పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 2 : సప్తమ స్కంధము 1-79

పోతన తెలుగు భాగవతం
సప్తమ స్కంధము

ఉపోద్ఘాతము

(1) శ్రీ మ ద్విఖ్యాతి లతా¯ క్రామిత రోదోంతరాళ! కమనీయ మహా¯ జీమూత తులిత దేహ¯ శ్యామల రుచిజాల! రామచంద్రనృపాలా!(2) మహనీయ గుణగరిష్ఠు లగు న మ్మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుం డయిన సూతుం డి ట్లనియె; నట్లు ప్రాయోపవిష్టుం డయిన పరీక్షిన్నరేంద్రుడు శుకయోగీంద్రు నవలోకించి.

నారాయణుని వైషమ్య అభావం

(3) "సర్వభూతములకు సముఁడు నెచ్చెలి ప్రియుం¯ డైన వైకుంఠుఁ డనంతుఁ డాద్యుఁ¯ డింద్రుని కొఱకు దైత్యేంద్రుల నేటికి¯ విషముని కైవడి వెదకి చంపె? ¯ నసురులఁ జంపంగ నమరులచేఁ దన, ¯ కయ్యెడి లాభ మింతైనఁ గలదె? ¯ నిర్వాణనాథుండు నిర్గుణుం డగు తన, ¯ కసురుల వలని భయంబుఁ బగయుఁ(3.1) గలుగనేర వట్టి ఘనుఁడు దైత్యులఁ జంపి¯ సురులఁ గాచుచునికి చోద్య మనుచు¯ సంశయంబు నాకు జనియించె మునినాథ! ¯ ప్రజ్ఞమెఱసి తెలియఁ బలుకవయ్య!"(4) అనిన శుకుం డిట్లనియె.(5) "నీ సంప్రశ్నము వర్ణనీయము గదా నిక్కంబు రాజేంద్ర! ల¯ క్ష్మీసంభావ్యుని సచ్చరిత్రము మహాచిత్రంబు చింతింపఁ ద¯ ద్దాసాఖ్యానము లొప్పు విష్ణుచరణధ్యాన ప్రధానంబు లై¯ శ్రీ సంధానములై మునీశ్వర వచో జేగీయమానంబు లై.(6) చిత్రంబులు త్రైలోక్య ప¯ విత్రంబులు భవలతా లవిత్రంబులు స¯ న్మిత్రంబులు మునిజన వన¯ చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్.(7) నరేంద్రా! కృష్ణద్వైపాయనునకు నమస్కరించి హరికథనంబులు జెప్పద వినుము; వ్యక్తుండుగాక గుణంబులు లేక ప్రకృతిం జెందక, భవంబుల నొందక, పరమేశ్వరుండు దన మాయవలన నయిన గుణంబుల నావేశించి, బాధ్య బాధకత్వంబుల నొందు; నతండు గుణరహితుండు; సత్త్వ రజ స్తమంబులు ప్రకృతిగుణంబు; లా గుణంబులకు నొక్కొక్క కాలంబున హానివృద్ధులు గల; వా యీశ్వరుండు సత్త్వంబున దేవఋషులను, రజోగుణంబున నసురులను, దమోగుణంబున యక్ష రక్షోగణంబులను, విభజించె; సూర్యుండు పెక్కెడలం గానంబడియు నొక్కరుం డైన తెఱంగునఁ దద్విభుండును సర్వగతుండయ్యును భిన్నుండు గాఁడు; తత్త్వవిదులైన పెద్దలు దమలోనం బరమాత్మ స్వరూపంబున నున్న యీశ్వరు నివ్విధంబున నెఱుంగుదురు; జీవాత్మకుఁ బరుండైన సర్వమయుండు తన మాయచేత రజంబును విశ్వంబు సృజింపం గోరి, సత్త్వంబును గ్రీడింపం గోరి, తమంబును నిద్రింపం గోరి యుత్పాదించి, చరమైన కాలంబును సృజియించు; నా కాలంబున సర్వదర్శనుం డైన యీశ్వరుండును గాలాహ్వయుండును నై హరి సత్త్వగుణం బయిన దేవానీకంబునకు వృద్ధియు, రజ స్తమోగుణు లయిన రాక్షసులకు హానియుం జేయుచుండు.(8) జననాయక! యీ యర్థము¯ ఘన యశుఁ డగు ధర్మజునకుఁ గ్రతుకాలమునన్¯ మును నారదుండు చెప్పెను¯ వినిపించెద వినుము చెవులు విమలత నొందన్.(9) మున్ను ధర్మరాజు చేయు రాజసూయయాగంబున బాలుండైన శిశుపాలుండు హరిని నిందించి నిశిత నిర్వక్ర చక్రధారా దళిత మస్తకుం డయి తేజోరూపంబున వచ్చి హరిదేహంబు జొచ్చినం జూచి వెఱఁగు పడి ధర్మజుండు సభలోనున్న నారదునిం జూచి యిట్లనియె.(10) "ఎట్టివారికైన నేకాంతులకు నైన, ¯ వచ్చి చొరఁగ రాని వాసుదేవు¯ తత్త్వమందుఁ జేదిధరణీశుఁ డహితుఁడై, ¯ యెట్లు జొచ్చె? మునివరేణ్య! నేఁడు.(11) వేనుఁడు మాధవుం దెగడి విప్రులు దిట్టిన భగ్నుఁడై తమో¯ లీనుఁడు గాఁడె తొల్లి; మదలిప్తుఁడు చైద్యుఁడు పిన్ననాట నుం¯ డేనియు మాధవున్ విన సహింపఁడు భక్తి వహింపఁ డట్టి వాఁ¯ డే నిబిడ ప్రభావమున నీ పరమేశ్వరునందుఁ జొచ్చెనో?(12) హరిసాధింతు హరిన్ గ్రసింతు హరిఁ బ్రాణాంతంబు నొందింతుఁ దా¯ హరికిన్ వైరి నటంచు వీఁడు పటురోషాయత్తుఁడై యెప్పుడుం¯ దిరుగుం, బ్రువ్వదు నోరు, వ్రీలిపడ దా దేహంబు, దాహంబుతో¯ నరకప్రాప్తియు నొందఁ, డే క్రియ జగన్నాథుం బ్రవేశించెనో?(13) అదియునుం గాక, దంతవక్త్రుండును వీఁడును నిరంతరంబు గోవిందు నింద జేయుదురు; నిఖిలజనులు సందర్శింప నేఁడు వీనికి విష్ణు సాయుజ్యంబు గలుగుట కేమి హేతువు? వినిపింపుము; పవన చలితదీపశిఖయునుం బోలె నా హృదయంబు సంచలించుచున్న"దనిన, ధర్మనందనునకు నారదుం డిట్లనియె "దూషణభూషణతిరస్కారంబులు శరీరంబునకుం గాని పరమాత్మకు లేవు; శరీరాభిమానంబునం జేసి దండవాక్పారుష్యంబులు హింసయై తోఁచు తెఱంగున; నేను నాయది యనియెడు వైషమ్యంబును భూతంబులకు శరీరంబు నందు సంభవించు; నభిమానంబు బంధంబు; నిరభిమానుండై వధించినను వధంబుగాదు; కర్తృత్వ మొల్లని వానికి హింసయు సిద్ధింపదు; సర్వభూతాత్మకుండైన యీశ్వరునికి వైషమ్యంబు లేదు; కావున.(14) అలుక నైనఁ జెలిమి నైనఁ గామంబున¯ నైన బాంధవమున నైన భీతి¯ నైనఁ దగిలి తలఁప నఖిలాత్ముఁ డగు హరిఁ¯ జేర వచ్చు వేఱు జేయఁ డతఁడు.(15) వైరానుబంధనంబునఁ¯ జేరిన చందమున విష్ణుఁ జిరతర భక్తిం¯ జేరఁగరా దని తోఁచును¯ నారాయణభక్తి యుక్తి నా చిత్తమునన్.(16) కీటకముఁ దెచ్చి భ్రమరము¯ పాటవమున బంభ్రమింప భ్రాంతంబై త¯ త్కీటకము భ్రమరరూపముఁ¯ బాటించి వహించుఁ గాదె భయయోగమునన్.(17) ఇవ్విధంబున.(18) కామోత్కంఠత గోపికల్, భయమునం గంసుండు, వైరక్రియా¯ సామాగ్రిన్ శిశుపాలముఖ్య నృపతుల్, సంబంధులై వృష్ణులున్, ¯ బ్రేమన్ మీరలు, భక్తి నేము, నిదె చక్రింగంటి; మెట్లైన ను¯ ద్ధామ ధ్యానగరిష్ఠుఁ డైన హరిఁ జెందన్ వచ్చు ధాత్రీశ్వరా!(19) మఱియుం బెక్కండ్రు కామ ద్వేష భయ స్నేహ సేవాతిరేకంబులఁ జిత్తంబు హరిపరాయత్తంబుగాఁ జేసి తద్గతిం జెందిరి; హరి నుద్దేశించి క్రోధాదులైన యేనింటిలోపల నొక్కటి యైన వెన్నునికి లేని నిమిత్తంబున నతండు వ్యర్థుం డయ్యె; మీ తల్లి చెలియలి కొడుకు లయిన శిశుపాల దంతవక్త్రులు దొల్లి విష్ణుమందిర ద్వారపాలకులు; విప్రశాపంబునఁ బదభ్రష్టులై భూతలంబున జన్మించిరి."అనిన విని యుధిష్ఠిరుండు నారదున కిట్లనియె.(20) "అలుగం గారణ మేమి విప్రులకు? ము న్నా విప్రు లెవ్వారు? ని¯ శ్చలు లేకాంతులు నిర్జితేంద్రియులు నిస్సంసారు లీశాను వ¯ ర్తులు వైకుంఠపురీనివాసు లన విందున్ వారి కెబ్భంగి నీ¯ ఖల జన్మంబులు వచ్చె? నారద! వినం గౌతూహలం బయ్యెడిన్."

హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కథ

(21) అనిన నారదుం డిట్లనియె "నొక్కనాఁడు బ్రహ్మమానసపుత్రు లైన సనకసనందనాదులు దైవయోగంబున భువనత్రయంబు నందును సంచరించుచు నై దా ఱేండ్ల ప్రాయంపు బాలకుల భావంబున దిగంబరు లయి హరిమందిరంబునకు వచ్చి చొచ్చునెడ మొగసాల నున్న పురుషు లిరువురు వారలం జూచి.(22) డింభకుల ననర్గళ వి¯ స్రంభకుల రమాధినాథ సల్లాప సుఖా¯ రంభకుల ముక్తమానస¯ దంభకులం జొరఁగనీక తఱిమి రధీశా!(23) వారించిన తమకంబున¯ వా రించుక నిలువలేక వడిఁ దిట్టిరి దౌ¯ వారికుల నసురయోని న¯ వారితులై పుట్టుఁ డనుచు వసుధాధీశా!(24) మఱియు నా పిన్నపెద్దలు వారలం జూచి "మీర లి య్యెడ నుండ నర్హులు గారు; నారాయణచరణకమలంబు విడిచి రజస్తమోగుణులై రాక్షసయోనిం బుట్టుం"డని శపియించిన, వారు నా శాపవశంబునఁ బదభ్రష్టులై కూలుచు మొఱలిడిన న మ్మహాత్ములు దయాళులై క్రమ్మఱం గరుణించి "మూఁడు జన్మంబులకు వైరంబున భగవత్సన్నిధానంబు గలిగెడు"మని నిర్దేశించి చని; రివ్విధంబున శాపహతు లై హరి పార్శ్వచరులైన పురుషు లిరువురు హిరణ్యకశిపు హిరణ్యాక్షు లన దితికి జన్మించి; రందుఁ గనిష్ఠుఁడైన హిరణ్యాక్షుని హరి వరాహ రూపంబున సంహరించె; నగ్రజుండయిన హిరణ్యకశిపుండు నరసింహ మూర్తి యయిన శ్రీహరిచేత విదళితుం డయ్యె; నతని కొడుకు ప్రహ్లాదుండు దండ్రిచేత హింసితుఁడయ్యును నారాయణపరాయణుండై శాశ్వతుం డయ్యె; రెండవ భవంబునఁ గైకశి యను రాక్షసికి రావణ కుంభకర్ణులయి సంభవించిన, విశ్వంభరుడు రఘుకులంబున రాఘవుండయి యవతరించి వారల వధియించె; న మ్మహాత్ముని పరాక్రమంబులు మార్కండేయ ఋషి వలన నెఱింగెదవు; తృతీయ జన్మంబున మీ తల్లి చెలియలికి శిశుపాల దంతవక్త్రు లన నుద్భవించి.(25) వక్రం బింతయు లేక పాయని మహావైరంబునన్ నిత్యజా¯ త క్రోధ స్మరణంబులన్ విదళితోద్యత్పాప సంఘాతులై¯ చక్రచ్ఛిన్న శిరస్కులై మునివచశ్శాపావధి ప్రాప్తులై¯ చక్రిం జెందిరి వారు పార్శ్వచరులై సారూప్య భావంబునన్."(26) అనిన విని ధర్మనందనుం డిట్లనియె.(27) "బాలున్ హరిపదచింతా¯ శీలున్ సుగుణాలవాలు శ్రీమన్మేధా¯ జాలున్ సంతోషింపక¯ యేలా శిక్షించె రాక్షసేంద్రుం డనఘా!(28) పరిభూత వ్యధనంబులు, ¯ నిరుపమ సంసారజలధి నిర్మథనంబుల్¯ నరకేసరి కథనంబులు, ¯ పరిరక్షిత దేవ యక్ష ఫణి మిథునంబుల్.(29) మునీంద్రా! వినిపింపు"మనిన నారదుం డిట్లనియె "కమలోదరుచేతం దన సహోదరుండు హతుం డయ్యె నని విని హిరణ్యకశిపుండు రోష శోక దందహ్యమాన మానసుం డయి ఘూర్ణిల్లుచు నాభీలదావదహన జ్వాలా కరాళంబు లయిన విలోకన జాలంబుల గగనంబునం బొగలెగయ నిరీక్షించుచుఁ దటిల్లతాంకుర సంకాశ ధగద్ధగిత దంత సందష్ట దశనచ్ఛదుండును, నదభ్ర భయంకర భ్రుకుటిత ఫాలభాగుండును, నిరంతరాక్రాంత దురంత వైర వేగుండును నై మహాప్రభాజాల జటాలంబగు శూలంబుఁ గేల నందుకొని సభామండపంబున నిలువంబడి త్రిమస్తక, త్రిలోచన, శకుని, శంబర, శతబాహు, నముచి, హయగ్రీవ, పులోమ, విప్రచిత్తి ప్రముఖులైన దైత్య దానవుల నాలోకించి యిట్లనియె.(30) "నాకుం దమ్ముఁడు మీకు నెచ్చెలి రణన్యాయైకదక్షుండు బా¯ హాకుంఠీకృత దేవయక్షుఁడు హిరణ్యాక్షుండు వానిన్ మహా¯ సౌకర్యాంగము దాల్చి దానవవధూ సౌకర్యముల్ నీఱుగా¯ వైకుంఠుండు వధించిపోయెనఁట! యీ వార్తాస్థితిన్ వింటిరే?(31) వనముల నుండుఁ జొచ్చు ముని వర్గములోపల ఘోణిగాఁడు సం¯ జనన మెఱుంగ రెవ్వరును జాడ యొకింతయు లేదు తన్ను డా¯ సిన మఱి డాయు వెంటఁబడి చిక్కక చిక్కఁడు వీని నొక్క కీ¯ లున మన మెల్ల లోఁబడక లోఁబడఁ బట్టుకొనంగవచ్చునే?(32) భుజశక్తి నాతోడఁ బోరాడ శంకించి¯ మున్నీట మునిఁగిన మునుఁగుఁ గాక; ¯ అలయించి పెనఁగు నా యచలసంభ్రమమున¯ కెఱఁగి వెన్నిచ్చిన నిచ్చుఁ గాక; ¯ జగడంబు సైఁపక సౌకర్యకాంక్షియై¯ యిల క్రింద నీఁగిన నీఁగుఁ గాక; ¯ క్రోధించి యటుగాక కొంత పౌరుషమున¯ హరి భంగి నడరిన నడరు గాక;(32.1) కఠినశూలధారఁ గంఠంబు విదళించి, ¯ వాని శోణితమున వాఁడి మెఱసి, ¯ మత్సహోదరునకు మహిఁ దర్పణము జేసి, ¯ మెఱసివత్తు మీకు మేలు దెత్తు.(33) ఖండిత మూలద్రుమమున¯ నెండిన విటపముల భంగి నితఁడు పడిన, నా¯ ఖండల ముఖ్యులు పడుదురు, ¯ భండనమున నితఁడు దమకుఁ బ్రాఁణము లగుటన్.(34) పొండు దానవులార! భూసురక్షేత్ర సం¯ గతయైన భూమికి గములు గట్టి¯ మఖతపస్స్వాధ్యాయ మౌనవ్రతస్థుల¯ వెదకి ఖండింపుఁడు విష్ణుఁ డనఁగ¯ నన్యుఁ డొక్కఁడు లేఁడు యజ్ఞంబు వేదంబు¯ నతఁడె భూదేవ క్రి యాదిమూల¯ మతఁడు దేవర్షి పిత్రాదిలోకములకు¯ ధర్మాదులకు మహాధార మతఁడె(34.1) యే స్థలంబుల గో భూసురేంద్ర వేద¯ వర్ణధర్మాశ్రమంబులు వరుస నుండు¯ నా స్థలంబుల కెల్ల మీ రరిగి చెఱచి¯ దగ్ధములు జేసి రండు మీ దర్ప మొప్ప."(35) అని యిట్లు నిర్దేశించిన దివిజమర్దను నిర్దేశంబులు శిరంబుల ధరియించి రక్కసులు పెక్కండ్రు భూతలంబునకుం జని.(36) గ్రామ పుర క్షేత్ర ఖర్వట ఖేట ఘో¯ షారామ నగరాశ్రమాదికములు¯ గాలిచి, కొలఁకులు గలఁచి, ప్రాకార గో¯ పుర సేతువులు త్రవ్వి, పుణ్య భూజ¯ చయములు ఖండించి, సౌధ ప్రపా గేహ¯ పర్ణశాలాదులు పాడుచేసి, ¯ సాధు గో బ్రాహ్మణ సంఘంబులకు హింస¯ గావించి, వేదమార్గములు జెఱచి,(36.1) కుతల మెల్ల నిట్లు కోలాహలంబుగా¯ దైత్యు లాచరింపఁ దల్లడిల్లి¯ నష్టమూర్తు లగుచు నాకలోకము మాని¯ యడవులందుఁ జొచ్చి రమరవరులు.(37) అంత హిరణ్యకశిపుండు దుఃఖితుండై, మృతుం డయిన సోదరునకు నుదక ప్రదానాది కార్యంబు లాచరించి, యతని బిడ్డల శకుని, శంబర, కాలనాభ, మదోత్కచ ప్రముఖుల నూఱడించి, వారల తల్లితోఁ గూడ హిరణ్యాక్షుని భార్యల నందఱ రావించి, తమ తల్లియైన దితి నవలోకించి యిట్లనియె.(38) నీరాగారనివిష్ట పాంథుల క్రియన్ నిక్కంబు సంసార సం¯ చారుల్ వత్తురు గూడి విత్తురు సదా; సంగంబు లే దొక్కచో; ¯ శూరుల్ పోయెడి త్రోవఁ బోయెను భవత్సూనుండు దల్లీ! మహా¯ శూరుం డాతఁడు త ద్వియోగమునకున్ శోకింప నీ కేటికిన్.(39) సర్వజ్ఞుఁ డీశుండు సర్వాత్ముఁ డవ్యయుం¯ డమలుండు సత్యుఁ డనంతుఁ డాఢ్యుఁ¯ డాత్మరూపంబున నశ్రాంతమును దన¯ మాయాప్రవర్తన మహిమవలన¯ గుణములఁ గల్పించి గుణసంగమంబున¯ లింగశరీరంబు లీలఁ దాల్చి¯ కంపిత జలములోఁ గదలెడి క్రియఁ దోచు¯ పాదపంబుల భంగి భ్రామ్యమాణ(39.1) చక్షువుల ధరిత్రి చలితయై కానంగఁ¯ బడిన భంగి, వికల భావరహితుఁ¯ డాత్మమయుఁడు గంపి తాంతరంగంబునఁ¯ గదలినట్లు తోఁచుఁ గదలకుండు.

సుయజ్ఞోపాఖ్యానము

(40) అవ్వా! యి వ్విధంబున లక్షణవంతుండు గాని యీశ్వరుండు లక్షితుండై కర్మసంసరణంబున యోగవియోగంబుల నొందించు సంభవ వినాశ శోక వివేకావివేక చింతా స్మరణంబులు వివిధంబు; లీ యర్థంబునకుఁ బెద్దలు ప్రేతబంధు యమ సంవాదం బను నితిహాసంబు నుదాహరింతురు; వినుండు, చెప్పెద; నుశీనర దేశంబు నందు సుయజ్ఞుం డను రాజు గలం; డతండు శత్రువులచేత యుద్ధంబున నిహతుం డయి యున్న యెడ.(41) చిరిఁగిన బహురత్న చిత్రవర్మముతోడ¯ రాలిన భూషణ రాజితోడ¯ భీకరబాణ నిర్భిన్న వక్షముతోడఁ¯ దఱచుఁ గాఱెడు శోణితంబుతోడఁ¯ గీర్ణమై జాఱిన కేశబంధముతోడ¯ రయరోషదష్ట్రాధరంబుతోడ¯ నిమిషహీనం బైన నేత్రయుగ్మముతోడ¯ భూరజోయుత ముఖాంబుజముతోడఁ(41.1) దునిసిపడిన దీర్ఘ దోర్దండములతోడ¯ జీవరహితుఁ డగు నుశీనరేంద్రుఁ¯ జుట్టి బంధుజనులు సొరిది నుండఁగ భయా¯ క్రాంత లగుచు నతని కాంత లెల్ల.(42) స్రస్తాకంపిత కేశబంధములతో సంఛిన్నహారాళితో¯ హస్తాబ్జంబులు సాఁచి మోఁదికొనుచున్ హా నాథ! యంచున్ బహు¯ ప్రస్తావోక్తులతోడ నేడ్చిరి వగం బ్రాణేశు పాదంబుపై¯ నస్తోక స్తనకుంకమారుణ వికీర్ణాస్రంబు వర్షించుచున్.(43) "అనఘా! నిన్ను నుశీనరప్రజల కర్థానందసంధాయిగా¯ మును నిర్మించిన బ్రహ్మ నిర్దయత నున్మూలించెనే వీరికిం¯ దనయశ్రేణికి మాకు దిక్కు గలదే ధాత్రీశ! నీబోఁటికిం¯ జనునే పాసి చనంగ భాతృజనులన్ సన్మిత్రులం బుత్రులన్.(44) జనలోకేశ్వర! నిన్నుఁ బాసిన నిమేషంబుల్ మహాబ్దంబులై¯ చను లోకాంతరగామివై మరల కీ చందంబునన్ నీవు పో¯ యిన మే మెట్లు చరింతు మొల్లము గదా యీ లోకవృత్తంబు నేఁ¯ డనలజ్వాలలఁ జొచ్చి వచ్చెదము నీ యంఘ్రిద్వయిం జూడగన్."(45) అని యిట్లు రాజభార్య లా రాజశవంబు డగ్గఱి విలపింపం బ్రొద్దు గ్రుంకెడు సమయంబున వారల విలాపంబులు విని బ్రాహ్మణబాలకుం డై యముండు చనుదెంచి ప్రేతబంధువులం జూచి యిట్లనియె.(46) "మచ్చిక వీరికెల్ల బహుమాత్రముఁ జోద్యము దేహి పుట్టుచుం¯ జచ్చుచు నుంటఁ జూచెదరు చావక మానెడువారిభంగి నీ ¯ చచ్చినవారి కేడ్చెదరు చావున కొల్లక డాఁగ వచ్చునే? ¯ యెచ్చటఁ బుట్టె నచ్చటికి నేఁగుట నైజము ప్రాణికోటికిన్.(47) జననీజనకులఁ బాసియు, ¯ ఘన వృకముల బాధపడక కడుఁ బిన్నలమై¯ మనియెద మెవ్వఁడు గర్భం¯ బున మును పోషించె వాఁడె పోషకుఁ డడవిన్.(48) ఎవ్వఁడు సృజించుఁ బ్రాణుల, ¯ నెవ్వఁడు రక్షించుఁ ద్రుంచు నెవ్వఁ డనంతుం¯ డెవ్వఁడు విభుఁ డెవ్వఁడు వాఁ¯ డివ్విధమున మనుచుఁ బెనుచు హేలారతుఁడై.(49) ధనము వీథిఁ బడిన దైవవశంబున¯ నుండు; పోవు మూల నున్న నైన; ¯ నడవి రక్ష లేని యబలుండు వర్ధిల్లు; ¯ రక్షితుండు మందిరమునఁ జచ్చు.(50) కలుగును మఱి లేకుండును¯ గల భూతము లెల్లఁ గాలకర్మవశము లై¯ నిలుఁవడు ప్రకృతిం దద్గుణ¯ కలితుఁడు గాఁ డాత్మమయుఁ డగమ్యుఁడు దలపన్.(51) పాంచభౌతికమైన భవనంబు దేహంబు¯ పురుషుఁడు దీనిలోఁ బూర్వకర్మ¯ వశమున నొకవేళ వర్తించు దీపించుఁ¯ దఱియైన నొకవేళఁ దలఁగి పోవుఁ¯ జెడెనేని దేహంబు సెడుఁగాని పురుషుండు¯ చెడ డాతనికి నింత చేటులేదు¯ పురుషునకిని దేహపుంజంబునకు వేఱు¯ గాని యేకత్వంబు గానరాదు(51.1) దారువులఁ వెలుంగు దహనుని కైవడిఁ¯ గాయములఁ జరించు గాలిభంగి¯ నాళలీనమైన నభము చాడ్పున వేఱు¯ దెలియవలయు దేహి దేహములకు.(52) అని మఱియు నిట్లనియె.(53) భూపాలకుఁడు నిద్రపోయెడి నొండేమి¯ విలపింప నేటికి వెఱ్ఱులార! ¯ యెవ్వఁడు భాషించు నెవ్వఁ డాకర్ణించు¯ నట్టి వాఁ డెన్నడో యరిగినాఁడు, ¯ ప్రాణభూతుం డైన పవనుఁ డాకర్ణింప¯ భాషింప నేరఁడు, ప్రాణి దేహ¯ ములకు వేఱై తాన ముఖ్యుఁడై యింద్రియ¯ వంతుఁడై జీవుండు వలను మెఱయ,(53.1) ప్రాభవమున భూత పంచకేంద్రియమనో¯ లింగదేహములను లీలఁ గూడు¯ విడుచు నన్యుఁ డొకఁడు విభుఁడు దీనికి మీరు¯ పొగల నేల? వగలఁ బొరల నేల?(54) ఎందాఁక నాత్మ దేహము¯ నొందెడు నందాఁకఁ గర్మయోగము; లటపైఁ¯ జెందవు; మాయాయోగ¯ స్పందితులై రిత్త జాలిఁబడ నేమిటికిన్?(55) చెలులుం దల్లులు దండ్రు లాత్మజులు సంసేవ్యుల్ సతుల్ చారు ని¯ ర్మలగేహంబు లటంచుఁ గూర్తురు మహామాయాగుణ భ్రాంతులై¯ కలలోఁ దోచిన యోగముల్ నిజములే కర్మానుబంధంబులం¯ గలుగున్ సంగము లేక మానుఁ బిదపం గర్మాంతకాలంబునన్.(56) మఱియు, మాయాగుణప్రపంచంబు నెఱింగెడు తత్త్వజ్ఞులు నిత్యానిత్యంబులం గూర్చి సుఖదుఃఖంబులం జెంద; రజ్ఞులు గొందఱు యోగ వియోగంబులకు సుఖదుఃఖంబుల నొందుదురు; తొల్లి యొక్క మహా గహనంబున విహగంబులకు నంతకభూతుం డైన యెఱుక గల; డతం డొక్కనాఁడు ప్రభాతంబున లేచి వాటంబైన వేఁట తమకంబున,(57) వల, లురులు, జిగురుఁ గండెలుఁ, ¯ జలిదియు, జిక్కంబు, ధనువు, శరములుఁ గొనుచుం¯ బులుఁగులఁ బట్టెడు వేడుక¯ యలుఁగులు వెడలంగఁ గదలి యడవికిఁ జనియెన్.(58) ఇట్లడవికిం జని తత్ప్రదేశంబు నందు.(59) కట్టలుకఁ దడుకుచాటునఁ¯ బిట్టల నురిగోలఁ దిగిచి, బిఱుసున ఱెక్కల్¯ పట్టి విఱిచి, చిక్కములోఁ¯ బెట్టుచు విహరించె లోకభీకరలీలన్.(60) మఱియు నానావిధంబు లగు శకుంతలంబుల నంతంబు నొందించుచు సకల పక్షి సంహార సంరబ్ధకుం డైన లుబ్ధకుండు దన ముందటఁ గాలచోదితంబై సంచరించుచున్న కుళింగపక్షి మిథునంబు గనుంగొని యందుఁ గుళింగి నురిం దిగిచి యొక్క చిక్కంబులో వైచినం జూచి దుఃఖించి కుళింగపక్షి యిట్లనియె.(61) "అడవుల మేఁత మేసి మన మన్యుల కెన్నఁడు నెగ్గు జేయ కి¯ క్కడ విహరింప నేఁ డకట కట్టిఁడి బ్రహ్మ కిరాతు చేతిలోఁ¯ బడు మని వ్రాసెనే నుదుటఁ బాపపు దైవము కంటి కింత యె¯ క్కుడు బరువయ్యెనే బ్రదుకు గోమలి! యే మన నేర్తుఁ జెల్లరే.(62) ఒకమాటు మనల నందఱఁ ¯ బ్రకటించి కిరాతువలలఁ బడఁజేయక ని¯ న్నొకతిన్ వలఁబడఁ జేసిన¯ వికటీకృత దక్ష మైన విధి నే మందున్.(63) ఱెక్కలు రావు పిల్లలకు ఱేపటినుండియు మేఁత గానమిం¯ బొక్కెడు గూటిలో నెగసి పోవఁగ నేరవు; మున్ను తల్లి యీ¯ దిక్కుననుండి వచ్చు నని త్రిప్పని చూడ్కుల నిక్కినిక్కి న¯ ల్దిక్కులుఁ జూచుచున్న వతిదీనత నెట్లు భరింతు నక్కటా!"(64) అని యి వ్విధంబున.(65) కుంఠితనాదముతోడను¯ గంఠము శోషింప వగచు ఖగమును హననో¯ త్కంఠుండైన కిరాతుఁ డ¯ కుంఠితగతి నేసె నొక్క కోలం గూలన్.(66) కాలము వచ్చిన శబరుని¯ కోలను ధరఁగూలె ఖగము ఘోషముతోడం¯ గాలము డాసిన నేలం¯ గూలక పో వశమె యెట్టి గుణవంతులకున్.(67) కావున మీఱు చచ్చుతఱిఁ గానరు చచ్చి ధరిత్రిఁ బడ్డ ధా¯ త్రీవిభు దేహముం గదిసి దీనత నేడువ నేల? పొండు చిం¯ తావతులార! వత్సర శతంబుల కైన నిజేశు చక్కికిం¯ బోవుట దుర్లభంబు; మృతిఁ బొందినవారలు చేర వత్తురే."(68) అని యిట్లు కపటబాలకుండై క్రీడించుచున్న యముని యుపలాల నాలాపంబులు విని సుయజ్ఞుని బంధువు లెల్ల వెఱఁగుపడి సర్వప్రపంచంబు నిత్యంబుగాదని తలంచి శోకింపక సుయజ్ఞునికి సాంపరాయిక కృత్యంబులు జేసి చని; రంత నంతకుం డంతర్హితుం డయ్యె"నని చెప్పి హిరణ్యకశిపుండు దన తల్లిని దమ్ముని భార్యలం జూచి యిట్లనియె.(69) "పరులెవ్వరు దా మెవ్వరు¯ పరికింపఁగ నేక మగుట భావింపరు త¯ త్పరమజ్ఞానము లేమిని¯ బరులును నే మనుచుఁ దోఁచుఁ బ్రాణుల కెల్లన్."(70) అని తెలియం బలికిన హిరణ్యకశిపుని వచనంబులు విని దితి గోడండ్రునుం దానును శోకంబు మాని తత్త్వవిలోకనంబు గలిగి లోకాంతరగతుండైన కొడుకునకు వగవక చనియె"నని చెప్పి నారదుండు ధర్మనందనున కిట్లనియె.(71) "అజరామరభావంబును ¯ ద్రిజగద్రాజ్యంబు నప్రతిద్వంద్వము దో¯ ర్విజితాఖిల శాత్రవమును¯ గజరిపుబలమును హిరణ్యకశిపుఁడు గోరెన్.(72) ఇట్లు గోరి మందరాచల ద్రోణికిం జని; యందుఁ గాలి పెనువ్రేల నేల నిలువంబడి, యూర్ధ్వబాహుండయి మిన్ను చూచుచు, వాఁడి మయూఖంబులతోడి ప్రళయకాల భానుండునుం బోలె దీర్ఘజటారుణ ప్రభాజాలంబులతోడ నెవ్వరికిం దేఱిచూడరాక పరమ దారుణంబైన తపంబు జేయుచుండె; నిర్జరులు నిజస్థానంబుల నుండి; రంత.(73) అదిరెం గుంభుని, సాద్రియై కలఁగె నే డంభోనిధుల్, తారకల్¯ చెదరెన్ సగ్రహసంఘలై, దిశలు విచ్ఛిన్నాంతలై మండెఁ, బె¯ ల్లదరెన్ గుండెలు జంతుసంహతికి, నుగ్రాచార దైత్యేంద్ర మూ¯ ర్ధ దిశోద్ధూతసధూమ హేతిపటలోదంచత్తపోవహ్నిచేన్.(74) ఇట్లు త్రైలోక్య సంతాపకరం బైన దైత్యరాజ తపో విజృంభణంబు సైరింపక నిలింపులు నాకంబు విడిచి బ్రహ్మలోకంబునకుం జని లోకేశ్వరుం డయిన బ్రహ్మకు వినతులయి యిట్లని విన్నవించిరి.(75) "దితికొడుకు తపము వేఁడిమి¯ నతి తప్తుల మైతి మింక నలజడి నమరా¯ వతి నుండ వెఱతు; మెయ్యది¯ గతి మాకును? దేవదేవ! కారుణ్యనిధీ!(76) శంకా లేశము లేదు దేవ! త్రిజగ త్సంహారమున్ దేవతా¯ సంకోచంబును వేదశాస్త్ర పదవీ సంక్షేపమున్ లేక యే¯ వంకన్ లేవ నటంచు దుస్సహతపోవ్యావృత్తి చిత్తంబులో¯ సంకల్పించె నిశాచరుండు ప్రతిసంస్కారంబు చింతింపవే.(77) నీ వేరీతిఁ దపోబలంబున జగన్నిర్మాణముం జేసి యీ¯ దేవాధీశులకంటె నెక్కుడు సిరిం దీపించి తిబ్బంగిఁ దా¯ నీ విశ్వంబుఁ దపస్సమాధిమహిమన్ హింసించి వేఱొక్క వి¯ శ్వావిర్భావకరత్వశక్తి మదిలో నర్థించినాఁ డీశ్వరా!(78) అదియునుం గాక, కాలాత్మకులగు జీవాత్మల కనిత్యత్వంబు గలుగుటం జేసి తపోయోగసమాధిబలంబునం దనకు నిత్యత్వంబు సంపాదింతు నని తలంచినా"డని మఱియు నిట్లనిరి.(79) భవదీయం బగు నున్నతోన్నత మహాబ్రహ్మైక పీఠంబు సం¯ స్తవనీయం బగు భూతియున్ విజయమున్ సౌఖ్యంబు సంతోషమున్¯ భువనశ్రేణికి నిచ్చి దైత్యుని తపస్పూర్తిన్ నివారించి యో¯ భువనాధీశ్వర! కావవే భువనముల్ పూర్ణప్రసాదంబునన్.