పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 2 : అష్టమ 664 - సంపూర్ణం

రాక్షసుల సుతల గమనంబు

(664) సావర్ణి మనువు వేళను¯ దేవేంద్రుండగు నితండు దేవతలకు; దు¯ ర్భావిత మగు నా చోటికి¯ రావించెద; నంతమీఁద రక్షింతు దయన్. (665) వ్యాధులు దప్పులు నొప్పులు¯ బాధలుఁ జెడి విశ్వకర్మభావిత దనుజా¯ రాధిత సుతలాలయమున¯ నేధిత విభవమున నుండు నితఁ డందాకన్.” (666) అని పలికి బలిం జూచి భగవంతుం డి ట్లనియె. (667) ”సేమంబు నీ కింద్రసేన మహారాజ!¯ వెఱవకు మేలు నీ వితరణంబు; ¯ వేలుపు లం దుండ వేడుక పడుదురు¯ దుఃఖంబు లిడుములు దుర్మరణము¯ లాతురతలు నొప్పు లందుండు వారికి¯ నొందవు సుతల మందుండు నీవు; ¯ నీ పంపు జేయని నిర్జరారాతుల¯ నా చక్ర మేతెంచి నఱకుచుండు; (667.1) లోకపాలకులకు లోనుగా వక్కడ¯ నన్యు లెంతవార లచట? నిన్ను¯ నెల్ల ప్రొద్దు వచ్చి యేను రక్షించెదఁ¯ గరుణతోడ నీకుఁ గానవత్తు. (668) దానవ దైత్యుల సంగతిఁ¯ బూనిన నీ యసురభావమును దోడ్తో మ¯ ద్ధ్యానమునఁ దలఁగి పోవును¯ మానుగ సుతలమున నుండుమా మా యాజ్ఞన్.” (669) అని యిట్లు పలుకుచున్న ముమ్మూర్తుల ముదుకవేల్పు తియ్యని నెయ్యంపుఁ బలుకుఁ జెఱకు రసంపుసోనలు వీనుల తెరువులం జొచ్చి లోను బయలు నిండి ఱెప్పల కప్పు దప్పం ద్రోచికొని కనుఁగవ కొలంకుల నలుగులు వెడలిన చందంబున సంతసంబునం గన్నీరు మున్నీరై పఱవ, నురఃఫలకంబునం బులకంబులు కులకంబులయి తిలకంబు లొత్తఁ, గేలు మొగిడ్చి నెక్కొన్న వేడుకం ద్రొక్కుడు పడుచుఁ జిక్కని చిత్తంబునఁ జక్కని మాటల రక్కసుల ఱేఁ డిట్లనియె. (670) ”ఎన్నడు లోకపాలకుల నీ కృపఁ జూడని నీవు నేఁడు న¯ న్నున్నతుఁ జేసి నా బ్రతుకు నోజయు నానతి యిచ్చి కాచి తీ¯ మన్నన లీ దయారసము మాటలు పెద్దఱికంబుఁ జాలవే? ¯ పన్నగతల్ప! నిన్నెఱిఁగి పట్టిన నాపద గల్గనేర్చునే?” (671) అని పలికి హరికి నమస్కరించి బ్రహ్మకుం బ్రణామంబు జేసి, యిందుధరునకు వందనం బాచరించి, బంధవిముక్తుండై తన వారలతోఁ జేరికొని బలి సుతలంబునకుం జనియె; నంత హరికృపావశంబునం గృతార్థుండై కులోద్ధారకుం డయిన మనుమనిం గని సంతోషించి ప్రహ్లాదుండు భగవంతున కిట్లనియె. (672) ”చతురాననుఁడు నీ ప్రసాదంబు గానఁడు¯ శర్వుఁడీ లక్ష్ముల జాడఁ బొందఁ, ¯ డన్యుల కెక్కడి? దసురులకును మాకు¯ బ్రహ్మాదిపూజితపదుఁడ వయిన¯ దుర్లభుండవు నీవు దుర్గపాలుఁడ వైతి¯ పద్మజాదులు భవత్పాదపద్మ¯ మకరంద సేవన మహిమ నైశ్వర్యంబు¯ లందిరి కాక యే మల్పమతుల (672.1) మధిక దుర్యోనులము కుత్సితాత్మకులము¯ నీ కృపాదృష్టిమార్గంబు నెలవు చేర¯ నేమి తప మాచరించితి మెన్నఁగలమె? ¯ మమ్ముఁ గాచుట చిత్రంబు మంగళాత్మ! (673) అదియునుం గాక. (674) సర్వగతుఁడ వయ్యు సమదర్శనుఁడ వయ్యు¯ నొకట విషమవృత్తి నుండు దరయ¯ నిచ్ఛలేనివారి కీవు భక్తులు గోరు¯ తలఁపు లిత్తు కల్పతరువు మాడ్కి.” (675) అని విన్నవించుచున్న ప్రహ్లాదుం జూచి పరమ పురుషుం డిట్లనియె. (676) ”వత్స! ప్రహ్లాద! మేలు నీ వారు నీవు¯ సొరిది మనుమనిఁ దోడ్కొని సుతలమునకుఁ¯ బయనమై పొమ్ము నే గదాపాణి నగుచుఁ¯ జేరి రక్షింప దురితంబు చెంద దచట.” (677) అని యిట్లు నియమించినం బరమేశ్వరునకు నమస్కరించి వలగొని కరకమల పుట ఘటిత నిటల తటుండయి, వీడ్కొని, బలిం దోడ్కొని సక లాసురయూథంబునుం దాను నొక్క మహాబిలద్వారంబు చొచ్చి ప్రహ్లాదుండు సుతల లోకంబునకుం జనియె; నంత బ్రహ్మవాదు లయిన యాజకుల సభామధ్యంబునం గూర్చున్న శుక్రునిం జూచి నారాయణుం డి ట్లనియె.

బలియజ్ఞమును విస్తరించుట

(678) ”ఏమిఁ గొఱత పడియె నీతని జన్నంబు¯ విస్తరింపు కడమ విప్రవర్య! ¯ విషమ మయిన కర్మ విసరంబు బ్రాహ్మణ¯ జనులు చూచినంత సమతఁ బొందు.” (679) అనిన శుక్రుం డి ట్లనియె. (680) ”అఖిల కర్మంబుల కధినాథుఁడవు నీవ¯ యజ్ఞేశుఁడవు నీవ యజ్ఞపురుష! ¯ ప్రత్యక్షమున నీవు పరితుష్టి నొందినఁ¯ గడ మేలఁ కల్గు నే కర్మములకు? ¯ ధనదేశకాలార్హతంత్రమంత్రంబులఁ¯ గొఱఁతలు నిన్నుఁ బేర్కొనిన మాను; ¯ నయినఁ గావింతు నీ యానతి భవదాజ్ఞ¯ మెలఁగుట జనులకు మేలుఁ గాదె? (680.1) యింతకంటెను శుభము నా కెచటఁ గలుగు”¯ ననుచు హరిపంపు శిరమున నావహించి¯ కావ్యుఁ డసురేంద్రు జన్నంబు కడమఁ దీర్చె¯ మునులు విప్రులు సాహాయ్యమునఁ జరింప. (681) ఇ వ్విధంబున వామనుం డయి హరి బలి నడిగి, మహిం బరిగ్రహించి, తనకు నగ్రజుండగు నమరేంద్రునకుం ద్రిదివంబు సదయుం డయి యొసంగె; న త్తరి దక్ష భృగు ప్రముఖ ప్రజాపతులును, భవుండును, గుమారుండును, దేవర్షి, పితృగణంబులును, రాజులును, దానును గూడికొని చతురాననుండు గశ్యపునకు నదితికి సంతోషంబుగా లోకంబులకు లోకపాలురకు "వామనుండు వల్లభుం"డని నియమించి యంత ధర్మంబునకు యశంబునకు లక్ష్మికి శుభంబులకు దేవతలకు వేదంబులకు వ్రతంబులకు స్వర్గాపవర్గంబులకు "నుపేంద్రుండు ప్రధానుం"డని సంకల్పించె నా సమయంబున. (682) కమలజుఁడు లోకపాలురు¯ నమరేంద్రునిఁగూడి దేవయానంబున న¯ య్యమరావతికిని వామను¯ నమరం గొనిపోయి రంత నట మీఁద నృపా! (683) బల్లిదంపుదోడు ప్రాపున నింద్రుని¯ కింద్రపదము చేరు టిట్లు గలిగెఁ; ¯ దనకు నాఢ్యుఁడైన తమ్ముఁడుఁ గలిగినఁ¯ గోర్కులన్న కేల కొఱఁత నొందు? (684) పా లడుగఁడు మే లడుగం¯ డేలఁడు భిక్షించి యన్నకిచ్చెఁ ద్రిజగమున్¯ వేలుపులతల్లి కడపటి¯ చూలుంబోలంగఁ గలరె సొలయని తమ్ముల్. (685) కడుపు బదరగాఁగ గొడుకులఁ గనుకంటె¯ దల్లి కొకఁడె చాలు బల్లిదుండు; ¯ త్రిదశగణముఁ గన్న యదితి గానుపు దీఱఁ¯ జిన్ని మేటివడుగుఁ గన్న యట్లు. (686) ఇట్లు దేవేంద్రుండు వామన భుజపాలితం బగు త్రిభువనసామ్రాజ్య విభవంబు మరల నంగీకరించె; నప్పుడు బ్రహ్మయు, శర్వుండునుఁ, గుమారుండును, భృగు ప్రముఖులయిన మునులునుఁ, బితృదేవతలును, దక్షాది ప్రజాపతులును, సిద్ధులును, వైమానికులును మఱియుం దక్కిన వారలును బరమాద్భుతంబైన విష్ణుని సుమహాకర్మంబులకు నాశ్చర్యంబు నొందుచుఁ, బ్రశంసించుచు, నాడుచుం, బాడుచు, తమతమ నివాసంబులకుం జని;"రని చెప్పి శుకుం డి ట్లనియె. (687) ”మనుజనాథ! త్రివిక్రము మహిమ కొలఁది¯ యెఱుఁగఁ దర్కింప లెక్కింప నెవ్వఁడోపుఁ? ¯ గుంభినీ రేణుకణములు గుఱుతు పెట్టు¯ వాఁడు నేరఁడు; తక్కిన వారి వశమె? (688) అద్భుత వర్తనుఁడగు హరి¯ సద్భావితమైన విమలచరితము వినువాఁ¯ డుద్భట విక్రముఁడై తుది¯ నుద్భాసితలీలఁ బొందు నుత్తమ గతులన్. (689) తగిలి మానుష పైతృక దైవ కర్మ¯ వేళలందుఁ ద్రివిక్రమ విక్రమంబు¯ లెక్కడెక్కడఁ గీర్తింతు రెవ్వరేనిఁ¯ బొందుదురు నిత్య సౌఖ్యంబు భూవరేంద్ర! (690) జడులై నాకముఁ గోలుపోవు సురలం జంభారినిం బ్రోవఁగా¯ వడుగై భూమి బదత్రయం బిడుటకై వైరోచనిన్ వేఁడి రెం¯ డడుగుల్ సాఁచి త్రివిక్రమస్ఫురణ బ్రహ్మాండంబుఁ దా నిండుచుం¯ గడుమోదంబున నుండు వామనున కెక్కాలంబునన్ మ్రొక్కెదన్.” (691) అని యిట్లు శుకుండు రాజునకు వామనావతారచరితంబు చెప్పె”నని సూతుండు మునులకుం జెప్పిన విని, వార లతని కిట్లనిరి.

మత్స్యావతార కథా ప్రారంభం

(692) "విమలాత్మ! విన మాకు వేడ్క యయ్యెడి; మున్ను¯ హరి మత్స్యమైన వృత్తాంతమెల్లఁ; ¯ గర్మబద్ధుని భంగి ఘనుఁ డీశ్వరుఁడు లోక¯ నిందితంబై తమోనిలయమైన¯ మీనరూపము నేల మే లని ధరియించె?¯ నెక్కడ వర్తించె? నేమి చేసె? ¯ నాద్యమై వెలయు న య్యవతారమునకు నె¯ య్యది కారణంబు? గార్యాంశ మెట్లు? (692.1) నీవు దగుదు మాకు నిఖిలంబు నెఱిఁగింపఁ¯ దెలియఁ జెప్పవలయు, దేవదేవు¯ చరిత మఖిలలోక సౌభాగ్య కరణంబు¯ గాదె? విస్తరింపు క్రమముతోడ." (693) అని మునిజనంబులు సూతు నడిగిన నతం డిట్లనియె "మీర లడిగిన యీ యర్థంబుఁ బరీక్షిన్నరేంద్రుం డడిగిన భగవంతుం డగు బాదరా యణి యిట్లనియె. (694) "విభుఁ డీశ్వరుఁడు వేదవిప్రగోసురసాధు¯ ధర్మార్థములఁ గావఁ దనువుఁ దాల్చి, ¯ గాలిచందంబున ఘనరూపములయందుఁ¯ దనురూపములయందుఁ దగిలియుండు; ¯ నెక్కువఁ దక్కువ లెన్నఁడు నొందక¯ నిర్గుణత్వంబున నెఱియు ఘనుఁడు; ¯ గురుతయుఁ గొఱఁతయు గుణసంగతివహించు¯ మనుజేశ! చోద్యమే మత్స్య మగుట? (694.1) వినుము; పోయిన కల్పాంతవేళఁ దొల్లి ¯ ద్రవిళదేశపురాజు సత్యవ్రతుండు¯ నీరు ద్రావుచు హరిఁగూర్చి నిష్ఠతోడఁ¯ దపముఁ గావించె నొకయేటి తటము నందు. (695) మఱియు, నొక్కనాఁ డమ్మేదినీ కాంతుండు గృతమాలిక యను నేటి పొంత హరిసమర్పణంబుగా జలతర్పణంబు జేయు చున్న సమయంబున నా రాజు దోసిట నొక్క మీనుపిల్ల దవిలివచ్చిన నులికిపడి, మరలం దరంగిణీ జలంబు నందు శకుల శాబకంబు విడిచె; నట్లు విడి వడి నీటిలో నుండి జలచరపోతంబు భూతలేశ్వరున కి ట్లనియె. (696) "పాటువచ్చిన జ్ఞాతి ఘాతులు పాపజాతి ఝషంబు లీ¯ యేటఁ గొండొక మీనుపిల్లల నేఱి పట్టి వధింప న¯ చ్చోటు నుండక నీదు దోసిలి చొచ్చి వచ్చిన నన్ను న¯ ట్టేటఁ ద్రోవఁగఁ బాడియే? కృప యింత లేక దయానిధీ! (697) వలలు దారు నింక వచ్చి జాలరి వేఁట¯ కాఱు నేఱు గలఁచి కారపెట్టి¯ మిడిసి పోవనీక మెడఁ బట్టుకొనియెద; ¯ రప్పు డెందుఁ జొత్తు? ననఘచరిత! (698) భక్షించు నొండె ఝషములు¯ శిక్షింతురు ధూర్తు లొండెఁ; జెడకుండ ననున్¯ రక్షింపు దీనవత్సల! ¯ ప్రక్షీణులఁ గాచుకంటె భాగ్యము గలదే? " (699) అనిన విని కరుణాకరుండగు న వ్విభుండు మెల్లన య య్యంభశ్చర డింభకంబునుఁ గమండలు జలంబునం బెట్టి తన నెలవునకుం గొని పోయె, నదియు నొక్క రాత్రంబునం గుండిక నిండి తనకు నుండ నిమ్ము చాలక రాజన్యున కి ట్లనియె. (700) "ఉండ నిదిఁ గొంచె మెంతయు¯ నొండొకటిం దెమ్ము భూవరోత్తమ!"యనుడున్¯ గండకముఁ దెచ్చి విడిచెను¯ మండలపతి సలిల కలశ మధ్యమున నృపా! (701) అదియును ముహూర్తమాత్రంబునకు మూఁడు చేతుల నిడుపై యుదంచంబు నిండి పట్టు చాలక వేఱొండుఁ దె మ్మనవుడు నా రాచ పట్టి కరుణాగుణంబునకు నాటపట్టుఁ గావున గండకంబు నొండొక్క చిఱుతమడుఁగున నునిచె; నదియు నా సరోవర జలంబునకు నగ్గలం బై తనకు సంచరింప నది గొంచెం బని పలికినం బుడమిఱేడు మంచి వాఁడగుటం జేసి యా కంచరంబు నుదంచిత జలాస్పదంబైన హ్రదంబునందు నిడియె; నదియు నా సలిలాశయంబునకును నధికంబై పెరుఁగ నిమ్ము చాలదని చెప్పికొనిన నప్పుణ్యుం డొప్పెడి నడవడిం దప్పని వాఁడైన కతంబున న మ్మహామీనంబును మహార్ణవంబున విడిచె; నదియును మకరాకరంబునం బడి రాజున కిట్లను "పెను మొ సళ్ళు ముసరికొని కసిమసంగి మ్రింగెడి; నింతకాలంబు నడపి కడపట దిగవిడువకు వెడలఁ దిగువు"మని యెలింగింప దెలిసి కడపట యన్నీటితిరుగుడు ప్రోడకుం బుడమిఱేఁ డిట్లనియె. (702) "ఒక దినంబున శతయోజనమాత్రము¯ విస్తరించెదు నీవు; వినము చూడ¯ మిటువంటి ఝషముల నెన్నఁడు నెఱుఁగము¯ మీనజాతుల కిట్టి మేను గలదె? ¯ యేమిటి కెవ్వఁడ? వీ లీలఁ ద్రిప్పెదు¯ కరుణ నాపన్నులఁ గావ వేఁడి¯ యంభశ్చరంబైన హరివి నే నెఱిఁగితి¯ నవ్యయ! నారాయణాభిధాన! (702.1) జనన సంస్థితి సంహార చతురచిత్త! ¯ దీనులకు భక్తులకు మాకు దిక్కు నీవ; ¯ నీదు లీలావతారముల్ నిఖిలభూత¯ భూతి హేతువుల్ మ్రొక్కెదఁ బురుషవర్య! (703) ఇతరులముఁ గాము చిత్సం¯ గతులము మా పాలి నీవుఁ గలిగితి భక్త¯ స్థితుఁడవగు నిన్ను నెప్పుడు¯ నతి చేసినవాని కేల నాశముఁ గలుగున్. (704) శ్రీలలనాకుచవేదికఁ¯ గేళీపరతంత్రబుద్ధిఁ గ్రీడించు సుఖా¯ లోలుఁడవు దామసాకృతి¯ నేలా మత్స్యంబ వైతి వెఱిఁగింపు హరీ!"

మీనావతారుని ఆనతి

(705) అని పలుకు సత్యవ్రత మహారాజునకు నయ్యుగంబు కడపటఁ బ్రళయ వేళ సముద్రంబున నేకాంతజన ప్రీతుండయి విహరింప నిచ్ఛించి మీన రూపధరుండైన హరి యిట్లనియె. (706) "ఇటమీఁద నీ రాత్రికేడవదినమునఁ¯ బద్మగర్భున కొక్క పగలు నిండు; ¯ భూర్భువాదిక జగంబులు మూఁడు విలయాబ్ధి¯ లోన మునుంగు; నాలోనఁ బెద్ద¯ నావ చేరఁగ వచ్చు; నా పంపు పెంపున¯ దానిపై నోషధితతులు బీజ¯ రాసులు నిడి పయోరాశిలో విహరింపఁ¯ గలవు సప్తర్షులుఁ గలసి తిరుఁగ (706.1) మ్రోలఁ గాన రాక ముంచు పెంజీఁకటి¯ మిడుకుచుండు మునుల మేనివెలుఁగుఁ¯ దొలకుచుండు జలధి దోధూయమాన మై¯ నావ దేలుచుండు నరవరేణ్య! (707) మఱియు న న్నావ మున్నీటి కరళ్ళకు లోనుఁ గాకుండ, నిరుఁ గెలంకుల వెనుక ముందట నేమఱకుండఁ, బెన్నెఱుఁలగు నా గఱులన్ జడియుచుఁ బొడువ వచ్చిన బలుగ్రాహంబుల నొడియుచు సంచరించెద; నొక్క పెనుఁబాము చేరువ నా యనుమతిం బొడచూపెడు దానంజేసి సుడిగాడ్పుల కతంబున నావ వడిం దిరుగంబడకుండ నా కొమ్ము తుదిం పదిలము చేసి నీకునుఁ దపసులకును నలజడి చెందకుండ మున్నీట నిప్పాటం దమ్మిచూలి రేయి వేగునంతకు మెలంగెద; నది కారణంబుగా జలచర రూపంబుఁ గయికొంటి; మఱియు నొక ప్రయోజనంబుఁ గలదు; నా మహిమ పరబ్రహ్మం బని తెలియుము; నిన్ను ననుగ్రహించితి"నని సత్యవ్రతుండు చూడ హరి తిరోహితుం డయ్యె; నయ్యవసరంబున. (708) మత్స్యరూపి యైన మాధవు నుడుగులుఁ¯ దలఁచికొనుచు రాచతపసి యొక్క¯ దర్భశయ్యఁ దూర్పుఁ దలగడగాఁ బండి¯ కాచి యుండె నాఁటి కాలమునకు. (709) అంతఁ గల్పాంతంబు డాసిన (710) ఉల్లసిత మేఘ పంక్తులు¯ జల్లించి మహోగ్రవృష్టి జడిగొని కురియన్¯ వెల్లి విరిసి జలరాసులు¯ చెల్లెలి కట్టలను దాఁటి సీమల ముంచెన్.

కల్పాంత వర్ణన

(711) తదనంతరంబ (712) మున్ను పోయిన కల్పాంతమున నరేంద్ర! ¯ బ్రహ్మ మనఁగ నైమిత్తిక ప్రళయ వేళ¯ నింగిపై నిట్టతొలఁకు మున్నీటిలోనఁ¯ గూలె భూతాళి జగముల కొలఁదు లెడలి. (713) అంత న మ్మహారాత్రి యందు (714) నెఱి నెల్లప్పుడు నిల్చి ప్రాణిచయమున్ నిర్మించి నిర్మించి వీఁ¯ పిఱయన్ నీల్గుచు నావులించుచు నజుం డే సృష్టియున్ మాని మే¯ నొఱఁగన్ ఱెప్పలు మూసి కేల్ దలగడై యుండంగ నిద్రించుచున్¯ గుఱు పెట్టం దొడఁగెం గలల్ గనుచు నిర్ఘోషించుచున్ భూవరా! (715) అలసి సొలసి నిదుర నందిన పరమేష్ఠి¯ ముఖము నందు వెడలె మొదలి శ్రుతులు¯ నపహరించె నొక హయగ్రీవుఁ డను దైత్య¯ భటుఁడు; దొంగఁ దొడర బరుల వశమె? (716) చదువులుఁ దన చేఁ బడినం¯ జదువుచుఁ బెన్ బయల నుండ శంకించి వడిం¯ జదువుల ముదుకఁడు గూరుకఁ¯ జదువుల తస్కరుఁడు చొచ్చె జలనిధి కడుపున్. (717) ఇట్లు వేదంబులు దొంగిలి దొంగరక్కసుండు మున్నీట మునింగిన, వాని జయింపవలసియు, మ్రానుదీఁగెల విత్తనంబుల పొత్తరలు పె న్నీట నాని చెడకుండ మనుపవలసియు నెల్ల కార్యంబులకుం గావలి యగునా పురుషోత్తముం డ ప్పెను రేయి చొరుదల యందు. (718) కుఱుగఱులు వలుఁద మీసలు¯ చిఱుదోకయుఁ బసిఁడి యొడలు సిరిగల పొడలున్¯ నెఱి మొగము నొక్క కొమ్మును¯ మిఱుచూపులుఁ గలిగి యొక్క మీనం బయ్యెన్.

గురుపాఠీన విహరణము

(719) ఇట్లు లక్ష యోజనాయతం బయిన పాఠీనంబై విశ్వంభరుండు జలధి చొచ్చి. (720) ఒకమాటు జలజంతుయూథంబులోఁగూడు¯ నొకమాటు దరులకు నుఱికి వచ్చు; ¯ నొకమాటు మింటికి నుదరి యుల్లంఘించు¯ నొకమాటు లోపల నొదిఁగి యుండు; ¯ నొకమాటు వారాశి నొడలు ముంపమిఁ జూచు¯ నొకమాటు బ్రహ్మాండ మొరయఁ దలఁచు; ¯ నొకమాటు ఝషకోటి నొడిసి యాహారించు¯ నొకమాటు జలముల నుమిసి వైచు; (720.1) గఱులు సారించు; మీసాలుఁ గడలు కొలుపుఁ; ¯ బొడలు మెఱయించుఁ; గన్నులఁ పొలప మార్చు; ¯ నొడలు జళిపించుఁ దళతళ లొలయ మీన¯ వేషి పెన్నీట నిగమ గవేషి యగుచు.

కడలిలో నావను గాచుట

(721) అంతకు మున్న సత్యవ్రతుండు మహార్ణవంబులు మహీవలయంబు ముంచు నవసరంబున భక్త పరాధీనుం డగు హరిఁ దలంచుచు నుండ నారాయణ ప్రేరితయై యొక్క నావ వచ్చినం గనుంగొని. (722) చని సత్యవ్రతమేదినీదయితుఁ డోజం బూని మ్రాన్దీఁగె వి¯ త్తనముల్ పెక్కులు నావపై నిడి హరిధ్యానంబుతో దానిపై¯ ముని సంఘంబులుఁ దాను నెక్కి వెఱతో మున్నీటిపైఁ దేలుచుం¯ గనియెన్ ముందట భక్తలోక హృదలంకర్మీణమున్ మీనమున్. (723) కని జలచరేంద్రుని కొమ్మున నొక్క పెనుఁ బాపత్రాటన నావఁ గట్టి, సంతసించి డెందంబు నివురుకొని తపస్వులుం దాను నా రాచపెద్ద మీనాకారుండగు వేల్పుఱేని నిట్లని పొగడం దొడంగె. (724) "తమలోఁ బుట్టు నవిద్య గప్పికొనుడుం దన్మూలసంసార వి¯ భ్రములై కొందఱు దేలుచుం గలఁగుచున్ బల్వెంటలన్ దైవ యో¯ గమునం దే పరమేశుఁ గొల్చి ఘనులై కైవల్య సంప్రాప్తులై¯ ప్రమదంబందుదు రట్టి నీవు కరుణం బాలింపు మమ్మీశ్వరా! (725) కన్నులు గల్గువాఁడు మఱి కాననివారికిఁ ద్రోవఁ జూపఁగాఁ¯ జన్న తెఱంగు మూఢునకు సన్మతిఁ దా గురుఁడౌట సూర్యుఁడే¯ కన్నులుగాఁగ భూతములఁ గాంచుచు నుండు రమేశ! మాకు ను¯ ద్యన్నయమూర్తివై గురువవై యల సద్గతిజాడఁ జూపవే. (726) ఇంగలముతోడి సంగతి¯ బంగారము వన్నె గలుగు భంగిని ద్వత్సే¯ వాంగీకృతుల యఘంబులు¯ భంగంబులఁ బొందు ముక్తి ప్రాపించు హరీ! (727) హృదయేశ! నీ ప్రసన్నత¯ పదివేలవపాలి లేశభాగము కతనం¯ ద్రిదశేంద్రత్వము గలదఁట; ¯ తుది నిను మెప్పింప నేది దొరకదు శ్రీశా! (728) పెఱవాఁడు గురు డటంచును¯ గొఱగాని పదంబు చూపఁ గుజనుండగు నీ¯ నెఱ త్రోవ నడవ నేర్చిన¯ నఱమఱ లేనట్టిపదమునందు దయాబ్ధీ! (729) చెలివై చుట్టమవై మనస్థ్సితుఁడవై చిన్మూర్తివై యాత్మవై¯ వలనై కోర్కులపంటవై విభుఁడవై వర్తిల్లు నిన్నొల్లకే¯ పలువెంటంబడి లోక మక్కట; వృథా బద్ధాశమై పోయెడిన్¯ నిలువన్ నేర్చునె హేమరాశిఁ గనియున్ నిర్భాగ్యుఁ డంభశ్శయా! (730) నీరరాశిలోన నిజకర్మ బద్ధమై¯ యుచితనిద్రఁ బొంది యున్న లోక¯ మే మహాత్ముచేత నెప్పటి మేల్కాంచు¯ నట్టి నీవు గురుఁడ వగుట మాకు. (731) ఆలింపుము విన్నప మిదె¯ వేలుపు గమిఱేని నిన్ను వేఁడికొనియెదన్¯ నాలోని చిక్కు మానిచి¯ నీలోనికిఁ గొంచుఁ బొమ్ము నిఖిలాధీశా! (732) అని యిట్లు సత్యవ్రతుండు పలికిన సంతసించి మత్స్యరూపంబున మహాసముద్రంబున విహరించు హరి పురాణపురుషుం డగుటం జేసి సాంఖ్యయోగక్రియాసహితయగు పురాణసంహిత నుపదేశించె; నమ్మహారాజు ముని సమేతుండై భగవన్నిగదితంబై సనాతనంబగు బ్రహ్మస్వరూపంబు విని కృతార్థుం డయ్యె; నతం డిమ్మహాకల్పంబున వివస్వతుం డనం బరఁగిన సూర్యునకు శ్రాద్ధదేవుండన జన్మించి శ్రీహరి కృపావశంబున నేడవ మనువయ్యె; అంత నవ్విధంబున బెనురేయి నిండునంతకు సంచరించి జలచరాకారుండగు నారాయణుండు తన్నిశాంత సమయంబున. (733) ఉఱ కంభోనిధి రోసి వేదముల కుయ్యున్ దైన్యముం జూచి వేఁ¯ గఱు లల్లార్చి ముఖంబు సాఁచి బలువీఁకందోఁక సారించి మే¯ న్మెఱయన్ దౌడలు దీటి మీస లదరన్ మీనాకృతిన్ విష్ణుఁ డ¯ క్కఱటిం దాఁకి వధించె ముష్టిదళితగ్రావున్ హయగ్రీవునిన్.

ప్రళ యావసాన వర్ణన

(734) అంతం బ్రళయావసాన సమయంబున. (735) ఎప్పుడు వేగు నం చెదురు చూచుచునుండు¯ మునుల డెందంబులం ముదము నొందఁ, ¯ దెలివితోఁ బ్రక్క నిద్రించు భారతి లేచి¯ యోరపయ్యెదఁ జక్క నొత్తి కొనఁగ, ¯ మలినమై పెనురేయి మ్రక్కిన తేజంబుఁ¯ దొంటి చందంబునఁ దొంగలింపఁ, ¯ బ్రాణుల సంచితభాగధేయంబులుఁ¯ గన్నుల కొలకులఁ గానఁబడఁగ, (735.1) నవయవంబులుఁ గదలించి, యావులించి¯ నిదురఁ దెప్పఱి, మేల్కాంచి, నీల్గి, మలఁగి, ¯ యొడలు విఱుచుచుఁ గనుఁగవ లుసుముకొనుచు. ¯ ధాత గూర్చుండె సృష్టి సంధాత యగుచు. (736) అయ్యవసరంబున. (737) వాసవారిఁ జంపి వాని చేఁ బడియున్న¯ వేదకోటి చిక్కు విచ్చి తెచ్చి¯ నిదుర మాని యున్న నీరజాసనునకు¯ నిచ్చెఁ గరుణతోడ నీశ్వరుండు. (738) జలరుహనాభుని కొఱకై¯ జలతర్పణ మాచరించి సత్యవ్రతుఁ డా¯ జలధి బ్రతికి మను వయ్యెను; ¯ జలజాక్షునిఁ గొలువ కెందు సంపదఁ గలదే?

మత్యావతార కథా ఫలసృతి

(739) జనవిభుండు దపసి సత్యవ్రతుండును¯ మత్స్యరూపి యైన మాధవుండు¯ సంచరించినట్టి సదమలాఖ్యానంబు¯ వినిన వాఁడు బంధ విరహితుండు. (740) హరి జలచరావతారముఁ¯ బరువడి ప్రతిదినముఁ జదువఁ బరమపదంబున్¯ నరుఁ డొందు వాని కోర్కులు¯ ధరణీశ్వర! సిద్ధిఁ బొందుఁ దథ్యము సుమ్మీ. (741) ప్రళయాంభోనిధిలోన మేన్మఱచి నిద్రంజెందు వాణీశు మో¯ ముల వేదంబులుఁ గొన్న దైత్యుని మృతిం బొందించి సత్యవ్రతుం¯ డలరన్ బ్రహ్మము మాటలం దెలిపి సర్వాధారుఁడై మీనమై¯ జలధిం గ్రుంకుచుఁ దేలుచున్ మెలఁగు రాజన్మూర్తికిన్ మ్రొక్కెదన్. (742) అని చెప్పి.

పూర్ణి

(743) రాజేంద్ర! దైత్యదానవ¯ రాజమహాగహన దహన! రాజస్తుత్యా! ¯ రాజావతంస! మానిత¯ రాజధరార్చిత! గుణాఢ్య! రాఘవరామా! (744) దివిజరిపువిదారీ! దేవలోకోపకారీ! ¯ భువనభరనివారీ! పుణ్యరక్షానుసారీ! ¯ ప్రవిమలశుభమూర్తీ! బంధుపోషప్రవర్తీ! ¯ ధవళబహుళకీర్తీ! ధర్మనిత్యానువర్తీ! (745) ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతంబయిన శ్రీమహాభాగవత పురాణం బను మహాప్రబంధంబు నందు స్వాయంభువ స్వారోచిషోత్తమ తామస మనువుల చరిత్రంబును, గరిమకరంబుల యుద్ధంబును, గజేంద్ర రక్షణంబును, రైవత చాక్షుష మనువుల వర్తనంబును, సముద్ర మథనంబును, కూర్మావతారంబును, గరళ భక్షణంబును, అమృతాది సంభవంబును, దేవాసుర కలహంబును, హరి కపటకామినీ రూపంబున నసురుల వంచించి దేవతల కమృతంబు పోయుటయు, రాక్షస వధంబును, హరిహర సల్లాపంబును, హరి కపటకామినీరూప విభ్రమణంబును, వైవశ్వత సూర్యసావర్ణి దక్షసావర్ణి బ్రహ్మసావర్ణి భద్రసావర్ణి దేవసావర్ణీంద్రసావర్ణి మనువుల వృత్తాంతంబులును, బలి యుద్ధయాత్రయును, స్వర్గవర్ణనంబును, దేవ పలాయనంబును, వామనావతారంబును, శుక్ర బలి సంవాదంబునుఁ, ద్రివిక్రమ విస్ఫురణంబును, రాక్షసుల సుతల గమనంబును, సత్యవ్రతోపాఖ్యానంబును, మీనావతారంబును నను కథలుఁ గల యష్టమ స్కంధము.