పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 2 : సప్తమ 445 - సంపూర్ణం

ఆశ్రమాదుల ధర్మములు

(445) అనిన నారదుం డిట్లనియె "గృహస్థుం డయినవాఁడు వాసుదేవార్పణంబుగా గృహోచితక్రియ లనుసంధించుచు మహామునుల సేవించి వారల వలన నారాయణ దివ్యావతార కథాకర్ణనంబు చేయుచు నయ్యైవిహితకాలంబుల శాంతజనులం గూడి మెలంగుచు బుత్రమిత్ర కళత్రాది సంగంబులు గలల వంటి వని యెఱుంగుచు లోపల నాసక్తి లేక సక్తునికైవడి వెలుపలఁ బురుషకారంబు లొనర్చుచుఁ దగులంబు లేక విత్తంబు లిచ్చి జనక సుత సోదర సఖ జ్ఞాతిజనుల చిత్తంబులు సమ్మదాయత్తంబులు గావించుచు ధనధాన్య విధాన దైవ లబ్ధంబులవలన నభిమానంబు మాని యనుభవించుచు గృహక్షేత్రంబులఁ జొచ్చి యుదరపూరణమాత్రంబు దొంగిలినవాని దండింపక భుజగ మృగ మూషిక మర్కట మక్షికా ఖరోష్ట్రంబుల హింసింపక పుత్రుల భంగి నీక్షించుచు దేశకాలదైవంబుల కొలందిని ధర్మార్థ కామంబులఁ బ్రవర్తించుచు శునక పతిత చండాలాదులకైన భోజ్య పదార్థంబులు దగిన భంగి నిచ్చుచు నిజవృత్తిలబ్ధంబు లగు నశనాదులచేత దేవ ఋషి పితృ భూత మానవుల సంతర్పించుచుఁ బంచ మహాయజ్ఞావశేషంబుల నంతర్యామి పురుష యజనంబును నాత్మ జీవనోపాయంబును సమర్థించుచు నుండవలయు. (446) జనక గురుల నైనఁ జంపు నర్థమున కై¯ ప్రాణమైన విడుచు భార్యకొఱకు¯ నట్టి భార్యఁ బురుషుఁ డతిథి శుశ్రూష చే¯ యించి గెలుచు నజితు నీశు నైన. (447) పరముఁ డీశ్వరుండు బ్రాహ్మణముఖమున¯ నాహరించి తుష్టుఁ డయిన భంగి¯ నగ్నిముఖము నందు హవ్యరాసులు గొని¯ యైనఁ దుష్టి నొందఁ డనఘచరిత! (448) కావున గృహస్థుండు బ్రాహ్మణు లందును దేవత లందును మర్త్య పశుప్రముఖ జాతులందును నంతర్యామియు బ్రాహ్మణాననుండును నైన క్షేత్రజ్ఞు నందు నయ్యై కోరికలు సమర్పించి సంతర్పణంబు జేయవలయు భాద్రపదంబునఁ గృష్ణపక్షంబు నందును దక్షిణోత్తరాయణంబు లందును రేయింబగలు సమమైనకాలంబు లందును వ్యతీపాతంబు లందును దినక్షయంబు నందును సూర్యచంద్రగ్రహణంబు లందును శ్రవణ ద్వాదశి యందును వైశాఖ శుక్ల తృతీయ యందును గార్తిక శుక్ల నవమి యందును హేమంత శిశిరంబుల లోను నాలుగష్టక లందును మాఘ శుక్ల సప్తమి యందును మాస నక్షత్రంబులతోడం గూడిన పున్నము లందును ద్వాదశితోడం గూడిన యుత్తరాత్రయ శ్రవణానురాధ లందును నుత్తరాత్రయ సహితంబు లయిన యేకాదశుల యందును జన్మనక్షత్రయుక్త దివసంబు లందును మఱియుఁ బ్రశస్తకాలంబు లందును జననీజనకబంధు జనులకు శ్రాద్ధంబులును జప హోమ స్నాన వ్రతంబులును దేవ బ్రాహ్మణసమారాధనంబులును నాచరింపవలయు భార్యకుఁ బుంసవనాదికంబును నపత్యంబునకు జాతకకర్మాదికంబును దనకు యజ్ఞదీక్షాదికంబును బ్రేతజనులకు దహనాదికంబును మృతదివసంబున సాంవత్సరికంబును జరుపవలయు. (449) విను మే దేశములన్ దయాగుణతపోవిద్యాన్వితం బైన వి¯ ప్రనికాయంబు వసించు, నే స్థలములన్ భాగీరథీముఖ్య వా¯ హినులుండున్, హరిపూజ లెయ్యెడల భూయిష్ఠప్రకారంబులం¯ దనరున్, భూవర! యట్టి చోటులఁ దగున్ ధర్మంబులం జేయఁగన్. (450) హరి యందు జగము లుండును¯ హరిరూపము సాధుపాత్ర మందుండు శివం¯ కర మగు పాత్రము గలిగిన¯ నరయఁగ నది పుణ్యదేశ మనఘచరిత్రా! (451) మఱియు గురుక్షేత్రంబును, గయాశీర్షంబును, బ్రయాగంబును, బులహాశ్రమంబును, నైమిశంబును, ఫాల్గుణంబును, సేతువును, బ్రభాసంబును, గుశస్థలియును, వారణాసియు, మధురాపురియును, బంపా బిందు సరోవరంబులును, నారాయణాశ్రమంబును, సీతారామాశ్రమంబును, మహేంద్ర మలయాదులయిన కులాచలంబులును, హరిప్రతిమార్చన ప్రదేశంబులును, హరిసేవాపరులయిన పరమభాగవతులు వసించెడి పుణ్యక్షేత్రంబులును శుభకాముండైనవాఁడు సేవింపవలయు. (452) భూవరేంద్ర! యిట్టి పుణ్యప్రదేశంబు¯ లందు నరుడు చేయు నట్టి ధర్మ¯ మల్పమైన నది సహస్రగుణాధిక¯ ఫలము నిచ్చు హరికృపావశమున. (453) వినుము; చరాచరంబయిన విశ్వమంతయు విష్ణుమయం బగుటఁ జేసి పాత్ర నిర్ణయ నిపుణులైన విద్వాంసులు నారాయణుండు ముఖ్యపాత్రంబని పలుకుదురు; దేవఋషులును బ్రహ్మపుత్రులైన సనకాదులును నుండ భవదీయ రాజసూయంబున నగ్రపూజకు హరి సమ్మతుం డయ్యె; ననేక జంతు సంఘాత సంకీర్ణంబైన బ్రహ్మాండ పాదపంబునకు నారాయణుండు మూలంబు; తన్నిమిత్తంబు నారాయణ సంతర్పణంబు సకల జంతు సంతర్పణం బని యెఱుంగుము; ఋషి నర తిర్య గమర శరీరంబులు పురంబులు వాని యందుఁ దారతమ్యంబులతోడ జీవరూపంబున భగవంతుడయిన హరి వర్తించుటం జేసి పురుషుండనఁ బ్రసిద్ధుఁ డయ్యె; నందుఁ దిర్యగ్జాతుల కంటె నధికత్వంబు పురుషుని యందు విలసిల్లుటం జేసి పురుషుండు పాత్రంబు; పురుషులలోన హరి తనువైన వేదంబును ధరించుచు సంతోషవిద్యాతపోగరిష్ఠుండైన బ్రాహ్మణుండు పాత్రంబు; బ్రాహ్మణులలోన నాత్మజ్ఞాన పరిపూర్ణుండయిన యోగి ముఖ్యపాత్రం బని పలుకుదురు; పరస్పర పాత్రంబులకు సహింపని మనుష్యులకుఁ బూజనార్థంబుగాఁ ద్రేతాయుగంబు నందు హరి ప్రతిమలు గల్పింప బడియె; కొందఱు ప్రతిమార్చనంబు చేయుదురు; పాత్రపురుషద్వేషు లైనవారలకు నట్టి ప్రతిమార్చనంబు ముఖ్యార్థప్రదంబు గాదు; మందాధికారులకుఁ బ్రతిమార్చనంబు పురుషార్థప్రదం బగును. (454) అఖిలలోకములకు హరి దైవతము చూడ¯ హరికి దైవతము ధరాధినాథ! ¯ పదపరాగలేశ పంక్తిచేఁ ద్రైలోక్య¯ పావనంబు జేయు బ్రాహ్మణుండు. (455) అట్టి బ్రాహ్మణజను లందుఁ గర్మనిష్ఠులుఁ దపోనిష్ఠులు వేదశాస్త్రనిష్ఠులు జ్ఞానయోగనిష్ఠులు నై కొందఱు వర్తింతు; రందు జ్ఞాననిష్ఠునికి ననంతఫలకామి యైన గృహస్థుండు పితృజనుల నుద్దేశించి కవ్యంబులును దేవతల నుద్దేశించి హవ్యంబులును బెట్టుట ముఖ్యంబు; దైవకార్యంబునకు నిరువుర నైన నొకరి నైన బిత్రుకార్యంబునకు మువ్వురి నైన నొకరినైన భోజనంబు చేయింప వలయు; ధనవంతున కైనను శ్రాద్ధవిస్తారంబు కర్తవ్యంబు గాదు; దేశకాలప్రాప్త కందమూలఫలాదికం బయిన హరి నైవేద్యంబున విధిచోదిత ప్రకారంబుగా శ్రద్ధతోడఁ బాత్రంబు నందుఁ బెట్టిన యన్నంబు గామదుహంబయి యక్షయ ఫలకారి యగు; ధర్మతత్త్వవేది యైనవాఁడు శ్రాద్ధంబులందు మాంస ప్రదానంబు జేయక భక్షింపక చరింపవలయు; కంద మూలాది దానంబున నయ్యెడి ఫలంబు పశుహింసనంబున సంభవింపదు; ప్రాణహింస చేయక వర్తించుట కంటె మిక్కిలి ధర్మంబు లేదు; యజ్ఞవిదు లైన ప్రోడలు నిష్కాములై బాహ్యకర్మంబులు విడిచి యాత్మ జ్ఞాన దీపంబులందుఁ గర్మమయంబు లయిన యజ్ఞంబుల నాచరింతురు. (456) పశువులఁ బొరిగొని మఖములు¯ విశదములుగఁ జేయు బుధుని వీక్షించి తమున్¯ విశసనము చేయునో యని ¯ క్రశిమన్ బెగడొందు భూతగణము నరేంద్రా! (457) అదిగావున; ధర్మవేది యయినవాఁడు దైవప్రాప్తంబు లయిన కంద మూలాదికంబులచేత నిత్యనైమిత్తికక్రియలఁ జేయవలయు; నిజధర్మబాధకం బయిన ధర్మంబును, బరథర్మప్రేరితంబయిన ధర్మంబును, నాభాసధర్మంబును, బాషండధర్మంబును, గపటధర్మంబును ధర్మజ్ఞుండయినవాఁడు మానవలయు; నైసర్గికధర్మంబు దురితశాంతి సమర్థం బగు; నిర్ధనుండు ధర్మార్థంబు యాత్ర జేయుచు నైన ధనంబు గోరవలదు జీవనోపాయంబునకు నిట్టట్టుఁ దిరుగక కార్పణ్యంబు లేక జీవించుచు మహాసర్పంబు తెఱంగున సంతోషంబున నాత్మారాముండై యెద్ధియుం గోరక బ్రదికెడి సుగుణునికిం గల సుఖంబు గామ లోభంబుల దశదిశలం బరిధావనంబు చేయువానికి సిద్ధింపదు; పాదరక్షలు గలవానికి శర్కరాకంటకాదుల వలన భయంబు లేక మెలంగ నలవడు భంగిఁ గామంబులవలన నివృత్తి గలవానికి నెల్లకాలంబును భద్రంబగు; ఉపస్థమునకును జిహ్వాదైన్యంబునకును బురుషుండు గృహపాలకశునకంబుకైవడి సంచరించుచు సంతుష్టి లేక చెడు; సంతోషిగాని విప్రుని విద్యా తపో విభవ యశంబులు నిరర్థకంబు లగు; ఇంద్రియలోలత్వంబున జ్ఞానంబు నశించు; సకల భూలోక భోగంబులు భోగించియు దిగ్విజయంబు చేసియు బుభుక్షా పిపాసలవలనఁ గామపారంబును హింసవలనఁ గ్రోధపారంబును జేరుట దుర్లభంబు; సంకల్పవర్జనంబునం గామంబును, గామవర్జనంబునఁ గ్రోధంబును, నర్థానర్థదర్శనంబున లోభంబును, నద్వైతాను సంధానంబున భయంబును, నాత్మానాత్మ వివేకంబున శోకమోహంబులును, సాత్వికసేవనంబున దంభంబును, మౌనంబున యోగాంతరాయంబును, శరీర వాంఛ లేమిని హింసయు, హితాచరణంబున భూతజంబయిన దుఃఖంబును, సమాధిబలంబున దైవికవ్యధయు, బ్రాణాయామాదికంబున మన్మథవ్యధయు, సాత్త్వికాహారంబుల నిద్రయు, సత్త్వగుణంబున రజస్తమంబులును, నుపశమంబున సత్త్వంబును గురుభజన కుశలుఁడై శీలంబున జయింపవలయు. (458) హరిమహిమ దనకుఁ జెప్పిన¯ గురువున్ నరుఁ డనుచుఁ దలఁచి కుంఠితభక్తిం¯ దిరుగు పురుషు శ్రమ మెల్లను¯ కరిశౌచము క్రియ నిరర్థకం బగు నధిపా! (459) ఈ వనజాతనేత్రుఁ బరమేశు మహాత్ముఁ బ్రధానపూరుషున్¯ దేవశరణ్యు సజ్జనవిధేయు ననంతుఁ బురాణయోగ సం¯ సేవితపాదపద్ముఁ దమ చిత్తమునన్ నరుఁ డంచు లోకు లి¯ చ్ఛావిధిఁ జూచుచుండుదురు; సన్మతి లేక నరేంద్రచంద్రమా! (460) వినుము; షడింద్రియంబులలోన నొకటియందుఁ దత్పరులై యిచ్ఛాపూరణ విధానంబులఁ జరితార్థుల మైతి మనువారలు ధారణాభ్యాస సమాధియోగంబుల సాధింప లేరు; కృషిప్రముఖంబులు సంసారసాధనంబులు గాని మోక్ష సాధనంబులు గావు; కుటుంబ సంగంబునఁ జిత్తవిక్షేపం బగు; చిత్తవిజయ ప్రయత్నంబున సన్న్యసించి సంగంబు వర్జించి మితంబయిన భిక్షాన్నంబు భక్షించుచు శుద్ధవివిక్త సమప్రదేశంబున నొక్కరుండు నాసీనుండై సుస్థిరత్వంబున బ్రణవోచ్ఛారణంబు చేయుచు రేచకపూరకకుంభకంబులఁ బ్రాణాపానంబుల నిరోధించి కామహతం బయిన చిత్తంబున బరిభ్రమణంబు మాని కామవిసర్జనంబు చేసి మరలు నంతకు నిజా నాసాగ్ర నిరీక్షణంబు చేయుచు నివ్విధంబున యోగాభ్యాసంబు చేయువాని చిత్తంబు కాష్ఠరహితంబయిన వహ్ని తెఱంగున శాంతిం జెందు కామాదుల చేత వేధింపఁబడక ప్రశాంత సమస్తవృత్తంబయిన చిత్తంబు బ్రహ్మసుఖ సమ్మర్శనంబున లీనంబై మఱియు నెగయ నేరదు. (461) ధరణీదేవుఁడు సన్న్యసించి యతియై ధర్మార్థకామంబులం¯ బరివర్జించి పునర్విలంబమునఁ దత్ప్రారంభి యౌనేని లో¯ భ రతిం గ్రక్కిన కూడు మంచి దనుచున్ భక్షించి జీవించు దు¯ ర్నరు చందంబున హాస్యజీవనుఁ డగున్ నానాప్రకారంబులన్. (462) మలమునఁ గ్రిమియును బడు క్రియ¯ నిలబడు నొడ లాత్మ గాదు హేయం బనుచుం¯ దలఁతురు తద్జ్ఞులు పొగడుదు¯ రలసత నొడ లాత్మ యనుచు నజ్ఞు లిలేశా! (463) వ్రతము మానఁదగదు వడుగు గుఱ్ఱనికిని¯ గ్రియలు మానఁదగదు గృహగతునికి¯ దపసి కూర నుండదగదు సన్న్యాసికిఁ¯ దరుణితోడి పొత్తు తగదు తగదు. (464) రథము మేనెల్ల, సారథి బుద్ధి, యింద్రియ;¯ గణము గుఱ్ఱములు, పగ్గములు మనము, ¯ ప్రాణాది దశవిధ పవనంబు లిరుసు, ధ;¯ ర్మాధర్మగతులు రథాంగకములు, ¯ బహుళతరంబైన బంధంబు చిత్తంబు, ¯ శబ్దాదికములు సంచారభూము, ¯ లభిమాన సంయుతుం డయిన జీవుఁడు రథి, ¯ ఘనతరప్రణవంబు కార్ముకంబు, (464.1) శుద్ధజీవుండు బాణంబు, శుభదమైన ¯ బ్రహ్మ మంచిత లక్ష్యంబు, పరులు రాగ¯ భయ మదద్వేష శోక లోభప్రమోహ¯ మాన మత్సర ముఖములు మానవేంద్ర! (465) ఇట్లు మనుష్య శరీరరూపం బయిన రథంబు దన వశంబు చేసికొని మహాభాగవత చరణకమల సేవా నిశితం బయిన విజ్ఞానఖడ్గంబు ధరియించి శ్రీమన్నారాయణ కరుణావలోకన బలంబున రాగాదిశత్రు నిర్మూలనంబు గావించి ప్రణవబాణాసనంబున శుద్ధజీవశరంబును సంధించి బ్రహ్మ మనియెడి గుఱి యందుఁ బడవేసి యహంకారరథికుండు రథికత్వంబు మాని నిజానందంబున నుండవలయు; నట్టి విశేషంబు సంభవింపని సమయంబున బహిర్ముఖంబు లయిన యింద్రియఘోటకంబులు బుద్ధిసారథి సహితంబులై స్వాభిమాన రథికుని ప్రమత్తత్త్వంబుం దెలిసి ప్రవృత్తిమార్గంబు నొందించి విషయశత్రు మధ్యంబునం గూల్చిన. (466) విషయ శత్రు లెల్ల విక్రాంతితోడ సా¯ రథిసమేతుఁ డయిన రథికుఁ బట్టి¯ యుగ్ర తిమిరమృత్యు యుత మగు సంసార¯ కూపమధ్య మందుఁ గూల్తు రధిప! (467) వినుము; వైదికకర్మంబు ప్రవృత్తంబును నివృత్తంబును నన రెండు దెఱంగు లయ్యె; నందు బ్రవృత్తంబునఁ బునరావర్తనంబును నివృత్తంబున మోక్షంబును సిద్ధించు; ప్రవృత్త కర్మంబులోన నిష్ఠాపూర్తంబులన రెండుమార్గంబులు గల; వందు హింసాద్రవ్యమయ కామ్యరూపంబు లయిన దర్శ పూర్ణమాస పశు సోమయాగ వైశ్వదేవ బలిహరణ ప్రముఖంబు లయిన యాగాదికంబు లిష్టంబులు; దేవతాలయ వన కూప తటాక ప్రముఖంబులు పూర్తంబులు; ప్రవృత్త కర్మంబున దేహంబు విడిచి దేహాంతరారంభంబు నొందు దేహి హృదయాగ్రంబు వెలుంగు వానితోడ నింద్రియంబులం గూడి భూతసూక్ష్మయుక్తుం డై ధూమదక్షిణాయన కృష్ణపక్ష రాత్రిదర్శంబుల వలన సోమలోకంబుఁ జేరి భోగావసానంబున విలీనదేహుండై వృష్టి ద్వారంబునఁ గ్రమంబున నోషధి లతాన్న శుక్ల రూపంబులం బ్రాపించి భూమి యందు జన్మించు; నిది పునర్భవరూపం బయిన పితృమార్గంబు; నివృత్తకర్మ నిష్ఠుం డయినవాఁడు జ్ఞానదీప్తంబు లయిన యింద్రియంబు లందుఁ గ్రియాయజ్ఞంబులు యజించి యింద్రియంబుల దర్శనాది సంకల్ప మూలంబయిన మనంబునందు; వికారయుక్తంబయిన మనంబును వాక్కు నందు; విద్యా విలక్షణ యయిన వాక్కును వర్ణ సముదా యము నందు; వర్ణ సముదాయంబును అకారాది సర్వత్రయాత్మకం బయిన యోంకారంబు నందు; నోంకారంబును బిందు వందు; బిందువును నాదంబు నందు; నాదంబును బ్రాణంబు నందు; బ్రాణంబును బ్రహ్మ మందు నిలుపవలయును; దేవమార్గంబయిన యుత్తరాయణ శుక్లపక్ష దివాప్రాహ్ణపూర్ణిమా రాకలవలన సూర్యద్వారంబున బ్రహ్మలోకంబు నందుఁ జేరి; భోగావసానంబున స్థూలోపాధియైన విశ్వుండై స్థూలంబును సూక్ష్మంబు నందు లయించి; సూక్ష్మోపాధి యైన తైజసుండై సూక్ష్మంబును గారణంబు నందు లయించి; కారణోపాధి యైన ప్రాజ్ఞుండై కారణంబును సాక్షిస్వరూపంబు నందు లయించి; తుర్యుండై సూక్ష్మలయంబునందు శుద్ధాత్ముండై యివ్విధంబున ముక్తుం డగును. (468) అమరనిర్మితంబు లై యొప్పు పితృదేవ¯ సరణు లెవ్వఁ డెఱుఁగు శాస్త్రదృష్టి¯ నట్టివాఁడు దేహి యై మోహమున నొందఁ¯ డతిశయించు బుద్ధి నవనినాథ! (469) వినుము; దేహాదులకుఁ గారణత్వంబున నాదియందును నవధిత్వంబు ననంతమందును గలుగుచు బహిరంగంబున భోగ్యంబును, నంతరంగంబున భోక్తయు, బరంబునఁ నపరంబును, జ్ఞానంబున జ్ఞేయంబును, వచనంబున వాచ్యంబును, నప్రకాశంబున బ్రకాశంబును నైన వస్తువునకు వేఱొండు లేదు; ప్రతిబింబాదికంబు వస్తుత్వంబునం జేసి వికల్పితంబై తలంపంబడు భంగి నైంద్రియకంబైన సర్వంబును నర్థత్వంబున వికల్పితం బయి తోఁచుం గాని పరమార్థంబు గాదు; దేహాదికంబులు మిథ్యాత్మకంబులు; వానికి హేతువు లయిన క్షితిప్రముఖంబులకును మిథ్యాత్వం బగుట సిద్ధంబు; పరమాత్మకు నవిద్యచేత నెంతదడవు వికల్పంబుదోఁచు; నంతదడవును భ్రమంబునుం దోఁచు; అవిద్యానివృత్తి యైన సర్వంబును మిథ్య యని శాస్త్రవిధినిషేధంబులు కలలోపల మేలుగన్న తెఱంగగు; భావాద్వైత క్రియాద్వైత ద్రవ్యాద్వైతంబులు మూఁడు గల; వందుఁ బట తంతు న్యాయంబునఁ గార్యకారణంబు లందు వస్త్వైకత్వాలోచనంబు చేసి వికల్పంబు లేదని భావించుట భావాద్వైతంబు; మనోవాక్కాయ కృతంబు లైన సర్వ కర్మంబులను ఫల భేదంబు జేయక పరబ్రహ్మార్పణంబు జేయుట క్రియాద్వైతంబు; పుత్ర మిత్ర కళత్రాది సర్వ ప్రాణులకుం దనకును దేహంబునకుం బంచభూతాత్మకత్వంబున భోక్త యొక్కం డను పరమార్థత్వంబున నర్థకామంబుల యెడ నైక్యదృష్టిఁ జేయుట ద్రవ్యాద్వైతంబు; నేర్పున నాత్మతత్త్వానుభవంబున నద్వైతత్రయంబును విలోకించి వస్తుభేదబుద్ధియుఁ గర్మభేదబుద్ధియు స్వకీయపరకీయబుద్ధియు స్వప్నంబులుగాఁ దలంచి ముని యైనవాఁడు మానవలయు. (470) వాదములు వేయు నేటికి¯ వేదోక్త విధిం జరించు విబుధుఁడు గృహమం¯ దాదరమున నారాయణ¯ పాదంబులు గొలిచి ముక్తిపదమున కేగున్. (471) భూపాలోత్తమ! మీరు భక్తిగరిమస్ఫూర్తిన్ సరోజేక్షణ¯ శ్రీ పాదాంబుజయుగ్మమున్ నియతులై సేవించి కాదే మహో¯ గ్రాపత్సంఘములోనఁ జిక్కక సమస్తాశాంత నిర్జేతలై¯ యేపారంగ మఖంబు చేసితిరి దేవేంద్రప్రభావంబునన్.

నారదుని పూర్వజన్మంబు

(472) వినుము; పోయిన మహాకల్పంబునందు గంధర్వులలోన నుపబర్హణుం డను పేర గంధర్వుండ నైన నేను సౌందర్య మాధుర్య గాంభీర్యాది గుణంబుల సుందరులకు బ్రియుండనై క్రీడించుచు నొక్కనాఁడు; విశ్వస్రష్టలైన బ్రహ్మలు దేవసత్రమనియెడి యాగంబులోన నారాయణకథలు గానంబు చేయుకొఱకు నప్సరోజనులను గంధర్వులనుం జీరిన. (473) క్రతువులోని కేను గంధర్వగణముతోఁ¯ గలసి పోయి విష్ణుగాథ లచట¯ గొన్ని పాడి సతులఁ గూడి మోహితుఁడ నై¯ తలఁగి చనితి నంత ధరణినాథ! (474) వారిజగంధుల పొత్తున¯ వారిం గైకొనక తలఁగి వచ్చిన బుద్ధిన్¯ వా రెఱిఁగి శాప మిచ్చిరి¯ వారింపఁగరాని రోషవశమున నధిపా! (475) పంకజాక్షు నిచటఁ బాడక కామినీ¯ గణము గూడి చనిన కల్మషమున¯ దగ్ధకాంతి వగుచు ధరణీ తలంబున¯ శూద్రజాతి సతికి సుతుఁడ వగుము. (476) అని యిట్లు విశ్వస్రష్టలు శపించిన నొక బ్రాహ్మణదాసికిఁ బుత్రుండ నై జన్మించి యందు బ్రహ్మవాదు లైన పెద్దలకు శుశ్రూష చేసిన భాగ్యంబున ని మ్మహాకల్పంబు నందు బ్రహ్మపుత్రుండనై జన్మించితి. (477) కౌశలమున మోక్షగతికి గృహస్థుఁ డే¯ ధర్మ మాచరించి తగిలి పోవు¯ నట్టి ధర్మ మెల్ల నతి విశదంబుగాఁ¯ బలుకఁ బడియె నీకు భవ్యచరిత! (478) అఖిలాధారుఁ డజాది దుర్లభుఁడు బ్రహ్మంబైన విష్ణుండు నీ¯ మఖమం దర్చితుఁడై నివాసగతుఁ డై మర్త్యాకృతిన్ సేవ్యుఁ డై¯ సఖి యై చారకుఁ డై మనోదయితుఁ డై సంబంధి యై మంత్రి యై¯ సుఖదుండయ్యె భవన్మహామహిమ దాఁ జోద్యంబు ధాత్రీశ్వరా! (479) అని యిట్లు నారదుండు చెప్పిన వృత్తాంతం బంతయు విని ధర్మనందనుండు ప్రేమవిహ్వలుండయి వాసుదేవునిం బూజించె; వాసుదేవ ధర్మనందనులచేతఁ బూజితుండై నారదముని దేవమార్గంబునం జనియె"నని శుకయోగీంద్రుండు పాండవపౌత్రునకుం జెప్పె"నని సూతుండు శౌనకాదులకుం జెప్పిన.

పూర్ణి

(480) రాజీవసదృశలోచన! ¯ రాజీవభవాది దేవరాజి వినుత! వి¯ బ్రాజితకీర్తిలతావృత¯ రాజీవభవాండ భాండ! రఘుకులతిలకా! (481) ధరణిదుహితృరంతా! ధర్మమార్గానుగంతా! ¯ నిరుపమనయవంతా! నిర్జరారాతిహంతా! ¯ గురుబుధసుఖకర్తా! కుంభినీచక్రభర్తా! ¯ సురభయపరిహర్తా! సూరిచేతోవిహర్తా! (482) హరపటుచాపఖండన! మహాద్భుతవిక్రమశౌర్యభండనా! ¯ శరనిధిగర్వభంజన! రసాతనయాహృదయాబ్జరంజనా! ¯ తరుచరసైన్యపాలన! సుధాంధసమౌనిమనోజ్ఞఖేలనా! ¯ సరసిజగర్భసన్నుత! నిశాచరసంహర! త్రైజగన్నుతా! (483) ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతం బయిన శ్రీ మహాభాగవతం బను మహాపురాణంబు నందు ధర్మనందనునకు నారదుండు హిరణ్యాక్ష హిరణ్యకశిపుల పూర్వజన్మ వృత్తాంతంబు చెప్పుటయు, హిరణ్యకశిపు దితి సంవాదంబును, సుయజ్ఞోపాఖ్యానంబును, ప్రేతబంధు యమ సల్లాపంబును, బ్రహ్మవర లాభ గర్వితుండైన హిరణ్యకశిపు చరిత్రంబును, బ్రహ్లాద విద్యాభ్యాస కథయును, బ్రహ్లాద హిరణ్యకశిపు సంవాదంబును, బ్రహ్లాదవచనంబు ప్రతిష్ఠింప హరి నరసింహ రూపంబున నావిర్భవించి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదునకు నభయం బిచ్చి నిఖిలదేవతానివహ ప్రహ్లాదాది స్తూయమానుండై తిరోహితుం డగుటయుఁ, ద్రిపురాసుర వృత్తాంతంబును, నీశ్వరుండు త్రిపురంబుల దహించుటయు, వర్ణాశ్రమధర్మ వివరణంబును, బ్రహ్లాదాజగర సంవాదంబును, స్వధర్మ ప్రవర్తకుఁ డగు గృహస్థుండు ముక్తుం డగు మార్గంబు నారదుండు ధర్మరాజునకుఁ దెలుపుటయు, నారదుని పూర్వజన్మ వృత్తాంతంబును, నను కథలు గల సప్తమస్కంధము సంపూర్ణము.