదయించె¯ నతఁడు కుశస్థలి యను పురంబు¯ నీరధిలోపల నిర్మించి; పెంపుతో¯ నానర్తముఖ విషయంబులేలె; ¯ గనియెఁ గకుద్మి ముఖ్యంబైన నందన¯ శతము; రైవతుఁడు విశాలయశుడు, ¯ దన కూఁతు రేవతి ధాత ముందటఁ బెట్టి¯ తగు వరు నడిగెడి తలఁపుతోడఁ (70.1) గన్యఁ దోడ్కొని బ్రహ్మలోకమున కేగి¯ యచట గంధర్వ కిన్నరు లజుని మ్రోల¯ నాటపాటలు సలుపఁగ, నవసరంబు¯ గాక నిలుచుండె, నతఁ డొక్క క్షణము తడవు. (71) అంత నవసరంబయిన నజునికి నమస్కరించి, రైవతుండు రేవతిం జూపి యిట్లనియె. (72) "చాల ముద్దరాలు, జవరాలుఁ గొమరాలు¯ నీ శుభాత్మురాలి కెవ్వఁ డొక్కొ¯ మగఁడు? చెప్పు" మనిన యది చూచి పకపక¯ నవ్వి భూమిపతికి నలువ పలికె. (73) "మనుజేశ! దీనికై మదిలోనఁ దలఁచిన¯ వార లెల్లను గాలవశతఁ జనిరి; ¯ వారల బిడ్డల, వారల మనుమల¯ వారల గోత్రంబు వారినైన¯ వినము మేదిని మీఁద; వినుము, నీ వచ్చిన¯ యీలోన నిరువదియేడు మాఱు¯ లొండొండ నాలుగు యుగములుఁ జనియె; నీ¯ వటు గాన ధరణికి నరుగు; మిపుడు (73.1) దేవదేవుండు హరి, బలదేవుఁ డనఁగ¯ భూమి భారంబు మాన్పంగఁ బుట్టినాఁడు; ¯ సకలభూతాత్మకుఁడు నిజాంశంబుతోడ¯ యువతిమణి నిమ్ము జనమణి కున్నతాత్మ!" (74) అని యానతిచ్చిన బ్రహ్మకు నమస్కరించి, భూలోమునకుఁ జనుదెంచి, సోదర స్వజన హీనంబగు తన నగరంబున కా రాజు వచ్చి, బలభద్రుం గాంచి, రేవతీకన్య నతని కిచ్చి, నారాయణాశ్రమంబగు బదరికావనంబునకు నియమంబునఁ దపంబు జేయం జనియె.

నాభాగుని చరిత్ర

(75) నభగుఁడను మనుజపతికిని¯ శుభమతి నాభాగుఁ డనఁగ సుతుఁ డుదయించెం; ¯ బ్రభులై కవి యను తలఁపున¯ విభజించిరి భ్రాత లతని విత్తము, నధిపా! (76) అంత నాభాగుండును బ్రహ్మచారియై, తన తోడంబుట్టువులను ధనంబుల పాలడిగిన, వారలు “దండ్రి చెప్పిన క్రమంబున నిచ్చెద” మనిన నాభాగుండు తండ్రి యగు నభగు కడకుం జని, “విభాగంబు చేయు” మని పలికిన, నతం “డిందు నంగిరసులు మేధ గలవారయ్యును, సత్త్ర యాగంబు చేయుచు, నాఱవ దినంబున నర్హకర్మంబులు దోఁపక, మూఢులయ్యెదరు; వారలకు నీవు వైశ్వదేవసూక్తంబులు రెండెఱింగించినఁ, గవి యనం బ్రసిద్ధి కెక్కెదవు; దానంజేసి వారు కృతకృత్యు లై స్వర్గంబునకు బోవుచు, సత్త్రపరిశేషితంబైన ధనంబు నీకిచ్చెద” రని పలికినం దండ్రి వీడ్కొని నాభాగుండు చని, యట్ల చేసిన, నంగిరసులు సత్త్ర పరిశేషితధనంబు లతని కిచ్చి, నాకంబునకుం జని; రంత. (77) అంగిరసు లిచ్చు పసిఁడికి¯ మంగళమతిఁ జేరు నృపుని మానిచి, యొకఁ డు¯ త్తుంగుఁడు, గృష్ణాంగుఁడు దగ, ¯ ముంగల నిలుచుండి విత్తముం జేకొనియెన్. (78) వానింజూచి, నాభాగుండు దనకు మును లిచ్చుటం జేసి తన ధనం బని పలికిన, నమ్మహాపురుషుండు “మీ తండ్రి చెప్పిన క్రమంబ కర్తవ్యం” బనిన నాభాగుండు నభగు నడిగిన, నతండు “యజ్ఞమందిర గతం బయిన యుచ్ఛిష్టం బగు ధనంబు దొల్లి మహామునులు రుద్రున కిచ్చి; రది కారణంబుగా నా దేవుండు సర్వధనంబునకు నర్హుం” డనిన విని, వచ్చి, నాభాగుండు మహాదేవునకు నమస్కరించి, “దేవా! యీ ధనంబు నీ యధీనం బని మా తండ్రి చెప్పె; నే నపరాధంబు చేసితి; సహింపు;” మనవుడు భక్తవత్సలుండగు నమ్మహాపురుషుండు నభగు సత్యవచనంబునకు, నాభాగుని నిజంబునకు మెచ్చి, “నీవు దప్పక పలికితివి కావున, సత్త్రపరిశేషితం బగు ధనంబు నీకు నిచ్చితి” నని పలికి యంతర్దర్శిత్వంబును సనాతనం బగు బ్రహ్మజ్ఞానంబు నునుపదేశించి, తిరోహితుండయ్యె; ఇవ్విధంబున. (79) భువిలో నాభాగునికథ¯ దవిలి మతిన్ రేపు మాపుఁ దలఁచినమాత్రం¯ గవి యగు; మంత్రజ్ఞుం డగుఁ; ¯ బ్రవిమలగతిఁ బొందు నరుఁడు భద్రాత్మకుఁడై.

అంబరీషోపాఖ్యానము

(80) అంత నాభాగునకు నంబరీషుండు జనియించె; నతని యందు జగ దప్రతిహతంబైన బ్రాహ్మణశాపంబు నిరర్థకం బయ్యె” ననిన విని “యేమి కారణంబున దురంతంబైన బ్రహ్మదండంబు వలన నతండు విడువంబడియె” ననిన నప్పుడమిఱేనికి శుకుం డిట్లనియె. (81) "సప్తద్వీప విశాలభూభరము దోః స్తంభంబునం బూని, సం¯ ప్రాప్తశ్రీయుతుఁడై, మహావిభవసంపచ్ఛాతురిం గల్గి, దు¯ ర్వ్యాప్తిం జెందక, వైష్ణవార్చనలమేరం గాలముం బుచ్చుచున్, ¯ సుప్తిం బొందక, యొప్పె సద్గుణగరిష్టుం డంబరీషుం డిలన్. (82) చిత్తంబు మధురిపు శ్రీపాదముల యంద¯ పలుకులు హరిగుణపఠనమంద; ¯ కరములు విష్ణుమందిర మార్జనములంద¯ శ్రవములు హరికథాశ్రవణమంద; ¯ చూపులు గోవింద రూపవీక్షణమంద¯ శిరము కేశవ నమస్కృతుల యంద; ¯ పదము లీశ్వరగేహపరిసర్పణములంద¯ కామంబు చక్రికైంకర్యమంద; (82.1) సంగ మచ్యుతజన తనుసంగమంద; ¯ ఘ్రాణ మసురారి భక్తాంఘ్రి కమలమంద; ¯ రసనఁ దులసీదళములంద; రతులు పుణ్య¯ సంగతుల యంద యా రాజచంద్రమునకు. (83) మఱియు నమ్మహీవిభుండు. (84) ఘన వైభవంబునఁ గల్మషదూరుఁడై¯ యజ్ఞేశు, నీశు, నబ్జాక్షుఁ గూర్చి, ¯ మొనసి వసిష్ఠాది మునివల్లభులతోడఁ¯ దగిలి, సరస్వతీ తటమునందు¯ మేధతో బహువాజిమేథంబు లొనరించె¯ గణుతింపరాని దక్షిణలు బెట్టి; ¯ సమలోష్టహేముఁడై, సర్వకర్మంబులు¯ హరిపరంబులు గాఁగ నవని యేలె; (84.1) విష్ణుభక్తులందు, విష్ణువునందుఁ, గ¯ లంక యెడల, మనసు లంకె వెట్టి, ¯ విహితరాజ్యవృత్తి విడువనివాఁడునై, ¯ యతఁడు రాచతపసి యనఁగ నొప్పె. (85) వెండియు నమ్మహాభాగవతుండు (86) హరి! యని సంభావించును; ¯ హరి! యని దర్శించు; నంటు; నాఘ్రాణించున్; ¯ హరి! యని రుచిగొనఁ దలఁచును; ¯ హరిహరి; ఘను నంబరీషు నలవియె పొగడన్? (87) ఇట్లు పుణ్యచిత్తుండు, నీశ్వరాయత్తుండునై యల్లనల్లన రాజ్యంబు చేయుచున్న సమయంబున. (88) అతని కీహ మానె హరులందుఁ గరులందు¯ ధనములందుఁ గేళివనములందుఁ¯ బుత్రులందు బంధుమిత్రుల యందును¯ బురమునందు నంతిపురమునందు. (89) అంతఁ గొంతకాలంబున కమ్మేదినీకాంతుండు సంసారంబువలని తగులంబు విడిచి నిర్మలుండై యేకాంతంబున భక్తిపరవశుండై యుండ నా రాచతపసికి భక్తలోకవత్సలుండగు పురుషోత్తముండు ప్రతిభటశిక్షణంబును, నిజజనరక్షణంబును, నిఖిలజగదవక్రంబును నగు చక్రంబు నిచ్చి చనియె; అంత. (90) తన తోడినీడ కైవడి¯ ననురూప గుణాఢ్య యైన యాత్మమహిషితో¯ జనవిభుఁడు ద్వాదశీవ్రత¯ మొనరన్ హరిఁగూర్చి చేసె నొక యేఁ డధిపా! (91) ఇట్లు వ్రతంబు చేసి, యా వ్రతాంతంబునం గార్తికమాసంబున మూఁడు రాత్రు లుపవసించి, కాళిందీజలంబుల స్నాతుండయి, మధువనంబున మహాభిషేక విధానంబున విహిత పరికర సుసంపన్నుం డయి, హరి నభిషేకంబు జేసి, మనోహరంబు లయిన గంధాక్షతంబులు సమర్పించి యభినవామోదంబులైన పుష్పంబులం బూజించి తదనంతరంబ. (92) పా లేఱై ప్రవహింప నంగరుచులం బ్రాయంబులున్ రూపము¯ ల్మేలై ధూర్తులుగాక వెండిగొరిజల్హేమోరు శృంగంబులుం¯ గ్రాలం గ్రేపుల యఱ్ఱు నాఁకుచును రంగచ్చేలలై యున్న మం¯ దాలన్ న్యర్బుదషట్క మిచ్చె విభుఁ డుద్యద్వైదికశ్రేణికిన్ (93) పెక్కండ్రు విప్రవరులకు ¯ గ్రక్కున నతిభక్తితోడఁ గడుపులు నిండం¯ జొక్కపు టన్నంబిడి విభుఁ¯ డొక్కెడఁ బారణము చేయ నుద్యోగింపన్. (94) అయ్యవసరంబున. (95) భాసుర నిగమ పదోప¯ న్యాసుఁడు సుతపోవిలాసుఁ డనుపమ యోగా¯ భ్యాసుఁడు రవిభాసుఁడు దు¯ ర్వాసుఁ డతిథి యయ్యెఁ దన్నివాసంబునకున్. (96) అట్లతిథి యై వచ్చిన నమ్మునివల్లభునకుఁ బ్రత్యుత్థానంబు చేసి, కూర్చుండ గద్దియ యిడి పాదంబులు గడిగి పూజించి క్షేమం బరసి తన యింట నన్నంబు గుడువు మని నమస్కరించిన నమ్మహా త్ముండు సంతసించి భోజనంబునకు నంగీకరించి, నిర్మలంబులగు కాళిందీజలంబులం బరమధ్యానంబు చేయుచు, మునింగి లేచి రాక తడవు చేసిన, ముహుర్తార్ధావశిష్ట యగు ద్వాదశి యందుఁ బారణ చేయవలయుటఁ జింతించి బ్రాహ్మణాతిక్రమదోషంబునకు శంకించి విద్వజ్జనంబుల రావించి వారల నుద్దేశించి. (97) "ముని నీరు జొచ్చి వెడలడు¯ చనియెడు ద్వాదశియు నింత చనియెన్నీలో¯ నన పారణయున్ వలయును¯ వినిపింపుం డర్హధర్మవిధ మెట్టిదియో?" (98) అని పలికిన నా రాజునకు బ్రాహ్మణజను లిట్లనిరి. (99) "అతిథి పోయిరామి నధిప! యీ ద్వాదశి¯ పారణంబు మానఁ బాడి గాదు¯ గుడువకుంట గాదు కుడుచుటయును గాదు¯ సలిలభక్షణంబు సమ్మతంబు."