పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ ఉత్తర 441 - 537

శివుడు కృష్ణుని స్తుతించుట

(441) “దేవా! నీవు బ్రహ్మరూపంబగు జ్యోతిర్మయుండవు; నిఖిల వేద వేదాంత నిగూఢుండవు; నిర్మలుండవు; సమానాధిక రహితుం డవు; సర్వవ్యాపకుండవైన నిన్ను నిర్మలాంతఃకరణులైన వారలాకాశంబు పగిది నవలోకింతు; రదియునుంగాక పంచోపనిషన్మయం బయిన భవదీయ దివ్యమంగళ మహావిగ్రహ పరిగ్రహంబు సేయునెడ నాభియం దాకాశంబును, ముఖంబునం గృశానుండును, శిరంబున స్వర్గంబును, శ్రోత్రంబుల దిశలును, నేత్రంబుల సూర్యుండును, మనంబునఁ జంద్రుఁడును, బాదంబుల వసుంధరయు, నాత్మ యందహంకారంబును, జఠరంబున జలధులును, రేతంబున నంబువులును, భుజంబుల నింద్రుండును, రోమంబుల మహీరుహౌషధీ వ్రాతంబును, శిరోజంబుల బ్రహ్మలును, జ్ఞానంబున సృష్టియు, నవాంతర ప్రజాపతులును, హృదయంబున ధర్మంబును గలిగి మహాపురుషుండవై లోకకల్పనంబుకొఱకు నీ యకుంఠితతేజంబు గుప్తంబుసేసి జగదుద్భవంబుకొఱకుఁ గైకొన్న భవదీయ దివ్యావతారవైభవం బెఱింగి నుతింప నెంతవారము; నీవు సకలచేతనాచేతననిచయంబులకు నాద్యుండవు; యద్వితీయుండవు; పురాణపురుషుండవు; సకల సృష్టి హేతుభూతుండవు; నీశ్వరుండవు; దినకరుండు కాదంబినీ కదంబావృతుం డగుచు భిన్నరూపుండై బహువిధచ్ఛాయలం దోఁచు విధంబున నీ యఘటితఘటనానిర్వాహకంబైన సంకల్పంబునఁ ద్రిగుణాతీతుండవయ్యును సత్త్వాదిగుణవ్యవధానంబుల ననేక రూపుండ వై గుణవంతులైన సత్పురుషులకుఁ దమోనివారకంబైన దీపంబు రూపంబునం బ్రకాశించుచుందువు; భవదీయమాయా విమోహితులయిన జీవులు పుత్త్ర దార గృహ క్షేత్రాది సంసారరూపకంబైన పాప పారావారమహావర్తగర్తంబుల మునుంగుచుందేలుచుందురు; దేవా! భవదీయ దివ్యరూపానుభవంబు సేయంజాలక యింద్రియ పరతంత్రుండై భవత్పాదసరసీరుహంబులఁ జేరనెఱుంగని మూఢాత్ముం డాత్మవంచకుండనంబడు; విపరీతబుద్ధిం జేసి ప్రియుండ వైన నిన్ను నొల్లక యింద్రియార్థానుభవంబు సేయుట యమృతంబుమాని హాలాహలంబుసేవించుట గాదె? జగదుదయపాలన లయలీలాహేతుండవై శాంతుండవయి సుహృజ్జన భాగధేయుండ వై సమానాధికవస్తుశూన్యుండవైన నిన్ను నేనును బ్రహ్మయుం బరిణతాంతఃకరణు లైన ముని గణంబులును భజియించుచుందుము; మఱియును. (442) అవ్యయుండ; వనంతుండ; వచ్యుతుండ; ¯ వాదిమధ్యాంతశూన్యుండ; వఖిలధృతివి ¯ నిఖిలమం దెల్ల వర్తింతు నీవు దగిలి ¯ నిఖిల మెల్లను నీ యంద నెగడుఁ గృష్ణ!" (443) అని సన్నుతించిన హరి యాత్మ మోదించి¯ మొగమునఁ జిఱునవ్వు మొలకలెత్త ¯ లలితబాలేందుకళామౌళి కిట్లను¯ "శంకర! నీ మాట సత్య మరయ ¯ నేది నీ కిష్టమై యెసఁగెడు దానిన; ¯ వేఁడుము; నీకిత్తు వీఁ డవధ్యుఁ¯ డిది యెట్టి దనినఁ బ్రహ్లాదుండు మద్భక్తుఁ¯ డతనికి వరము నీ యన్వయమున (443.1) జనన మందిన వారలఁ జంప ననుచుఁ ¯ గడఁక మన్నించితిని యది కారణమున ¯ విశ్వవిశ్వంభరాభార విపులభూరి ¯ బలభుజాగర్వ మడఁపంగ వలయుఁగాన. (444) కరములు నాలుగు సిక్కం ¯ బరిమార్చితి, వీఁడు నీదు భక్తుల కగ్రే ¯ సరుఁడై పొగడొంది జరా ¯ మరణాది భయంబు దక్కి మను నిటమీఁదన్." (445) అని యానతిచ్చిన నంబికావరుండు సంతుష్టాంతరంగుం డయ్యె; నబ్బలినందనుం డట్లు రణరంగవేదిం గృష్ణదేవతాసన్నిధిం బ్రజ్వలిత చక్రకృశాను శిఖాజాలంబులందు నిజబాహా సహస్ర శాఖా సమిత్ప్రచయంబును, దత్‌క్షతోద్వేలకీలాల మహితాజ్యధారాశతంబును, బరభయంకర వీరహుంకార మంత్రంబులతోడ వేల్చి పరిశుద్ధిం బొంది విజ్ఞానదీపాంకురంబున భుజాఖర్వగర్వాంధకారంబు నివారించినవాఁడై యనవరతపూజితస్థాణుండగు నబ్బాణుండు, భుజవనవిచ్ఛేదజనితవిరూపితస్థాణుం డయ్యును దదీయవరదాన కలితానంద హృదయారవిందుం డగుచు గోవిందచరణారవిందంబులకుఁ బ్రణామంబు లాచరించి; యనంతరంబ. (446) పురమున కేగి యుషా సుం ¯ దరికిని ననిరుద్ధునకు ముదంబున భూషాం ¯ బర దాసదాసికాజన ¯ వరవస్తువితాన మొసఁగి వారని భక్తిన్. (447) కనకరథంబున నిడుకొని ¯ ఘనవైభవ మొప్పఁ గన్యకాయుక్తముగా ¯ ననిరుద్ధుని గోవిందుం ¯ డనుమోదింపంగ దెచ్చి యర్పించె నృపా! (448) అంత మురాంతకుండు త్రిపురాంతకు వీడ్కొని బాణు నిల్పి య¯ త్యంతవిభూతిమై నిజబలావలితోఁ జనుదేర నా యుషా ¯ కాంతుఁడు మున్నుగాఁ బటహ కాహళ తూర్య నినాద పూరితా¯ శాంతరుఁడై వెసం జనియె నాత్మ పురీముఖుఁడై ముదంబునన్. (449) కనియెన్ గోపకుమారశేఖరుఁడు రంగత్ఫుల్లరాజీవ కో ¯ కనదోత్తుంగ తరంగసంగత లసత్కాసారకన్ భూరి శో ¯ భన నిత్యోన్నత సౌఖ్యభారక నుదంచద్వైభవోదారకన్ ¯ జనసంతాపనివారకన్ సుజనభాస్వత్తారకన్ ద్వారకన్. (450) కని డాయంజనఁ బురలక్ష్మి కృష్ణ సందర్శన కుతూహలయై చేసన్నలం జీరు చందంబున నందంబునొందు నుద్ధూతతరళ విచిత్ర కేతుపతాకాభిశోభితంబును, మహనీయ మరకతతోరణ మండితంబును, గనకమణి వినిర్మితగోపురసౌధప్రాసాద వీథికావిలసితంబును, మౌక్తిక వితానవిరచిత మంగళ రంగవల్లీ విరాజితంబును, శోభనాకలితవిన్యస్త కదళికాస్తంభ సురభి కుసుమమాలి కాక్షతాలంకృతంబును, గుంకుమ సలిల సిక్త విపణిమార్గంబును, శంఖ దుందుభి భేరీ మృదంగ పటహ కాహళాది తూర్య మంగళారావ కలితంబును, వంది మాగధ సంగీత ప్రసంగంబును నై యతి మనోహర విభవాభిరామం బైన యప్పురవరంబు సచివ పురోహిత సుహృద్బాంధవ ముఖ్యు లెదురుకొన భూసురాశీర్వాదంబులను బుణ్యాంగనా కరకలిత లలితాక్షతలను గైకొనుచుం గామినీమణులు గర్పూరనీరాజనంబులు నివాళింప నిజమందిరంబుం బ్రవేశించి యప్పుండరీకాక్షుండు పరమానందంబున సుఖం బుండె; నంత. (451) శ్రీకృష్ణుని విజయం బగు ¯ నీ కథఁ బఠియించువార లెప్పుడు జయముం ¯ గైకొని యిహపరసౌఖ్యము ¯ లాకల్పోన్నతి వహింతు రవనీనాథా!" (452) అని చెప్పిన శుకయోగికి ¯ జననాయకుఁ డనియెఁ గృష్ణచరితము విన నా ¯ మన మెపుడుఁ దనియ దింకను ¯ విన వలతుం గరుణఁ జెప్పవే మునినాథా!" (453) అనినఁ బరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియె.

నృగోపాఖ్యానంబు

(454) "ధరణీశ! యొకనాఁడు హరి తనూజులు రతీ¯ శ్వర సాంబ సారణ చారుభాను ¯ లాదిగా యదుకుమారావలి యుద్యాన, ¯ వనమున కతివైభవమున నేగి ¯ వలనొప్ప నిచ్ఛానువర్తులై సుఖలీలఁ¯ జరియించి ఘనపిపాసలనుఁ జెంది ¯ నెఱిదప్పి సలిల మన్వేషించుచును వేగ¯ వచ్చుచో నొకచోట వారిరహిత (454.1) కూపమును నందులో నొక కొండవోలె ¯ విపుల మగు మేని యూసరవెల్లిఁ గాంచి ¯ చిత్తముల విస్మయం బంది తత్తఱమున ¯ దాని వెడలించు వేడుక దగులుటయును. (455) పరువిడి పోయి తెచ్చి ఘనపాశచయంబుల నంటఁగట్టి య¯ గ్గురుభుజు లందఱుంగదిసి కోయని యార్చుచు దాని నెమ్మెయిం¯ దరలఁగఁ దీయలేక దగ దట్టముగా మది దుట్టగిల్ల నొం ¯ డొరు గడవంగ వే చని పయోరుహనాభున కంతఁ జెప్పినన్. (456) విని సరసీరుహాక్షుఁ డతివిస్మితుఁడై జలశూన్యకూప మ¯ ల్లన కదియంగ నేఁగి కృకలాసము నొక్కతృణంబుఁ బోలె గొ¯ బ్బు న వెడలించె వామకరపద్మమున న్నది యంతలోనఁ గాం¯ చనరుచి మేనఁ గల్గు పురుషత్వముతోఁ బొడసూపి నిల్చినన్. (457) చూచి కృష్ణుం డతని వృత్తాంతం బంతయు నెఱింగియు నక్కడి జనంబులుం గుమారవర్గంబును దెలియుకొఱకు నతనిచేత తద్వృత్తాంతం బంతయు నెఱింగించువాఁడై యిట్లనియె. (458) "కన దురు రత్నభూషణ నికాయుఁడవై మహనీయమూర్తివై ¯ యనుపమకీర్తిశోభితుఁడవై విలసిల్లుచు ధాత్రిమీఁదఁ బెం ¯ పొనరిన నీకు నేమిగతి నూసరవెల్లితనంబు చొప్పడెన్ ¯ విన నిది చోద్య మయ్యె సువివేకచరిత్ర! యెఱుంగఁ జెప్పుమా! " (459) అని యడిగిన మురరిపు పద ¯ వనజంబులఁ దన కిరీటవరమణు లొరయన్ ¯ వినయమున మ్రొక్కి యిట్లను ¯ ఘనమోదముతోడ నిటల ఘటితాంజలియై. (460) "విశ్వసంవేద్య! మహిత! యీ విశ్వమందుఁ ¯ బ్రకటముగ నీ వెఱుంగని దొకటి గలదె ¯ యైన నాచేత విన నిష్ఠమయ్యె నేని ¯ నవధరింపుము వినిపింతు నంబుజాక్ష! (461) ఏ నిక్ష్వాకుతనూజుఁడన్ నృగుఁడు నా నేపారు భూపాలుఁడన్; ¯ దీనవ్రాతము నర్థిఁ బ్రోచుచు ధరిత్రీనాయకుల్‌ గొల్చి స¯ మ్మానింపం జతురంత భూభరణసామర్థ్యుండనై సంతత¯ శ్రీ నిండారినవాఁడ నుల్లసిత కీర్తిస్ఫూర్తి శోభిల్లఁగన్. (462) పలుకులఁ దన్నుఁ దాఁ బొగడఁ బాతక మందు రటుండెఁ దారకా ¯ వలి సికతావ్రజంబు హిమవారికణంబులు లెక్క పెట్టఁగా ¯ నలవడుఁ గాని యేను వసుధామరకోటికి దాన మిచ్చు గో ¯ వుల గణుతింప ధాతయునునోపఁడు మాధవ! యేమిసెప్పుదున్? (463) అదియునుం గాక. (464) పొలుచు సువర్ణశృంగఖురముల్‌ దనరం దొలిచూలులై సువ¯ త్సలు గల పాఁడియావుల నుదాత్త తపోవ్రత వేదపాఠముల్‌ ¯ గలిగి కుటుంబులై విహితకర్మములం జరియించు పేద వి¯ ప్రులకు సదక్షిణంబుగ విభూతి దలిర్పఁగ నిత్తు, నచ్యుతా! (465) మఱియును న్యాయసముపార్జిత విత్తమ్ములగు గో భూ హిరణ్య రత్న నివాస రథ హస్తి వాజి కన్యా సరస్వతీ వస్త్ర తిల కాంచన రజత శయ్యాది బహువిధ దానంబు లనూనంబులుగా ననేకంబులు సేసితిఁ, బంచమహాయజ్ఞంబు లొనరించితి, వాపీ కూప తటాక వన నిర్మాణంబులు సేయించితి, నివ్విధంబునం జేయుచో నొక్కనాఁడు. (466) అనఘా! మునుపడఁ గశ్యపుఁ ¯ డను విప్రున కే నకల్మషాత్ముఁడనై యి¯ చ్చిన గోవు దప్పి నా మం ¯ దను గలసినఁ దెలియలేక తగ నా గోవున్. (467) ఒండొక భూమీసురకుల ¯ మండనునకు దాన మీయ మసలక యా వి¯ ప్రుం డా గోవుంగొని చను ¯ చుండన్ మును ధారగొన్న యుర్వీసురుఁడున్. (468) మది రోష మొదవ దోవతి ¯ వదలిన బిగియించుకొనుచు వడిఁ గది "సిది నా ¯ మొదవు; నడివీథి దొంగిలి ¯ వదలక కొనిపోయె; దిట్టివారుం గలరే? " (469) అనవుడు నాతఁ డిట్లనియె నాతనితో "నిపు డేను దీని నీ ¯ జనపతిచేత ధారగొని సాధుగతిం జన నీది యంట యె"¯ ట్ల? నిన నతండు "నేనును ధరాధిపుచే మును ధారగొన్న యా"¯ వని వినిపింప నిద్దఱకు నయ్యె నపార వివాద మచ్చటన్. (470) ఇట్లు విప్రు లిద్దఱుం దమలో నంతకంతకు మచ్చరంబు పెచ్చుపెరిఁగి కలహించి నాయున్నయెడకుం జనుదెంచిరి; మున్ను నా చేత గోదానంబు గొన్న బ్రాహ్మణుం డిట్లనియె. (471) "మనుజేంద్ర! ప్రజ లధర్మప్రవర్తనముల¯ నడవకుండఁగ నాజ్ఞ నడపు నీవు ¯ మనమున నే ధర్మమని యాచరించితి?¯ మును నాకు నిచ్చిన మొదవు దప్పి ¯ వచ్చి నీ మందలోఁ జొచ్చిన నిప్పు డీ¯ భూసురునకు ధారవోసి యిచ్చి ¯ తగవు మాలితివి, దాతవు నపహర్తవు¯ నైన ని న్నేమందు? నవనినాథ! " (471.1) యనిన మాటలు సెవులు సోఁకినఁ గలంగి ¯ "భూసురోత్తమ! యజ్ఞానపూర్వకముగ ¯ నిట్టి పాపంబు దొరసె నే నెఱిఁగి సేయఁ ¯ గొనుము నీ కిత్తు నొక లక్ష గోధనంబు. " (472) అని మఱియును నవ్విప్రుని ¯ సునయోక్తుల ననునయింపుచును నిట్లంటిన్ ¯ "ననుఁ గావు, నరకకూపం ¯ బునఁ బడఁగా జాలఁ విప్రపుంగవ!"యనుచున్. (473) "ఎంత వేఁడిన మచ్చరంబంత పెరిఁగి ¯ మొదల నాకిచ్చి నట్టి యీమొదవె కాని ¯ యెనయ నీ రాజ్యమంతయు నిచ్చితేని ¯ నొల్ల"నని విప్రుఁ డచ్చట నుండ కరిగె. (474) అ ట్లతం డరిగిన నా రెండవ బ్రాహ్మణునిం బ్రార్థించిన నతండును జలంబు డింపక "పదివే లేఱికోరిన పాఁడిమొదవుల నిచ్చిననైనను దీనిన కాని యొల్ల” నని నిలువక చనియె; నంతఁ గాలపరిపక్వం బైన నన్ను దండధరకింకరులు గొనిపోయి వైవస్వతు ముందటం బెట్టిన నతండు నన్ను నుద్దేశించి యిట్లనియె. (475) "మనుజేంద్రోత్తమ! వంశపావన! జగన్మాన్యక్రియాచార! నీ ¯ ఘన దానక్రతుధర్మముల్‌ త్రిభువనఖ్యాతంబులై చెల్లెడిన్, ¯ మును దుష్కర్మఫలంబు నొంది పిదపం బుణ్యానుబంధంబులై ¯ చను సౌఖ్యంబులఁ బొందు; పద్మజునియాజ్ఞం ద్రోవఁగావచ్చునే? "

నృగుడు యూసరవి ల్లగుట

(476) అని వేగంబున ద్రొబ్బించిన నేను బుడమిం బడునపు డీనికృష్టంబయిన యూసరవెల్లి రూపంబుఁ గైకొంటి; నింతకాలంబు దద్దోష నిమిత్తంబున నిద్దురవస్థం బొందవలసెఁ; బ్రాణులకుఁ బుణ్య పాపంబు లనుభావ్యంబులు గాని యూరక పోనేరవు; నేఁడు సమస్త దురితనిస్తారకంబయిన భవదీయ పాదారవింద సందర్శనంబునం జేసి యీ ఘోరదుర్దశలంబాసి నిర్మలాత్మకుండ నైతి"నని పునఃపునః ప్రణామంబు లాచరించి, మఱియు నిట్లనియె. (477) "కృష్ణ! వాసుదేవ! కేశవ! పరమాత్మ! ¯ యప్రమేయ! వరద! హరి! ముకుంద! ¯ నిన్నుఁ జూడఁ గంటి, నీ కృపం గనుగొంటి ¯ నఖిల సౌఖ్యపదవు లందఁ గంటి. " (478) అని యనేకభంగులం గొనియాడి గోవిందుని పదంబులు దన కిరీటంబు సోఁకం బ్రణమిల్లి “దేవా! భవదీయ పాదారవిందంబులు నా హృదయారవిందంబును బాయకుండునట్లుగాఁ బ్రసాదింపవే?” యని తదనుజ్ఞాతుండై యచ్చటి జనంబులు సూచి యద్భుతానందంబులం బొంద నతుల తేజోవిరాజిత దివ్యవిమానారూఢుండై దివంబున కరిగె; నంత నమ్మాధవుండు నచ్చట నున్న పార్థివోత్తములకు ధర్మబోధంబుగా నిట్లనియె. (479) "నరనాథకుల కాననము దహించుటకును¯ నవనీసురులవిత్త మగ్నికీల; ¯ జననాయకుల నిజైశ్వర్యాబ్ధి నింకింప¯ బ్రాహ్మణక్షేత్రంబు బాడబంబు; ¯ పార్థివోత్తముల సంపచ్ఛైలములఁ గూల్ప¯ భూసురధనము దంభోళిధార; ¯ జగతీవరుల కీర్తి చంద్రిక మాప వి¯ ప్రోత్తము ధనము సూర్యోదయంబు; (479.1) విప్రతతి సొమ్ముకంటెను విషము మేలు ¯ గరళమునకును బ్రతికృతి గలదు గాని ¯ దాని మాన్పంగ భువి నౌషధములు లేవు ¯ గాన బ్రహ్మస్వములు గొంట గాదు పతికి. (480) ఎఱుఁగమి నైనను భూసుర ¯ వరులధనం బపహరింప వలవదు పతికిన్; ¯ మఱపున ననలము ముట్టిన ¯ దరికొని వెసఁ గాల్పకున్నె తను వెరియంగన్? (481) మఱియును దన ధనంబు పరులచేతఁ గోల్పడిన విప్రుండు దుఃఖమున రోదనంబు సేయ రాలిన యశ్రుకణంబుల నవనిరేణువు లెన్ని తడియు నన్ని వేలేండ్లు తదుపేక్షాపరుండైన పతి దారుణ వేదనలుగల కుంభీపాక నరకంబు నొందు; మఱియు నతనితోడఁ గ్రిందటఁ బది తరంబులవారును, ముందటఁ బది తరంబులవారును మహానరకవేదనలం బొందుదురు; స్వదత్తంబైన నర్ధలోభంబునం జేసి దుశ్శీలుండై యెవ్వఁడు బ్రాహ్మణక్షేత్ర సంభూత ధాన్యధనాదికంబు భుజించు నప్పాపాత్ముం డఱువదివేల సంవత్సరంబులు మలకూపంబునం గ్రిమిరూపంబున వర్తించు; నట్లగుట యెఱింగి విప్రుడెంత తప్పు చేసిన నెన్ని గొట్టిన, నెన్ని దిట్టిన నతని కెదురు పలుకక వినయంబున వందనం బాచరించు పుణ్యాత్ములు నాదు పాలింటివా; రదియునుంగాక యేనును బ్రతిదినంబును భూసురుల నతి వినయంబునఁ బూజింతు; నిట్లు సేయక విపరీతవర్తనులైన తామసుల నేను వెదకి దండింతు; నదిగావున మీరలును బ్రాహ్మణజనంబుల వలనం బరమభక్తి గలిగి మెలంగుం"డని యానతిచ్చి యాదవప్రకరంబులు సేవింప నఖిలలోకశరణ్యుండైన యప్పుండరీకాక్షుండు నిజ నివాసంబునకుం జనియె” నని చెప్పి శుకుం డిట్లనియె. (482) "ఈ కథఁ జదివిన వారలుఁ ¯ గైకొని వినువారు విగత కలుషాత్మకులై ¯ లౌకికసౌఖ్యము నొందుదు ¯ రా కైవల్యంబుఁ గరతలామలక మగున్.

బలరాముని ఘోషయాత్ర

(483) నరనాథ! విను మొకనాఁడు తాలాంకుండు¯ చుట్టాల బంధులఁ జూచు వేడ్క ¯ సుందర కాంచన స్యందనారూఢుఁడై¯ భాసిల్లుచున్న వ్రేపల్లె కరిగి ¯ చిరకాల సంగత స్నేహులై గోప గో¯ పాంగనా నికర మాలింగనములు ¯ సముచిత సత్కృతుల్‌ సలుపఁ గైకొని మహో¯ త్సుక లీల నందయశోదలకును (483.1) వందనం బాచరించిన వారు మోద ¯ మంది బిగియారఁ గౌఁగిళ్ల నొందఁ జేర్చి ¯ సమత దీవించి యంకపీఠమునఁ జేర్చి ¯ శిరము మూర్కొని చుబుకంబుఁ గరము పుణికి. (484) మఱియు నానందబాష్పధారాసిక్త కపోలయుగళంబులతోడం గుశలప్రశ్నంబుగా నిట్లని “రన్నా! నీవును నీ చిన్నతమ్ముండగు వెన్నుండును లెస్సయున్నవారె? మమ్మెప్పుడు నరసిరక్షింప వలయు; మాకు నేడుగడయ మీరకాక యొరులు గలరే?” యని సముచిత సంభాషణంబులం బ్రొద్దుపుచ్చుచుండి; రంత. (485) గోపాలవరులు ప్రమదం ¯ బాపోవని మది నివర్తి తాఖిల గేహ¯ వ్యాపారు లగుచు హలధరు ¯ శ్రీపాదంబులకు నతులు సేసిరి వరుసన్. (486) సీరియు వారికిఁ గరుణో ¯ దారుండై నడపె సముచితక్రియ లంతం ¯ గోరి తన యీడు గోపకు ¯ మారులఁ జే చఱచి బలుఁడు మందస్మితుఁడై. (487) నిజ సుందర దేహద్యుతి ¯ రజతాచలరుచులఁ దెగడ రాముఁడు వారల్‌ ¯ భజియింప నేగి యొకచో ¯ విజనస్థలమున వసించి విలసిల్లు నెడన్. (488) చరణములం గనకస్ఫుట నూపుర; జాలము ఘల్లనుచుం జెలఁగం¯ గరములఁ గంకణముల్‌ మొరయన్ నలి; కౌనసియాడఁ గుచాగ్రములన్¯ సరులు నటింపఁ గురుల్‌ గునియన్ విల; సన్మణికుండల కాంతులు వి¯ స్ఫురిత కపోలములన్ బెరయన్ వ్రజ; సుందరు లందఱమందగతిన్. (489) చని బలభద్రుని శౌర్య సముద్రుని; సంచితపుణ్యు నగణ్యునిఁ జం¯ దన ఘనసార పటీర తుషారసు; ధా రుచికాయు విధేయు సుధా¯ శనరిపుఖండను సన్మణిమండను; సారవివేకు నశోకు మహా¯ త్మునిఁ గని గోపిక లోపిక లేక య; దుప్రభు నిట్లని రుత్కలికన్. (490) "హలధర! నీ సహోదరుఁ డుదంచిత కంజవిలోచనుండు స¯ ల్లలిత పురాంగనా జనవిలాస విహార సమగ్ర సౌఖ్యముల్‌ ¯ గలిగి సుఖించునే? మము నొకానొక వేళన యేని బుద్ధిలోఁ ¯ దలఁచునొ? నూతనప్రియలఁ దార్కొని యేమియుఁ బల్కకుండునో? (491) జననీ జనకుల ననుజులఁ ¯ దనుజుల బంధువుల మిత్రతతుల విడిచి నె¯ మ్మనమున నొండు దలంపక ¯ తను నమ్మినవారి విడువఁదగునే హరికిన్? (492) సలలిత యామునసైకత స్థలమున¯ నుండ మమ్మే మని యూఱడించె ¯ విమల బృందావన వీథి మా చుబుకముల్‌¯ పుణుకుచే నే మని బుజ్జగించెఁ ¯ బుష్పవాటికలలోఁ బొలుచు మా కుచయుగ్మ¯ మంటుచు నే మని యాదరించెఁ ¯ గాసారముల పొంతఁ గౌఁగిట మముఁ జేర్చి¯ నయ మొప్ప నే మని నమ్మఁ బలికె (492.1) నన్నియు మఱచెఁ గాఁబోలు వెన్నుఁ డాత్మ ¯ గోరి తాఁ జాయలున్నైన వారి విడుచు ¯ నట్టి కృష్ణుఁడు దము ఱట్టువెట్టు ననక ¯ యేల నమ్మిరి పురసతుల్‌ బేల లగుచు. " (493) అని యిబ్భంగి సరోజలోచనుని నర్మాలాపముల్‌ నవ్వులు¯ న్ననుబంధుల్‌ పరిరంభణంబులు రతివ్యాసంగముల్‌ భావముల్‌¯ వినయంబుల్‌ సరసోక్తులుం దలఁచి యువ్విళ్ళూరు చిత్తంబులన్¯ జనితానంగశరాగ్నిచేత దురవస్థం బొంది శోకించినన్. (494) అంత బలభద్రుండు వారల మనంబుల సంతాపంబులు వారింప నుపాయంబు లగు సరసచతురవచనంబులఁ గృష్ణుని సందేశంబులు సెప్పి విగతఖేదలం జేసి యచ్చట మాసద్వయంబు నిలిచి వసంతవాసరంబులు గడపుచుఁ గాళిందీ తీరంబున. (495) మాకంద జంబీర మందార ఖర్జూర¯ ఘనసార శోభిత వనములందు ¯ నేలాలతా లోల మాలతీ మల్లికా¯ వల్లీమతల్లికా వాటికలను ¯ దరళ తరంగ శీకర సాధు శీతల¯ సైకతవేదికా స్థలములందు ¯ మకరంద రస పాన మదవ దిందిందిర¯ పుంజ రంజిత మంజు కుంజములను (495.1) విమలరుచి గల్గు సానుదేశముల యందు ¯ లలిత శశికాంత ఘన శిలాతలములందు ¯ లీల నిచ్ఛావిహార విలోలుఁ డగుచు ¯ సుందరీజనములు గొల్వఁ జూడ నొప్పె. (496) అట్లు విహరింప వరుణునియాజ్ఞఁ జేసి ¯ వారుణీదేవి మద్య భావంబు నొంది ¯ నిఖిల తరుకోటరములందు నిర్గమించి ¯ మించు వాసనచేత వాసించె వనము. (497) అట్టియెడ. (498) కర మొప్పారు నవీనవాసనల నాఘ్రాణించి గోపాల సుం ¯ దరులుం దానును డాయనేగి యతిమోదం బొప్ప సేవించి యా¯ తరళాక్షుల్‌ మణిహేమకంకణఝణత్కారానుకారంబులై ¯ కరతాళంబులు మ్రోయఁబాడుచును వేడ్కన్నాడుచున్ సోలుచున్ (499) తనమీఁది బిరుదాంకితములైన గీతముల్‌¯ వాడుచు రా బలభద్రుఁ డంత ¯ మహిత కాదంబరీ మధుపానమదవిహ్వ¯ లాక్షుండు లలితనీలాలకుండు ¯ నాలోల నవపుష్పమాలికోరస్థ్సలుఁ¯ డనుపమ మణికుండలాంచితుండు ¯ ప్రాలేయ సంయుక్త పద్మంబుగతి నొప్పు¯ సలలితానన ఘర్మజలకణుండు (499.1) నగుచు వనమధ్యమున సలిలావగాహ ¯ శీలుఁడై జలకేళికిఁ జేరి యమున ¯ నిందు రమ్మని పిలువఁ గాళింది యతని ¯ మత్తుఁడని సడ్డసేయక మసలుటయును.

కాళిందీ భేదనంబు

(500) ఘనకుపితాత్ముఁడై యమునఁ గన్గొని రాముఁడు వల్కె "డాయఁ జీ¯ రినఁ జనుదేక తక్కితి పురే! విను నిందఱుఁ జూడ మద్భుజా ¯ సునిశిత లాంగలాగ్రమున సొంపఱ నిప్పుడు నూఱు త్రోవలై ¯ చన వెసఁ జించి వైతు' నని చండ పరాక్రమ మొప్ప నుగ్రుఁడై. (501) అట్లు కట్టలుక రాము డుద్దామం బగు బాహుబలంబున హలంబు సాఁచి యమ్మహావాహినిం దగిల్చి పెకలి రాఁ దిగిచిన నన్నది భయభ్రాంతయై సుందరీరూపంబు గైకొని యతిరయంబునం జనుదెంచి, యయ్యదువంశతిలకుం డగు హలధరుని పాదారవిందంబులకు వందనం బాచరించి యిట్లనియె. (502) "బలరామా! ఘనబాహ! నీ యతుల శుంభద్విక్రమం బంగనల్‌¯ దెలియం జాలెడివారె? యీ యఖిలధాత్రీభారధౌరేయ ని¯ శ్చల సత్త్వుండగు కుండలీశ్వరుఁడునుం జర్చింప నీ సత్కళా ¯ కలితాంశప్రభవుండు; నీ గురు భుజా గర్వంబు సామాన్యమే?" (503) అని వినుతించి "యేను భవదంఘ్రి సరోజము లాశ్రయించెదన్ ¯ ననుఁగరుణింపు" మన్న యదునందనుఁ డన్నదిఁ బూర్వమార్గవై¯ చను మని కామినీనికరసంగతుఁడై జలకేళి సల్పె నిం ¯ పెనయఁ గరేణుకాయుత మదేభముచాడ్పున నమ్మహానదిన్. (504) అంత జలకేళి సాలించి సంతసంబు ¯ నందుచుండ వినీలవస్త్రాదిరత్న ¯ మండనంబులుఁ గాంచనమాలికయునుఁ ¯ దెచ్చి హలి కిచ్చి చనె నా నదీలలామ. (505) అవి యెల్లఁ దాల్చి హలధరుఁ ¯ డవిరళగతి నొప్పి వల్లవాంగనలునుఁ దా ¯ దివిజేంద్రుఁ బోలి మహి తో¯ త్సవమున వర్తించుచుండె సౌఖ్యోన్నతుఁ డై. (506) అవనీశ! యిట్లు హలమునఁ ¯ దివిచినఁ గాళింది వ్రయ్య దెలియఁగ నేఁడున్ ¯ భువి నుతి కెక్కెను రాముని ¯ ప్రవిమలతరమైన బాహుబలసూచకమై. (507) అంత బలభద్రుండు వ్రజసుందరీ సమేతుండై నందఘోషంబునం బరితోషంబు నొందుచుండె, నంత నక్కడఁ గరూశాధిపతి యైన పౌండ్రకుండు తన దూతం బిలిచి యిట్లనియె.

పౌండ్రకవాసుదేవుని వధ

(508) మనుజేశ! "బలగర్వమున మదోన్మత్తుఁడై¯ యవనిపై వాసుదేవాఖ్యుఁ డనఁగ ¯ నే నొక్కరుఁడ గాక యితరుల కీ నామ¯ మలవడునే?"యని "యదటు మిగిలి ¯ తెగి హరిదా వాసుదేవుఁ డననుకొను¯ నఁట! పోయి వల దను"మనుచు దూతఁ ¯ బద్మాయతాక్షుని పాలికిఁ బొమ్మన¯ నరిగి వాఁ డంబుజోదరుఁడు పెద్ద (508.1) కొలువుఁ గైకొని యుండ సంకోచపడక ¯ "వినుము; మా రాజుమాటగా వనజనాభ! ¯ యవని రక్షింప వాసుదేవాఖ్య నొంది ¯ నట్టి యేనుండ సిగ్గు వోఁ దట్టి నీవు. (509) నా పేరును నా చిహ్నము ¯ లేపున ధరియించి తిరిగె దిది పంతమె? యిం ¯ తే పో! మదిఁ బరికించిన ¯ నే పంత మెఱుంగు గొల్లఁ డేమిట నైనన్? (510) ఇంతనుండి యైన నెదిరిఁ దన్నెఱిఁగి నా ¯ చిన్నెలెల్ల విడిచి చేరి కొలిచి ¯ బ్రదుకు మనుము కాక పంతంబు లాడెనా ¯ యెదురు మనుము ఘోర కదనమునను. " (511) అను దుర్భాషలు సభ్యులు ¯ విని యొండొరు మొగము సూచి విస్మితు లగుచున్ ¯ "జనులార! యెట్టి క్రొత్తలు ¯ వినఁబడియెడు నిచట? లెస్స వింటిరె?" యనఁగన్. (512) అట్టియెడ కృష్ణుండు వాని కిట్లనియె. (513) "వినరా! మీ నృపుఁ డన్న చిహ్నములు నే వే వచ్చి ఘోరాజిలో¯ దనమీఁదన్ వెస వైవఁ గంకముఖగృధ్రవ్రాతముల్‌ మూఁగఁగా, ¯ ననిలో దర్పము దూలి కూలి వికలంబై సారమేయాళికి¯ న్ననయంబున్ నశనంబ వయ్యె దను మే నన్నట్లుగా వానితోన్. " (514) అని యుద్రేకముగా నా ¯ డిన మాటల కులికి వాఁడు డెందము గలఁగం ¯ జని తన యేలిక కంతయు ¯ వినిపించెను నతని మదికి విరసము గదురన్. (515) అంతఁ గృష్ణుండు దండయాత్రోత్సుకుఁడై వివిధాయుధ కలితంబును, విచిత్రకాంచనపతాకాకేతు విలసితంబు నగు సుందరస్యందనంబుఁ బటు జవతురంగంబులం బూన్చి దారుకుండు తెచ్చిన, నెక్కి యతిత్వరితగతిం గాశికానగరంబున కరిగినం, బౌండ్రకుండును రణోత్సాహంబు దీపింప నక్షౌహిణీద్వితయంబుతోడం బురంబు వెడలె, నప్పు డతని మిత్రుండైన కాశీపతియును మూఁ డక్షౌహిణులతోడం దోడుపడువాఁడై వెడలె, నిట్లాప్తయుతుండై వచ్చువాని. (516) చక్ర గదా శంఖ శార్ఙ్గాది సాధనుఁ¯ గృత్రిమగౌస్తుభ శ్రీవిలాసు ¯ మకరకుండల హార మంజీర కంకణ¯ మణిముద్రికా వనమాలికాంకుఁ ¯ దరళ విచిత్ర పతంగ పుంగవకేతుఁ¯ జెలువొందు పీతకౌశేయవాసు ¯ జవనాశ్వకలిత కాంచన రథారూఢుని¯ రణకుతూహలు లసన్మణికిరీటు (516.1) నాత్మసమవేషు రంగవిహారకలిత ¯ నటసమానునిఁ బౌండ్రభూనాథుఁ గాంచి ¯ హర్ష మిగురొత్త నవ్వెఁ బద్మాయతాక్షుఁ ¯ డంత వాఁడును నుద్వృత్తుఁ డగుచు నడరి. (517) పరిఘ శరాసన పట్టిస ¯ శర ముద్గర ముసల కుంత చక్ర గదా తో ¯ మర భిందిపాల శక్తి¯ క్షురికాసిప్రాస పరశుశూలముల వెసన్. (518) పరువడి వైచినన్ దనుజభంజనుఁ డంత యుగాంత కాల భీ ¯ కరమహితోగ్ర పావకుని కైవడి నేచి విరోధిసాధనో ¯ త్కరముల నొక్కటన్ శరనికాయములన్ నిగిడించి త్రుంచి భా ¯ స్వరగతి నొత్తె సంచలితశాత్రవసైన్యముఁ బాంచజన్యమున్. (519) వారని యల్కతోఁ గినిసి వారిజనాభుఁడు వారి సైన్యముల్‌ ¯ మారి మసంగినట్లు నుఱుమాడినఁ బీనుఁగుఁబెంటలై వెసం ¯ దేరులు వ్రాలె; నశ్వములు ద్రెళ్ళె; గజంబులు మ్రొగ్గె; సద్భటుల్‌¯ ధారుణిఁ గూలి; రిట్లు నెఱిదప్పి చనెన్ హతశేషసైన్యముల్‌. (520) అట్టియెడ రుధిర ప్రవాహంబులును, మేదోమాంసపంకంబునునై సంగరాంగణంబు ఘోరభంగి యయ్యె; నయ్యవసరంబునం గయ్యంబునకుం గాలుద్రవ్వు నప్పౌండ్రకునిం గనుంగొని; హరి సంబోధించి యిట్లనియె. (521) "మనుజేంద్రాధమ! పౌండ్రభూపసుత! నీ మానంబు బీరంబు నేఁ¯ డనిలో మాపుదు; నెద్దు క్రొవ్వి పెలుచన్నాఁబోతుపై ఱంకెవై ¯ చిన చందంబున దూతచేత నను నాక్షేపించి వల్దన్న పే ¯ రునుఁ జిహ్నంబులు నీపయిన్ విడుతునర్చుల్‌ పర్వనేఁడాజిలోన్ (522) అదిగాక నీదు శరణము ¯ పదపడి యేఁజొత్తు నీవు బల విక్రమ సం ¯ పదగల పోటరి వేనిం ¯ గదలక నిలు"మనుచు నిశితకాండము లంతన్. (523) చల మొప్పన్ నిగుడించి వాని రథముం జక్కాడి తత్సారథిం ¯ దల వే త్రుంచి హయంబులన్ నరికి యుద్దండప్రతాపక్రియం ¯ బ్రళయార్కప్రతిమాన చక్రమున నప్పౌండ్రున్ వెసం ద్రుంప వాఁ ¯ డిలఁ గూలెం గులిశాహతిన్నొరగు శైలేంద్రాకృతిన్ భూవరా!

కాశీరాజు వధ

(524) మడవక కాశికావిభుని మస్తక ముద్ధతిఁ ద్రుంచి బంతి కై ¯ వడి నది పింజ పింజ గఱవన్ విశిఖాళి నిగుడ్చి వాని యే ¯ లెడి పురిలోన వైచె నవలీల మురాంతకుఁ డిట్లు వైరులం ¯ గడఁగి జయించి చిత్తమునఁ గౌతుకముం జిగురొత్త నత్తఱిన్. (525) సుర గంధర్వ నభశ్చర ¯ గరుడోరగ సిద్ధ సాధ్యగణము నుతింపన్ ¯ మరలి చనుదెంచి హరి నిజ ¯ పురమున సుఖముండె నతి విభూతి దలిర్పన్. (526) వనజోదరు చిహ్నంబులు ¯ గొనకొని ధరియించి పౌండ్రకుఁడు మచ్చరియై ¯ యనవరతము హరి దన తలఁ ¯ పునఁ దగులుటఁ జేసి ముక్తిఁ బొందె నరేంద్రా! (527) అక్కడఁ గాశిలో నా రాజు మందిరాం¯ గణమునఁ గుండల కలిత మగుచుఁ ¯ బడి యున్న తలఁ జూచి పౌరజనంబులు¯ దమ రాజు తలయ కాఁ దగ నెఱింగి ¯ చెప్పిన నా నృపు జీవితేశ్వరులును¯ సుతులు బంధువులును హితులు గూడి ¯ మొనసి హాహాకారమున నేడ్చి; రత్తఱిఁ¯ దత్తనూభవుఁడు సుదక్షిణుండు (527.1) వెలయఁ దండ్రికిఁ బరలోకవిధు లొనర్చి ¯ జనకు ననిలో వధించిన చక్రపాణి ¯ నడరి మర్దింపఁ దగు నుపాయంబు దలఁచి ¯ చతురుఁ డగు నట్టి తన పురోహితునిఁ బిలిచి. (528) అతడుం దానునుఁ జని పశు ¯ పతిపద సరసిజములకునుఁ బ్రమదముతో నా ¯ నతుఁడై యద్దేవుని బహు ¯ గతులం బూజింప నతఁడుఁ గరుణాన్వితుఁడై. (529) "మెచ్చితి నే వర మైనను ¯ నిచ్చెద నను వేఁడు"మనిన "నీశ్వర! నన్నున్ ¯ మచ్చిక రక్షింతువు పొర ¯ పొచ్చెము సేయక మహేశ! పురహర! యభవా! (530) దేవా! మజ్జనకుని వసు ¯ దేవాత్మజుఁ డాజిలో వధించెను, నే నా ¯ గోవిందుని ననిలోపల ¯ నే విధమున గెలుతు నానతీవె పురారీ! " (531) అనిన శంకరుఁ డతనికి ననియె "ననఘ! ¯ నీవు ఋత్విజులును భూసురావళియునుఁ ¯ బ్రీతి నభిచార మొనరింప భూతయుక్తుఁ ¯ డగుచు ననలుండు దీర్చు నీ యభిమతంబు. " (532) అనిన నా చంద్రమౌళి వాక్యముల భంగి ¯ భూరినియమముతో నభిచారహోమ ¯ మొనరఁ గావింప నగ్ని యథోచితముగఁ ¯ జెలఁగు దక్షిణవలమాన శిఖల వెలిఁగె. (533) అందుఁ దామ్రశ్మశ్రుకేశకలాపంబును, నశనిసంకాశంబులైన నిడుద కోఱలును, నిప్పులుప్పతిల్లు చూడ్కులును, ముడివడిన బొమలును, జేవురించిన మొగంబును గలిగి కృత్య యతి రౌద్రాకారంబునఁ బ్రజ్వరిల్లుచుఁ గుండంబు వెలువడి యనుదిన నిహన్య మాన ప్రాణిరక్తారుణ మృత్యుకరవాలంబు లీలం జూపట్టు నాలుకను సెలవుల నాకికొనుచు నగ్నికీలాభీలంబగు శూలంబు గేలం దాల్చి భువనకోలాహలంబుగా నార్చుచు, నుత్తాల తాలప్రమాణ పాదద్వయ హతులం దూలు పెంధూళి నింగిమ్రింగ, భూతంబులు సేవింప, నగ్నవేషయై, నిజవిలోచన సంజాత సముద్ధూత నిఖిల భయంకర జ్వాలికాజాలంబున దిశాజాలంబు నోలిం బ్రేల్చుచు, నుద్వేగగమనంబున నగధరు నగరంబున కరుగుదేరఁ, బౌరజనంబులు భయాకులమానసులై దావదహనునిం గని పఱచు వన మృగంబులచాడ్పునం బఱచి, సుధర్మాభ్యంతరంబున జూదమాడు దామోదరునిం గని “రక్షరక్షేతి”రవంబుల నార్తులయి “కృష్ణ! కృష్ణ! పెనుమంటలం బురంబు గాల్పం బ్రళయాగ్ని సనుదెంచె” నన వారిం జూచి “యోడకోడకుఁ” డని భయంబు నివారించి, సర్వరక్షకుండైన పుండరీకాక్షుండు జగదంతరాత్ముండు గావునం దద్వృత్తాంతం బంతయుఁ దన దివ్యచిత్తంబున నెఱింగి కాశీరాజపుత్త్ర ప్రేరితయైన యమ్మహాకృత్యను నిగ్రహింపం దలంచి నిజపార్శ్వవర్తి యయియున్న యద్దివ్యసాధనంబు గనుంగొని యప్పుడు. (534) భీమమై బహుతీవ్రధామమై హతరిపు¯ స్తోమమై సుమహితోద్దామ మగుచుఁ ¯ జండమై విజితమార్తాండమై పాలితా¯ జాండమై విజయప్రకాండ మగుచు ¯ దివ్యమై నిఖిలగంతవ్యమై సుజన సం¯ భావ్యమై సద్భక్త సేవ్య మగుచు ¯ నిత్యమై నిగమసంస్తుత్యమై వినమితా¯ దిత్యమై నిర్జితదైత్య మగుచు (534.1) విలయసమయ సముద్భూత విపులభాస్వ ¯ దళికలోచన లోచనానల సహస్ర ¯ ఘటిత పటుసటాజ్వాలికా చటుల సత్త్వ ¯ భయదచక్రంబు కృత్యపైఁ బంపె శౌరి. (535) అదియును, బ్రళయవేళాసంభూత జీమూతసంఘాత ప్రభూత ఘుమఘుమాటోప నినదాధరీకృత మహాదుస్సహ కహకహ నిబిడనిస్వననిర్ఘోషపరిపూరిత బ్రహ్మాండకుహరంబును, నభ్రంలిహ కీలాసముత్కట పటు చిటపట స్ఫుట ద్విస్ఫులింగచ్ఛటాభీలంబును, సకలదేవతాగణ జయజయశబ్ద కలితంబును, ననంతతేజో విరాజితంబును నగుచుం గదిసినం బంటింపక కంటగించు కృత్యను గెంటి వెంటనంటిన నది తన తొంటిరౌద్రంబు విడిచి మరలి కాశీపురంబు సొచ్చి పౌరలోకంబు భయాకులతంబొంది వాపోవ, రోషభీషణాకారంబుతో నప్పుడు ఋత్విఙ్నికాయయుతంబుగ సుదక్షిణుని దహించె; నత్తఱిఁ జక్రంబును దన్నగరంబు సౌధ ప్రాకార గోపురాట్టాల కాది వివిధ వస్తు వాహన నికరంబుతో భస్మంబు గావించి మరలి యమరులు వెఱఁగందఁ గమలలోచన పార్శ్వవర్తి యై నిజ ప్రభాపుంజంబు వెలుఁగొందఁ గొల్చియుండె"నని చెప్పి; మఱియు నిట్లనియె. (536) "మురరిపు విజయాంకితమగు ¯ చరితము సద్భక్తిఁ దగిలి చదివిన వినినన్ ¯ దురితములఁ బాసి జను లిహ ¯ పరసౌఖ్యము లతనిచేతఁ బడయుదు రధిపా!" (537) అనిన శుకయోగికి రాజయోగి యిట్లనియె.