పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 2 : సప్తమ 186 - 284

ప్రహ్లాదుని హింసించుట

(186) అని రాక్షసవీరుల నీక్షించి యిట్లనియె. (187) "పంచాబ్దంబులవాఁడు తండ్రి నగు నా పక్షంబు నిందించి య¯ త్కించిద్భీతియు లేక విష్ణు నహితుం గీర్తించుచున్నాఁడు వ¯ ల్దంచుం జెప్పిన మానఁ డంగమునఁ బుత్రాకారతన్ వ్యాధి జ¯ న్మించెన్ వీని వధించి రండు దనుజుల్ మీమీ పటుత్వంబులన్. (188) అంగవ్రాతములోఁ జికిత్సకుఁడు దుష్టాంగంబు ఖండించి శే¯ షాంగశ్రేణికి రక్ష చేయు క్రియ నీ యజ్ఞుం గులద్రోహి దు¯ స్సంగుం గేశవపక్షపాతి నధముం జంపించి వీరవ్రతో¯ త్తుంగఖ్యాతిఁ జరించెదం గులము నిర్దోషంబు గావించెదన్. (189) హంతవ్యుఁడు రక్షింపను¯ మంతవ్యుఁడు గాడు యముని మందిరమునకున్¯ గంతవ్యుఁడు వధమున కుప¯ రంతవ్యుం డనక చంపి రం డీ పడుచున్." (190) అని దానవేంద్రుం డానతిచ్చిన వాఁడి కోఱలు గల రక్కసులు పెక్కండ్రు శూలహస్తులై వక్త్రంబులు తెఱచికొని యుబ్బి బొబ్బలిడుచు ధూమసహిత దావదహనంబునుం బోలెఁ దామ్ర సంకాశంబు లయిన కేశంబులు మెఱయ ఖేదన చ్ఛేదన వాదంబులుఁ జేయుచు. (191) "బాలుఁడు రాచబిడ్డఁడు కృపాళుఁడు సాధుఁడు లోకమాన్య సం¯ శీలుఁడు వీఁ డవధ్యుఁ"డని చిక్కక స్రుక్కక క్రూరచిత్తులై¯ శూలములం దదంగముల సుస్థిరులై ప్రహరించి రుగ్ర వా¯ చాలత నందఱున్ దివిజశత్రుఁడు వల్దనఁ డయ్యె భూవరా! (192) పలువురు దానవుల్ పొడువ బాలుని దేహము లేశమాత్రము¯ న్నొలియదు లోపలన్ రుధిర ముబ్బదు కందదు శల్య సంఘమున్¯ నలియదు దృష్టివైభవము నష్టము గాదు ముఖేందు కాంతియుం¯ బొలియదు నూతనశ్రమము పుట్టదు పట్టదు దీనభావమున్. (193) తన్ను నిశాచరుల్ పొడువ దైత్యకుమారుఁడు మాటిమాటి "కో! ¯ పన్నగశాయి! యో! దనుజభంజన! యో! జగదీశ! యో! మహా¯ పన్నశరణ్య! యో! నిఖిలపావన!"యంచు నుతించుఁ గాని తాఁ¯ గన్నుల నీరు దేఁడు భయకంపసమేతుఁడు గాఁడు భూవరా! (194) పాఱఁడు లేచి దిక్కులకు; బాహువు లొడ్డఁడు; బంధురాజిలోఁ¯ దూఱఁడు;"ఘోరకృత్య"మని దూఱఁడు; తండ్రిని మిత్రవర్గముం¯ జీరఁడు; మాతృసంఘము వసించు సువర్ణగృహంబులోనికిం¯ దాఱఁడు;"కావరే"యనఁడు; తాపము నొందఁడు; కంటగింపఁడున్. (195) ఇట్లు సర్వాత్మకంబై యిట్టిదట్టి దని నిర్దేశింప రాని పరబ్రహ్మంబు దానయై య మ్మహావిష్ణుని యందుఁ జిత్తంబుజేర్చి తన్మయుం డయి పరమానందంబునం బొంది యున్న ప్రహ్లాదుని యందు రాక్షసేంద్రుండు దన కింకరులచేతం జేయించుచున్న మారణకర్మంబులు పాపకర్ముని యందుఁ బ్రయుక్తంబు లైన సత్కారంబులుం బోలె విఫలంబు లగుటం జూచి. (196) "శూలములన్ నిశాచరులు స్రుక్కక దేహము నిగ్రహింపఁగా¯ బాలుఁడు నేలపైఁ బడఁడు పాఱఁడు చావఁడు తండ్రినైన నా¯ పాలికి వచ్చి చక్రధరు పక్షము మానితి నంచుఁ బాదముల్¯ ఫాలము సోఁక మ్రొక్కఁ డనపాయత నొందుట కేమి హేతువో?" (197) అని శంకించుచు. (198) ఒకమాటు దిక్కుంభియూధంబుఁ దెప్పించి¯ కెరలి డింభకునిఁ ద్రొక్కింపఁ బంపు; ¯ నొకమాటు విషభీకరోరగ శ్రేణుల¯ గడువడి నర్భకుఁ గఱవఁ బంపు; ¯ నొకమాటు హేతిసంఘోగ్రానలములోన¯ విసరి కుమారుని వ్రేయఁ బంపు; ¯ నొకమాటు కూలంకషోల్లోల జలధిలో¯ మొత్తించి శాబకు ముంపఁ బంపు; (198.1) విషముఁ బెట్టఁ బంపు; విదళింపఁగాఁ బంపు; ¯ దొడ్డ కొండచఱులఁ ద్రోయఁ బంపుఁ; ¯ బట్టి కట్టఁ బంపు; బాధింపఁగాఁ బంపు; ¯ బాలుఁ గినిసి దనుజపాలుఁ డధిప! (199) ఒకవేళ నభిచార హోమంబు చేయించు¯ నొకవేళ నెండల నుండఁ బంచు; ¯ నొకవేళ వానల నుపహతి నొందించు¯ నొకవేళ రంధ్రంబు లుక్కఁ బట్టు; ¯ నొకవేళఁ దన మాయ నొదవించి బెగడించు¯ నొకవేళ మంచున నొంటి నిలుపు; ¯ నొకవేళఁ బెనుగాలి కున్ముఖుఁ గావించు¯ నొకవేళఁ బాఁతించు నుర్వి యందు; (199.1) నీరు నన్నంబు నిడనీక నిగ్రహించు; ¯ గశల నడిపించు; ఱువ్వించు గండశిలల; ¯ గదల వ్రేయించు; వేయించు ఘనశరములఁ; ¯ గొడుకు నొకవేళ నమరారి క్రోధి యగుచు. (200) మఱియు ననేక మారణోపాయంబులఁ బాపరహితుం డైన పాపని రూపుమాపలేక యేకాంతంబున దురంత చింతా పరిశ్రాంతుండయి రాక్షసేంద్రుండు దన మనంబున. (201) ముంచితి వార్ధులన్, గదల మొత్తితి, శైలతటంబులందు ద్రొ¯ బ్బించితి, శస్త్రరాజిఁ బొడిపించితి, మీఁద నిభేంద్రపంక్తి ఱొ¯ ప్పించితి; ధిక్కరించితి; శపించితి; ఘోరదవాగ్నులందుఁ ద్రో¯ యించితిఁ; బెక్కుపాట్ల నలయించితిఁ; జావఁ డి దేమి చిత్రమో (202) ఎఱుఁగఁడు జీవనౌషధము; లెవ్వరు భర్తలు లేరు; బాధలం¯ దఱలఁడు నైజ తేజమునఁ; దథ్యము జాడ్యము లేదు; మిక్కిలిన్¯ మెఱయుచు నున్నవాఁ; డొక నిమేషము దైన్యము నొందఁ డింక నే¯ తెఱఁగునఁ ద్రుంతు? వేసరితి; దివ్యము వీని ప్రభావ మెట్టిదో? (203) అదియునుం గాక తొల్లి శునశ్శేఫుం డను మునికుమారుండు దండ్రి చేత యాగపశుత్వంబునకు దత్తుం డయి తండ్రి తనకు నపకారి యని తలంపక బ్రదికిన చందంబున. (204) ఆగ్రహమునఁ నేఁ జేసిన¯ నిగ్రహములు పరులతోడ నెఱి నొకనాఁడున్¯ విగ్రహము లనుచుఁ బలుకఁ డ¯ నుగ్రహములుగా స్మరించు నొవ్వఁడు మదిలోన్. (205) కావున వీఁడు మహాప్రభావసంపన్నుండు వీనికెందును భయంబు లేదు; వీనితోడి విరోధంబునం దనకు మృత్యువు సిద్ధించు"నని నిర్ణయించి చిన్నఁబోయి ఖిన్నుండై ప్రసన్నుండు గాక క్రిందు జూచుచు విషణ్ణుండై చింతనంబు జేయుచున్న రాజునకు మంతనంబునఁ జండామార్కు లిట్లనిరి. (206) "శుభ్రఖ్యాతివి నీ ప్రతాపము మహాచోద్యంబు దైత్యేంద్ర! రో¯ షభ్రూయుగ్మ విజృంభణంబున దిగీశవ్రాతముం బోరులన్¯ విభ్రాంతంబుగఁ జేసి యేలితి గదా విశ్వంబు వీఁ డెంత? యీ¯ దభ్రోక్తుల్ గుణదోషహేతువులు చింతం బొంద నీ కేటికిన్? (207) వక్రుండైన జనుండు వృద్ధ గురు సేవంజేసి మేధానయో¯ పక్రాంతిన్ విలసిల్లు మీఁదట వయఃపాకంబుతో బాలకున్¯ శక్రద్వేషణబుద్ధుఁ జేయుము మదిం జాలింపు మీ రోషమున్¯ శుక్రాచార్యులు వచ్చునంత కితఁడున్ సుశ్రీయుతుం డయ్యెడున్." (208) అని గురుపుత్రులు పలికిన రాక్షసేశ్వరుండు "గృహస్థులైన రాజులకు నుపదేశింపఁ దగిన ధర్మార్థకామంబులు ప్రహ్లాదునకు నుపదేశింపుఁ"డని యనుజ్ఞ జేసిన, వారు నతనికిఁ ద్రివర్గంబు నుపదేశించిన నతండు రాగద్వేషంబులచేత విషయాసక్తులైన వారలకు గ్రాహ్యంబు లైన ధర్మార్థకామంబులుఁ దనకు నగ్రాహ్యంబు లనియును వ్యవహార ప్రసిద్ధికొఱకైన భేదంబు గాని యాత్మభేదంబు లేదనియును ననర్థంబుల యందర్థకల్పన చేయుట దిగ్భ్రమం బనియు నిశ్చయించి, గురూపదిష్ట శాస్త్రంబులు మంచివని తలంపక గురువులు దమ గృహస్థ కర్మానుష్ఠానంబులకుం బోయిన సమయంబున. (209) ఆటలకుఁ దన్ను రమ్మని¯ పాటించి నిశాటసుతులు భాషించిన దో¯ షాటకులేంద్రకుమారుఁడు¯ పాటవమున వారిఁ జీరి ప్రజ్ఞాన్వితుఁడై. (210) "చెప్పఁ డొక చదువు మంచిది¯ చెప్పెడిఁ దగులములు చెవులు చిందఱ గొనఁగాఁ¯ జెప్పెడు మన యెడ నొజ్జలు¯ చెప్పెద నొక చదువు వినుఁడు చిత్తము లలరన్." (211) అని రాజకుమారుండు గావునఁ గరుణించి సంగడికాండ్రతోడ నగియెడి చందంబునఁ గ్రీడలాడుచు సమానవయస్కులైన దైత్యకుమారుల కెల్ల నేకాంతంబున నిట్లనియె. (212) "బాలకులార రండు మన ప్రాయపు బాలురు కొంద ఱుర్విపైఁ¯ గూలుట గంటిరే? గురుఁడు క్రూరుఁ డనర్థచయంబునందు దు¯ శ్శీలత నర్థకల్పనముఁ జేసెడి గ్రాహ్యము గాదు శాస్త్రమున్¯ మే లెఱిఁగించెదన్ వినిన మీకు నిరంతర భద్ర మయ్యెడిన్. (213) వినుండు సకల జన్మంబు లందును ధర్మార్థాచరణ కారణం బయిన మానుషజన్మంబు దుర్లభం; బందుఁ బురుషత్వంబు దుర్గమం; బదియు శతవర్షపరిమితం బైన జీవితకాలంబున నియతంబై యుండు; నందు సగ మంధకారబంధురం బయి రాత్రి రూపంబున నిద్రాది వ్యవహారంబుల నిరర్థకంబయి చను; చిక్కిన పంచాశద్వత్సరంబు లందును బాల కైశోర కౌమారాది వయోవిశేషంబుల వింశతి హాయనంబులు గడచు; కడమ ముప్పది యబ్దంబులు నింద్రియంబుల చేతఁ బట్టుపడి దురవగాహంబు లయిన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యంబులను పాశంబులం గట్టుపడి విడివడ సమర్థుండు గాక ప్రాణంబులకంటె మధురాయమాన యైన తృష్ణకు లోనై భృత్య తస్కర వణిక్కర్మంబులఁ బ్రాణహాని యైన నంగీకరించి పరార్థంబుల నర్థించుచు, రహస్యసంభోగచాతుర్య సౌందర్య విశేషంబుల ధైర్యవల్లికా లవిత్రంబు లయిన కళత్రంబులను, మహనీయ మంజుల మధురాలాపంబులు గలిగి వశులయిన శిశువులను, శీలవయోరూపధన్య లగు కన్యలను, వినయ వివేక విద్యాలంకారు లయిన కుమారులను, గామిత ఫలప్రదాతలగు భ్రాతలను, మమత్వ ప్రేమ దైన్య జనకు లయిన జననీజనకులను, సకల సౌజన్య సింధువు లయిన బంధువులను, ధన కనక వస్తు వాహన సుందరంబు లయిన మందిరంబులను, సుకరంబు లైన పశు భృత్య నికరంబులను, వంశపరంపరాయత్తంబు లయిన విత్తంబులను వర్జింపలేక, సంసారంబు నిర్జించు నుపాయంబుఁ గానక, తంతువర్గంబున నిర్గమద్వారశూన్యం బయిన మందిరంబుఁ జేరి చుట్టుపడి వెడలెడి పాటవంబు చాలక తగులుపడు కీటకంబు చందంబున గృహస్థుండు స్వయంకృతకర్మ బద్ధుండై శిశ్నోదరాది సుఖంబుల బ్రమత్తుండయి నిజకుటుంబపోషణ పారవశ్యంబున విరక్తిమార్గంబు దెలియనేరక, స్వకీయ పరకీయ భిన్నభావంబున నంధకారంబునం బ్రవేశించుం; గావునఁ గౌమార సమయంబున మనీషా గరిష్ఠుండై పరమ భాగవతధర్మంబు లనుష్ఠింప వలయు; దుఃఖంబులు వాంఛితంబులు గాక చేకుఱుభంగి సుఖంబులును గాలానుసారంబులై లబ్ధంబు లగుం; గావున వృథాప్రయాసంబున నాయుర్వ్యయంబు జేయం జనదు; హరిభజనంబున మోక్షంబు సిద్ధించు; విష్ణుండు సర్వభూతంబులకు నాత్మేశ్వరుండు ప్రియుండు; ముముక్షువైన దేహికి దేహావసానపర్యంతంబు నారాయణచరణారవింద సేవనంబు కర్తవ్యంబు. (214) కంటిరే మనవారు ఘనులు గృహస్థులై¯ విఫలులై కైకొన్న వెఱ్ఱితనము; ¯ భద్రార్థులై యుండి పాయరు సంసార¯ పద్ధతి నూరక పట్టుబడిరి; ¯ కలయోనులం దెల్ల గర్భాద్యవస్థలఁ¯ బురుషుండు దేహి యై పుట్టుచుండుఁ¯ దన్నెఱుంగఁడు కర్మతంత్రుఁడై కడపట¯ ముట్టఁడు భవశతములకు నయిన (214.1) దీన శుభము లేదు దివ్యకీర్తియు లేదు¯ జగతిఁ బుట్టి పుట్టి చచ్చి చచ్చి¯ పొరల నేల మనకుఁ? బుట్టని చావని¯ త్రోవ వెదకికొనుట దొడ్డబుద్ధి. (215) హాలాపాన విజృంభమాణ మదగర్వాతీత దేహోల్లస¯ ద్బాలాలోకన శృంఖలానిచయ సంబద్ధాత్ముఁడై లేశమున్¯ వేలానిస్సరణంబు గానక మహావిద్వాంసుఁడుం గామినీ¯ హేలాకృష్ట కురంగశాబక మగున్ హీనస్థితిన్ వింటిరే. (216) విషయసక్తులైన విబుధాహితుల తోడి¯ మనికి వలదు ముక్తిమార్గవాంఛ¯ నాదిదేవు విష్ణు నాశ్రయింపుఁడు ముక్త¯ సంగజనులఁ గూడి శైశవమున. (217) కావున విషయంబులఁ జిక్కుపడిన రక్కసులకు హరిభజనంబు శక్యంబుగాదు; రమ్యమయ్యును బహుతరప్రయాసగమ్య మని తలంచితిరేనిఁ జెప్పెద; సర్వభూతాత్మకుండై సర్వదిక్కాలసిద్ధుండై బ్రహ్మ కడపలగాఁగల చరాచరస్థూల సూక్ష్మజీవసంఘంబు లందును నభోవాయు కుంభినీ సలిలతేజంబు లనియెడు మహాభూతంబుల యందును భూతవికారంబు లయిన ఘటపటాదుల యందును గుణసామ్యం బయిన ప్రధానమందును గుణవ్యతికరంబైన మహత్తత్త్వాది యందును రజస్సత్త్వతమోగుణంబుల యందును భగవంతుం డవ్యయుం డీశ్వరుండు పరమాత్మ పరబ్రహ్మ మనియెడు వాచకశబ్దంబులు గల్గి కేవలానుభవానంద స్వరూపకుండు నవికల్పితుండు ననిర్దేశ్యుండు నయిన పరమేశ్వరుండు త్రిగుణాత్మకంబైన తన దివ్యమాయచేత నంతర్హితైశ్వరుండై వ్యాప్యవ్యాపకరూపంబులం జేసి దృశ్యుండును ద్రష్టయు, భోగ్యుండును భోక్తయు నయి నిర్దేశింపందగి వికల్పితుండై యుండు; తత్కారణంబున నాసురభావంబు విడిచి సర్వభూతంబు లందును దయాసుహృద్భావంబులు గర్తవ్యంబులు; దయాసుహృద్భావంబులు గల్గిన నధోక్షజుండు సంతసించు; అనంతుం డాద్యుండు హరి సంతసించిన నలభ్యం బెయ్యదియు లేదు; జనార్దన చరణసరసీరుహయుగళ స్మరణ సుధారస పానపరవశుల మైతిమేని మనకు దైవవశంబున నకాంక్షితంబులై సిద్ధించు ధర్మార్థ కామంబులుఁ గాంక్షితంబై సిద్ధించు మోక్షంబు నేల? త్రివర్గంబును నాత్మవిద్యయుం దర్క దండనీతి జీవికాదు లన్నియుఁ ద్రైగుణ్య విషయంబులైన వేదంబువలనం బ్రతిపాద్యంబులు; నిస్త్రైగుణ్యలక్షణంబునం బరమపురుషుండైన హరికి నాత్మసమర్పణంబు జేయుట మేలు; పరమాత్మతత్త్వ జ్ఞానోదయంబునం జేసి స్వపరభ్రాంతి జేయక పురుషుండు యోగావధూతత్త్వంబున నాత్మవికల్పభేదంబునం గలలోఁ గన్న విశేషంబులభంగిం దథ్యం బనక మిథ్య యని తలంచు"నని మఱియు ప్రహ్లాదుం డిట్లనియె. (218) "నరుఁడుం దానును మైత్రితో మెలఁగుచున్ నారాయణుం డింతయున్¯ వరుసన్ నారదసంయమీశ్వరునకున్ వ్యాఖ్యానముం జేసె మున్; ¯ హరిభక్తాంఘ్రిపరాగ శుద్ధతను లేకాంతుల్ మహాకించనుల్¯ పరతత్త్వజ్ఞులు గాని నేరరు మదిన్ భావింప నీ జ్ఞానమున్. (219) తొల్లి నేను దివ్యదృష్టి గల నారదమహామునివలన సవిశేషం బయిన యీ జ్ఞానంబును బరమభాగవతధర్మంబును వింటి"ననిన వెఱఁగు పడి దైత్యబాలకు ల ద్దనుజ రాజకుమారున కిట్లనిరి. (220) "మంటిమి కూడి, భార్గవకుమారకు లొద్ద ననేక శాస్త్రముల్¯ వింటిమి. లేఁడు సద్గురుఁడు వేఱొకఁ డెన్నఁడు, రాజశాల ము¯ క్కంటికి నైన రాదు చొరఁగా, వెలికిం జన రాదు, నీకు ని¯ ష్కంటకవృత్తి నెవ్వఁడు ప్రగల్భుఁడు చెప్పె? గుణాఢ్య! చెప్పుమా. (221) సేవింతుము నిన్నెప్పుడు¯ భావింతుము రాజ వనుచు బహుమానములం¯ గావింతుము తెలియము నీ¯ కీ వింతమతిప్రకాశ మే క్రియఁ గలిగెన్." (222) అని యిట్లు దైత్యనందనులు దన్నడిగినఁ బరమభాగవత కులాలంకారుం డైన ప్రహ్లాదుండు నగి తనకుఁ బూర్వంబునందు వినంబడిన నారదు మాటలు దలంచి యిట్లనియె.

ప్రహ్లాదుని జన్మంబు

(223) "అక్షీణోగ్ర తపంబు మందరముపై నర్థించి మా తండ్రి శు¯ ద్ధక్షాంతిం జని యుండఁ జీమగమిచేతన్ భోగి చందంబునన్¯ భక్షింపంబడెఁ బూర్వపాపములచేఁ బాపాత్మకుం డంచు మున్¯ రక్షస్సంఘముమీఁద నిర్జరులు సంరంభించి యుద్ధార్థులై. (224) ప్రస్థానోచిత భేరిభాంకృతులతోఁ బాకారియుం దారు శౌ¯ ర్యస్థైర్యంబుల నేగుదెంచినఁ దదీయాటోప విభ్రాంతులై¯ స్వస్థేమల్ దిగనాడి పుత్ర ధన యోషా మిత్ర సంపత్కళా¯ ప్రస్థానంబులు డించి పాఱి రసురుల్ ప్రాణావనోద్యుక్తులై. (225) ప్రల్లదంబున వేల్పు లుద్ధతిఁ బాఱి రాజనివాసముం¯ గొల్లబెట్టి సమస్త విత్తముఁ గ్రూరతం గొని పోవఁగా¯ నిల్లు చొచ్చి విశంకుఁడై యమరేశ్వరుం డదలించి మా¯ తల్లిఁ దాఁ జెఱఁబట్టె సిగ్గునఁ దప్తయై విలపింపఁగాన్. (226) ఇట్లు సురేంద్రుండు మా తల్లిం జెఱగొని పోవుచుండ న మ్ముగుద కురరి యను పులుఁగు క్రియ మొఱలిడినఁ దెరువున దైవయోగంబున నారదుండు పొడఁగని యిట్లనియె. (227) "స్వర్భువనాధినాథ! సురసత్తమ! వేల్పులలోన మిక్కిలిన్¯ నిర్భరపుణ్యమూర్తివి సునీతివి మానినిఁ బట్ట నేల? యీ¯ గర్భిణి నాతురన్ విడువు కల్మషమానసురాలు గాదు నీ¯ దుర్భరరోషమున్ నిలుపు దుర్జయుఁ డైన నిలింపవైరి పై." (228) అనిన వేల్పుఁదపసికి వేయిగన్నులు గల గఱువ యిట్లనియె. (229) "అంతనిధాన మైన దితిజాధిపువీర్యము దీని కుక్షి న¯ త్యంత సమృద్ధి నొందెడి మహాత్మక! కావునఁ దత్ప్రసూతి ప¯ ర్యంతము బద్ధఁ జేసి జనితార్భకు వజ్రము ధారఁ ద్రుంచి ని¯ శ్చింతుఁడనై తుదిన్ విడుతు సిద్ధము దానవరాజవల్లభన్." (230) అని పలికిన వేల్పులఱేనికిం దపసి యిట్లనియె. (231) "నిర్భీతుండు ప్రశస్త భాగవతుఁడున్ నిర్వైరి జన్మాంతరా¯ విర్భూతాచ్యుతపాదభక్తి మహిమావిష్టుండు దైత్యాంగనా¯ గర్భస్థుం డగు బాలకుండు బహుసంగ్రామాద్యుపాయంబులన్¯ దుర్భావంబునఁ బొంది చావఁడు భవద్దోర్దండ విభ్రాంతుఁ డై." (232) అని దేవముని నిర్దేశించిన నతని వచనంబు మన్నించి తానును హరిభక్తుండు గావున దేవేంద్రుండు భక్తి బాంధవంబున మా యవ్వను విడిచి వలగొని సురలోకంబునకుం జనియె; మునీంద్రుండును మజ్జనని యందుఁ బుత్రికాభావంబు జేసి యూఱడించి; నిజాశ్రమంబునకుం గొనిపోయి "నీవు పతివ్రతవు, నీ యుదరంబునఁ బరమభాగవతుండయిన ప్రాణి యున్నవాఁడు తపోమహత్త్వంబునం గృతార్థుండై నీ పెనిమిటి రాఁగలం; డందాక నీ విక్కడ నుండు"మనిన సమ్మతించి. (233) యోషారత్నము నాథదైవత విశాలోద్యోగ మా తల్లి ని¯ ర్వైషమ్యంబున నాథురాక మదిలో వాంఛించి నిర్దోష యై¯ యీషద్భీతియు లేక గర్భపరిరక్షేచ్ఛన్ విచారించి శు¯ శ్రూషల్ చేయుచు నుండె నారదునకున్ సువ్యక్త శీలంబునన్. (234) ఇట్లు దనకుఁ బరిచర్య జేయుచున్న దైత్యరాజకుటుంబినికి నాశ్రితరక్షావిశారదుం డైన నారదుండు నిజసామర్థ్యంబున నభయం బిచ్చి గర్భస్థుండ నైన నన్ను నుద్దేశించి ధర్మతత్త్వంబును నిర్మలజ్ఞానంబును నుపదేశించిన, నమ్ముద్ధియ దద్ధయుం బెద్దకాలంబునాఁటి వినికి గావున నాడుది యగుటం జేసి పరిపాటి దప్పి సూటి లేక మఱచె; నారదుఁడు నా యెడఁ గృప గల నిమిత్తంబున. (235) వెల్లిగొని నాఁటనుండియు¯ నుల్లసితం బైన దైవయోగంబున శో¯ భిల్లెడు మునిమత మంతయు¯ నుల్లంబున మఱపు పుట్ట దొకనాఁ డైనన్. (236) వినుఁడు నాదు పలుకు విశ్వసించితిరేని¯ సతుల కయిన బాల జనుల కయినఁ¯ దెలియ వచ్చు మేలు దేహాద్యహంకార¯ దళననిపుణ మైన తపసిమతము." (237) అని నారదోక్త ప్రకారంబున బాలకులకుఁ బ్రహ్లాదుం డిట్లనియె; "ఈశ్వరమూర్తి యైన కాలంబునం జేసి వృక్షంబు గలుగుచుండ ఫలంబునకు జన్మ సంస్థాన వర్ధనాపచయ క్షీణత్వ పరిపాక నాశంబులు ప్రాప్తంబు లయిన తెఱంగున దేహంబులకుం గాని షడ్భావవికారంబు లాత్మకు లేవు; ఆత్మ నిత్యుండు క్షయరహితుండు శుద్ధుండు క్షేత్రజ్ఞుండు గగనాదులకు నాశ్రయుండుఁ గ్రియాశూన్యుండు స్వప్రకాశుండు సృష్టిహేతువు వ్యాపకుండు నిస్సంగుండుఁ బరిపూర్ణుండు నొక్కండు నని వివేకసమర్థంబు లగు "నాత్మలక్షణంబులు పండ్రెండు"నెఱుంగుచు, దేహాదులందు మోహజనకంబు లగు నహంకార మమకారంబులు విడిచి పసిండిగనులు గల నెలవున విభ్రాజమాన కనక లేశంబులైన పాషాణాదులందుఁ బుటంబుపెట్టి వహ్నియోగంబున గరంగ నూది హేమకారకుండు పాటవంబున హాటకంబుఁ బడయు భంగి నాత్మకృత కార్యకారణంబుల నెఱింగెడి నేర్పరి దేహంబునం దాత్మసిద్ధికొఱకు నయిన యుపాయంబునం జేసి బ్రహ్మభావంబుఁ బడయు; మూలప్రకృతియు మహదహంకారంబులును బంచతన్మాత్రంబులు నివి యెనిమిదియుం "బ్రకృతు"లనియును, రజ స్సత్త్వ తమంబులు మూఁడును "బ్రకృతిగుణంబు"లనియుఁ, గర్మేంద్రియంబు లయిన వాక్పాణి పాద పాయూపస్థంబులును జ్ఞానేంద్రియంబు లైన శ్రవణ నయన రసనా త్వగ్ఘ్రాణంబులును మనంబును మహీ సలిల తేజో వాయు గగనంబులును నివి "పదాఱును వికారంబు"లనియును, గపిలాది పూర్వాచార్యులచేతఁ జెప్పబడియె; సాక్షిత్వంబున నీ యిరువదే డింటిని నాత్మగూడి యుండు; పెక్కింటి కూటువ దేహ; మదియు జంగమస్థావరరూపంబుల రెండువిధంబు లయ్యె; మూలప్రకృతి మొదలయిన వర్గంబునకు వేఱై మణిగణంబులఁ జొచ్చి యున్న సూత్రంబు చందంబున నాత్మ యన్నింటి యందునుం జొచ్చి దీపించు; ఆత్మకు జన్మ స్థితి లయంబులు గల వంచు మిథ్యాతత్పరులు గాక వివేకశుద్ధమైన మనంబునం జేసి దేహంబునం దాత్మ వెదకవలయు; ఆత్మకు "నవస్థలు"గలయట్లుండుఁ గాని యవస్థలు లేవు జాగరణ స్వప్న సుషుప్తు లను "వృత్తు"లెవ్వనిచేత నెఱుంగంబడు నతం డాత్మ యండ్రు; కుసుమ ధర్మంబు లయిన గంధంబుల చేత గంధాశ్రయు డయిన వాయువు నెఱింగెడు భంగిం ద్రిగుణాత్మకంబులయి కర్మ జన్యంబు లయిన బుద్ధి భేదంబుల నాత్మ నెఱుంగం దగు"నని చెప్పి. (238) "సంసార మిది బుద్ధిసాధ్యము గుణకర్మ¯ గణబద్ధ మజ్ఞానకారణంబుఁ¯ గలవంటి దింతియ కాని నిక్కము గాదు¯ సర్వార్థములు మనస్సంభవములు ¯ స్వప్న జాగరములు సమములు గుణశూన్యుఁ¯ డగు పరమునికి, గుణాశ్రయమున¯ భవవినాశంబులు వాటిల్లి నట్లుండుఁ¯ బట్టి చూచిన లేవు బాలులార! (238.1) కడఁగి త్రిగుణాత్మకము లైన కర్మములకు¯ జనకమై వచ్చు నజ్ఞాన సముదయమును¯ ఘనతర జ్ఞానవహ్నిచేఁ గాల్చి పుచ్చి¯ కర్మవిరహితు లై హరిఁ గనుట మేలు. (239) అది గావున, గురుశుశ్రూషయు సర్వలాభసమర్పణంబును సాధుజన సంగమంబును నీశ్వర ప్రతిమా సమారాధనంబును హరికథా తత్పరత్వంబును వాసుదేవుని యందలి ప్రేమయు నారాయణ గుణ కర్మ కథా నామకీర్తనంబును వైకుంఠ చరణకమల ధ్యానంబును విశ్వంభరమూర్తి విలోకన పూజనంబును మొదలయిన విజ్ఞానవైరాగ్య లాభసాధనంబు లైన భాగవతధర్మంబులపై రతి గలిగి సర్వభూతంబుల యందు నీశ్వరుండు భగవంతుం డాత్మఁ గలండని సమ్మానంబు జేయుచుఁ గామ క్రోధ లోభ మోహ మద మత్సరంబులం గెలిచి యింద్రియవర్గంబును బంధించి భక్తి చేయుచుండ నీశ్వరుం డయిన విష్ణుదేవుని యందలి రతి సిద్ధించు. (240) దనుజారి లీలావతారంబు లందలి¯ శౌర్యకర్మంబులు సద్గుణములు¯ విని భక్తుఁ డగువాఁడు వేడ్కతోఁ బులకించి¯ కన్నుల హర్షాశ్రుకణము లొలుక¯ గద్గదస్వరముతోఁ గమలాక్ష! వైకుంఠ!¯ వరద! నారాయణ! వాసుదేవ! ¯ యనుచు నొత్తిలిపాడు; నాడు; నాక్రోశించు¯ నగుఁ; జింతనము జేయు; నతి యొనర్చు; (240.1) మరులు కొని యుండుఁ; దనలోన మాటలాడు;¯ వేల్పు సోఁకిన పురుషుని వృత్తి దిరుగు;¯ బంధములఁ బాసి యజ్ఞానపటలిఁ గాల్చి¯ విష్ణుఁ బ్రాపించుఁ; దుది భక్తి వివశుఁ డగుచు. (241) కావున, రాగాదియుక్త మనస్కుం డయిన శరీరికి సంసారచక్రనివర్తకం బయిన హరిచింతనంబు బ్రహ్మమందలి నిర్వాణసుఖం బెట్టిదట్టి దని బుధులు దెలియుదురు; హరిభజనంబు దుర్గమంబుగాదు; హరి సకల ప్రాణిహృదయంబుల యందు నంతర్యామియై యాకాశంబు భంగి నుండు; విషయార్జనంబుల నయ్యెడిది లేదు; నిమిషభంగుర ప్రాణు లయిన మర్త్యులకు మమతాస్పదంబులును జంచలంబులును నైన పుత్ర మిత్ర కళత్ర పశు భృత్య బల బంధు రాజ్య కోశ మణి మందిర మంత్రి మాతంగ మహీ ప్రముఖ విభవంబులు నిరర్థకంబులు; యాగ ప్రముఖ పుణ్యలబ్ధంబు లైన స్వర్గాదిలోక భోగంబులు పుణ్యానుభవక్షీణంబులు గాని నిత్యంబులు గావు; నరుండు విద్వాంసుండ నని యభిమానించి కర్మంబు లాచరించి యమోఘంబు లయిన విపరీత ఫలంబుల నొందు; కర్మంబులు గోరక చేయవలయు; కోరి చేసిన దుఃఖంబులు ప్రాపించు; పురుషుండు దేహంబుకొఱకు భోగంబుల నపేక్షించు; దేహంబు నిత్యంబు కాదు తోడ రాదు; మృతం బైన దేహంబును శునకాదులు భక్షించు; దేహి కర్మంబు లాచరించి కర్మబద్ధుండయి క్రమ్మఱం గర్మానుకూలంబయిన దేహంబుఁ దాల్చు; నజ్ఞానంబునం జేసి పురుషుండు కర్మదేహంబుల విస్తరించు; నజ్ఞాన తంత్రంబులు ధర్మార్థ కామంబులు; జ్ఞాన లభ్యంబు మోక్షంబు; మోక్షప్రదాత యగు హరి సకల భూతంబులకు నాత్మేశ్వరుండు ప్రియుండు; తన చేత నయిన మహాభూతంబులతోడ జీవసంజ్ఞితుండై యుండు; నిష్కాములై హృదయగతుం డయిన హరిని నిజభక్తిని భజింపవలయు. (242) దానవ దైత్య భుజంగమ¯ మానవ గంధర్వ సుర సమాజములో ల¯ క్ష్మీనాథు చరణకమల¯ ధ్యానంబున నెవ్వఁడయిన ధన్యత నొందున్. (243) చిక్కఁడు వ్రతములఁ గ్రతువులఁ¯ జిక్కఁడు దానముల శౌచశీలతపములం¯ జిక్కఁడు యుక్తిని భక్తిని¯ జిక్కిన క్రియ నచ్యుతుండు సిద్ధము సుండీ! (244) చాలదు భూదేవత్వము¯ చాలదు దేవత్వ మధిక శాంతత్వంబుం¯ జాలదు హరి మెప్పింప వి¯ శాలోద్యములార! భక్తి చాలిన భంగిన్. (245) దనుజ భుజగ యక్ష దైత్య మృగాభీర¯ సుందరీ విహంగ శూద్ర శబరు¯ లైనఁ బాపజీవు లైన ముక్తికిఁ బోదు¯ రఖిల జగము విష్ణుఁ డనుచుఁ దలఁచి. (246) గురువులు దమకును లోఁబడు¯ తెరువులు చెప్పెదరు విష్ణు దివ్యపదవికిం¯ దెరువులు చెప్పరు; చీఁకటిఁ¯ బరువులు పెట్టంగ నేల? బాలకులారా! (247) తెం డెల్ల పుస్తకంబులు¯ నిం డాచార్యులకు మరల నేకతమునకున్¯ రండు విశేషము చెప్పెదఁ¯ బొం డొల్లనివారు కర్మపుంజము పాలై. (248) ఆడుదము మనము హరిరతిఁ¯ బాడుద మే ప్రొద్దు విష్ణుభద్రయశంబుల్¯ వీడుదము దనుజసంగతిఁ¯ గూడుదము ముకుందభక్తకోటిన్ సూటిన్. (249) విత్తము సంసృతిపటలము ¯ వ్రత్తము కామాదివైరివర్గంబుల నేఁ¯ డిత్తము చిత్తము హరికిని¯ జొత్తము నిర్వాణపదము శుభ మగు మనకున్." (250) అని యిట్లు ప్రహ్లాదుండు రహస్యంబున న య్యైవేళల రాక్షస కుమారులకు నపవర్గమార్గం బెఱింగించిన; వారును గురుశిక్షితంబులైన చదువులు చాలించి నారాయణభక్తి చిత్తంబులం గీలించి యుండుటం జూచి వారల యేకాంతభావంబు దెలిసి వెఱచి వచ్చి శుక్రనందనుండు శక్రవైరి కిట్లనియె. (251) "రక్షో బాలుర నెల్ల నీ కొడుకు చేరంజీరి లోలోన నా¯ శిక్షామార్గము లెల్ల గల్ల లని యాక్షేపించి తా నందఱన్¯ మోక్షాయత్తులఁ జేసినాఁడు మనకున్ మోసంబు వాటిల్లె; నీ¯ దక్షత్వంబునఁ జక్కఁజేయవలయున్ దైతేయవంశాగ్రణీ! (252) "ఉల్లసిత విష్ణుకథనము¯ లెల్లప్పుడు మాఁకు జెప్పఁ"డీ గురుఁ డని న¯ న్నుల్లంఘించి కుమారకు¯ లొల్లరు చదువంగ దానవోత్తమ! వింటే. (253) ఉడుగఁడు మధురిపుకథనము¯ విడివడి జడుపగిదిఁ దిరుగు వికసనమున నే¯ నొడివిన నొడువులు నొడువఁడు¯ దుడుకనిఁ జదివింప మాకు దుర్లభ మధిపా! (254) చొక్కపు రక్కసికులమున¯ వెక్కురు జన్మించినాఁడు విష్ణునియందున్¯ నిక్కపు మక్కువ విడువం¯ డెక్కడి సుతుఁ గంటి రాక్షసేశ్వర! వెఱ్ఱిన్." (255) అని యిట్లు గురుసుతుండు చెప్పినఁ గొడుకువలని విరోధవ్యవహారంబులు గర్ణరంధ్రంబుల ఖడ్గప్రహారంబు లయి సోఁకిన; బిట్టు మిట్టిపడి పాదాహతంబైన భుజంగంబు భంగిఁ బవనప్రేరితంబైన దవానలంబు చందంబున దండతాడితం బయిన కంఠీరవంబుకైవడి భీషణ రోషరసావేశ జాజ్వల్యమాన చిత్తుండును బుత్రసంహారోద్యోగాయత్తుండును గంపమాన గాత్రుండును నరుణీకృత నేత్రుండును నై కొడుకును రప్పించి సమ్మానకృత్యంబులు దప్పించి నిర్దయుండై యశనిసంకాశ భాషణంబుల నదల్చుచు. (256) సూనున్ శాంతగుణ ప్రధాను నతి సంశుద్ధాంచిత జ్ఞాను న¯ జ్ఞానారణ్య కృశాను నంజలిపుటీ సంభ్రాజమానున్ సదా¯ శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద నా¯ ధీనున్ ధిక్కరణంబుజేసి పలికెన్ దేవాహితుం డుగ్రతన్. (257) "అస్మదీయం బగు నాదేశమునఁ గాని¯ మిక్కిలి రవి మింట మెఱయ వెఱచు; ¯ నన్ని కాలములందు ననుకూలుఁడై కాని¯ విద్వేషి యై గాలి వీవ వెఱచు; ¯ మత్ప్రతాపానల మందీకృతార్చి యై¯ విచ్చలవిడి నగ్ని వెలుఁగ వెఱచు; ¯ నతిశాత యైన నా యాజ్ఞ నుల్లంఘించి¯ శమనుండు ప్రాణులఁ జంప వెఱచు; (257.1) నింద్రుఁ డౌదల నా మ్రోల నెత్త వెఱచు; ¯ నమర కిన్నర గంధర్వ యక్ష విహగ¯ నాగ విద్యాధరావళి నాకు వెఱచు; ¯ నేల వెఱువవు పలువ! నీ కేది దిక్కు. (258) ప్రజ్ఞావంతులు లోకపాలకులు శుంభద్ధ్వేషు లయ్యున్ మదీ¯ యాజ్ఞాభంగము చేయ నోడుదురు రోషాపాంగదృష్టిన్ వివే¯ క జ్ఞానచ్యుత మై జగత్త్రితయముం గంపించు నీ విట్టిచో¯ నాజ్ఞోల్లంఘన మెట్లు చేసితివి? సాహంకారతన్ దుర్మతీ! (259) కంఠక్షోభము గాఁగ నొత్తిలి మహాగాఢంబుగా డింభ! వై¯ కుంఠుం జెప్పెదు దుర్జయుం డనుచు వైకుంఠుండు వీరవ్రతో¯ త్కంఠాబంధురుఁ డేని నే నమరులన్ ఖండింప దండింపఁగా¯ గుంఠీభూతుఁడు గాక రావలదె మద్ఘోరాహవక్షోణికిన్. (260) ఆచార్యోక్తము గాక బాలురకు మోక్షాసక్తిఁ బుట్టించి నీ¯ వాచాలత్వముఁ జూపి విష్ణు నహితున్ వర్ణించి మ ద్దైత్య వం¯ శాచారంబులు నీఱు చేసితివి మూఢాత్ముం గులద్రోహి నిన్¯ నీచుం జంపుట మేలు చంపి కులమున్ నిర్దోషముం జేసెదన్. (261) దిక్కులు గెలిచితి నన్నియు¯ దిక్కెవ్వఁడు? రోరి! నీకు దేవేంద్రాదుల్¯ దిక్కుల రాజులు వేఱొక¯ దిక్కెఱుఁగక కొలుతు రితఁడె దిక్కని నన్నున్." (262) బలవంతుఁడ నే జగముల¯ బలములతోఁ జనక వీరభావమున మహా¯ బలుల జయించితి నెవ్వని¯ బలమున నాడెదవు నాకుఁ బ్రతివీరుఁడ వై." (263) అనినఁ దండ్రికి మెల్లన వినయంబునఁ గొడు కిట్లనియె. (264) "బలయుతులకు దుర్భలులకు¯ బల మెవ్వఁడు? నీకు నాకు బ్రహ్మాదులకున్¯ బల మెవ్వఁడు ప్రాణులకును¯ బల మెవ్వం డట్టి విభుఁడు బల మసురేంద్రా! (265) దిక్కులు కాలముతో నే¯ దిక్కున లేకుండుఁ గలుగుఁ దిక్కుల మొదలై¯ దిక్కుగల లేని వారికి¯ దిక్కయ్యెడు వాఁడు నాకు దిక్కు మహాత్మా! (266) కాలరూపంబులఁ గ్రమ విశేషంబుల¯ నలఘు గుణాశ్రయుం డయిన విభుఁడు¯ సత్త్వబలేంద్రియ సహజ ప్రభావాత్ముఁ¯ డై వినోదంబున నఖిలజగముఁ¯ గల్పించు రక్షించు ఖండించు నవ్యయుం¯ డన్ని రూపము లందు నతఁడు గలఁడు¯ చిత్తంబు సమముగాఁ జేయుము మార్గంబుఁ¯ దప్పి వర్తించు చిత్తంబుకంటె (266.1) వైరు లెవ్వరు చిత్తంబు వైరి గాఁక? ¯ చిత్తమును నీకు వశముగాఁ జేయవయ్య! ¯ మదయుతాసురభావంబు మానవయ్య! ¯ యయ్య! నీ మ్రోల మేలాడరయ్య! జనులు. (267) లోకము లన్నియున్ గడియలోన జయించినవాఁడ వింద్రియా¯ నీకముఁ జిత్తమున్ గెలువ నేరవు నిన్ను నిబద్ధుఁ జేయు నీ¯ భీకర శత్రు లార్వురఁ బ్రభిన్నులఁ జేయుము ప్రాణికోటిలో¯ నీకు విరోధి లేఁ డొకఁడు నేర్పునఁ జూడుము దానవేశ్వరా! (268) పాలింపుము శేముషి ను¯ న్మూలింపుము కర్మబంధముల సమదృష్టిం¯ జాలింపుము సంసారముఁ¯ గీలింపుము హృదయ మందుఁ గేశవభక్తిన్." (269) అనినఁ బరమభాగవతశేఖరునకు దోషాచరశేఖరుం డిట్లనియె. (270) "చంపినఁ జచ్చెద ననుచును¯ గంపింపక యోరి! పలువ! కఠినోక్తుల నన్¯ గుంపించెదు చావునకుం¯ దెంపరి యై వదరువాని తెఱఁగునఁ గుమతీ! (271) నాతోడం బ్రతిభాష లాడెదు జగన్నాథుండ నా కంటె నీ¯ భూతశ్రేణికి రాజు లేఁ డొకఁడు; సంపూర్ణ ప్రభావుండు మ¯ ద్భ్రాతం జంపిన మున్ను నే వెదకితిం బల్మాఱు నారాయణుం¯ డే తద్విశ్వములోన లేఁడు; మఱి వాఁ డెందుండురా? దుర్మతీ! (272) ఎక్కడఁ గలఁ డే క్రియ నే¯ చక్కటి వర్తించు నెట్టి జాడను వచ్చుం¯ జక్కడఁతు నిన్ను విష్ణునిఁ¯ బెక్కులు ప్రేలెదవు వాని భృత్యుని పగిదిన్." (273) అనిన హరికింకరుండు శంకింపక హర్షపులకాకుంర సంకలిత విగ్రహుండై యాగ్రహంబు లేక హృదయంబున హరిం దలంచి నమస్కరించి బాలవర్తనంబున నర్తనంబు జేయుచు నిట్లనియె. (274) "కలఁ డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డాకాశంబునం, గుంభినిం¯ గలఁ, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం¯ గలఁ, డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటం¯ గలఁ, డీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల యీ యా యెడన్. (275) ఇందు గలఁ డందు లేఁ డని¯ సందేహము వలదు చక్రి సర్వోపగతుం¯ డెం దెందు వెదకి చూచిన¯ నందందే కలఁడు దానవాగ్రణి! వింటే." (276) అని యి వ్విధంబున. (277) "హరి సర్వాకృతులం గలం"డనుచుఁ బ్రహ్లాదుండు భాషింప స¯ త్వరుఁడై "యెందును లేఁడు లేఁ"డని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ¯ నరసింహాకృతి నుండె నచ్యుతుఁడు నానా జంగమస్థావరో¯ త్కర గర్భంబుల నన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్. (278) అయ్యవసరంబున నద్దానవేంద్రుండు. (279) "డింభక సర్వస్థలముల¯ నంభోరుహనేత్రుఁ డుండు ననుచు మిగుల సం¯ రంభంబునఁ బలికెద వీ¯ స్తంభంబునఁ జూపఁ గలవె చక్రిన్ గిక్రిన్. (280) స్తంభమునఁ జూపవేనిం¯ గుంభిని నీ శిరముఁ ద్రుంచి కూల్పఁగ రక్షా¯ రంభమున వచ్చి హరి వి¯ స్రంభంబున నడ్డపడఁగ శక్తుం డగునే." (281) అనిన భక్తవత్సలుని భటుం డి ట్లనియె. (282) "అంభోజాసనుఁ డాదిగాఁగ దృణపర్యంతంబు విశ్వాత్ముఁడై¯ సంభావంబున నుండు ప్రోడ విపులస్తంభంబునం దుండడే? ¯ స్తంభాంతర్గతుఁ డయ్యు నుండుటకు నే సందేహమున్ లేదు ని¯ ర్దంభత్వంబున నేఁడు గానఁబడు బ్రత్యక్షస్వరూపంబునన్." (283) అనిన విని కరాళించి గ్రద్దన లేచి గద్దియ డిగ్గనుఱికి యొఱఁబెట్టిన ఖడ్గంబు పెఱికి కేల నమర్చి జళిపించుచు మహాభాగవతశిఖామణి యైన ప్రహ్లాదుని ధిక్కరించుచు. (284) "వినరా డింభక! మూఢచిత్త! గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుం¯ డని భాషించెద; వైన నిందుఁ గలఁడే" యంచున్ మదోద్రేకియై¯ దనుజేంద్రుం డరచేత వ్రేసెను మహోదగ్ర ప్రభా శుంభమున్¯ జనదృగ్భీషణదంభమున్ హరిజనుస్సంరంభమున్ స్తంభమున్.