పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 2 : సప్తమ 285 - 348

నృసింహరూప ఆవిర్భావము

(285) ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాణ వైరుండును, వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును, రోషానలజంఘన్యమాన విజ్ఞాన వినయుండును, వినయగాంభీర్యధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును, తామస గుణచంక్రమ్యమాణ స్థైర్యుండును నై విస్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరి నిందుఁ జూపు మని కనత్కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంత భేదన పాటవ ప్రశస్తం బగు హస్తంబున సభామండప స్తంభంబు వ్రేసిన వ్రేటుతోడన దశదిశలను మిడుంగుఱులు చెదరం జిటిలి పెటిలిపడి బంభజ్యమానం బగు నమ్మహాస్తంభంబువలనఁ బ్రళయవేళాసంభూత సప్తస్కంధబంధుర సమీరణ సంఘటిత ఘోరరజోఘుష్యమాణ మహా వలాహకవర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాతసంఘ నిర్ఘోష నికాశంబు లయిన ఛటచ్ఛట స్ఫటస్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్య మానంబులై యెగసి యాకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు జేసి నిండినం బట్టుచాలక దోధూయమాన హృదయంబు లయి పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ముఖర చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగాఁ బ్రపుల్ల పద్మ యుగళ సంకాశ భాస్వర చక్ర, చాప, హల, కులిశ, అంకుశ, జలచర రేఖాంకిత చారు చరణతలుండును, చరణచంక్రమణ ఘన వినమిత విశ్వంభరాభార ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మకులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరుస్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీగణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబరశోభిత కటిప్రదేశుండును, నిర్జరనిమ్నగావర్తవర్తుల కమలాకరగంభీర నాభివివరుండును, ముష్టిపరిమేయవినుత తనుతరస్నిగ్ద మధ్యుండును, కులాచల సానుభాగ సదృశ కర్కశవిశాల వక్షుండును, దుర్జన దనుజభట ధైర్య లతికా లవిత్రాయమాణ రక్షోరాజ వక్షోభాగ విశంకటక్షేత్ర విలేఖన చంగలాంగలాయమాన ప్రతాప జ్వల జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్రరేఖాయమాణ వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాతనఖరతర ముఖనఖరుండును, శంఖ, చక్ర, గదా, ఖడ్గ, కుంత, తోమర ప్రముఖ నానాయుధమహిత మహోత్తుంగ మహీధరశృంగసన్నిభ వీరసాగరవేలాయమాన మాలికా విరాజమాన నిరర్గళానేకశత భుజార్గళుండును, మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హార, కేయూర, కంకణ, కిరీట, మకరకుండలాది భూషణ భూషితుండును, ద్రివళీయుత శిఖరిశిఖరాభ పరిణద్ధ బంధుర కంధరుండును, బ్రకంపనకంపిత పారిజాతపాదపల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండును, శరత్కాల మేఘజాలమధ్య ధగద్ధగాయమాన తటిల్లతాసమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, కల్పాంతకాల సకలభువనగ్రసన విజృంభమాణ సప్తజిహ్వ జిహ్వాతులిత తరళతరాయమాణ విభ్రాజమాన జిహ్వుండును, మేరు మందర మహాగుహాంతరాళవిస్తార విపుల వక్త్ర నాసికారంధ్రుండును, నాసికారంధ్ర నిస్సరన్నిబిడ నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండును, పూర్వపర్వత విద్యోతమాన ఖద్యోత మండలసదృక్ష సమంచిత లోచనుండును, లోచనాంచల సముత్కీర్యమాణ విలోలకీలాభీల విస్ఫులింగ వితానరోరుధ్యమాన తారకాగ్రహమండలుండును, శక్రచాప సురుచిరాదభ్ర మహాభ్రూలతా బంధ బంధురభయంకర వదనుండును, ఘనతర గండశైలతుల్య కమనీయ గండభాగుండును, సంధ్యారాగ రక్తధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును సటాజాల సంచాల సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును, నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వ కర్ణుండును, మంథదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణవేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శీకారాకార భాసుర కేసరుండును, పర్వాఖర్వ శిశిరకిరణ మయూఖ గౌర తనూరుహుండును నిజ గర్జానినద నిర్దళిత కుముద సుప్రతీక వామ నైరావణ సార్వభౌమ ప్రముఖ దిగిభరాజ కర్ణకోటరుండును, ధవళధరాధరదీర్ఘ దురవలోకనీయ దేహుండును, దేహప్రభాపటల నిర్మధ్యమాన పరిపంథి యాతుధాన నికురంబ గర్వాంధకారుండును, బ్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణావీరరస సంయుతుండును, మహాప్రభావుండును నయిన శ్రీనృసింహదేవుం డావిర్భవించినం, గనుంగొని. (286) "నరమూర్తిగాదు కేవల¯ హరిమూర్తియుఁ గాదు మానవాకారముఁ గే¯ సరియాకారము నున్నది¯ హరిమాయారచిత మగు యథార్థము చూడన్. (287) తెంపున బాలుఁ డాడిన, సుధీరత సర్వగతత్వముం బ్రతి¯ ష్ఠింపఁ దలంచి యిందు నరసింహశరీరముఁ దాల్చి చక్రి శి¯ క్షింపఁగ వచ్చినాఁడు; హరిచే మృతి యంచుఁ దలంతు నైన నా¯ సొంపును బెంపు నందఱును జూడఁ జరింతు హరింతు శత్రువున్." (288) అని మెత్తంబడని చిత్తంబున గద యెత్తికొని తత్తఱంబున నార్చుచు నకుంఠిత కంఠీరవంబు డగ్గఱు గంధసింధురంబు చందంబున నక్తంచరకుంజరుండు నరసింహదేవున కెదురునడచి తదీయదివ్యతేజోజాలసన్నికర్షంబునం జేసి దవానలంబు డగ్గఱిన ఖద్యోతంబునుం బోలెఁ గర్తవ్యాకర్తవ్యంబులు దెలియక నిర్గతప్రభుండయి యుండె; నప్పుడు. (289) ప్రకటంబై ప్రళయావసానమున మున్ బ్రహ్మాండభాండావరో¯ ధక మై యున్న తమిస్రమున్ జగము నుత్పాదించుచోఁ ద్రావి సా¯ త్త్విక తేజోనిధి యైన విష్ణు నెడ నుద్దీపించునే? నష్టమై¯ వికలంబై చెడుఁగాక తామసుల ప్రావీణ్యంబు రాజోత్తమా! (290) అంత నద్దానవేంద్రుండు మహోద్దండంబగు గదాదండంబు గిరగిరం ద్రిప్పి నరమృగేంద్రుని వ్రేసిన; నతండు దర్పంబున సర్పంబు నొడిసిపట్టు సర్పపరిపంథి నేర్పున దితిపట్టిం బట్టికొనిన, మిట్టిపడి దట్టించి బిట్టు కట్టలుక న య్యసురవరుండు దృఢబలంబున నిట్టట్టు జడిసి పట్టు దప్పించుకొని, విడివడి దిటవు దప్పక కుప్పించి యుప్పరం బెగసి విహంగకులరాజ చరణ నిర్గళిత భుజంగంబు తెఱంగునం దలంగ నుఱికి తన భుజాటోపంబున నరకంఠీరవుండు కుంఠితుం; డయ్యెడి నని తలంచి, కలంగక చెలంగుచుఁ దన్ను నిబిడనీరద నికరంబుల మాటున నిలింపులు గుంపులు గొని డాఁగి మూఁగి క్రమ్మఱ నాత్మీయ జీవన శంకా కళంకితు లై మంతనంబులఁ జింతనంబులు చేయుచు నిరీక్షింప నక్షీణ సమరదక్షతా విశేషం బుపలక్షించి ఖడ్గ వర్మంబులు ధరియించి, భూనభోభాగంబుల వివిధ విచిత్ర లంఘన లాఘవంబులం బరిభ్రమణ భేదంబులం గరాళవదనుం డయి, యంతరాళంబునఁ దిరుగు సాళువపు డేగ చందంబున సంచరించిన; సహింపక. (291) పంచాననోద్ధూత పావకజ్వాలలు¯ భూనభోంతరమెల్లఁ బూరితముగ; ¯ దంష్ట్రాంకురాభీల ధగధగాయితదీప్తి¯ నసురేంద్రు నేత్రము లంధములుగఁ; ¯ గంటకసన్నిభోత్కట కేసరాహతి¯ నభ్రసంఘము భిన్నమై చలింపఁ; ¯ బ్రళయాభ్రచంచలాప్రతిమ భాస్వరములై¯ ఖరనఖరోచులు గ్రమ్ముదేర; (291.1) సటలు జళిపించి గర్జించి సంభ్రమించి¯ దృష్టి సారించి బొమలు బంధించి కెరలి¯ జిహ్వ యాడించి లంఘించి చేత నొడిసి¯ పట్టె నరసింహుఁ డా దితిపట్టి నధిప! (292) సరకుగొనక లీలాగతి¯ నురగేంద్రుఁడు మూషికంబు నొడసిన పగిదిన్¯ నరకేసరి దను నొడిసిన¯ సురవిమతుఁడు ప్రాణభీతి సుడివడియె నృపా! (293) సురరాజవైరి లోఁబడెఁ¯ బరిభావిత సాధుభక్త పటలాంహునకున్¯ నరసింహునకు నుదంచ¯ త్ఖరతరజిహ్వున కుదగ్ర ఘన రంహునకున్. (294) అంత. (295) విహగేంద్రుం డహి వ్రచ్చుకైవడి మహోద్వృత్తిన్ నృసింహుండు సా¯ గ్రహుఁడై యూరువులందుఁ జేర్చి నఖసంఘాతంబులన్ వ్రచ్చె దు¯ స్సహు దంభోళికఠోరదేహు నచలోత్సాహున్ మహాబాహు నిం¯ ద్ర హుతాశాంతకభీకరున్ ఘనకరున్ దైత్యాన్వయ శ్రీకరున్. (296) చించున్ హృత్కమలంబు, శోణితము వర్షించున్ ధరామండలిం, ¯ ద్రెంచుం గర్కశనాడికావళులు, భేదించున్ మహావక్షముం, ¯ ద్రుంచున్ మాంసము సూక్ష్మఖండములుగా, దుష్టాసురున్ వ్రచ్చి ద¯ ర్పించుం, బ్రేవులు కంఠమాలికలు గల్పించున్ నఖోద్భాసియై. (297) వక్షకవాటంబు వ్రక్కలు చేయుచో, ¯ ఘన కుఠారంబుల కరణి నొప్పు; ¯ గంభీర హృదయ పంకజము భేదించుచోఁ, ¯ గుద్దాలముల భంగిఁ గొమరుమిగులు; ¯ ధమనీ వితానంబు దవిలి ఖండించుచోఁ, ¯ బటు లవిత్రంబుల పగిది మెఱయు; ¯ జఠరవిశాలాంత్రజాలంబుఁ ద్రెంచుచోఁ, ¯ గ్రకచ సంఘంబుల గరిమఁ జూపు; (297.1) నంకగతుఁడైన దైత్యుని నాగ్రహమున¯ శస్త్ర చయముల నొంపక సంహరించి¯ యమరు నరసింహు నఖరంబు లతి విచిత్ర¯ సమర ముఖరంబులై యుండె జనవరేణ్య! (298) స్ఫురితవిబుధజన ముఖములు¯ పరివిదళిత దనుజనివహపతి తనుముఖముల్¯ గురురుచి జిత శిఖిశిఖములు¯ నరహరిఖరనఖము లమరు నతజనసఖముల్. (299) ఇట్లు కేవల పురుషరూపంబును మృగరూపంబునుం గాని నరసింహరూపంబున, రేయునుం బవలునుం గాని సంధ్యాసమయంబున, నంతరంగంబును బహిరంగంబునుం గాని సభాద్వారంబున, గగనంబును భూమియునుం గాని యూరుమధ్యంబునఁ, బ్రాణసహితంబులును బ్రాణరహితంబులునుం గాని నఖంబులం, ద్రైలోక్యజన హృదయ భల్లుం డయిన దైత్యమల్లుని వధియించి, మహాదహన కీలాభీల దర్శనుండును, గరాళవదనుండును, లేలిహానభీషణ జిహ్వుండును, శోణిత పంకాంకిత కేసరుండును నై ప్రేవులు కంఠమాలికలుగ ధరించి కుంభికుంభ విదళనంబు చేసి చనుదెంచు పంచాననంబునుం బోలె, దనుజకుంజర హృదయకమల విదళనంబు చేసి, తదీయ రక్తసిక్తంబు లైన నఖంబులు సంధ్యారాగ రక్తచంద్రరేఖల చెలువు వహింప సహింపక, లేచి తన కట్టెదుర నాయుధంబు లెత్తుకొని తత్తఱంబున రణంబునకు నురవడించు రక్కసులం బెక్కుసహస్రంబులం జక్రాధిక నిర్వక్రసాధనంబుల నొక్కనిఁ జిక్కకుండం జక్కడిచె; ని వ్విధంబున. (300) రక్షోవీరుల నెల్లఁ ద్రుంచి రణసంరంభంబు చాలించి దృ¯ ష్టిక్షేపంబు భయంకరంబుగ సభాసింహాసనారూఢుఁడై¯ యక్షీణాగ్రహుఁడై నృసింహుఁడు కరాళాస్యంబుతో నొప్పెఁ దన్¯ వీక్షింపం బలికింప నోడి యితరుల్ విభ్రాంతులై డాఁగఁగన్. (301) సుర చారణ విద్యాధర¯ గరుడోరగ యక్ష సిద్ధగణములలో నొ¯ క్కరుఁ డైన డాయ వెఱచును¯ నరహరి న య్యవసరమున నరలోకేశా! (302) తర్షంబుల నరసింహుని¯ హర్షంబులఁ జూచి నిర్జరాంగనలు మహో¯ త్కర్షంబులఁ గుసుమంబుల¯ వర్షంబులు గురిసి రుత్సవంబుల నధిపా! (303) మఱియు నయ్యవసరంబున మింట ననేక దేవతావిమానంబులును గంధర్వగానంబులును, నప్సరోగణ నర్తన సంవిధానంబులును, దివ్యకాహళ భేరీ పటహ మురజాది ధ్వానంబులును బ్రకాశమానంబు లయ్యె; సునందకుముదాదులయిన హరిపార్శ్వచరులును, విరించి మహేశ్వర మహేంద్ర పురస్సరులగు త్రిదశ కిన్నర కింపురుష పన్నగ సిద్ధ సాధ్య గరుడ గంధర్వ చారణ విద్యాధరాదులును, ప్రజాపతులును, నరకంఠీరవ దర్శనోత్కంఠు లయి చనుదెంచి.

దేవతల నరసింహ స్తుతి

(304) కరకమలయుగళ కీలిత¯ శిరులై డగ్గఱక భక్తిఁ జేసిరి బహు సం¯ సరణాబ్ధి తరికి నఖరికి¯ నరభోజనహస్తిహరికి నరకేసరికిన్. (305) ఆ సమయంబున దేవత లందఱు వేఱువేఱ వినుతించిరి; అందుఁ గమలాసనుం డిట్లనియె. (306) ఘనలీలాగుణచాతురిన్ భువనముల్ కల్పించి రక్షించి భే¯ దనముం జేయు దురంతశక్తికి ననంతజ్యోతికిం జిత్ర వీ¯ ర్యునికిన్ నిత్యపవిత్రకర్మునికి నే నుత్కంఠతో నవ్యయా¯ త్మునికిన్ వందన మాచరించెదఁ గృపాముఖ్య ప్రసాదార్థి నై." (307) రుద్రుం డిట్లనియె. (308) "అమరవరేణ్య! మీఁదట సహస్ర యుగాంతము నాఁడు గాని కో¯ పమునకు వేళ గాదు సురబాధకుఁ డైన తమస్వినీచరున్¯ సమరమునన్ వధించితివి చాలుఁ ద దాత్మజుఁడైన వీఁడు స¯ ద్విమలుఁడు నీకు భక్తుఁడు పవిత్రుఁడు గావుము భక్తవత్సలా!" (309) ఇంద్రుం డిట్లనియె. (310) "ప్రాణిసంఘముల హృత్పద్మమధ్యంబుల¯ నివసించి భాసిల్లు నీవ యెఱుఁగు; ¯ దింతకాలము దానవేశ్వరుచే బాధ¯ > పడి చిక్కి యున్న యాపన్నజనుల¯ రక్షించితివి మమ్ము; రాక్షసుఁ జంపితి¯ క్రతుహవ్యములు మాకుఁ గలిగె మరల; ¯ మంటిమి; నీ సేవ మరిగిన వారలు¯ కైవల్య విభవంబు కాంక్ష చేయ (310.1) రితరసుఖము లెల్ల నిచ్ఛగింపఁగ నేల? ¯ యస్థిరంబులివి, యనంతభక్తిఁ¯ గొలువ నిమ్ము నిన్ను ఘోరదైత్యానీక¯ చిత్తభయదరంహ! శ్రీనృసింహ!" (311) ఋషు లిట్లనిరి. (312) "భవదీయాదరలీల లోకముల నుత్పాదించి రక్షింప నేఁ¯ డవి దైత్యేశునిచేత భేదితములై హ్రస్వంబులై యుండ నీ¯ యవినీతున్ నరసింహరూపమున సంహారంబు నొందించి వే¯ దవిధిం గ్రమ్మఱ నుద్ధరించితి గదా ధర్మానుసంధాయివై." (313) పితృదేవత లిట్లనిరి. (314) "చండక్రోధముతోడ దైత్యుఁడు వడిన్ శ్రాద్ధంబులన్ మత్సుతుల్¯ పిండంబుల్ సతిలోదకంబులుగ నర్పింపంగ మా కీక యు¯ ద్దండత్వంబునఁ దాన కైకొను మహోదగ్రుండు; వీఁ డిక్కడన్¯ ఖండింపంబడె నీ నఖంబుల నుతుల్ గావింతు మాత్మేశ్వరా!" (315) సిద్ధు లిట్లనిరి. (316) "క్రుద్ధుండై యణిమాదిక¯ సిద్ధులు గైకొనిన దైత్యుఁ జీరితివి; మహా¯ యోద్ధవు నీ కృప మాకును¯ సిద్ధులు మరలంగఁ గలిగె శ్రీనరసింహా!" (317) విద్యాధరు లిట్లనిరి. (318) "దానవునిఁ జంపి యంత¯ ర్ధానాదికవిద్య లెల్ల దయతో మరలం¯ గా నిచ్చితివి విచిత్రము¯ నీ నిరుపమ వైభవంబు నిజము నృసింహా!" (319) భుజంగు లిట్లనిరి. (320) "రత్నములను మత్కాంతా¯ రత్నంబుల బుచ్చికొన్న రక్కసు నురమున్¯ యత్నమున వ్రచ్చి వైచితి; ¯ పత్నులు రత్నములుఁ గలిగి బ్రతికితి మీశా!" (321) మనువు లిట్లనిరి. (322) "దుర్ణయుని దైత్యుఁ బొరిగొని¯ వర్ణాశ్రమ ధర్మసేతు వర్గము మరలం¯ బూర్ణము చేసితి వే మని¯ వర్ణింతుము? కొలిచి బ్రతుకువారము దేవా!" (323) ప్రజాపతు లిట్లనిరి. (324) "ప్రజలం జేయుటకై సృజించితి మముం బాటించి; దైత్యాజ్ఞచేఁ¯ బ్రజలం జేయక యింతకాలము మహాభారంబుతో నుంటి; మీ¯ కుజనున్ వక్షముఁ జీరి చంపితివి; సంకోచంబు లే కెల్ల చోఁ¯ బ్రజలం జేయుచు నుండువారము జగద్భద్రాయమాణోదయా!" (325) గంధర్వు లిట్లనిరి. (326) "ఆడుదుము రేయుఁబగలుం¯ బాడుదుము నిశాటు నొద్ద, బాధించు దయం¯ జూడఁడు నీచే జమునిం¯ గూడె మహాపాతకునకుఁ గుశలము గలదే." (327) చారణు లిట్లనిరి. (328) "భువనజన హృదయభల్లుఁడు¯ దివిజేంద్ర విరోధి నేఁడు దెగె నీ చేతన్¯ భవరోగ నివర్తక మగు¯ భవదంఘ్రి యుగంబుఁ జేరి బ్రదికెద మీశా!" (329) యక్షు లిట్లనిరి. (330) "భ్రంశము లేని నీ భటుల భంగవిముక్తుల మమ్ము నెక్కి ని¯ స్సంశయవృత్తి దిక్కులఁ బ్రచారము చేయుచు నుండు వీఁడు ని¯ స్త్రింశముతోడ; వీనిఁ గడతేర్చితి వాపద మానె నో! చతు¯ ర్వింశతితత్త్వశాసక! త్రివిష్టపముఖ్యజగన్నివాసకా!" (331) కింపురుషు లిట్లనిరి. (332) "పురుషోత్తమ! నేరము కిం¯ పురుషుల మల్పులము నిన్ను భూషింపఁగ దు¯ ష్పురుషున్ సకల సుజన హృ¯ త్పరుషుం జంపితివి జగము బ్రదికె నధీశా!" (333) వైతాళికు లిట్లనిరి. (334) "త్రిభువనశత్రుఁడు పడియెను¯ సభలందును మఖము లందు జగదీశ్వర! నీ¯ శుభగీతములు పఠించుచు¯ నభయులమై సంచరింతు మార్తశరణ్యా!" (335) కిన్నర లిట్లనిరి. (336) "ధర్మము దలఁపడు లఘుతర¯ కర్మము చేయించు మమ్ముఁ గలుషాత్మకు దు¯ ష్కర్మునిఁ జంపితి; వున్నత¯ శర్ములమై నీదు భక్తి సలిపెదము హరీ!" (337) విష్ణుసేవకు లిట్లనిరి. (338) "సంచిత విప్రశాపమునఁ జండనిశాచరుఁ డైన వీని శి¯ క్షించుట కీడు గాదు కృప జేసితి వీశ్వర! భక్తితోడ సే¯ వించుటకంటె వైరమున వేగమ చేరఁగ వచ్చు నిన్ను; నీ¯ యంచిత నారసింహ తను వద్భుత మాపదఁ బాసి రందఱున్." (339) ఇట్లు బ్రహ్మరుద్రేంద్ర సిద్ధ సాధ్య పురస్సరులైన దేవముఖ్యు లందఱు నెడగలిగి యనేక ప్రకారంబుల వినుతించి; రందు రోషవిజృంభమాణుం డయిన నరసింహదేవుని డగ్గఱఁ జేర వెఱచి లక్ష్మీదేవిం బిలిచి; యిట్లనిరి. (340) "హరికిం బట్టపుదేవివి¯ హరిసేవానిపుణమతివి హరిగతివి సదా¯ హరిరతివి నీవు చని నర¯ హరిరోషము డింపవమ్మ! హరివరమధ్యా!" (341) అనిన నియ్యకొని మహోత్కంఠతోడ నా కలకంఠకంఠి నరకంఠీరవుని యుపకంఠంబునకుం జని. (342) "ప్రళయార్కబింబంబు పగిది నున్నది గాని¯ నెమ్మోము పూర్ణేందు నిభము గాదు; ¯ శిఖిశిఖాసంఘంబు చెలువు చూపెడుఁ గాని¯ చూడ్కిఁ ప్రసాద భాసురము గాదు; ¯ వీరరౌద్రాద్భుతావేశ మొప్పెడుఁ గాని¯ భూరి కృపారస స్ఫూర్తి గాదు; ¯ భయద దంష్ట్రాకుర ప్రభలు గప్పెడుఁ గాని¯ దరహసితాంబుజాతంబు గాదు; (342.1) కఠిన నఖర నృసింహ విగ్రహము గాని¯ కామినీజన సులభ విగ్రహము గాదు; ¯ విన్నదియుఁ గాదు; తొల్లి నే విష్ణువలన¯ గన్నదియుఁ గాదు; భీషణాకార" మనుచు. (343) పలికెద నని గమకముఁ గొను; ¯ బలికినఁ గడు నలుగు విభుఁడు ప్రతివచనములం¯ బలుకఁ డని నిలుచు; శశిముఖి¯ బలువిడి హృదయమునఁ జనవు భయమును గదురన్. (344) ఇట్లు నరహరిరూపంబు వారిజనివాసిని వీక్షించి శంకించి శాంతుడైన వెనుక డగ్గఱెదనని చింతించుచున్న వారిజసంభవుం డ ద్దేవుని రోషంబు నివారింప నితరుల కలవిగాదని ప్రహ్లాదుం జీరి యిట్లనియె. (345) "తీండ్ర మగు రోషమున మీ¯ తండ్రి నిమిత్తమునఁ జక్రి దారుణమూర్తిన్¯ వేండ్రము విడువఁడు మెల్లన¯ తండ్రీ! శీతలునిఁ జేసి దయచేయఁగదే." (346) అనిన "నౌఁ గాక"యని మహాభాగవతశేఖరుం డయిన బాలకుండు కరకమలంబులు ముకుళించి మందగమనంబున నమంద వినయ వివేకంబుల నరసింహదేవుని సన్నిధికిం జని సాష్టాంగదండప్రణామంబు జేసిన భక్తపరాధీనుం డగు నయ్యీశ్వరుం డాలోకించి కరుణాయత్తచిత్తుండై. (347) ప్రాభవ మొప్ప నుత్కటకృపామతియై కదియంగఁ జీరిఁ సం¯ శోభిత దృష్టిసంఘములఁ జూచుచు బాలుని మౌళి యందు లో¯ కాభినుతుండు పెట్టె నసురాంతకుఁ డుద్భట కాలసర్ప భీ¯ తాభయదాన శస్తము ననర్గళ మంగళ హేతు హస్తమున్. (348) ఇట్లు హరి కరస్పర్శనంబున భయ విరహితుండును, బ్రహ్మజ్ఞాన సహితుండును, బులకిత దేహుండును, సముత్పన్న సంతోషబాష్పసలిలధారా సమూహుండును, బ్రేమాతిశయ గద్గద భాషణుండును, వినయ వివేక భూషణుండును, నేకాగ్ర చిత్తుండును, భక్తిపరాయత్తుండును నయి య ద్దేవుని చరణ కమలంబులు దన హృదయంబున నిలిపికొని కరకమలంబులు ముకుళించి యిట్లని వినుతించె.