పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 2 : సప్తమ 349 - 407

ప్రహ్లాదుడు స్తుతించుట

(349) "అమరుల్ సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాదుల్ సతాత్పర్య చి¯ త్తములన్ నిన్ను బహుప్రకారముల నిత్యంబున్ విచారించి పా¯ రము ముట్టన్ నుతిచేయ నోపరఁట; నే రక్షస్తనూజుండ గ¯ ర్వమదోద్రిక్తుఁడ బాలుఁడన్ జడమతిన్ వర్ణింప శక్తుండనే? (350) తపమున్ వంశముఁ దేజమున్ శ్రుతము సౌందర్యంబు నుద్యోగమున్¯ నిపుణత్వంబుఁ బ్రతాపపౌరుషములున్ నిష్ఠాబలప్రజ్ఞలున్¯ జపహోమంబులుఁ జాల వీశ్వర! భవత్సంతుష్టికై దంతి యూ¯ థఁపు చందంబున భక్తి జేయవలయుం దాత్పర్య సంయుక్తుఁడై. (351) అమలజ్ఞాన సుదాన ధర్మరతి సత్యక్షాంతి నిర్మత్సర¯ త్వములన్ యజ్ఞ తపోనసూయలఁ గడున్ దర్పించు ధాత్రీసురో¯ త్తముకంటెన్ శ్వపచుండు ముఖ్యుఁడు మనోర్థ ప్రాణ వాక్కర్మముల్¯ సమతన్ నిన్ను నయించెనేని, నిజ వంశ శ్రీకరుం డౌఁ దుదిన్. (352) అజ్ఞుండు చేసిన యారాధనములఁ జే¯ పట్టఁ డీశ్వరుఁడు కృపాళుఁ డగుటఁ; ¯ జేపట్టు నొకచోట; సిద్ధ మీశ్వరునకు¯ నర్థంబు లేకుండు నతఁడు పూర్ణు¯ డైన నర్థము లీశ్వరార్పణంబులు గాఁగఁ¯ జేయుట ధర్మంబు; చేసెనేని¯ నద్దంబుఁ జూచిన నళికలలామంబు¯ ప్రతిబింబితం బగు పగిది మరల (352.1) నర్థములు దోఁచుఁ; గావున నధికబుద్ధి¯ భక్తి జేయంగవలయును భక్తిఁ గాని¯ మెచ్ఛఁ డర్థంబు లొసఁగెడు మేరలందుఁ¯ బరమ కరుణుండు హరి భక్తబాంధవుండు. (353) కావున నల్పుఁడ సంస్తుతి¯ గావించెద వెఱపు లేక కలనేరుపునన్; ¯ నీ వర్ణనమున ముక్తికిఁ¯ బోవు నవిద్యను జయించి పురుషుఁ డనంతా! (354) సత్త్వాకరుఁడ వైన సర్వేశ! నీ యాజ్ఞ¯ శిరముల నిడుకొని చేయువారు ¯ బ్రహ్మాదు లమరులు భయ మందుచున్నారు¯ నీ భీషణాకృతి నేఁడు చూచి; ¯ రోషంబు మాను నీ రుచిరవిగ్రహములు¯ కల్యాణకరములు గాని భీతి¯ కరములు గావు లోకములకు వృశ్చిక¯ పన్నగంబుల భంగి భయముఁ జేయు (354.1) నసుర మర్దించితివి; సాధుహర్ష మయ్యె; ¯ నవతరించిన పనిదీఱె నలుక యేల? ¯ కలుషహారివి సంతోషకారి వనుచు¯ నిన్నుఁ దలఁతురు లోకులు నిర్మలాత్మ! (355) ఖరదంష్ట్రా భ్రుకుటీ సటా నఖయు నుగ్రధ్వానయున్ రక్త కే¯ సరయున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్నేత్రయున్నైన నీ¯ నరసింహాకృతిఁ జూచి నే వెఱవఁ బూర్ణ క్రూర దుర్వార దు¯ ర్భర సంసారదవాగ్నికిన్ వెఱతు నీ పాదాశ్రయుం జేయవే. (356) దేవా! సకల యోను లందును సుఖవియోగ దుఃఖసంయోగ సంజనితంబైన శోకానలంబున దందహ్యమానుండనై దుఃఖనివారకంబు గాని దేహాద్యభిమానంబున మోహితుండనై పరిభ్రమించుచున్న యేను నాకుం బ్రియుండవు సఖుండవుఁ బరదేవతవు నైన నీవగు బ్రహ్మగీతంబు లయిన లీలావతార కథావిశేషంబులఁ బఠియించుచు రాగాదినిర్ముక్తుండనై దుఃఖపుంజంబులఁ దరియించి భవదీయ చరణకమల స్మరణ సేవానిపుణులైన భక్తులం జేరి యుండెద; బాలునిఁ దల్లిదండ్రులును, రోగిని వైద్యదత్తంబయిన యౌషధంబును, సముద్రంబున మునింగెడు వాని నావయును, దక్కొరులు రక్షింపనేరని తెఱంగున సంసారతాప సంతప్యమానుండై నీచేత నుపేక్షితుం డయిన వాని నుద్ధరింప నీవు దక్క నన్యుండు సమర్థుండు గాఁడు; జగంబుల నెవ్వం డేమి కృత్యంబు నెవ్వనిచేతం బ్రేరితుండై యే యింద్రియంబులం జేసి యేమిటి కొఱకు నెవ్వనికి సంబంధి యై యే స్థలంబున నే సమయంబునం దేమి రూపంబున నే గుణంబున నపరంబయిన జనకాది భావంబున నుత్పాదించి పరంబయిన బ్రహ్మాదిభావంబున రూపాంతరంబు నొందించు నట్టి వివిధప్రకారంబు లన్నియు నిత్యముక్తుండవు రక్షకుండవు నైన నీవ; నీ యంశంబైన పురుషునికి నీ యనుగ్రహంబునఁ గాలంబుచేతం బ్రేరితయై కర్మమయంబును బలయుతంబును బ్రధానలింగంబును నైన మనంబును నీ మాయ సృజియించు; నవిద్యార్పితవికారంబును వేదోక్తకర్మప్రధానంబును సంసారచక్రాత్మకంబైన యీ మనమున నిన్ను సేవింపక నియమించి తరియింప నొక్కరుండును సమర్థుండు లేడు; విజ్ఞాననిర్జిత బుద్ధిగుణుండవు; నీ వలన వశీకృత కార్యసాధన శక్తి యైన కాలంబు మాయతోడం గూడ షోడశవికారయుక్తం బయిన సంసారచక్రంబుఁ జేయుచుండు; సంసారదావదహన తంతప్యమానుండ నగు నన్ను రక్షింపుము. (357) జనులు దిక్పాలుర సంపదాయుర్విభ¯ వములు గోరుదురు భవ్యంబు లనుచు; ¯ నవి యంతయును రోషహాసజృంభితమైన¯ మాతండ్రి బొమముడి మహిమఁ జేసి¯ విహతంబులగు; నట్టి వీరుండు నీ చేత¯ నిమిషమాత్రంబున నేఁడు మడిసె; ¯ కావున ధ్రువములు గావు బ్రహ్మాదుల¯ శ్రీవిభవంబులు జీవితములుఁ; (357.1) గాలరూపకుఁ డగు నురుక్రమునిచేత¯ విదళితములగు; నిలువవు; వేయు నేల?¯ యితర మే నొల్ల నీ మీఁది యెఱుక గొంత¯ గలిగియున్నది గొలుతుఁ గింకరుఁడ నగుచు. (358) ఎండమావులవంటి భద్రము లెల్ల సార్థము లంచు మ¯ ర్త్యుండు రోగనిధాన దేహముతో విరక్తుఁ డుగాక యు¯ ద్దండ మన్మథవహ్ని నెప్పుడుఁ దప్తుఁడై యొకనాఁడుఁ జే¯ రండు పారము దుష్టసౌఖ్య పరంపరాక్రమణంబునన్. (359) శ్రీమహిళా, మహేశ, సరసీరుహగర్భుల కైన నీ మహో¯ ద్దామకరంబుచే నభయదానము జేయవు; నేను బాలుఁడం¯ దామస వంశ సంభవుఁడ దైత్యుఁడ నుగ్ర రజోగుణుండ ని¯ స్సీమ దయం గరాంబుజము శీర్షముఁజేర్చుట చోద్య మీశ్వరా! (360) మహాత్మా! సుజనులయిన బ్రహ్మాదు లందును దుర్జనులైన మా యందును సేవానురూపంబుగం బక్షాపక్షంబులు లేక కల్పవృక్షంబు చందంబున ఫలప్రదానంబు జేయుదువు; కందర్ప సమేతం బగు సంసారకూపంబునం గూలుచున్న మూఢజనులం గూడి కూలెడు నేను భవదీయభృత్యుం డగు నారదుని యనుగ్రహంబునం జేసి నీ కృపకుం బాత్రుండ నైతి; నన్ను రక్షించి మజ్జనకుని వధియించుట నా యందులఁ బక్షపాతంబు గాదు; దుష్టదనుజ సంహారంబును శిష్ట భృత్య మునిజన రక్షాప్రకారంబును నీకు నైజగుణంబులు; విశ్వంబు నీవ; గుణాత్మకం బయిన విశ్వంబు సృజియించి యందుం బ్రవేశించి హేతుభూతగుణయుక్తుండవై రక్షకసంహారకారాది నానారూపంబుల నుండుదువు; సదసత్కారణకార్యాత్మకం బయిన విశ్వంబునకు పరమకారణంబు నీవ; నీ మాయచేత వీఁడు దా ననియెడి బుద్ధి వికల్పంబు దోఁచుగాని నీకంటె నొండెద్దియు లేదు; బీజంబు నందు వస్తుమాత్రభూత సౌక్ష్మ్యంబును వృక్షంబు నందు నీలత్వాది వర్ణంబునుం గలుగు తెఱంగున; విశ్వంబునకు నీ యంద జన్మ స్థితి ప్రకాశ నాశంబులుం గలుగు; నీ చేత నయిన విశ్వంబు నీ యంద నిలుపు కొని తొల్లి ప్రళయకాలపారావారంబునఁ బన్నగేంద్రపర్యంకంబునఁ గ్రియారహితుండవై నిజసుఖానుభవంబు జేయుచు నిద్రితుని భంగి యోగనిమీలితలోచనుండవై మెలంగుచుఁ గొంత కాలంబునకు నిజ కాలశక్తిచేతం బ్రేరితంబులై ప్రకృతిధర్మంబు లయిన సత్త్వాదిగుణంబుల నంగీకరించి సమాధిచాలించి విలసించుచున్న నీనాభి యందు వటబీజంబువలన నుద్భవించు వటంబు తెఱంగున నొక్క కమలంబు సంభవించె; నట్టి కమలంబువలన నాల్గుమోముల బ్రహ్మ జన్మించి దిశలు వీక్షించి కమలంబునకు నొండయిన రూపంబు లేకుండుటఁ జింతించి జలాంతరాళంబుఁ బ్రవేశించి జలంబు లందు నూఱు దివ్యవత్సరంబులు వెదకి తన జన్మంబునకు నుపాదానకారణం బైన నిన్ను దర్శింప సమర్థుండు గాక, మగిడి కమలంబుకడకుం జని విస్మయంబు నొంది చిరకాలంబు నిర్భరతపంబు జేసి పృథివి యందు గంధంబు గను చందంబునఁ దన యందు నానాసహస్రవదన శిరో నయన నాసా కర్ణ వక్త్ర భుజ కర చరణుండును బహువిధాభరణుండును మాయాకలితుండును మహాలక్షణలక్షితుండును నిజప్రకాశదూరీకృత తముండును బురుషోత్తముండును నయిన నిన్ను దర్శించె; న య్యవసరంబున. (361) ఘోటకవదనుఁడ వై మధు¯ కైటభులం ద్రుంచి నిగమగణముల నెల్లం¯ బాటించి యజున కిచ్చిన¯ కూటస్థుఁడ వీశ్వరుఁడవు కోవిదవంద్యా! (362) ఇవ్విధంబున గృత త్రేతా ద్వాపరంబులను మూఁడు యుగంబు లందును దిర్యఙ్మానవ ముని జలచరాకారంబుల నవతరించి లోకంబుల నుద్ధరించుచు, ధరించుచు, హరించుచు యుగానుకూల ధర్మంబులం బ్రతిష్ఠించుచు నుండుదువు; దేవా! యవధరింపుము. (363) కామహర్షాది సంఘటితమై చిత్తంబు¯ భవదీయ చింతనపదవి చొరదు; ¯ మధురాదిరసముల మరగి చొక్కుచు జిహ్వ¯ నీ వర్ణనమునకు నిగుడనీదు; ¯ సుందరీముఖములఁ జూడఁగోరెడి జూడ్కి¯ తావకాకృతులపైఁ దగులుపడదు; ¯ వివిధ దుర్భాషలు వినఁ గోరు వీనులు¯ వినవు యుష్మత్కథావిరచనములు; (363.1) ఘ్రాణ మురవడిఁ దిరుగు దుర్గంధములకు¯ దవులు గొలుపదు వైష్ణవధర్మములకు; ¯ నడఁగి యుండవు కర్మేంద్రియములు పురుషుఁ¯ గలఁచు, సవతులు గృహమేధిఁ గలఁచు నట్లు. (364) ఇ వ్విధంబున నింద్రియంబులచేతఁ జిక్కుపడి స్వకీయ పరకీయ శరీరంబు లందు మిత్రామిత్ర భావంబులు జేయుచు జన్మమరణంబుల నొందుచు సంసారవైతరణీ నిమగ్నంబైన లోకంబు నుద్ధరింటుట లోక సంభవ స్థితి లయ కారణుండ వైన నీకుం గర్తవ్యంబు; భవదీయ సేవకులమైన మా యందుఁ బ్రియభక్తు లయిన వారల నుద్ధరింపుము. (365) భగవద్దివ్య గుణానువర్తన సుధాప్రాప్తైక చిత్తుండ నై¯ బెగడన్ సంసరణోగ్రవై తరణికిన్; భిన్నాత్ములై తావకీ¯ య గుణస్తోత్ర పరాఙ్ముఖత్వమున మాయాసౌఖ్యభావంబులన్¯ సుగతిం గానని మూఢులం గని మదిన్ శోకింతు సర్వేశ్వరా! (366) దేవా! మునీంద్రులు నిజవిముక్త కాములయి విజనస్థలంబులం దపంబు లాచరింతురు; కాముకత్వంబు నొల్లక యుండువారికి నీ కంటె నొండు శరణంబు లేదు గావున నిన్ను సేవించెదరు; కొందఱు కాముకులు కరద్వయ కండూతిచేతం దనియని చందంబునఁ దుచ్ఛంబయి పశు పక్షి క్రిమి కీట సామాన్యం బయిన మైథునాది గృహ మేది సుఖంబులం దనియక కడపట నతి దుఃఖవంతు లగుదురు; నీ ప్రసాదంబు గల సుగుణుండు నిష్కాముం డయియుండు. మౌనవ్రత జప తప శ్శ్రుతాధ్యయనంబులును నిజధర్మవ్యాఖ్యాన విజనస్థల నివాస సమాధులును మోక్షహేతువులగు; నయిన నివి పదియు నింద్రియజయంబు లేనివారికి భోగార్థంబులయి విక్రయించువారికి జీవనోపాయంబులయి యుండు; డాంభికులకు వార్తాకరంబులై యుండు, సఫలంబులుగావు; భక్తి లేక భవదీయజ్ఞానంబు లేదు; రూపరహితుండ వైన నీకు బీజాంకురంబులకైవడిఁ గారణకార్యంబు లయిన సదసద్రూపంబులు రెండును బ్రకాశమానంబు లగు; నా రెంటి యందును భక్తియోగంబున బుద్ధిమంతులు మథనంబున దారువులందు వహ్నిం గనియెడు తెఱంగున నిన్ను బొడఁగందురు; పంచభూత తన్మాత్రంబులును ప్రాణేంద్రియంబులును మనోబుద్ధ్యహంకార చిత్తంబులును నీవ; సగుణంబును నిర్గుణంబును నీవ; గుణాభిమాను లయిన జననమరణంబుల నొందు విబుధు లాద్యంతంబులు గానక నిరుపాధికుండవైన నిన్నెఱుంగరు; తత్త్వజ్ఞులయిన విద్వాంసులు వేదాధ్యయనాది వ్యాపారంబులు మాని వేదాంతప్రతిపాద్యుండ వగు నిన్ను సమాధివిశేషంబుల నెఱింగి సేవింతు; రదిగావున. (367) నీ గృహాంగణభూమి నిటలంబు మోవంగ¯ మోదించి నిత్యంబు మ్రొక్కఁడేని¯ నీ మంగళస్తవ నికర వర్ణంబులు¯ పలుమాఱు నాలుకఁ బలుకఁడేని¯ నీ యధీనములుగా నిఖిలకృత్యంబులు¯ ప్రియభావమున సమర్పింపఁడేని¯ నీ పదాంబుజముల నిర్మల హృదయుఁడై¯ చింతించి మక్కువఁ జిక్కఁడేని (367.1) నిన్నుఁ జెవులార వినఁడేని నీకు సేవ¯ చేయరాఁడేని బ్రహ్మంబు జెందఁ గలఁడె? ¯ యోగి యైనఁ దపోవ్రతయోగి యైన¯ వేది యైన మహాతత్త్వవేది యైన. (368) కావున భవదీయ దాస్యయోగంబుఁ గృపజేయు"మని ప్రణతుండైన ప్రహ్లాదుని వర్ణనంబులకు మెచ్చి నిర్గుణం డయిన హరి రోషంబు విడిచి; యిట్లనియె. (369) "సంతోషించితి నీ చరిత్రమునకున్ సద్భద్ర మౌఁగాక నీ¯ యంతర్వాంఛితలాభ మెల్లఁ గరుణాయత్తుండనై యిచ్చెదం¯ జింతం జెందకు భక్తకామదుఁడ నే సిద్ధంబు దుర్లోక్యుఁడన్¯ జంతుశ్రేణికి నన్నుఁ జూచినఁ బునర్జన్మంబు లే దర్భకా! (370) సకలభావములను సాధులు విద్వాంసు¯ లఖిల భద్రవిభుఁడ నైన నన్నుఁ¯ గోర్కు లిమ్మటంచుఁ గోరుదు రిచ్చెదఁ¯ గోరు మెద్ది యైనఁ గుఱ్ఱ! నీవు." (371) అని పరమేశ్వరుండు ప్రహ్లాదునియందుఁ గల సకామత్వంబుఁ దెలియుకొఱకు వంచించి యిట్టానతిచ్చిన; నతండు నిష్కాముండైన యేకాంతి గావునఁ గామంబు భక్తియోగంబునకు నంతరాయం బని తలంచి యిట్లనియె; "నుత్పత్తి మొదలు కామాద్యనుభవాసక్తి లేని నాకు వరంబు లిచ్చెదనని వంచింపనేల? సంసారబీజంబులును హృదయబంధకంబులు నయిన గామంబులకు వెఱచి ముముక్షుండనై సేమంబుకొఱకు నేమంబున నిన్నుం జేరితి; కామంబులును నింద్రియంబులును మనశ్శరీర ధైర్యంబులు మనీషా ప్రాణ ధర్మంబులును లజ్జాస్మరణలక్ష్మీసత్యతేజోవిశేషంబులును నశించు; లోకంబు లందు భృత్యు లర్థకాము లయి రాజుల సేవింతురు రాజులుం బ్రయోజనంబు లర్థించి భృత్యులకు నర్థంబు లొసంగుదు; రవ్విధంబు గాదు; నాకుం గామంబు లేదు; నీకుం బ్రయోజనంబు లే; దయినను దేవా! వరదుండ వయ్యెద వేనిఁ గామంబులు వృద్ధిఁబొందని వరంబుఁ గృపజేయుము; కామంబులు విడిచిన పురుషుండు నీతోడ సమాన విభవుం డగు నరసింహ! పరమాత్మ! పురుషోత్తమ!"యని ప్రణవ పూర్వకంబుగా నమస్కరించిన హరి యిట్లనియె. (372) "నీ యట్టి సుజ్ఞాన నిపుణు లేకాంతులు¯ గోర్కులు నా యందుఁ గోర నొల్ల; ¯ రట్లైనఁ బ్రహ్లాద! యసురేంద్రభర్తవై¯ సాగి మన్వంతర సమయ మెల్ల¯ నిఖిలభోగంబులు నీవు భోగింపుము¯ కల్యాణబుద్ధి నా కథలు వినుము; ¯ సకలభూతములందు సంపూర్ణుఁ డగు నన్ను¯ యజ్ఞేశు నీశ్వరు నాత్మ నిలిపి (372.1) కర్మచయము లెల్ల ఖండించి పూజన¯ మాచరింపు మీశ్వరార్పణముగ; ¯ భోగముల నశించుఁ బుణ్యంబు; వ్రతములఁ¯ బాప సంచయములు పాయు నిన్ను. (373) మఱియు నటమీఁదటఁ గాలవేగంబునం గళేబరంబు విడిచి త్రైలోక్యవిరాజ మానంబును దివిజరాజజేగీయమానంబును బరిపూరిత దశదిశంబును నయిన యశంబుతోడ ముక్తబంధుండవై నన్ను డగ్గఱియెదవు; వినుము. (374) నరుఁడు ప్రియముతోడ నాయవతారంబు, ¯ నీ యుదారగీత నికరములను¯ మానసించునేని మఱి సంభవింపఁడు¯ కర్మబంధచయముఁ గడచిపోవు. (375) అనినఁ బ్రహ్లాదుం డిట్లనియె. (376) "దంష్ట్రివై తొల్లి సోదరుని హిరణ్యాక్షు¯ నీవు చంపుటఁ జేసి నిగ్రహమున¯ మా తండ్రి రోషనిర్మగ్నుఁడై సర్వలో¯ కేశ్వరుఁ బరము ని న్నెఱుఁగ లేక¯ పరిపంథి పగిది నీ భక్తుండ నగు నాకు¯ నపకారములు జేసె నతఁడు నేఁడు¯ నీ శాంతదృష్టిచే నిర్మలత్వము నొందెఁ¯ గావున బాప సంఘంబువలనఁ (376.1) బాసి శుద్ధాత్మకుఁడు గాఁగ భవ్యగాత్ర! ¯ వరము వేఁడెద నా కిమ్ము వనజనేత్ర! ¯ భక్తసంఘాత ముఖపద్మ పద్మమిత్ర! ¯ భక్త కల్మషవల్లికా పటు లవిత్ర!" (377) అనిన భక్తునికి భక్తవత్సలుం డిట్లనియె. (378) "నిజభక్తుండవు నాకు నిన్నుఁ గనుటన్ నీ తండ్రి త్రిస్సప్త పూ¯ ర్వజులం గూడి పవిత్రుఁడై శుభగతిన్ వర్తించు విజ్ఞాన దీ¯ ప జితానేక భవాంధకారు లగు మద్భక్తుల్ వినోదించు దే¯ శ జనుల్ దుర్జనులైన శుద్ధులు సుమీ సత్యంబు దైత్యోత్తమా! (379) ఘన సూక్ష్మ భూత సంఘాతంబు లోపల¯ నెల్ల వాంఛలు మాని యెవ్వ రయిన¯ నీ చందమున నన్ను నెఱయ సేవించిన¯ మద్భక్తు లగుదురు మత్పరులకు¯ గుఱిజేయ నీవ యోగ్యుఁడ వైతి విటమీఁద¯ వేదచోదిత మైన విధముతోడఁ¯ జిత్తంబు నా మీఁదఁ జేర్చి మీ తండ్రికిఁ¯ బ్రేతకర్మములు సంప్రీతిఁ జేయు (379.1) మతఁడు రణమున నేఁడు నా యంగమర్శ¯ నమున నిర్మల దేహుఁడై నవ్యమహిమ¯ నపగతాఖిల కల్మషుఁ డైఁ తనర్చి¯ పుణ్యలోకంబులకు నేఁగుఁ బుణ్యచరిత!" (380) అని యిట్లు నరసింహదేవుం డానతిచ్చిన హిరణ్యకశిపునకుం బ్రహ్లాదుండు పరలోకక్రియలు జేసి, భూసురోత్తములచేత నభిషిక్తుండయ్యె; నయ్యెడం బ్రసాద సంపూర్ణ ముఖుండైన శ్రీనృసింహదేవునిం జూచి దేవతాప్రముఖసహితుం డైన బ్రహ్మదేవుం డిట్లనియె, (381) "దేవదేవాఖిలదేవేశ! భూతభా ¯ వన! వీఁడు నా చేత వరముపడసి¯ మత్సృష్టజనులచే మరణంబు నొందక¯ మత్తుఁడై సకలధర్మములుఁ జెఱచి¯ నేఁడు భాగ్యంబున నీచేత హతుఁ డయ్యెఁ¯ గల్యాణ మమరె లోకముల కెల్ల¯ బాలు నీతని మహాభాగవతశ్రేష్ఠుఁ¯ బ్రతికించితివి మృత్యు భయముఁ బాపి (381.1) వరముఁ గృపజేసితివి మేలు వారిజాక్ష! ¯ నీ నృసింహావతారంబు నిష్ఠతోడఁ¯ దగిలి చింతించువారలు దండధరుని¯ బాధ నొందరు మృత్యువు బారిఁ పడరు." (382) అనిన నరసింహదేవుం డిట్లనియె. (383) "మన్నించి దేవశత్రుల¯ కెన్నఁడు నిటువంటి వరము లీకుము పా పో¯ త్పన్నులకు వరము లిచ్చుట¯ పన్నగముల కమృత మిడుట పంకజగర్భా!" (384) అని యిట్లానతిచ్చి బ్రహ్మాదిదేవతాసమూహంబుచేఁ బూజితుఁడై భగవంతుండైన శ్రీనృసింహదేవుండు తిరోహితుండయ్యె; ప్రహ్లాదుండును శూలికిఁ బ్రణమిల్లి తమ్మిచూలికి వందనంబులు జేసి బ్రజాపతులకు మ్రొక్కి భగవత్కళలైన దేవతలకు నమస్కరించినం జూచి బ్రహ్మదేవుండు శుక్రాది మునీంద్ర సహితుండై దైత్యదానవరాజ్యంబునకుం బ్రహ్లాదుం బట్టంబు గట్టి యతనిచేతం బూజితుండై దీవించె; నంత నీశానాది నిఖిల దేవతలు వివిధంబులగు నాశీర్వాదంబులచేత నా ప్రహ్లాదునిఁ గృతార్థుం జేసి తమ్మిచూలిని ముందట నిడుకొని నిజస్థానంబునకుఁ జని; రిట్లు విష్ణుదేవుండు నిజపార్శ్వచరు లిరువురు బ్రాహ్మణశాపంబునం జేసి బ్రథమ జన్మంబున దితిపుత్రులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపు లను వరాహ నారసింహ రూపంబుల నవతరించి వధియించె; ద్వితీయ భవంబున రాక్షస జన్మంబు దాల్చిన రావణ కుంభకర్ణులను శ్రీరామ రూపంబున సంహరించె; తృతీయ జన్మంబున శిశుపాల దంతవక్త్రులను పేరులం బ్రసిద్ధి నొందిన వారలను శ్రీకృష్ణ రూపంబున ఖండించె; నివ్విధంబున మూఁడు జన్మంబుల గాఢ వైరానుబంధంబున నిరంత రసంభావిత ధ్యానులై వారలు నిఖిల కల్మష విముక్తు లై హరిం గదిసి"రని చెప్పి నారదుం డిట్లనియె. (385) "శ్రీ రమణీయమైన నరసింహ విహారము నింద్రశత్రు సం¯ హారముఁ బుణ్య భాగవతుఁడైన నిశాచరనాథపుత్ర సం¯ చారము నెవ్వఁడైన సువిచారత విన్నఁ బఠించినన్ శుభా¯ కారముతోడ నే భయముఁ గల్గని లోకముఁ జెందు భూవరా! (386) జలజాతప్రభవాదులున్ మనములోఁ జర్చించి భాషావళిం¯ బలుకన్ లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు నీ యింటిలోఁ¯ జెలి యై మేనమఱంది యై సచివుఁడై చిత్తప్రియుండై మహా¯ ఫలసంధాయకుఁడై చరించు టది నీ భాగ్యంబు రాజోత్తమా!

త్రిపురాసుర సంహారము

(387) బహుమాయుఁడైన మయుచే¯ విహతం బగు హరుని యశము విఖ్యాత జయా¯ వహముగ నీ భగవంతుఁడు¯ మహితాత్ముఁడు మున్నొనర్చె మనుజవరేణ్యా!" (388) అనిన ధర్మనందనుం డిట్లనియె. (389) "ఏ కర్మంబున విభుఁడగు ¯ శ్రీకంఠుని యశము మయునిచే సుడివడియెన్¯ వైకుంఠుఁ డెవ్విధంబునఁ¯ గైకొని తత్కీర్తి చక్కఁగా నొనరించెన్." (390) అనిన నారదుం డిట్లనియె. (391) "చక్రాయుధ బలయుతు లగు¯ శక్రాదుల కోహటించి శ్రమమున నసురుల్¯ సక్రోధంబున నరిగిరి¯ విక్రమములు మాని మయుని వెనుకకు నధిపా! (392) ఇట్లు రక్కసులు దన వెనుకఁ జొచ్చిన మాయానిలయుండును దుర్ణయుండును నైన మయుండు దన విద్యాబలంబున నయోరజత సువర్ణమయంబులై యెవ్వరికిని లక్షింపరాని గమనాగమనంబులును వితర్కింపరాని కర్కశపరిచ్ఛదంబులును గలిగిన త్రిపురంబుల నిర్మించి యిచ్చిన, నక్తంచరు లందఱు నందుంబ్రవేశించి కామసంచారులై పూర్వవైరంబుఁ దలంచి సనాయకంబు లయిన లోకంబుల నస్తోకంబయిన నిజబలాతిరేకంబున శోకంబు నొందించిన. (393) లోకాధినాథు లెల్లను¯ శోకాతురు లగుచు శరణు జొచ్చిరి దుష్టా¯ నీక విదళనాకుంఠున్¯ శ్రీకంఠున్ భువనభరణ చిత్తోత్కంఠున్. (394) ఇట్లు సకలలోకేశ్వరుం డగు మహేశ్వరుం జేరి లోకపాలకులు ప్రణతులై పూజించి కరకమలంబులు ముకుళించి. (395) "త్రిపురాలయు లగు దానవు¯ లపరాజితు లగుచు మాకు నశ్రాంతంబున్¯ వపురాదిపీడఁ జేసెద¯ రపరాధికులను వధింపు మగజాధీశా! (396) దీనులము గాక యుష్మద¯ ధీనులమై యుండు మేము దేవాహిత దో¯ ర్లీనుల మైనారము బల¯ హీనుల మగు మమ్ముఁ గావు మీశాన! శివా!" (397) అనిన భక్తవత్సలుం డగు పరమేశ్వరుండు శరణాగతు లైన గీర్వాణుల వెఱవకుం డని దుర్వారబలంబున బాణాసనంబుఁ గేల నందికొని యొక్క దివ్యబాణంబు సంధించి త్రిపురంబులపయి నేసిన మార్తాండమండలంబున వెలువడు మయూఖజాలంబుల చందంబునఁ దద్బాణంబువలన దేదీప్యమానంబులై యనేక బాణసహస్రంబులు సంభవించి భూ నభోంతరాళంబులు నిండి మండి తెప్పలుగాఁ గుప్పలు గొని త్రిపురంబుల పయిఁ గప్పె; నప్పుడు తద్బాణపావక హేతిసందోహ దందహ్యమాను లై గతాసు లయిన త్రిపురపుర నివాసులం దెచ్చి మహాయోగి యైన మయుండు సిద్ధరసకూపంబున వైచిన. (398) సిద్ధామృతరస మహిమను¯ శుద్ధమహావజ్రతుల్య శోభిత తను లై¯ వృద్ధిం బొందిరి దానవు¯ లుద్ధత నిర్ఘాత పావకోపము లగుచున్. (399) కూపామృత రససిద్ధిని¯ దీపితులై నిలిచి యున్న దేవాహితులన్¯ రూపించి చింత నొందెడు¯ గోపధ్వజుఁ జూచి చక్రి కుహనాన్వితుఁడై. (400) ఉత్సాహంబున నొక్క పాఁడిమొదవై యూథంబు ఘ్రాణించుచున్¯ వత్సంబై తనవెంట బ్రహ్మ నడవన్ వైకుంఠుఁ డేతెంచి యు¯ ద్యత్సత్త్వంబునఁ గూపమధ్య రసముం ద్రావెన్ విలోకించుచుం¯ దత్సౌభాగ్యనిమగ్ను లై మఱచి రా దైత్యుల్ నివారింపఁగన్. (401) ఇట్లు విష్ణుండు మోహనాకారంబున ధేను వయి వచ్చి త్రిపుర మధ్య కూపామృతరసంబు ద్రావిన నెఱింగి శోకాకులచిత్తు లయిన రసకూపపాలకులం జూచి మహాయోగి యైన మయుండు వెఱఁగుపడి దైవగతిం జింతించి శోకింపక యిట్లనియె. (402) "అమరు లైన దనుజు లైనను నరు లైన¯ నెంత నిపుణు లైన నెవ్వరైన¯ దైవికార్థచయముఁ దప్పింపఁగా లేరు¯ వలదు దనుజులార! వగవ మనకు." (403) అని పలికె; నంత విష్ణుండు నైజంబు లైన ధర్మవిజ్ఞానవిద్యాతపో విరక్తి సమృద్ధి క్రియాశక్తివిశేషంబుల శంభునికిఁ బ్రాధాన్యంబు సమర్పించి రథసూత కేతు వర్మ బాణాసన ప్రముఖ సంగ్రామ సాధనంబులు చేసినం గైకొని. (404) శరి యై కార్ముకి యై మహాకవచి యై సన్నాహి యై వాహి యై¯ సరథుండై సనియంత యై సబలుఁడై సత్కేతనచ్ఛత్రుఁ డై¯ పరమేశుం డొక బాణమున్ విడిచెఁ దద్బాణానలజ్వాలలం¯ బురముల్ కాలె ఛటచ్ఛటధ్వని నభోభూమధ్యముల్ నిండగన్. (405) ఇట్లు హరుండు దురవగాహంబు లైన త్రిపురంబుల నభిజిన్ముహూర్తంబున భస్మంబు చేసి కూల్చిన, నమర గరుడ గంధర్వ సాధ్య యక్ష వల్లభులు వీక్షించి జయజయశబ్దంబులు జేయుచుఁ గుసుమ వర్షంబులు వర్షించిరి; ప్రజలు హర్షించిరి; బ్రహ్మాదులు గీర్తించి; రప్సరసలు నర్తించిరి; దివ్య కాహళ దుందుభి రవంబులును మునిజనోత్సవంబులును బ్రచురంబు లయ్యె; నిట్లు విశ్వజనీనం బగు త్రిపురాసురసంహారంబున నఖిలలోకులును సంతసిల్లి యుండ; నయ్యవసరంబున. (406) తృణకణముల భంగి ద్రిపురంబుల దహించి¯ పరముఁ డవ్యయుండు భద్రయశుఁడు¯ శివుఁడు పద్మజాది జేగీయమానుఁ డై¯ నిజనివాసమునకు నెమ్మిఁ జనియె. (407) ఇట్లు నిజమాయా విశేషంబున మర్త్యలోకంబున విడంబించుచున్న విష్ణుని పరాక్రమవిధానంబులు మునిజన వంద్యమానంబు లై సకల లోక కల్యాణ ప్రధానంబు లై యుండు"ననిన విని నారదునకు ధర్మనందనుం డిట్లనియె.