భాగవత పారాయణ - 2 : అష్టమ 548 - 663
వామనుని భిక్ష కోరు మనుట
(548) మఱియు నయ్యజమానుం డభ్యాగతున కిట్లనియె. (549) "వడుగా! యెవ్వరివాఁడ? వెవ్వఁడవు? సంవాసస్థలంబెయ్య? ది¯ య్యెడకున్ నీ వరుదెంచుటన్ సఫలమయ్యెన్ వంశమున్ జన్మముం; ¯ గడుధన్యాత్ముఁడనైతి; నీ మఖము యోగ్యంబయ్యె; నా కోరికల్¯ గడతేఱెన్; సుహుతంబులయ్యె శిఖులుం; గల్యాణ మిక్కాలమున్. (550) వరచేలంబులొ మాడలో ఫలములో వన్యంబులో గోవులో¯ హరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో¯ కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో¯ ధరణీ ఖండమొ కాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా! " (551) అని ధర్మయుక్తంబుగాఁ బలికిన వైరోచని వచనంబులు విని సంతోషించి యీశ్వరుం డిట్లనియె.
వామనుని సమాధానము
(552) "ఇది నాకు నెలవని యేరీతిఁ బలుకుదు?¯ నొక చో టనక యెందు నుండ నేర్తు; ¯ నెవ్వనివాఁడ నం చేమని నుడువుదు?¯ నా యంతవాఁడనై నడవనేర్తు; ¯ నీ నడవడి యని యెట్లు వక్కాణింతుఁ?¯ బూని ముప్పోకల బోవ నేర్తు; ¯ నదినేర్తు నిదినేర్తు నని యేలఁ జెప్పంగ?¯ నేరుపు లన్నియు నేన నేర్తు; (552.1) నొరులుఁ గారు నాకు నొరులకు నే నౌదు¯ నొంటివాఁడఁ జుట్ట మొకఁడు లేఁడు¯ సిరియుఁ దొల్లి గలదు చెప్పెద నా టెంకి¯ సుజనులందుఁ దఱచు చొచ్చియుందు. (553) అది యట్లుండ నిమ్ము. (554) జననాథ! నీ మాట సత్యంబు సత్కీర్తి; ¯ దంబు గులార్హంబు ధర్మయుతముఁ¯ గరుణానువర్తులు ఘనసత్త్వమూర్తులు¯ కాని మీ కులమందుఁ గలుగ రొరులు¯ రణభీరువులు వితరణభీరువులు లేరు¯ ప్రత్యర్థు లర్థులు ప్రబ్బికొనిన¯ దానశౌండిమమునఁ దనుపుదు రధికులై¯ మీ తాత లందఱు మేటిమగలు (554.1) మీ కులంబునందు మెఱయుఁ బ్రహ్లాదుండు¯ మింటి చంద్రుమాడ్కి మేలి రుచులఁ ¯ బ్రథిత కీర్తితోడ భవదీయవంశంబు¯ నీరరాశి భంగి నెగడు చుండు. (555) తొల్లి మీ మూఁడవ తాత హిరణ్యాక్షుండు విశ్వజయంబు జేసి గదాయుధుండై భూతలంబునఁ బ్రతివీరులం గానక సంచరింప విష్ణుండు వరాహరూపంబున నతని సమయించె; తద్భ్రాత యగు హిరణ్యకశిపుఁ డది విని హరిపరాక్రమంబునకు నాశ్చర్యంబు నొంది తన జయంబును బలంబునుం బరిహసించి గ్రద్దన నుద్దవిడి నద్దనుజమర్దను మందిరంబునకుం జనియె; నప్పుడు. (556) శూలాయుధహస్తుండై¯ కాలాకృతి వచ్చు దనుజుఁ గని విష్ణుండుం¯ గాలజ్ఞత మాయాగుణ¯ శీలత నిట్లని తలంచెఁ జిత్తములోనన్. (557) ”ఎదురై పోర జయింప రా దితనిఁ; గా కెందేనియుం బోవ భీ¯ ప్రదుఁడై ప్రాణులఁ దోలు మృత్యువు క్రియం బైవచ్చు” నంచుం గ్రియా¯ విదుఁడబ్జాక్షుఁడు సూక్ష్మరూపమున నావేశించె నిశ్శ్వాస రం¯ ధ్ర దిశన్ దైత్యు హృదంతరాళమునఁ బ్రత్యక్షక్రియాభీరుఁడై. (558) అంత నద్దైత్యవల్లభుండు వైష్ణవాలయంబు జొచ్చి వెదకి హరిం గానక కోపంబు మానక మిన్ను మన్ను నన్వేషించి త్రిదివంబు నరసి, దిశలం బరికించి, భూ వివరంబులు వీక్షించి, సముద్రంబులు వెదకి, పురంబులు శోధించి, వనంబులు విమర్శించి, పాతాళంబు పరీక్షించి, జగంబున నదృష్టశత్రుండై మార్గణంబు చాలించి, తనలో నిట్లనియె. (559) "పగవాఁడు మడియ నోపును¯ దెగడేనియు నెదురుపడఁడె? దేహధరులకుం¯ దెగిన యెడఁ బగఱ మీఁదనుఁ¯ బగఁగొనఁ దగ"దనుచు నుడిగెఁ బ్రాభవశక్తిన్. (560) అతండు మీ ప్రపితామహుం; డతని గుణంబు లనేకంబులు గల; వవి యట్లుండనిమ్ము. (561) ఆతుర భూసురగతిఁ బురు¯ హూతాదులుఁ దన్ను వేఁడ నొగిఁ గొం డనుచున్¯ మీ తండ్రి యిచ్చె నాయువు¯ నేతన్మాతృఁడవె నీవు నీలోకమునన్? (562) ఏలితివి మూఁడు జగములుఁ; ¯ దోలితి వింద్రాది సురలఁ; దొల్లిటివారిం¯ బోలితివి దానగుణముల; ¯ సోలితివి పిశాచరాక్షసుల రక్షింపన్.
వామనుడు దాన మడుగుట
(563) అదియునుం గాక. (564) రాజ్యంబు గలిగె నేనిం¯ బూజ్యులకును యాచకులకు భూమిసురులకున్¯ భాజ్యముగ బ్రతుక డేనిం¯ ద్యాజ్యంబులు వాని జన్మ ధన గేహంబుల్. (565) మున్నెన్నుదురు వదాన్యుల¯ నెన్నెడుచో నిన్నుఁ ద్రిభువనేశుం డనుచున్; ¯ ఇన్నిదినంబుల నుండియు¯ నెన్నఁడు నినుఁ బెట్టు మనుచు నీండ్రము జేయన్. (566) ఒంటివాఁడ నాకు నొకటి రెం డడుగుల¯ మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల; ¯ గోర్కిఁదీర బ్రహ్మకూకటి ముట్టెద¯ దానకుతుకసాంద్ర! దానవేంద్ర!". (567) అనిన బరమయాచకునకుఁ బ్రదాత యిట్లనియె. (568) "ఉన్నమాటలెల్ల నొప్పును విప్రుండ! ¯ సత్య గతులు వృద్ధ సమ్మతంబు; ¯ లడుగఁ దలఁచి కొంచె మడిగితివో చెల్ల; ¯ దాత పెంపు సొంపుఁ దలఁపవలదె." (569) అని మఱియు ని ట్లనియె. (570) ”వసుధాఖండము వేఁడితో? గజములన్ వాంఛించితో? వాజులన్¯ వెసనూహించితొ? కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో? ¯ పసిబాలుండవు; నేర వీ వడుగ; నీ భాగ్యంబు లీపాటి గా¯ కసురేంద్రుండు పదత్రయం బడుగ నీ యల్పంబు నీ నేర్చునే?" (571) అనిన మొగంబునం జిఱునగవు మొలకలెత్త గృహమేథికి మేధావి యి ట్లనియె. (572) "గొడుగో, జన్నిదమో, కమండలువొ, నాకున్ ముంజియో, దండమో, ¯ వడుఁగే నెక్కడ భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె¯ క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ¯ డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్. (573) అదియునుంగాక. (574) వ్యాప్తింబొందక వగవక ¯ ప్రాప్తంబగు లేశమైనఁ బదివే లనుచుం¯ దృప్తింజెందని మనుజుఁడు¯ సప్తద్వీపముల నయినఁ జక్కంబడునే? (575) ఆశాపాశము దాఁ గడున్ నిడుపు; లే దంతంబు రాజేంద్ర! వా¯ రాశిప్రావృత మేదినీవలయ సామ్రాజ్యంబు చేకూడియుం¯ గాసింబొందిరిఁ గాక వైన్య గయ భూకాంతాదులున్నర్థకా¯ మాశంబాయఁగ నేర్చిరే మును నిజాశాంతంబులం జూచిరే. (576) సంతుష్టుఁడీ మూఁడు జగములఁ బూజ్యుండు¯ సంతోషి కెప్పుడుఁ జరుఁగు సుఖము¯ సంతోషిఁ గాకుంట సంసార హేతువు¯ సంతసంబున ముక్తిసతియు దొరకుఁ¯ బూఁటపూఁటకు జగంబుల యదృచ్ఛాలాభ¯ తుష్టిని దేజంబు తోన పెరుఁగుఁ¯ బరితోష హీనతఁ బ్రభ చెడిపోవును¯ జలధార ననలంబు సమయునట్లు (576.1) నీవు రాజ వనుచు నిఖిలంబు నడుగుట¯ దగవు గాదు నాకుఁ; దగిన కొలఁది¯ యేను వేఁడికొనిన యీ పదత్రయమునుఁ¯ జాల దనక యిమ్ము; చాలుఁజాలు."
శుక్ర బలి సంవాదంబును
(577) అని యిట్లు పలుకుచున్న ఖర్వునకు నుర్వీదానంబు చేయం దలంచి కరకలిత సలిల కలశుండైన య వ్వితరణగుణముఖరునిం గని, నిజ విచారయుక్త దనుజ రాజ్య చక్రుండగు శుక్రుం డిట్లనియె. (578) "దనుజేంద్ర! యీతఁడు ధరణీసురుఁడుఁ గాడు¯ దేవకార్యంబు సాధించుకొఱకు¯ హరి విష్ణుఁ డవ్యయుం డదితి గర్భంబునఁ¯ గశ్యపసూనుఁడై కలిఁగె; నకట! ¯ యెఱుగ కీతని కోర్కి నిచ్చెద నంటివి¯ దైత్య సంతతి కుపద్రవము వచ్చు¯ నీ లక్ష్మిఁ దేజంబు నెలవు నైశ్వర్యంబు¯ వంచించి యిచ్చుఁ దా వాసవునకు; (578.1) మొనసి జగము లెల్ల మూఁడు పాదంబుల¯ నఖిలకాయుఁ డగుచు నాక్రమించు¯ సర్వ ధనము విష్ణు సంసర్జనము చేసి¯ బడుగు పగిది నెట్లు బ్రతికె దీవు? (579) ఒక్కపదంబున భూమియు¯ నొక్కటఁ ద్రిదివంబు ద్రొక్కి యున్నతమూర్తిన్¯ దిక్కులు గగనముఁ దానై¯ వెక్కసమై యున్న నెందు వెడలెదు? చెపుమా! (580) ఇచ్చెద నని పల్కి యీకున్న నరకంబు¯ ద్రోవ నీవును సమర్థుఁడవుఁ గావ; ¯ యే దానమున నాశ మేతెంచు నదియును¯ దానంబుఁ గా దండ్రు తత్త్వవిదులు; ¯ దానంబు యజ్ఞంబుఁ దపముఁ గర్మంబును¯ దా విత్తవంతుఁడై తలఁపవలయుఁ; ¯ దన యింటఁ గల సర్వధనమును నైదు భా¯ గములుగా విభజించి కామమునకు (580.1) నర్థమునకు ధర్మయశముల కాశ్రిత¯ బృందములకు సమతఁ బెట్టునట్టి¯ పురుషుఁ డిందు నందు బూర్ణుఁడై మోదించుఁ¯ దన్ను మాని చేఁత దగవుఁ గాదు. (581) అదియునుం గాక యీ యర్థంబునందు బహుభంగి బహ్వృచ గీతార్థంబుఁ గల దొక్కటి; సావధానుండవై యాకర్ణింపుము. (582) అంగీకరించిన నఖిలంబుఁ బోవుచో¯ ననృతంబుఁగాదు లే దనిన నధిప! ¯ యాత్మ వృక్షము మూల మనృతంబు నిశ్చయ¯ మనృత మూలముఁ గల్గ నాత్మ చెడదు; ¯ పుష్పఫలము లాత్మ భూజంబునకు సత్య¯ మామ్రాను బ్రతుకమి నదియుఁ జెడును; ¯ ఫలపుష్పములు లేక పస చెడి వృక్షంబు¯ మూలంబుతో వృద్ధిఁ బొందుఁ గాదె? (582.1) చేటుఁ గొఱతయు లఘిమయుఁ జెందకుండ¯ నిచ్చు పురుషుండు చెడకుండు నిద్ధచరిత! ¯ కాక యంచిత సత్య సంగతి నటంచు¯ నిజధనం బర్థి కిచ్చిన నీకు లేదు. (583) సర్వమయినచోట సర్వధనంబులు¯ నడుగ లే దటంచు ననృతమాడు¯ చెనటి పందనేమి చెప్పఁ బ్రాణము తోడి¯ శవము వాఁడు; వాని జన్మ మేల? (584) మఱియు నిం దొక్క విశేషంబు గలదు; వివరించెద. (585) వారిజాక్షులందు వైవాహికము లందుఁ ¯ బ్రాణవిత్తమానభంగమందుఁ¯ జకిత గోకులాగ్ర జన్మరక్షణ మందు¯ బొంకవచ్చు నఘము పొందఁ దధిప! (586) కులమున్ రాజ్యముఁ దేజమున్ నిలుపుమీ కుబ్జుండు విశ్వంభరుం¯ డలతిం బోఁడు; త్రివిక్రమస్ఫురణ వాఁడై నిండు బ్రహ్మాండముం; ¯ గలఁడే మాన్ప నొకండు? నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్; ¯ వలదీ దానము గీనముం బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా!” (587) అని యిట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమీలితలోచనుండయి యశస్వి యిట్లనియె. (588) "నిజ మానతిచ్చితి వీవు మహాత్మక!¯ మహిని గృహస్థధర్మంబు నిదియ¯ యర్థంబుఁ గామంబు యశమును వృత్తియు¯ నెయ్యది ప్రార్థింప నిత్తు ననియు¯ నర్థ లోభంబున నర్థిఁ బొమ్మను టెట్లు?¯ పలికి లే దనుకంటెఁ బాప మెద్ది? ¯ యెట్టి దుష్కర్ముని నే భరించెదఁ గాని¯ సత్యహీనుని మోవఁ జాల ననుచుఁ (588.1) పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ¯ సమరముననుండి తిరుగక చచ్చుకంటె¯ బలికి బొంకక నిజమునఁ బరఁగుకంటె¯ మానధనులకు భద్రంబు మఱియుఁ గలదె. (589) ధాత్రిని హలికునకును సు¯ క్షేత్రము బీజములు నొకటఁ జేకుఱు భంగిం¯ జిత్రముగ దాత కీవియుఁ¯ బాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే? (590) కారేరాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే? ¯ వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ¯ బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై¯ యీరేకోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్? భార్గవా! (591) ఉడుగని క్రతువులఁ వ్రతములఁ¯ బొడగనఁ జన నట్టి పొడవు పొడవునఁ గుఱుచై¯ యడిగెడినఁట; ననుబోఁటికి¯ నిడరాదె మహానుభావ! యిష్టార్థంబుల్. (592) ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ, దనువుపై, నంసోత్తరీయంబుపై, ¯ బాదాబ్జంబులపైఁ, గపోలతటిపైఁ, బాలిండ్లపై నూత్నమ¯ ర్యాదం జెందు కరంబు గ్రిం దగుట మీఁదై నా కరంబుంట మేల్¯ గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే? (593) నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు¯ ర్మరణంబైనఁ గులాంతమైన నిజమున్ రానిమ్ము; కానిమ్ము పో; ¯ హరుఁడైనన్, హరియైన, నీరజభవుం డభ్యాగతుండైన నౌఁ; ¯ దిరుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా; ధీవర్య! వే యేటికిన్? (594) నొడివినంత పట్టు నుసలక యిచ్చుచో¯ నేల కట్టు విష్ణుఁ డేటి మాట? ¯ గట్టెనేనిఁ దాన కరుణించి విడుచును¯ విడువకుండ నిమ్ము విమలచరిత!
బలి దాన నిర్ణయము
(595) మేరువు దల క్రిం దైనను¯ బారావారంబు లింకఁ బాఱిన లోలో¯ ధారుణి రజమై పోయినఁ¯ దారాధ్వము బద్ధమైనఁ దప్పక యిత్తున్. (596) ఎన్నడుం బరువేఁడఁ బోఁడట; యేకలుం డఁట; కన్న వా¯ రన్నదమ్ములు నైన లేరఁట; యన్నివిద్యల మూల గో¯ ష్ఠిన్నెఱింగిన ప్రోడ గుజ్జఁట; చేతు లొగ్గి వసింప నీ¯ చిన్నిపాపనిఁ ద్రోసిపుచ్చఁగఁ జిత్త మొల్లదు సత్తమా!” (597) అని యిట్లు సత్య పదవీ ప్రమాణ తత్పరుండును, వితరణ కుతూహల సత్త్వరుండును, విమల యశస్కుండును, దృఢ మనస్కుండును, నియతసత్యసంధుండును, నర్థిజన కమలబంధుండును నైన బలిం జూచి శుక్రుండు గోపించి "మదీయ శాసనం బతిక్రమించితివి గావున శీఘ్రకాలంబునఁ బదభ్రష్టుండవుఁ గ"మ్మని శాపం బిచ్చె బలియును గురుశాపతప్తుండయ్యు ననృతమార్గంబు నకభిముఖుండుఁ గాకుండె; నప్పుడు. (598) బ్రతుక వచ్చుఁగాఁక బహుబంధనములైన¯ వచ్చుఁగాక లేమి వచ్చుఁగాక¯ జీవధనములైనఁ జెడుఁగాక పడుఁగాక¯ మాటఁ దిరుఁగ లేరు మానధనులు.
వామనునికి దాన మిచ్చుట
(599) అ య్యవసరంబున. (600) దనుజలోకనాథు దయిత వింధ్యావళి¯ రాజవదన మదమరాళ గమన¯ వటుని కాళ్ళుఁ గడుగ వరహేమ ఘటమున¯ జలముఁ దెచ్చె భర్త సన్న యెఱిఁగి. (601) అయ్యవసరంబునఁ గపటవటునకు న ద్దానవేంద్రుం డిట్లనియె. (602) "రమ్మా మాణవకోత్తమ! ¯ లెమ్మా నీ వాంఛితంబు లే దన కిత్తుం¯ దెమ్మా యడుగుల నిటు రా¯ నిమ్మా కడుగంగవలయు నేటికిఁ దడయన్?" (603) అనిన విని. (604) బలిదైత్యేంద్ర కరద్వయీ కృత జలప్రక్షాళనవ్యాప్తికిన్¯ జలజాతాక్షుఁడు చాఁచె యోగి సుమనస్సంప్రార్థితశ్రీదముం¯ గలితానమ్ర రమా లలాటపదవీ కస్తూరికా శాదమున్¯ నలినామోదము రత్ననూపురిత నానావేదముం బాదమున్. (605) సురలోక సముద్ధరణము¯ నిరతశ్రీకరణ మఖిల నిగమాంతాలం¯ కరణము భవసంహరణము¯ హరిచరణము నీఁటఁ గడిగె నసురోత్తముడున్. (606) ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు చేసి వామపాదంబు గడిగి తత్పావన జలంబు శిరంబునం జల్లుకొని వార్చి దేశ కాలాది పరిగణనంబు చేసి. (607) "విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వే¯ దప్రామాణ్యవిదే త్రిపాద ధరణిం దాస్యామి!"యంచుం గ్రియా¯ క్షిప్రుండై దనుజేశ్వరుండు వడుగుం జే సాఁచి పూజించి "బ్ర¯ హ్మప్రీత"మ్మని ధారపోసె భువనం బాశ్చర్యముం బొందగన్. (608) తత్కాలంబున. (609) నీరధారఁ బడఁగ నీక యడ్డంబుగాఁ¯ గలశరంధ్ర మాఁపగాను దెలిసి¯ హరియుఁ గావ్యు నేత్ర మటఁ గుశాగ్రంబున¯ నడువ నేకనేత్రుఁ డయ్యె నతఁడు. (610) అంత. (611) అమరారాతి కరాక్షతోజ్ఝిత పవిత్రాంభః కణశ్రేణికిం¯ గమలాధీశ్వరుఁ డొడ్డె ఖండిత దివౌకస్స్వామిజిన్మస్తముం¯ గమలాకర్షణ సుప్రశస్తము రమాకాంతాకచోపాస్తమున్¯ విమలశ్రీ కుచశాత చూచుక తటీవిన్యస్తమున్ హస్తమున్. (612) మునిజన నియమాధారను¯ జనితాసుర యువతి నేత్రజలకణ ధారన్¯ దనుజేంద్ర నిరాధారను¯ వనజాక్షుఁడు గొనియె బలివివర్జితధారన్. (613) కమలనాభు నెఱిఁగి కాలంబు దేశంబు¯ నెఱిఁగి శుక్రు మాట లెఱిగి నాశ¯ మెఱిఁగి పాత్ర మనుచు నిచ్చె దానము బలి¯ మహి వదాన్యుఁ డొరుఁడు మఱియుఁ గలఁడె. (614) బలిచేసిన దానమునకు¯ నళినాక్షుఁడు నిఖిలభూత నాయకుఁ డగుటం¯ గలకల మని దశదిక్కులు¯ బళిబళి యని పొగడె భూతపంచక మనఘా! (615) "క్షితిదానమిచ్చు నతఁడును¯ నతికాంక్షఁ బరిగ్రహించు నతఁడును దురిత¯ చ్యుతులై శతవత్సరములు¯ శతమఖ లోకమునఁ గ్రీడ సలుపుదు రెలమిన్. (616) అట్లుగావున నే దానంబును భూదానంబునకు సదృశంబు గానేరదు; గావున వసుంధరా దానం బిచ్చితి; వుభయలోకంబులం గీర్తి సుకృతంబులు పడయు"మని పలికి య మ్మాయావటుం డిట్లనియె. (617) "ఇదియేమి వేఁడితని నీ¯ మదివగవక ధారపోయుమా; సత్యము పెం¯ పొదవఁగ గోరిన యర్థం¯ బిది యిచ్చుట ముజ్జగంబు లిచ్చుట మాకున్." (618) అని పలికిన వటుని పలుకులకు హర్ష నిర్భర చేతస్కుండై వైరోచనుండు. (619) ”పుట్టి నేర్చుకొనెనొ పుట్టక నేర్చెనో¯ చిట్టి బుద్ధు లిట్టి పొట్టివడుగు¯ పొట్ట నున్న వెల్ల బూమెలు” నని నవ్వి¯ యెలమి ధరణి దాన మిచ్చె నపుడు. (620) గ్రహ మునీంద్ర సిద్ధ గంధర్వ కిన్నర¯ యక్ష పక్షి దేవతాహి పతులు¯ పొగడి రతని పెంపుఁ; బుష్పవర్షంబులు¯ గురిసె దేవతూర్యకోటి మొరసె. (621) ఇట్లు ధారా పరిగ్రహంబు చేసి.
త్రివిక్రమ స్ఫురణంబు
(622) ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై¯ నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై¯ నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై¯ నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. (623) రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై¯ శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై¯ ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర¯ ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్. (624) ఇట్లు విష్ణుండు గుణత్రయాత్మకంబగు విశ్వరూపంబు ధరియించి భువియును, నభంబును, దివంబును, దిశలును, దిశాఛిద్రంబులును, సముద్రంబులునుఁ, జలదచల దఖిల భూతనివహంబులుం దానయై యేకీభవించి, క్రమక్రమంబున భూలోకంబునకుం బొడవై భువర్లోకంబు నతిక్రమించి, సువర్లోకంబును దలకడచి, మహర్లోకంబు దాఁటి, జనలోకంబునకు మీఁదై, తపంబునకు నుచ్ఛ్రితుండై, సత్యలోకంబు కంటె నౌన్నత్యంబు వహించి, యెడ లిఱుములు సందులు రంధ్రములు లేకుండ నిండి, మహాదేహ మహితుండై చరణతలంబున రసాతలంబునుఁ, బాదంబుల మహియును, జంఘల మహీధ్రంబులును, జానువులఁ బతత్త్రిసముదయంబులును, నూరువుల నింద్రసేన మరుద్గణంబులును, వాసస్థ్సలంబున సంధ్యయు, గుహ్యంబునఁ బ్రజాపతులును, జఘనంబున దనుజులును, నాభిని నభంబును, నుదరంబున నుదధిసప్తకంబును, నురంబున దారకానికరంబును, హృదయంబున ధర్మంబును, నురోజంబుల ఋతసత్యంబులును, మనంబునఁ జంద్రుండును, వక్షంబున గమలహస్త యగు లక్ష్మియుఁ, గంఠంబున సామాది సమస్త వేదంబులును, భుజంబులఁ బురంద రాది దేవతలునుఁ, గర్ణంబుల దిశలును, శిరంబున నాకంబును, శిరోజంబుల మేఘంబులును, నాసాపుటంబున వాయువును, నయనంబుల సూర్యుండును, వదనంబున వహ్నియు, వాణి నఖిలచ్ఛంద స్సముదయంబును, రసనంబున జలేశుండును, భ్రూయుగళంబున విధినిషేధంబులును, ఱెప్పల నహోరాత్రంబులును, లలాటంబునఁ గోపంబును, నధరంబున లోభంబును, స్పర్శంబునఁ గామంబును, రేతంబున జలంబును, బృష్ఠంబున నధర్మంబును, గ్రమణంబుల యజ్ఞంబులును, ఛాయల మృత్యువును, నగవులవలన ననేక మాయావిశేషంబులును, రోమంబుల నోషధులును, నాడీప్రదేశంబుల నదులును, నఖంబుల శిలలును, బుద్ధి నజుండును, బ్రాణంబుల దేవర్షిగణంబులును, గాత్రంబున జంగమ స్థావర జంతు సంఘంబులును గలవాఁడయి, జలధరనినద శంఖ శార్ఙ సుదర్శన గదాదండ ఖ డ్గాక్షయ బాణతూణీర విభ్రాజితుండును, మకరకుండల కిరీట కేయూర హార కటక కంకణ కౌస్తుభమణి మేఖలాంబర వనమాలికా విరాజితుండును, సునంద నంద జయ విజయ ప్రముఖ పరిచర వాహినీ సందోహ పరివృతుండును, నమేయ తేజోవిరాజితుండును, నై బ్రహ్మాండంబు దన మేనికప్పు తెఱంగున నుండ విజృంభించి. (625) ఒకపాదంబున భూమి గప్పి దివి వే ఱొంటన్ నిరోధించి యొం¯ డొకటన్ మీఁది జగంబు లెల్లఁ దొడి, నొండొంటిన్ విలంఘించి. ప¯ ట్టకబ్రహ్మాండకటాహముం బెటిలి వేండ్రంబై పరుల్ గానరా¯ కొకఁడై వాగ్దృగలభ్యుఁడై హరి విభుం డొప్పారె విశ్వాకృతిన్. (626) ఒక పదంబు క్రింద నుర్వి పద్మము నంటి¯ కొన్న పంకలవము కొమరుఁ దాల్చె; ¯ నొకటి మీఁదఁ దమ్మి కొదిఁగిన తేఁటినా¯ వెలసె మిన్ను నృప! త్రివిక్రమమున. (627) తత్సమయంబున. (628) జగము లెల్ల దాఁటి చనిన త్రివిక్రము¯ చరణనఖర చంద్ర చంద్రికలను¯ బొనుఁగు పడియె సత్యమున బ్రహ్మతేజంబు¯ దివసకరుని రుచుల దివియ బోలె. (629) భవబంధములఁ బాసి బ్రహ్మలోకంబునఁ¯ గాపురంబులు చేయు ఘనులు రాజు¯ లా మరీచ్యాదులు, నా సనందాదులు¯ నా దివ్యయోగీంద్రు లచట నెపుడు¯ మూర్తిమంతంబులై మ్రోయు పురాణ త¯ ర్కామ్నాయ నియమేతిహాస ధర్మ¯ సంహితాదులు గురుజ్ఞానాగ్నినిర్దగ్ధ¯ కర్ములై మఱియును గలుగునట్టి (629.1) వార లెల్లఁ జొచ్చి వచ్చి సర్వాధిపు¯ నంఘ్రిఁ జూచి మ్రొక్కి రధిక భక్తిఁ¯ దమ మనంబు లందుఁ దలచు నిధానంబుఁ¯ గంటి మనుచు నేఁడు మంటి మనుచు. (630) తనపుట్టిల్లిదె పొమ్మటంచు నజుఁడుం దన్నాభిపంకేరుహం¯ బు నిరీక్షించి నటించి యున్నత పదంబుం జూచి తత్పాదసే¯ చనముం జేసెఁ గమండలూదకములం జల్లించి; తత్తోయముల్¯ వినువీథిం బ్రవహించె దేవనదినా విశ్వాత్ముకీర్తిప్రభన్. (631) తత్సమయంబున. (632) యోగమార్గంబున నూహించి బహువిధ¯ పుష్పదామంబులఁ బూజ చేసి¯ దివ్యగంధంబులుఁ దెచ్చి సమర్పించి¯ ధూపదీపములఁ దోడ్తోడ నిచ్చి¯ భూరి లాజాక్షతంబులు జల్లి ఫలములుఁ¯ గానిక లిచ్చి రాగములఁ బొగడి¯ శంఖాదిరవములు జయఘోషములుఁ జేసి¯ "కరుణాంబునిధి! త్రివిక్రమ!" యటంచు (632.1) బ్రహ్మ మొదలు లోకపాలురుఁ గొనియాడి; ¯ రెల్ల దిశల వనచరేశ్వరుండు¯ జాంబవంతుఁ డరిగి చాటె భేరిధ్వని¯ వెలయఁ జేసి విష్ణు విజయ మనుచు. (633) అన్నిజగంబులఁ దానై¯ యున్నజగన్నాథుఁ జూడ నొగి భావింపం¯ గన్నందక మన మందక¯ సన్నుతులం జేసి రపుడు సభ్యులు బలియున్.
దానవులు వామనుపై కెళ్ళుట
(634) అంత నొయ్యన పూర్వప్రకారంబున వామనాకారంబు వహించి యున్న వామనునిం గని "పదత్రయ వ్యాజంబున నితండు సకల మహీ మండలంబు నాక్రమించె కపటవటురూప తిరోహితుండగు విష్ణుండని యెఱుంగక మన దానవేంద్రుఁడు సత్యసంధుండు గావున మాటఁ దిరుగక యిచ్చె నతని వలన నేరంబు లేదు ఈ కుబ్జుం డప్రతిహత తేజః ప్రభావంబున సజ్జకట్టుగా నిజ్జగంబులం బరిగ్రహించి, పర్జన్యాదులకు విసర్జనంబు చేయందలంచి యున్నవాఁ, డీ పాఱునిం దూఱి పాఱనీక నిర్జించుటఁ గర్జం"బని తర్జనంబులును గర్జనంబులునుఁ జేయుచు, వజ్రాయుధాది మరుజ్జేతలగు హేతి ప్రహేతి విప్రచిత్తి ముఖ్యులయిన రక్కసులు పెక్కం డ్రుక్కుమిగిలి యుద్ధంబునకు సన్నధులై పరశు పట్టిస భల్లాది సాధనంబులు ధరియించి కసిమెసంగి ముసరికొని దశదిశలఁ బ్రసరించినఁ జూచి హరిపరిచరులు సునంద నంద జయ జయంత విజయ ప్రబలోద్బల కుముద కుముదాక్ష తార్క్ష్య పుష్పదంత విష్వక్సేన శ్రుతదేవ సాత్వత ప్రముఖులగు దండనాథు లయుత వేదండ సముద్దండ బలులుఁ దమతమ యూథంబుల నాయుధంబులతోడం గూర్చుకొని దానవానీకంబులం బరలోకంబున కనుచువారలై వారల నెదుర్కొని కదనంబునకున్ బరవసంబు చేయుచున్నం గనుంగొని శుక్రుశాపంబుఁ దలంచి దనుజ వల్లభుం డిట్లనియె. (635) ”రాక్షసోత్తములార! రండు పోరాడక¯ కాలంబు గాదిది కలహమునకు; ¯ సర్వభూతములకు సంపదాపదలకు¯ బ్రభువైన దైవంబుఁ బరిభవింప¯ మన మోపుదుమె? తొల్లి మనకు రాజ్యంబును¯ సురలకు నాశంబు సొరిది నిచ్చి¯ విపరీతముగఁ జేయు వేల్పు నే మందము¯ మనపాలి భాగ్యంబు మహిమ గాక; (635.1) వెఱచి పలుమాఱుఁ బాఱెడి విష్ణుభటులు¯ మిమ్ము నెగచుట దైవంబు మేర గాదె? ¯ మనకు నెప్పుడు దైవంబు మంచిదగును¯ నాఁడు గెలుతుము పగవారి నేఁడు వలదు. (636) అదియునుం గాక. (637) పలుదుర్గంబులు సచివులు¯ బలములు మంత్రౌషధములు బహు శేముషియుం¯ గలిగియు సామోపాయం¯ బులఁగాల మెఱింగి నృపుడు పోరుట యొప్పున్.
బలిని బంధించుట
(638) అట్లు గావున రణంబున శత్రుల కిప్పు డెదురు మోహరించుట కార్యంబుఁ గాదు; మనకుం దగు కాలంబున జయింతము; నలంగక తొలంగుం” డనిన దలంగి భాగవత భట భీతులై చిక్కి రక్కసులు రసాతలంబునకుం జని; రంత హరి హృదయం బెఱింగి తార్క్షనందనుండు యాగసుత్యాహంబున వారుణ పాశంబుల నసురవల్లభుని బంధించె; నంత. (639) బాహులుఁ బదములుఁ గట్టిన ¯ శ్రీహరి కృపగాక యేమి జేయుదు నని సం¯ దేహింపక బలి నిలిచెను¯ హాహారవ మెసఁగె దశ దిగంతములందున్. (640) సంపద చెడియును దైన్యము¯ గంపంబును లేక తొంటికంటెను బెంపుం¯ దెంపును నెఱుకయు ధైర్యము¯ వంపని సురవైరిఁ జూచి వటుఁ డిట్లనియెన్. (641) “దానవ! త్రిపదభూతల మిత్తు నంటివి¯ ధరణిఁ జంద్రార్కు లెందాఁక నుందు¯ రంత భూమియు నొక్క యడుగయ్యె నాకును¯ స్వర్లోకమును నొక్క చరణమయ్యె; ¯ నీ సొమ్ము సకలంబు నేఁడు రెండడుగులు¯ గడమ పాదమునకుఁ గలదె భూమి? ¯ యిచ్చెద నన్నర్థ మీని దురాత్ముండు¯ నిరయంబు బొందుట నిజముగాదె? (641.1) కాన దుర్గతికినిఁ గొంత కాల మరుగు¯ కాక యిచ్చెదవేని వేగంబ నాకు¯ నిపుడ మూఁడవ పదమున కిమ్ముఁ జూపు ¯ బ్రాహ్మణాధీనములు ద్రోవ బ్రహ్మవశమె?” (642) అని యిట్లు వామనుండు పలుక సత్యభంగ సందేహ విషదిగ్ధ శల్య నికృత్త హృదయుం డయ్యును విషణ్ణుండుఁ గాక వైరోచని ప్రసన్న వదనంబుతోడఁ జిన్ని ప్రోడ వడుగున కి ట్లనియె. (643) ”సూనృతంబుఁ గాని సుడియదు నా జిహ్వ¯ బొంకఁజాల; నాకు బొంకు లేదు; ¯ నీ తృతీయపదము నిజము నా శిరమున¯ నెలవు సేసి పెట్టు నిర్మలాత్మ! (644) నిరయమునకుఁ బ్రాప్త నిగ్రహంబునకును¯ బదవిహీనతకును బంధనమున¯ కర్థ భంగమునకు నఖిల దుఃఖమునకు¯ వెఱవ దేవ! బొంక వెఱచినట్లు. (645) అదియునుం గాక. (646) తల్లిదండ్రులు నన్నదమ్ములు చెలికాండ్రు¯ గురువులు శిక్షింపఁ గొఱతపడునె? ¯ పిదప మేలగుఁ గాక; పృథుమదాంధులకును¯ దానవులకు మాకుఁ దఱియెఱింగి¯ విభ్రంశచక్షువు వెలయ నిచ్చుటఁ జేసి¯ గురువులలోనాదిగురువ వీవ; ¯ నీవు బంధించిన నిగ్రహమో లజ్జ¯ యో నష్టియో బాధయో తలంప (646.1) నిన్నునెదిరించి పోరాడి నిర్జరాదు¯ లాదియోగీంద్రు లందెడు నట్టి టెంకి¯ నందరే తొల్లి పెక్కండ్రు? హర్షమూర్తి! ¯ యీశ! నీ యెడ దుర్లభ మేమి కలదు? (647) చెలియే మృత్యువు? చుట్టమే యముఁడు? సంసేవార్థులే కింకరుల్? ¯ శిలలం జేసెనె బ్రహ్మదన్ను? దృఢమే జీవంబు? నో చెల్లరే; ¯ చలితం బౌట యెఱుంగ కీ కపట సంసారంబు నిక్కంబుగాఁ¯ దలఁచున్ మూఢుఁడు సత్యదాన కరుణాధర్మాదినిర్ముక్తుఁడై. (648) చుట్టాలు దొంగలు సుతులు ఋణస్థులు; ¯ కాంతలు సంసార కారణములు; ¯ ధనము లస్థిరములు; దను వతి చంచల¯ గార్యార్థు లన్యులు; గడచుఁగాల¯ మాయువు; సత్వర మైశ్వర్య మతి శీఘ్ర¯ మని కాదె తమ తండ్రి నతకరించి¯ మా తాత సాధుసమ్మతుఁడు ప్రహ్లాదుండు¯ నీ పాదకమలంబు నియతిఁ జేరె (648.1) భద్రుఁ డతనికి మృతి లేని బ్రతుకుఁ గలిగె¯ వైరులై కాని తొల్లి మా వారుఁ గాన¯ రర్థివై వచ్చి నీవు న న్నడుగు టెల్ల¯ బద్మలోచన! నా పుణ్య ఫలము గాదె?” (649) అని యిట్లు పలుకుచున్న యవసరంబున. (650) ఆ దైత్యేంద్రుఁడు పీనవక్షు, నవపద్మాక్షుం, బిశంగాంబరా¯ చ్ఛాదున్నిర్మలసాధువాదు. ఘనసంసారాదివిచ్ఛేదు. సం¯ శ్రీదున్,భక్తిలతాధిరోహిత హరిశ్రీపాదు, నిఃఖేదుఁ, బ్ర¯ హ్లాదున్బోధకళావినోదుఁ గనియెన్ హర్షంబుతో ముందటన్.
ప్రహ్లా దాగమనము
(651) ఇట్లు సమాగతుండైన తమ తాతం గనుఁగొని విరోచన నందనుండు వారుణపాశబద్ధుండుఁ గావునఁ దనకుం దగిన నమస్కారంబు జేయ రామింజేసి సంకులాశ్రువిలోల లోచనుండై సిగ్గుపడి నత శిరస్కుండై నమ్రభావంబున మ్రొక్కు చెల్లించె; నంతఁ బ్రహ్లాదుఁడు ముఖమండపంబున సునందాది పరిచర సమేతుండై కూర్చున్న వామనదేవునిం గని యానంద బాష్పజలంబులుఁ బులకాంకురంబులున్ నెఱయ దండప్రణామం బాచరించి యిట్లని విన్నవించె. (652) ”ఇతనికి మున్ను నీ వింద్రపదం బిచ్చి¯ నేఁడు త్రిప్పుటయును నెఱయమేలు¯ మోహనా హంకృతి మూలంబు గర్వాంధ¯ తమస వికారంబు దాని మాన్పి¯ కరుణ రక్షించుటఁగాక బంధించుటే?¯ తత్త్వజ్ఞునకు మహేంద్రత్వమేల? ¯ నీ పాదకమలంబు నియతిఁ గొల్చిన దాని¯ బోలునే సురరాజ్య భోగపరత? (652.1) గర్వ మేపారఁ గన్నులు గానరావు; ¯ చెవులు వినరావు; చిత్తంబు చిక్కుపడును; ¯ మఱచు నీ సేవలన్నియు మహిమ మాన్పి¯ మేలు చేసితి నీ మేటి మేర చూపి.” (653) అని పలికి జగదీశ్వరుండును నిఖిలలోక సాక్షియు నగు నారాయణ దేవునకు నమస్కరించి, ప్రహ్లాదుండు పలుకుచున్న సమయంబున. (654) తతమత్తద్విపయాన యై కుచ నిరుంధచ్ఛోళ సంవ్యానయై¯ ధృతభాష్పాంబు వితాన యై కరయుగాధీ నాలికస్థానయై¯ ”పతిభిక్షాం మమ దేహి కోమలమతే! పద్మాపతే!” యంచుఁ ద¯ త్సతివింధ్యావళి చేరవచ్చెఁ ద్రిజగద్రక్షామనున్ వామనున్. (655) వచ్చి యచ్చేడియ తచ్చరణ సమీపంబునం బ్రణతయై నిలువంబడి యిట్లనియె. (656) ”నీకుంగ్రీడార్థము లగు¯ లోకంబులఁ జూచి పరులు లోకులు కుమతుల్¯ లోకాధీశుల మందురు¯ లోకములకు రాజవీవ లోకస్తుత్యా! (657) కా దనఁడు పొమ్ము లే దీ¯ రా దనఁడు జగత్త్ర యైక రాజ్యము నిచ్చెన్¯ నా దయితుఁ గట్టనేటికి? ¯ శ్రీదయితాచిత్తచోర! శ్రితమందారా!”
హిరణ్యగ ర్భాగమనము
(658) అని యిట్లు వింధ్యావళియుం బ్రహ్లాదుండును విన్నవించు నవసరంబున హిరణ్యగర్భుండు చనుదెంచి యిట్లనియె. (659) ”భూతలోకేశ్వర! భూతభావన! దేవ¯ దేవ! జగన్నాథ! దేవవంద్య! ¯ తన సొమ్ము సకలంబుఁ దప్పక నీ కిచ్చె¯ దండయోగ్యుఁడు గాడు దానపరుఁడుఁ; ¯ గరుణింప నర్హుండు గమలలోచన! నీకు¯ విడిపింపు మీతని వెఱపు దీర; ¯ తోయపూరము చల్లి దూర్వాంకురంబులఁ¯ జేరి నీ పదము లర్చించునట్టి (659.1) భక్తియుక్తుఁడు లోకేశుపదము నందు¯ నీవు ప్రత్యక్షముగ వచ్చి నేఁడు వేఁడ¯ నెఱిఁగి తన రాజ్య మంతయు నిచ్చి నట్టి¯ బలికిఁ దగునయ్య! దృఢపాశబంధనంబు?” (660) అని పలికిన బ్రహ్మవచనంబులు విని భగవంతుం డిట్లనియె. (661) ”ఎవ్వనిఁ గరుణింప నిచ్ఛయించితి వాని¯ యఖిల విత్తంబు నే నపహరింతు¯ సంసార గురుమద స్తబ్ధుఁడై యెవ్వఁడు¯ దెగడి లోకము నన్ను ధిక్కరించు¯ నతఁ డెల్ల కాలంబు నఖిల యోనుల యందుఁ¯ బుట్టుచు దుర్గతిఁ బొందుఁ బిదప¯ విత్త వయో రూప విద్యా బలైశ్వర్య¯ కర్మ జన్మంబుల గర్వ ముడిగి (661.1) యేక విధమున విమలుఁడై యెవ్వఁ డుండు¯ వాఁడు నా కూర్చి రక్షింపవలయువాఁడు; ¯ స్తంభ లోభాభిమాన సంసార విభవ¯ మత్తుఁడై చెడ నొల్లఁడు మత్పరుండు. (662) బద్ధుండై గురుశాపతప్తుఁడయి తా బంధువ్రజత్యక్తుఁడై¯ సిద్ధైశ్వర్యముఁ గోలుపోయి విభవక్షీణుండునై పేదయై¯ శుద్ధత్వంబును సత్యముం గరుణయున్ సొంపేమియుం దప్పఁ డు¯ ద్బుద్ధుండై యజయాఖ్యమాయ గెలిచెం బుణ్యుం డితం డల్పుఁడే. (663) అసురనాథుఁ డనుచు ననఘుని మర్యాద¯ యేను జూత మనుచు నింత వలుక¯ నిజము పలికె నితఁడు నిర్మలాచారుండు¯ మేలుమేలు నాకు మెచ్చువచ్చు.