పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : ఏకాదశ స్కంధము 1 - 62


పోతన తెలుగు భాగవతం
ఏకాదశ స్కంధము

ఉపోద్ఘాతము

(1) శ్రీ సీతాపతి! లంకే¯ శాసురసంహారచతుర! శాశ్వత! నుతవా¯ ణీసత్యధిభూభవవృ¯ త్రాసురరిపుదేవజాల! రామనృపాలా! (2) మహనీయగుణగరిష్ఠులగు నమ్మునిశ్రేష్ఠులకు నిఖిలపురాణ వ్యాఖ్యానవైఖరీ సమేతుండైన సూతుం డిట్లనియె; నట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుం గని శుకయోగీంద్రుం “డయ్యా! జన్మ కర్మవ్యాధివిమోచనంబునకుఁ గారణంబగు దివ్యౌషధంబు గావున శ్రీమన్నారాయణ కథామృతంబుఁ గ్రోలు” మని యిట్లనియె.

భూభారంబు వాపుట

(3) "బలవత్సైన్యముతోడఁ గృష్ణుఁడు మహాబాహా బలోపేతుఁడై¯ కలనన్‌ రాక్షసవీరవర్యుల వడిన్‌ ఖండించి, భూభారము¯ జ్జ్వలమై యుండఁగ ద్యూతకేళి కతనం జావంగఁ గౌరవ్య స¯ ద్బలముంబాండవ సైన్యమున్నడఁచె భూభాగంబు గంపింపఁగన్‌. (4) అంత. (5) మునివరులు సంతసిల్లిరి¯ యనయము నందాదులకును హర్షం బయ్యెం; ¯ దన నిజభక్తులు యాదవ¯ ఘనవీరసమూహ మపుడు గడు నొప్పెసఁగెన్‌. (6) విదితుండై సకలామరుల్‌ గొలువ నుర్వీభారమున్‌ మాన్పి, దు¯ ర్మద సంయుక్త వసుంధరాధిపతులన్‌ మర్దించి, కంసాదులం ¯ దుదిముట్టన్‌ వధియించి, కృష్ణుఁ డతిసంతుష్టాత్ముఁడై యున్నచో ¯ యదుసైన్యంబులు భూమి మోవఁగ నసహ్యం బయ్యె నత్యుగ్రమై. (7) ఈ రీతి శ్రీకృష్ణుఁ డేపారఁ బూతనా¯ శకట తృణావర్త సాల్వ వత్స¯ చాణూర ముష్టిక ధేను ప్రలంబక¯ దైత్యాఘ శిశుపాల దంతవక్త్ర¯ కంస పౌండ్రాదిక ఖండనం బొనరించి¯ యటమీఁదఁ గురుబలం బణఁచి మఱియు ¯ ధర్మజు నభిషిక్తుఁ దనరఁగాఁ జేసిన¯ నతఁడు భూపాలనం బమరఁ జేసె (7.1) భక్తులగు యాదవేంద్రులఁ బరఁగఁ జూచి¯ "యన్యపరిభవ మెఱుఁగ రీ యదువు లనుచు¯ వీరిఁ బరిమార్ప నేఁ దక్క వేఱొకండు¯ దైవ మిఁక లేదు త్రిభువనాంతరమునందు. "

యాదవుల హతంబు

(8) అని వితర్కించి జగదీశ్వరుం “డత్యున్నత వేణుకాననంబు వాయువశంబున నొరసికొన ననలం బుద్భవంబయి దహించు చందంబున యదుబలంబుల కన్యోన్య వైరానుబంధంబులు గల్పించి హతం బొనర్చెద” నని విప్రశాపంబు మూలకారణంబుగాఁ దలంచి యదుబలంబుల నడంచె" నని పలికిన మునివరునకు రాజేంద్రుం డిట్లనియె. (9) "హరిపాదకమల సేవా¯ పరులగు యాదవుల కెట్లు బ్రాహ్మణశాప¯ స్ఫురణంబు సంభవించెనొ¯ యరయఁగ సంయమివరేణ్య! యానతి యీవే! "(10) అనిన జనపాలునకు ని¯ ట్లని సంయమికులవరేణ్యుఁ డతి మోదముతో¯ విను మని చెప్పఁగఁ దొడఁగెను¯ ఘనతర గంభీర వాక్ప్రకాశస్ఫురణన్‌.

కృష్ణ సందర్శనంబు

(11) "నిరుపమసుందరం బయిన శరీరంబు ధరియించి సమస్త కర్మ తత్పరుండై పరమేశ్వరుండు యదువుల నడంగింపఁ దలఁచు సమయంబున జటావల్కల కమండలుధారులును, రుద్రాక్షభూతిభూషణ ముద్రాముద్రితులును, గృష్ణాజినాంబరులును నగు విశ్వామిత్రాసిత దుర్వాసోభృగ్వంగిరః కశ్యప వామదేవ వాలఖిల్యాత్రి వసిష్ఠ నారదాది మునివరులు స్వేచ్ఛావిహారంబున ద్వారకానగరంబున కరుదెంచి యందు. (12) ఘనుని శ్రీకృష్ణునిఁ గౌస్తుభాభరణునిఁ, ¯ గర్ణకుండలయుగ్మఘనకపోలుఁ, ¯ బుండరీకాక్షు నంభోధరశ్యామునిఁ, ¯ గలిత నానారత్న ఘన కిరీటు, ¯ నాజానుబాహు నిరర్గళాయుధహస్తు, ¯ శ్రీకరపీతకౌశేయవాసు, ¯ రుక్మిణీనయన సరోజ దివాకరు, ¯ బ్రహ్మాదిసుర సేవ్యపాదపద్ము ,(12.1) దుష్టనిగ్రహ శిష్టసంతోషకరణుఁ, ¯ గోటిమన్మథలావణ్యకోమలాంగు, ¯ నార్తజనరక్షణైకవిఖ్యాతచరితుఁ, ¯ గనిరి కరుణాసముద్రుని, ఘనులు మునులు. (13) వచ్చిన మునిసంఘములకు¯ విచ్చలవిడి నర్ఘ్యపాద్యవిధు లొనరింపన్‌¯ మెచ్చగు కనకాసనముల ¯ నచ్చుగఁ గూర్చుండి వనరుహాక్షునితోడన్‌. (14) "జనములు నిను సేవింపని¯ దినములు వ్యర్థంబు లగుచుఁ దిరుగుచు నుండుం¯ దనువులు నిలుకడ గావఁట¯ వనములలో నున్ననైన వనరుహనాభా! (15) తరణంబులు భవజలధికి, ¯ హరణంబులు దురితలతల, కాగమముల కా¯ భరణంబు, లార్తజనులకు¯ శరణంబులు, నీదు దివ్యచరణంబు లిలన్‌. (16) ఒక్క వేళను సూక్ష్మరూపము నొందు దీ వణుమాత్రమై, ¯ యొక్క వేళను స్థూలరూపము నొందు దంతయు నీవయై, ¯ పెక్కురూపులు దాల్తు, నీ దగు పెంపు మాకు నుతింపఁగా¯ నక్కజం బగుచున్న దేమన? నంబుజాక్ష! రమాపతీ! (17) శ్రీనాయక! నీ నామము¯ నానాభవరోగకర్మనాశమునకు వి¯ న్నాణం బగు నౌషధ మిది¯ కానరు దుష్టాత్ము లకట! కంజదళాక్షా! "(18) అని యనేకవిధంబులం బ్రస్తుతించిన మునివరులం గరుణాకటాక్ష వీక్షణంబుల నిరీక్షించి, పుండరీకాక్షుం డిట్లనియె; “మదీయధ్యాన నామస్మరణంబులు భవరోగహరణంబులును, బ్రహ్మరుద్రాదిక శరణంబులును, మంగళకరణంబులును నగు” ననియును, “నా రూపంబులైన మేదినీసురుల పరితాపంబులఁ బరిహరించు పురుషుల నైశ్వర్యసమేతులంగాఁ జేయుదు” ననియును, యోగీశ్వరేశ్వరుం డయిన యీశ్వరుం డానతిచ్చి యనంతరంబ “మీర లిచ్చటికివచ్చిన ప్రయోజనంబేమి?” యనిన వారలు “భవదీయ పాదారవింద సందర్శనార్థంబు కంటె మిక్కిలి విశేషం బొండెద్ది?” యని వాసుదేవవదనచంద్రామృతంబు నిజనేత్రచకోరంబులం గ్రోలి యథేచ్ఛా విహారులై ద్వారకానగరంబున కనతి దూరంబున నుండు పిండారకం బను నొక్క పుణ్యతీర్థంబున కరిగి; రంత. (19) దర్పించి యాదవులు తమ¯ నేర్పునఁ గొమరారు సాంబు నెలఁతుకరూపం¯ బేర్పడ శృంగారించియుఁ¯ గర్పూర సుగంధి పోల్కిఁ గావించి యొగిన్‌. (20) మూఁకలుగూడి యాదవులు ముందటఁ బెట్టుక యార్చి నవ్వుచుం¯ బోకలఁ బోవుచున్‌ మునిసమూహము కొయ్యన సాఁగి మ్రొక్కుచుం¯ "బ్రాకటమైన యీ సుదతి భారపుగర్భమునందుఁ బుత్త్రుఁడో¯ యేకత మందు బాలికయొ యేర్పడఁ జెప్పు"డటన్న నుగ్రులై. (21) యదుడింభకులను గనుఁగొని¯ మదయుతులై వచ్చి రనుచు మదిలో రోషం¯ బొదవఁ గనుఁగొనల నిప్పులు¯ సెదరఁగ హాస్యంబు సనునె చేయఁగ ననుచున్‌. (22) "వాలాయము యదుకుల ని¯ ర్మూలకరం బైన యట్టి ముసలం బొక టీ¯ బాలిక కుదయించును బొం¯ డాలస్యము లే ద"టంచు నటఁబల్కుటయున్‌. (23) మదోద్రేకులైన యాదవబాలకులు మునిశాపభీతులై వడవడ వడంకుచు సాంబకుక్షినిబద్ధ చేల గ్రంథివిమోచనంబు సేయు సమయంబున ముసలం బొక్కటి భూతలపతితం బయిన విస్మయంబు నొంది దానిం గొనిచని దేవకీనందను సన్నిధానంబునం బెట్టి యెఱింగించిన నతం డాత్మకల్పిత మాయారూపం బగుట యెఱింగియు, నెఱుంగని తెఱంగున వారలం జూచి యిట్లనియె. (24) "మది సెడి కన్నులుగానక¯ మదయుతులై మునులఁ గల్లమాటలఁ జెనయం¯ గదిసి కులక్షయకారణ¯ విదితం బగు శాప మొందు వెఱ్ఱులుఁ గలరే? (25) ధరణీసురశాపమునకు¯ హరిహర బ్రహ్మాదులైన నడ్డము గలరే? ¯ నరు లనఁగ నెంత వారలు¯ గర మరుదుగఁ బూర్వజన్మకర్మముఁ ద్రోవన్‌? (26) అది గావున యతి నిందాపరత్వంబున యదువంశనాశం బగు; సందియంబులే” దని పరమేశ్వరుండు వారలం జూచి “సముద్రతీరంబున నొక్క మహాపర్వతం బున్నది; యందు నుండు నత్యుచ్ఛ్రయ విశాలభీషణం బగు పాషాణంబున మీ భుజాబలంబుచేత నీ ముసలంబు దివిచి దీని చూర్ణంబు సింధు కబంధంబులఁ గలిపి రండు; పొండ”ని జగద్విభుండైన కృష్ణుం డానతిచ్చిన, వారు నట్ల చేసి తత్కీలితం బయిన లోహఖండంబును సరకుగొనక సాగరంబునఁ బడవైచిన, నొక్క ఝషంబు గ్రసించిన, దాని నొక్క లుబ్ధకుండు జాలమార్గంబునఁ బట్టికొని, తదుదరగతంబయిన లోహఖండంబు దెచ్చి బాణాగ్రంబున ముల్కిగా నొనర్చె” నని తత్కథావృత్తాంతంబు సెప్పిన బాదరాయణిం గనుంగొని రాజేంద్రుం డిట్లనియె. (27) "చిత్తం బే క్రియ నిలుచుం? ¯ జిత్తజగురు పాదపద్మ సేవ సదా య¯ త్యుత్తమ మని వసుదేవుఁడు¯ చిత్తముఁ దగ నిల్పి యెట్లు సెందె మునీంద్రా! "

వసుదేవ ప్రశ్నంబు

(28) అని యడిగిన రాజునకు శుకుం డిట్లనియె. (29) "వినుము నృపాలక! సెప్పెద¯ ఘనమై విలసిల్లు పూర్వకథ గల దదియున్‌¯ మును ద్వారక కేతెంచియు¯ నొనరఁగ నారదుఁడు గృష్ణు నొయ్యనఁ గాంచెన్‌. (30) అట్లు దేవముని కృష్ణసందర్శనార్థం బరుగుదెంచి తద్గృహాభ్యంతరమున కరిగిన, వసుదేవుం డమ్మునీంద్రుని నర్ఘ్యపాద్యాదివిధులం బూజించి, కనకాసనాసీనుం గావించి, యుచిత కథావినోదంబులం బ్రొద్దుపుచ్చుచు నిట్లనియె; “యే నరుండు నారాయణచరణసరసీరుహ భజనపరాయణత్వంబు నిరంతరంబు నొందం; డట్టివానికి మృత్యువు సన్నిహితంబై యుండు; నీ దర్శనంబునం గృతార్థుండ నైతి; నచ్యుతానంత గోవింద నామస్మరణైకాగ్రచిత్తులైన మీవంటి పుణ్యపురుషుల సమాగమంబున లోకులు సుఖాశ్రయులయి యుండుదురు; దేవతాభజనంబు సేయువారిని గీర్వాణులు ననుగ్రహింతు; రట్లు సజ్జనులును దీనవత్సలులు నగు వారలు పూజనాది క్రియలచే నా దేవతలను భక్తి సేయుదురు; కావున శ్రీ మహా భాగవత కథాసమూహంబులఁ గల ధర్మంబు లడిగెద; నేయే ధర్మంబులు శ్రవణ సుఖంబులుగా వినిన దండధరకింకర తాడనంబులం బడక, ముకుందచరణారవింద వందనాభిలాషులయి పరమపదప్రాప్తు లగుదు; రా ధర్మంబు లానతిమ్ము; తొల్లి గోవిందునిం బుత్రుఁగాఁ గోరి ముక్తిమార్గం బెఱుంగలేక దేవతామాయం జేసి చిక్కి చిత్తవ్యసనాంధకారం బగు సంసారంబునం దగులువడి యున్నవాఁడ; హరికథామృతంబు వెల్లిగొల్పు; మట్లయిన సుఖంబు గలుగు"ననిన వసుదేవ కృతప్రశ్నుండైన నారదుండు వాసుదేవ కథా ప్రసంగ సల్లాపహర్ష సమేతుండై సంతసంబంద నిట్లనియె. (31) "నను నీవు సేయు ప్రశ్నము¯ జనసన్నుత! వేదశాస్త్రసారాంశంబై¯ ఘనమగు హరిగుణకథనము¯ విను" మని, వినిపింపఁ దొడఁగె వేడ్క దలిర్పన్‌. (32) "అతిపాపకర్ములైనను¯ సతతము నారాయణాఖ్యశబ్దము మదిలో¯ వితతంబుగఁ బఠియించిన¯ చతురులఁ గొనియాడఁ గమలసంభవు వశమే?

విదేహ హర్షభ సంభాషణ

(33) అట్లు గావున పరమేశ్వరభక్తిజనకంబై కైవల్యపదప్రాప్తికరంబయి యొప్పుచున్న విదేహర్షభసంవాదంబు నాఁ బరగు నొక్క పురాతన పుణ్యకథావిశేషం బెఱింగించెద సావధాన మనస్కుండవై యాకర్ణింపు” మని యిట్లనియె (34) "వినుము; స్వాయంభువుండను మనువునకును¯ రమణ నుదయించె నఁట ప్రియవ్రతుఁ డనంగఁ¯ దనయు; డాతని కాగ్నీధ్రుఁ డనఁగ సుతుఁడు¯ జాతుఁ డయ్యెను భువనవిఖ్యాతుఁ డగుచు. (35) ఆ యాగ్నీధ్రునకు నాభి యను ప్రాజ్ఞుం డగు తనూభవుం డుదయించి బలిచక్రవర్తితో మైత్రింజేసి ధారుణీభారంబు పూని యాజ్ఞా పరిపాలనంబున నహితరాజన్య రాజ్యంబులు స్వవశంబులు గావించుకొని యుండె; నంతట నాభికి సత్పుత్రుం డయిన ఋషభుండు పుట్టె; నతండు హరిదాసుండై సుతశతకంబుఁ బడసె; నందగ్రజుండయిన భరతుం డను మహానుభావుఁడు నారాయణపరాయణుండై యిహలోకసుఖంబులం బరిహరించి, ఘోరతపం బాచరించి జన్మ త్రితయంబున నిర్వాణసుఖపారవశ్యంబున సకలబంధ విముక్తుం డై వాసుదేవపదంబు నొందె; నాతని పేర నతం డేలిన భూఖండంబు భారతవర్షం బను వ్యవహారంబున నెగడి జగంబులఁ బ్రసిద్ధం బయ్యె; మఱియు నందుఁ దొమ్మండ్రు కుమారులు బల పరాక్రమ ప్రభావ రూప సంపన్నులయి నవఖండంబులకు నధిష్ఠాతలైరి; వెండియు వారలలో నెనుబది యొక్కండ్రు కుమారులు నిత్య కర్మానుష్ఠాన పరతంత్రులై విప్రత్వం బంగీకరించి; రందుఁ గొందఱు శేషించిన వారులు కవి హర్యంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయ నావిర్హోత్ర ద్రమిళ చమస కరభాజను లనం బరఁగు తొమ్మం డ్రూర్ధ్వరేతస్కు లయి బ్రహ్మవిద్యావిశారదు లగుచు, జగత్త్రయంబును బరమాత్మ స్వరూపంబుగాఁ దెలియుచు ముక్తులై యవ్యాహతగమను లగుచు, సుర సిద్ధ సాధ్య యక్ష గంధర్వ కిన్నర కింపురుష నాగలోకంబు లందు స్వేచ్ఛావిహారంబు సేయుచు నొక్కనాఁడు. (36) జగదేకనాథు గుణములు¯ మిగులఁగ సంస్మరణతోడ మీఱిన భక్తిం¯ బగలును రాత్రియు సంధ్యలుఁ¯ దగిలి జితేంద్రియులు నైన తపసులు ధాత్రిన్‌. (37) ఊహింపఁ బుణ్యుఁ డైన వి¯ దేహుని యజ్ఞాంతమందు నేతెంచినచో¯ గేహము వెడలి యెదుర్కొని¯ మోహవివర్జితులఁ బుణ్యమునిసంఘములన్‌. (38) అర్ఘ్యపాద్యాదివిధులను నర్థితోడఁ¯ బూజ గావించి, వారలఁ బొలుపు మిగుల¯ నుచితపీఠంబులందును నునిచి, యెలమి¯ నవమునిశ్రేష్ఠులను భూమినాయకుండు. (39) వారల కిట్లను "మీరలు¯ గారవమున విష్ణుమూర్తిఁ గైకొనిన మహా¯ భూరితపోధనవర్యులు¯ సారవిహీనంబు లైన సంసారములన్‌. (40) ఏ రీతి గడప నేర్తురు? ¯ క్రూరులు బహుదుఃఖరోగకుత్సిత బుద్ధుల్‌¯ నీరసులు నరులు గావున¯ నారయ సుజ్ఞానబుద్ధి నానతి యీరే?

కవి సంభాషణ

(41) మఱియు సకలజంతుసంతానంబుకంటె మానుషాకారంబు నొందుట దుర్లభం; బంతకంటె నారాయణచరణయుగళస్మరణ పరాయణులగుట దుష్కరంబు; గావున నాత్యంతికంబగు క్షేమంబడుగ వలసెఁ; బరమేశ్వరుండు ప్రపత్తినిష్ఠులకు సారూప్యం బెట్లొసంగు నత్తెఱం గానతిం” డనిన విని విదేహభూపాలునకు హరికథామృత పానాతిపరవశులైన మునిసమాజంబునందుఁ గవి యను మహానుభావుం డిట్లని చెప్పం దొడంగె; “నరిషడ్వర్గంబునందు నీషణత్రయంబుచేతం దగులువడి మాత్సర్యయుక్త చిత్తుం డగు నట్టి వానికెవ్విధంబున నచ్యుత పాదారవింద భజనంబు సంభవించు? విశ్వంబును నాత్మయు వేఱుగా భావించు వానికి భీరుత్వం బెట్లు లే? దవిద్యాంధకారమగ్నులకు హరిచింతనంబెట్లు సిద్ధించు? నట్టి నరుండు తొంటికళేబరంబు విడిచి పరతత్త్వం బెబ్భంగిం జేరు? ముకుళీకృతనేత్రుండయిన నరుండు మార్గభ్రమణంబునఁ దొట్రుపాటువడి చను చందంబున విజ్ఞానవిమలహృదయభక్తిభావనా వశంబు లేకున్నఁ బరమపదంబు వీరికెవ్విధంబునం గలుగు? నని యడిగితివి; గావునఁ జెప్పెద; సావధానుండవై యాకర్ణింపుము. (42) కరణత్రయంబు చేతను¯ నరుఁడే కర్మంబు సేయు నయ్యైవేళన్‌¯ హరి కర్పణ మని పలుకుట¯ పరువడి సుజ్ఞాన మండ్రు పరమమునీంద్రుల్‌. (43) జ్ఞానాజ్ఞానంబు లందు సంకలితుండైన స్మృతి విపర్యయంబు నొందు; నట్లుగావున గురుదేవతాత్మకుం డయి, బుద్ధిమంతుండైన మర్త్యుండు శ్రీ వల్లభు నుత్తమోత్తమునిఁగాఁ జిత్తంబునఁ జేర్చి సేవింపవలయు; స్వప్న మనోరథేచ్ఛాద్యవస్థలయందు సర్వసంకల్పనాశం బగుటంజేసి, వానిఁ గుదియం బట్టి నిరంతర హరిధ్యానపరుం డైనవానికిఁ గైవల్యంబు సులభముగఁ గరతలామలకంబై యుండు. (44) సంతతంబును గృష్ణ సంకీర్తనంబులు¯ వీనుల కింపుగ వినఁగవలయు, ¯ హర్షంబుతోడుత హరినామకథనంబు¯ పాటలఁ నాటలఁ బరఁగవలయు, ¯ నారాయణుని దివ్యనామాక్షరంబులు¯ హృద్వీథి సతతంబు నెన్నవలయుఁ, ¯ గంజాక్షులీలలు కాంతారముల నైన¯ భక్తి యుక్తంబుగాఁ బాడవలయు, (44.1) వెఱ్ఱిమాడ్కిని లీలతో విశ్వమయుని¯ నొడువుచును లోకబాహ్యత నొందవలయు, ¯ నింతయును విష్ణుమయ మని యెఱుఁగవలయు, ¯ భేద మొనరింప వలవదు మేదినీశ!"

హరిముని సంభాషణ

(45) అనిన విదేహభూపాలుడు “భాగవతధర్మం బెద్ది? యే ప్రకారంబునం బ్రవర్తించు? వారల చిహ్నంబు లెవ్వి? యంతయు నెఱింగింప నీవ యర్హుండ” వనిన నందు హరి యను మహాత్ముం డిట్లనియ. (46) "సర్వభూతమయుండైన సరసిజాక్షుఁ ¯ డతఁడె తన యాత్మయం దుండు ననెడువాఁడు, ¯ శంఖచక్రధరుం డంచుఁ జనెడువాఁడు, ¯ భక్తిభావాభిరతుఁడు వో భాగవతుఁడు. (47) వర్ణాశ్రమధర్మంబుల¯ నిర్ణయకర్మములఁ జెడక నిఖిలజగత్సం¯ పూర్ణుఁడు హరి యను నాతఁడె¯ వర్ణింపఁగ భాగవతుఁడు వసుధాధీశా! (48) ఇట్లు సర్వసంగపరిత్యక్తుండై, నిఖిలాంతరాత్ముండై, పరమేశ్వరు డరుణగభస్తి కిరణ సహస్రంబుల లోకత్రయంబుం బావనంబు సేయు చందంబునం దన చరణారవింద రజఃపుంజంబు చేతం బవిత్రంబు సేయుచు, సురాసురజేగీయమానసేవ్యం బైన జనార్దన పాదారవిందంబులకు వందనాభిలాషుఁడై, భక్తియు లవమాత్రంబునుం జలింపనీక సుధాకరోదయంబున దివాకరజనితతాపనివారణం బయిన భంగి నారాయణాంఘ్రినఖమణిచంద్రికా నిరస్త హృదయతాపుండై, యాత్మీయభక్తిరశనానుబంధబంధురంబైన వాసుదేవ చరణసరోరుహ ధ్యానానందపరవశుం డగు నతండు భాగవతప్రధానుం” డని యెఱింగించిన విని విదేహుం డిట్లనియె.(49) "గజరాజవరదు గుణములు ¯ త్రిజగత్పావనము లగుటఁ దేటపడంగా¯ సుజనమనోరంజకముగ¯ విజితేంద్రియ! వినఁగ నాకు వేడుక పుట్టెన్‌. "

అంతరిక్షు సంభాషణ

(50) అనిన విని యంతరిక్షుం డను ఋషిశ్రేష్ఠుం డిట్లనియె. (51) పరమబ్రహ్మ మనంగాఁ, ¯ బరతత్త్వ మనంగఁ, బరమపద మనఁగను, నీ¯ శ్వరుఁ డనఁ, గృష్ణుఁ డన, జగ¯ ద్భరితుఁడు, నారాయణుండు దా వెలుఁగొందున్‌. (52) అవ్యక్తనిర్గుణపరబ్రహ్మంబునందుఁ దనకు విపర్యయంబుగా జననం బయిన జ్ఞానంబె విష్ణుమాయ యనంబడుఁ; బరమేశ్వరుఁ డట్టి మాయచేత జగంబు నిర్మించి నిశ్చింతుండై యుండు; నింద్రియార్థ భ్రమణంబు సేసెడు దుర్మతులకు సుషుప్త్యాద్యవస్థలు వరుసన కలుగుటంజేసి పరమేశ్వరునిం బొందరామి యను నాలుగవ యవస్థయుఁ గలుగు; స్వప్నంబునందు గ్రాహ్యగ్రాహక గ్రహణంబు లను త్రివిధభేదంబు గలిగియుండు; నీచందంబున నవిద్యాంధకార సంవృతంబై మూఁడు విధంబులఁ బర్యవసించు మనోరథంబు స్వప్నావస్థయం దణంగిన క్రియఁ ద్రివిధం బగు మాయయు నాత్మ యందు లీనంబగుఁ; బరమేశ్వరుండు మొదలం బృథివ్యాది మహా భూతమయం బయిన సృష్టిని గలుగఁజేసి యందుఁ బంచభూతాత్మకం బయిన యాత్మ కేకాదశేంద్రియంబులచేత భేదంబు పుట్టించుచు, గుణంబులచేత గుణంబు లంగీకరించుచు నాత్మ యందుఁ బ్రద్యోతితగుణంబులవలన గుణానుభవంబుఁ జేయుచునున్న వాఁడై, సృష్టి నాత్మీయంబుగాఁ భావించు; దేహి కర్మమూలంబున నైమిత్తిక కర్మంబుల నాచరించుచుఁ దత్ఫలం బంగీకరించి దుఃఖైక వశుండై వర్తించుఁ; బెక్కు దుఃఖంబులం బడిన యా దేహి కర్మఫలప్రాప్తుం డగుచు భూత సంప్లవపర్యంతంబు పరవశుండై జన్మమరణంబులం బొరలుచుండు; నంత్యకాలం బాసన్నంబయిన ద్రవ్యగుణ స్వరూపం బగు జగంబు ననాదినిధనంబగు కాలంబు ప్రకృతింబొందించు; నటమీఁద శతవర్షంబులు వర్షంబు లేమిచేత నత్యుగ్రలోక లోచనుతేజంబున సకలలోకంబులు దహింపఁబడు; నంత నధో లోకంబుననుండి సంకర్షణముఖజనితానలం బూర్ధ్వశిఖాజాలంబుల వాయుసహాయంబై దిక్కులయం దెల్లఁ బ్రవర్తించు; నటమీఁద సంవర్తక వలాహక గణంబులు నూఱు హాయనంబులు సలిలధారా పాతంబుగా వర్షంబు గురియు; నందు విరాడ్రూపంబు లీనంబగు; నంత నీశ్వరుం డింధనాగ్నిచందంబున నవ్యక్తంబుఁ బ్రవేశించు; తదనంతరంబ ధరణీమండలంబు వాయుహృతగంధం బై కబంధ రూపంబుఁ దాల్చు; నా జలంబు హృతరసంబై తేజోరూపంబు నొందు నా తేజంబు తమోనిరస్తం బై వాయువం దడంగు; నా గంధవహుండు స్పర్శవిరహితుం డయి యాకాశంబు నందు సంక్రమించు; నా విష్ణుపదంబును విగత శబ్దగుణంబు గలది యై యాత్మ యందడంగు; నింద్రియంబులును మనంబును బుద్ధియు వికారంబులతోడ నహంకారంబుఁ బ్రవేశించు; నా యహంకారంబును స్వగుణయుక్తంబై పరమాత్మునిం జేరు; నిట్లు త్రివర్ణాత్మకయై సర్గ స్థితి లయకారిణి యగు మాయ యిట్టిది” యని తత్స్వరూప మాహాత్మ్యంబులు వివరించిన నరపాలుం డిట్లనియె. (53) "జ్ఞానవిహీనులైన నరసంఘముఁ గానఁగరాని మాయఁ దా¯ లోన నడంచి యెట్లు హరిలోకముఁ జెందుదు? రంతయుం దగన్‌¯ భూనుత! సత్యవాక్యగుణభూషణ! యిక్కథ వేడ్కతోడుతం¯ బూనికఁ జెప్పు"మన్నను బ్రబుద్ధుఁడు నిట్లను గారవంబునన్‌.

ప్రబుద్ధుని సంభాషణ

(54) “సూర్యోదయాస్తమయంబులం బ్రతిదినంబు నాయువు క్షీణంబు నొంద, దేహ కళత్ర మిత్ర భ్రాతృమమత్వ పాశబద్ధులై విడివడు నుపాయంబు గానక, సంసారాంధకారమగ్నులయి గతాగతకాలంబుల నెఱుంగక, దివాంధంబులగు జంతుజాలంబుల భంగి జన్మ జరా రోగ విపత్తి మరణంబు లందియు, శరీరంబ మేలనుచుఁ బ్రమోద మోహమదిరాపానమత్తులై, విషయాసక్తతం జిక్కి, తమ్ముఁ దారెఱుంగక యుండి, విరక్తిమార్గంబు దెలియక వర్తించు మూఢు లగు జనంబుల పొంతలఁ బోవక; కేవల నారాయణ భక్తి భావంబు గల సద్గురుం బ్రతిదినంబును భజియించి; సాత్త్వికంబును, భూతదయయును, హరికథామృతపానంబును, బ్రహ్మచర్యవ్రతంబును, విషయంబుల మనంబు సేరకుండుటయు, సాధు సంగంబును, సజ్జన మైత్రియు, వినయసంపత్తియు, శుచిత్వంబును, తపంబును, క్షమము, మౌనవ్రతంబును, వేదశాస్త్రాధ్యయన తదర్థానుష్ఠానంబులును, నహింసయు, సుఖదుఃఖాది ద్వంద్వసహిష్ణుతయు, నీశ్వరుని సర్వగతునింగా భావించుటయు, ముముక్షుత్వంబును, జనసంగ వర్జనంబును, వల్కలాది ధారణంబును, యదృచ్ఛాలాభ సంతుష్టియు, వేదాంతశాస్త్రార్థ జిజ్ఞాసయును, దేవతాంతరనిందా వర్జనంబును, గరణత్రయ శిక్షణంబును, సత్యవాక్యతయు, శమదమాదిగుణ విశిష్టత్వంబును, గృహారామ క్షేత్ర కళత్ర పుత్త్ర విత్తాదుల హరికర్పణంబు సేయుటయు, నితర దర్శన వర్జనంబు సేయుటయును భాగవతోత్తమధర్మంబు” లని చెప్పి యిట్లనియె. (55) "హరిదాసుల మిత్రత్వము¯ మురరిపుకథ లెన్నికొనుచు మోదముతోడన్‌¯ భరితాశ్రుపులకితుండై¯ పురుషుఁడు హరిమాయ గెల్చు భూపవరేణ్యా!"(56) అనిన రాజేంద్రుండు వారల కిట్లనియె; “భాగవతులారా! సకలలోకనాయకుం డగు నారాయణుం డనంబరఁగిన పరమాత్ముని ప్రభావంబు వినవలతు; నానతిం” డనినఁ బిప్పలాయనుం డిట్లనియె.

పిప్పలాయన భాషణ

(57) "నరవర! విను జగన్నాథుని చారిత్ర¯ మెఱిఁగింతు నీమది కింపు మిగుల¯ లసదుద్భవస్థితిలయ కారణంబయి¯ దేహేంద్రియాదులఁ దిరము గాఁగఁ¯ జొనుపు నెప్పుడు పరంజ్యోతిస్స్వరూపంబు¯ జ్వాలల ననలుండుఁ జనని పగిది¯ నింద్రియంబులు నాత్మ నెనయవు శబ్దంబు¯ పొరయక సుషిరంబుఁ బొందు, సత్య (57.1) మనఁగ సత్త్వరజస్తమోమయగుణంబు, ¯ మహదహంకారరూపమై మహిమ వెలయు¯ చేతనత్వంబు గలదేని జీవ మందు, ¯ రిదియ సదసత్స్వరూపమై యెన్నఁబడును. (58) దీనికిం బెక్కైనది పరమాత్మగా నెఱింగి కమలసంభవాదులు నుతియింతు; రిట్టి పరమాత్మ స్థావరజంగమంబుల నధిష్ఠించి వృద్ధి క్షయంబులం బొందక నిమిత్తమాత్రంబునం దరులతాదు లందు జీవంబు లేక తదంతరస్థుండై వర్తించు; నంత సర్వేంద్రియావృతం బైన యాకారంబు నష్టంబైన మనంబునుం బాసి శ్రుతివిరహితుం డై తిరుగుచుండు; నిర్మల జ్ఞానదృష్టి గలవానికి భానుప్రభాజాలంబు దోఁచిన క్రియను, సుజ్ఞానవంతుడు హరిభక్తిచేత గుణకర్మార్థంబులైన చిత్తదోషంబులు భంజించి భగవత్సదనంబు సేరు” ననిన విని రాజిట్లనియె. (59) "పురుషుం డే యే కర్మము¯ పరువడిఁ గావించి పుణ్యపరుఁడై మనుఁ? దా¯ దురితములుఁ దొరఁగి మురరిపు¯ చరణయుగం బెట్లు సేరు? సన్మునివర్యా! "

ఆవిర్హోత్రుని భాషణ

(60) అనిన విని యందావిర్హోత్రుం డిట్లనియెఁ; “గర్మాకర్మ వికర్మ ప్రతిపాదకంబు లగు శ్రుతివాదంబులలౌకికవర్ణితంబు; లట్టి యామ్నాయంబులు సర్వేశ్వరస్వరూపంబులు గాన విద్వాంసులు నెఱుంగ లే; రవి కర్మాచారంబు లనంబడు; మోక్షంబుకొఱకు నారాయణ భజనంబు పరమపావనంబు; వేదోక్తంబుల నాచరింపక ఫలంబులకు వాంఛ సేయువార లనేక జన్మాంతరంబులం బడయుదురు; మోక్షంబు నపేక్షించు వాఁడు విధిచోదిత మార్గంబున హరిం బూజింపవలయు; నట్టి పూజాప్రకారం బెట్లనినఁ, బవిత్రగాత్రుం డయి జనార్దను సన్నిధిం బూతచిత్తుండై, షోడశోపచారంబులఁ జక్రధరు నారాధించి, గంధ పుష్ప ధూప దీప నైవేద్యంబులు సమర్పించి, సాష్టాంగదండ ప్రణామంబు లాచరించి, భక్తిభావనా విశేషుండగు నతండు హరింజేరు” నని చెప్పిన విని విదేహుం డిట్లనియె; “నీశ్వరుం డేయే కర్మంబుల నాచరించె, నంతయు నెఱిగింపు” మనినఁ ద్రమిళుం డిట్లనియె. (61) "తారల నెన్నఁగ వచ్చును; ¯ భూరేణుల లెక్కవెట్టఁ బోలును ధాత్రిన్‌; ¯ నారాయణగుణకథనము¯ లారయ వర్ణింపలేరు హర బ్రహ్మాదుల్‌. (62) అట్లు గావున నాత్మసృష్టంబైన పంచభూతనికరంబును పురం బొనరించి, యందు నిజాంశంబునం బ్రవేశించి, సగుణనిష్ఠుండై నారాయణాభిధానంబు గల ఋషీశ్వరుం డగు పరమేశ్వరుండు వెలుఁగొందె; నతని దశేంద్రియంబులచేఁ బాలితంబులైన దేహంబులు ధరించి, జగద్రక్షకత్వ సంహారకత్వాది గుణంబులు గలుగుటం జేసి గుణనిష్ఠుండయి రజస్సత్త్వతమో గుణంబుల బ్రహ్మ విష్ణు రుద్ర మూర్తులనం బరఁగి, త్రిగుణాత్మకుం డనంబడు నారాయణాఖ్యుని చరిత్రం బెఱింగించెద; నాకర్ణింపుము.