పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 2 : సప్తమ 408 - 444

వర్ణాశ్రమ ధర్మంబులు

(408) "అనఘాత్మ! సకల వర్ణాశ్రమాచార స¯ మ్మత ధర్మ మెయ్యది మానవులకు? ¯ నే ధర్మమున నరుం డిద్ధ విజ్ఞానము¯ భక్తియుఁ బ్రాపించుఁ? బద్మజునకు¯ సాక్షాత్సుతుండవు సర్వజ్ఞుఁడవు నీకు¯ నెఱుఁగరానిది ధర్మ మింత లేదు; ¯ నారాయణపరాయణ స్వాంతు లనఘులు¯ శాంతులు సదయులు సాధువృత్తి (408.1) మెఱయుచున్న ఘనులు మీవంటి వా రెద్ది¯ పరమధర్మ మనుచు భక్తిఁ దలఁతు¯ రట్టి ధర్మరూప మఖిలంబు నెఱిఁగింపు; ¯ వినఁగ నిచ్ఛ గలఁదు విమలచరిత!" (409) అనిన నారదుండు ధర్మరాజుం జూచి "దాక్షాయణి యందు నిజాంశంబున నవతరించి భువన శోభనంబు కొఱకు బదరికాశ్రమంబునఁ దపోనిరతుండయి యున్న నారాయణునివలన సనాతనంబగు ధర్మంబు వింటి; నది చెప్పెద; సకల వర్ణంబుల జనులకు సత్యంబును, దయయును, నుపవాసాది తపంబును, శౌచంబును, సైరణయును, సదసద్వివేకంబును, మనోనియమంబును, బహిరింద్రియ జయంబును, హింసలేమియును, బ్రహ్మచర్యంబును, దానంబును, యథోచితజపంబును, సంతోషంబును, మార్దవంబును, సమదర్శనంబును, మహాజనసేవయు, గ్రామ్యంబులయిన కోరికలు మానుటయు, నిష్ఫలక్రియలు విడుచుటయు, మితభాషిత్వంబును, దేహంబు గాని తన్ను వెదకికొనుటయు, నన్నోదకంబులు ప్రాణులకుం బంచి యిచ్చుటయుఁ, బ్రాణులందు దేవతాబుద్ధియు, నాత్మబుద్ధింజేయుటయు, శ్రీనారాయణచరణస్మరణ కీర్తన శ్రవణ సేవార్చన నమస్కార దాస్యాత్మసమర్పణ సఖ్యంబు లనియెడి త్రింశల్లక్షణంబులు గలుగ వలయు; నందు సత్కులాచారుం డయి మంత్రవంతంబు లయిన గర్భాదానాదిసంస్కారంబు లవిచ్ఛిన్నంబులుగాఁ గలవాఁడు ద్విజుండు ద్విజునకు యజన యాజనాధ్యయ నాధ్యాపన దానప్రతిగ్రహంబు లను షట్కర్మంబులు విహితంబులు రాజునకుఁ బ్రతిగ్రహ వ్యతిరిక్తంబు లయిన యజనాది కర్మంబులయిదును బ్రజాపాలనంబును బ్రాహ్మణులుగానివారివలన దండశుల్కాదులు గొనుటయు విహిత కర్మంబులు; వైశ్యునికిఁ గృషి వాణిజ్య గోరక్షణాది కర్మంబులును బ్రాహ్మణకులానుసరణంబులును విహితంబులు; శూద్రునకు ద్విజ శుశ్రూష జేయవలయు. (410) విను కర్షణాదికవృత్తికంటెను మేలు¯ యాచింపనొల్లని యట్టివృత్తి; ¯ ప్రాప్తంబు గైకొని బ్రతుకుకంటెను లెస్స¯ యనుదినంబును ధాన్య మడిగికొనుట; ¯ యాయవారముకంటె నధిక కళ్యాణంబు¯ పఱిగ యెన్నుల ధాన్యభక్షణంబు; ¯ శిలవృత్తికంటెను శ్రేయ మాపణముల¯ బడ్డగింజలు దిని బ్రదుకుఁ గనుట (410.1) యెడరుచోట నృపతి కీ నాల్గువృత్తులుఁ¯ దగుఁ; బ్రతిగ్రహంబు దగదు; తలఁప¯ నాపదవసరముల నధముఁ డెక్కువజాతి¯ వృత్తి నున్న దోషవిధము గాదు. (411) వినుము; శిలవృత్తియు నుంఛవృత్తియు ఋత మనియు, నయాచిత వృత్తి యమృతమనియు, యాచ్నావృత్తి మృతమనియుఁ, గర్షకవృత్తి ప్రమృత మనియు నెన్నుదురు; అట్టి వృత్తు లెఱింగి జీవించుట మేలు; వాణిజ్యంబు సత్యానృతమనియు; శ్వవృత్తి నీచసేవ యనియుఁ బలుకుదురు; సర్వవేదమయుండు బ్రాహ్మణుండు; సర్వదేవ మయుండు క్షత్రియుండు; బ్రాహ్మణ క్షత్రియులకు నీచసేవనంబు కర్తవ్యంబు గాదు. (412) దమమును శౌచముఁ దపమును¯ శమమును మార్దవముఁ గృపయు సత్యజ్ఞాన¯ క్షమలును హరిభక్తియు హ¯ ర్షము నిజలక్షణము లగ్రజాతికి నధిపా! (413) శౌర్యము దానశీలముఁ బ్రసాదము నాత్మజయంబుఁ దేజమున్¯ ధైర్యము దేవభక్తియును ధర్మము నర్థముఁ గామమున్ బుధా¯ చార్యముకుందసేవలును సత్కృతియుం బరితోషణంబు స¯ ద్వీర్యము రక్షణంబుఁ బృథివీవరశేఖర! రాజచిహ్నముల్. (414) ధర్మార్థకామవాంఛయు¯ నిర్మల గురుదేవ విప్ర నివహార్చనముల్¯ నిర్మదభావముఁ బ్రమదము¯ శర్మకరత్వమును వైశ్యజన లక్షణముల్. (415) స్తేయము లేనివృత్తియు శుచిత్వము సన్నుతియున్ నిజేశులన్¯ మాయలు లేక డాయుటయు మంత్రము జెప్పక పంచయజ్ఞముల్¯ చేయుటయున్ ధరామరుల సేవయు గోవులరక్షణంబు న¯ న్యాయము లేమియున్ మనుజనాథ! యెఱుంగుము శూద్రధర్మముల్. (416) నిలయము పాటించి నిర్మలదేహ యై¯ శృంగార మేప్రొద్దుఁ జేయవలయు¯ సత్యప్రియాలాపచతురయై ప్రాణేశు¯ చిత్తంబు ప్రేమ రంజింపవలయు¯ దాక్షిణ్య సంతోష ధర్మ మేధాదుల¯ దైవత మని ప్రియుఁ దలఁపవలయు¯ నాథుఁ డే పద్ధతి నడచు నా పద్ధతి¯ నడచి తద్బంధుల నడపవలయు (416.1) మార్దవమునఁ బతికి మజ్జన భోజన¯ శయన పాన రతులు జరపవలయు¯ విభుఁడు పతితుఁడైన వెలఁది పాతివ్రత్య¯ మహిమఁ బుణ్యుఁ జేసి మనుపవలయు. (417) తరుణి దన ప్రాణవల్లభు¯ హరిభావముగా భజించి యతఁడున్ తానున్¯ సిరికైవడి వర్తించును¯ హరిలోకము నందు సంతతానందమునన్. (418) ఉపవాసంబులు వ్రతములు¯ దపములు వేయేల భర్త దైవత మని ని¯ ష్కపటతఁ గొల్చిన సాధ్వికి¯ నృపవర! దుర్లభము లేదు నిఖిలజగములన్. (419) మఱియు సంకరజాతు లయిన రజక చర్మకారక నట బురడ కైవర్తక మ్లేచ్ఛ భిల్లు లను నంత్యజాతు లేడ్వురకును జండాల పుల్కస మాతంగ జాతులకును నాయా కులాగతంబు లైన వృత్తులఁ జౌర్యహింసాదులు వర్జించి సంచరింపవలయు; మానవులకుఁ బ్రతియుగంబున నైసర్గికంబులైన ధర్మంబులు రెండు లోకంబు లందును సుఖకరంబు లని వేదవిదులైన పెద్దలు చెప్పుదురు; కారుకారున దున్నెడు క్షేత్రంబు లావు చెడు; నందు జల్లిన బీజంబులు నిస్తేజంబు లై యుండి లెస్సగ నంకురింపవు; నిరంతర ఘృతధారావర్షంబున దహనునకు దాహకత్వంబు లేక శాంతిం జెందు; నందు వేల్చిన హవ్యంబులు ఫలింపవు; తద్విధంబున ననవరత కామానుసంధానంబునఁ గామోన్ముఖంబైన చిత్తంబు కామంబులం దనిసి నిష్కా మంబై విరక్తి నొందుం; గావున సత్త్వస్వభావంబుతోడ నెప్పుడుఁ దప్పక నిజవంశానుగత విహితధర్మంబున వర్తించు నరుండు మెల్లన స్వాభావిక కర్మపరత్వంబు విడిచి ముక్తి నొందు; జాతి మాత్రంబునఁ బురుషునికి వర్ణంబు నిర్దేశింపం బనిలేదు; శమదమాది వర్ణలక్షణ వ్యవహారంబులఁ గనవలయు"నని మఱియు నారదుం డిట్లనియె. (420) క్రమమున వర్ణంబుల చి¯ హ్నము లెల్లను జెప్పఁబడియె నాశ్రమముల ధ¯ ర్మము లెఱిఁగించెద నన్నియు¯ సమదాహిత హృదయశూల! సదమలశీలా! (421) వినుము; బ్రహ్మచారి మౌంజీ కౌపీన యజ్ఞోపవీత కృష్ణాజిన పాలాశ దండ కమండలు ధరుండును, సంస్కారహీన శిరోరుహుండును, దర్భహస్తుండును, శీలప్రశస్తుండును, మౌనియు నై త్రిసంధ్యంబును బ్రహ్మగాయత్రి జపియించుచు సాయంప్రాతరవసరంబులు నర్క పావక గురు దేవతోపాసనంబులు చేయుచు గురుమందిరంబునకుం జని దాసుని చందంబున భక్తి వినయ సౌమనస్యంబులు గలిగి వేదంబు చదువుచు నధ్యయ నోపక్రమావసానంబుల గురుచరణంబులకు నమస్కరించుచు రేపుమాపును విహిత గృహంబుల భిక్షించి భైక్ష్యంబు గురువునకు నివేదించి యనుజ్ఞ గొని మితభోజనంబు కావించుచు నర్హకాలంబుల నుపవసించుచు నంగనలందు నంగనాసక్తులందుం బ్రయోజనమాత్ర భాషణంబు లొనర్చుచు గురు పరాంగనలవలన నభ్యంగ కేశప్రసాధన శరీరమర్దన మజ్జన రహస్య యోగంబులు వర్జించుచు గృహంబున నుండక జితేంద్రియత్వంబున సత్యభాషణుం డయి సంచరింపవలయు. (422) పొలఁతి దావవహ్ని పురుషుఁ డాజ్యఘటంబు¯ కరఁగ కుండ రాదు కదిసెనేని ¯ బ్రహ్మ యైనఁ కూఁతుఁ బట్టకమానఁడు¯ వడుగు కింతి పొత్తు వలదు వలదు. (423) వినుము; స్వరూపసాక్షాత్కారంబున దేహి బహిరింద్రియాదికం బయిన యింతయు నాభాసమాత్రంబుగా నిశ్చయించి యెందాఁక జీవుండు స్వతంత్రుఁ డయిన యీశ్వరుండు గాకుండు నంతదడవు నంగన యిది పురుషుండ నే ననియెడి భేదబుద్ధి మానుట కర్తవ్యంబు గాదు; బ్రహ్మచారి యతి గృహస్థులం దెవ్వఁ డైనఁ జిత్తంబు పరిపక్వంబు గాక యద్వైతానుసంధానంబుజేసిన మూఢుండగుంగావున రహస్యంబునఁ బుత్రిక నైనం డాయకుండవలయు. (424) శిరమున మేన సంస్కృతులు చేయక చందనభూషణాద్యలం¯ కరణము లెల్ల మాని ఋతుకాలములన్ నిజభార్యఁ బొందుచుం¯ దరుణుల జూడఁ బాఱక ధృతవ్రతుఁడై మధు మాంస వర్జి యై¯ గురుతరవృత్తితో మెలఁగు కోవిదుఁ డొక్క గృహస్థు భూవరా! (425) మఱియు ద్విజుండు గృహస్థుండై గురువువలన నుపనిషదంగ సహితంబైన వేదత్రయంబును బఠియించి నిజాధికారానుసారంబుగ నర్థవిచారంబు జేసి తన బలంబుకొలంది గురువులకు నభీష్టంబు లొసంగి గృహంబున నొండె వనంబున నొండె నైష్ఠికత్వంబు నాశ్రయించి యొండె బ్రాణులతోడ జీవించుచు గురువు నందు నగ్ని యందు నాత్మ యందు సర్వభూతంబు లందు నచ్యుతదర్శనంబు జేయుచు నింద్రియవ్యసనాది మగ్నుండుగాక యెఱుక గలిగి వర్తించుచు పరబ్రహ్మంబు నొందు. (426) వినుము; వనప్రస్థునకున్¯ మునికథితము లైన నియమములు గల వా చొ¯ ప్పున వనగతుఁడై మెలఁగెడి¯ ఘనుఁడు మహర్లోకమునకు గమనించు నృపా! (427) అటమీఁద, గృహస్థాశ్రమంబు విడిచి వనంబునకుం జని దున్నక పండెడి నీవారాదికంబు లగ్నిపక్వంబు జేసి యొండె, నామంబులు చేసి యొండె, నర్కపక్వంబులైన ఫలాదు లొండె, భక్షింపుచు; వన్యాహారంబుల నిత్యకృత్యంబులయిన చరుపురోడాంశంబు లొనర్చుచుఁ; బ్రతిదినంబును బూర్వ సంచితంబులు పరిత్యజించి నూతన ద్రవ్యంబులు సంగ్రహించుచు; నగ్నికొఱకుఁ బర్ణశాల యైనఁ బర్వతకందరం బయిన నాశ్రయించుచు; హిమ, వాయు, వహ్ని, వర్షాతపంబులకు సహించుచు; నఖ, శ్మశ్రు, కేశ, తనూరుహంబులు ప్రసాధితంబులు జేయక జటిలుండై వసియించుచు; దండాజిన, కమండలు, వల్కల పరిచ్ఛదంబులు ధరియించి; పండ్రెండైన, నెనిమిదైన, నాలుగైన, రెండైన, నొక వత్సరంబయినఁ దపః ప్రయాసంబున బుద్ధి నాశంబు గాకుండ ముని యై చరించుచు; దైవవశంబున జరారోగంబులచేతఁ జిక్కి నిజ ధర్మానుష్ఠాన సమర్థుండు గాని సమయంబున నిరశన వ్రతుం డయి యగ్నుల నాత్మారోపణంబు జేసి; సన్యసించి యాకాశంబు నందు శరీరరంధ్రంబులును, గాలి యందు నిశ్శ్వాసంబును, దేజంబు లోపల నూష్మంబును, జలంబుల రసంబును, ధరణి యందు శల్య మాంస ప్రముఖంబులును, వహ్ని యందు వ్యక్తంబుతోడ వాక్కును, నింద్రుని యందు శిల్పంబుతోడఁ గరంబులును, విష్ణుని యందు గతితోడఁ బదంబులును, బ్రజాపతి యందు రతితోడ నుపస్థంబును, మృత్యువందు విసర్గంబుతోడఁ బాయువును, దిక్కులందు శబ్దంబు తోడ శ్రోత్రంబును, వాయు వందు స్పర్శంబుతోడ ద్వక్కును, సూర్యు నందు రూపంబుతోడఁ జక్షువులును, సలిలంబు లందుఁ బ్రచేతస్స హిత యయిన జిహ్వయు, క్షితి యందు గంధ సహితం బయిన ఘ్రాణంబును, జంద్రుని యందు మనోరథంబులతోడ మనంబును, గవియైన బ్రహ్మ యందు బోధంబుతోడ బుద్ధియు, రుద్రుని యందహంకారంబుతోడ మమత్వంబును, క్షేత్రజ్ఞుని యందు సత్త్వంబు తోడ జిత్తంబును. బరంబు నందు గుణంబులతోడ వైకారికంబును, డిందించి; యటమీఁదఁ, బృథివిని జలంబునందు; జలంబును దేజంబు నందుఁ; దేజంబును వాయువు నందు; వాయువును గగనంబు నందు; గగనంబును నహంకారతత్త్వంబు నందు; నహంకారంబును మహత్తత్త్వంబు నందు; మహత్తత్త్వంబును బ్రకృతి యందు; బ్రకృతిని నక్షరుండైన పరమాత్మ యందు లయంబు నొందించి చిన్మాత్రావశేషితుం డయిన క్షేత్రజ్ఞుని నక్షరత్వంబున నెఱింగి ద్వయరహితుండై దగ్ధకాష్ఠుండైన వహ్ని చందంబున బరమాత్మ యైన నిర్వికారబ్రహ్మంబునందు లీనుండ గావలయు. (428) అనఘ! వనప్రస్థుండై¯ చని తద్ధర్మంబు లిట్లు సలుపుచు మఱియున్¯ మనెనేని సన్న్యసింపం¯ జను నటమీఁదటను ముక్త సంగత్వమునన్. (429) ఇట్లు వానప్రస్థాశ్రమంబు జరపి సన్న్యసించి దేహమాత్రావశిష్టుండును నిరపేక్షుండును భిక్షుండును నిరాశ్రయుండును నాత్మారాముండును సర్వభూతసముండును శాంతుండును సమచిత్తుండును నారాయణపరాయణుండును నై కౌపీనం బను నాచ్ఛాదకమాత్రం బయిన వస్త్రంబు ధరియించి దండాదివ్యతిరిక్తంబులు విసర్జించి యాత్మపరంబులుగాని శాస్త్రంబులు వర్జించి గ్రహనక్షత్రాది విద్యల జీవింపక భేదవాదంబులయిన తర్కంబులు దర్కింపక యెందును బక్షీకరింపక శిష్యులకు గ్రంథంబులు వంచించి యుపన్యసింపక బహువిద్యల జీవింపక మత్తాదివ్యాపారంబుల నుల్లసిల్లక పెక్కుదినంబు లొక్కయెడ వసియింపక యూరూర నొక్కొక్క రాత్రి నిలుచుచుఁ గార్యకారణవ్యతిరిక్తం బయిన పరమాత్మ యందు విశ్వంబు దర్శించుచు సదసన్మయంబయిన విశ్వంబు నందు బరబ్రహ్మంబయిన యాత్మ నవలోకించుచు జాగరణ స్వప్న సంధి సమయంబుల నాత్మనిరీక్షణంబు చేయుచు నాత్మకు బంధమోక్షణంబులు యామాత్రంబులుగాని వస్తుప్రకారంబున లేవనియును దేహంబునకు జీవితంబు ధ్రువంబు గాదనియును మృత్యువు ధ్రువంబనియును నెఱుంగుచు భూతదేహంబుల సంభవనాశంబులకు మూలంబయిన కాలంబు బ్రతీక్షించుచు నివ్విధంబున జ్ఞానోత్పత్తి పర్యంతంబుఁ జరియించి యటమీఁద విజ్ఞానవిశేషంబు సంభవించినఁ బరమహంసుండయి దండాదిచిహ్నంబులు ధరియించి యొండె ధరియింపక యొండె బహిరంగవ్యక్తచిహ్నుండు గాక యంతరంగవ్యక్తం బయిన యాత్మాను సంధానంబు గలిగి మనీషియై బాహ్యానుసంధాన భావంబున మనుష్యులకుఁ దనవలన నున్మత్త బాల మూకల తెఱంగుఁ జూపుచుండవలయు.

ప్రహ్లాదాజగర సంవాదము

(430) మునివల్లభుఁ డజగరుఁ డను¯ సునయుండు హిరణ్యకశిపు సూనుండును ము¯ న్నొనరించిన సంవాదము¯ వినుమీ యర్థంబునందు వెలయు నరేంద్రా! (431) తొల్లి భగవత్ప్రియుం డయిన ప్రహ్లాదుండు కతిపయామాత్య సమేతుండై లౌకికతత్వంబు నెఱింగెడికొఱకు లోకంబుల సంచరించుచు నొక్కనాఁడు కావేరీతీరంబున సహ్యపర్వతతటంబున ధూళిధూసరితంబు లయిన కరచరణాద్యవయవంబులతోడ గూఢంబైన నిర్మల తేజంబుతోఁ గర్మాకారవచోలింగ వర్ణాశ్రమాదుల నెవ్వరికి నెఱుంగఁ బడక నేల నిద్రించుచు నజగర వ్రతధరుండైన మునిం గని డాయం జని విధివత్ప్రకారంబున నర్చించి మునిచరణంబులకు శిరంబు మోపి మ్రొక్కి యతని చరిత్రంబు దెలియ నిచ్చయించి యిట్లనియె. (432) "భూమి నుద్యోగి యై భోగి యై యుండెడి¯ నరుని కైవడి మునినాథ! నీవు¯ ఘనశరీరము దాల్చి కదలవు చిత్ర ము¯ ద్యమయుక్తునకుఁ గాని ధనము లేదు¯ ధనవంతునకుఁ గాని తగు భోగములు లేవు¯ భోగికిఁ గాని సంపూర్ణమైన¯ తనువు లే దుద్యోగధనభోగములు లేక¯ నేల నూరక పడి నిద్ర పోవు (432.1) నీకు నెట్లు గలిగె నిరుపమ దేహంబు¯ సముఁడ వార్యుఁడవు విశారదుఁడవు¯ బుద్ధినిధివి జనులఁ బొగడవు దెగడవు¯ నిద్ర ప్రతిదినంబు నిలుప నేల?" (433) అని యిట్లు ప్రహ్లాదుం డడిగిన వికసితముఖుం డయి మునీంద్రుండు తదీయ మధురాలాపసుధారసప్రవాహంబులు కర్ణంబులఁ బరిపూర్ణంబులైన నతని నవలోకించి యిట్లనియె. (434) "ఆంతరంగికదృష్టి నంతయు నెఱుఁగుదు¯ వార్యసమ్మతుఁడ వీ వసురవర్య! ¯ విశ్వజంతువుల ప్రవృత్తి నివృత్తిల¯ క్షణముల నీ యెఱుంగనివి లేవు¯ భగవంతుఁ డగు హరి పాయక నీ మనో¯ వీథి రాజిల్లుచు వెలుఁగుఱేని ¯ క్రమమున బహుళాంధకారంబు బరిమార్చుఁ¯ బరమ సాత్వికుఁడవు భద్రబుద్ధి (434.1) వైన నీవు నన్ను నడిగెదు గావున¯ విన్న ధర్మ మెల్ల విస్తరింతు¯ నిన్నుఁ జూడఁ గలిగె నీతోడి మాటలు¯ నాత్మశుద్ధి గలిగె ననఘచరిత! (435) వినుము; ప్రవాహకారిణి యై విషయంబులచేతం బూరింపరాని తృష్ణచేతం బడి కర్మంబులఁ బరిభ్రామ్యమాణుండ నైన నేను నానావిధ యోనుల యందుఁ బ్రవేశించుచు వెడలుచు నెట్టకేలకు మనుష్య దేహంబు ధరియించి యందు ధర్మంబున స్వర్గద్వారంబును నధర్మంబున శునకసూకరాది తిర్యగ్జంతు యోని ద్వారంబుల నొంది క్రమ్మఱ మనుష్యుండై పుట్టవలయు నని వివేకించి సుఖరక్షణదుఃఖ మోక్షంబులకొఱకు ధర్మంబు చేయు దంపతుల వ్యవహారంబు గని సర్వక్రియానివృత్తి గలిగిన జీవుండు స్వతంత్రుండై ప్రకాశించు నని నిర్ణయించి భోగంబులు మనోరథజాత మాత్రంబులు గాని శాశ్వతంబులు గావని పరీక్షించి నివృత్తుండనై యుద్యోగంబు లేక నిద్రించుచుఁ బ్రారబ్దభోగంబు లననుభవించుచు నుండుదు; నివ్విధంబునఁ దనకు సుఖరూపంబైన పురుషార్థంబు దన యందుఁ గలుగుట యెఱుంగక పురుషుండు శైవాలజాల నిరుద్ధంబు లైన శుద్ధజలంబుల విడిచి యెండమావులు జలంబు లని పాఱెడు మూఢుని వడువున సత్యంబుగాని ద్వైతంబుఁ జొచ్చి ఘోరసంసారచక్ర పరిభ్రాంతుం డై, దైవతంత్రంబు లైన దేహాదులచేత నాత్మకు సుఖంబును దుఃఖనాశంబునుం గోరుచు నిరీశుం డైనవాని ప్రారంభంబులు నిష్ఫలంబు లగు; నదియునుం గాక మర్త్యునకు ధనంబు ప్రాప్తంబయిన నది దుఃఖకరంబు గాని సుఖకరంబు గాదు; లోభవంతు లయిన ధనవంతులు నిద్రాహారంబులు లేక రాజ చోర యాచక శత్రు మిత్రాది సర్వస్థలంబు లందును శంకించుచు దానభోగంబులు మఱచి యుండుదురు; ప్రాణార్థవంతులకు భయంబు నిత్యంబు; శోకమోహ భయక్రోధ రాగ శ్రమాదులు వాంఛామూలంబులు; వాంఛ లేకుండవలయును. (436) సరఘల్ గూర్చిన తేనె మానవులకున్ సంప్రాప్త మైనట్లు లో¯ భ రతుల్ గూర్చిన విత్తముల్ పరులకుం బ్రాపించుఁ బ్రాప్తాశి యై¯ తిరుగం బోని మహోరగంబు బ్రదుకున్ దీర్ఘాంగమై యుండియుం¯ జిరకాలం బగు వాని వర్తనములం జింతించి యేకాంతి నై. (437) అజగరమును జుంటీఁగయు¯ నిజగురువులుగాఁ దలంచి నిశ్చింతుఁడ నై¯ విజనస్థలిఁ గర్మంబుల¯ గజిబిజి లేకున్నవాఁడ గౌరవవృత్తిన్. (438) అజిన వల్కల దుకూలాంబరంబులు గట్టి¯ యైన గట్టక యైన నలరుచుందు; ¯ నాందోళికా రథ హయ నాగములనెక్కి¯ యైన నెక్కక యైన నరుగుచుందుఁ; ¯ గర్పూర చందన కస్తూరికా లేప¯ మైన భూరజ మైన నలదికొందు; ¯ భర్మశయ్యల నైనఁ బర్ణ శిలా తృణ¯ భస్మంబులం దైన బండు చుందు; (438.1) మానయుక్త మైన మానహీనం బైనఁ¯ దీయ నైన మిగులఁ దిక్త మైన¯ గుడుతు సగుణ మైన గుణవర్జితం బైన¯ నల్ప మైనఁ జాల నధిక మైన (439) లే దని యెవ్వరి నడుగను¯ రా దని చింతింపఁ బరులు రప్పించినచోఁ¯ గా దని యెద్దియు మానను¯ ఖేదము మోదమును లేక క్రీడింతు మదిన్. (440) నిందింప బరుల నెన్నఁడు¯ వందింప ననేక పీడ వచ్చిన మది నా¯ క్రందింప విభవముల కా¯ నందింపఁ బ్రకామ వర్తనంబున నధిపా! (441) ఇట్లు గోరికలు లేక యొక్క సమయంబున దిగంబరుఁడనై పిశాచంబు చందంబున నుండుచుఁ బెక్కు దినంబులుం గోలెఁ బెనుఁబాఁప వర్తనంబుఁ గైకొని నిమీలితలోచనత్వంబున నేకాంతభావంబు విష్ణుని యందు జేర్చి వికల్పంబు భేదగ్రాహకచిత్తవృత్తులఁ జిత్తంబు నర్థరూప విభ్రమంబు గల మనంబు నందు మనంబును నహంకారంబు నందు నహంకారంబును మాయ యందు మాయను నాత్మానుభూతి యందు లయంబు నొందించి సత్యంబు దర్శించుచు విరక్తి నొంది స్వానుభవంబున నాత్మస్థితుండనై యుండుదు; నీవు భగవత్పరుండవు గావున రహస్యం బైన పరమహంసధర్మంబు స్వానుభవగోచరం బైన తెఱంగున నీకు హృద్గోచరంబగు నట్లు చెప్పితి"ననిన విని. (442) ఘను నజగరమునివల్లభు¯ దనుజేంద్రుఁడు పూజ చేసి తగ వీడ్కొని నె¯ మ్మనమున సంతోషించుచుఁ¯ జనియెన్ నిజ గేహమునకు శశికులతిలకా! (443) అనిన యుధిష్ఠరుం డిట్లనియె. (444) ననుఁ బోటి జడగృహస్థుఁడు¯ మునివల్లభ! యిట్టి పదవి మోదంబున నే¯ యనువునఁ జెందును వేగమ¯ వినిపింపుము నేఁడు నాకు విజ్ఞాననిధీ!